Showing posts with label మనీ. Show all posts
Showing posts with label మనీ. Show all posts

Sunday, 12 July 2026

మన దేశంలో పబ్లిషింగ్ వ్యవస్థ ప్రపంచస్థాయి ప్రమాణాల్లో ఎందుకు లేదు?


ఒక్క అమెజాన్‌లోనే, 2025లో, ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 మిలియన్ల ప్రింటెడ్ బుక్స్ సేలయ్యాయి. 

ఈ 300 మిలియన్ల పుస్తకాల్లో 50% పుస్తకాలు కొని చదివింది అమెరికన్ పాఠకులే కావడం మనం గమనించాల్సిన ముఖ్యమైన అంశం. 

'కిండిల్ బుక్స్' లాంటి డిజిటల్ బుక్స్, ఆడియో బుక్స్ అంకెలు వేరే. 

కట్ చేస్తే -

ప్రపంచపటంలోని అభివృద్ధి చెందిన ఏ దేశాన్నయినా తీసుకోండి. ఆ దేశ ప్రజలు, పాలకులు, కంపెనీల సీఈవోలు... ఖచ్చితంగా మంచి పాఠకులైవుంటారు. పుస్తకప్రియులైవుంటారు. వీళ్ళల్లో చాలామంది రైటర్స్ కూడా ఉంటారు. 'న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్' స్థాయిలో మంచి మంచి పుస్తకాలు రాసివుంటారు. 

పుస్తకాలు చదవటం అనే అలవాటు మనిషిలోని విజువలైజేషన్ పవర్‌ను ఎప్పటికప్పుడు పెంపొందిస్తుంది. పాఠకుల్లో ఒక స్థాయి క్రమశిక్షణకు మూల కారణమవుతుంది. ఈ రెండూ ఉన్నప్పుడే ఎవరైనా ఏ ఫీల్డులోనైనా ఎదగగలుగుతారు. 

వ్యక్తుల ఉన్నతస్థాయి ఎదుగుదల, పరోక్షంగా వారి దేశ ఉన్నతికి ఉపయోగపడుతుంది.     

మనమెక్కడున్నాం మరి? 

యూట్యూబ్ కనిపెట్టిన అమెరికన్స్ కంటే ఎక్కువగా మనదేశంలోని వ్యూయర్సే ఆ వీడియోల్ని పనీపాటా పక్కనపెట్టి ఎగబడి చూస్తున్నారు. యూట్యూబ్ ద్వారా వారికి భారీ ఆదాయం రావడానికి కారణమవుతున్నారు. 

యూట్యూబ్ వీడియోలు చూడటం తప్పు కాదు.
ఏం చూస్తున్నామన్నది పాయింట్. 

యూట్యూబ్‌లోని వీడియోలు చూడ్దానికి అలవాటుపడటం ద్వారా... పరోక్షంగా మనలోని ఆలోచనా శక్తిని, ఊహాశక్తిని, విశ్లేషణాశక్తిని, విజువలైజేషన్ పవర్‌ను ఊహించని స్థాయిలో కోల్పోతున్నాం. 

పుస్తకాలే కాదు, అసలు ఇంక దేన్నయినా సరే, చదివే అలవాటునే పూర్తిగా మర్చిపోతున్నాం.  
 
ఇది నిజం కాదా?

మనలో ఎంతమంది పెన్ను, పేపర్ పట్టుకొని గత 24 గంటల్లో ఏదైనా రాశారు? అసలు మనలో ఎంతమంది ఏదైనా ఒక పుస్తకం పట్టుకొని ఎన్నిరోజులైంది?

"ఇప్పుడంతా డిజిటల్ యుగం, పుస్తకాలు అవుట్‌డేటెడ్" అనే ముందు, ఈ పోస్టు ప్రారంభంలో నేను రాసిన అమెరికా ఉదాహరణ ఇంకోసారి చదవండి. 

మన దేశంలో పబ్లిషింగ్ వ్యవస్థ ప్రపంచస్థాయి ప్రమాణాల్లో ఎందుకు లేదు?... మన దేశంలో 99.99% రచయితలు ఎందుకు రాయటం ద్వారా సంపాదించుకోలేరు?... ప్రొఫెషనల్ రైటర్స్‌గా ఎందుకు బ్రతకలేరు?... 

ఇలాంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం కూడా ఒక్కటే. 

మనం పుస్తకాలు చదవటం లేదు.     

Every great nation is first built in silence—one reader, one book, one awakened mind at a time. 

- మనోహర్ చిమ్మని  

Tuesday, 7 July 2026

చెప్పి చేస్తేనే మజా!


ఏదైనా సాధించాలకునేవారు రెండు రకాలుగా ఉంటారు. 

> బయటికి ఏం చెప్పకుండా, సీక్రెట్‌గా ఒక వ్యూహం ప్రకారం పనులు చేసుకుంటూ అనుకున్నది సాధించేవాళ్ళు.
> నేను ఇది సాధించాలనుకుంటున్నాను అని ఓపెన్‌గా బయటికి చెప్పి మరీ సాధించేవాళ్ళు.

మొదటిరకం వాళ్ళది "ఎందుకొచ్చిన ప్రెషర్... ఎవరేమనుకుంటారో... ఏం కామెంట్ చేస్తారో" అన్న భయం. 

రెండోరకం వాళ్లది "బయటికి ప్రకటిస్తే గాని మనకు ప్రెషర్ ఉండదు. ఆ ప్రెషర్ ఇచ్చే డ్రైవ్‌తోనే ఇంకా బాగా కమిటెడ్‌గా పనిచేస్తాం" అన్న భావన.

అనుకున్నది సాధించే విషయంలో, ఇద్దరికీ 50/50 చాన్సెసే ఉంటాయి. కాని, ఓపెన్‌గా చెప్పి మరీ కష్టపడేవారికి కొంచెం ఎడ్జ్ ఉంటుంది. 

మొదటివాళ్ళది డిఫెన్స్.
రెండోరకం వాళ్ళది అఫెన్స్. 

కట్ చేస్తే - 

చిన్న బడ్జెట్ కేటగిరీలోనే, దాదాపు అంతా కొత్తవాళ్ళు, అప్-కమింగ్‌వాళ్లతో, మంచి కల్ట్ సబ్జెక్ట్‌తో ఒక 100 కోట్ల హిట్ కొట్టాలన్నది ఇప్పుడు నా లక్ష్యం. నా టీమ్ లక్ష్యం.    

కల్ట్ కథలు.
డిసిప్లిన్డ్ ఎగ్జిక్యూషన్.
కమర్షియల్ సెన్స్.

లైక్‌మైండెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఫిలిం ప్రొడక్షన్ వైపు ఆసక్తి ఉన్న సీరియస్ ఇన్వెస్టర్లు-కొలాబొరేటర్లతో నా కొత్త జర్నీ ప్రారంభమవుతోంది. 

వైజాగ్ నుంచి పనులకు శ్రీకారం.

If you believe in smart cinema and calculated risk, and you’re looking for a genuine entry into the film business, there’s space at the table.

Make films that make money.
Let’s work together. Let’s grow together.

Interested? DM me. 

- మనోహర్ చిమ్మని 

Saturday, 21 March 2026

మణిరత్నం, శేఖర్ కపూర్ కంటే ఎక్కువేం కాదుకదా నువ్వు?


ఎప్పటికప్పుడు "ఈ ఒక్క సినిమా తీసి వదిలేద్దాం" అనుకోవటం అంత వెర్రివెంగలప్ప డెసిషన్ ఇంకోటి ఉండదు. 

అంటే, సినిమాలు వదిలెయ్యటం కోసం సినిమా చెయ్యటం అన్నమాట!  

ఆఫ్‌కోర్స్, ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక చాలామందికి వారి వారి సినిమా కష్టాలు, అనుభవాలు, అవమానాలు, తలనొప్పులు, అప్పులు చాలా ఉండొచ్చు. 
  
అయినా సరే, అది నిజంగా ఒక అర్థం లేని నిర్ణయమే. 

కట్ చేస్తే - 

ఇలాంటి పసలేని చప్పటి నిర్ణయం ఇండస్ట్రీలో చాలామంది తీసుకుంటుంటారు. తర్వాత ఎప్పుడో ఒక పదేళ్ళ తర్వాత బాధపడుతుంటారు. 

స్ట్రాటెజిక్‌గా ఇది ఎంత చెత్త నిర్ణయం అంటే... ఈ నిర్ణయం బాక్‌డ్రాప్‌లో మనం తీసుకునే ఇతర నిర్ణయాలన్నీ మరింత చెత్తగా ఉంటాయి. 

కర్ర విరగదు, పాము చావదు.  
ఆ "ఒక్క సినిమా" అనుకున్నట్టు జరగదు.  

నిజంగా వదిలేసేటప్పుడు, ఆ క్షణం, అలా అనుకొని చిటికెలో వదిలేయవచ్చు కదా? దాని గురించి ఇప్పుడే ఎందుకు? 

ముందు ఇప్పుడు చేసే ప్రాజెక్ట్ సంగతి చూసుకోవాలి. చిన్నదో పెద్దదో సరైన ప్రాజెక్టును, సరైన మనుషుల్ని ఎన్నుకోవాలి. సరైన టీమ్ సెట్ చేసుకోవాలి.

ఇది నేను ఇక్కడ రాస్తున్నంత ఈజీ కాదు.
కాని, తీవ్రంగా ప్రయత్నించాలి. 

నీ పర్సనల్ లక్ష్యాల నేపథ్యంలో, నువ్వు ఎన్నుకున్న ప్రాజెక్టును ఇంకా ఇంకా బాగా ఎలా చెయ్యాలో ఆలోచించాలి. నిజంగా అంత బాగా చెయ్యాలి.  

ఈ క్రమంలో ఈగోలు, అడ్డంకులు, అవమానాలు, డబ్బు కష్టాలు చాలా ఉంటాయి. 

నిన్నొక మోసగానిలా చూస్తారు. నిర్మొహమాటంగా మొహం మీదే అంటారు. అన్నీ తట్టుకోవాలి.   

మణిరత్నం, శేఖర్ కపూర్ కంటే ఎక్కువేం కాదుకదా నువ్వు? వాళ్ళు తట్టుకున్నన్ని అవమానాల ముందు నువ్వెంత? 

ఒక్కటే ఫోకస్.  
జస్ట్ వన్ థింగ్. 

హిట్ కొట్టాలి. 

తర్వాత సంగతి తర్వాత.  

- మనోహర్ చిమ్మని       

Saturday, 10 May 2025

మీ ఎకౌంట్లో ఇంకెన్ని వీకెండ్స్ ఉన్నాయో తెలుసా?


యావరేజ్‌న మనిషి ఒక 4000 వారాలు బ్రతుకుతాడట.

అంటే ఒక 77 ఏళ్ళు. 

ఒక పెన్నూ పేపర్ తీసుకుంటే ఇట్టే అర్థమైపోతుంది... ఇంకెన్నివారాలు మనం బ్రతుకుతాం అన్నది. 

ఈలోపు మన లిస్టులో కనీసం ఒక 1001 బాధ్యతలు, పనులు, లక్ష్యాలు, కోరికలు, ఆశలు గట్రా చాలా ఉన్నాయి. 

ఎలా సాధ్యం?

మనకు మిగిలిన వారాలెన్ని? 
ఈలోపు ఇన్ని ఉరుకులు పరుగులు అవసరమా? 

మన శరీరానికి విశ్రాంతి ఎప్పుడు? 
మన మనసుకి ప్రశాంతత ఎప్పుడు? 
మనకున్న ఈ ఒకే ఒక్క జీవితానికి ఆనందం ఎప్పుడు? 

కట్ చేస్తే -

అవ్వా బువ్వా అన్నీ కావాలంటే కుదరదు. 

నీకు ఇష్టమైన పనిచేస్తూ, నీకు నచ్చినట్టు నువ్వు జీవించటం ముఖ్యమా? ఎవరో ఏదో అనుకుంటారని నీది కాని బ్రతుకు బ్రతకడం ముఖ్యమా? 

ఆలోచించు. 
ఈలోగా నీ జీవితంలోంచి ఇంకో వారం వెళ్ళిపోకుండా చూసుకో. 

- మనోహర్ చిమ్మని 

100 Days, 100 Posts. 15/100. 

Wednesday, 7 May 2025

తెరమీద సినిమా, తెరవెనుక సినిమా... రెండూ వేర్వేరు!


బ్రతుకుతెరువుకి డబ్బు కోసం సినిమాలు ప్రయారిటీలో టాప్‌లో ఉండటం... 
డబ్బులు రాని ఉట్టుట్టి ఆత్మ సంతృప్తి కళలు ప్రయారిటీలో అన్నిటికంటే కిందకి పడిపోవడం... 

ఎలాంటి ఆశ్చర్యాన్నివ్వని నిజాలు.   
జీవిత వాస్తవాలు.

... అలాగే ఉంటాయి. 

కట్ చేస్తే - 

బయటివాళ్ళు "గ్యాంబ్లింగ్ ఆడుతున్నావ్" అంటారు. 

"కాదు, జీవనపోరాటం చేస్తున్నా... ఇంకో వందమందికి జీవితాన్నిస్తున్నా" అంటాన్నేను. 

తెరమీద సినిమా, 
తెరవెనుక సినిమా... 
రెండూ వేర్వేరు.

తెరవెనుక సినిమానే ఎవ్వరికీ తెలీదు. తెలియాల్సిన అవసరం లేదు.   

A film is shaped not only by what’s inside the frame, but by what’s left out — for in absence, meaning deepens, and in silence, truth echoes.

- మనోహర్ చిమ్మని 

100 Days, 100 Posts. 11/100. 

Tuesday, 29 April 2025

ఒక మిత్రుడు, 12 నిమిషాలు...


ఒక అధ్యయనం ప్రకారం - నీకు నచ్చిన ఒక మంచి స్నేహితునితో-లేదా-స్నేహితురాలితో... ఎలాంటి అరమరికలు లేకుండా, ఏమీ దాచిపెట్టుకోకుండా, డిప్లొమసీ లేకుండా, బుర్ర నిండా ఉన్న టెన్షన్స్ పక్కన పెట్టేసి, ఫ్రీగా ఒక 12 నిమిషాలు మాట్లాడగలిగితే చాలు... నీ మొత్తం ఆలోచించే విధానమే మారిపోతుందట. 

అదెలా అంటే... ఎన్నో రోజులుగానో, నెలలుగానో, సంవత్సరాలుగానో... ఏదో ఒక అంశం గురించో, ఒక సమస్య గురించో, ఒక రిలేషన్‌షిప్ గురించో, ఒక నిర్ణయం గురించో... నీ ఆలోచనలన్నీ ఒక్కటే లూప్‌లో తిరుగుతుంటాయి. అది నీకు తెలుసు, కాని గుర్తించవు. అదే నీ కమ్‌ఫర్ట్ జోన్. ఆ జోన్ విడిచిపెట్టి నువ్వు బయటికిరాలేవు. అయినా సరే... అవే కష్టాలు భరిస్తూ, అదే టెన్షన్లో, నీకు తెలియకుండా నిన్ను కమ్మేసిన ఒక క్రానిక్ డిప్రెషన్లో నువ్వు బ్రతుకుతుంటావు. అంతా బాగా లేదని నీకు తెలుసు. కాని బాగున్నట్టే ఫీలవుతుంటావు. బయటికి కూడా నువ్వు అలాగే కనిపిస్తుంటావు అందరికీ. కాని, అది నిజం కాదు. 

ఇదిగో ఇదంతా ఒక ఒక బ్యాగేజీ. నువ్వు మోయలేని ఒక పెద్ద బరువు. ఇదంతా పక్కనపెట్టి... నీకు నచ్చిన ఫ్రెండుతో పైన చెప్పినట్టు అన్ని ఫిల్టర్సూ తీసేసి, ఫ్రీగా ఒక 12 నిమిషాలు మాట్లాడగలిగితే చాలు. నువ్వొక కొత్త మనిషివవుతావు. కొత్తగా ఆలోచిస్తుంటావు. 

ఇప్పటిదాకా నిన్ను వేధిస్తున్న సమస్యలకు, నువ్వే ఒక కొత్త పరిష్కారం కనుగొంటావు. నువ్వే ఒక నిర్ణయం తీసుకొంటావు. 

కాని, ఇది ఎవ్వరూ చేయరు. ఎవ్వరికీ అంత సమయం లేదు. 12 నిమిషాలు కాదు, ఎన్నో వందల నిమిషాలు వృధాగా వెచ్చిస్తుంటారు. కాని, అదే పనికిరాని ఫెయిల్యూర్ లూప్‌లో కొనసాగుతుంటారు. 

దీన్ని బ్రేక్ చేసినవాళ్ళు కింగ్స్, క్వీన్స్. 

కట్ చేస్తే -

There is a reminder that I always have 12 minutes for you. 

- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 3/100.

మార్పును ఎవరైనా సరే ఆహ్వానించక తప్పదు


Netflix CEO Ted Sarandos claimed in a recent interview that audiences are telling Hollywood, "They no longer want to go to the cinema, and would rather watch movies on streaming services."

Citing the recent drop in cinema attendance Ted Sarandos said “What is the consumer telling us? That they’d like to watch movies at home.” 

అదీ విషయం...

నెట్‌ఫ్లిక్స్ సీఈవో ఈ మాట అనడం వెనుక ఎంతో అధ్యయనం ఉంటుంది. ఏదో తోచింది అనడానికి ఈయన థర్డ్ గ్రేడ్ క్రిటిక్ కాదు. ఒక పెద్ద ఎంటర్‌టైన్మెంట్ బిజినెస్ సామ్రాజ్యానికి సారథి.

సో, సినిమా థియేటర్లకు ప్రేక్షకుల డ్రాప్ అనేది ఒక్క ఇండియాలోనే కాదు. ప్రపంచమంతా ఉంది.

అన్నిచోట్లా ఇదే మార్పు. 

మామూలు ల్యాండ్‌లైన్ ఫోన్ నుంచి మొబైల్ ఫోన్‌కు, మొబైల్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్‌కు ఎలా అయితే మారుతూవచ్చామో, ఇదీ అలాంటిదే. సాంకేతిక అభివృద్ధి నేపథ్యంగా మనిషి జీవనశైలిలో వస్తున్న మార్పును ఎవరైనా సరే ఆహ్వానించక తప్పదు. 

కట్ చేస్తే -   

ఓటీటీలకు ప్రేక్షకులున్నారు. కంటెంట్ కావల్సినంత ఉంది. వెబ్ సీరీస్‌లు, ఒరిజినల్స్ రూపంలో కొత్త కంటెంట్ వాళ్లే సొంతంగా క్రియేట్ చేసుకొంటున్నారు. సినిమాలు వాళ్లకిప్పుడు ఒక ఆప్షన్ మాత్రమే. 

మరోవైపు, సినిమాలు కూడా ఎక్కడికీ పోవు. అవి ప్రదర్శించే ప్లాట్‌ఫామ్స్ మాత్రమే మారుతూ ఉంటాయి. 

ఇండియాలో భారీ ఫ్యాన్స్ బేస్ ఉన్న కొందరు హీరోల సినిమాలు, కొన్ని భారీ బడ్జెట్ విజువల్ వండర్స్ తప్ప, మిగిలిన సినిమాలన్నీ క్రమంగా థియేటర్‌కు వెళ్ళిచూడాలనుకునే ఆలోచన నుంచి దూరమవుతాయి. 

ఈ నేపథ్యంలో - వందల కోట్లు పెట్టి తీసే సినిమాల లెక్కలు తప్పుతాయి. ప్రదర్శించే ప్లాట్‌ఫామ్ ఏదైనా కానీ, పరిమిత బడ్జెట్‌లో నిర్మితమయ్యే కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రం ఎప్పుడూ ఎలాంటి సమస్య ఉండదు. 

కంటెంట్ ఈజ్ ద కింగ్. 

- మనోహర్ చిమ్మని   

100 Days. 100 Posts. 2/100.

Sunday, 27 April 2025

ఫోకస్ ఎప్పుడూ కంటెంట్ మీదుండాలి...


సినిమావాళ్ళకైనా, ఓటీటీలకైనా కావల్సింది డబ్బే. 

మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే - సినిమాలు ఓటీటీల మీద వచ్చే ఆదాయం మీద ఆధారపడ్డాయి గాని, ఓటీటీలు కేవలం సినిమాల మీదే ఆధరపడలేదు. 

ఓటీటీల నుంచి డబ్బులు బాగా వస్తున్నాయి కదా, మా సినిమాలో ఉన్నది స్టార్ హీరో కదా అన్న ఈగోలకు ఇప్పుడు ఒక్కసారిగా బ్రేక్ పడింది. 

స్టార్ హీరో సినిమా అయినా, చిన్న సినిమా అయినా... టీజర్లు, ట్రయలర్లు వచ్చి, రిలీజ్‌కు ముందు వాటి బజ్ చూశాకనే ఓటీటీలు ఇప్పుడు మాట్లాడుతున్నాయి. 

సో, స్టార్ హీరోలున్న సినిమాలకే ఓటీటీలు ముందు డీల్ ఓకే చేస్తాయి అన్న మిత్‌కు ఇప్పుడు పూర్తిగా తెరపడింది.

అతి తక్కువ సమయంలో ఓటీటీ బిజినెస్‌లో ఇలాంటి భారీ మార్పు రావడానికి కారం కూడా సినిమావాళ్లే. వారి అత్యాశే. వారి ఈగోనే. 

కాని, "కంటెంట్ ఈజ్ ద కింగ్" అన్న విషయాన్ని లైట్ తీసుకోవడమే.  

ఓటీటీ రేటు బాగా వస్తుంది కదా అని హీరోలు రెమ్యూనరేషన్స్ పెంచడం, ప్రొడ్యూసర్స్-డైరెక్టర్స్ అంతకంతకూ అర్థంలేకుండా సినిమాల బడ్జెట్స్ పెంచుకుంటూపోతుండటం అనేది... చివరికి బంగారు గుడ్లు పెట్టే బాతుని చంపుకుతిన్నట్టయింది. 

అంతకు ముందు శాటిలైట్ రైట్స్ వచ్చినప్పుడు కూడా అంతే... ఆ బిజినెస్‌లోని ప్రతిచిన్న లూప్‌హోల్‌నూ వాడుకొని, అసలు కంటెంట్ లేని సినిమాలను వందలకు వందలు తీసి, శాటిలైట్ రైట్స్ అమ్ముకోవడం ద్వారానే కోట్లు గడించారు. 

ఇందాకే చెప్పినట్టు - ఓటీటీలకు ప్రేక్షకులున్నారు. కంటెంట్ కావల్సినంత ఉంది. వెబ్ సీరీస్‌లు, ఒరిజినల్స్ రూపంలో కొత్త కంటెంట్ వాళ్లే సొంతంగా క్రియేట్ చేసుకొంటున్నారు. 

సినిమాలు వాళ్లకిప్పుడు ఒక ఆప్షన్ మాత్రమే. 

కట్ చేస్తే -   

కొత్త టాలెంట్‌తో, ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా మంచి కంటెంట్‌ను క్రియేట్ చేసే చిన్న బడ్జెట్ ఇండిపెండెంట్ సినిమాలకు ఎలాంటి సమస్య ఉండదు.     

ఇది దశాబ్దాలుగా - అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ప్రూవ్ అవుతూనే ఉంది. ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారా సినిమా ఎక్కడికో పోతుంది. ఏ నాన్-థియేటర్ రైట్స్ అయినా తర్వాత ఎలాగూ వెంటబడి వస్తాయి. 

కాని, ఎవరు వింటారు? 

- మనోహర్ చిమ్మని

(100 Days. 100 Posts. 1/100.)             

Saturday, 26 April 2025

ఏది నిజం... ఏది అబద్ధం?


ఎవరైనా మనతో అబద్ధాలు చెబుతున్నట్టయితే మొదట్లో ఒకటిరెండుసార్లు నమ్ముతున్నట్టు నటిస్తామేమో. అదీ వాళ్ళకోసమే. 

కాని, అబద్ధాలు మాట్లాడ్డమే ఒక అలవాటుగా చేసుకున్నవాళ్లను చూస్తే జాలేస్తుంది. 

మైథోమానియా. 
పాథలాజికల్ లైయింగ్. 
ఏదైనా కావచ్చు...  

అలాంటి ఒక సైకలాజికల్ డిసార్డర్‌తో వాళ్లెంత బాధపడుతున్నారో కదా అనిపిస్తుంది. 

కట్ చేస్తే - 

డైరెక్ట్ సీయం మాట్లాడుతున్నట్టు చెప్తారు. మొబైల్‌లో సీయంతో అలా మాట్లాడుతూ పక్కకి వెళ్తారు. మనం నమ్మాలి. 
  
సీయం కోటరీలోని టాప్ లెవల్ మనుషులు ప్రతిరోజూ టచ్‌లో ఉన్నట్టే చెప్తారు. 

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోలీస్ కమిషనర్లు, గవర్నమెంట్‌లోని టాప్ ఆఫీసర్లు.. అబ్బో ఈ లిస్టుకు అంతుండదు. 

అందరూ వీళ్లతో టచ్‌లోనే ఉంటారు. 

వీళ్ళు డీల్స్ మాట్లాడితే లక్షలు కాదు... కోట్లలో ఉంటాయి.  

కాని - పాపం, ట్రెయిన్ టికెట్-బస్ టికెట్ లాంటి చిన్న చిన్న అవసరాలకు కూడా - నెలలు నెలలు - వీళ్ళు డబ్బు కోసం బాధపడుతుంటారు... అదేంటో అర్థం కాదు. 

బహుశా ఇది కూడా ఒక అబద్ధం కావచ్చు, చెప్పలేం. 

ఫ్రెండ్‌షిప్ గురించి రామోజీరావు యస్ పి బాలుకు చెప్పినట్టు, ఫ్రెండ్‌గా చేసుకున్నాం కాబట్టి చివరిదాకా మనం నమ్ముకుంటూపోవాలి... భరిస్తూపోవాలి.

అలాంటి మన గుడ్డి నమ్మకానికి వీళ్ళు విలువెప్పుడిస్తారన్నదే మిలియన్ డాలర్ కొశ్చన్. అసలిస్తారా అన్నది ఇంకో చిల్లర కొశ్చన్. 

Wishing such people a speedy recovery. 

- మనోహర్ చిమ్మని 

పోలీస్ వారి హెచ్చరిక !!


ఈరోజుల్లో ఈ ఎర్ర సినిమాలు ఎవరు చూస్తారు... అనుకుంటాం.

కాని, వాటి బేస్ వాటికుంది. బి-సి సెంటర్స్‌లో వీటికి ప్రేక్షకులున్నారు. ఆయా ఎర్రపార్టీల నాయకులు, కార్యకర్తలు ఒక్క మాట చెప్తే వెళ్ళి చూసే జనం కూడా ఉన్నారు. 

ఈ కోణంలో చూస్తే - కొత్తవారితో తీసే మామూలు ఇండిపెండెంట్ కమర్షియల్ సినిమాల ఓపెనింగ్స్‌కు నిజంగా ఇంత సీన్ లేదు.    

భారీ బడ్జెట్ ఫ్లాప్ సినిమాలకంటే ఈ ఎర్ర సినిమాల ఓపెనింగే బెటర్‌గా ఉంటుంది. ఇక సినిమాలో ఏమాత్రం సత్తా ఉన్నా... ఒకప్పటి మాదాల రంగారావు, టి కృష్ణ, ఆర్ నారాయణమూర్తి సినిమాల్లా హిట్ కొట్టొచ్చు. 

కట్ చేస్తే - 

మిత్రుడు, నటుడు, అభ్యుదయ సినిమాల డైరెక్టర్ బాబ్జీ గారి "పోలీస్ వారి హెచ్చరిక" సినిమా త్వరగా రిలీజై, హిట్ కావాలని ఆశిస్తున్నాను. 

- మనోహర్ చిమ్మని  

పి యస్:
డైరెక్టర్ బాబ్జీ గారు నా లేటెస్ట్ రోడ్-క్రైమ్-థ్రిల్లర్ సినిమా "ఎర్ర గులాబి"లో ఒక సెన్సేషనల్ పాత్రలో నటించారు.   

Saturday, 19 April 2025

ఈ మార్పుని ఎవ్వరూ ఆపలేరు!


నెమ్మదిగా సింగిల్ థియేటర్స్ అన్నీ... అన్నిచోట్లా అదృశ్యం అవుతాయి. మాల్స్, మల్టిప్లెక్సెస్‌లోని కాంపాక్ట్ థియేటర్స్ తప్ప, పెద్ద థియేటర్స్ అనేవి దాదాపు ఇంక ఉండవు. ఇది నా ప్రెడిక్షన్ కాదు. మనకు ఇష్టంలేని నిజం.   

బిగ్ స్క్రీన్ మీద మాత్రమే చూసి థ్రిల్ ఫీల్ కావాలనిపించే అతి కొన్ని అత్యంత భారీ స్థాయి విజువల్స్, భారీ స్టార్‌డమ్ ఉండే సినిమాలకు తప్ప... థియేటర్స్‌కు వెళ్ళి సినిమా చూడాలన్న కోరిక సగటు ప్రేక్షకుని జీవనశైలిలోంచి చాలా త్వరగా అదృశ్యమైపోతోంది.       

వినడానికి కష్టంగా ఉంటుంది. కాని, ఇది మనం నమ్మితీరాల్సిన నిజం.  
 
చాలా మంది పాయింట్ అవుట్ చేస్తున్నట్టు... టికెట్ రేట్స్ ఇష్టమొచ్చినట్టు పెంచుతుండటం, క్యాంటీన్స్‌లో విపరీతమైన ధరలు వంటివి ఈ మార్పుకు ఒక ప్రధాన కారణం కావచ్చు. కాదనలేం. ఎందుకంటే - సినిమా స్టార్‌లను ఎక్కువగా ఆదరించేది, సినిమాలు ఎక్కువగా చూసేది, సినిమాల కోసం ఎక్కువగా ఖర్చుపెట్టేది... మధ్యతరగతి వాళ్లు, దిగువ మధ్యతరగతి వాళ్లే. 

అయితే - దీన్ని మించిన కారణాలు కూడా అనేకం ఉన్నాయి... 

కరోనా తర్వాత సగటు మనిషి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడున్న సగటు మనిషి జీవనశైలికి సినిమా ఒక ఆప్షన్ మాత్రమే. సినిమాను మించిన ప్లాట్‌ఫామ్స్, టైమ్‌పాస్‌లు ఇప్పుడు చాలా ఉన్నాయి. వీటిలో - ఓటీటీలు, సోషల్ మీడియా అనేవి టాప్‌లో ఉంటాయి. సింగిల్ థియేటర్స్ కనుమరుగు కావడానికి ఈ రెండు కూడా అతి ముఖ్యమైన కారణాలని నేను భావిస్తాను.  

కట్ చేస్తే - 

మనిషి జీవనశైలిలో వచ్చిన ఈ మార్పుని ఎవ్వరూ ఆపలేరు. కాని, సినిమా కూడా ఎక్కడికీ పోదు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏ ఐ) వంటి కొత్త ఆవిష్కరణలు ఇంకెన్ని పుట్టుకువచ్చినా, సినిమాపై వాటి ఎఫెక్టు గురించి ఎవరు ఎంత భయపెట్టినా... సినిమా మాత్రం చావదు. దానికి అంతం లేదు. 

జస్ట్... సినిమాను ప్రదర్శించే ప్లాట్‌ఫామ్స్ మాత్రమే మారుతుంటాయి.     

Trends change. Tech evolves. But cinema stays—because stories never die.

- మనోహర్ చిమ్మని 

శిలాశాసనం లాంటి రూల్!


సినీఫీల్డులోకి ప్రవేశించాలనుకొనే ఆర్టిస్టులయినా, టెక్నీషియన్లయినా, ఇంకెవరయినా... ముందుగా తెల్సుకోవల్సిన విషయాలు ప్రధానంగా రెండు:

1. సినీఫీల్డులో "ఇది ఇలా జరుగుతుంది" అని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఫీల్డులో ఎంట్రీ దొరకడమే చాలా కష్టం. దొరికాక దాన్ని సరైన విధంగా వినియోగించుకొని నిలదొక్కుకోవడం మరీ కష్టం. ఒక్క ముక్కలో చెప్పాలంటే - ఇక్కడ దేనికీ గ్యారంటీ లేదు. కాబట్టి, దేన్నీ టేకిట్ ఫర్ గ్రాంటెడ్‌లా తీసుకోడానికి లేదు. ప్రతిక్షణం, ప్రతి విషయంలో చాలా చాలా జాగ్రత్తపడాల్సి ఉంటుంది.   

2.  ఇక్కడ అవకాశం దొరికి, పేరు తెచ్చుకొనేవరకూ దాదాపు ఎవ్వరూ ఒక్క రూపాయి పారితోషికం ఇవ్వరు. అలా ఇస్తారనుకోవడం, అలా అని ఎవరైనా చెప్తే వినడం... ఉఠ్ఠి భ్రమ. మన జేబులోంచే వేలు, లక్షలు ఖర్చుపెట్టుకుంటూ బ్రతకాల్సి ఉంటుంది. ఆర్టిస్టు అయినా, టెక్నీషియన్ అయినా - ఇలాంటి ఖర్చు లేకుండా ఎవరికైనా ఒక చోట అవకాశం దొరికిందంటే దాన్ని నిజంగా ఒక అదృష్టంగా భావించాలి. ఈ విషయంలో కేవలం ఒకే ఒక్క కేటగిరీకి మాత్రమే మినహాయింపు ఉంటుంది. అది - హీరోయిన్లు, ఇతర ఫిమేల్ సపోర్టింగ్ ఆర్టిస్టులు. వీళ్లు దొరకడం కొంచెం కష్టం కాబట్టి ఈ వెసులుబాటు! అదే హీరోలయితే ఎదురు పెట్టుబడి పెట్టాల్సికూడా రావొచ్చు. ఈమధ్య హీరోయిన్స్ కూడా పెట్టుబడి పెట్టి హీరోయిన్స్ అవుతున్నారు. అందులో ఎలాంటి తప్పులేదు. ఎవరి డ్రీమ్ కోసం వారు ఏదైనా చెయ్యొచ్చు. అది పూర్తిగా వేరే విషయం.          

పైన చెప్పిన రెండు అంశాల్ని దృష్టిలో పెట్టుకొని, కొత్తగా ఫీల్డులోకి రావాలనుకొనేవాళ్లు తీసుకోవల్సిన జాగ్రత్త ఒకే ఒక్కటి...

ఇక్కడ ఫీల్డులో అవకాశం దొరికి, నిలదొక్కుకొనేవరకూ - ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరొక ఆదాయమార్గాన్ని లేదా జాబ్‌ని ముందుగానే చూసుకోవాలి. అది మీ సినీ కెరీర్ ప్రయత్నాలకు ఎలాంటి అడ్డంకి కానిదై ఉండాలి. లేదంటే - సింపుల్‌గా మీరు బాగా డబ్బున్నవాళ్లయి ఉండాలి. మీ కుటుంబం మీకు పూర్తిగా సహకరించాలి. అప్పుడే ఫీల్డులో మీరు ఏదైనా సాధించడానికి 80% అవకాశం ఉంటుంది.  

కట్ చేస్తే - 

శిలాశాసనం లాంటి ఈ జాగ్రత్త తీసుకోకుండా ఫీల్డులోకి ఎవరు ఎంటరయినా... తర్వాత సినిమా కష్టాలు తప్పవు.

అన్నీ అవుతున్నట్టే ఉంటుంది. కానీ, ఏదీ జరగదు. సాంఘికంగా, ఆర్థికంగా ఎన్నో ఛాలెంజ్‌లు ఎదుర్కోవాల్సి వస్తుంది. చూస్తుండగానే జీవితం మీ చేతుల్లోంచి జారిపోతుంది.

సో, మరొక ఇన్‌కమ్ స్ట్రీమ్ గాని, ఒక సపోర్ట్ సిస్టమ్ గాని లేకుండా ఇక్కడ ఎవ్వరూ ఏం సాధించలేరు.      

ఇలాంటి సిచువేషన్‌కు పూర్తి వ్యతిరేకంగా - కొందరు ఏ బాదరబందీల్లేకుండా ఫీల్డులోకి దిగుతారు. నాలాంటివాళ్ళు అన్నీ కుదిరినప్పుడే చేస్తారు. లేదా, ఒక్కోటి కుదిరించుకొంటూ ముందుకెళ్తారు. ఇంకొందరు యు యస్ లో బాగా సంపాదించుకొని వచ్చి, ఇక్కడో కంపెనీ పెట్టుకొని, ఫీల్డులో పూర్థిస్థాయిలో దిగుతారు. వీళ్ళందరికీ ఎలాంటి భయం ఉండదు. వత్తిడిలో నిర్ణయాలు తీసుకొనే అవసరం వీరికి అసలుండదు. వీళ్ళు చాలా కూల్‌గా ఈ జర్నీని ఎంజాయ్ చేస్తూ, కొంచెం ముందూ వెనకా, అనుకున్నది సాధించుకొంటూ వెళ్తారు.      

అయితే - పరోక్షంగా వీళ్ళంతా కూడా శిలాశాసనం లాంటి ఆ జాగ్రత్త పాటించినట్టే అని నా ఉద్దేశ్యం.  

సో, బి కేర్‌ఫుల్!         

- మనోహర్ చిమ్మని    

Wednesday, 16 April 2025

సినిమాల్లోకి ఎంట్రీనే ఉంటుంది... ఎక్జిట్ మన చేతుల్లో ఉండదు!


'సినిమా కష్టాలు' పడకుండా ఇండస్ట్రీలో పైకివచ్చినవారు లేరు!

ఎంత సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నా సరే, ఎంత డబ్బున్నా సరే, ఎంతో టాలెంట్ ఉండి మరెంతో టాప్ రేంజ్‌లోకి వచ్చినా సరే... ఏదో ఒక టైమ్‌లో, ఏదో ఒక రూపంలో, ఈ సినిమా కష్టాలనేవి ఈ రంగంలో ఉండేవాళ్లను తప్పక ఎటాక్ చేస్తాయి.

ఈ స్టేట్‌మెంట్‌కు ఎలాంటి రిలాక్సేషన్ లేదు. ఎవ్వరూ దీనికి అతీతులు కాదు. 

ఒక టాప్ రేంజ్ హీరోగా తన సినిమాలతో దేశాన్ని ఉర్రూతలూగించిన ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ నివసించే ఇంటిని బ్యాంక్ వాళ్లు వేలానికి పెట్టే పరిస్థితి వచ్చింది ఒక దశలో.

అప్పటికే సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చి, బాగా సంపాదించి, ఇంకా అదే రేంజ్‌లో సినిమాలు చేస్తున్న సమయంలోనే దర్శకుడు పూరి జగన్నాథ్ సుమారు వంద కోట్లు పోగొట్టుకొని ఆర్థికంగా ఒక్కసారిగా మైనస్‌లోకి వెళ్లిపోయాడు. మొన్నీమధ్యకూడా "ఇస్మార్ట్ శంకర్" కు ముందు, పూరీ దగ్గర యాభై వేలుకూడా లేని పరిస్థితి గురించి కొన్నిరోజులక్రితం ఆయన పుట్టినరోజునాడు ఒక కార్యక్రమంలో ఛార్మి ఎంతో ఎమోషనల్‌గా చెప్పింది.    

ఒక పెద్ద రచయిత, అప్పట్లో చదివించే స్థోమతలేక తన కొడుకు చదువుని ఇంటర్‌మీడియట్‌తోనే ఆపేశారు.

ఒక ట్రెండ్ సెట్టర్ సినిమా ఇచ్చి, ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించిన తర్వాత కూడా, ఒక మేవరిక్ దర్శకుడు, ఆయన టీమ్... తమ సొంత బేనర్లో మరో సినిమా చేస్తున్న సమయంలో... లంచ్‌కి డబ్బుల్లేక బండిమీద రేగుపళ్లు కొనుక్కుని తిన్నారంటే నమ్ముతారా? 

ఇలా ఎన్నయినా ఉదాహరణలు ఇవ్వగలను. దీన్నిబట్టి అసలు అవకాశాలు, సక్సెస్‌లు లేనివారి కష్టాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ఎవరైనా చాలా ఈజీగా ఊహించవచ్చు.  

సినిమా కష్టాలకు సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవాటితో అస్సలు సంబంధం ఉండదు అని చెప్పడమే ఇక్కడ నా పాయింట్. మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే - సినిమాల్లోకి ఎంట్రీనే ఉంటుంది. ఎక్జిట్ మన చేతుల్లో ఉండదు. 

సినిమా ఎవ్వర్నీ వదలదు, దీన్లోకి ఎంటరయినవాడు సినిమానీ వదల్లేడు!

ఇది నిజం... నేనెప్పుడూ సినిమాఫీల్డులోకి పూర్తిస్థాయిలో దిగలేదు. అయినా సరే, దీన్ని వదలాలంటే ఇప్పుడు నాకు జేజమ్మ కనిపిస్తోంది. 

దటీజ్ సినిమా! 

పైనరాసిన మొత్తానికి ఒక పాజిటివ్ ఎపిలోగ్ ఏంటంటే... సినిమాను ఒక పక్కా క్రియేటివ్ బిజినెస్‌గా, ఒక ప్రొఫెషన్‌గా మాత్రమే తీసుకొని, ఆ పరిధిలోనే, ఎక్కడా టెంప్ట్ కాకుండా, కొన్ని అతి మామూలు జాగ్రత్తలు తీసుకొని, కొంచెం బేసిక్ డిసిప్లిన్ పాటిస్తే మాత్రం అసలు ఏ కష్టాలు రావు. బాగా సంపాదించొచ్చు కూడా.   

స్పిరిచువల్‌గా చెప్పాలంటే... ఒక రకమైన 'డిటాచ్‌డ్ అటాచ్‌మెంట్' పాటించాలి. కాని, ఎవరు పాటిస్తారు? 

ఇదంతా అందరికీ తెలిసిందే. కాని ఆచరణ దగ్గరే తడబడుతుంటారు.

అలా తడబడనివాళ్ళే ఫీల్డులో నిలదొక్కుకుంటారు. వాళ్ళే లైమ్‌లైట్‌లో ఉంటారు. 

The film world rewards the fearless. If you’re waiting for permission, you’ll be watching, not creating.

- మనోహర్ చిమ్మని  

Tuesday, 15 April 2025

ఇప్పుడు సీన్ మారింది!


"మా వాడు చదువుకోవట్లేదు. ఉద్యోగం చేయడు. బిజినెస్ చేయలేడు. ఏ పనీ చేతకాదు. ఎందుకూ పనికిరాడు. కొంచెం నీ దగ్గర డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పెట్టుకో!"

ఒకరోజు పొద్దున్నే గురువుగారు "దర్శకరత్న" దాసరి గారికి కాల్ చేసి అలా అడిగాట్ట ఆయన స్నేహితుడు. బయటివాళ్ల దృష్టిలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అంటే మరీ అంత పనికిరానిదన్నమాట! 

ఈ జోక్‌ని స్వయంగా గురువుగారు, దర్శకరత్న దాసరి నారాయణరావుగారు అప్పటి తన బంజారాహిల్స్ ఆఫీసులో స్వయంగా నాతో చెప్పారు. ఒక్క డైరెక్షన్ డిపార్ట్‌మెంటే కాదు. టోటల్‌గా సినీఫీల్డులో పనిచేసేవారంతా ఎందుకూ పనికిరానివాళ్లని ఇతర ఫీల్డులవాళ్ల అభిప్రాయం. 

"చదువుకోవడం చేతకానివాళ్లంతా సినీఫీల్డంటారు!" అని కూడా అంటారు కొంతమంది. వాళ్లకి తెలీదు... ఫీల్డులో హైస్కూల్ డ్రాపవుట్స్ నుంచి, ఎమ్ బి ఏ లు, యూనివర్సిటీ డబుల్ గోల్డ్ మెడలిస్టులు, న్యూక్లియర్ ఫిజిక్స్ పీజీలు, ఐ ఐ ఎమ్ నేపథ్యాన్ని అలవోగ్గా అలా వదిలేసినవాళ్ల దాకా ఎందరో ఉన్నారని! 

"అబ్బో సినిమావాళ్లా!" అంటారు కొందరు. మిగిలినవాళ్లంతా ఏదో సొక్కమైనట్టు. వీళ్లేదో చేయరాని పని చేస్తున్నట్టు! దేన్నయినా సరే జనరలైజ్ చేసి మాట్లాడే ఇలాంటివాళ్లంతా తెలుసుకోవాల్సిన ఒక నిజం ఎన్నటికీ తెల్సుకోలేరు.

"మ్యాటర్ ఎప్పుడూ ఫీల్డు కాదు. మన మైండ్‌సెట్" అనేది కామన్‌సెన్స్. అన్ని ఫీల్డుల్లో మంచీ చెడు ఉంటుంది. ఇది గ్లామర్ ఫీల్డు కాబట్టి, ఇక్కడ దగ్గినా తుమ్మినా బ్రేకింగ్ న్యూసే.

సినిమా న్యూస్‌లు, సినిమావాళ్ళమీద టిడ్‌బిట్స్, సినిమా బేస్‌డ్ ప్రోగ్రామ్స్, సినిమావాళ్ల ఫోటోలు, బైట్స్ లేకుండా ఏ పత్రికా, ఏ చానెల్, ఏ సోషల్ మీడియా బ్రతకలేదు. సగటు మనిషి జీవితంలో కూడా సినిమా ఒక అంతర్భాగం. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సినిమావాళ్ళ కొలాబొరేషన్ లేకుండా దాదాపు ప్రపంచంలోని ఏ బిజినెస్, ఏ ప్రొఫెషన్ కూడా ఉండే అవకాశం లేదు.    

ఇప్పుడు సీన్ మారింది. సినిమా ఒక పాష్ & ప్రీమియమ్ స్థాయి ప్రొఫెషన్ అని, అందులో ఎంట్రీ అనేదే చాలా గొప్ప విషయమని రియలైజ్ అవుతున్నారు. అవక తప్పదు. మనీకి మనీ, ఫేమ్‌కి ఫేమ్... సినిమానా మజాకా!   

ఒకప్పడు లక్షల్లో ఉండే అంకెలు... ఇప్పుడు పదుల కోట్లు, వందల కోట్ల దాకా ఎలా వెళ్తున్నది కూడా షాకవుతూ మరింత బాగా గమనిస్తున్నారు. 

- మనోహర్ చిమ్మని 

Sunday, 13 April 2025

పూర్వాశ్రమంలో మేనేజర్స్...


మీకో విషయం తెలుసా?

హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్... ఏ సినిమా ఫీల్డులో అయినా చూడండి... ఎక్కువ మంది ప్రొడ్యూసర్స్ అంతకుముందు... పూర్వాశ్రమంలో మేనేజర్స్‌గా పనిచేసినవాళ్లే! 

ఇది నేను నెగెటివ్‌గా చెప్పట్లేదు. సక్సెస్ సైన్స్ పాయింటాఫ్ వ్యూలో చెప్తున్నాను. 

వాళ్ళేం భారీగా ఎంబిఏలు గింబీయేలు చదువుకొని వుండరు. అంతకుముందు కోటీశ్వరులు కూడా కాదు లక్షలు, కోట్లు ఇన్వెస్ట్ చెయ్యడానికి. కాని, వాళ్ళు ప్రొడ్యూసర్స్ అవుతారు, సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్స్ అవుతారు.  

ఎలా సాధ్యం? 

జస్ట్ వన్ థింగ్. ఫోకస్. ఒక్కటే ఒక్క లక్ష్యం... ఏమైనా సరే, ప్రొడ్యూసర్ కావాలనుకుంటారు... అవుతారు. 

బై హుక్ ఆర్ నుక్... హిట్ కొట్టాలనుకుంటారు, కొడతారు. దట్సిట్.     

కట్ చేస్తే - 

మనం ఉన్నాం... బాగా చదువుకున్నవాళ్ళం. కొంచెమైనా ఎడ్జ్ అనేది మనకు ఉండాలి కదా? 

ఉండదు. 

ఎందుకు? 

ప్రతిదానికీ పనికిమాలిన ఎన్నో ఎనాలిసిస్‌లు చేస్తాం. అవసరం లేకపోయినా ఎంతో ఆలోచిస్తాం. పది పడవల మీద కాళ్ళుపెడతాం. రిజల్టు ఎప్పట్లాగే ఉంటుంది... పది మందిలో పాము చావదు అన్నట్టు!  

- మనోహర్ చిమ్మని       

Saturday, 12 April 2025

సినిమా అవతల లైఫ్ చాలా ఉంది...


ఒక్కటే ఒక్క సినిమా. 
మరీ టెంప్ట్ అవుతే -
మరీ అవసరమైతేనే -
ఇంకో సినిమా.
వన్+వన్.   
బస్.  
ఖేల్ ఖతమ్. 
దుకాణ్ బంద్.  

ముందు నేను అనుకున్నది ఇదే. ఇప్పటికీ కట్టుబడి ఉన్నదీ దీనికే. 

ఈలోగా ప్రభుత్వాలు మారాయి. రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో స్టకప్ వచ్చింది. అదే అన్నిచోట్లా రిఫ్లెక్ట్ అయింది. ఆ ఎఫెక్ట్ ప్రత్యక్షంగా పరోక్షంగా నాకూ పడింది. నా టీమ్ మీద కూడా పడింది. అందరం బాగా సఫరయ్యాం.    

కట్ చేస్తే - 

మధ్యలో అనుకోకుండా, అసలు ప్లాన్‌లో లేని... ఒక రోడ్-క్రైమ్-థ్రిల్లర్ సినిమా "ఎర్ర గులాబి" వచ్చింది. చూస్తుండగానే దాని షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో డబ్బింగ్ దశలో ఉంది.  

ఎర్రగులాబి రిలీజ్ చెయ్యడం.
Yo! పూర్తిచేసి, రిలీజ్ చెయ్యడం. 
దట్సిట్. 

సయొనారా టు ఫిలిమ్స్! 

సినిమా అవతల లైఫ్ చాలా ఉంది. సమయం చాలా తక్కువగా ఉంది. 

- మనోహర్ చిమ్మని    

Friday, 11 April 2025

మంథన్ - ఒక చరిత్ర!


1976 లోనే, సుమారు 50 ఏళ్ళక్రితం, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా క్రౌడ్-ఫండింగ్ పద్ధతిలో దర్శకుడు శ్యాం బెనెగల్ రూపొందించిన సినిమా - మంథన్. 

దీనికి కథ శ్యాం బెనెగల్, వర్గీస్ కురియన్ రాయగా, స్క్రీన్‌ప్లే ప్రఖ్యాత రచయిత విజయ్ టెండూల్కర్ అందించారు. ప్రఖ్యాత పాటల రచయిత కూడా అయిన కైఫీ అజ్మీ ఈ సినిమాకు సంభాషణలు రాశారు. సంగీతం వనరాజ్ భాటియా సమకూర్చారు. స్మితా పాటిల్, గిరీష్ కర్నాడ్, అనంత్ నాగ్, నసీరుద్దీన్ షా, కుల్భూషణ్ కర్బందా, అమ్రిష్ పురి వంటి హేమాహేమీలు ఈ సినిమాలో నటించారు. 

1977లో బెస్ట్ ఫిలిం, బెస్ట్ స్క్రీన్‌ప్లే జాతీయ అవార్డులు అందుకున్న ఈ సినిమా, ఎన్నో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై అద్భుత చిత్రంగా ప్రశంసలందుకుంది. ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ వాళ్ళు - ఫిలిం నెగెటివ్ మీద చేసిన ఈ సినిమాను భవిష్యత్ తరాలవారికి కూడా అందుబాటులో ఉండేవిధంగా - శివేంద్రసింగ్ దుంగార్పూర్ సారథ్యంలో డిజిటల్ రూపంలోకి ఇటీవలే 2024లో మార్చారు. అదే సంవత్సరం మే నెలలో, 77 వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రదర్శించారు. ఆ ప్రత్యేక ప్రదర్శనకు డైరెక్టర్ శ్యాం బెనెగల్‌తో పాటు - దివంగత స్మితాపాటిల్ కుమారుడు ప్రతీక్ బబ్బర్, నసీరుద్దీన్ షా హాజరయ్యారు. ఆ తర్వాత సుమారు 7 నెలల్లోనే శ్యాం బెనెగల్ మరణించారు. 

చాలా మందికి తెలియని విషయం... శ్యాం బెనెగల్ పుట్టింది, పెరిగింది, చదువుకొంది అంతా కూడా మన హైద్రాబాద్‌లోనే అన్నది! ఉస్మానియా యూనివర్సిటీలోనే ఆయన ఎమ్మే ఎకనామిక్స్ చదివారు. శ్యాం బెనెగల్ జన్మించిన తిరుమలగిరి ఏరియా మా ఆఫీసుకి జస్ట్ ఒక 6 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.    

కట్ చేస్తే -

గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు "మిల్క్ కాపిటల్ ఆఫ్ ఇండియా" అని పేరుంది. ప్రఖ్యాత మిల్క్ ప్రొడక్ట్స్ సంస్థ "అమూల్" (AMUL) ఇక్కడే ఉంది. అమూల్ అంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ (AMUL) అని ఎంతమందికి తెలుసు? 

త్రిభువన్ దాస్ పటేల్ లాంటి సోషల్ వర్కర్, వర్గీస్ కురియన్ లాంటి శ్వేత విప్లవకారుల విశేష కృషి ఫలితంగానే గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో మొట్టమొదటి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం రూపొందింది. ఆ సహకార సంఘం ఏర్పాటుకు ముందు ఎంతో మంది నిస్వార్థ నాయకుల కృషి, వారు భరించిన కష్టనష్టాలు, ఎదుర్కొన్న కుల సంబంధమైన కుట్రలు, ద్వేషాలు మొదలైనవాటన్నిటిని నేపథ్యంగా తీసుకొని అల్లిన అందమైన నిజజీవిత కథే శ్యాం బెనెగల్ "మంథన్". 


తమ నిజజీవిత కథను సినిమాగా తీయడం కోసం గుజరాత్ లోని 5 లక్షల మంది పాల ఉత్పత్తిదారులు చెరొక 2 రూపాయలు విరాళంగా ఇచ్చి - మంథన్ సినిమా బడ్జెట్ 10 లక్షల రూపాయలను సమకూర్చారు. ఈ మహత్కార్యానికి పూనుకొని సక్సెస్ చేసిన మనీషి వర్గీస్ కురియన్. 1976 లో మంథన్ విడుదలైనప్పుడు - ఇదే 5 లక్షల మంది పాల ఉత్పత్తిదారులు... వారి డబ్బులతో రూపొందించిన, వారి జీవిత కథనే, వెండితెర మీద చూసుకొని ఆనందించడానికి... గుజరాత్ నలుమూలల నుంచి బండ్లు కట్టుకొని సినిమా థియేటర్లకు వెళ్ళారు.  

చదువుతుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తోంది కదా?  

ఇదీ మంథన్ సినిమా నేపథ్యం. దురదృష్టవశాత్తు, సినీ ప్రేమికులందరూ తప్పక అధ్యయనం చేయాల్సిన ఇలాంటి చరిత్ర, ఎక్కడో నిశ్శబ్దంగా దాగుండిపోవటం, కనుమరుగైపోవడం అనేది పెద్ద విషాదం. 

ఇదీ - మనదేశంలో 50 ఏళ్ళ క్రితమే క్రౌడ్ ఫండింగ్ పద్ధతిలో నిర్మించిన ఒక అద్భుత సినిమా కథ. మరి 50 ఏళ్ళ క్రితమే ఇంత అద్భుతంగా సక్సెస్ సాధించిన క్రౌడ్-ఫండింగ్ పద్ధతి ఇప్పుడెందుకు ఇండియాలో సక్సెస్ కావడం లేదు?... అదే మిలియన్ డాలర్ కొశ్చన్.          

- మనోహర్ చిమ్మని 

మనదేశపు తొలి క్రౌడ్ ఫండింగ్ సినిమా - మంథన్


"క్రౌడ్ ఫండింగ్" అనే పదం ఈ మధ్యనే అమెరికాలో పుట్టింది. క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్స్ వచ్చాయి. అక్కడ బాగా విజయవంతమయ్యాయి.

కానీ, దాదాపు 50 ఏళ్లక్రితమే శ్యాం బెనెగల్ దర్శకత్వం వహించిన సెన్సేషనల్ సినిమా "మంథన్" మనదేశపు తొలి క్రౌడ్ ఫండింగ్ సినిమా. ఇది 1976 లోనే వచ్చింది. 

"సెన్సేషనల్" అన్న పదం ఇక్కడ నేను కావాలని ఉపయోగించాను. మంథన్ సినిమాకు సంబంధించిన క్రింది వివరాలు కొన్ని చదవండి... మీకే తెలుస్తుంది నేనెందుకు ఆ పదం వాడానో.   

కట్ చేస్తే - 

మంథన్ ఉట్టి సినిమా కాదు. ఒక చరిత్ర. 

మంథన్ సినిమా నిర్మించడానికి కావల్సిన మొత్తం 10 లక్షల బడ్జెట్‌ను అప్పట్లో "వైట్ రెవల్యూషన్" కు కారకుడు, "అమూల్" సంస్థ చైర్మన్ డాక్టర్ కురియన్ వర్గీస్ ఈ క్రౌడ్ ఫండింగ్ పధ్ధతిలోనే సమకూర్చిపెట్టాడు.

మొత్తం 5 లక్షలమంది పాల ఉత్పత్తిదారుల నుంచి, మనిషికి 2 రూపాయల చొప్పున సేకరించి, ఈ సినిమా నిర్మాణానికి కావల్సిన మొత్తం బడ్జెట్ 10 లక్షల రూపాయలను శ్యాం బెనెగల్‌కు ఇచ్చి సినిమా చేయించాడాయన. 

అలా తీసిన భారతదేశపు తొలి క్రౌడ్ ఫండెడ్ సినిమా మంథన్, ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను రివార్డులను సాధించిపెట్టింది. పేరు, అవార్డులతోపాటు మంథన్ సినిమాకు లాభాలు కూడా బాగానే వచ్చాయి అప్పట్లో.  

స్మితాపాటిల్, గిరీష్ కర్నాడ్, నసీరుద్దీన్ షా వంటి గొప్ప నటీనటులు నటించిన ఈ సినిమా డిజిటల్ వెర్షన్ 2024 లో, 77 వ కాన్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. దానికి దర్శకుడు శ్యాం బెనెగల్, నసీరుద్దీన్ షా, రత్నా పాఠక్, స్మితాపాటిల్ కుమారుడు ప్రతీక్ బబ్బర్ హాజరయ్యారు. ఆ తర్వాత 2024 డిసెంబర్లోనే శ్యాం బెనెగల్ మరణించారు. 

మనిషికి 2 రూపాయల చొప్పున, మొత్తం 5 లక్షల మంది పాల ఉత్పత్తిదారుల నుంచి క్రౌడ్ ఫండింగ్ అప్పుడెలా చేయగలిగారు? దానివెనుక చరిత్ర ఏంటి? ... 1976 లోనే చరిత్ర సృష్టించిన ఈ సినిమాకు సంబంధించిన మరి కొన్ని సెన్సేషనల్ అంశాలు రేపటి నా బ్లాగ్‌లో, ఇక్కడే చదవండి.

- మనోహర్ చిమ్మని  

Wednesday, 9 April 2025

"క్రౌడ్‌-ఫండింగ్ ఫర్ సినిమా"... మన దేశంలో ఎందుకు సక్సెస్ కాలేదు?


అమెరికాతో పాటు, కొన్ని ఇతర అభివృధ్ధిచెందిన దేశాల్లో  ఈమధ్య బాగా ప్రాచుర్యం పొందిన పదం - క్రౌడ్ ఫండింగ్. 

ఒక ప్రాజెక్టుని ప్రారంభించి, పూర్తిచేయడంకోసం చిన్నచిన్న మొత్తాల్లో ఎక్కువమంది నుంచి డబ్బు సేకరించడమే క్రౌడ్ ఫండింగ్. సింపుల్‌గా చెప్పాలంటే - ఒక కోటి రూపాయల పెట్టుబడి కోసం ముగ్గురో, నలుగురో కలిస్తే అది "పార్ట్‌నర్‌షిప్" అవుతుంది. అదే కోటి రూపాయల కోసం ఒక 10 మందో, అంతకంటే ఎక్కువ మందో కలిసిస్తే అది "క్రౌడ్ ఫండింగ్" అవుతుంది. 

అంతర్జాతీయంగా ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందిన ఈ ఫండ్ రైజింగ్ ప్రాసెస్ ని అమలు చేయటం కోసం ఆన్‌లైన్‌లో కిక్ స్టార్టర్, ఇండీగోగో వంటి ఎన్నోవెబ్ సైట్లున్నాయి. ఈ సౌకర్యం కల్పించినందుకు వాటి కమిషన్, సర్విస్ చార్జీలు, టాక్స్ వగైరా  అవి తీసుకుంటాయి. ఒకసారి ఆ సైట్స్‌కు వెళితే ఎవరికయినా విషయం పూర్తిగా అర్థమైపోతుంది.

2013 లో వచ్చిన "లూసియా" అనే కన్నడ సినిమా, ఈ క్రౌడ్ ఫండింగ్ పధ్ధతిలో తయారైన తొలి కన్నడ సినిమా. 50 లక్షల మొత్తం బడ్జెట్‌ను క్రౌడ్ ఫండింగ్ పధ్ధతిలోనే సేకరించి నిర్మించిన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఒక్కటే 95 లక్షలు సంపాదించిపెట్టింది. అప్పుడు లూసియా మొత్తం కలెక్షన్లు 3 కోట్లు. ఆ తర్వాత నాకు తెలిసి, కనీసం ఇంకో అరడజన్ కన్నడ సినిమాలు ఇదే పధ్ధతిలో నిర్మించారు. హిందీలో, తెలుగులో  కూడా ఈ పధ్ధతిలో కొన్ని సినిమాల నిర్మాణం జరిగింది.    

అయితే - ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయిన ఈ క్రౌడ్ ఫండింగ్ మెథడ్... ఒకవైపు చారిటీ కోసం, మరోవైపు వివిధరకాల స్టార్టప్‌ల కోసం ఇన్వెస్ట్‌మెంట్ సేకరించడం నుంచి, ఇండిపెండెంట్ సినిమాల నిర్మాణానికి బడ్జెట్ సేకరించడం వరకు... ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతోంది. మన దేశంలో కూడా ఒక్క సినిమాల విషయంలో తప్ప, మిగిలిన అన్ని అంశాల్లో సక్సెస్‌ఫుల్‌గానే కొనసాగుతోంది. 

ఒక్క సినిమాల విషయంలోనే - ఈ క్రౌడ్ ఫండింగ్ పద్ధతి మన దేశంలో ఎందుకని సక్సెస్ కాలేదన్నది - బాగా స్టడీ చేయాల్సిన అంశం. నా ఉద్దేశ్యంలో -  మన దేశంలో "క్రౌడ్ ఫండింగ్ ఫర్ సినిమా" ఫెయిల్ కావడానికి కారణం... ఆ కోణంలో ఎవ్వరూ పెద్దగా పట్టించుకోకపోవడమే.    

సినిమా నేపథ్యం ఉన్న ఔత్సాహికులు బాగా అధ్యయనం చేసి, కేవలం ఇండిపెండెంట్ సినిమాల క్రౌడ్-ఫండింగ్ కోసమే ఏదైనా ప్రారంభించగలిగితే, నిజంగా అదొక సెన్సేషనల్ స్టార్టప్ అవుతుంది.               

కట్ చేస్తే - 

సినిమాల్లో క్రౌడ్ ఫండింగ్ అనేది ఎక్కడో అమెరికా నుంచి దిగుమతి అయిన కొత్త కాన్సెప్ట్ కాదు. సుమారు 50 ఏళ్ళ క్రితమే మన దేశంలో దీన్ని అత్యంత విజయవంతంగా సాధించి చూపించిన రికార్డు మనకుంది. 

అర్థ శతాబ్దం క్రితమే, అమెరికా వంటి దేశాల్లో అసలలాంటి ఆలోచన పుట్టకముందే, మన దేశంలోనే క్రౌడ్ ఫండింగ్‌తో తీసిన ఆ సినిమా పేరేంటి? డైరెక్టర్ ఎవరు?... అదంతా రేపటి బ్లాగ్‌లో. ఇక్కడే. 

- మనోహర్ చిమ్మని  

Tuesday, 8 April 2025

నాకు తెలిసిన "కెమెరామన్ అశోక్‌రెడ్డి ఫ్రమ్ ఆదిలాబాద్!"


అది... 2005. 
పాత ఆదిలాబాద్ జిల్లా. 
నిర్మల్ దగ్గర పార్పెల్లి గ్రామం. 
పదో తరగతి ఎలాగో పాసయ్యాడు. 
ఇంక చదువు తనవల్ల కాదనుకున్నాడు.
ఇంటర్‌లో చదువు డిస్కంటిన్యూ చేశాడు.

కట్ చేస్తే - 

హైద్రాబాద్‌లో మొట్టమొదటి డిజిటల్ కెమెరామన్, వెండి మబ్బులు సినిమా, రుతురాగాలు, చక్రవాకం వంటి మాగ్నం-ఓపస్ సీరియళ్ళకు కెమెరామన్ అయిన పోతన రమణ దగ్గర అసిస్టెంట్‌గా చేరిపోయాడా యువకుడు. 

కొన్నాళ్ళ తర్వాత దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ స్టూడియోల్లో ఒకటైన డిజిక్వెస్ట్‌లో ఉద్యోగంలో చేరాడు. 

కట్ చేస్తే - 

బెంగుళూరు, ముంబై, కొచ్చి, హైద్రాబాద్ డిజిక్వెస్ట్ బ్రాంచ్‌ల మధ్య కెమెరాలతో ఫ్లయిట్ ప్రయాణాలు, షూటింగులు. అలా ముంబైలో పనిచేస్తున్నప్పుడే రిషి పంజాబి వటి యాడ్ ఫిలిం మేకర్స్‌తో కూడా పనిచేశాడా యువకుడు. 


డిజిక్వెస్ట్‌లో పనిచేస్తున్నప్పుడే నా రొమాంటిక్ హారర్ సినిమా "స్విమ్మింగ్‌పూల్"కు కెమెరా డిపార్ట్‌మెంట్‌లో పనిచేయడానికి వచ్చి, అప్పుడు నాకు మొదటిసారిగా పరిచయమయ్యాడా యువకుడు. 

అప్పటినుంచీ మధ్య మధ్య కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. మొన్నీ మధ్యనే మా స్వర్ణసుధ ప్రాజెక్ట్స్ ఆఫీసులో కూడా కలుసుకున్నాము. తర్వాత మళ్ళీ మొన్నటి రోడ్-క్రైమ్-థ్రిల్లర్ "ఎర్ర గులాబి" సినిమా షూటింగ్‌లోనే మేం కలవడం. 

అయితే - ఈ సారి, కెమెరా అసిస్టెంటుగానో అసిస్టెంట్ కెమెరామన్‌గా మాత్రమే రాలేదతను. టాలీవుడ్‌లో కెమెరాలను షూటింగ్ కోసం రెంటుకిచ్చే "స్కంద ఫిలిం గేర్స్"  పార్టనర్‌గా కూడా వచ్చాడు. మా డిఓపి వీరేంద్రలలిత్‌తో, నాతో కలిసి అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా ఎప్పట్లాగే మా టీమ్‌లో పనిచేశాడా యువకుడు. 

ఆ యువకుని పేరు... అశోక్ రెడ్డి. 

కట్ చేస్తే - 

అశోక్ రెడ్డి ఇప్పటికే ఒక తమిళ సినిమాకు, 2 తెలుగు సినిమాలకు ఇండిపెండెంట్ డిఓపిగా పనిచేశాడు. డైరెక్టర్ రవిబాబుతో కూడా ఒక సినిమా చేశాడు. ఇకమీదట డిఓపి గానే కొనాసాగాలనుకుంటున్నాడు. 

నాకున్న సమాచారం ప్రకారం, తన పర్సనల్ లైఫ్‌లో వచ్చిన ఒక పెద్ద డిస్టర్బెన్స్ వల్ల అశోక్ రెడ్డి కెరీర్‌లో కొన్ని ఒడిదొడుకులు వచ్చాయి గాని, లేదంటే ఇప్పటికే టాలీవుడ్‌లో సినిమాటోగ్రాఫర్‌గా ఒక స్థాయికి రీచ్ అయ్యి, చాలా బిజీగా ఉండేవాడు. 

తెలంగాణలో అసలు ఎలాంటి డెవలప్‌మెంట్‌కు నోచుకోని ఆదిలాబాద్ జిల్లా (ఇప్పుడు నిర్మల్ జిల్లా) నుంచి 2005 లోనే ఒక కుర్రాడు సినిఫీల్డులోకి వచ్చి, ఈ స్థాయికి ఎదగడం అన్నది నిజంగా నేను ఊహించని విషయం. 


వ్యక్తిగతంగా చాలా మంచివాడు, సౌమ్యుడు అయిన అశోక్ రెడ్డి నాకు పదేళ్ళ క్రితం మొదటిసారి పరిచయం అయినప్పుడు ఎలా ఉన్నాడో, ఇప్పుడూ అలాగే ఉన్నాడు. ఇండస్ట్రీలో ఇది చాలా అరుదు. ఒక్క సినిమా చేస్తారో లేదో... ఒక్కొక్కరు ఎలా యాటిట్యూడ్ లెవల్స్ చూపిస్తారో మనకు తెలుసు. అశోక్ రెడ్డిలో అలాంటిదేం లేకపోవడం నిజంగా గొప్ప విషయం. 

ఫినిషింగ్ టచ్ ఏంటంటే - 

త్వరలో మా ఇద్దరి కోంబోలో ఒక సినిమా ఉండబోతోంది. స్క్రిప్ట్ వర్క్, ప్రి-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. టైటిల్ కూడా మొన్నీమధ్యే రిజిస్టర్ అయింది...

"Warangal Vibes!"
A dark romantic crime comedy. 

Wishing Ashok Reddy a remarkable journey and a shining career as a DOP in the film industry!

- మనోహర్ చిమ్మని