Friday, 11 April 2025

మనదేశపు తొలి క్రౌడ్ ఫండింగ్ సినిమా - మంథన్


"క్రౌడ్ ఫండింగ్" అనే పదం ఈ మధ్యనే అమెరికాలో పుట్టింది. క్రౌడ్ ఫండింగ్ వెబ్‌సైట్స్ వచ్చాయి. అక్కడ బాగా విజయవంతమయ్యాయి.

కానీ, దాదాపు 50 ఏళ్లక్రితమే శ్యాం బెనెగల్ దర్శకత్వం వహించిన సెన్సేషనల్ సినిమా "మంథన్" మనదేశపు తొలి క్రౌడ్ ఫండింగ్ సినిమా. ఇది 1976 లోనే వచ్చింది. 

"సెన్సేషనల్" అన్న పదం ఇక్కడ నేను కావాలని ఉపయోగించాను. మంథన్ సినిమాకు సంబంధించిన క్రింది వివరాలు కొన్ని చదవండి... మీకే తెలుస్తుంది నేనెందుకు ఆ పదం వాడానో.   

కట్ చేస్తే - 

మంథన్ ఉట్టి సినిమా కాదు. ఒక చరిత్ర. 

మంథన్ సినిమా నిర్మించడానికి కావల్సిన మొత్తం 10 లక్షల బడ్జెట్‌ను అప్పట్లో "వైట్ రెవల్యూషన్" కు కారకుడు, "అమూల్" సంస్థ చైర్మన్ డాక్టర్ కురియన్ వర్గీస్ ఈ క్రౌడ్ ఫండింగ్ పధ్ధతిలోనే సమకూర్చిపెట్టాడు.

మొత్తం 5 లక్షలమంది పాల ఉత్పత్తిదారుల నుంచి, మనిషికి 2 రూపాయల చొప్పున సేకరించి, ఈ సినిమా నిర్మాణానికి కావల్సిన మొత్తం బడ్జెట్ 10 లక్షల రూపాయలను శ్యాం బెనెగల్‌కు ఇచ్చి సినిమా చేయించాడాయన. 

అలా తీసిన భారతదేశపు తొలి క్రౌడ్ ఫండెడ్ సినిమా మంథన్, ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను రివార్డులను సాధించిపెట్టింది. పేరు, అవార్డులతోపాటు మంథన్ సినిమాకు లాభాలు కూడా బాగానే వచ్చాయి అప్పట్లో.  

స్మితాపాటిల్, గిరీష్ కర్నాడ్, నసీరుద్దీన్ షా వంటి గొప్ప నటీనటులు నటించిన ఈ సినిమా డిజిటల్ వెర్షన్ 2024 లో, 77 వ కాన్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. దానికి దర్శకుడు శ్యాం బెనెగల్, నసీరుద్దీన్ షా, రత్నా పాఠక్, స్మితాపాటిల్ కుమారుడు ప్రతీక్ బబ్బర్ హాజరయ్యారు. ఆ తర్వాత 2024 డిసెంబర్లోనే శ్యాం బెనెగల్ మరణించారు. 

మనిషికి 2 రూపాయల చొప్పున, మొత్తం 5 లక్షల మంది పాల ఉత్పత్తిదారుల నుంచి క్రౌడ్ ఫండింగ్ అప్పుడెలా చేయగలిగారు? దానివెనుక చరిత్ర ఏంటి? ... 1976 లోనే చరిత్ర సృష్టించిన ఈ సినిమాకు సంబంధించిన మరి కొన్ని సెన్సేషనల్ అంశాలు రేపటి నా బ్లాగ్‌లో, ఇక్కడే చదవండి.

- మనోహర్ చిమ్మని  

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani