Showing posts with label క్రియేటివిటీ. Show all posts
Showing posts with label క్రియేటివిటీ. Show all posts

Sunday, 12 July 2026

మన దేశంలో పబ్లిషింగ్ వ్యవస్థ ప్రపంచస్థాయి ప్రమాణాల్లో ఎందుకు లేదు?


ఒక్క అమెజాన్‌లోనే, 2025లో, ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 మిలియన్ల ప్రింటెడ్ బుక్స్ సేలయ్యాయి. 

ఈ 300 మిలియన్ల పుస్తకాల్లో 50% పుస్తకాలు కొని చదివింది అమెరికన్ పాఠకులే కావడం మనం గమనించాల్సిన ముఖ్యమైన అంశం. 

'కిండిల్ బుక్స్' లాంటి డిజిటల్ బుక్స్, ఆడియో బుక్స్ అంకెలు వేరే. 

కట్ చేస్తే -

ప్రపంచపటంలోని అభివృద్ధి చెందిన ఏ దేశాన్నయినా తీసుకోండి. ఆ దేశ ప్రజలు, పాలకులు, కంపెనీల సీఈవోలు... ఖచ్చితంగా మంచి పాఠకులైవుంటారు. పుస్తకప్రియులైవుంటారు. వీళ్ళల్లో చాలామంది రైటర్స్ కూడా ఉంటారు. 'న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్' స్థాయిలో మంచి మంచి పుస్తకాలు రాసివుంటారు. 

పుస్తకాలు చదవటం అనే అలవాటు మనిషిలోని విజువలైజేషన్ పవర్‌ను ఎప్పటికప్పుడు పెంపొందిస్తుంది. పాఠకుల్లో ఒక స్థాయి క్రమశిక్షణకు మూల కారణమవుతుంది. ఈ రెండూ ఉన్నప్పుడే ఎవరైనా ఏ ఫీల్డులోనైనా ఎదగగలుగుతారు. 

వ్యక్తుల ఉన్నతస్థాయి ఎదుగుదల, పరోక్షంగా వారి దేశ ఉన్నతికి ఉపయోగపడుతుంది.     

మనమెక్కడున్నాం మరి? 

యూట్యూబ్ కనిపెట్టిన అమెరికన్స్ కంటే ఎక్కువగా మనదేశంలోని వ్యూయర్సే ఆ వీడియోల్ని పనీపాటా పక్కనపెట్టి ఎగబడి చూస్తున్నారు. యూట్యూబ్ ద్వారా వారికి భారీ ఆదాయం రావడానికి కారణమవుతున్నారు. 

యూట్యూబ్ వీడియోలు చూడటం తప్పు కాదు.
ఏం చూస్తున్నామన్నది పాయింట్. 

యూట్యూబ్‌లోని వీడియోలు చూడ్దానికి అలవాటుపడటం ద్వారా... పరోక్షంగా మనలోని ఆలోచనా శక్తిని, ఊహాశక్తిని, విశ్లేషణాశక్తిని, విజువలైజేషన్ పవర్‌ను ఊహించని స్థాయిలో కోల్పోతున్నాం. 

పుస్తకాలే కాదు, అసలు ఇంక దేన్నయినా సరే, చదివే అలవాటునే పూర్తిగా మర్చిపోతున్నాం.  
 
ఇది నిజం కాదా?

మనలో ఎంతమంది పెన్ను, పేపర్ పట్టుకొని గత 24 గంటల్లో ఏదైనా రాశారు? అసలు మనలో ఎంతమంది ఏదైనా ఒక పుస్తకం పట్టుకొని ఎన్నిరోజులైంది?

"ఇప్పుడంతా డిజిటల్ యుగం, పుస్తకాలు అవుట్‌డేటెడ్" అనే ముందు, ఈ పోస్టు ప్రారంభంలో నేను రాసిన అమెరికా ఉదాహరణ ఇంకోసారి చదవండి. 

మన దేశంలో పబ్లిషింగ్ వ్యవస్థ ప్రపంచస్థాయి ప్రమాణాల్లో ఎందుకు లేదు?... మన దేశంలో 99.99% రచయితలు ఎందుకు రాయటం ద్వారా సంపాదించుకోలేరు?... ప్రొఫెషనల్ రైటర్స్‌గా ఎందుకు బ్రతకలేరు?... 

ఇలాంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం కూడా ఒక్కటే. 

మనం పుస్తకాలు చదవటం లేదు.     

Every great nation is first built in silence—one reader, one book, one awakened mind at a time. 

- మనోహర్ చిమ్మని  

Tuesday, 7 July 2026

చెప్పి చేస్తేనే మజా!


ఏదైనా సాధించాలకునేవారు రెండు రకాలుగా ఉంటారు. 

> బయటికి ఏం చెప్పకుండా, సీక్రెట్‌గా ఒక వ్యూహం ప్రకారం పనులు చేసుకుంటూ అనుకున్నది సాధించేవాళ్ళు.
> నేను ఇది సాధించాలనుకుంటున్నాను అని ఓపెన్‌గా బయటికి చెప్పి మరీ సాధించేవాళ్ళు.

మొదటిరకం వాళ్ళది "ఎందుకొచ్చిన ప్రెషర్... ఎవరేమనుకుంటారో... ఏం కామెంట్ చేస్తారో" అన్న భయం. 

రెండోరకం వాళ్లది "బయటికి ప్రకటిస్తే గాని మనకు ప్రెషర్ ఉండదు. ఆ ప్రెషర్ ఇచ్చే డ్రైవ్‌తోనే ఇంకా బాగా కమిటెడ్‌గా పనిచేస్తాం" అన్న భావన.

అనుకున్నది సాధించే విషయంలో, ఇద్దరికీ 50/50 చాన్సెసే ఉంటాయి. కాని, ఓపెన్‌గా చెప్పి మరీ కష్టపడేవారికి కొంచెం ఎడ్జ్ ఉంటుంది. 

మొదటివాళ్ళది డిఫెన్స్.
రెండోరకం వాళ్ళది అఫెన్స్. 

కట్ చేస్తే - 

చిన్న బడ్జెట్ కేటగిరీలోనే, దాదాపు అంతా కొత్తవాళ్ళు, అప్-కమింగ్‌వాళ్లతో, మంచి కల్ట్ సబ్జెక్ట్‌తో ఒక 100 కోట్ల హిట్ కొట్టాలన్నది ఇప్పుడు నా లక్ష్యం. నా టీమ్ లక్ష్యం.    

కల్ట్ కథలు.
డిసిప్లిన్డ్ ఎగ్జిక్యూషన్.
కమర్షియల్ సెన్స్.

లైక్‌మైండెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ఫిలిం ప్రొడక్షన్ వైపు ఆసక్తి ఉన్న సీరియస్ ఇన్వెస్టర్లు-కొలాబొరేటర్లతో నా కొత్త జర్నీ ప్రారంభమవుతోంది. 

వైజాగ్ నుంచి పనులకు శ్రీకారం.

If you believe in smart cinema and calculated risk, and you’re looking for a genuine entry into the film business, there’s space at the table.

Make films that make money.
Let’s work together. Let’s grow together.

Interested? DM me. 

- మనోహర్ చిమ్మని 

Saturday, 10 May 2025

మీ ఎకౌంట్లో ఇంకెన్ని వీకెండ్స్ ఉన్నాయో తెలుసా?


యావరేజ్‌న మనిషి ఒక 4000 వారాలు బ్రతుకుతాడట.

అంటే ఒక 77 ఏళ్ళు. 

ఒక పెన్నూ పేపర్ తీసుకుంటే ఇట్టే అర్థమైపోతుంది... ఇంకెన్నివారాలు మనం బ్రతుకుతాం అన్నది. 

ఈలోపు మన లిస్టులో కనీసం ఒక 1001 బాధ్యతలు, పనులు, లక్ష్యాలు, కోరికలు, ఆశలు గట్రా చాలా ఉన్నాయి. 

ఎలా సాధ్యం?

మనకు మిగిలిన వారాలెన్ని? 
ఈలోపు ఇన్ని ఉరుకులు పరుగులు అవసరమా? 

మన శరీరానికి విశ్రాంతి ఎప్పుడు? 
మన మనసుకి ప్రశాంతత ఎప్పుడు? 
మనకున్న ఈ ఒకే ఒక్క జీవితానికి ఆనందం ఎప్పుడు? 

కట్ చేస్తే -

అవ్వా బువ్వా అన్నీ కావాలంటే కుదరదు. 

నీకు ఇష్టమైన పనిచేస్తూ, నీకు నచ్చినట్టు నువ్వు జీవించటం ముఖ్యమా? ఎవరో ఏదో అనుకుంటారని నీది కాని బ్రతుకు బ్రతకడం ముఖ్యమా? 

ఆలోచించు. 
ఈలోగా నీ జీవితంలోంచి ఇంకో వారం వెళ్ళిపోకుండా చూసుకో. 

- మనోహర్ చిమ్మని 

100 Days, 100 Posts. 15/100. 

"జర్నలిజం" అన్న పదమే సిగ్గుపడుతోంది!


యూట్యూబ్‌లో కొన్ని చిల్లర ఎకౌంట్స్ ఎకవుంట్స్ ఉంటాయి. సినిమా హీరోయిన్స్ మీదో, హీరోల మీదో, లేదంటే ఇద్దరినీ కలిపో... వాడిష్టమొచ్చిన నీచనికృష్ట కథొకటి అల్లుతాడు. దానికి పరమ ఛండాలపు థంబ్‌నెయిలొకటి పెడతాడు. లక్షల్లో వ్యూస్ వస్తాయి. వాడి లక్ష్యం నెరవేరుతుంది. 

వాడి స్థాయి అదే. వాడి బ్రతుకుతెరువు అదే.

ఇప్పుడు దేశంలోని అత్యధిక టీవీ ఛానెల్స్ కూడా ఈ స్థాయికి దిగజారాయి. 

ప్రపంచం ముందు పరువుపోతోంది.

"జర్నలిజం" అన్న పదమే సిగ్గుపడుతోంది.

డిఫెన్స్ మినిస్ట్రీ ఇన్ని స్టోరీలు, ఇంత కంటెంట్ ఈ ఛానెల్స్‌కు ఎప్పుడిచ్చింది?  నిజంగా ఇచ్చివుంటే, అదంతా ప్రింట్ మీడియాలో కూడా వస్తుంది కదా? ఫారిన్ ప్రెస్‌లో కూడా వస్తుంది కదా? 

కట్ చేస్తే -

చిల్లర యూట్యూబ్ థంబ్‌నెయిల్ బ్యాచ్ స్థాయికి దిగజారిన ఛానెల్స్ చూపిస్తున్న బ్రేకింగ్ న్యూస్‌నే నిజమని నమ్ముతూ, ఆ న్యూస్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న మన దేశభక్తులకు నా సానుభూతి.   

బార్డర్ దగ్గర అనేక కష్టనష్టాలనుభవిస్తున్న మన దేశ ప్రజలందరికీ... దేశం కోసం పోరాడుతున్న మన త్రివిధదళాల ఫైటర్స్ అందరికీ నా సెల్యూట్.  

- మనోహర్ చిమ్మని   

100 Days, 100 Posts. 14/100. 

Wednesday, 7 May 2025

తెరమీద సినిమా, తెరవెనుక సినిమా... రెండూ వేర్వేరు!


బ్రతుకుతెరువుకి డబ్బు కోసం సినిమాలు ప్రయారిటీలో టాప్‌లో ఉండటం... 
డబ్బులు రాని ఉట్టుట్టి ఆత్మ సంతృప్తి కళలు ప్రయారిటీలో అన్నిటికంటే కిందకి పడిపోవడం... 

ఎలాంటి ఆశ్చర్యాన్నివ్వని నిజాలు.   
జీవిత వాస్తవాలు.

... అలాగే ఉంటాయి. 

కట్ చేస్తే - 

బయటివాళ్ళు "గ్యాంబ్లింగ్ ఆడుతున్నావ్" అంటారు. 

"కాదు, జీవనపోరాటం చేస్తున్నా... ఇంకో వందమందికి జీవితాన్నిస్తున్నా" అంటాన్నేను. 

తెరమీద సినిమా, 
తెరవెనుక సినిమా... 
రెండూ వేర్వేరు.

తెరవెనుక సినిమానే ఎవ్వరికీ తెలీదు. తెలియాల్సిన అవసరం లేదు.   

A film is shaped not only by what’s inside the frame, but by what’s left out — for in absence, meaning deepens, and in silence, truth echoes.

- మనోహర్ చిమ్మని 

100 Days, 100 Posts. 11/100. 

Tuesday, 6 May 2025

ఇంగ్లిష్ "Katha" సీరీస్‌ను గుర్తుకు తెచ్చే "పాలపిట్ట కథ-2025"


అందమైన ముఖచిత్రంతో పాలపిట్ట మ్యాగజైన్ హౌజ్ నుంచి ఈమధ్యే విడుదలైన "పాలపిట్ట కథ-2025" కొత్తగా ఉంది. మా ఆలిండియా రేడియో లైబ్రరీలో నేను చదివిన ఒకప్పటి ఇంగ్లిష్ "కథ" సీరీస్ బుక్స్ గుర్తుకొచ్చాయి. 

ఎన్నిక చేసిన 31మంది కథకులు రాసిన 31 కొత్తకథలు ఇందులో ఉన్నాయి. అన్నీ వేటికవే విలక్షణమైన కథావస్తువు, విభిన్నమైన శిల్పంతో కూడిన కథలు. ఇలాంటి ఒక కొత్త ఆలోచన చేసి, వెంటనే ఆచరణలో పెట్టిన "పాలపిట్ట" మ్యాగజైన్ ఎడిటర్, నా మిత్రుడు గుడిపాటికి అభినందనలు.   

272 పేజీలు, 200 రూపాయలు. పాలపిట్ట బుక్స్, మలక్‌పేట్ (9848787284), నవోదయ బుక్ హౌజ్, కాచిగూడ (9000413413) లకు ఆర్డర్ పెట్టి కాపీలు తెప్పించుకోవచ్చు.  

కట్ చేస్తే - 

సినిమాలు, ఇంకో అరడజన్ ఫ్రీలాన్సింగ్ పనుల్లో మునిగిపోయి, ఊపిరాడక కొట్టుకుపోతున్న నాచేత చాలా కాలం తర్వాత మళ్ళీ కథ రాయించిన క్రెడిట్ గుడిపాటిదీ, ఇంకో ఫ్రెండుది కూడా. వారిద్దరికీ థాంక్స్.     

"పాలపిట్ట-2025"లో నా కథ "సముద్రం నాకిష్టం" కూడా ఉంది. 

I don’t write to impress. I write to undress the soul—mine first.

- మనోహర్ చిమ్మని 
100 Days, 100 Posts. 10/100.  

Monday, 5 May 2025

సక్సెస్ రేట్ 5% అయినప్పుడు ఏం చెయ్యాలి?


ఇందాకే ఒక షార్ట్ చూశాను. అది రాజమౌళి ఇంటర్వ్యూ. 

రాజమౌళి చెప్పినదాంట్లో సారాంశం ఇది: 

"సినిమాల్లో సక్సెస్ రేటు కేవలం 5 శాతం. గత 75 ఏళ్ళుగా ఇదే రికార్డవుతోంది. ఇది అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు 99 శాతం సినిమాల్ని ఒకే టైపు మూసధోరణిలో ఎందుకు చెయ్యటం? అప్పటివరకూ రాని ఇంకేదో చెప్పడానికి ప్రయత్నించాలి. ఎలా అయినా రిస్క్ ఒక్కటే అయినప్పుడు, అదేదో కొత్తగా వెళ్తే పోలా?" 

లాజిక్ కరెక్టే కదా? 

కట్ చేస్తే - 

సినిమా చేసే ప్రతి ప్రొడ్యూసర్, డైరెక్టర్ "మాది డిఫరెంట్ సినిమా, ఇంతవరకు ఈ పాయింట్‌తో రాలేదు" అనే అనుకుంటారు. అలాగే చెప్తారు కూడా. 

అయితే అందులో నిజం ఎంతన్నది అందరికీ తెలిసిందే. 

When success is a 5% chance anyway, why not bet on a story the world has never seen? The risk is the same—but the legacy could be yours alone.

- మనోహర్ చిమ్మని 
100 Days, 100 Posts. 8/100. 

Sunday, 4 May 2025

బ్లాగింగ్ ద్వారా సాధించాల్సింది ఇంక చాలా ఉంది...


మొన్నటిదాకా నా బ్లాగ్‌కు ఉన్న కస్టమ్ డొమైన్‌ను తీసేసి, కొత్త డొమైన్ నేమ్‌కు మార్చే ప్రాసెస్‌లో ఎక్కడో స్టకప్ అయింది. 

పాత డొమైన్ రావట్లేదు, కొత్తది కనెక్ట్ అవ్వలేదు. ఒరిజినల్ బ్లాగర్ డొమైన్ అయితే అలాగే ఉంది. 

2, 3 గంటలు బుర్రబద్దలు కొట్టుకున్నాను. సెట్ చెయ్యలేకపోయాను. ప్రస్తుతానికి దాన్నలా వదిలేశాను. ఇప్పుడు ఎక్కడా నా బ్లాగర్ లింక్ ఇవ్వట్లేదు. 

ఎక్కడో యు యస్ లో ఉన్న మా ప్రణయ్ ఇంట్లో లేని లోటుని... ఇదిగో... ఇలాంటి టెక్నికల్ గ్లిచెస్ వల్ల కూడా మొట్టమొదటిసారి ఫీలయ్యాను. 

మా ప్రణయ్‌కి ఆ లాగిన్స్ పంపించో, లేదంటే ఇక్కడే ఎవరైనా టెక్కీని పక్కన కూర్చోపెట్టుకొనో, ఈ పని త్వరగా పూర్తిచెయ్యాలి. 

కట్ చేస్తే - 

సినిమా కావచ్చు, నాన్-సినిమా కావచ్చు... నేను చేసే అన్ని పనులకూ, ఇకనుంచి నా బ్లాగే ఒక సెంట్రల్ హబ్ కాబోతోంది. 

- మనోహర్ చిమ్మని 
100 Days, 100 Posts. 7/100.   

నాని గట్స్‌ను నిజంగా మెచ్చుకోవాల్సిందే!


హిట్3 చూశాను. నేను అప్పుడెప్పుడో నా హైస్కూల్ రోజుల్లో, వరంగల్లోని అలంకార్ థియేటర్లో ఒక ఇంగ్లిష్ సినిమా చూస్తున్నట్టు ఫీలయ్యాను. 

సోకాల్డ్ నాని ఇమేజ్‌ను అలవోగ్గా అలా పక్కకు తోసేసి, డైరెక్టర్ శైలేశ్ కొలను అదరగొట్టాడు. శ్రీనిధి శెట్టిని హీరోయిన్‌గా ఎంపిక చెయ్యటం మంచి నిర్ణయం. ఆమె కనిపించిన ప్రతిచోటా తన ఫేసినేటింగ్ ప్రజెన్స్ ఫీలయ్యేలా చేసింది.        

కట్ చేస్తే - 

నాని గట్స్‌ను నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఇలాంటి రిస్కులు వేరే హీరోలు చెయ్యకపోవచ్చు. ప్రొఫెషనల్‌గా ఇది నానీ తీసుకున్న బిగ్గెస్ట్ రిస్క్. సక్సెస్ అయ్యింది.

Hence it's proved...   

No guts. No glory. 
No guts. No story.     

- మనోహర్ చిమ్మని 
100 Days, 100 Posts. 6/100.    

ఒక జీవిత కాలంలో దర్శకుడిగా 151 సినిమాలంటే...


గురువుగారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దగ్గర ఒకే ఒక్క సినిమాకు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్లో అసిస్టెంట్‌గా (బయటినుంచి అబ్జర్వర్‌గా) సుమారు ఒక 4 నెలపాటు పనిచేశాను. 

అంత తక్కువ సమయంలో దాసరి గారి దర్శకత్వ శాఖలో నేను నేర్చుకున్నది చాలా తక్కువ.

కాని, ఒక గొప్ప దర్శకుడిగా వారిని అతి దగ్గర నుండి నేను అధ్యయనం చేసింది మాత్రం చాలా ఎక్కువ. 

"ఒక హిట్ ఇచ్చి కలుద్దాంలే" అన్న సిల్లీ మైండ్‌సెట్‌తో దాసరి గారు బ్రతికున్నప్పుడు మళ్ళీ కలవలేకపోయాను. కాని, ఇప్పుడనిపిస్తోంది... నేను తప్పు చేశానని. 

"మనోహర్, హిట్టూ ఫట్టూ తర్వాత... డైరెక్టర్‌గా నువ్వు అసలు ఒక సినిమా తీయడమే నీ పెద్ద సక్సెస్. మిగిలిందంతా బోనస్. డైరెక్టర్ కాకముందే స్క్రిప్ట్ రైటింగ్ మీద నువ్వు అంత మంచి 'నంది అవార్డ్' బుక్ రాశావు చూడు, అది కూడా నీ సక్సెసే. నువ్వలాంటి ఫీలింగ్స్ పెట్టుకోవద్దు. వచ్చి కలుస్తూవుండు. ఈసారి నీ సినిమా నేనే రిలీజ్ చేస్తాను" అని కొంచెం సీరియస్‌గానే చెప్పారు. 

కాని, నేను వారిని మళ్ళీ కలవలేకపోయాను.

గురువుగారు అంత త్వరగా నిష్క్రమించాల్సింది కాదు. వారు ఇప్పుడున్నట్టయితే, నా ఇప్పటి మైండ్‌సెట్‌తో... నో డౌట్... వారిని తరచూ కలిసేవాడిని. 

కట్ చేస్తే -  

నిజంగా... గురువుగారికి వందనం, అభివందనం!

ఒక జీవిత కాలంలో 151 సినిమాలు డైరెక్ట్ చెయ్యటం అంత ఈజీ కాదు. అది దాసరి గారు చేసి చూపించారు. 

వీటిలో 50 కి పైగా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, 60 కి పైగా సినిమాల్లో నటించారు, అంతకు ముందు ఘోస్ట్ రైటర్‌గా ఒక 25 సినిమాలకు పనిచేశారు, 1000 పాటలు రాశారు, కొరియోగ్రఫీ చేశారు, కెమెరామన్‌గా చేశారు. సినిమారంగంలో ఆయన ఎన్నెన్నో టచ్ చేశారు. 

ఫిలిం నెగెటివ్ వాడిన ఆ రోజుల్లోనే... 1980 లో అనుకుంటాను... గురువుగారు ఒకే ఒక్క సంవత్సరంలో 10 సినిమాలు రిలీజ్ చేశారు. వాటిలో 90% హిట్స్, సూపర్ హిట్స్. 

ఇప్పటి డిజిటల్ ఫిలిం మేకింగ్‌ యుగంలో - మనం మన జీవితకాలంలో - కనీసం ఒక 10 సినిమాలైనా చెయ్యకపోతే వేస్ట్ అని నాకనిపిస్తోంది.  

గురువుగారి జయంతి సందర్భంగా వారికి నా వినమ్ర నివాళులు. 

- మనోహర్ చిమ్మని      
100 Days, 100 Posts. 5/100

Tuesday, 29 April 2025

ఒక మిత్రుడు, 12 నిమిషాలు...


ఒక అధ్యయనం ప్రకారం - నీకు నచ్చిన ఒక మంచి స్నేహితునితో-లేదా-స్నేహితురాలితో... ఎలాంటి అరమరికలు లేకుండా, ఏమీ దాచిపెట్టుకోకుండా, డిప్లొమసీ లేకుండా, బుర్ర నిండా ఉన్న టెన్షన్స్ పక్కన పెట్టేసి, ఫ్రీగా ఒక 12 నిమిషాలు మాట్లాడగలిగితే చాలు... నీ మొత్తం ఆలోచించే విధానమే మారిపోతుందట. 

అదెలా అంటే... ఎన్నో రోజులుగానో, నెలలుగానో, సంవత్సరాలుగానో... ఏదో ఒక అంశం గురించో, ఒక సమస్య గురించో, ఒక రిలేషన్‌షిప్ గురించో, ఒక నిర్ణయం గురించో... నీ ఆలోచనలన్నీ ఒక్కటే లూప్‌లో తిరుగుతుంటాయి. అది నీకు తెలుసు, కాని గుర్తించవు. అదే నీ కమ్‌ఫర్ట్ జోన్. ఆ జోన్ విడిచిపెట్టి నువ్వు బయటికిరాలేవు. అయినా సరే... అవే కష్టాలు భరిస్తూ, అదే టెన్షన్లో, నీకు తెలియకుండా నిన్ను కమ్మేసిన ఒక క్రానిక్ డిప్రెషన్లో నువ్వు బ్రతుకుతుంటావు. అంతా బాగా లేదని నీకు తెలుసు. కాని బాగున్నట్టే ఫీలవుతుంటావు. బయటికి కూడా నువ్వు అలాగే కనిపిస్తుంటావు అందరికీ. కాని, అది నిజం కాదు. 

ఇదిగో ఇదంతా ఒక ఒక బ్యాగేజీ. నువ్వు మోయలేని ఒక పెద్ద బరువు. ఇదంతా పక్కనపెట్టి... నీకు నచ్చిన ఫ్రెండుతో పైన చెప్పినట్టు అన్ని ఫిల్టర్సూ తీసేసి, ఫ్రీగా ఒక 12 నిమిషాలు మాట్లాడగలిగితే చాలు. నువ్వొక కొత్త మనిషివవుతావు. కొత్తగా ఆలోచిస్తుంటావు. 

ఇప్పటిదాకా నిన్ను వేధిస్తున్న సమస్యలకు, నువ్వే ఒక కొత్త పరిష్కారం కనుగొంటావు. నువ్వే ఒక నిర్ణయం తీసుకొంటావు. 

కాని, ఇది ఎవ్వరూ చేయరు. ఎవ్వరికీ అంత సమయం లేదు. 12 నిమిషాలు కాదు, ఎన్నో వందల నిమిషాలు వృధాగా వెచ్చిస్తుంటారు. కాని, అదే పనికిరాని ఫెయిల్యూర్ లూప్‌లో కొనసాగుతుంటారు. 

దీన్ని బ్రేక్ చేసినవాళ్ళు కింగ్స్, క్వీన్స్. 

కట్ చేస్తే -

There is a reminder that I always have 12 minutes for you. 

- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 3/100.

మార్పును ఎవరైనా సరే ఆహ్వానించక తప్పదు


Netflix CEO Ted Sarandos claimed in a recent interview that audiences are telling Hollywood, "They no longer want to go to the cinema, and would rather watch movies on streaming services."

Citing the recent drop in cinema attendance Ted Sarandos said “What is the consumer telling us? That they’d like to watch movies at home.” 

అదీ విషయం...

నెట్‌ఫ్లిక్స్ సీఈవో ఈ మాట అనడం వెనుక ఎంతో అధ్యయనం ఉంటుంది. ఏదో తోచింది అనడానికి ఈయన థర్డ్ గ్రేడ్ క్రిటిక్ కాదు. ఒక పెద్ద ఎంటర్‌టైన్మెంట్ బిజినెస్ సామ్రాజ్యానికి సారథి.

సో, సినిమా థియేటర్లకు ప్రేక్షకుల డ్రాప్ అనేది ఒక్క ఇండియాలోనే కాదు. ప్రపంచమంతా ఉంది.

అన్నిచోట్లా ఇదే మార్పు. 

మామూలు ల్యాండ్‌లైన్ ఫోన్ నుంచి మొబైల్ ఫోన్‌కు, మొబైల్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్‌కు ఎలా అయితే మారుతూవచ్చామో, ఇదీ అలాంటిదే. సాంకేతిక అభివృద్ధి నేపథ్యంగా మనిషి జీవనశైలిలో వస్తున్న మార్పును ఎవరైనా సరే ఆహ్వానించక తప్పదు. 

కట్ చేస్తే -   

ఓటీటీలకు ప్రేక్షకులున్నారు. కంటెంట్ కావల్సినంత ఉంది. వెబ్ సీరీస్‌లు, ఒరిజినల్స్ రూపంలో కొత్త కంటెంట్ వాళ్లే సొంతంగా క్రియేట్ చేసుకొంటున్నారు. సినిమాలు వాళ్లకిప్పుడు ఒక ఆప్షన్ మాత్రమే. 

మరోవైపు, సినిమాలు కూడా ఎక్కడికీ పోవు. అవి ప్రదర్శించే ప్లాట్‌ఫామ్స్ మాత్రమే మారుతూ ఉంటాయి. 

ఇండియాలో భారీ ఫ్యాన్స్ బేస్ ఉన్న కొందరు హీరోల సినిమాలు, కొన్ని భారీ బడ్జెట్ విజువల్ వండర్స్ తప్ప, మిగిలిన సినిమాలన్నీ క్రమంగా థియేటర్‌కు వెళ్ళిచూడాలనుకునే ఆలోచన నుంచి దూరమవుతాయి. 

ఈ నేపథ్యంలో - వందల కోట్లు పెట్టి తీసే సినిమాల లెక్కలు తప్పుతాయి. ప్రదర్శించే ప్లాట్‌ఫామ్ ఏదైనా కానీ, పరిమిత బడ్జెట్‌లో నిర్మితమయ్యే కంటెంట్ ఉన్న సినిమాలకు మాత్రం ఎప్పుడూ ఎలాంటి సమస్య ఉండదు. 

కంటెంట్ ఈజ్ ద కింగ్. 

- మనోహర్ చిమ్మని   

100 Days. 100 Posts. 2/100.

Sunday, 27 April 2025

ఫోకస్ ఎప్పుడూ కంటెంట్ మీదుండాలి...


సినిమావాళ్ళకైనా, ఓటీటీలకైనా కావల్సింది డబ్బే. 

మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే - సినిమాలు ఓటీటీల మీద వచ్చే ఆదాయం మీద ఆధారపడ్డాయి గాని, ఓటీటీలు కేవలం సినిమాల మీదే ఆధరపడలేదు. 

ఓటీటీల నుంచి డబ్బులు బాగా వస్తున్నాయి కదా, మా సినిమాలో ఉన్నది స్టార్ హీరో కదా అన్న ఈగోలకు ఇప్పుడు ఒక్కసారిగా బ్రేక్ పడింది. 

స్టార్ హీరో సినిమా అయినా, చిన్న సినిమా అయినా... టీజర్లు, ట్రయలర్లు వచ్చి, రిలీజ్‌కు ముందు వాటి బజ్ చూశాకనే ఓటీటీలు ఇప్పుడు మాట్లాడుతున్నాయి. 

సో, స్టార్ హీరోలున్న సినిమాలకే ఓటీటీలు ముందు డీల్ ఓకే చేస్తాయి అన్న మిత్‌కు ఇప్పుడు పూర్తిగా తెరపడింది.

అతి తక్కువ సమయంలో ఓటీటీ బిజినెస్‌లో ఇలాంటి భారీ మార్పు రావడానికి కారం కూడా సినిమావాళ్లే. వారి అత్యాశే. వారి ఈగోనే. 

కాని, "కంటెంట్ ఈజ్ ద కింగ్" అన్న విషయాన్ని లైట్ తీసుకోవడమే.  

ఓటీటీ రేటు బాగా వస్తుంది కదా అని హీరోలు రెమ్యూనరేషన్స్ పెంచడం, ప్రొడ్యూసర్స్-డైరెక్టర్స్ అంతకంతకూ అర్థంలేకుండా సినిమాల బడ్జెట్స్ పెంచుకుంటూపోతుండటం అనేది... చివరికి బంగారు గుడ్లు పెట్టే బాతుని చంపుకుతిన్నట్టయింది. 

అంతకు ముందు శాటిలైట్ రైట్స్ వచ్చినప్పుడు కూడా అంతే... ఆ బిజినెస్‌లోని ప్రతిచిన్న లూప్‌హోల్‌నూ వాడుకొని, అసలు కంటెంట్ లేని సినిమాలను వందలకు వందలు తీసి, శాటిలైట్ రైట్స్ అమ్ముకోవడం ద్వారానే కోట్లు గడించారు. 

ఇందాకే చెప్పినట్టు - ఓటీటీలకు ప్రేక్షకులున్నారు. కంటెంట్ కావల్సినంత ఉంది. వెబ్ సీరీస్‌లు, ఒరిజినల్స్ రూపంలో కొత్త కంటెంట్ వాళ్లే సొంతంగా క్రియేట్ చేసుకొంటున్నారు. 

సినిమాలు వాళ్లకిప్పుడు ఒక ఆప్షన్ మాత్రమే. 

కట్ చేస్తే -   

కొత్త టాలెంట్‌తో, ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా మంచి కంటెంట్‌ను క్రియేట్ చేసే చిన్న బడ్జెట్ ఇండిపెండెంట్ సినిమాలకు ఎలాంటి సమస్య ఉండదు.     

ఇది దశాబ్దాలుగా - అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ప్రూవ్ అవుతూనే ఉంది. ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారా సినిమా ఎక్కడికో పోతుంది. ఏ నాన్-థియేటర్ రైట్స్ అయినా తర్వాత ఎలాగూ వెంటబడి వస్తాయి. 

కాని, ఎవరు వింటారు? 

- మనోహర్ చిమ్మని

(100 Days. 100 Posts. 1/100.)             

Saturday, 26 April 2025

ఏది నిజం... ఏది అబద్ధం?


ఎవరైనా మనతో అబద్ధాలు చెబుతున్నట్టయితే మొదట్లో ఒకటిరెండుసార్లు నమ్ముతున్నట్టు నటిస్తామేమో. అదీ వాళ్ళకోసమే. 

కాని, అబద్ధాలు మాట్లాడ్డమే ఒక అలవాటుగా చేసుకున్నవాళ్లను చూస్తే జాలేస్తుంది. 

మైథోమానియా. 
పాథలాజికల్ లైయింగ్. 
ఏదైనా కావచ్చు...  

అలాంటి ఒక సైకలాజికల్ డిసార్డర్‌తో వాళ్లెంత బాధపడుతున్నారో కదా అనిపిస్తుంది. 

కట్ చేస్తే - 

డైరెక్ట్ సీయం మాట్లాడుతున్నట్టు చెప్తారు. మొబైల్‌లో సీయంతో అలా మాట్లాడుతూ పక్కకి వెళ్తారు. మనం నమ్మాలి. 
  
సీయం కోటరీలోని టాప్ లెవల్ మనుషులు ప్రతిరోజూ టచ్‌లో ఉన్నట్టే చెప్తారు. 

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పోలీస్ కమిషనర్లు, గవర్నమెంట్‌లోని టాప్ ఆఫీసర్లు.. అబ్బో ఈ లిస్టుకు అంతుండదు. 

అందరూ వీళ్లతో టచ్‌లోనే ఉంటారు. 

వీళ్ళు డీల్స్ మాట్లాడితే లక్షలు కాదు... కోట్లలో ఉంటాయి.  

కాని - పాపం, ట్రెయిన్ టికెట్-బస్ టికెట్ లాంటి చిన్న చిన్న అవసరాలకు కూడా - నెలలు నెలలు - వీళ్ళు డబ్బు కోసం బాధపడుతుంటారు... అదేంటో అర్థం కాదు. 

బహుశా ఇది కూడా ఒక అబద్ధం కావచ్చు, చెప్పలేం. 

ఫ్రెండ్‌షిప్ గురించి రామోజీరావు యస్ పి బాలుకు చెప్పినట్టు, ఫ్రెండ్‌గా చేసుకున్నాం కాబట్టి చివరిదాకా మనం నమ్ముకుంటూపోవాలి... భరిస్తూపోవాలి.

అలాంటి మన గుడ్డి నమ్మకానికి వీళ్ళు విలువెప్పుడిస్తారన్నదే మిలియన్ డాలర్ కొశ్చన్. అసలిస్తారా అన్నది ఇంకో చిల్లర కొశ్చన్. 

Wishing such people a speedy recovery. 

- మనోహర్ చిమ్మని 

పోలీస్ వారి హెచ్చరిక !!


ఈరోజుల్లో ఈ ఎర్ర సినిమాలు ఎవరు చూస్తారు... అనుకుంటాం.

కాని, వాటి బేస్ వాటికుంది. బి-సి సెంటర్స్‌లో వీటికి ప్రేక్షకులున్నారు. ఆయా ఎర్రపార్టీల నాయకులు, కార్యకర్తలు ఒక్క మాట చెప్తే వెళ్ళి చూసే జనం కూడా ఉన్నారు. 

ఈ కోణంలో చూస్తే - కొత్తవారితో తీసే మామూలు ఇండిపెండెంట్ కమర్షియల్ సినిమాల ఓపెనింగ్స్‌కు నిజంగా ఇంత సీన్ లేదు.    

భారీ బడ్జెట్ ఫ్లాప్ సినిమాలకంటే ఈ ఎర్ర సినిమాల ఓపెనింగే బెటర్‌గా ఉంటుంది. ఇక సినిమాలో ఏమాత్రం సత్తా ఉన్నా... ఒకప్పటి మాదాల రంగారావు, టి కృష్ణ, ఆర్ నారాయణమూర్తి సినిమాల్లా హిట్ కొట్టొచ్చు. 

కట్ చేస్తే - 

మిత్రుడు, నటుడు, అభ్యుదయ సినిమాల డైరెక్టర్ బాబ్జీ గారి "పోలీస్ వారి హెచ్చరిక" సినిమా త్వరగా రిలీజై, హిట్ కావాలని ఆశిస్తున్నాను. 

- మనోహర్ చిమ్మని  

పి యస్:
డైరెక్టర్ బాబ్జీ గారు నా లేటెస్ట్ రోడ్-క్రైమ్-థ్రిల్లర్ సినిమా "ఎర్ర గులాబి"లో ఒక సెన్సేషనల్ పాత్రలో నటించారు.   

Wednesday, 23 April 2025

ఒకసారి మా AIR ను చూడాలనుంది!


సుమారు ఒక పదేళ్ళు నేను ఆలిండియా రేడియో, కర్నూలు ఎఫ్ యం లో పనిచేశాను.

అదొక మంచి జ్ఞాపకం.

అప్పటి నా మిత్రులు (కొలీగ్స్) కొందరిని చాలా కాలం తర్వాత మళ్ళీ ఇవ్వాళ కలవబోతున్నాను... ఒక పెళ్ళిలో.

చూడాలి మరి... ఎంతమంది కలుస్తారో రేపు.

కట్ చేస్తే -

ఒకసారి మా ఆలిండియా రేడియో స్టేషన్‌కు వెళ్ళి చూడాలనుంది.

ఇంకా అక్కడ పనిచేస్తున్న మా అప్పటి కొలీగ్స్‌లో నాకు బాగా తెలిసిన ఫ్రెండు ఒక్కరే ఉన్నారు బహుశా. కలవాలి.

బళ్ళారి చౌరస్తా, కృష్ణారెడ్డి నగర్, చలపతి దాబా, మౌర్యా ఇన్, రాజ్ విహార్... 

ఆనంద్ టాకీస్, వెంకటేష్, విక్టరీ, శ్రీరామ థియేటర్లు, కొత్త బస్ స్టాండు, కొండారెడ్డి బుర్జు, రివర్ వ్యూ బార్... 

ఓల్డ్ సిటీ సందులో యస్ వి ఆర్ లక్ష్మీదేవి ఇల్లు, బ్యాంక్ కాలనీలో నేను ఫస్ట్ ఉన్న పెంట్ హౌజ్, నేనూ డిసౌజా కలిసి తయారు చేసిన రెడ్ వైన్... 

యండమూరి వీరేంద్రనాథ్‌తో నేను-శాస్త్రి చేసిన ఇంటర్వ్యూ... 

యస్ పి గోవర్థన్, లక్ష్మీ రెడ్డి, రామానుజాచార్యులు, ఆనంద్ బాబు, పెద్ద మేడమ్, రాం గోపాల్, కృష్ణ, కరుణాకర్, రవిశంకర్ రెడ్డి, గణపతి, మోహన్ సుధాకర్, ఫహీమ్, బాషా, రాంరెడ్డి, సురేష్... 

నబీసాబ్ హోటల్లో రోజూ చాయ్... 

టేప్ లైబ్రరీలో వేలకొద్ది గ్రాంఫోన్ రికార్డులు, బుక్స్... 

మహానంది, అహోబిలం, బెలూం కేవ్స్ లకు బైక్స్ మీద బ్యాచిలర్ లాంగ్ డ్రైవ్‌లు... 

... అన్నీ, అందరూ గుర్తుకొస్తున్నారు.

Some spaces stay with you long after you've left them.

All India Radio, Kurnool, was one such place for me.

For 10 years or more, it was where I immersed myself in world literature — both fiction and non-fiction. 

A treasure trove of words, stories, and wisdom.

How can I forget the magic of those days, the pages that shaped me?

ఒక ట్రిప్ వెంటనే వెయ్యాలి. తప్పదు. 

మై డియర్ మోహన్ రెడ్డి & కామేశ్ భాయ్... వింటున్నారా?

- మనోహర్ చిమ్మని

Monday, 21 April 2025

శిలువ మోయటం అంత ఈజీ కాదు!


కథ రాసే రచయిత కథ రాసిచ్చి వెళ్ళిపోతాడు. పాటల రచయిత పాటలు రాసిచ్చి వెళ్ళిపోతాడు. మ్యూజిక్ డైరెక్టర్ ముందు పాటలిస్తాడు, తర్వాత బ్యాగ్రౌండ్ స్కోర్ చేసిచ్చి ఆయన పనిలో ఆయనుంటాడు. ఇలాగే - ఎడిటర్, కాస్ట్యూమ్స్ చీఫ్, మేకప్-మ్యాన్, హెయిర్ డ్రెస్సర్, కెమెరామన్, ఎట్సెట్రా... వీళ్లందరి పని వాళ్ళ పనివరకే. 

షూటింగ్ టైంలో లైట్-మెన్, ఆర్ట్ వాళ్ళు గట్రా కూడా షూటింగ్ అయిపోతూనే ఇంక కనిపించరు. వాళ్ళ పని అక్కడికే పూర్తయిపోతుంది.  

వీళ్లంతా తర్వాత వేరే సినిమాల పనిలో పడతారు, లేదా ఇంకో ప్రాజెక్టు వెతుక్కుంటుంటారు. తప్పేం లేదు.  

అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా చాలా మంది డిటాచ్డ్‌గానే ఉంటారు. 

వీళ్ళందరికీ - అనుకున్న ప్రకారం డబ్బులు అందుతాయి. అక్కడికి వీళ్ళు ఫ్రీ అయిపోతారు. 

కట్ చేస్తే -  

ఒక్క డైరెక్టర్ మాత్రమే - కాన్సెప్ట్ అనుకున్నప్పటి నుంచి, ప్రొడ్యూసర్‌ను వెతుక్కొని, సినిమా పూర్తిచేసి, చివరికి సినిమాను మార్కెట్ చేసి బయటపడేవరకు ఒంటరిగా, నిశాచరునిలా బ్రతుకుతుంటాడు. 

సినిమా అనే యజ్ఞం ప్రారంభం నుంచి, పూర్తయ్యేదాకా డైరెక్టర్ పడే కష్టాలకు అంతుండదు. తన సినిమా కోసం పనిచేసే 24 క్రాఫ్ట్స్ వారి విభిన్న మైండ్‌సెట్‌లను, వారి ప్రవర్తనను, వారి మాటలను చాలా ఓపిగ్గా భరిస్తాడు. ఎక్కడా ప్రొడ్యూసర్‌కు బాధకలక్కుండా తనలో తనే అన్నీ భరిస్తాడు.   

సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా ప్రతి ఫిలిం డైరెక్టర్ జీవితం ఇదే. 

ఇంతా చేస్తే - రేపు సినిమా ఏదైనా ఉల్టాపుల్టా అయ్యిందనుకో... ప్రొడ్యూసర్ నుంచి మొత్తం టీం వరకు, అంతా "నేను ఆరోజే చెప్పాను" అని నానా రాగాలు తీస్తారు. అలాక్కాకుండా - సినిమా హిట్ అయ్యిందనుకోండి... "అంతా నా వల్లే" అని, ఎప్పుడో అదృశ్యమైపోయిన ఇదే గుంపుగుంపంతా ముందుకు ఉరికొస్తారు. 

దటీజ్ ఫిలిం డైరెక్టర్!     

- మనోహర్ చిమ్మని 

పి యస్:
హిట్ కొట్టినప్పుడు పేరు, డబ్బు బాగా వచ్చేది డైరెక్టర్‌కే కదా... అందుకే అన్నీ మోస్తాడంటారు కొందరు.

హిట్ కొట్టినా కొట్టకపోయినా, ప్రతి సినిమాకు కనీసం ఒక 100 మందికి జీవనోపాధి కల్పించేవాడు డైరెక్టరే. హిట్ కొట్టినప్పుడు డైరెక్టర్‌తో పాటు వీళ్ళలో కొందరికి కూడా చాలా పేరొస్తుంది. మంచి అవకాశాలూ వస్తాయి. ఇది నా పాయింట్.       

Saturday, 19 April 2025

ఈ మార్పుని ఎవ్వరూ ఆపలేరు!


నెమ్మదిగా సింగిల్ థియేటర్స్ అన్నీ... అన్నిచోట్లా అదృశ్యం అవుతాయి. మాల్స్, మల్టిప్లెక్సెస్‌లోని కాంపాక్ట్ థియేటర్స్ తప్ప, పెద్ద థియేటర్స్ అనేవి దాదాపు ఇంక ఉండవు. ఇది నా ప్రెడిక్షన్ కాదు. మనకు ఇష్టంలేని నిజం.   

బిగ్ స్క్రీన్ మీద మాత్రమే చూసి థ్రిల్ ఫీల్ కావాలనిపించే అతి కొన్ని అత్యంత భారీ స్థాయి విజువల్స్, భారీ స్టార్‌డమ్ ఉండే సినిమాలకు తప్ప... థియేటర్స్‌కు వెళ్ళి సినిమా చూడాలన్న కోరిక సగటు ప్రేక్షకుని జీవనశైలిలోంచి చాలా త్వరగా అదృశ్యమైపోతోంది.       

వినడానికి కష్టంగా ఉంటుంది. కాని, ఇది మనం నమ్మితీరాల్సిన నిజం.  
 
చాలా మంది పాయింట్ అవుట్ చేస్తున్నట్టు... టికెట్ రేట్స్ ఇష్టమొచ్చినట్టు పెంచుతుండటం, క్యాంటీన్స్‌లో విపరీతమైన ధరలు వంటివి ఈ మార్పుకు ఒక ప్రధాన కారణం కావచ్చు. కాదనలేం. ఎందుకంటే - సినిమా స్టార్‌లను ఎక్కువగా ఆదరించేది, సినిమాలు ఎక్కువగా చూసేది, సినిమాల కోసం ఎక్కువగా ఖర్చుపెట్టేది... మధ్యతరగతి వాళ్లు, దిగువ మధ్యతరగతి వాళ్లే. 

అయితే - దీన్ని మించిన కారణాలు కూడా అనేకం ఉన్నాయి... 

కరోనా తర్వాత సగటు మనిషి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడున్న సగటు మనిషి జీవనశైలికి సినిమా ఒక ఆప్షన్ మాత్రమే. సినిమాను మించిన ప్లాట్‌ఫామ్స్, టైమ్‌పాస్‌లు ఇప్పుడు చాలా ఉన్నాయి. వీటిలో - ఓటీటీలు, సోషల్ మీడియా అనేవి టాప్‌లో ఉంటాయి. సింగిల్ థియేటర్స్ కనుమరుగు కావడానికి ఈ రెండు కూడా అతి ముఖ్యమైన కారణాలని నేను భావిస్తాను.  

కట్ చేస్తే - 

మనిషి జీవనశైలిలో వచ్చిన ఈ మార్పుని ఎవ్వరూ ఆపలేరు. కాని, సినిమా కూడా ఎక్కడికీ పోదు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏ ఐ) వంటి కొత్త ఆవిష్కరణలు ఇంకెన్ని పుట్టుకువచ్చినా, సినిమాపై వాటి ఎఫెక్టు గురించి ఎవరు ఎంత భయపెట్టినా... సినిమా మాత్రం చావదు. దానికి అంతం లేదు. 

జస్ట్... సినిమాను ప్రదర్శించే ప్లాట్‌ఫామ్స్ మాత్రమే మారుతుంటాయి.     

Trends change. Tech evolves. But cinema stays—because stories never die.

- మనోహర్ చిమ్మని 

శిలాశాసనం లాంటి రూల్!


సినీఫీల్డులోకి ప్రవేశించాలనుకొనే ఆర్టిస్టులయినా, టెక్నీషియన్లయినా, ఇంకెవరయినా... ముందుగా తెల్సుకోవల్సిన విషయాలు ప్రధానంగా రెండు:

1. సినీఫీల్డులో "ఇది ఇలా జరుగుతుంది" అని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఫీల్డులో ఎంట్రీ దొరకడమే చాలా కష్టం. దొరికాక దాన్ని సరైన విధంగా వినియోగించుకొని నిలదొక్కుకోవడం మరీ కష్టం. ఒక్క ముక్కలో చెప్పాలంటే - ఇక్కడ దేనికీ గ్యారంటీ లేదు. కాబట్టి, దేన్నీ టేకిట్ ఫర్ గ్రాంటెడ్‌లా తీసుకోడానికి లేదు. ప్రతిక్షణం, ప్రతి విషయంలో చాలా చాలా జాగ్రత్తపడాల్సి ఉంటుంది.   

2.  ఇక్కడ అవకాశం దొరికి, పేరు తెచ్చుకొనేవరకూ దాదాపు ఎవ్వరూ ఒక్క రూపాయి పారితోషికం ఇవ్వరు. అలా ఇస్తారనుకోవడం, అలా అని ఎవరైనా చెప్తే వినడం... ఉఠ్ఠి భ్రమ. మన జేబులోంచే వేలు, లక్షలు ఖర్చుపెట్టుకుంటూ బ్రతకాల్సి ఉంటుంది. ఆర్టిస్టు అయినా, టెక్నీషియన్ అయినా - ఇలాంటి ఖర్చు లేకుండా ఎవరికైనా ఒక చోట అవకాశం దొరికిందంటే దాన్ని నిజంగా ఒక అదృష్టంగా భావించాలి. ఈ విషయంలో కేవలం ఒకే ఒక్క కేటగిరీకి మాత్రమే మినహాయింపు ఉంటుంది. అది - హీరోయిన్లు, ఇతర ఫిమేల్ సపోర్టింగ్ ఆర్టిస్టులు. వీళ్లు దొరకడం కొంచెం కష్టం కాబట్టి ఈ వెసులుబాటు! అదే హీరోలయితే ఎదురు పెట్టుబడి పెట్టాల్సికూడా రావొచ్చు. ఈమధ్య హీరోయిన్స్ కూడా పెట్టుబడి పెట్టి హీరోయిన్స్ అవుతున్నారు. అందులో ఎలాంటి తప్పులేదు. ఎవరి డ్రీమ్ కోసం వారు ఏదైనా చెయ్యొచ్చు. అది పూర్తిగా వేరే విషయం.          

పైన చెప్పిన రెండు అంశాల్ని దృష్టిలో పెట్టుకొని, కొత్తగా ఫీల్డులోకి రావాలనుకొనేవాళ్లు తీసుకోవల్సిన జాగ్రత్త ఒకే ఒక్కటి...

ఇక్కడ ఫీల్డులో అవకాశం దొరికి, నిలదొక్కుకొనేవరకూ - ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరొక ఆదాయమార్గాన్ని లేదా జాబ్‌ని ముందుగానే చూసుకోవాలి. అది మీ సినీ కెరీర్ ప్రయత్నాలకు ఎలాంటి అడ్డంకి కానిదై ఉండాలి. లేదంటే - సింపుల్‌గా మీరు బాగా డబ్బున్నవాళ్లయి ఉండాలి. మీ కుటుంబం మీకు పూర్తిగా సహకరించాలి. అప్పుడే ఫీల్డులో మీరు ఏదైనా సాధించడానికి 80% అవకాశం ఉంటుంది.  

కట్ చేస్తే - 

శిలాశాసనం లాంటి ఈ జాగ్రత్త తీసుకోకుండా ఫీల్డులోకి ఎవరు ఎంటరయినా... తర్వాత సినిమా కష్టాలు తప్పవు.

అన్నీ అవుతున్నట్టే ఉంటుంది. కానీ, ఏదీ జరగదు. సాంఘికంగా, ఆర్థికంగా ఎన్నో ఛాలెంజ్‌లు ఎదుర్కోవాల్సి వస్తుంది. చూస్తుండగానే జీవితం మీ చేతుల్లోంచి జారిపోతుంది.

సో, మరొక ఇన్‌కమ్ స్ట్రీమ్ గాని, ఒక సపోర్ట్ సిస్టమ్ గాని లేకుండా ఇక్కడ ఎవ్వరూ ఏం సాధించలేరు.      

ఇలాంటి సిచువేషన్‌కు పూర్తి వ్యతిరేకంగా - కొందరు ఏ బాదరబందీల్లేకుండా ఫీల్డులోకి దిగుతారు. నాలాంటివాళ్ళు అన్నీ కుదిరినప్పుడే చేస్తారు. లేదా, ఒక్కోటి కుదిరించుకొంటూ ముందుకెళ్తారు. ఇంకొందరు యు యస్ లో బాగా సంపాదించుకొని వచ్చి, ఇక్కడో కంపెనీ పెట్టుకొని, ఫీల్డులో పూర్థిస్థాయిలో దిగుతారు. వీళ్ళందరికీ ఎలాంటి భయం ఉండదు. వత్తిడిలో నిర్ణయాలు తీసుకొనే అవసరం వీరికి అసలుండదు. వీళ్ళు చాలా కూల్‌గా ఈ జర్నీని ఎంజాయ్ చేస్తూ, కొంచెం ముందూ వెనకా, అనుకున్నది సాధించుకొంటూ వెళ్తారు.      

అయితే - పరోక్షంగా వీళ్ళంతా కూడా శిలాశాసనం లాంటి ఆ జాగ్రత్త పాటించినట్టే అని నా ఉద్దేశ్యం.  

సో, బి కేర్‌ఫుల్!         

- మనోహర్ చిమ్మని    

Thursday, 17 April 2025

Think BIG! ... లక్ష్యం ఎప్పుడూ పెద్దదిగానే ఉండాలి!!


అమెరికాలో ఒక దివాలా తీసిన వ్యక్తి - సర్వస్వం కోల్పోయి, పీకలదాకా అప్పుల్లో కూరుకుపోయిన స్థితి నుంచి, కేవలం మూడేళ్లలో 600 మిలియన్ల డాలర్లు సంపాదించాడు. అంటే, మన ఇండియన్ కరెన్సీలో సుమారు 5120 కోట్లు అన్నమాట!

"ఇదెలా సాధ్యమయ్యింది?" అని ఆయన్ని ప్రశ్నించినపుడు ఆ రహస్యాన్ని ఆయన కేవలం ఒకే ఒక్క వాక్యంలో చెప్పాడు - "నేను ఎప్పటినుంచయితే భారీ స్థాయిలో ఆలోచించటం మొదలెట్టానో, ఆ క్షణం నుంచే నా జీవితం పూర్తిగా మారిపోయింది!" 

ఆ తర్వాత ఆ వ్యక్తి ఇంకెన్నో వందల కోట్లు సంపాదించాడు. క్రమంగా ఒక మిలియనేర్ ట్రెయినర్‌గా మారిపోయి, ఆ రంగంలోనూ మిలియన్లు సంపాదించాడు. అతనే బ్రయాన్ ట్రేసీ. ఇదంతా కొన్ని దశాబ్దాల క్రిందటి విషయం. ఇలాంటి విజయాలు మన దేశంలో కూడా వందలకొద్దీ రికార్డ్ అయి ఉన్నాయి.     

ఇక్కడ భారీ స్థాయిలో ఆలోచించడం అంటే "థింకింగ్ బిగ్" అన్న మాట. సక్సెస్ సైన్స్ కు సంబంధించి ఈ రెండు పదాలకి చాలా అర్థం ఉంది. ఇంట్లో ముసుగుతన్ని పడుకొని, పగటి కలలు కనడం, ఆకాశానికి నిచ్చెనలు వేయడం "థింక్ బిగ్" ఎప్పుడూ కాదు.

క్యాలిక్యులేటెడ్ రిస్క్‌తో అతిపెద్ద లక్ష్యాల్ని నిర్దేశించుకొని, సంపూర్ణ సామర్థ్యంతో కృషి చేయడమే క్లుప్తంగా దీని నిర్వచనం. 

కట్ చేస్తే -   

సినిమాల్లో అవకాశాల కోసం, గతంలో లాగా ఏళ్ళ తరబడి వెతుక్కుంటూ సమయం వృధాచేసుకునే కాలం కాదిది. 

ఇది డిజిటల్-సోషల్ మీడియా యుగం.

సరిగ్గా ప్లాన్ చేసుకుని, ఒక ఖచ్చితమైన బ్లూప్రింట్‌తో కష్టపడితే ఏదీ అసాధ్యం కాదు. ఎన్నో రంగాల్లో, ఎందరో, ఎన్నెన్నో భారీ విజయాల్ని ఇలా సాధించి చూపిస్తున్నారు. యాక్టింగ్ రాదు అని ట్రోల్స్ చేయబడ్డ ఒక వర్ధమాన హీరో ఒకే ఒక్క శుక్రవారం తన జాతకం తానే మార్చేసుకుని, ఇప్పుడు పది కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. 

ఇది సినిమాల్లో మాత్రమే సాధ్యం. ఈ జర్నీకి కొంత టైమ్ పట్టొచ్చు. కాని, లక్ష్యం ఎప్పుడూ పెద్దదిగానే ఉండాలి. అప్పుడు ముందే భారీ టార్గెట్ కొట్టకపోయినా, ఎంతో కొంతయితే సాధించగలుగుతారు. అయితే - శిలాశాసనం లాంటి ఒక రూల్ పాటించకుండా అది ఎవ్వరికీ సాధ్యం కాదు. అదేంటన్నది రేపు మరో ఆర్టికిల్‌లో. ఇక్కడే.   

- మనోహర్ చిమ్మని