Wednesday, 23 September 2026

ఏరోజూ మనం మర్చిపోకూడని దైవాలు


తల్లిదండ్రులు వారి చివరి క్షణాలవరకు కూడా పిల్లల భవిష్యత్తు, విజయాల గురించే అనుక్షణం ఆలోచిస్తుంటారు. ఎంత వీలైతే అంత సపోర్ట్ చేస్తారు. పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. వారు లేకుండా ఏదీ లేదు. ఇందులో రెండో మాటలేదు. ఉండదు.

కళ్ళకు కనిపించని దేవుళ్లని ఎంతో భక్తితో పూజిస్తాం. కళ్ళముందు కనిపించే దేవుళ్ళయిన తల్లిదండ్రులను మర్చిపోవద్దు. వారిని అశ్రద్ధ చేయవద్దు. తల్లిదండ్రులు పిల్లల కోసం చేసినంతగా, పిల్లలు వారికోసం చేసేది ఏం ఉండదు.

కొంచెం ప్రేమ.
నాలుగు మాటలు.
మేమున్నాం అన్న భరోసా. 

కాని, దురదృష్టవశాత్తూ, ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా జరగటం లేదు. వివిధ కారణాల వల్ల పిల్లలతో తల్లిదండ్రులు కలిసివుండే పరిస్థితులు అరుదైపోయాయి.

వాళ్లెక్కడో, వీళ్ళెక్కడో.  

ఎంత దూరం ఉన్నా సరే, తరచూ ఫోన్ ద్వారా ఒక పలకరింపు వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్నిస్తుంది. వీలైనప్పుడల్లా వారి దగ్గరికి వెళ్ళి వాళ్లతో కొన్నిరోజులు గడపటం కూడా చేస్తే వాళ్ళ ఆనందానికి అవధులుండవు.  

జీవితమంతా తల్లిదండ్రులు పిల్లల కోసం పడిన శ్రమకు ఈమాత్రం బాధ్యత, ప్రేమ ఫీలవ్వని పిల్లల జీవితాల్లో ఎంత అభివృద్ధి ఉన్నా, వారికి తెలియకుండా ఏదో ఒక సమస్య నిత్యం వారి జీవితాల్లో వెంటాడుతుంటుంది. 

నమ్మగలిగితే, బహుశా అదే... కర్మ. 

ఇది అర్థమయ్యేనాటికి తల్లిదండ్రులు ఉండరు. అప్పుడు బాధపడి ప్రయోజనం ఉండదు. ఆ బాధ నిరంతరం వేధిస్తుంటుంది... "అయ్యో నేను వాళ్ళని ఎంత అశ్రద్ధ చేశాను... ఎంతో చేయగలిగి ఉండి కూడా చేయలేకపోయానే" అని ఒక అపరాధభావం మనసుని అల్లకల్లోలం చేస్తుంటుంది. 

మీకు గుర్తున్న రోజుల నుంచి... మీ తల్లిదండ్రులను గుర్తుకు తెచ్చుకోండి. వారికి తిరిగి మీ ప్రేమను పంచండి. వృద్ధాప్యంలో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయండి. 

తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప, తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు వదిలివేయడం లాంటి పాపం అసలు చేయకండి. ఆశ్రమాలు ఖరీదైనవి... వారికి ఏ లోటూ ఉండదు అని మీరనుకుంటే అది పొరపాటే. పిల్లలకు దగ్గరగా ఉండలేని ఏ సౌఖ్యాలూ వారికి సంతోషాన్నివ్వలేవు.        

ఒకవేళ ఇప్పటికే మీ తల్లిడండ్రులు గతించి ఉన్నట్టయితే, వారి జయంతి రోజునో, వర్థంతి రోజునో వారిని స్మరించుకోండి. వారి జ్ఞాపకాలను నెమరేసుకోండి. ఒకవేళ తెలిసో తెలియకో మీవైపు నుంచి వారిపట్ల ఏదైనా అశ్రద్ధ జరిగినా, పొరపాటు జరిగినా... మనస్పూర్తిగా క్షమించమని అడగండి. మీలోని గిల్ట్ పోతుంది. 

తల్లిదండ్రులు ఎక్కడున్నా సరే, ఎప్పుడూ పిల్లల సంతోషాన్నే ఆశిస్తారు. నిరంతరం పిల్లల మంచి కోసమే తపిస్తుంటారు. ఒక మంచి సంకల్పంతో మీరు ఏ పనిచేసినా చేసినా అది సఫలం కావాలని ఆశీర్వదిస్తుంటారు.  వారి చల్లని దీవెనల బలంతో మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చెయ్యగలుగుతారు. చిన్నవీ పెద్దవీ లక్ష్యాలు సాధించడం మీకొక అలవాటయిపోతుంది. మీరు సంతోషంగా ఉంటారు.

ఇదంతా ఏవో నీతిసూత్రాలు, ప్రవచనాల్లాంటి రొటీన్ హితబోధ కాదు. 

మీరు నమ్మితీరాల్సిన న్యూ ఏజ్ సైన్స్. 

నేను ఎంత మెటీరియలిస్టిక్ మేవెరిక్‌గా ఆలోచించేవాణ్ణయినా సరే, ఈ పోస్టు ఇలా రాయటం నా బాధ్యత అనిపించింది. అనుకోవడమే ఆలస్యం... నాన్-స్టాప్‌గా రాశాను. రాస్తుంటే నా కళ్ళల్లోంచి వస్తున్న నీళ్ళను ఆపుకోలేకపోయాను. 

- మనోహర్ చిమ్మని  

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani