Saturday, 25 October 2025

ఒక సృజనాత్మక రంగాన్ని ఎన్నుకున్నప్పుడు...


దాదాపు ఒక ఇరవై ఏళ్ళ క్రితం, ఆంధ్రభూమి వీక్లీ హారర్ కథల పోటీల్లో బహుమతి పొందిన నా కథ ఒకటి, మద్రాస్‌లోని ఒక పాపులర్ ఫిలిం డైరెక్టర్ ఆఫీసు నుంచి నాకు కాల్ తెప్పించింది.  

అప్పుడు ఆంధ్రభూమి వీక్లీ ఎడిటర్‌గా సికరాజు గారు పనిచేస్తున్నారు. ఆయనే నా ఫోన్ నంబర్ వాళ్ళకిస్తే, వాళ్ళు నాకు కాల్ చేశారు. అదంతా ల్యాండ్ లైన్ కాలం. అప్పుడు నేను ఆలిండియా రేడియో, కర్నూలు ఎఫ్ ఎమ్ లో పనిచేస్తున్నాను. 

అలా అనుకోకుండా సినిమా రంగానికి మొదట రచయితగా కనెక్ట్ అయ్యాను. ఆ తర్వాత వెంటనే డైరెక్టర్ అయ్యాను. నా రెగ్యులర్ వృత్తీ వాపకాలు చూసుకుంటూనే, వీలున్నప్పుడల్లా ఒక సినిమా చేస్తూ, ఇప్పటివరకు ఓ నాలుగు సినిమాలు చేశాను. నాకే తృప్తి లేదు.  

ఇప్పుడు నా అన్ని వ్యక్తిగత, కుటుంబ బాధ్యతల నుంచి నేను పూర్తిగా బయటపడ్డాను. ఇప్పటిదాకా మా పిల్లల కోసం, కుటుంబం కోసం కష్టపడ్డాను. ఇప్పుడు నాకోసం నేను పనిచేసుకోవాలికాబట్టి, మళ్ళీ ఇప్పుడు ఇంకో నాలుగైదు సినిమాలు చేద్దామని కొంచెం సీరియస్‌గా కొత్త ఇన్నింగ్స్ మొదలెట్టాను.        

కట్ చేస్తే - 

అప్పుడు నన్ను ఒక కొత్త రచయితగా మద్రాసు పిలిచి, పాండి బజార్‌లోని పూంగా హోటల్లో నాకు రూం వేసినప్పుడు, వాళ్ళు కోరినట్టు కేవలం మూడు రోజుల్లో ఒక సినిమా స్క్రిప్టు వెర్షన్ మొత్తం 80 సీన్లు పూర్తిగా రాసి ఫైల్ చేసి ఇచ్చాను. 

నేను రాసిచ్చిన వెర్షన్ వాళ్ళకు బాగా నచ్చి, నాకు అప్పుడు 25 వేలు రెమ్యూనరేషన్ ఇచ్చి, మళ్ళీ కర్నూలుకు బస్ టికెట్ తీసి పంపించారు.     

అదే నా మొదటి పారితోషికం. 

నా సినిమా కనెక్షన్ అనుకోకుండా అలా మొదలైంది. 

కట్ చేస్తే - 

ఇప్పటివరకు మా ఆఫీసుకి అవకాశం కోసం వచ్చిన కొత్త స్క్రిప్ట్ రైటర్స్ (?) సుమారు ఒక డజన్ మందిని నేను ఒక్కటే అడిగాను... "మీరు రాసిన ఒక ఫుల్ స్క్రిప్ట్ ఏదైనా ఉంటే చూపించండి" అని. 

మీ ముందే అలా కొన్ని సీన్స్ శాంపుల్స్ చదివి ఇచేస్తాను అన్నాను. 

ఏ ఒక్కరూ ఇవ్వలేకపోయారు. వాళ్ళు రాయలేదు కాబట్టి. వాళ్ళ దగ్గర స్క్రిప్ట్ అంటూ ఏదీ లేదు కాబట్టి. 

"పోనీ, మీకు నచ్చిన పాయింట్‌తో ఒక నాలుగు సీన్స్ రాసివ్వండి" అన్నాను. 

డజన్ మందిలో పది మంది మళ్ళీ తిరిగి రాలేదు. అడగ్గా అడగ్గా విధిలేక రాసిచ్చిన మిగిలిన ఇద్దరికీ స్క్రిప్ట్ రైటింగ్ బేసిక్స్ కూడా తెలియదు. లిటరల్లీ ఒక్కటంటే ఒక్క వాక్యం కూడా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా తెలుగులో రాయలేకపోయారు.  

ఫినిషింగ్ టచ్ ఏంటంటే - 
ఈ డజన్ మందిలో ప్రతి ఒక్కరూ నాతో అన్న మొట్టమొదటి మాట ఏంటంటే... 

"సార్, నా దగ్గర బ్లాక్ బస్టర్ కథ ఉంది. మీకు ఫ్రీగా ఇస్తాను!" 

అయితే, ఇది నా కంప్లెయింట్ కాదు. అందరూ ఇలాగే సీరియస్‌నెస్ లేకుండా ఉంటారనీ కాదు. 

నిజంగా చాలా బాగా స్క్రిప్ట్ రాయగలిగిన కొత్త రైటర్స్ తప్పకుండా ఉంటారు. ఏదో ఒకరోజు వాళ్ళనే వెతుక్కుంటూ అవకాశాలొస్తాయి. 

అయితే అలా వాళ్లనే వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలను వాళ్ళు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారన్నది ఇంకో ఎపిసోడ్. ఇంకో బ్లాగ్ పోస్టు. దాని గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం.  

If you’ve chosen a creative life, give it your all. Cinema rewards only those who fight for their art — every single day. 

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani