Wednesday, 9 April 2025

"క్రౌడ్‌-ఫండింగ్ ఫర్ సినిమా"... మన దేశంలో ఎందుకు సక్సెస్ కాలేదు?


అమెరికాతో పాటు, కొన్ని ఇతర అభివృధ్ధిచెందిన దేశాల్లో  ఈమధ్య బాగా ప్రాచుర్యం పొందిన పదం - క్రౌడ్ ఫండింగ్. 

ఒక ప్రాజెక్టుని ప్రారంభించి, పూర్తిచేయడంకోసం చిన్నచిన్న మొత్తాల్లో ఎక్కువమంది నుంచి డబ్బు సేకరించడమే క్రౌడ్ ఫండింగ్. సింపుల్‌గా చెప్పాలంటే - ఒక కోటి రూపాయల పెట్టుబడి కోసం ముగ్గురో, నలుగురో కలిస్తే అది "పార్ట్‌నర్‌షిప్" అవుతుంది. అదే కోటి రూపాయల కోసం ఒక 10 మందో, అంతకంటే ఎక్కువ మందో కలిసిస్తే అది "క్రౌడ్ ఫండింగ్" అవుతుంది. 

అంతర్జాతీయంగా ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందిన ఈ ఫండ్ రైజింగ్ ప్రాసెస్ ని అమలు చేయటం కోసం ఆన్‌లైన్‌లో కిక్ స్టార్టర్, ఇండీగోగో వంటి ఎన్నోవెబ్ సైట్లున్నాయి. ఈ సౌకర్యం కల్పించినందుకు వాటి కమిషన్, సర్విస్ చార్జీలు, టాక్స్ వగైరా  అవి తీసుకుంటాయి. ఒకసారి ఆ సైట్స్‌కు వెళితే ఎవరికయినా విషయం పూర్తిగా అర్థమైపోతుంది.

2013 లో వచ్చిన "లూసియా" అనే కన్నడ సినిమా, ఈ క్రౌడ్ ఫండింగ్ పధ్ధతిలో తయారైన తొలి కన్నడ సినిమా. 50 లక్షల మొత్తం బడ్జెట్‌ను క్రౌడ్ ఫండింగ్ పధ్ధతిలోనే సేకరించి నిర్మించిన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఒక్కటే 95 లక్షలు సంపాదించిపెట్టింది. అప్పుడు లూసియా మొత్తం కలెక్షన్లు 3 కోట్లు. ఆ తర్వాత నాకు తెలిసి, కనీసం ఇంకో అరడజన్ కన్నడ సినిమాలు ఇదే పధ్ధతిలో నిర్మించారు. హిందీలో, తెలుగులో  కూడా ఈ పధ్ధతిలో కొన్ని సినిమాల నిర్మాణం జరిగింది.    

అయితే - ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయిన ఈ క్రౌడ్ ఫండింగ్ మెథడ్... ఒకవైపు చారిటీ కోసం, మరోవైపు వివిధరకాల స్టార్టప్‌ల కోసం ఇన్వెస్ట్‌మెంట్ సేకరించడం నుంచి, ఇండిపెండెంట్ సినిమాల నిర్మాణానికి బడ్జెట్ సేకరించడం వరకు... ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతోంది. మన దేశంలో కూడా ఒక్క సినిమాల విషయంలో తప్ప, మిగిలిన అన్ని అంశాల్లో సక్సెస్‌ఫుల్‌గానే కొనసాగుతోంది. 

ఒక్క సినిమాల విషయంలోనే - ఈ క్రౌడ్ ఫండింగ్ పద్ధతి మన దేశంలో ఎందుకని సక్సెస్ కాలేదన్నది - బాగా స్టడీ చేయాల్సిన అంశం. నా ఉద్దేశ్యంలో -  మన దేశంలో "క్రౌడ్ ఫండింగ్ ఫర్ సినిమా" ఫెయిల్ కావడానికి కారణం... ఆ కోణంలో ఎవ్వరూ పెద్దగా పట్టించుకోకపోవడమే.    

సినిమా నేపథ్యం ఉన్న ఔత్సాహికులు బాగా అధ్యయనం చేసి, కేవలం ఇండిపెండెంట్ సినిమాల క్రౌడ్-ఫండింగ్ కోసమే ఏదైనా ప్రారంభించగలిగితే, నిజంగా అదొక సెన్సేషనల్ స్టార్టప్ అవుతుంది.               

కట్ చేస్తే - 

సినిమాల్లో క్రౌడ్ ఫండింగ్ అనేది ఎక్కడో అమెరికా నుంచి దిగుమతి అయిన కొత్త కాన్సెప్ట్ కాదు. సుమారు 50 ఏళ్ళ క్రితమే మన దేశంలో దీన్ని అత్యంత విజయవంతంగా సాధించి చూపించిన రికార్డు మనకుంది. 

అర్థ శతాబ్దం క్రితమే, అమెరికా వంటి దేశాల్లో అసలలాంటి ఆలోచన పుట్టకముందే, మన దేశంలోనే క్రౌడ్ ఫండింగ్‌తో తీసిన ఆ సినిమా పేరేంటి? డైరెక్టర్ ఎవరు?... అదంతా రేపటి బ్లాగ్‌లో. ఇక్కడే. 

- మనోహర్ చిమ్మని  

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani