Wednesday, 13 January 2021

నా బ్లాగింగ్ ఇకనుంచీ మ్యాగజైన్ రూపంలోనే!

ఇంతకుముందే ఒకటిరెండుసార్లు వేర్వేరు పోస్టుల్లో చెప్పాను... నా బ్లాగింగ్ ప్యాషన్‌కి ఎక్స్‌టెన్షన్ లాంటిది 'మనోహరమ్' వెబ్ మ్యాగజైన్ అని.   

గత కొన్ని వారాలుగా బేటా రూపంలో వస్తున్న మనోహరమ్ డిజిటల్ మ్యాగజైన్, ఈ ఫిబ్రవరి 1 నుంచి పూర్తిస్థాయిలో రాబోతోంది. 

జనవరి 28 నాడు మనోహరమ్ మ్యాగజైన్ అఫీషియల్ ప్రాంభం ఉంటుంది. 

మ్యాగజైన్ ఫైనల్ వెర్షన్ రూపం జనవరి 28 నాడు లాంచ్ చేస్తున్న మనోహరమ్ ఫిబ్రవరి సంచిక నుంచి మీరు ఎంజాయ్ చేస్తారు. రెగ్యులర్‌గా ప్రతి నెలా 1వ తేదీ నాడు 00.10 గంటలకు పబ్లిష్ అవుతుంది. 

కట్ చేస్తే - 

ఇక నుంచీ ప్రత్యేకంగా నేను నగ్నచిత్రం బ్లాగ్‌లో బ్లాగింగ్ చేయటం ఉండదు. బహుశా ఇదే ఈ బ్లాగ్‌లో చివరి పోస్టు. 

సక్సెస్ సైన్స్, సినిమాలు, సరదాలు - ఈ మూడే (మైండ్‌సెట్, మూవీస్, మస్తి) ప్రధాన విభాగాలుగా - మనోహరమ్ మ్యాగజైన్‌లో నా బ్లాగింగ్ పూర్తిస్థాయిలో కొనసాగుతుంది. 

ప్రధాన అగ్రిగేటర్ అయిన మాలిక, మొదలైన వాటిల్లో మనోహరమ్ అప్‌డేట్స్ ఉంటాయి. 

సమస్యల్లా ఒక్కటే. మంత్లీ అప్‌డేట్స్ కాబట్టి అగ్రిగేటర్లలో రెగ్యులర్‌గా మనోహరమ్‌లోని ఆర్టికిల్స్ ఎట్సెట్రా కనిపించే ఆస్కారం ఉండదు. ఈ లోటుని ఎట్లా భర్తీ చేయొచ్చో ఆలోచించాలి.  

మిత్రులు, శ్రేయోభిలాషులు... మీ అభిప్రాయాలు, సలహాలను నాకు మనోహరమ్ ద్వారా కూడా అందించగలరని సవినయ మనవి. 

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో,
- మీ... మనోహర్ చిమ్మని
Editor, 'Manoharam', Elite Web Magazine

Sunday, 10 January 2021

ప్రణయ్ పుట్టినరోజు

ఉదయం 10.45...

సరిగ్గా 24 ఏళ్ళక్రితం... ఇదే సమయానికి నేను కర్నూలు నుంచి హైద్రాబాద్ వెళ్తున్న బస్‌లో ఉన్నాను. 

పొద్దున 6 గంటలకే నా భార్య సుజాతను హైద్రాబాద్‌లోని ధరమ్ కరణ్ రోడ్‌లో ఉన్న వాళ్ల అమ్మవాళ్లింటినుంచి బేగంపేటలో ఉన్న డాక్టర్ సవితాదేవి గారి స్వప్న నర్సింగ్ హోమ్‌కు తీసుకెళ్ళారు. 

ఎర్రమంజిల్ నుంచి సుజాత వాళ్ళ అక్కవాళ్ళు వెంటనే హాస్పిటల్‌కు వెళ్ళారు. 

వాళ్ళంతా చాలా బాగా చూసుకుంటారు అన్న విషయం నాకు తెలుసు. అయినా సరే, చాలా టెన్షన్...  

నేనప్పుడు కర్నూలు ఆలిండియా రేడియో ఎఫ్ ఎమ్ లో పనిచేస్తున్నాను. ఆఫీసుకెళ్ళి, లీవ్ పెట్టి హైద్రాబాద్ బయల్దేరాను. 1997 అది. ఇప్పట్లా మొబైల్ ఫోన్స్ అప్పుడు లేవు. గౌలిగూడ బస్ స్టాండ్‌లో దిగాకనే పబ్లిక్ ఫోన్ నుంచి ఫోన్ చెయ్యాలి. 

కట్ చేస్తే - 

నేను మధ్యాహ్నానికి ఎర్రమంజిల్ చేరుకున్నాను. అక్కడినుంచి బేగంపేట స్వప్న నర్సింగ్ హోమ్ కి వెళ్ళాను. 

అప్పుడే డాక్టర్స్ సుజాతను లోపలికి సిజేరియన్ కోసం తీసుకెళ్తున్నారు. డాక్టర్ సవితాదేవి నాకు 2 నిమిషాలు అంతా వివరంగా చెప్పారు. పేపర్స్ పైన నా సంతకాలు తీసుకున్నారు. స్ట్రెచర్ మీద సుజాత ఏడుస్తూనే ఉంది. ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకెళ్ళారు స్టాఫ్. 

కట్ చేస్తే - 

3 గంటల 15 నిమిషాలకు డాక్టర్స్ బయటకొచ్చి చెప్పారు:

"అబ్బాయి పుట్టాడు. ఇద్దరూ బాగున్నారు" అని. 

ఓ గంట తర్వాత రూమ్‌కి - ఒక తెల్లటి కోన్‌లో పింక్ కలర్ ఐస్‌క్రీమ్‌ను చుట్టి తీసుకొచ్చినట్టు - మా ప్రణయ్‌ని తీసుకొచ్చారు నర్స్‌లు. 

అప్పుడే పుట్టిన చిన్న పిల్లలను అంత దగ్గరగా చూడటం నాకు అదే మొదటిసారి. అదొక అద్భుతమైన ఫీలింగ్...

చూస్తుంటే 24 ఏళ్ళు గడిచాయి.

నిజంగా ఒక్క కంప్లయింట్ లేదు...

సెయింట్ పీటర్స్ నుంచి-ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి-బెంగుళూరు జైన్ యూనివర్సిటీ వరకూ... ప్రతి దశలోనూ... చదువులో ఎప్పుడూ టాప్.

త్వరలో ఉద్యోగంలో చేరబోతున్నాడు.  

నేనే మంచి తండ్రిని కాలేకపోయాను... 

హాప్పీ బర్త్‌డే ప్రణయ్!

Saturday, 9 January 2021

మనోహరమ్ ఎలైట్ వెబ్ మ్యాగజైన్

సాంకేతికంగా, కంటెంట్ పరంగా కూడా మనోహరమ్ మ్యాగజైన్ బేటా వెర్షన్‌లో అన్ని ప్రయోగాలూ పూర్తయ్యాయి.

మొన్న జనవరి 1 నుంచే మ్యాగజైన్ పూర్తి వెర్షన్‌ను ప్రారంభిద్దామని అనుకున్నాను. కొన్ని ప్రొఫెషనల్ కారణాలవల్ల, ఇంకా, నా శ్రేయోభిలాషులైన కొందరు పెద్దవాళ్ల సలహా అనుసరించి కూడా ఆ పని చేయలేదు. 

మనోహరమ్ మ్యాగజైన్ పూర్తి వెర్షన్ అఫీషియల్‌ లాంచ్‌ ఈ నెల 28 వ తేదీనాడు ఉంటుంది.

ఎవరు లాంచ్ చేస్తారన్నది 2, 3 రోజుల ముందు తెలియజేస్తాను. 

ఫిబ్రవరి సంచిక నుంచి "మనోహరమ్" తెలుగులో ఒక పూర్తిస్థాయి ఎలైట్ వెబ్ మ్యాగజైన్ రూపం సంతరించుకొంటోంది. రెగ్యులర్‌గా ప్రతి నెలా 1వ తేదీ నాడు 00.10 గంటలకు పబ్లిష్ అవుతుంది. 

కట్ చేస్తే - 

ప్యాషన్, పాజిటివ్ దృక్పథమే ప్రధానంగా - నా బ్లాగింగ్‌ హాబీకి పూర్తిస్థాయి ఎక్స్‌టెన్షన్ ఈ మ్యాగజైన్.

ఇంతకుముందు కూడా ఒక పోస్టులో చెప్పినట్టు... సక్సెస్ సైన్స్-సినిమాలు-సరదాలు (Mindset-Movies-Masti)... ఈ మూడే ప్రధాన విభాగాలుగా నేను ప్లాన్ చేసిన ఈ మ్యాగజైన్ పూర్తిగా ఒక బిందాస్ పాజిటివ్ మ్యాగజైన్.

పాలిటిక్స్, హేట్రెడ్‌కు ఇందులో స్థానం లేదు. 

ఏ రంగంలోంచి ఏ వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినా-లేదా- అతడు/ఆమె గురించి ఒక స్టోరీ రాసినా, అది సక్సెస్ సైన్స్ పాయింటాఫ్ వ్యూలోనే ఉంటుంది. 

కథలు, కవితలు కూడా ఇలాగే ఉండాలన్న రూల్ లేదు. క్రియేటివిటీ అనేది ఎలాంటి తూనికలకు లొంగాల్సిన అవసరంలేదు. ఇంకొక వ్యక్తినో, వర్గాన్నో బాధపెట్టకుండా ఉంటే చాలు.

జీవితం పట్ల, జీవనశైలిపట్ల పాజిటివ్ దృక్పథమే ప్రధానం. 

ఇలా ఉండాలి, అలా ఉండాలి అన్న ప్లానింగ్స్, రీప్లానింగ్స్ అన్నీ దాటుకొని - మ్యాగజైన్‌ను ఒక ఫైనల్ వెర్షన్‌కు తీసుకురాగలిగాను.

ఫైనల్ వెర్షన్ రూపం జనవరి 28 నాడు లాంచ్ చేస్తున్న మనోహరమ్ ఫిబ్రవరి సంచిక నుంచి మీరు ఎంజాయ్ చేస్తారు. 

ఎందరో మిత్రులు, శ్రేయోభిలాషులు... మీ ప్రోత్సాహమే నాకు కొండంత బలం. అందరికీ నా వందనాలు.  

Friday, 8 January 2021

2021 లో మొదటి 8 రోజులు

"ఒకసారి పబ్లిక్‌లోకి వచ్చాక పర్సనల్ అంటూ ఏమీ ఉండదు!"

ఇలా అని గతంలో పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ గురించి అంటుండేవాళ్ళు.

కాని, సోషల్ మీడియా వచ్చాక, ఇప్పుడు ప్రతి ఒక్కరి పర్సనల్ లైఫ్ కూడా పబ్లిక్ అయిపోయింది! 

మరీ ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ యాండ్రాయిడ్ వాడే ప్రతి సగటు మనిషి జీవితాన్ని ఒక రచ్చబండ చేసేశాయి. 

బయటివాడెవడో అస్సలు తనకు సంబంధం లేనివాని పర్సనల్ విషయాల్ని గెలకటం ఒక టైపు రచ్చ. కాగా, ఎవరికివారే వాళ్ల కుటుంబ విషయాల్ని, ఇతర పర్సనల్ విషయాల్ని ఓపెన్‌గా వాల్స్ పైన పెట్టుకోవడం ఇంకో టైపు రచ్చ. పైగా, వీటికి లైక్ కొట్టి కామెంట్ చెయ్యలేదని అలకలూ, నిష్టురాలూ... కొండొకచో ఆ విషయం మీద కూడా పోస్టులు, ట్వీట్లు! 

కట్ చేస్తే - 

9 నెలల పాండెమిక్-లాక్‌డౌన్ ప్రభావమైనా మనలో కనీసం ఒక్క శాతం మార్పునైనా తీసుకురాలేదంటే - మనలో ఏదో లోపం ఉన్నట్టే! ముందు దానిగురించి ఆలోచించాలి. 


జర్నలింగ్-లేదా-డైరీ రాసుకోవడంలో తప్పులేదు. ఒక మంచి అలవాటు కూడా! దానివల్ల అసలు మన జీవితంలో ఏం జరుగుతుందో ప్రతి 24 గంటలకు ఒకసారి మనకి మనం చూసుకుంటాం. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ బాధ్యతాయుతంగా ముందుకెళ్తుంటాం.

చాలావరకు బ్లాగింగ్ కూడా ఇలాంటిదే. ఎన్నో దురలవాట్లకంటే ఈ ఎడిక్షన్ చాలా బెటర్. బ్లాగింగ్‌లో రిఫ్లెక్ట్ అయ్యే మన ఆలోచనా విధానం, మన మైండ్‌సెట్ ఎటుపోతున్నాయో మనకు తెలుస్తుంటుంది. మనం ఎటుపోతున్నామో కూడా మనకు తెలుస్తుంది.

బ్లాగింగ్ మంచి స్ట్రెస్‌బస్టర్ కూడా. 

వ్యక్తిగతంగా అయినా, వృత్తిపరంగా అయినా - సోషల్‌మీడియాను నిజంగా బాగా ఉపయోగించుకోగలిగితే చాలా విషయాల్లో అదొక గోల్డ్ మైన్ అంటే అతిశయోక్తికాదు. 

సోషల్‌మీడియాకు సంబంధించినంతవరకూ... 2021లో నేను పూర్తిగా ఆ దిశలోనే వెళ్తున్నాను. మిగిలిన అన్ని విషయాల్లో 10 రెట్లు వేగం పెంచాను. 

సమయం చాలా విలువైంది. అది ఎవ్వరికోసం ఆగదు. 

జీవితం ఒక్కటే. దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. 

Friday, 1 January 2021

Happy New Year !!

న్యూ ఇయర్ అయినా, ఉగాది అయినా... కొత్త సంవత్సరం అని నాకు ప్రత్యేకంగా సెంటిమెంట్లు ఎప్పుడూ లేవు. కాని, పెద్దలు ఇలాంటివి ఊరికే పెట్టలేదు అనేది మాత్రం చాలా గట్టిగా నమ్ముతాను. 

ఇలాంటిదేదో ఒక ప్రత్యేకమైన సందర్భం వస్తే తప్ప మనం కొన్ని  నిమిషాలయినా ఆగి, అసలు ఏం జరుగుతోంది, ఏం చేస్తున్నాను, ఎన్ని బాధ్యతలున్నాయి, టైమ్ చూసుకుంటున్నామా అసలు... అనే యాంగిల్‌లో ఫోకస్‌డ్‌గా  ఆలోచించము. ఈ కోణంలో నాకు ఉగాది చాలా ముఖ్యమైంది. అలాగే న్యూ ఇయర్ కూడా. 

కట్ చేస్తే - 

రాత్రి నుంచి ఇప్పటివరకు నాకు వచ్చిన ప్రతి గ్రీటింగ్,  ప్రతి మెసేజ్‌కూ రిప్లై ఇచ్చాను. నేనుగా ఒకరిద్దరు పెద్దవాళ్లకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పంపించాను. 

2021 లో కనీసం ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నాను. 2 పుస్తకాలు పబ్లిష్ చేస్తున్నాను.  

ఇవి ప్రత్యేకంగా గోల్స్ లాంటివి కాదు. ప్రొఫెషనల్‌గా నా పనిలో భాగం. చేస్తున్నాను. అంతే.       

Monday, 28 December 2020

బుక్ పబ్లిషింగ్ 'స్పాన్సర్స్' ‌కి ఆహ్వానం!

నేను ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నప్పుడు, ఒక ఘోస్ట్ రైటర్‌గా అప్పట్లో కొంతమంది ప్రముఖ దర్శకులకు పనిచేసిన అనుభవంతో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్క్రిప్ట్ రైటింగ్ పైన నేనొక పుస్తకం రాశాను. 

పుస్తకం పేరు "సినిమాస్క్రిప్ట్ రచనాశిల్పం". 

అప్పట్లో అదొక బెస్ట్ సెల్లర్ పుస్తకం. రెండు ప్రింట్లు వేశాను. హాట్‌కేక్స్‌లా 5 వేల కాపీలు సేలయ్యాయి.

తర్వాత నేను డైరెక్టర్ అయ్యాను. ఆ రెండు సినిమాల అనుభవాన్ని కూడా చేర్చి, పుస్తకం కొంత రివైజ్ చేసి ప్రింట్ చేద్దామనుకొన్నాను. నా రెగ్యులర్ ఉద్యోగం, ఇతరత్రా కారణాలవల్ల ఆ పని అలా అలా పెండింగ్‌లో పడిపోయింది.

విశాలాంధ్ర, నవోదయ వాళ్లు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ నేను ఈ పుస్తకం రీప్రింట్ చెయ్యలేకపోయాను.

ఈ పుస్తకాన్ని తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రముఖ ఫిలిం ఇన్‌స్టిట్యూట్స్ వాళ్ళు వాళ్ల స్టుడెంట్స్‌కు సిలబస్‌లో భాగంగా ఇచ్చేవారు. కాపీలు మార్కెట్లో దొరక్క, ఫిలిం నగర్‌లోని ఒక జిరాక్స్ సెంటర్లో ఈ పుస్తకం జిరాక్స్ కాపీలు స్పైరల్ బైండ్ చేసి అమ్ముతున్నట్టు విని నేనొకసారి అక్కడికి వెళ్ళాను. అనామకుడుగా నేనూ ఒక కాపీ కొనుక్కున్నాను. అదొక విచిత్రమైన ఫీలింగ్!

కట్ చేస్తే –

కరోనా లాక్‌డౌన్ నాలో, నా ఆలోచనాపరిధిలో ఒక పెద్ద మార్పుకు కారణమైంది. ఎన్నెన్నో విషయాల్లో ఎంతో అంతర్మథనానికి తెరలేపింది. ఎంత రియలిస్టిక్ కండిషన్స్‌లో అయినా సరే, కొన్ని రిస్కీ నిర్ణయాలు తీసుకొనే ముందు ఎందుకు ఒకటికి పదిసార్లు ఆలోచించాలో కళ్ళముందు సినిమావేసి చూపించినట్టు తెలిసేలా చేసింది. మొత్తంగా ఈ లాక్‌డౌన్ నాలో ఒక మహాజ్ఞానోదయానికి కారణమైంది.

ఈ నేపథ్యంలో – ఇంతకుముందు నేను చాలా తేలికగా, అసలు పట్టించుకోకుండా ఏ రెండు ముఖ్యమైన అంశాలనైతే బాగా లైట్ తీసుకొన్నానో, అవే నాకు చాలా ముఖ్యమైనవి అని తెలుసుకున్నాను.

ఆ రెంటిలో ఒకటి నా రైటింగ్.

నేను రాసిన “సినిమాస్క్రిప్ట్ రచనాశిల్పం” పుస్తకం Best Book on Films కేటగిరీలో నాకు నంది అవార్డు సాధించిపెట్టింది. నేను రాసిన “ఆధునిక జర్నలిజం” పుస్తకం, కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మే స్థాయిలో రిఫరెన్స్ బుక్స్ లిస్ట్‌లో ఉంది. ఈ విషయం, అదే యూనివర్సిటీలో నేను PhD ఇంటవ్యూకెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూలో నాకు చెప్పారు!

నేను రాసి, పబ్లిష్ చేసి, బాగా గుర్తింపు తెచ్చుకొన్న ఈ 2 పుస్తకాలు ఇప్పుడు మార్కెట్లో లేవు. ఎంతోమంది నుంచి నాకు డైరెక్టుగా మెసేజెస్, కాల్స్ వస్తున్నాయి. కర్టెసీ – సోషల్ మీడియా!

నవోదయ అధినేతలు, విశాలాంధ్ర వాళ్ళు ఇంక నాకు చెప్పడం మానేశారు.

ఇప్పుడు నేను ఈ 2 పుస్తకాలు రీప్రింట్ చేస్తున్నాను. ఈవైపు ఆసక్తి ఉండి, నన్ను ప్రోత్సహిస్తూ “Sponsors” గా సహకరించాలనుకొనే మిత్రులు, శ్రేయోభిలాషులు, పుస్తకాభిమానులు ఎవరైనా నాకు ఈమెయిల్-లేదా-వాట్సాప్ చేయగలిగితే సంతోషిస్తాను.

థాంక్స్ ఇన్ అడ్వాన్స్.

నా ఈమెయిల్: richmonkmail@gmail.com
వాట్సాప్ నంబర్ (text only): +91 9989578125    

Saturday, 19 December 2020

2021 కి కౌంట్ డౌన్ షురూ...

కొత్త సంవత్సరం అనేది ఒక మైలు రాయి. ప్రతి మనిషి జీవితంలో ఒక కొత్త అధ్యాయం. అది ఇంగ్లిష్ న్యూ ఇయర్ కావచ్చు. తెలుగు ఉగాది కావచ్చు. 

ఇలాంటి సందర్భాలే కావాలా అనే ఒక లాజిక్ వస్తుంది. కాని తప్పక కావాలి, ఆ అవసరం ఉంది అని బాగా ఆలోచించే మనవాళ్ళు ఇవి క్రియేట్ చేశారని నాకనిపిస్తోంది. 

కనీసం ఇలా అయినా కొన్ని నిమిషాలో, కొన్ని గంటలో మొత్తం అసలేం జరుగుతోంది అన్నది రివ్యూ చేసుకొంటారు. వ్యక్తిగతంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, మనిషి జీవనయానంలోని ఇంకో అరడజను ప్రధాన అంశాల్లో కావచ్చు. ఈ స్వీయ విశ్లేషణ చాలా అవసరం. 

కట్ చేస్తే - 

మానవజాతి చరిత్రలో మొట్టమొదటిసారిగా - ప్రపంచం మొత్త ఒక ఆరు నెలలపాటు మూసుకొనేలా చేసిన కోవిడ్19 ఎటాక్ నేపథ్యంలో, 2020 మనకు నేర్పిన ఎన్నో పాఠాల్ని కొన్ని నిమిషాలైనా గుర్తుకుతెచ్చుకోవాల్సిన అవసరం ఇప్పుడుంది. 

2020లో మనం ఊహించని ఎన్నో అనుభవాల నేపథ్యంలో ఇకనుంచీ మన జీవనశైలిలో, మన ఆలోచనల్లో, మనం చేసే పనుల్లో ఎంత మార్పు అవసరమో కూడా ఒక ఖచ్చితమైన రివ్యూ అవసరం అని నాకనిపిస్తోంది.

ఇంకో 12 రోజుల్లో 2021 రాబోతోంది. మనం మర్చిపోయిన పెన్నూ, పేపర్ తీసుకొని ఒక అరగంటయినా దీనికోసం కెటాయిస్తే ఎలావుంటుంది?         

Thursday, 17 December 2020

కౌంట్‌డౌన్ టు కరోనా, 2020!

ఇందాకే చదివిన ఒక పాయింటు నన్ను అమితంగా కలచివేస్తోంది...

సగటున ఒక మనిషి జీవించేది 24,869 రోజులట! అంటే సుమారు 68 ఏళ్లన్నమాట! తక్కువేం కాదు...

ఈ లెక్కన నేను బ్రతకడానికి ఇంకా కొన్ని వేల రోజులున్నాయి. కాని, ఏంటి గ్యారంటీ?

ఏ ట్రాఫిక్ లేని సమయంలో రోడ్డు దాటుతోంటే, ఏ "పల్సర్"వాడో ఎక్కడ్నుంచో వచ్చి గుద్దేసి చంపేయొచ్చు. ఏ క్యాన్సరో ఎటాకయి ఠపీమని పోవచ్చు. మనం ఎక్కిన ఏ బెంగుళూరు బస్సో తగలబడిపోవచ్చు. 

గ్యారెంటీ ఏదీ కాదు. దేనికీ లేదు.

ఆ అంకెలు, ఆ లెక్క... కళ్లముందే కనిపిస్తున్నాయి నాకు.    

మనం ఏదో అనుకుంటాం. ఏదో భ్రమలో బ్రతుకుతూ ఉంటాం. "ఇంకా టైమ్ చాలా ఉంది" అనుకుంటాం. కాని, చూస్తోంటే సంవత్సరాలు, దశాబ్దాలు ఇట్టే గడిచిపోతుంటాయి. నేను అసలు ఊహించని ఎందరో నా కళ్ళముందే పోయారు. 

కరోనా గురించి ఎవరైనా కలగన్నారా? దాదాపు ఒక సంవత్సరం నుంచి ప్రపంచాన్నే వణికిస్తోంది. లక్షలమంది చచ్చారు. లక్షలమంది చావు అంచులవరకు వెళ్ళొచ్చారు. ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అయ్యాయి. 

ఇప్పుడా కరోనా కూడా క్లయిమాక్సుకు చేరింది.

ఎందరో తిట్టుకొన్న 2020 - తన తప్పేం లేకపోయినా...  గిల్టీగా, నిశ్శబ్దంగా నిష్క్రమిస్తోంది. 

నేను పూర్తిచేయాల్సిన పనులు, బాధ్యతలు చేయాల్సినవి చాలా ఉన్నాయి. సమయం మాత్రం చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో నేను మాత్రం 2020 కి చాలా థాంక్స్ చెప్తున్నాను. లాక్‌డౌన్లో ఒక కొత్త జీవనశైలిని నాకు అలవాటు చేసింది. నాలో ఎన్నెన్నో కొత్త ఆలోచనలకు తెరలేపింది. మొత్తంగా ఒక మహా జ్ఞానోదయానికి కారణమైంది. 

థాంక్యూ 2020, నేను ఆల్రెడీ 10X స్పీడ్‌లో వున్నాను. 2021 లో. 

Wednesday, 16 December 2020

నువ్వు లేకుండా అప్పుడే రెండేళ్ళు!

బ్రతికుండటానికి కూడా చాలా శక్తి, చాలా విల్‌పవర్ కావాలని నువ్వు వెళ్ళిపోతూ మా అందరికి తెలియజెప్పాకే తెలిసింది. 

నేను కొంచెం చొరవతీసుకున్నా, నువ్వు "అన్నా, మా సమస్యను పరిష్కరించు" అని నాతో ఒక్క ముక్క గట్టిగా చెప్పినా ఇవ్వాళ నేనిది రాసుకొంటూ ఇలా బాధపడేవాణ్ణి కాదు. మానవసంబంధాల విలువ ఏంటో కూడా నువ్వు వెళ్ళిపోతూ చెప్పావు. 

సమాజంలో ప్రతి వ్యవస్థ కూడా కాలగమనంలో ఎంతో మారిపోతూవస్తోంది. నువ్వూ మారాల్సింది. సమస్యను ఏవైపునుంచయినా పరిష్కరించుకోవాల్సింది. సమస్యే మూలం కాని, సమస్యకు నువ్వు మూలం కాదు అన్న చిన్న ఆలోచన చెయ్యలేకపోయావు. నేను బాగుంటే నువ్వు బ్రతికుండేవాడివి. అన్నగా ఏం చేయలేకపోయాననే బాధ నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నన్ను ఏడిపిస్తుంది. నీ పదేళ్ళ కొడుకు కార్తీక్‌తో ఫోన్లో మాట్లాడినప్పుడల్లా కళ్ళుచెమ్మగిల్లుతాయి. వాడిని కలిసి హత్తుకున్నప్పుడు వదిలిపెట్టలేనంత దుఃఖం. 

నువ్వొక్కడివే స్నేహితుడిగా, తమ్ముడిగా, నీతోనే పెరిగిన శ్రీధర్‌కు ఇప్పుడు వరంగల్‌లో ఎవ్వరున్నారు మనసు విప్పి మాట్లాడుకోడానికి? వాడెంత నీకోసం తపనపడ్డాడు? వాడితోనైనా గట్టిగా చెప్పాల్సింది కదా - అన్నతో చెప్పి, నువ్వూ అన్నా కలిసి నా సమస్యను వెంటనే ఇప్పుడే పరిష్కరించండి అని.  

నీ చివరిరోజుల్లో నువ్వు నన్ను కలిసిన ప్రతిసారీ, నీ జీవితం ఎలాపోతోందో తెలుసుకోవడం ద్వారానైనా నేను చాలా తెలుసుకోవాల్సింది. ఇలాంటి ముగింపు నేనూహించలేదు. నేనెలా ఉన్నా సరే, అన్నగా నేను పూనుకోవాలన్న ఆలోచన ఆ మూడేళ్ళలో ఒక్కసారి నాకు వచ్చినా ఇవ్వాళ నాకింత బాధ వుండేదికాదు. 

ఇప్పుడు శ్రీధర్, నేనూ ఎప్పుడు కలిసినా, ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకొన్నా నీ గురించే. చెట్టుకు, పుట్టకు ఒక్కొక్కరై మర్చిపోయిన మానవసంబంధాలగురించే. నీ జీవితాన్ని ఒక పాఠంగా మార్చి నువ్వు నిష్క్రమిస్తే తప్ప మాకు తెలియలేదు మానవసంబంధాల విలువేంటో.  

ఎందుకు వాసూ, ఇలా చేశావు? "అన్నా" అని ఎప్పుడూ నవ్వుతూ నాతో మాట్లాడిన నీ జ్ఞాపకాలూ, ఆవెంటనే వచ్చే కన్నీళ్ళే కదా ఇప్పుడు నాకు మిగిలింది?

మానవసంబంధాలు చాలా ముఖ్యం. మనసువిప్పి మాట్లాడుకోడానికి ఒక మనిషి ఉండటం చాలా ముఖ్యం. ఈ రెండూ ఉన్నప్పుడే మిగిలినవి ఏవైనా సరే బాగుంటాయి. 

నా చిన్న తమ్ముడు వాసు లేడు అన్న నిజాన్ని నేనింకా నమ్మడానికి ఒప్పుకోలేకపోతున్నా. కాని, నిజాన్ని ఎలా కాదనగలను? నీ ఫోన్ కాల్ ఏది? మొన్న వరంగల్ వచ్చినపుడు నువ్వు లేవే? 

మిస్ యూ వాసూ... 

Tuesday, 15 December 2020

బాపుగారి బొమ్మ

బాపుగారి బొమ్మ అంటే మామూలుగా అయితే రెండర్థాలు స్పురిస్తాయి: బాపు గీసిన బొమ్మ, బాపు సినిమా.

ఈ రెండూ కాకుండా, సుమారు 15 ఏళ్ళక్రితం చెన్నైలోని వారి ఇంట్లో బాపుగారిని కలిసినప్పటి సంగతులు ఇప్పుడు నేను రాస్తున్నాను.

అప్పట్లో నేను రాయదల్చుకున్న ఒక పుస్తకం కోసం కొంతమంది నేను ఎన్నికచేసుకొన్న దర్శకులను కలవటం జరిగింది. ఆ ప్రాసెస్‌లో భాగంగా ఒక మధ్యాహ్నం వారి టైమ్ తీసుకొని బాపుగారి ఇంటికి వెళ్లాను. నాతోపాటు నా మిత్రుడు, కోడైరెక్టర్ వేణుగోపాల్ కూడా వచ్చాడు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి, సాయంత్రం 7 మధ్యలో – సుమారు 3 గంటలపాటు బాపుగారితో మాట్లాడుతూ, వారి ఇంటర్వ్యూను ఆడియో రికార్డు చేశాను.

అసలు బాపుగారితో పక్కపక్కనే ఒకే సోఫా మీద కూర్చొని, వారితో అన్ని గంటలపాటు ముచ్చటించటం, వారి ఇంటర్వ్యూని రికార్డ్ చేయటం అనేది నిజంగా అదొక గొప్ప అనుభవం.

బాపుగారు కేవలం ఒక చలనచిత్ర దర్శకుడే కాదు… ఒక అంతర్జాతీయ స్థాయి పెయింటర్, ఇల్లస్ట్రేటర్, కార్టూనిస్ట్, స్టోరీబోర్డ్ ఆర్టిస్ట్, మ్యూజిక్ ఆర్టిస్ట్, డిజైనర్ కూడా.

1964 లోనే యునెస్కో స్పాన్సర్ చేసిన ఒక అంతర్జాతీయ సెమినార్లో చిల్డ్రెన్స్ బుక్స్ మీద ప్రెజెంటేషన్ ఇవ్వగలిగిన మేధావి. వాల్టర్ థామ్సన్, ఎఫిషియెంట్ పబ్లిసిటీస్, ఎఫ్ డి స్టీవార్ట్స్ వంటి అంతర్జాతీయ స్థాయి యాడ్ ఏజెన్సీలకు గ్రాఫిక్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన అనుభవం ఉన్న బహుముఖప్రజ్ఞాశాలి. 1960 ల్లోనే ఫోర్డ్ ఫౌండేషన్‌ తరపున ది సదరన్ లాంగ్వేజ్ బుక్ ట్రస్ట్‌కు ఆర్ట్ కన్సల్టెంట్‌గా పనిచేశారాయన. అదంతా కంప్యూటర్లు, ఇంటర్నెట్టూ, ఆన్‌లైన్ కమ్యూనికేషన్ వంటివి లేని కాలం అన్న విషయం ఇక్కడ మనం గమనించాలి.

అప్పట్లో పబ్లిష్ అయిన ప్రతి తెలుగు నవలమీద, ప్రతి కథా సంకలనం మీద, వీక్లీల కవర్లపైన, మ్యాగజైన్ల వార్షిక సంచికలమీద… బాపు గారి ముఖచిత్రం మాత్రమే ఎక్కువగా ఉండేది. అలాంటి ముఖచిత్రాలు ఎన్ని వందల పుస్తకాలకు వేశారన్నది చెప్పటం కష్టం. బహుశా ఆ సంఖ్య వేలల్లోనే ఉండొచ్చు.

దర్శకుడిగా బాపు చేసిన దాదాపు 48 సినిమాల్లో 10 హిందీ సినిమాలు, ఒక తమిళ సినిమా కూడా ఉంది. వారి సినిమాలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడ్డాయి. అవార్డులు, రివార్డులు గెల్చుకొన్నాయి.

బాపు గారికి కూడా 2013లో పద్మశ్రీ అవార్డుతో పాటు అంతకు ముందే ఎన్నో అవార్డులు వచ్చాయి.

ఒక దశలో హిందీలో ఒక టాప్ హీరోగా వెలిగిన అనిల్ కపూర్‌ను, తెలుగులో వంశవృక్షం చిత్రం ద్వారా మొట్టమొదటగా వెండితెరకు పరిచయం చేసింది బాపుగారే అవటం ఒక గమ్మత్తైన విశేషం.


బాపుగారు షూటింగ్‌కు ముందే తాను తీయబోయే ప్రతి షాట్‌నూ స్టోరీబోర్డ్ రూపంలో గీసుకుంటారు. సినిమాల్లో వారి ఫ్రేమ్స్ అన్నీ వారు గీసిన స్టోరీబోర్డులో బొమ్మల్లాగే ఉండటంలో ఎలాటి ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా వారి సినిమాల్లో హీరోయిన్స్… వారి కళ్ళు, క్లోజప్స్, చీరెకట్టు, నడుము వొంపులు, వాలు జడ, కాళ్ళు, పాదాలు…

వారి చాలా సినిమాల స్టోరీబోర్డులను వారి ఇంట్లోనే స్వయంగా చూసిన అతికొద్దిమందిలో నేనూ ఒకన్ని.

అప్పట్లో తెలుగు కాస్త బాగా రాయగలిగిన దాదాపు ప్రతి యువకుడూ, ప్రతి కవీ, ప్రతి రచయితా తమ చేతి వ్రాతను బాపుగారి స్టయిల్లో రాసే ప్రయత్నం చేసేవారంటే అతిశయోక్తికాదు. బాపు రైటింగ్ శైలి ప్రభావం నామీద కూడా బోలెడంత వుంది. ఇప్పుడు మీరు చదువుతున్న ఈ వెబ్ మ్యాగజైన్ “మనోహరమ్” లోగో బ్రష్‌స్ట్రోక్‌లో నేను రాసిందే. కర్టెసీ… బాపుగారి శైలి ప్రభావం!

కట్ చేస్తే –

నేను బాపుగారింటికి వెళ్ళినరోజు ఇంట్లో ఎవరూ లేరనుకొంటాను. ఒకసారి వాళ్ల అబ్బాయి, మరొకసారి స్వయంగా బాపుగారే అందించిన కాఫీ త్రాగటం మర్చిపోలేని జ్ఞాపకం.

వారి ఇంట్లో కూర్చున్న ఆ 5 గంటలూ నన్ను “మీరు” అని, “మనోహర్ గారు” అని పిలవటం నేను చాలా ఇబ్బందిపడిన విషయం. నాకు తెలిసి, బాపుగారు వారి అసిస్టెంట్స్‌ను కూడా “మీరు” అనే పిలుస్తారట.

ఇంటర్వ్యూ నడుస్తుండగా, 90 నిమిషాల ఆడియో క్యాసెట్ సరిపోదన్న విషయం ముందే గుర్తించిన నా మిత్రుడు వేణుగోపాల్ బయటకెళ్ళి వేగంగా ఇంకో క్యాసెట్ కొనుక్కొచ్చిన విషయం నాకింకా గుర్తుంది.

వీటన్నిటినీ మించి బాపుగారికి సంబంధించి నేను చెప్పదల్చుకొన్న మరొక అద్భుత విషయాన్ని గురించి ఇప్పుడు చివరగా చెప్తున్నాను. అది… బాపుగారి “వర్క్‌రూమ్-కమ్-స్టడీరూమ్.”

బాపు గారి వర్క్‌రూమ్ ఒక పెద్ద హాల్ సైజులో ఉంటుంది. దానికి రెండువైపులా ద్వారాలుంటాయి. చుట్టూ వున్న నాలుగు గోడలు పూర్తిగా నిలువెత్తు ర్యాక్స్‌తో ఫిక్స్‌చేసివుంటాయి. వందలాది పుస్తకాలు.

హాల్ మధ్యలో వేర్వేరుచోట్ల కూర్చొని పనిచేసుకోడానికి అక్కడక్కడా రెండు బీన్ బ్యాగులు, చిన్న చిన్న పీటల్లాంటి కుషన్లు. ఎక్కడ కూర్చొంటే అక్కడే ఆర్ట్, రైటింగ్ సెటప్… బ్రష్షులు, పెన్నులు, పెన్సిళ్ళు, ఇంకులు, రంగులు, ప్యాలెట్లు…

అంటే – ఆయన ఎక్కడ కూర్చోవాలనుకొంటే అక్కడే కూర్చొని ఆర్ట్ వేయటమో, రాసుకోవడమో, చదవటమో చేస్తారన్నమాట!

నేనొక ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయి, ఒక 30 నిమిషాలపాటు స్పెల్‌బౌండ్ అయి చూసిన బాపుగారి వర్క్‌రూమ్-కమ్-స్టడీని ఇప్పటికీ అడుగు అడుగూ వర్ణించగలను!

సృజనశీలి అయిన ఒక అద్భుత వ్యక్తికి అంతకు మించిన ఆస్తి ఏముంటుంది?

వెళ్తూ వెళ్తూ ప్రచురణకోసం వారి ఫోటో అడిగాను. తర్వాత మనసు మార్చుకొని – సిగార్‌తో వున్నదీ, ఆయనే స్వయంగా వేసుకొన్న ‘బాపుగారి బొమ్మ’ కావాలన్నాను. “నేను మీకోసం కొత్తగా ఒకటి వేసి మీకు పోస్ట్ చేస్తాను” అని నా అడ్రెస్ తీసుకొన్నారు. మాట ఇచ్చినట్టే సరిగా వారం రోజుల్లో బాపుగారినుంచి పోస్టులో ‘సిగార్‌తో బాపుగారి బొమ్మ’ వచ్చింది!

ఆ బొమ్మ, ప్లస్, వారిదగ్గర నేను అడిగి తీసుకొన్న ‘పెళ్ళిపుస్తకం’ సినిమాలోని ఒక సీన్‌కు వారు వేసుకొన్న మొత్తం స్టోరీబోర్డు కాపీ ఇప్పటికీ ఒక కార్డ్‌బోర్డ్ పెట్టెలో నాదగ్గర భద్రంగా ఉన్నాయి.

వారికి సెలవు చెప్పి బయటికి వస్తోంటే ఇంటిముందు విశాలమైన ఆవరణలో ఒక ఊయల. ఎదురుగానే హీరో మమ్ముట్టి ఇల్లు. గేట్ దాటి బయటకు వెళ్తూ వెనక్కి తిరిగిచూస్తే – ఇంకా బయటే మాకు చేయి ఊపుతూ బాపు గారు!

ఇన్ని అద్భుత జ్ఞాపకాలనిచ్చిన బాపుగారికి వారి జయంతి సందర్భంగా ఇదే నా వినమ్ర నివాళి.

^^^^^
Read this and more articles on 'Manoharam' Elite Web Magazine:
https://manoharam.in/movies/bapu-gari-bomma