సరిగ్గా 24 ఏళ్ళక్రితం... ఇదే సమయానికి నేను కర్నూలు నుంచి హైద్రాబాద్ వెళ్తున్న బస్‌లో ఉన్నాను.
పొద్దున 6 గంటలకే నా భార్య సుజాతను హైద్రాబాద్‌లోని ధరమ్ కరణ్ రోడ్‌లో ఉన్న వాళ్ల అమ్మవాళ్లింటినుంచి బేగంపేటలో ఉన్న డాక్టర్ సవితాదేవి గారి స్వప్న నర్సింగ్ హోమ్‌కు తీసుకెళ్ళారు.
ఎర్రమంజిల్ నుంచి సుజాత వాళ్ళ అక్కవాళ్ళు వెంటనే హాస్పిటల్‌కు వెళ్ళారు.
వాళ్ళంతా చాలా బాగా చూసుకుంటారు అన్న విషయం నాకు తెలుసు. అయినా సరే, చాలా టెన్షన్...
నేనప్పుడు కర్నూలు ఆలిండియా రేడియో ఎఫ్ ఎమ్ లో పనిచేస్తున్నాను. ఆఫీసుకెళ్ళి, లీవ్ పెట్టి హైద్రాబాద్ బయల్దేరాను. 1997 అది. ఇప్పట్లా మొబైల్ ఫోన్స్ అప్పుడు లేవు. గౌలిగూడ బస్ స్టాండ్‌లో దిగాకనే పబ్లిక్ ఫోన్ నుంచి ఫోన్ చెయ్యాలి.
కట్ చేస్తే -
నేను మధ్యాహ్నానికి ఎర్రమంజిల్ చేరుకున్నాను. అక్కడినుంచి బేగంపేట స్వప్న నర్సింగ్ హోమ్ కి వెళ్ళాను.
అప్పుడే డాక్టర్స్ సుజాతను లోపలికి సిజేరియన్ కోసం తీసుకెళ్తున్నారు. డాక్టర్ సవితాదేవి నాకు 2 నిమిషాలు అంతా వివరంగా చెప్పారు. పేపర్స్ పైన నా సంతకాలు తీసుకున్నారు. స్ట్రెచర్ మీద సుజాత ఏడుస్తూనే ఉంది. ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకెళ్ళారు స్టాఫ్.
కట్ చేస్తే -
3 గంటల 15 నిమిషాలకు డాక్టర్స్ బయటకొచ్చి చెప్పారు:
"అబ్బాయి పుట్టాడు. ఇద్దరూ బాగున్నారు" అని.
ఓ గంట తర్వాత రూమ్‌కి - ఒక తెల్లటి కోన్‌లో పింక్ కలర్ ఐస్‌క్రీమ్‌ను చుట్టి తీసుకొచ్చినట్టు - మా ప్రణయ్‌ని తీసుకొచ్చారు నర్స్‌లు.
అప్పుడే పుట్టిన చిన్న పిల్లలను అంత దగ్గరగా చూడటం నాకు అదే మొదటిసారి. అదొక అద్భుతమైన ఫీలింగ్...
చూస్తుంటే 24 ఏళ్ళు గడిచాయి.
నిజంగా ఒక్క కంప్లయింట్ లేదు...
సెయింట్ పీటర్స్ నుంచి-ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి-బెంగుళూరు జైన్ యూనివర్సిటీ వరకూ... ప్రతి దశలోనూ... చదువులో ఎప్పుడూ టాప్.
త్వరలో ఉద్యోగంలో చేరబోతున్నాడు.
నేనే మంచి తండ్రిని కాలేకపోయాను...
హాప్పీ బర్త్‌డే ప్రణయ్!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani