Saturday, 4 December 2021

24 గంటల్లో మీ షార్ట్ ఫిలిమ్‌కు స్క్రిప్ట్ రెడీ!

షార్ట్ ఫిలింలకు ఇప్పుడు 2 రకాలుగా చాలా డిమాండ్ ఉంది: 

1. తెలుగులో ఓటీటీలకు కంటెంట్ చాలా కావాలి. ఒక్క సినిమాలే సరిపోవు. సో, మంచి స్టాండర్డ్ కంటెంట్ ఉన్న షార్ట్ ఫిలింలను ఓటీటీలు తీసుకొంటాయి.

2. షార్ట్ ఫిలిమ్‌ను కూడా ఒక సినిమా స్థాయిలో తీసి మెప్పించగలిగే డైరెక్టర్స్‌ను ఫిలిం ఇండస్ట్రీ గుర్తిస్తుంది. వెంటనే ఫీచర్ ఫిలిం అవకాశాలొస్తాయి. అలా అవకాశాలు వచ్చి, ఫిలిం డైరెక్టర్స్ అయినవారు చాలా మంది ఉన్నారన్న విషయం మీకు తెలుసు. 

ఈ నేపథ్యంలో - టెక్నికల్‌గా మంచి సత్తా ఉన్న కొందరు షార్ట్ ఫిలిం డైరెక్టర్స్‌కు స్టోరీ రాసుకొనే విషయంలో కొంత సమస్య ఉండవచ్చు. మంచి రచయిత అవసరం ఉండొచ్చు. 

ఒక నంది అవార్డు రచయితగా నేను, నా టీమ్ అందిస్తున్న ప్రొఫెషనల్ స్క్రిప్ట్ రైటింగ్ సర్విసెస్ ద్వారా ఇలాంటి ప్యాషనేట్ షార్ట్ ఫిలిం డైరెక్టర్స్, వారి అభిరుచికి అనుగుణమైన స్క్రిప్టులను రాయించుకోవచ్చు.

నాతో స్క్రిప్ట్ రాయించుకోవడం వల్ల మీకూ లాభమే. ఒక ఫిలిం డైరెక్టర్, నంది అవార్డు రచయిత రాసిన స్క్రిప్టుగా, మీ షార్ట్ ఫిలింకు మీరు ముందే ఒక క్రేజ్ క్రియేట్ చేసుకోవచ్చు.    

స్టోరీలైన్ మీదే అయినా ఓకే. లేదంటే - నాకు ఇలా కావాలని క్లుప్తంగా జోనర్ గురించి మీ విజన్‌ చెప్పినా ఓకే.  మీకు అవసరమైన డ్యూరేషన్‌లో, ఫీచర్ ఫిలిం స్థాయిలో అద్భుతమైన స్క్రిప్ట్ రాసి, మీ డెడ్‌లైన్‌కు అందిస్తాము. 

స్క్రిప్టుకు మీ పేరు వేసుకునే సౌకర్యం కూడా ఉంది. నిర్ణయం మీదే. 

ఇంత వేగంగా, ఒక స్టాండర్డ్‌తో మీ షార్ట్ ఫిలిమ్‌కు స్క్రిప్ట్ రాసిచ్చినందుకు రెమ్యూనరేషన్ ఉంటుంది. అది ఎంత అన్నది మనం చర్చించి నిర్ణయిద్దాం. 

ఫ్రీ కాల్ కోసం... మీ వివరాలు, మీ షార్ట్ ఫిలిం తెలుపుతూ నాకు వాట్సాప్ చేయండి. టైమ్ సెట్ చేసుకొని మాట్లాడుకొందాం.  

ఆల్ ద బెస్ట్. 

Nandi Award Winning Writer, Film Director

MANOHAR CHIMMANI SCRIPT WRITING SERVICES
Whatsapp: 9989578125 

ABOUT MANOHAR CHIMMANI: 
http://bit.ly/manutime 

Request:
మీ కాంటాక్ట్స్‌లో "షార్ట్ ఫిలిం" స్క్రిప్ట్ రైటింగ్ అవసరం ఉన్నవారికి ఇది షేర్ చేయండి. థాంక్ యూ.

2022 కు 27 రోజులు

జీవితంలో సగం అందరితో బాగుండాలి, అందరికీ నచ్చేలా ఉండాలి అనుకోవటంతోనే సరిపోయింది.

మిగిలిన సగం జీవితంలోని కష్టాలు, దుఖాలు, కోరి తెచ్చుకొన్న స్ట్రెస్‌తో సరిపోయింది.

కొన్ని ఆనందాలు, కొన్ని అనుబంధాలు, కొన్ని స్నేహాలు, కొన్ని ప్రణయాలు. కొన్ని విజయాలు. అంతా కలిపి, ఓ గుప్పెడు జ్ఞాపకాలు.      

జీవితం ఇంతే.

చాలా ఎక్కువైంది. ఈ ఆటలు, ఈ డ్రామాలు ఇక చాలు. 

నువ్వు నువ్వుగా జీవించు. 

ఇంకేమైనా అరా కొరా బాధ్యతలు, కమిట్‌మెంట్స్ ఉంటే జెట్ స్పీడ్‌తో ముగించుకో. మిగిలిన ఈ చిన్న ప్రయాణంలో కూడా ఎవరినో ఇంప్రెస్ చేసే మైండ్‌సెట్ వద్దు. నువ్వు నువ్వుగా ఉంటూనే ఈ మాత్రం చెయ్యొచ్చు. 

కమాన్, త్వరగా కానీయ్. ఫ్రీడం తెచ్చుకో. 

నువ్వు నువ్వుగా జీవించు. నీకోసం జీవించు. ప్రతి నిమిషం, ప్రతి క్షణం జీవించు. 

చేయాల్సింది చాలా ఉంది. సమయమే చాలా తక్కువగా ఉంది.  

Love yourself 
like your life depends on it! 

Friday, 3 December 2021

ప్రతివాడికీ చులకనే!

ఈ భూమ్మీద ఉన్న ప్రతి బిజినెస్‌లో, ప్రతి ప్రొఫెషన్‌లో ఎక్కడో ఒక చోట కొన్ని అవకతవకలు జరుగుతుంటాయి. ఎవరో ఒకరిద్దరు చేయకూడనిదేదో చేస్తుంటారు. 

అది రియల్ ఎస్టేట్ కావచ్చు. స్టీల్ ఇండస్ట్రీ కావచ్చు. మైనింగ్ కావచ్చు. మెడికల్ ఫీల్డు కావచ్చు. ఎడ్యుకేషన్ కావచ్చు. సినిమా ఫీల్డు కావచ్చు... జర్నలిజం కూడా కావచ్చు. 

ఈ దేశంలో ఏదీ సొక్కం కాదు. ఏదీ ప్యూర్ కాదు. 

బిజినెస్ అన్న తర్వాత సవాలక్ష జరుగుతుంటాయి. "సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్" అనేది ఈ భూమి ఉన్నంత కాలం ఉండే ఒక... ప్రాక్టికల్లీ ప్రూవ్డ్ బేసిక్ థియరీ. 

జర్నలిజం అయినా, సినిమా ఫీల్డయినా, పాలిటిక్స్ అయినా, క్రికెట్ అయినా... ఏదైనా ఈ బేసిక్ థియరీ పరిధిలోనే ఎక్జిస్ట్ అవుతాయి. కొనసాగుతుంటాయి.

