Friday, 11 April 2025

మంథన్ - ఒక చరిత్ర!


1976 లోనే, సుమారు 50 ఏళ్ళక్రితం, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా క్రౌడ్-ఫండింగ్ పద్ధతిలో దర్శకుడు శ్యాం బెనెగల్ రూపొందించిన సినిమా - మంథన్. 

దీనికి కథ శ్యాం బెనెగల్, వర్గీస్ కురియన్ రాయగా, స్క్రీన్‌ప్లే ప్రఖ్యాత రచయిత విజయ్ టెండూల్కర్ అందించారు. ప్రఖ్యాత పాటల రచయిత కూడా అయిన కైఫీ అజ్మీ ఈ సినిమాకు సంభాషణలు రాశారు. సంగీతం వనరాజ్ భాటియా సమకూర్చారు. స్మితా పాటిల్, గిరీష్ కర్నాడ్, అనంత్ నాగ్, నసీరుద్దీన్ షా, కుల్భూషణ్ కర్బందా, అమ్రిష్ పురి వంటి హేమాహేమీలు ఈ సినిమాలో నటించారు. 

1977లో బెస్ట్ ఫిలిం, బెస్ట్ స్క్రీన్‌ప్లే జాతీయ అవార్డులు అందుకున్న ఈ సినిమా, ఎన్నో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై అద్భుత చిత్రంగా ప్రశంసలందుకుంది. ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ వాళ్ళు - ఫిలిం నెగెటివ్ మీద చేసిన ఈ సినిమాను భవిష్యత్ తరాలవారికి కూడా అందుబాటులో ఉండేవిధంగా - శివేంద్రసింగ్ దుంగార్పూర్ సారథ్యంలో డిజిటల్ రూపంలోకి ఇటీవలే 2024లో మార్చారు. అదే సంవత్సరం మే నెలలో, 77 వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రదర్శించారు. ఆ ప్రత్యేక ప్రదర్శనకు డైరెక్టర్ శ్యాం బెనెగల్‌తో పాటు - దివంగత స్మితాపాటిల్ కుమారుడు ప్రతీక్ బబ్బర్, నసీరుద్దీన్ షా హాజరయ్యారు. ఆ తర్వాత సుమారు 7 నెలల్లోనే శ్యాం బెనెగల్ మరణించారు. 

చాలా మందికి తెలియని విషయం... శ్యాం బెనెగల్ పుట్టింది, పెరిగింది, చదువుకొంది అంతా కూడా మన హైద్రాబాద్‌లోనే అన్నది! ఉస్మానియా యూనివర్సిటీలోనే ఆయన ఎమ్మే ఎకనామిక్స్ చదివారు. శ్యాం బెనెగల్ జన్మించిన తిరుమలగిరి ఏరియా మా ఆఫీసుకి జస్ట్ ఒక 6 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.    

కట్ చేస్తే -

గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు "మిల్క్ కాపిటల్ ఆఫ్ ఇండియా" అని పేరుంది. ప్రఖ్యాత మిల్క్ ప్రొడక్ట్స్ సంస్థ "అమూల్" (AMUL) ఇక్కడే ఉంది. అమూల్ అంటే ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ (AMUL) అని ఎంతమందికి తెలుసు? 

త్రిభువన్ దాస్ పటేల్ లాంటి సోషల్ వర్కర్, వర్గీస్ కురియన్ లాంటి శ్వేత విప్లవకారుల విశేష కృషి ఫలితంగానే గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో మొట్టమొదటి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం రూపొందింది. ఆ సహకార సంఘం ఏర్పాటుకు ముందు ఎంతో మంది నిస్వార్థ నాయకుల కృషి, వారు భరించిన కష్టనష్టాలు, ఎదుర్కొన్న కుల సంబంధమైన కుట్రలు, ద్వేషాలు మొదలైనవాటన్నిటిని నేపథ్యంగా తీసుకొని అల్లిన అందమైన నిజజీవిత కథే శ్యాం బెనెగల్ "మంథన్". 


తమ నిజజీవిత కథను సినిమాగా తీయడం కోసం గుజరాత్ లోని 5 లక్షల మంది పాల ఉత్పత్తిదారులు చెరొక 2 రూపాయలు విరాళంగా ఇచ్చి - మంథన్ సినిమా బడ్జెట్ 10 లక్షల రూపాయలను సమకూర్చారు. ఈ మహత్కార్యానికి పూనుకొని సక్సెస్ చేసిన మనీషి వర్గీస్ కురియన్. 1976 లో మంథన్ విడుదలైనప్పుడు - ఇదే 5 లక్షల మంది పాల ఉత్పత్తిదారులు... వారి డబ్బులతో రూపొందించిన, వారి జీవిత కథనే, వెండితెర మీద చూసుకొని ఆనందించడానికి... గుజరాత్ నలుమూలల నుంచి బండ్లు కట్టుకొని సినిమా థియేటర్లకు వెళ్ళారు.  

చదువుతుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తోంది కదా?  

ఇదీ మంథన్ సినిమా నేపథ్యం. దురదృష్టవశాత్తు, సినీ ప్రేమికులందరూ తప్పక అధ్యయనం చేయాల్సిన ఇలాంటి చరిత్ర, ఎక్కడో నిశ్శబ్దంగా దాగుండిపోవటం, కనుమరుగైపోవడం అనేది పెద్ద విషాదం. 

ఇదీ - మనదేశంలో 50 ఏళ్ళ క్రితమే క్రౌడ్ ఫండింగ్ పద్ధతిలో నిర్మించిన ఒక అద్భుత సినిమా కథ. మరి 50 ఏళ్ళ క్రితమే ఇంత అద్భుతంగా సక్సెస్ సాధించిన క్రౌడ్-ఫండింగ్ పద్ధతి ఇప్పుడెందుకు ఇండియాలో సక్సెస్ కావడం లేదు?... అదే మిలియన్ డాలర్ కొశ్చన్.          

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani