Thursday, 31 December 2015

2015 .. ఇప్పుడొక జ్ఞాపకం!

చాలా గ్యాప్ తర్వాత డైరెక్టర్‌గా మళ్లీ  ఒక సినిమా తీసి రిలీజ్ చేశాను. అదీ - ఇండియా, యు కె ల్లో.

స్విమ్మింగ్‌పూల్!

శ్రీ శ్రీ మూవీ క్రియేషన్స్, శ్రీ శ్రీ ఇంటర్నేషనల్ అధినేత అరుణ్ కుమార్ గారి సంకల్పం, సహకారం నాకు ఈ విషయంలో బాగా తోడ్పడ్డాయి.

స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ తేదీని 40 రోజులముందే ప్రకటించాను. మాకున్న పరిమిత రిసోర్సెస్‌తోనే - ఆ తేదీకే - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో భారీగానే రిలీజ్ చేశాను. ఇది చిన్న సినిమాల విషయంలో అంత ఈజీ కాదు. ఆమాటకొస్తే, కోట్లు పెట్టి తీసిన  సినిమాలు కూడా ఎన్నో అసలు రిలీజ్‌కు నోచుకోక ఇంకా అలా పడిఉన్నాయి. అది వేరే విషయం.

ఈ అనుభవంతో నా తర్వాతి సినిమా రిలీజ్ డేట్‌ను షూటింగ్ ప్రారంభం రోజే ప్రకటించగల ఆత్మవిశ్వాసం నాలో మరింతగా పెరిగింది.

సినిమా హిట్టా, ఫట్టా అన్నది ఓ పెద్ద సబ్జెక్టు. దాన్ని గురించి ఇక్కడ చర్చించడంలేదు. దాని వెనక ఎన్నో కారణాలుంటాయి. ఎప్పుడూ ట్రాక్‌మీద లైవ్‌గా లైమ్‌లైట్‌లో ఉండటం అనేది చాలా ముఖ్యం. అది ఈ సినిమాతో నేను సాధించగలిగాను.

కట్ టూ ది అదర్ సైడ్ ఆఫ్ సినిమా - 

వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, ఆర్థికంగా .. సమస్యలూ, సంఘర్షణ సమాంతరంగా 2015 అంతా వెంటాడాయి. షోబిజినెస్ కాబట్టి అంతా బాగున్నట్టే ఉండాలి. ఉన్నాను. దటీజ్ సినిమా! ఈ విషయంలో కొందరు స్నేహితులు, శ్రేయోభిలాషులకు ఇబ్బంది కలిగించాను. సినీఫీల్డులో ఎప్పుడూ ఉండే అనిశ్చితి వల్లనే తప్ప ఇది కావాలని చేసింది కాదు అని వారికీ తెలుసు. అయినా - బాధ్యత బాధ్యతే.

జీవితంలో ఏ తప్పైనా చేయొచ్చు కానీ, అప్పు మాత్రం చేయకూడదన్న వాస్తవాన్ని 2015 లో మరింత బాగా అర్థం చేసుకోగలిగాను. కానీ, భారీ సక్సెస్‌లు ఇచ్చిన పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లకే ఇది తప్పలేదు. నేనెంత!

కట్ బ్యాక్ టూ సినిమా - 

స్విమ్మింగ్‌పూల్ సినిమా విషయంలో నా సినిమాటోగ్రాఫర్ మిత్రుడు వీరేంద్రలలిత్, హీరో అఖిల్ కార్తీక్, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్లంతా నాకు బాగా సహకరించారు.

ప్రదీప్‌చంద్రను స్విమ్మింగ్‌పూల్ చిత్రం ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేయడం వ్యక్తిగతంగా నాకెంతో సంతృప్తినిచ్చిన విషయం.

మా రష్యన్ ప్రొఫెసర్ మాధవ్ మురుంకర్, కామేశ్వర రావు, కె జె దశరథ్, శీను6ఫీట్, ఐశ్వర్య, బ్రాహ్మిణి లతోపాటు హీరోయిన్ ప్రియ వశిష్టను ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేశాను. రష్యన్ ఇంటర్నేషనల్ మోడల్ కాత్య ఐవజోవాను ఈ చిత్రం ద్వారా ఐటమ్ డాన్సర్‌గా పరిచయం చేశాను.

ఈ సినిమాలో నటించిన మిత్రుడు 'జబర్దస్త్' రచ్చ రవి, ఈ సినిమా రిలీజ్ తర్వాతవరకు కూడా ఇచ్చిన కోపరేషన్ గురించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించడం నా బాధ్యత.

అలాగే, యు ఎస్ లో నా ఆత్మీయ మిత్రుడు సదానందం భరత నా కోసం, ఈ సినిమాకోసం చాలా శ్రమ తీసుకోవడం మరో గొప్ప విశేషం.    

దాదాపు ఒక దశాబ్దం క్రితం నేను కోల్పోయిన క్రియేటివ్ ఫ్రీడమ్‌ను తిరిగి సంపాదించుకొనే క్రమంలో మొన్నటి స్విమ్మింగ్‌పూల్ సినిమా నా ఫస్ట్ స్టెప్ గా భావిస్తున్నాను. 2016 లో ఈ పరంపర ఇక మరింత వేగంగా కంటిన్యూ అవుతుంది.

అయితే - సినిమా ఒక్కటే జీవితం కాదు. సినిమా అవతల కూడా లైఫ్ ఉంది. ఆ లైఫ్ కూడా చాలా ముఖ్యం అన్న వాస్తవం ఎప్పుడూ వాస్తవమే. ఈ వాస్తవాన్ని నేను అశ్రధ్ధ చేయదల్చుకోలేదు. మర్చిపోదల్చుకోలేదు.  

Wednesday, 23 December 2015

ఫేస్ లేని ఫేస్‌బుక్ ఫ్రెండ్స్!

జకెర్‌బర్గ్ పెట్టిన లిమిట్ 5000 టచ్ అయ్యాక గానీ తెలియలేదు .. ఫేస్‌బుక్ లో ఫ్రెండ్స్ ఎంత తక్కువుంటే అంత మంచిదని!

ఏదో .. యాడ్ రిక్వెస్ట్ పెట్టినవాళ్లెందరినీ ఏమాత్రం ఆలోచించకుండా, వారిని డిసప్పాయింట్ చెయ్యలేక, యాడ్ చేసుకున్నాను.

కానీ, చాలా చిత్రమైన ఎక్స్‌పీరియన్స్ అది.

కొన్ని ఫ్రెండ్ రెక్వెస్టులొస్తాయి. సమ్ సుబ్బారావ్ అని పేరుంటుంది. అక్కడ ప్రొఫైల్ ఫోటోలో, కవర్ ఫోటోలో మాత్రం ఏ ప్రభాసో, పవన్ కల్యాణో ఉంటాడు! కొందరి పేర్లు అసలు ఉండటమే చిత్రంగా ఉంటాయి. న్యూటన్, టింగ్ టాంగ్, టఫ్ గై, బులెట్ కిక్ .. ఇలా ఉంటాయి. ప్రొఫైల్ ఫోటోలో ఏ విప్లవకారుడో, ఇంకే అర్థంలేని ఫోటోనో, అసలు ఫేస్ కనిపించని ఫోటోనో ఉంటుంది.

ఇక కొందరు ఆడాళ్లు, అమ్మాయిల విషయం మరీ గమ్మత్తుగా ఉంటుంది. వీరిలో దాదాపు 90% పేర్లు నిజం కావనిపిస్తుంది. హరి హరిణి, సిని హాసిని, సుని సునీత, ఆ పండు, ఈ పండు .. ఇలా ఉంటాయి పేర్లు. ప్రొఫైల్ పిక్చర్లో సమంత, నందిత, రకుల్‌ప్రీత్ ఉంటారు!

తమ ఐడెంటిటీని ఓపెన్‌గా చెప్పుకోలేని ఇలాంటి ఎఫ్ బి ఫ్రెండ్స్ "ఎబౌట్"లో కూడా ఏముండదు. జస్ట్ శూన్యం!

ఎవరో ఏంటో తెలీని ఇలాంటి ఫోర్స్‌డ్ ఎడాలిసెంట్స్ అసలు మన ఫేస్‌బుక్‌లో అవసరమంటారా?

5000 టచ్ అయ్యాకగానీ ట్యూబ్‌లైట్ వెలగలేదు .. :) 

Saturday, 12 December 2015

తెలుగు ఇండస్ట్రీ, 2 స్కూళ్లు!

ఓ గుప్పెడు టాప్‌స్టార్స్, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు .. వారి కుటుంబాలు, వారసులు. ఇదొక స్కూలు. ఈ స్ఖూల్లో ఎవరికి వాళ్లకే ఫిక్స్‌డ్‌గా లాబీలుంటాయి. ఆ లాబీలు దాటుకొని ఓ కొత్త డైరెక్టర్ ఈ స్కూళ్లోకి ప్రవేశించడం చాలా అరుదు. అసాధ్యం. ఈ స్కూల్‌తో సంబంధం లేకుండా బయట ఏదయినా పెద్ద హిట్ ఇచ్చినప్పుడే ఇక్కడ కొత్తవాళ్లకు ఎంట్రీ సాధ్యమౌతుంది.

ఇది పక్కా ట్రెడిషనల్ స్కూల్.

రెండో స్కూల్ పూర్తిగా ఇండిపెండెంట్ స్కూల్. ఆర్‌జివి, శేఖర్ కమ్ముల లాంటి డైరెక్టర్లు ఈ కేటగిరీలోకొస్తారు. ఎవరినో దృష్టిలో పెట్టుకొని కాకుండా, అనుకున్నట్టుగా సినిమా తీస్తూ వీళ్లకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారు.

ఇది పూర్తిగా ఒక అన్‌ట్రెడిషనల్ స్కూల్.

వీళ్లు క్రియేట్ చేసుకున్న బ్రాండ్‌ని బట్టి వీళ్లకు అప్పుడప్పుడూ ట్రెడిషనల్ స్కూల్లోని హీరోలు, నిర్మాతలతో సినిమాలు తీసే అవకాశముంటుంది.

కట్ టూ నా స్కూల్ -

హీరోలకోసం ప్రత్యేకంగా రాసుకొన్న బౌండెడ్ స్క్రిప్టులు చంకలో పెట్టుకొని, ఎలాంటి గ్యారంటీలేని ఈ ట్రెడిషనల్ స్కూళ్ల చుట్టూ ఏళ్లతరబడి తిరగడం నాకు కుదరని పని. ఎందుకంటే సినిమానే నా జీవితం కాదు. దాన్ని మించిన జీవితం బయట ఎంతో ఉంది.

సినిమాలపట్ల అమితమైన ప్యాషన్ ఉన్న కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, నిర్మాతలను నేనే క్రియేట్ చేసుకుంటాను. వారికోసం నా అన్వేషణ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అలా అన్నీ కుదిరినప్పుడే సినిమా తీస్తాను.

తక్కువ బడ్జెట్‌లో, అతి తక్కువ షూటింగ్ డేస్‌లో సినిమా తీసి క్లిక్ కావడమే నాకిష్టం. చెప్పాలంటే - కొంచెం అంట్రెడిషనల్, కొంచెం అగ్రెసివ్ కూడా.

ఇదే నా స్కూల్ ..   

Friday, 11 December 2015

9 మినిట్ బ్లాగింగ్!

ఇకనుంచీ నా బ్లాగ్‌పోస్టుల్లో అనవసరపు "ఇంట్రో"లుండవు. "కట్ టూ"లుండవు. ఉంటే గింటే ఒకే ఒక "కట్ టూ" ఉంటుంది. దాంతర్వాత ఒకే ఒక్క వాక్యంలో బ్లాగ్ పోస్ట్ ముగుస్తుంది. అంటే - ఓ రకంగా - అది "కట్ టూ ఫినిషింగ్" అన్నమాట!

అరుదుగా ఎప్పుడో ఒకసారి భారీ సైజులో నేనేదైనా బ్లాగ్ పోస్ట్ రాయొచ్చుగానీ, ఇకనుంచీ నా బ్లాగ్ పోస్టులన్నీ సుమారు 10-12 లైన్లలోనే  "టిడ్‌బిట్స్" సైజులో ఉంటాయి.

మినీ బ్లాగ్ పోస్టులన్నమాట!

నేను సినిమాల్లో ఉన్నంతకాలం, "నగ్నచిత్రం"లో పోస్టులన్నీ దాదాపు సినిమాలకు, క్రియేటివిటీకి సంబంధించినవే అయ్యుంటాయి.

ఈ 9 మినిట్ బ్లాగింగ్ గురించి అప్పట్లో అనుకున్నానుగానీ, కొనసాగించలేకపోయాను. కానీ, ఇప్పుడు నేనే దీన్ని తప్పనిసరి చేసుకుంటున్నాను.

ఏదో ఒకటి రాసే నాకత్యంత ప్రియమైన హాబీని నేనే కిల్ చేసుకోదల్చుకోలేదు.

రాయడం అనేది ఒక ఎడిక్షన్ నాకు. ఒక రిలాక్స్. ఒక రిలీఫ్. ఒక మెడిటేషన్. ఒక ఆనందం.

సో, బ్యాక్ టూ మై 9 మినిట్ బ్లాగింగ్ ..