ఇవన్నీ మర్చిపోయి... ఏవో నోటికొచ్చిన నాలుగు మాటలు మాట్లాడ్డం విశ్లేషణ అనిపించుకోదు. జర్నలిజం అనిపించుకోదు. జస్ట్ బుల్ షిట్. 

థాంక్స్ టు సోషల్ మీడియా... దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఇలాంటి విశ్లేషకులే ఎక్కువయ్యారు మనకి. 

కట్ చేస్తే - 

నిన్న రాత్రి అనుకోకుండా ఒక గొప్ప విశ్లేషణ చూశాను. అది సినిమా ఫీల్డు పైన. 

"బంగారు బాతుని చంపుకున్నారు" అని... ఇంకేదేదో అని కొన్ని కంప్లైంట్స్. 

వాటిల్లో ఒకటి రెండు పాయింట్స్ నేను 100% అప్రిషియేట్ చేస్తాను. 

ఫర్ ఎక్జాంపుల్... బయట పది రూపాయలుండే సమోసా... థియేటర్ లోపల 80 రూపాయలుండటం. బయట 10, 20 రూపాయలకంటే ఎక్కువుండని పాప్‌కార్న్ లోపల వందల్లో ఉండటం. కూల్‌ డ్రింక్స్, కాఫీ టీలు, ఇతర స్నాక్స్, ఫుడ్ ఐటమ్స్ కూడా అంతే. జస్ట్ దోపిడీ! 

ఈ ఒక్క కారణం చేత - ఏవో ట్రిపుల్ ఆర్‌లు, రాధేశ్యామ్‌లు వంటి ఆడియో విజువల్లీ గ్రాండియర్ రేంజ్ ఉండే కొన్ని సినిమాలకు తప్ప - 

అలాగే - 

రిలీజైన రోజే సినిమా చూడాలి, మళ్ళీ మళ్ళీ చూడాలి అన్న మైండ్‌సెట్‌తో ఉండే హార్డ్ కోర్ ఫ్యాన్స్ చూసే ఏవో కొన్ని భారీ హీరోల సినిమాలకు తప్ప -  

ఇక మీదట కామన్ ఆడియన్స్ థియేటర్స్‌కు రావాలని ఉన్నా రారు. ఇంట్లోనే కాలుమీద కాలేసుకొని, ఏ పల్లీలో, పాప్‌కార్నో, బ్రెడ్ ఆంలేటో తింటూ, కాఫీ త్రాగుతూ శుభ్రంగా ఓటీటీల్లో కావల్సిన సినిమాలు చూసుకుంటారు. 

ఒక్క తెలుగు, హిందీ, ఇండియన్ భాషల సినిమాలే కాదు... ప్రపంచ భాషల్లోని అన్ని సినిమాల్నీ ఇంట్లో కూర్చునే చూసుకోగల సౌకర్యం ఇప్పటి ప్రేక్షకునికుంది. 

సో, ఇప్పుడు థియేటర్ అనగానే ఈ దోపిడీ గుర్తొచ్చి... నోర్మూసుకొని, షార్ట్స్ వేసుకొని టీవీ ముందు కూర్చొని, హాయిగా ఓటీటీ ఆన్ చేస్తారు. 

బయట కోవిడ్ భయం ఉండదు. థియేటర్లో దోపిడీ భయం ఉండదు. 

ఇండస్ట్రీ పెద్దలు ఇది తప్పక ఆలోచించాల్సిన విషయం. 

ఇలాంటి ఒకటి రెండు పాయింట్స్ తప్ప... 8.27 నిమిషాల  ఆ ప్రోగ్రామ్‌లో, ఆ విశ్లేషకుడు చర్చించిన ఏ ఒక్క పాయింటూ లాజిక్‌కు నిలబడదు. ఆ ఒక్కో పాయింట్ మీద నేనిక్కడ చర్చించాలంటే ఇలాంటి పాడ్‌కాస్టుల సీరీస్ చెయ్యాల్సి ఉంటుంది. 

అయినా సరే, ఇంకో పాయింట్ క్లుప్తంగా చర్చిస్తాను...

స్వయంగా నేనే దశాబ్దాల నుంచి వింటున్నాను... సినిమా ఫీల్డు అనగానే "ఆ నలుగురు" అంటారందరూ. అదేంటో మరి! 20 ఏళ్ల క్రితం కూడా ఇదే మాటన్నారు. ఇప్పుడూ అదే అంటున్నారు. ఆ నలుగురు తప్ప ఈ ఇరవై ఏళ్ల కాలంలో కొత్తగా ఎవ్వరూ ఫీల్డులోకి రాలేదా?  

ఐమాక్స్‌లు రాలేదా, పీవీఆర్‌లు రాలేదా, రిలయన్స్ వాళ్ళ థియేటర్స్ రాలేదా? 

థియేటర్స్ నడిపించే సత్తా ఉన్నవాళ్లు నడిపించుకుంటారు. ఎందుకీ గొడవ అనుకున్నవాళ్ళు లీజ్‌కు ఇచ్చుకుంటారు. లేదంటే కూలగొట్టేసి, ఏదో కాంప్లెక్స్ కట్టుకుంటారు. మాల్ కట్టుకుంటారు. అంతే తప్ప - ఎవ్వరూ ఎవ్వరి నుంచీ బలవంతంగా లీజుకి లాక్కోరు. లాక్కోలేరు. 

అలాగే, థియేటర్స్ చేతిలో ఉన్న ఆ నలుగురైనా, నలభై మంది అయినా... వాటిని అద్దెకిచ్చి నడుపుకోవాలనుకుంటారు తప్ప... ఖాళీగా పెట్టుకోరు. అవైలబిలిటీ ఉంటే, రెంట్ కడితే చాలు. ఎవ్వరికైనా ఇస్తారు.  ఎవరైనా సినిమాలు వేసుకోవచ్చు. 

బిజినెస్ పరంగానో, వ్యక్తిగతంగానో ఎవ్వరికైనా ఏవైనా గ్రడ్జెస్ ఉన్నప్పుడు చాలా అరుదుగా కొన్ని గొడవలు జరగొచ్చు. అది ఏ బిజినెస్‌లో అయినా ఉండేదే. కాని, ఒక ఫంక్షన్ హాల్ కట్టుకున్నోడు... దానికి రోజుకి ఓ నాలుగు లక్షల రూపాయలు అద్దె వస్తోంటే ఎందుకు వద్దనుకుంటాడు? 

సింపుల్ లాజిక్. అంతే. 

వీళ్లంతా చెప్పే ఆ నలుగురి థియేటర్స్‌లోనే ఎన్ని చిన్న బడ్జెట్ సినిమాలు భారీ హిట్లు కాలేదు? 

ఇవన్నీ పక్కనపెట్టి... సోషల్ మీడియా ఎకవుంట్ వుండి, ఇంకెక్కడా పనికిరాని ప్రతి సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావీ, ఒక స్పెషలిస్ట్‌లా సినిమా ఇండస్ట్రీ గురించీ, సినిమాల గురించీ మాట్లాడ్దం చాలా విచిత్రం. 

జర్నలిజం ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? జర్నలిస్టుల్లో ఇప్పుడు ఎంత మంది ఎలాంటి నైతిక విలువలు పాటిస్తూ, పక్షపాతం లేని రిపోర్టింగ్ చేస్తున్నారు? ఇదంతా జగమెరిగిన సత్యం. 

అలాగని, అందరు జర్నలిస్టులనూ పక్షపాతం చూపిస్తున్నారనీ, అవినీతిపరులనీ, అడుక్కుతింటున్నారనీ, బ్లాక్ మెయిలర్స్ అనీ... ఒకే గాటన కట్టలేం కదా? అలా చేయటం, అలా అందర్నీ కామన్‌గా అనటం చాలా పెద్ద తప్పు. 

అదే విధంగా - 

"కళ మీద ఆధారపడ్డ బ్రతుకులు" అని సినిమా ఫీల్డు వాళ్లని జనరలైజ్ చేసి మాట్లాడ్దం ఏదైతే ఉందో... అది చాలా పెద్ద తప్పు. అది జర్నలిజం కాదు.  

ఆ నలుగురు ఆ నలుగురు అంటూ ఇంత గొప్ప విశ్లేషణ చేసిన ఈ జర్నలిస్టు ఎంతో పరిశోధన చేసే ఉంటాడు కదా? ఆ నలుగురు ఎవరో, వారి పేర్లేంటో అతనికి తప్పక తెలిసే ఉంటాయి కదా? 

అలాంటప్పుడు... ఎంతసేపూ ఒక్క దిల్ రాజు పేరునే చెప్తూ, మిగిలిన ముగ్గురి పేర్లు చెప్పకపోవటం వెనుక మతలబు ఏంటి? 

మిగిలిన ముగ్గురి పేర్లు చెప్పాలంటే అంత భయమా? లేదంటే ఇంకేదైనా ఫీలింగా?  

సారీ టు సే... ఇది జర్నలిజం అస్సలు కాదు. 
^^^

Transcript of my Podcast. Written & podcast on 3-12-2021. 

Anchor Link:


Wednesday, 1 December 2021

సిరివెన్నెల ఒక జ్ఞాపకం

నా మొదటి సినిమా "కల" కోసం ఒక పాట రాయమని నేను సిరివెన్నెల గారిని కోరాను. 

శాస్త్రి గారు అప్పటికే కొత్త డైరెక్టర్స్, చిన్న బడ్జెట్ సినిమాలు చేసేవాళ్ళ కోసం ఇలా "ఒక్క పాట" రిక్వెస్టులను ఒప్పుకోవటం మానేశారు.  

గ్రీన్ పార్క్‌లో రూం వేసుకొని, ఎక్కువగా సింగిల్ టైటిల్ కార్డుతో లిరిక్స్ రాస్తున్నారు. భారీ రెమ్యూనరేషన్! 

అరుదుగా తనకు బాగా నచ్చిన, ఇష్టమున్న కొన్ని సంస్థలకు, దర్శకులకు మాత్రం ఒకటి రెండు పాటలు రాస్తున్నారు. 

ఇక్కడ తను రాయకూడదని కాదు. చిన్న బడ్జెట్ సినిమాలను, కొత్త దర్శకులను తక్కువచేయడం కూడా కాదు. "చిన్న బడ్జెట్ సినిమాలకు ముందే బడ్జెట్ సమస్య. నాతో రాయించుకొనే ఆ ఒక్క పాటకు వారు ఎందుకు ఇబ్బంది పడాలి" అన్నది వారి ఆలోచన. ఇంకొకటి - కొత్త లిరిక్ రైటర్స్‌కు కూడా ఎక్కువ అవకాశాలుంటాయి కదా అని. 

ఇలాంటి సమయంలోనే - ఏమైనా సరే నా సినిమాలో సిరివెన్నెల గారి పాట ఒక్కటయినా ఖచ్చితంగా ఉండాలని నేను మొండిగా అనుకున్నాను. నేను పరిచయం చేసిన నా మ్యూజిక్ డైరెక్టర్ ధర్మతేజ (మణిశర్మ కజిన్) తో అదే చెప్పాను.

ఆయన్ని కలిసి అడిగాము. 

నన్ను కిందా మీదా చూసి, "సిచువేషన్ చెప్పండి" అన్నారు. 

చెప్పాను. 

"ట్యూన్ ఉందా" అన్నారు. వెంటనే జేబులోంచి వాక్‌మాన్ తీసి, నొక్కాను. 

విని, పల్లవి అప్పటికప్పుడే ఆశువుగా చెప్పారు. తర్వాత పాట రాసిచ్చారు. 

తర్వాత ఆ పాటను బాలు, చిత్ర గార్లతో పాడించుకున్నాం. చిత్ర గారు చెన్నైలో పాడారు. బాలు గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ మహతిలో పాడారు. 

ఆ పాట ఒక యుగళ గీతం. దాని గురించి రాత్రే ప్రత్యేకంగా ఒక బ్లాగ్ రాసి, పోస్ట్ చేసాను.  

కట్ చేస్తే - 

సిరివెన్నెల గారు సిగరెట్స్ బాగా తాగుతారు. ఎంత బాగా అంటే - నేను ఆ రేంజ్‌లో ఇప్పటివరకు ఇంకొకర్ని చూళ్లేదు.  

ఆయన కూర్చున్న కుర్చీకి కుడివైపు ఒక చిన్న బకెట్ సైజు ప్లాస్టిక్ బిన్ ఉంటుంది. దాంట్లో సగం దాకా నీళ్లుపోసి ఉంటాయి. 

సిగరెట్ కొంచెం కాల్చటం, సగం కూడా అయిపోకముందే దాన్లో వెయ్యటం... మళ్ళీ ఇంకోటి వెలిగించటం... 

అంత చెయిన్ స్మోకింగ్! 

తర్వాతేమైనా తగ్గించారేమో తెలీదు. కాని, ఆయనలోని అప్పటి ఆ చెయిన్ స్మోకింగ్ అలవాటు ఈరోజు ఇంత త్వరగా, ఇలాంటి సమయంలో ఆరోగ్యం పాడవటానికీ, తిరిగి కోలుకోలేకపోవటానికీ తప్పకుండా ఒక కారణమయ్యుంటుంది. 

ఇవన్నీ ఇప్పుడు అనుకోకూడదు. కాని... వారంటే, వారి సాహిత్యం అంటే నాకున్న అభిమానం ఇలా అనుకునేలా చేసి బాధపెడుతుంది. 

డైరెక్టర్ త్రివిక్రమ్ చెప్పినట్టు - "ఆయన తెలుగు సినిమా పాటలు రాయటం ఆయన దురదృష్టం. మన అదృష్టం."

సినిమా పాటల రచయిత కాకుండా - ఆయన కేవలం వచన కవిత్వం మీదే కొనసాగి ఉంటే మాత్రం ఒక అంతర్జాతీయ స్థాయి కవిగా వెలుగొందేవారు. 

సిరివెన్నెల గారు విశ్వనాథ్ గారికి రాశారు. ఆర్జీవీకీ రాశారు. అన్ని సిచ్యువేషన్స్‌కు రాశారు. అన్ని సంగీత ప్రక్రియలకు రాశారు. స్వయంగా కొన్ని పాటలు రాసి, పాడారు కూడా. 

సినిమా పేరునే తన ఇంటిపేరుని చేసుకొన్న ఏకైక తెలుగు సినిమా పాటల రచయిత "సిరివెన్నెల" సీతారామశాస్త్రి గారికి నా వినమ్ర నివాళి! 
^^^^^



Tuesday, 30 November 2021

సిరివెన్నెలతో ఒక పాట

ఇది 2004 నాటి పాట. 

నా మొదటి సినిమా: కల

హీరోయిన్ త్వరలో చనిపోతుందని ఆమెకు తెలుసు. హీరోకి ఆ విషయం తెలీదు అనుకొంటుందామె.  

హీరోకి తెలుసు. కాని, అతను బయట పడడానికి వీళ్లేదు. 

ఈ ఇద్దరి మధ్య ఒకానొక సందర్భంలో ఈ యుగళ గీతం.

హీరో హీరోయిన్ల వెనుక ఎలాంటి డ్రిల్ గుంపు లేకుండా, సోలోగా, రాజమండ్రి దగ్గర గోదావరిలో పడవల్లో 3 రోజులు షూట్ చేశాం. 

ప్రొడక్షన్: శ్రీ వేంకటేశ్వర చిత్ర
నిర్మాత: వై. రామచంద్రా రెడ్డి
దర్శకత్వం: మనోహర్ చిమ్మని 

హీరో: రాజా
హీరోయిన్: నయన హర్షిత
కోరియోగ్రాఫర్: శాంతి 
సంగీతం: ధర్మతేజ
"సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు"

ఇదీ పాట... 

పల్లవి :
-------------
ప్రియరాగాలనే పలికించావులే 
నయగారాలనే ఒలికించావులే
మల్లెపూవల్లె విచ్చావులే 
నువ్వు నాకెంతో నచ్చావులే 

ప్రేమ తెరచాపలా నీవు నిలిచావులే 
నీలి కనుపాపలో నన్ను నిలిపావులే 
నిండు మనసంతా ఇచ్చావులే 
అందుకే నిన్ను మెచ్చానులే 

చరణం  1:
---------------
చినుకంత స్నేహం కోరిందని 
గగనాల మేఘం ఇల చేరదా
ఇనాళ్ళ దాహం తీరిందని 
చిగురాకు ప్రాణం పులకించదా 

కలల్లోని ఆ స్వర్గం
ఇలా చేతికందింది
నిజంలోని ఆనందం 
మనస్సంతా నిండింది

నీకు తోడుండి పొమ్మన్నది
నన్ను నీవెంట రమన్నది            |ప్రియరాగాలనే|

చరణం  2:
---------------
బతుకంటే అర్థం చెబుతావని
నడిపింది హృదయం నీ దారిని
ఈ గాలి పయనం ఎన్నాళ్లని
నీ ప్రేమ బంధం నన్నాపనీ 

రుణం ఏదో మిగిలింది
అదే నిన్ను కలిపింది
మరీ ఆశ కలిగింది
మరో జన్మ అడిగింది

నిన్ను ప్రేమించుకోమన్నది
ప్రేమనే పంచుకొమ్మన్నది        |ప్రియరాగాలనే|

***

సిరివెన్నెల గారు నా మొదటి సినిమా కోసం అడగ్గానే ఈ  పాట రాశారు. వారితో కొన్ని రోజులపాటు ఆ జర్నీ ఒక మరపురాని జ్ఞాపకం.

సీతారామశాస్త్రి గారికి నా వినమ్ర నివాళి... 🙏🙏🙏

Thursday, 25 November 2021

తెలుగు సినిమా ఇప్పుడు లోకల్ సినిమా కాదు!

త్వరలో విడుదల కాబోతున్న ప్రభాస్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా సుమారు 9, 10 భాషల్లో రిలీజవుతున్నాయి. ఇంగ్లిష్‌తో పాటు జపనీస్, కొరియన్, థాయ్ భాషలు కూడా ఈ 10 భాషల్లో ఉన్నాయి.  

ఆయా భాషలున్న దేశాల్లో, లేదా అంతర్జాతీయంగా ఆయా ఫిలిం మార్కెట్స్‌లో... అంత డిమాండ్ లేనిదే ఇన్ని భాషల్లో ఏ నిర్మాతా దర్శకుడు తమ సినిమాలను రిలీజ్ చేయరు అనేది సింపుల్ లాజిక్. 

హీరో ప్రభాస్‌కు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనీసం ఒక 50 దేశాల్లో ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయి. ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ గురించి, మొన్నే రిలీజైన ఆ సినిమాలోని ఫస్ట్ సింగిల్ గురించీ... ఇన్ని దేశాల్లోని అతని ఫ్యాన్స్... ట్విట్టర్‌లోనూ, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లోనూ ఈమధ్య చేస్తున్న హల్ చల్ ఒక రేంజ్‌లో ఉంది. 

ఇప్పుడు రూపొందుతున్న సుకుమార్-అల్లు అర్జున్‌ల పుష్ప సినిమాకు, పూరి జగన్నాధ్-విజయ్ దేవరకొండ లైగర్ సినిమాకు హాలీవుడ్ స్థాయి  టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. లైగర్‌లో అయితే ఏకంగా వెటరన్ బాక్సర్ మైక్ టైసన్‌నే దించారు. ఈ పాడ్కాస్ట్ చేస్తున్న సమయానికి... టైసన్‌తో లాస్ వేగాస్‌లో షూటింగ్‌లో ఉన్నారు... పూరి, చార్మి, అనన్య పాండే, లైగర్ విజయ్ దేవరకొండ అండ్ టీమ్.  

భారతదేశపు తొలి మార్షల్ ఆర్ట్స్ సినిమాను రామ్‌గోపాల్ వర్మ "లడ్‌కీ" పూజ భలేకర్ హీరోయిన్‌గా తీస్తున్నాడు. ఆ భారీ సినిమాను భారీ బడ్జెట్ తో... సంయుక్తంగా ఇండియన్-చైనీస్ ప్రొడక్షన్ కంపెనీలు నిర్మిస్తున్నాయి. 

సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా - ఈ లడ్‌కీ సినిమాను ఎన్ ఎఫ్‌ టి తో... క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో అమ్మకానికిపెట్టి భారీ బిజినెస్ చేస్తూ ఇంకో కొత్త ట్రెండ్ సెట్ చేశాడు ఆర్జీవీ.       

మార్షల్ ఆర్ట్స్, అమ్మాయి, ఆర్జీవీ కెమెరా యాంగిల్స్... ఇవన్నీ ఈ సారి కరెక్టుగా వర్కవుట్ అయ్యి, ఈ మధ్యకాలంలో ఆర్జీవీ నుంచి మనం చూడని ఒక భారీ హిట్ వచ్చినా చెప్పలేం. ఇప్పుడీ ఆర్జీవీ లడ్‌కీ సినిమా ఒక్క చైనాలోనే 30,000 స్క్రీన్లలో రిలీజ్ కాబోతోందంటే ఒక్కసారి ఆలోచించండి. 

ఇప్పటికే దాదాపు పూర్తయ్యి, త్వరలో  6 భాషల్లో రిలీజ్ అవబోతున్న రాజమౌళి #RRR సినిమా గురించి ప్రత్యేకించి చెప్పే పనిలేదు. బాహుబలితో తెలుగు సినిమా మార్కెట్‌ను ప్రపంచస్థాయికి తీసుకుపోవడంలో పయొనీర్‌గా చరిత్రలో తన స్థానం సుస్థిరం చేసుకొన్న రాజమౌళి 'ట్రిపుల్ ఆర్' సినిమా కోసం ఇప్పుడు ప్రపంచ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.  

రాజమౌళి, ఇంకా కొందరు తెలుగు దర్శకులు మనం చూస్తుండగానే హాలీవుడ్‌లో కూడా అడుగుపెడతారు, జెండా ఎగురేస్తారు. ఆరోజు కూడా పెద్ద దూరంలో ఏం లేదు. 

ఇక... ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ నుంచి ప్రభాస్, దీపికా పడుకోన్ హీరోహీరోయిన్స్‌గా, బిగ్ బి అమితాబ్ కూడా నటిస్తున్న నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ సినిమా... మేవెరిక్ డైరెక్టర్ సందీప్ వంగా డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా లైన్లో ఉన్న "స్పిరిట్" సినిమా... ఒక రేంజ్‌లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసేవే.  

ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ మార్కెట్ కూడా తెలుగు సినిమాలవైపు చూస్తోంది. కొన్ని హాలీవుడ్, బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీలు మన తెలుగు సినిమాలతో ఇప్పటికే కో-ప్రొడక్షన్ చేస్తున్నాయి. 

నిజంగా మన సినిమాల్లో అంత సత్తా లేకపోతే, ప్రేక్షకులు చూడకపోతే, అంత బిజినెస్‌ని అవి ఇవ్వలేకపోతే - హాలీవుడ్ గానీ, బాలీవుడ్ కానీ అసలు ఈవైపు కన్నెత్తి చూడవు. 

ఇది సింపుల్ లాజిక్. సింపుల్ బిజినెస్ లాజిక్. 

ఇదంతా నాణేనికి ఒకవైపు.   

ఇప్పుడు నాణేనికి రెండోవైపుకి వద్దాం. 

రైల్వే ట్రెయిన్ టికెట్స్, ఆర్టీసీ బస్ టికెట్స్ బుకింగ్ లాగా... పూర్తిగా ప్రయివేట్ వ్యాపారమైన సినిమా టికెట్స్‌కు కూడా ప్రభుత్వం రేట్ ఫిక్స్ చేయటం, ప్రభుత్వ అజమాయిషీలో టికెటింగ్ పోర్టల్ ఏర్పాటు చేయటం... ఎంతవరకు సమంజసం అనేది... ఇంకో పాడ్కాస్ట్‌లో  వివరంగా చర్చిద్దాం. 

కమ్ర్షియల్‌గా, సాంకేతికంగా ప్రపంచస్థాయి సినిమా నిర్మాణంతో పోటీపడుతూ... మార్కెటింగ్ & బిజినెస్ విషయంలోనూ అదే స్థాయిలో తన కెపాసిటీ చూపిస్తూ కాలర్ ఎగరేస్తున్న తెలుగు సినిమా ఒకటి రెండు చిన్న చిన్న విషయాల్లో చీప్ కావడం... అసలు ఫిలిం ప్రొడక్షన్, ఫిలిం బిజినెస్‌ల బేసిక్స్‌తో కూడా ఎలాంటి పరిచయం-ఎలాంటి అవగాహన-ఎలాంటి సంబంధం లేని మేధావులతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించుకోవడానికి కారణం కావటం... నాకెందుకో అంత బాగా అనిపించటంలేదు. 

ఆ ఒకటి రెండు విషయాల్లో ఒకటి - భారీ హీరోల సినిమా రిలీజ్ అప్పుడు టికెట్ రేట్స్ పెంచడం. 

రెండోది - అదే సమయంలో భారీ టికెట్ రేట్స్‌తో అదనంగా బెనెఫిట్ షోలు వేయడం. 

ఇలాంటి  చిన్న చిన్న విషయాల్ని పక్కనపెట్టి... తెలుగు సినిమా తను ఇప్పుడు దూసుకెళ్తున్న  "లార్జర్ దాన్ లైఫ్" రేంజ్‌లోనే  హాలీవుడ్ స్థాయిలో ఆలోచించి, బిజినెస్ పరంగా మరింత భారీ ఆదాయం కోసం ఫ్రాంచైజీ రూపంలో మరిన్ని ఇన్‌కం అవెన్యూస్‌ను పెంచుకొంటే బాగుంటుంది. 

దేశంలోనే మొదటి 100 కోట్ల రికార్డును, మొదటి వెయ్యి కోట్ల రికార్డును క్రియేట్ చేసిన మన తెలుగు నిర్మాత దర్శకులకు... ఇది... అంత పెద్ద విషయమేం కాదు. 
^^^^^

Transcript of my podcast episode #34, #ManoharChimmaniPodcast. Here're the links:

Anchor:

Spotify:

Youtube:

కొత్త దర్శకులకు, చిన్న బడ్జెట్ సినిమా దర్శకులకు...

Script Writing Services Made Easy! 

హిట్ సినిమా కోసం మీ దగ్గర మంచి మంచి కాన్‌సెప్ట్స్ ఉంటాయి. అయిడియాలుంటాయి.  

సమస్యల్లా ఒక్కటే. 

మీలో చాలా మందికి పర్ఫెక్ట్‌గా స్క్రిప్ట్ రాసుకొనే అవకాశం ఉండదు. సమయం ఉండదు. 

90 శాతం చిన్న బడ్జెట్ సినిమాలకు ఉండే ఏకైక సమస్య డబ్బే. పేరుకే నిర్మాత ఉంటాడు. కాని, డబ్బు ఎక్కడెక్కడి నుంచి వస్తుందా, ఎప్పుడొస్తుందా అని ఎక్కువగా టెన్షన్ పడేది డైరెక్టరే. 

కాన్‌సెప్ట్ స్టేజి నుంచి, సినిమా రిలీజయ్యే దాకా ఈ ఫండ్స్ టెన్షన్‌తోనే  డైరెక్టర్‌కు తెల్లారిపోతుంది. 

మరోవైపు,  24 క్రాఫ్ట్స్‌తో కోఆర్డినేట్ అవుతూ ఎప్పటికప్పుడు పని ప్లాన్ చేసుకోవటం ఎప్పుడూ ఉండనే ఉంటుంది.   

ఇంక స్క్రిప్ట్ రాసుకొనే సమయమెక్కడ? 

ఒక దర్శకరచయితగా ఇలాంటి అనుభవం నాకూ ఉంది. 

ఇలాంటి టెన్షన్ మీకొద్దు. 


స్క్రిప్ట్ విషయంలో ఆ బాధ్యత మీరు నిశ్చింతగా నాకు వదిలేసి, మీ ఇతర పనుల్లో హాయిగా ముందుకెళ్ళిపొండి. 

మీరు అనుకున్న సమయానికి, అనుకున్న స్థాయిలో మీకు స్క్రిప్ట్ అందించే బాధ్యత నాది. 

ఓకే అనుకుంటే, పూర్తి వివరాలు క్రింది లింక్‌లో చదవండి. నాకు వాట్సాప్ చేయండి. 

Read it fully & get connected:

Tuesday, 23 November 2021

రజినీకాంత్, చిరంజీవి కూడా ఫిలిం ఇన్స్‌టిట్యూట్‌కు వెళ్ళినవాళ్లే! కానీ...

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పుడు లీడ్‌లో ఉన్న హీరోహీరోయిన్స్‌లో, దాదాపు అందరూ ఫిలిం ఇన్‌స్టిట్యూట్స్‌లో శిక్షణ పొందినవారే. 

రజినీకాంత్, చిరంజీవి కూడా ఇందుకు మినహాయింపు కాదు. 

సుమారు 40 ఏళ్ల క్రితం వాళ్ళు కూడా మద్రాస్‌లోని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నారు.

ఆ శిక్షణ ద్వారా నేర్చుకొన్న కొన్ని అదనపు మెలకువల ద్వారానే వారిలో ఆ ఆత్మవిశ్వాసం వచ్చింది. ఆ ఆత్మవిశ్వాసంతో  ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో ఒక అవగాహన తెచ్చుకున్నారు.

ఇండస్ట్రీలోకి ప్రవేశించడానికే కాదు, ప్రవేశించాక అక్కడ నిలదొక్కుకోడానికి కూడా అవసరమైన ఒక క్రమశిక్షణ క్రియేట్ చేసుకున్నారు. వ్యూహాత్మకంగా కష్టపడ్డారు. 

అవకాశాలు... వాటంతటవే వాళ్లని వెతుక్కొంటూ వచ్చాయి. 

ఇద్దరూ లెజెండ్స్ అయ్యారు. 40 ఏళ్లుగా ఇంకా నటిస్తూనే ఉన్నారు.   

కట్ చేస్తే -  

ఫిలిం కోచింగ్‌లో ప్రధానంగా రెండు రకాలుంటాయి: 

ఒకటి రొటీన్ కోచింగ్. రెండోది పనికొచ్చే కోచింగ్. 

రొటీన్ కోచింగ్ గురించి పెద్దగా చెప్పేదేం లేదు. ఇన్‌స్టిట్యూట్ వాళ్లకు ఆదాయం కావాలి. కోచింగ్ తీసుకొనేవాళ్ళకు "హమ్మయ్య... కోచింగ్ తీసుకున్నాం" అన్న ఆనందం కావాలి. 

ఒక సర్టిఫికేట్ వస్తుంది. ఎవరో ఓ సెలబ్రిటీతో ఒక ఫోటో కూడా వస్తుంది. 

ది ఎండ్. 

తర్వాత ఇంకేం జరగదు. 

ఇంటిదగ్గర నుంచి కష్టాల లిస్టుతో తిట్లు...  కృష్ణానగర్‌లో ఆకలి కేకలు... గణపతి కాంప్లెక్స్ గోడల దగ్గర గాసిప్స్... శ్రీనగర్ కాలనీ, ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్‌లో ఉన్న ఫిలిం ప్రొడక్షన్ ఆఫీసుల చుట్టూ అవకాశాల కోసం అలా తిరుగుతుండగానే నెలలూ సంవత్సరాలూ గడవటం. 

రావల్సిన ఆ "ఒక్క ఛాన్స్" మాత్రం రాదు. 

అయితే - పనికొచ్చే కోచింగ్ అలా ఉండదు...

కోచింగ్ కోసం వాళ్ళు డబ్బు ఎందుకు తీసుకొంటున్నారు అన్న విషయంలో వారికి స్పష్టమైన స్పృహ ఉంటుంది. బాధ్యత ఫీలవుతారు. 

అప్పటిదాకా అస్పష్టంగా ఉన్న మీ లక్ష్యం ఏంటో మీకు బాగా తెలిసేలా చేస్తారు. మీ లక్ష్యాన్ని వాళ్ళ లక్ష్యంగా ఓన్ చేసుకుంటారు. దాన్నెలా మీరు సాధించాలో ఒక బ్లూప్రింట్ ఇస్తారు. ఒక స్ట్రాటజీ క్రియేట్ చేస్తారు. ఒక నిర్దిష్ట సమయానికి మీ లక్ష్యాన్ని మీరు సాధించేలా చేస్తారు. 

ఇదంతా వ్యూహాత్మకం, శాస్త్రీయం. మనకు కనిపించని అదృష్టం కాదు.   

ఈ శిక్షణ ఎవరిది వారికి విభిన్నంగా, కస్టమైజ్‌డ్‌గా ఉంటుంది. 

అందుకే ఇది రొటీన్ శిక్షణ కాదు. పనికొచ్చే శిక్షణ. 

ఇంగ్లిష్‌లో దీన్ని "మెంటారింగ్" అంటారు.   

ఈ డిజిటల్ ఫిలిం మేకింగ్ యుగంలో కొత్తవాళ్లకి అవకాశాలు బాగా పెరిగాయి. ఓటీటీల్లో ఫిలిమ్స్, వెబ్ సీరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోలు... ఏది ఏ అద్భుత అవకాశానికైనా దారితీయొచ్చు.   

ఇంతకు ముందులా సంవత్సరాల నిర్విరామ కృషి అవసరం లేదు. కాని, అన్ని సంవత్సరాల కృషిని అతి తక్కువ సమయంలోనే పూర్తి చెయ్యగల పట్టుదల, ఆత్మవిశ్వాసం, లక్ష్యం మీద నుంచి దృష్టి మరల్చని ఏకాగ్రత... ఇవి మాత్రం చాలా అవసరం. 

రొటీన్ కోచింగ్ కోసం అయితే ఒక్క పైసా ఖర్చు చెయ్యాల్సిన అవసరం ఇప్పుడు లేదు. అంతా ఆన్‌లైన్‌లో ఉంది. యూట్యూబ్‌లో ఉంది. 

ఫిలిం ఇండస్ట్రీలోకి ప్రవేశించి మీ కల నిజం చేసుకోవాలనుకొంటే మాత్రం - మీకు నిజంగా "పనికొచ్చే కోచింగ్" అవసరం. 

అలాంటి పనికొచ్చే కోచింగ్ మాత్రమే నేనిస్తున్నాను. దీనికి ఫీజుంటుంది. మీ సెలబ్రిటీ కల నిజమౌతుంది. 

దీనివల్ల మీకెంత లాభమో నాకూ అంతే లాభం ఉంది. మీకు నేను వ్యక్తిగతంగా వెచ్చించే సమయానికి నాకు ఫీజు రావడం ఒక్కటే కాదు... అద్భుతమైన టాలెంటున్న కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లూ నాకు దొరుకుతారు. నా తర్వాతి ప్రాజెక్టుల కోసం నా టీమ్‌లోకి నేను తీసుకొంటాను. 

విన్ విన్ అన్నమాట! 

నిజానికి నా విన్ కూడా అల్టిమేట్‌గా మీ లక్ష్యం నెరవేరడానికే ఉపయోగపడుతుంది. 

సో, ఇలాంటి రొటీన్‌కు భిన్నమైన ఒక పనికొచ్చే కోచింగ్‌లో, మెంటారింగ్‌లో... వెంటనే చేరే ఉద్దేశ్యం మీలో ఉందా? 

వెంటనే సెలబ్రిటీ అయిపోవాలన్న విషయంలో - అంత కసి, పట్టుదల, సీరియస్‌నెస్, ఫోకస్ మీలో ఉన్నాయా? 

నిజంగా ఉన్నట్టయితేనే - అప్లికేషన్, ఫీజు వివరాల కోసం కింద డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్‌కు వెంటనే వాట్సాప్ చేయండి. 

వెల్‌కమ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ! 
^^^^^

(మీ కాంటాక్ట్స్‌లో సినీఫీల్డు వైపు, కోచింగ్‌వైపు ఆసక్తి ఉన్నవారికి ఈ లింక్ షేర్ చేయండి. థాంక్యూ!)

"We Make Money to Make More Movies."
- Walt Disney 

*****

Transcript of my latest podcast episode #33, #ManoharChimmaniPodcast. Links:

Spotify:

Anchor:

అదృష్టం అన్న పదాన్ని నేను నమ్మను, కాని...

నమ్ముతున్నాను...

అదృష్టం అనేది ఉంది, ఉంటుంది. 

ఇది నమ్మాలంటే జీవితంలో కొన్ని ఊహించని అనుభవాలు ఎదురవ్వాలి. ఇదెలా సాధ్యం అని లాజిక్కులు పట్టుకోలేక పిచ్చెక్కిపోవాలి. ఇలా కూడా జరుగుతుందా అని షేక్ అయిపోవాలి. 

అప్పుడు మాత్రమే కొన్నిటి మీద నమ్మకం కలుగుతుంది. అందులో ఒకటి - మనం అంతకు ముందెప్పుడూ నమ్మని... అదృష్టం.  

కట్ చేస్తే - 

కొంతమంది జాగ్రత్తగా అన్నీ ప్లాన్ చేసుకున్నట్టే కనిపిస్తారు. నిజంగా చేస్తారు కూడా. ప్రతి చిన్న విషయంలో అతి జాగ్రత్తపడతారు. జీవితంలోని ఒకటి రెండు అతి ముఖ్యమైన విషయాల్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిపోతారు. 

దీనికి పూర్తి వ్యతిరేకంగా - కొందరు అన్నీ చాలా కేర్‌లెస్‌గా తీసుకున్నట్టే ఉంటారు. కాని, అనుకున్న ప్రతి పనీ అలవోగ్గా అలా చేసేసుకుంటూ వెళతారు. ఎక్కడా ఒక చిన్న అడ్డంకిరాదు. వచ్చినా, దాన్ని కూడా లైట్ తీసుకుంటారు. ముందుకే వెళ్తుంటారు తప్ప... అక్కడే చతికిల పడిపోరు. 

ఇది నమ్మకం, మైండ్‌సెట్ మీద ఆధారపడి ఉంటుంది... అని మళ్ళీ లాజిక్స్ వెంటపడతాయి. 

కాని, కాదు. 

ఖచ్చితంగా కాదు. 

ఇంకేదో వారికి సహాయపడుతోంది. వారిని లీడ్ చేస్తోంది. కాని, దాని గురించి వాళ్లంతగా పట్టించుకోరు. 

ఇక్కడే అదృష్టం అనే ట్రంప్ కార్డ్ ఒకటి ఉందని నాకు చాలాసార్లు అర్థమైంది. 

కాని, ఆ ట్రంప్ కార్డ్ మనకి పడాలంటే ఏంచెయ్యాలో మాత్రం తెలీదు. అది దానికదే పడాలి తప్ప, ఎదురుచూస్తే మాత్రం రాదు. 

అదృష్టానికి, దేవునికీ ఏదైనా సంబంధం ఉందా అంటే నేనేం చెప్పలేను. ఒకవేళ ఎవరైనా ఉందీ అంటే మాత్రం నాకు నచ్చదు. 

ఎందుకంటే, దేవుడు అంత శాడిస్టు కాదు.  

మాధవరెడ్డి ఎంత మంచివాడంటే...

టైటిల్ చూసి, ఇదేదో చీప్ క్వాలిటీ యూట్యూబ్ థంబ్‌నెయిల్ అనుకుంటారేమో! 

నో... కాదు.  

ఎట్ ద సేమ్ టైం... రాజకీయాలకు సంబంధించిన టాపిక్ కూడా కాదు.  

1999 లో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎలిమినేటి మాధవరెడ్డి మినిస్టర్‌గా ఉన్నప్పుడు, నేనూహించని విధంగా, ఒక సందర్భంలో, మా ఇద్దరిమధ్య జరిగిన ఓ అయిదారు నిమిషాల సంభాషణ తాలూకు జ్ఞాపకం గురించి... ఈ పాడ్‌కాస్ట్. 

కట్ చేస్తే -  

అప్పుడు నేను కర్నూలు ఆలిండియా రేడియోలో పనిచేస్తున్నాను. మద్రాస్ నుంచి ఎవరైనా పిల్చినప్పుడల్లా వెళ్ళి, అక్కడ రైటర్‌గానో, ఘోస్ట్ రైటర్‌గానో పీస్ వర్క్ లాగా పనిచేసి వస్తుండేవాణ్ణి. 

డబ్బులు కూడా అప్పుడు బాగానే వచ్చేవి. 3, 4 రోజుల్లో ఒక డైలాగ్ వెర్షనో, ఒక కథావిస్తరణో, ఓ ట్రీట్‌మెంటో రాసిచ్చి వచ్చేవాణ్ణి. అలా వెళ్ళినప్పుడల్లా కనీసం 20-30 వేలకు తక్కువ కాకుండా ఇచ్చేవాళ్ళు. 

ఆలిండియా రేడియోలో అప్పుడు నా నెలజీతం కూడా అంత వచ్చేది కాదనుకుంటాను. 

డబ్బులొక్కటే కాకుండా...  మెరీనా బీచ్‌లో పెద్దవాళ్లతో కలిసి విండోస్ పైకెత్తిన ఫియట్ కార్లో కూర్చొని, పల్లీలు తింటూ ఓ పెగ్ తీసుకోడం... సెలబ్రిటీలతో తరచూ కలిసే అవకాశం ఉండటం... అంతా ఓ రేంజ్ లో ఉండేది అప్పుడు. 

అప్పటి ఆ స్క్రిప్ట్ రైటింగ్, ఘోస్ట్ రైటింగ్ అనుభవాలతో - "సినిమా స్క్రిప్టు రచనాశిల్పం" అనే పుస్తకం ఒకటి రాశాను. చకచకా  ప్రింట్స్ వేయాల్సి వచ్చింది. ఎర్ర మంజిల్ లోని మా అన్న ఇంటినుంచి, కర్నూల్లో మా ఇంటినుంచి, విశాలాంధ్ర, నవోదయ బుక్ హౌస్ ల నుంచి అప్పట్లో మొత్తం ఓ 5 వేల కాపీలు సేలయ్యాయి. అదొక రికార్డు. 

ఆ పుస్తకానికే "బెస్ట్ బుక్ ఆన్ ఫిలిమ్స్" క్యాటగిరీ కింద నాకు నంది అవార్డు వచ్చింది. 

ఆ సంవత్సరం నంది అవార్డుల ప్రదానోత్సవం నాడు... అవార్డు గ్రహీతలందరికీ ముందు గోల్కొండ హోటల్లో లంచ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.  

సాయంత్రం లలిత కళాతోరణంలో నంది అవార్డుల కార్యక్రమం తర్వాత, జూబ్లీ హాల్లో డిన్నర్ ఏర్పాటు చేశారు. 

అక్కడ ఏవీయస్ గారూ, ఇంకో ఇద్దరు టీవీ ఆర్టిస్టులు, నేనూ ఒకచోట నిల్చుని మాట్లాడుకుంటున్నాం. ఆ ఇద్దరు అందమైన ఫిమేల్ ఆర్టిస్టులే ఆ రోజు స్టేజి మీద అవార్డులు, చెక్కులు వగైరా అందించే పనికి నియమించబడ్డారు. ఆ ఇద్దరిలో ఒకరు ఇప్పుడు సినిమాల్లో వెరీ బిజీ సపోర్టింగ్ ఆర్టిస్టు. అది వేరే విషయం.     

ఏవియస్ గారు, మా అన్న... ఎర్రమంజిల్లో అనుగ్రహ పార్ట్‌మెంట్స్‌లో పక్కపక్క ఫ్లాట్స్‌లోనే ఉండే వాళ్లు. నేను హైదరాబాద్ వచ్చినపుడల్లా ఏవియస్ గారు, నేను కల్సుకోనేవాళ్ళం. అలా మా ఇద్దరికీ బాగా పరిచయం ఉంది... జోకులు కూడా వేసుకునేంత చనువు కూడా ఉండేది.  

జూబ్లీ హాల్లో డిన్నర్ తర్వాత, లాన్లో నిల్చుని, అలా మేం మాట్లాడుకుంటున్నప్పుడు - వెనకనుంచి నా భుజం పైన ఓ చెయ్యి పడింది. 

"ఏం మనోహర్... ఏంది సంగతి" అంటూ చాలా క్యాజువల్ గా, నన్ను తీసుకొని అలా పక్కకి నడిచాడు ఆ వ్యక్తి. అసలేం జరుగుతోందో అర్థం కాక, నేనూ అనుసరించాను. 

నా భుజం మీద చెయ్యేసి, నన్ను పలకరించి, అంతకు ముందే నేను బాగా తెలిసినట్టు, చాలా క్యాజువల్ గా నన్నలా పక్కకి తీసుకెళ్ళిన ఆ వ్యక్తి ... మినిస్టర్ మాధవరెడ్డి! 

ఇప్పుడున్నంత సెక్యూరిటీ హడావిడి అప్పుడు లేదు. ఆయన వెనుక ఒకే ఒక్క సెక్యూరిటీ ఆఫీసర్ సివిల్ డ్రెస్ లో ఉన్నాడు. అక్కడ అంతా కలిపి ఒక యాభైమంది కూడా లేరు. సగం మంది అవార్డీలు వెళ్ళిపోయారు. ఎవరికోసమో వెయిట్ చెస్తూ, రెండు నిమిషాలు అలా క్యాజువల్ గా టైం పాస్ చెయ్యడానికే బహుశా లాన్లోకి వచ్చి ఉంటాడని తర్వాత నాకర్థమైంది.  

నాకిప్పటికీ ఆశ్చర్యం... 

సాయంత్రం అవార్డులిస్తున్నప్పుడు నంది బహుమతిని సి యమ్ చంద్రబాబు ఇవ్వగా, నందితో పాటు ఇచ్చే ఒక లామినేటెడ్ ధృవపత్రాన్ని, చెక్కును... ఆరోజు నాకు అందించింది మాధవరెడ్డి. 

మైక్ లో ఎనౌన్స్ మెంట్ తర్వాత... ఒక్కొక్కటీ నాకు అందిస్తూ, వాటి మీద రాసున్న నా పేరుని, "చిమ్మని మనోహర్"  అని రెండు సార్లూ చిన్నగా ఆయన బయటికే చదువుతూ నాకు అందించటం నాకు ఇంకా గుర్తుంది.  

కాని, ఓ 2 గంటల తర్వాత, జుబ్లీ హాల్లో డిన్నర్ వరకూ నా పేరుని, నన్నూ ఆయన గుర్తు పెట్టుకోవడం - లేదా ఆయనకు గుర్తుండటం... నాకిప్పటికీ ఆశ్చర్యమే. 

ఆయన అడుగుతున్న ప్రశ్నలకు జవాబులిస్తూపోతున్నాను. నా ఉద్యోగం గురించి కూడా అడిగాడు. కర్నూలు ఆలిండియా రేడియోలో ఏడెనిమిదేళ్ళుగా నేను చేస్తున్న జాబ్ గురించి చెప్పాను.  

"ఇంకెన్నేండ్లుంటవ్  మనోహర్ కర్నూల్ల? హైద్రాబాద్ కు రా" అన్నారాయన. 

ట్రాన్స్‌ఫర్ కష్టమని చెప్పాను. అప్పటికే 2 సార్లు, నా ఫ్రెండ్స్ తో కలిసి ఢిల్లీ వెళ్ళి ప్రయత్నించినా పని కాలేదన్న విషయం చెప్పాను. 

"సెంటర్ల ఐ & బి మినిస్టర్ మనోడే కదా... ఓసారి కలవకపోయినవ్?" అన్నారాయన. 

"అదీ అయింది సర్. వాళ్లావిడే స్వయంగా రికమెండ్ చేశారు ఆయనకు. హైద్రాబాద్‌లో నా పోస్ట్ ఒకటి ఖాళీగా కూడా ఉంది. ఆయన ఆఫీసునుంచి ఒక పిఏనో, పియస్సో చెప్పినా పని అయిపోద్ది సర్... కాని, ఆయన ఎందుకో ఇంట్రెస్ట్ చూపలేదు" అన్నాను.

"ఇది చాలా చిన్న పని బై... ఆయనో టైప్‌లే!  చెయ్యలేదు... గంతే కదా... సరే... నువ్వు మల్ల ఈసారి హైద్రాబాద్ వచ్చినప్పుడు నన్ను కలువ్. నేను చేయిస్తా" అని చాలా సింపుల్‌గా చెప్పారు మాధవరెడ్డి.   

నా జీవితంలో అదే మొట్టమొదటిసారి... నేను ఒక మినిస్టర్‌తో అంత దగ్గరగా ఉండి, అంత క్లోజ్‌గా మాట్లాడ్డం! 

ఏవియస్ గారు, పక్కనున్న ఇద్దరు ఆర్టిస్టులు మావైపే చూస్తున్నారు. 

ఇంతలో మా పక్కనుంచే సి యం చంద్రబాబు నాయుడు నడిచివెళ్తోంటే, నా భుజం మీద చరుస్తూ "రైట్ మనోహర్... ఈసారి వచ్చినప్పుడు కలువ్ మరి" అంటూ బాబు వెనకే స్పీడ్‌గా నడుస్తూ వెళ్ళిపోయారాయన. మాధవరెడ్డి వెనుకే ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ ఫాలో అయ్యాడు. అప్పటిదాకా ఎక్కడున్నారో తెలీదు కాని, సెకన్లో ఇంకో నలుగురు సెక్యూరిటీ ఆఫీసర్లు వారిని ఫాలో అయ్యారు.  

"ఏంటి... మినిస్టర్ గారు మీకు ముందే తెలుసా?!" అని ఏవీయస్ గారు నన్ను ప్రశ్నించటంతో - ఆ ట్రాన్స్ లోంచి నేను బయటికి వచ్చాను. 

నిజంగా ఆ క్షణమే నాకు హైద్రాబాద్ ట్రాన్స్‌ఫర్ అయిపోయినంత హాప్పీగా ఫీలయ్యాను. 

అదీ... మాధవరెడ్డి అంటే. 

ఆ తర్వాతే నేను మాధవరెడ్డి గురించి కొంత తెలుసుకున్నాను. 

"నేను మినిస్టర్ ను" అనే భేషజం లేని మనిషి... మంచి మనిషి. మంచి చేతల మనిషి. 

పనికిమాలిన వాగుడు, మీడియా పిచ్చి, లేని పోని బిల్డప్పులు... ఆయనకు పడవ్.     

తర్వాత నేను కర్నూలు నుంచి హైద్రాబాద్‌కు - జస్ట్ నా ట్రాన్స్ ఫర్ పనిమీదనే... కేవలం మాధవరెడ్డిని కలవటం కోసం... ప్రత్యేకంగా ఓ నాలుగురోజుల ట్రిప్ ప్లాన్ చేసుకుంటుండగానే బాంబ్ బ్లాస్ట్ జరిగింది.  

మాధవరెడ్డి బ్రతికుంటే మాత్రం అప్పుడు నాకు నిజంగా వెంటనే ట్రాన్స్‌ఫర్ అయ్యేది. నా కెరీర్, నా లైఫ్... మరోలా ఉండేవి.       
***

This is the transcript of my latest podcast episode: #32 #ManoharChimmaniPodcast. Links to this episode:

Anchor Link: 

Spotify Link: