Thursday, 27 May 2021

అవతలివారి ప్రాధాన్యతల లిస్టులో నువ్వెక్కడ?

కేస్ #1:

మనం ఒకరికి కాల్ చేస్తాం. అవతల ఫోన్ ఎత్తి, "ఒక్క 10 నిమిషాల్లో చేస్తా" అని పెట్టేస్తారు. ఆ 10 నిమిషాలు ఎన్నటికీ రాదు. వాళ్ళు చెయ్యరు. 

మళ్ళీ మనం చేసినప్పుడు, ఇదంతా మర్చిపోయి, మనం అప్పుడే ఫోన్ చేసినట్టు, "చెప్పండి" అంటారు!  

ఏదో బిజీలో ఉంటారు కదా అన్న ఉద్దేశ్యంతో వాట్సాప్ మెసేజ్ పెడ్తాం. రోజుకొకటి పెడుతూనే ఉంటాం. మనకక్కడ అతను ఆన్ లైన్లో ఉన్నట్టు తెలుస్తుంటుంది, లాస్ట్ ఎప్పుడు చూసిందీ తెలుస్తుంటుంది. 

వారి బిజీ వారిది. వారి సమస్యలు వారివి. మనమేం దీని గురించి అడగము. అయినా చెప్తారు: "4 రోజుల తర్వాత ఇప్పుడే ఫోన్ నా చేతికి వచ్చింది" అని! 

అసలు 4 రోజులు ఫోన్ లేకుండా - సిటీ నడిబొడ్డున - ఏ బిజినెస్ మ్యాన్ బిజినెస్ చేస్తాడు?   

కేస్ #2:

నేను: "నీకు వీలయ్యే టైమే చెప్పు. ఆ టైమ్‌కు కాల్ చెయ్యి. ఒకవేళ నువ్వు ఆ టైమ్‌కు చెయ్యలేకపోతే, జస్ట్ ఒక చిన్న మెసేజ్ పెట్టు. నీ బిజీ పనుల్లో ఇది కూడా మర్చిపోయే అవకాశముంటుంది కాబట్టి - టైమ్ చెప్పు, నేనే కాల్ చేస్తా"

అతను: సమస్యే లేదు. నేను చేస్తా కదా... 10 - 11 మధ్య చేస్తా.

11 అయిపోతుంది. సాయంత్రం 7 కూడా అయిపోతుంది. కాల్ రాదు. "ఇప్పుడు చెయ్యలేను" అని చిన్న మెసేజ్ కూడా రాదు. 

మళ్ళీ నేను కాల్ చేస్తే, "మీటింగ్‌లో ఉన్నాను. అయిపోగానే చేస్తాను" అని ఒక మెసేజ్ వస్తుంది. 

ఆ మీటింగ్ ఎన్నటికీ అయిపోదు. నాకు కాల్ రాదు.   

కట్ చేస్తే - 

ఈ రెండు కేసుల్లో - ఇద్దరికీ వ్యక్తిగతంగా నేను అత్యధిక ప్రాధాన్యమిస్తాను. వాళ్ల కాల్ గాని, మెసేజ్ కాని వస్తే వెంటనే రెస్పాండ్ అవుతాను. అది నా అలవాటు. 

అలాగని, అందరూ నాలాగే ఉండాలని నేనెప్పుడూ అనుకోను. చాయిస్ వారికే ఇస్తాను. అయినా సరే, 90% ఎప్పుడూ ఇలాగే జరుగుతుంది.  

ఇలాంటి ఉదాహరణల్లో ఎదుటివారిని తప్పుపట్టడానికి లేదు. అది వారి ఇష్టం. వారి బిజీ, వారి టెన్షన్స్, వారి తలనొప్పులు వారికుంటాయి. 

అయితే - "అవతలివారి ప్రయారిటీ లిస్టులో మనం ఎక్కడున్నాం" అన్న విషయాన్ని మాత్రం ఇలాంటివి మనకు బాగా స్పష్టం చేస్తాయి.  

Sunday, 16 May 2021

దర్బార్ హాల్ ఒక మంచి జ్ఞాపకం


ఫేస్‌బుక్‌లో కొన్ని ఫోటోలు చూసినప్పుడు కొన్ని గుర్తొస్తాయి. ఒకలాంటి ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం...   

ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో - ఊరికే ఎప్పుడేమవుతుందా అని భయపడుతూనో, టెన్షన్ పడుతూనో, అదేపనిగా ఆలోచిస్తూనో ఆరోగ్యం, మనసూ పాడుచేసుకునేకంటే - కొన్ని అలాంటి నాస్తాల్జిక్ ముమెంట్స్‌ను గుర్తుతెచ్చుకోవడం ఎంతయినా మంచిదని నాకనిపించి ఈ బ్లాగ్ రాస్తున్నాను. 

చిన్నప్పుడు వరంగల్‌లో, మా ఇంటిదగ్గర బొడ్రాయిలో ఉన్న విజ్ఞానమందిర్ గ్రంథాలయంలో ఎప్పుడూ "సోవియట్ లాండ్", "స్పుత్నిక్" లాంటి రష్యన్ పత్రికలను అదేపనిగా చదివేవాణ్ణి. ఈ ఇష్టమే పెద్దయ్యాక నేను యూనివర్సిటీకెళ్ళినప్పుడు, అక్కడ మూడేళ్ళ (పార్ట్ టైమ్) రష్యన్ డిప్లొమాలో చేరి, అందులో కూడా యూనివర్సిటీ టాపర్ అవ్వడానికి ఒక ఇన్‌స్పైరింగ్  నేపథ్యమైంది.

నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన రెండు పీజీల్లో ఒకటి షెల్టరిచ్చింది, ఫుడ్ పెట్టింది. మంచి మిత్రులనిచ్చింది. ఇంకో పీజీ నాకు మంచి ఉద్యోగాలనిచ్చింది. కాని, ఈ రెండిటికంటే నాకు ఎక్కువ ఆనందాన్నిచ్చింది మాత్రం నా మూడేళ్ళ పార్ట్ టైమ్ రష్యన్ డిప్లొమానే!  

అది పూర్తిగా మరో లోకం. బోధనా పధ్ధతి ఒక అద్భుతం. క్లాస్‌లో ఎవ్వరు మాట్లాడినా... అయితే రష్యన్లో మాట్లాడాలి, లేదంటే ఇంగ్లిష్‌లో మాట్లాడాలి. పూర్తిగా తెలుగు మీడియం నుంచి యూనివర్సిటీలోకి ప్రవేశించిన నాకు అంతో ఇంతో ఇంగ్లిష్ రావడానికి కారణం ఈ రష్యన్ డిప్లొమానే. 

ఇవన్నీ ఒక ఎత్తైతే - మా క్లాస్‌లో మొత్తం 20 మంది స్టుడెంట్స్ ఉంటే, అందులో 16 మంది అమ్మాయిలే! వాళ్లంతా సిటీ అమ్మాయిలు, మాట్లాడితే ఇంగ్లిష్!! అమ్మాయిలు మొదట్లో నన్ను కొంచెం టార్చర్ పెట్టినా - తర్వాత నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. రష్యన్ డిప్లొమా నాకు అంత బాగా నచ్చడానికి ఇది కూడా ఒక బిగ్ రీజన్ అని నేను ఒప్పుకొనితీరాలి.        

కట్ చేస్తే - 

1987-88 లో దాదాపు ఒక సంవత్సరంపాటు ఇండియాలో "సోవియట్ ఫెస్టివల్" జరిగింది. అప్పుడు ఎందరో రష్యన్ పాప్ సింగర్స్, ఆర్టిస్టులు, రచయితలు, బాలెరినాలు, జిమ్నాస్ట్‌లు, క్రీడాకారులు, ఇతర రంగాల్లోని ప్రముఖులు అప్పటి USSR నుంచి ఇండియా వచ్చారు. 

రాజీవ్ గాంధీ, గోర్బచేవ్‌ల ఫోటోలు, స్పీచ్‌లు అప్పుడొక క్రేజ్.  

ఇండియాలో జరిగిన సోవియట్ ఫెస్టివల్‌లో భాగంగా - ఢిల్లీ, మద్రాసు, హైద్రాబాద్ వంటి దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో రష్యన్ సాంస్కృతిక కార్యక్రమాలు, రష్యన్స్‌తో ఇంటరాక్టివ్ కార్యక్రమాలూ చాలా జరిగాయి. 

ఆ సందర్భంగానే - వందలాదిమంది నేటివ్ రష్యన్ డెలిగేట్స్ ముందు - కోఠీ వుమెన్స్ కాలేజీలో వున్న దర్బార్ హాల్‌లో, అప్పుడు మా ఓయూ రష్యన్ డిప్లొమా స్టుడెంట్స్ ఒక రష్యన్ నాటికను రష్యన్ భాషలోనే ప్రదర్శించాము. 

నాటిక చిన్నదే. కాని, ఆ సాయంత్రం, మా ముందు దర్బార్ హాల్లో వందల్లో ఆసీనులైన రష్యన్ డెలిగేట్స్ అందరూ మా ప్రదర్శనను మెచ్చుకొని చప్పట్లు కొట్టి అభినందించడం అనేది ఇప్పటికీ నాకు ఒళ్లు గగుర్పొడిచే ఒక మంచి జ్ఞాపకం.  

అయితే - ఇప్పట్లా అప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు కాబట్టి, ఫోటోలకోసం మేము ఆ కార్యక్రమానికి నిర్దేశించబడిన ఫోటోగ్రాఫర్స్ మీదనే పూర్తిగా ఆధారపడాల్సివచ్చిందనుకుంటాను. అయినా సరే, కొన్ని ఫోటోలు తప్పక ఉండాలి. అవి కూడా ఎప్పుడో ఒకసారి ఇలాగే తవ్వకాల్లో బయటపడతాయని నా నమ్మకం. 

Sunday, 9 May 2021

ఏ చిన్న చాన్స్ తీసుకోవద్దు!

ఇప్పటిదాకా మిమల్ని కరోనా తాకలేదంటే అర్థం మీరు అదృష్టవంతులు అని గాని, మీలో ఇమ్యూనిటీ బాగుందనీ కాదు. మీరు చాలా బాధ్యతగా ఉన్నారని అర్థం.

దయచేసి దాన్నలాగే కంటిన్యూ చేయండి...

కట్ చేస్తే - 

దాదాపు రెండువారాల క్రితం కోవిడ్19 నన్ను కౌగిలించుకొంది. మొత్తం ఇంటికే పరిమితం చేసుకొన్నాను. ఇప్పుడైతే తగ్గినట్టే ఉంది. మామూలుగానే ఉన్నాను. రుచి, వాసనే ఇంకా దారిలోకి రావాల్సి ఉంది. 

బహుశా ఇంకో వారం పడుతుందనుకుంటాను, నేను పూర్తిగా ఫిట్ అవ్వడానికి. 

అయితే - ఈ రెండువారాలు మానసికంగా నేను అనుభవించిన వ్యధ గురించి చెప్పలేను. ఇక్కడ విషయం నా ప్రాణం మీద భయం కాదు. కొన్ని రాయడానికి ఇది సమయం కూడా కాదు. రాయకూడదు కూడా. 

అదలా పక్కనపెడితే ... ఈ సెకండ్ వేవ్‌లో - నాకు తెలిసిన ఎందరో నాకంటే వయసులో పెద్దవాళ్ళు, నాకంటే చిన్నవాళ్ళు కూడా - నేనెన్నడూ ఊహించని విధంగా ఈ కరోనా బారినపడి మళ్ళీ కోలుకోలేదు.

ఇప్పుడే తెలిసింది... మిత్రుడు, ప్రముఖ జర్నలిస్టు టీయెన్నార్ పరిస్థితి కూడా ప్రస్తుతం క్రిటికల్‌గా ఉందట. I wish all will be okay and he'll be alright. 

ఈ సందర్భంగా, మీ అందరికీ నా వ్యక్తిగత విన్నపం ఏంటంటే - ఇంకొన్నాళ్ళు ఈ విషయాన్ని అంత ఈజీగా తీసుకోకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ చిన్న చాన్స్ తీసుకోవద్దు...

ప్రస్తుతం మనమందరం ఒక కనిపించని శత్రువుతో పోరాడుతున్నాం. కాని, తప్పకుండా దీన్ని కూడా అధిగమిస్తాం. 

This too shall pass... 

కట్ బ్యాక్ టూ మై బ్లాగింగ్ - 

కరోనా మళ్ళీ నన్ను ఇటు లాక్కొచ్చింది. కొన్ని అలవాట్లు అంత ఈజీగా పోవు. నా బ్లాగింగ్ హాబీ అలాంటిదే. 

ఒక పాజిటివ్ ఎడిక్షన్.

గత రెండువారాల నా కోవిడ్ ఐసొలేషన్‌లో నన్ను కాపాడింది ఆ టాబ్లెట్స్ మాత్రమే కాదు. అంతో ఇంతో నాలో ఉన్న చదివే అలవాటు, ఇలా ఏదో ఒకటి రాసే అలవాటు. ఇందులో ఎలాంటి అతిశయోక్తిలేదు. 

నా బ్లాగింగ్‌కి ఎక్స్‌టెన్షన్... మనోహరమ్ వెబ్ మ్యాగజైన్ కోసం బోలెడన్ని ఆర్టికిల్స్ రాశాను. ఇవ్వాటినుంచీ మళ్లీ రెగ్యులర్‌గా మ్యాగజైన్‌లో అప్‌డేట్ చేస్తుంటాను. 

Monday, 12 April 2021

అందరికీ 'ప్లవ' ఉగాది శుభాకాంక్షలు 🙏

మిత్రులు, శ్రేయోభిలాషులు, ప్రియమైన నా బ్లాగ్ పాఠకులందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! 

ఈ తెలుగు సంవత్సరం ఆరంభం నుంచీ మనందరిలో ఆనందం ఇండెక్స్ పైపైకే ఎగరాలనీ, అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా జరగాలనీ, ఆ దిశలో రెట్టించిన ఉత్సాహంతో మనమందరం తగిన కృషి చేయాలనీ, ఇప్పటికే చేయాల్సినవన్నీ చేసేసి హాయిగా రిటైరయి విశ్రాంతి తీసుకుంటున్నవాళ్ళు కూడా మరింత బిందాస్‌గా, ఆరోగ్యంగా ఉండాలనీ, దూరమైన మిత్రులూ బంధువులూ అన్ని ఈగోలూ, గొడవలూ పక్కనపెట్టి ఎప్పట్లా కలిసిపోవాలనీ... మనందరినీ వదలకుండా టెన్షన్ పెడుతున్న కరోనా వైరస్ వెంటనే పత్తాలేకుండా పోవాలనీ... మనస్పూర్తిగా కోరుకొంటూ...

నా బ్లాగ్ పోస్టులన్నీ ఆయా సందర్భాల్లో నా మూడ్ తీసుకెళ్ళినట్టుగా కదిలి రాసినవి. అత్యధిక భాగం నా వ్యక్తిగత అభిప్రాయాలే. ఆలోచనలే. అనుభవాలే.

తెలియక, ఏ పోస్టులోనైనా ఎవరినైనా లేశమాత్రంగా బాధపెట్టినా మన్నించగలరని మనవి. 

కట్ చేస్తే - 

బ్లాగింగ్ మీద నాకున్న అపరిమిత వ్యామోహానికి పొడిగింపే నా కొత్త వెబ్ మ్యాగజైన్ Manoharam.in.

సినిమాలైనా, సక్సెస్ సైన్స్ అయినా, వ్యక్తిగత అనుభవాలూ ఫీలింగ్స్ అయినా... ఇకనుంచీ నా బ్లాగింగ్ అంతా ఈ మ్యాగజైన్‌లోనే. 

ఎందరో మహానుభావులు... అందరికీ ఉగాది శుభాకాంక్షలతో - 
మీ
- మనోహర్ చిమ్మని 🙏

Friday, 9 April 2021

వకీల్ సాబ్ ఎలా ఉండాలి అనేది ఎవరు నిర్ణయిస్తారు?

 
కొంతమంది మేథావులప్పుడే మొదలెట్టారు… పింక్‌లో అమితాబ్ అట్లా చెయ్యలేదు, అమితాబ్ ఇట్లా చెయ్యలేదు అంటూ.

రీమేక్ కథాచర్చల్లో వీళ్లను కూర్చోబెట్టాల్సింది. పాపం దిల్ రాజుకు తెలియదు.

‘సినిమా బాగుంది’, ‘బాగాలేదు’, ‘చెత్తగా ఉంది’… అని చెప్పే హక్కు – టికెట్ కొని సినిమా చూసే ఎవరికైనా ఉంటుంది. కాని, కోట్లు పెట్టి సినిమా తీసేవాళ్ళకు “మీరు సినిమా ఇలా తీయాలి, ఇ-లా-గే తీయాలి” అని చెప్పే హక్కు మాత్రం ఎవరికీ ఉండదు.

అలాంటివాళ్లు నిరభ్యంతరంగా వారికిష్టమైన సినిమాలు మాత్రమే చూసుకోవచ్చు… తీసుకోవచ్చు… తీసుకొని చూసుకోవచ్చు. మీరు సినిమా ఇలా తీశారేంటి అని అడగడానికి ఒక్కరు కూడా ఆ వైపు రారు.

Cut back to Pink –

బోనీ కపూర్, దిల్ రాజు, శ్రీరామ్ వేణు, తమన్, పవన్ కళ్యాణ్, నివేతా థామస్, అంజలి, అనన్య… నాకేం చుట్టాలు కారు. సినిమా మాత్రం నాకు చుట్టమే!

అదొక పరిశ్రమ. ఒక కార్పొరేట్ బిజినెస్. కోట్లతో వ్యాపారం.

కమర్షియల్ సినిమాకు మొదటి లక్ష్యం డబ్బు. రెండో లక్ష్యం, మూడో లక్ష్యం కూడా డబ్బే. క్రియేటివిటీ, వినోదం దాని ముడిసరుకు.

పింక్ రీమేక్ పింక్‌లాగే ‘మక్కీ కి మక్కీ’ ఉండాలి అంటే, పింకే మరోసారి చూస్తే చాలు. వకీల్ సాబ్ సినిమా చూసి అది పింక్‌లా లేదు అనటం కమర్షియల్ సినిమా లాజిక్‌కు చాలా దూరం.

అమితాబ్ హిందీ సినిమాను, పవన్ కల్యాణ్ తెలుగు సినిమాను ఒకే మీటర్‌తో ఎలా కొలుస్తారు?

బాలీవుడ్‌లో అమితాబ్‌కు ఉన్న ఇమేజ్ వేరు. అక్కడి మార్కెట్ వేరు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇమేజ్ వేరు, మార్కెట్ వేరు.

పింక్ దర్శకుడు ఆ సినిమా తీసేటప్పటి ఆలోచన వేరు. అది హిందీలో హిట్ అయ్యాక – అదే సినిమాను తెలుగులో పవన్ కల్యాణ్‌తో రీమేక్ చెయ్యాలన్న నిర్మాతల ఆలోచన వెనకుండే వినోదాత్మక వ్యాపార ఆలోచన వేరు.

పింక్ కమర్షియల్ సినిమానే. వకీల్ సాబ్ కూడా కమర్షియల్ సినిమానే. దేని నిర్మాణ నేపథ్యం దానిది.

పింక్‌లో చర్చించిన వ్యక్తుల ఇండివిడ్యువాలిటీ, సాంఘిక ప్రయోజనం అనే ఆత్మ ఎక్కడికీ పోదు. పోలేదు. మిగిలిన వ్యాపార హంగులన్నీ మాత్రం తప్పవు… తప్పనిసరి కూడా. అలా చేశారు కాబట్టే – వకీల్ సాబ్ ఈరోజు ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

పక్కా కమర్షియల్ సినిమాలను సీరియస్ సినిమా దృక్కోణంతో, మేథోపరమైన తూనికరాళ్లతో తూచటం ఏమాత్రం కరెక్టు కాదు.

కట్ చేస్తే –

ఈ సోకాల్డ్ కొంతమంది మేథావుల ఆలోచనలకు అనుగుణంగా సినిమా తీస్తే – థియేటర్ క్యూబ్‌లకు కట్టిన డబ్బులు కూడా రావు. 🙂 🙂

Understand cinema. Enjoy cinema.

Saturday, 3 April 2021

నెగెటివిటీకి ఎంత దూరం ఉంటే అంత మంచిది!

కొన్ని రోజుల క్రితం ఒక బ్లాగ్ రాశాను... ప్రతి సినిమా వెనుక ఒక కథ ఉంటుంది అని. 

నేను అనుకున్న అంశాన్ని బహుశా ఆ బ్లాగ్ పోస్టులో నేను సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయానేమో అనిపించింది.

ఎందుకంటే - స్వతహాగా ఒక శాంతమూర్తి అయిన ఒక బ్లాగర్, బ్లాగ్ కామెంటర్, పెద్ద మనిషి చాలా బాధాకరంగా రియాక్టయ్యారు. నిజానికి అంత అవసరం లేదు. 

ఆ కామెంట్‌ను పోస్ట్ చెయ్యటం కూడా నాకు నచ్చలేదు. నేను రాసిన అంశాలకు, నేను రాసిన దృక్కోణానికీ, ఆ కామెంట్‌లో రాసిన అంశాలకూ అసలు సంబంధం లేదు. నిజానికి అంత సీన్ అక్కడ లేదు. :-)         

నేను ఎవరిని ఉద్దేశించి రాశానో, ఎవరితో నా భావాలు షేర్ చేసుకోవాలని రాశానో - వాళ్ళనుంచి మాత్రం నాకు కావల్సిన, నేను ఊహించిన పాజిటివ్ రియాక్షనే వచ్చింది. 

సినిమాలమీద విశ్లేషణలు చేసేవాళ్ళు చేస్తుంటారు. చీల్చి చెండాడి రాసేవాళ్ళు రాస్తుంటారు... సినిమాలు తీసేవాళ్ళు తీస్తుంటారు.

ఇది దశాబ్దాలుగా జరుగుతున్నదే. ఎవరి ప్రొఫెషన్ వారిది. ఎవరి ఆసక్తి వారిది. 

డబ్బులు పెట్టి సినిమా చూసే ప్రేక్షకునికి - తాను చూసిన ఆ సినిమా బాగుందో, బాగాలేదో చెప్పే హక్కు తప్పకుండా ఉంటుంది. అలా చెప్పవద్దు అని నేనెప్పుడూ చెప్పలేదు, చెప్పను. 

విశ్లేషకుల విషయంలో కూడా అంతే... వారి ప్రొఫెషన్ వారిది. వారి ఆసక్తి వారిది. రాయొద్దు అని ఎలా చెప్తాం? 

సినిమా కథ వెనుక కథలకూ వీరికీ ఎలాంటి సంబంధం లేదు. అయితే - ఈ నేపథ్యం తెలిసినవారు మాత్రం ఇవన్నీ చూసి నవ్వుకుంటారు, జాలిపడతారు, బాధపడతారు. 

ఒక సినిమా హిట్టూ ఫట్టుల విషయంలో ఇంత బాగా విశ్లేషించగలిగే వీరికి విజయాలు చిటికెలో పని. మరి ఎందుకని వీరు ఒక్కటైనా సినిమా తీయలేరు? తీసి అందరి మన్ననలు పొందొచ్చు కదా? కోట్లలో డబ్బు సంపాదించొచ్చుకదా? 

కట్ చేస్తే - 

నా బ్లాగ్ 100% 'నో-హిపోక్రసీ' బ్లాగ్. మాస్కులుండవు. 

ఈ రాతలన్నీ నాకోసం రాసుకుంటున్నాను. నాలాంటి ఆలోచనా దృక్పథం ఉన్న లైక్‌మైండెడ్ మిత్రులకోసం రాస్తున్నాను. 

నెగెటివిటీ, మాస్కులు, హిపోక్రసీ... వీటికి నేను చాలా దూరం.  

జీవితం చాలా చిన్నది. వీలైనంత పనిచేద్దాం. సంతోషంగా ఉందాం. అనుభవిద్దాం. 

ఒడ్డున ఉండి సలహాలు, సూచనలు ఇవ్వడం... సామెతలు, కొటేషన్స్ పోస్ట్ చేయడం చాలా సులభం. అప్పుడప్పుడూ అది నేనూ చేస్తుంటాను. 

కాని, దిగినప్పుడే తెలుస్తుంది అసలు లోతెంతో.  

ఈ చిన్న లాజిక్ మనం మర్చిపోవద్దు. 

"I don't dream at night, I dream at day, I dream all day; I'm dreaming for a living."
- Steven Spielberg 

Make Movies That Make Money! 

Tuesday, 23 March 2021

Unlearning Times

కరోనా లాక్‌డౌన్ నన్ను దాదాపు సంపూర్ణంగా మార్చేసిందంటే అతిశయోక్తి కాదు. 

కుక్క బూడిదలో పడుకుని ఏదేదో అనుకొని, బూడిదలోంచి లేవగానే దులుపుకొని అంతా మర్చిపోయి ఊరు మీద పడ్డట్టు కాకుండా - నిజంగానే - చాలా విషయాల్లో తిరుగులేని జ్ఞానోదయం అయింది.

Thanks to few gentlemen - చాలా విషయాల్లో ఏం చేయకూడదో, ఎలా ఉండకూడదో నేర్చున్నాను. 

"Unlearning" అన్నమాట! 

కట్ చేస్తే - 

నాకున్న కొన్ని అర్థంలేని వ్యక్తిగత పరిమితుల వల్ల... చివరి క్షణం వరకూ వ్యక్తులపట్ల నేను మార్చుకోలేకపోయిన కొన్ని గుడ్డి నమ్మకాల వల్ల - అవకాశాలు నేను అతి సులభంగా క్రియేట్ చేసుకోగలిగిన రోజుల్లో - సినిమాలు చేయలేకపోయాను. 

ఒకవైపు నేను తీసుకొన్న లాంగ్ గ్యాప్, మరోవైపు కోవిడ్ ప్రభావం ఉన్న ఇప్పటి పరిస్థితుల్లో ఏదీ అంత సులభం కాదు. 

అయినా సరే - ఇప్పుడు నేను వరుసగా సినిమాలు చేయడానికి సంకల్పించాను. 

క్రియేటివిటీపరంగా చూసినా, బిజినెస్‌పరంగా చూసినా... ఖచ్చితమైన లక్ష్యంతో పనిచేసేవాళ్లకు ఫీల్డు ఇప్పుడు సుపర్బ్‌గా ఉంది. 

అందులో నా వాటా నేను తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. 

ఈరోజు నుంచే నా 30 రోజుల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. కోవిడ్ తర్వాత కొత్తగా నా మొదటి సినిమా ఎనౌన్స్ చెయ్యబోతున్నాను.        

Sunday, 21 March 2021

ప్రతి సినిమాకూ ఓ కథ ఉంటుంది!

నేను చెప్పేది మామూలు సినిమా కథ గురించి కాదు... 

ప్రతి సినిమాకు ఒక విభిన్న నేపథ్యం ఉంటుంది. అంటే -  సినిమా వెనుక కథ అన్నమాట.

అసలా ఆలోచన ఎలా వచ్చింది... మార్కెట్ అవుతున్న కాంబినేషన్స్‌ను క్యాష్ చేసుకోవడం అన్న ఆలోచనలోంచి పుట్టిందా? ఒక కథ అనుకుని దానికి తగిన హీరోకి చెప్పి ఒప్పించుకోవడం నుంచి పుట్టిందా? నిర్మాతతో ఒక సిట్టింగ్ వేశాక పుట్టిందా? కొత్తవాళ్లతో చిన్న బడ్జెట్‌లో తీయాలి అనుకొని ప్రారంభించిందా? ఇన్వెస్ట్‌మెంట్‌తో వచ్చిన ఒక కొత్త హీరోని పరిచయం చేయాలన్న లక్ష్యంతో మొదలెట్టిందా? ఒక హీరోయిన్‌తో ఉన్న పర్సనల్ ఆబ్లిగేషన్‌తో ఆమెను పైకి తీసుకురావాలని చేసిన ప్రాజెక్టా? అసలు ఎలాంటి ఆర్థిక వనరులు లేకుండా ప్రారంభించి అలా అలా కొనసాగించిందా? ఒక బిజినెస్ మ్యాన్ మనీ మానిప్యులేషన్స్ అవసరాల కోసం తీసిందా? ఇన్‌కమ్ ట్యాక్స్ అవసరాలకోసం ఫెయిల్ కావాలని తీసిందా?... ఇంకా చాలా ఉంటాయి.   

ఇలా - ప్రతి సినిమా వెనుక నిజంగా ఇంకో కథ ఉంటుంది. ఈ కథ గురించి కేవలం ఒకరిద్దరికే తెలిసే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇంకో నలుగురు ముఖ్యమైన వ్యక్తులకో, టీమ్‌మెంబర్స్‌కో తెలిసే అవకాశం ఉంటుంది. 

ఈ నేపథ్యం తెలియకుండా చేసే జడ్జ్‌మెంట్-aka-విశ్లేషణ ఏదైతే ఉందో... దాన్ని చూసి ఆయా సినిమాల మూలకర్తలు, నేపథ్యం తెలిసిన ఆ కొద్దిమంది నవ్వుకోడం, జాలిపడ్డం తప్ప వేరే ఏమీ ఉండదు. 

'అద్భుతం' అని వీళ్ళు విశ్లేషించి రాసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొడతాయి. వీళ్ళు అది తక్కువుంది... ఇది ఎక్కువుంది... ఇలా తీయాల్సింది... అలా తీయాల్సింది అని ఏకేసి, 'చెత్త సినిమా' అని తేల్చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్‌లవుతాయి!

ఇక - కొంతమంది మేధావులు విశ్లేషించే అద్భుత సినిమాలకు అసలు జనం రారు!!

ఇదంతా ఆయా విశ్లేషకుల వ్యక్తిగత అభిరుచి, స్వేచ్చకు సంబంధించింది.  అయితే - 90 శాతం మంది సినీ ప్రేక్షకులకు ఈ విశ్లేషణలు తెలియవు, అసలు పట్టవు. 

కాని - టికెట్స్ తెగేదీ, సినిమా జయాపజయాలు నిర్థారించబడేదీ మాత్రం ఈ సగటు ప్రేక్షకులవల్లే అన్నది మనం అర్థం చేసుకోవాల్సిన నిజం.      

అయితే - ఆయా విశ్లేషణలు రాసినవాళ్ళకు మాత్రం అదో తుత్తి. దాని కింద కామెంట్లు, మెచ్చుకోళ్ళు వారికి ఇష్టం, లేదా ఎడిక్షన్. 

అది వారి గోల్... వారి విశ్లేషణల వెనుక కథ. 

ఎవరి క్రియేటివ్ ఫ్రీడమ్ వారిది. ఎవరి గోల వారిది. సోషల్ మీడియా వచ్చాక ఈ గోల చాలా పీక్స్‌కు చేరింది. 

కొంతమందికి ఇందాక చెప్పినట్టు అదో తుత్తి. కొంతమందికి స్ట్రెస్ బస్టర్. కొందరికి టైమ్‌పాస్. కొందరికి వ్యక్తిగత అవసరం. కొందరికి ప్రొఫెషన్. 

కట్ చేస్తే - 

నాకున్న పరిమిత జ్ఞానంతో నేను గ్రహించింది ఏంటంటే - "సినిమా ఇలా తీయాలి, అలా తీయాలి, ఇక్కడ స్లో అయింది, అక్కడ చప్పగా ఉంది, సెకండాఫ్ పోయింది..." అని అంత బాగా సినిమా ఆర్ట్ గురించి తెలిసినవాళ్ళూ, అంత బాగా చెప్పేవాళ్ళూ ఎవ్వరూ ఇంతవరకు ఒక్క సినిమా తీయలేదు!

తీసిన ఒకరిద్దరు, వాళ్ళు దశాబ్దాలుగా వారు చెబుతూవచ్చిన తూనికల లెక్కలకు సరితూగే హిట్ సినిమా ఒక్కటి కూడా చేయలేదు. చేయలేరు!!

హాలీవుడ్ నుంచి, బాలీవుడ్ మీదుగా, కోలీవుడ్, టాలీవుడ్... ఎక్కడయినా ఇంతే.

సినిమా తీసేవాళ్లు తీస్తుంటారు. వాటి గురించి రాసేవాళ్ళు రాసుకుంటారు. ఎవరి బిజినెస్ వారిది. ఎవరి పని వారిది.   

ఇప్పుడైతే సినిమా ఒక బిగ్ బిజినెస్. 

ఈ బిజినెస్‌లో - బాలీవుడ్‌ను కూడా వెనక్కి తోసి - చాలా కోణాల్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు నంబర్ వన్ స్థానానికి చేరుకుంది.   

సినిమా అంటే ఇప్పుడు - క్రియేటివిటీ ఒక్కటే కాదు. సమీకరణాలు, లెక్కలు కూడా. 

ఎవరితో చేస్తున్నాం... ఏం చేస్తున్నాం... ఏ స్థాయిలో చేస్తున్నాం... డబ్బు ఎంత పెడుతున్నాం...   ఎంతొస్తుంది... అంత రావడానికి ప్రేక్షకులకు ఇంకా ఏమిస్తే బాగుంటుంది... ఎలాంటి ప్రమోషన్ చేయాలి? 

ఇదే ఇప్పటి సినిమా.

ఎంటర్‌టైన్‌మెంట్, బిజినెస్ ఫస్ట్.

ఆ తర్వాతే ఇంకేదైనా. 

Filmmaking is an art. A passion. And... a big business too. 

Saturday, 20 March 2021

రిస్కీ గేమ్!

ఒకప్పుడు... ఏదో ఒకటిరెండు పనులు సీరియస్‌గా చేస్తుంటే "ఇంక టైమ్ లేదు, సరిపోదు, పిచ్చి బిజీ" అని అనిపించేది. 

ఇప్పుడు అంతకంటే సీరియస్‌గా... ఒక్కసారే అరడజన్‌కు పైగా పనుల్ని రెగ్యులర్‌గా, ఎలాంటి పొరపాటు లేకుండా, పంక్చువల్‌గా చేస్తున్నాను. వీటితోపాటు, ఇంకో 2 ముఖ్యమైన పనుల్ని రేపటినుంచీ చేపట్టబోతున్నాను. 

అయినా సరే - టైమ్‌కు సంబంధించి ఎలాంటి టెన్షన్ లేదు. 

ఫుల్ ప్యాక్‌డ్‌గా, టైమ్‌బౌండ్ టార్గెట్‌తో రకరకాల ఫ్రీలాన్స్ పనుల్లో మునిగి ఉన్న ఇలాంటి సమయంలోనే -  నాకు అతిదగ్గరి బంధువులబ్బాయి పెళ్ళికి సంబంధించిన ఒక బాధ్యతను కూడా ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నాను. ఈమధ్యే. 

మామూలు పరిస్థితుల్లో అయితే పెళ్ళికి సంబంధిన ఏ చిన్న పని అయినా "నో" అని తప్పించుకొనేవాణ్ణి. కాని ఇప్పుడలా కాదు. నా అవసరం అక్కడుంది. నేను మాత్రమే సరైన విధంగా పనిపూర్తి చేయగలను అని నాకు తెలుసు. అలాంటప్పుడు, ఇప్పటి నా నేపథ్యాన్ని సాకుగా పెట్టుకొని, తప్పించుకోలేకపోయాను. 

కట్ చేస్తే - 

ఇలాంటి విషయాల్లో - నేను ఎప్పుడూ మాట్లాడని విధంగా, నిర్మొహమాటంగా, కాన్‌ఫిడెంట్‌గా, కళ్లల్లోకి చూస్తూ - నా ఉద్దేశ్యాన్ని, నా ఆలోచనల్ని నాకిప్పటివరకూ అసలు పరిచయంలేనివాళ్లతో కూడా చెప్పగలుగుతున్నాను.

నిజానికి, ఇలాంటి పెళ్ళి టాపిక్స్ నాకు తెలిసి ఇంతకుముందు నేనెప్పుడూ మాట్లాళ్లేదు... నా పెళ్ళి విషయంలో కూడా. 

పెళ్ళి అనేది ఒక పెద్ద రిస్కీ గేమ్!

దాన్ని అంత ఈజీగా తీసుకొని, అప్పటికప్పుడు ఏవో నిర్ణయాలు తీసుకోవడం కరెక్టు కాదు. తర్వాత జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. 

నా తర్వాతి జనరేషన్‌లో, నాకు తెలిసిన ఎవ్వరి జీవితంలో అయినా - పెళ్ళి విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం జరగొద్దు. ఎవ్వరూ బాధపడొద్దు. 

అదే నా తపన. అందుకే ఎన్నడూ లేని ఈ చొరవ. 

అందుకే ఎన్నడూలేని విధంగా - ఇలా నేను ఈ పెళ్ళి బాధ్యత నా భుజాలమీదకెత్తుకోవడం... 

Thursday, 18 March 2021

విభజన తర్వాత ఫిలిం ఇండస్ట్రీ ఎలా ఉంది?

గమనిక: ఇది పొలిటికల్ పోస్ట్ కాదు. 

కట్ చేస్తే - 

"విభజన తర్వాత ఇండస్ట్రీ ఎలా ఉండబోతోంది?" అని రాష్ట్ర విభజనకు ముందే, 16 డిసెంబర్ 2013 నాడు, దాదాపు 7 సంవత్సరాల క్రితం నేనొక చిన్న బ్లాగ్ రాశాను. దాన్నిక్కడ యథాతథంగా ఇస్తున్నాను: 
---

"విభజన తర్వాత ఇండస్ట్రీ ఎలా ఉండబోతోంది?"
^^^
ఇండస్ట్రీలోని చాలామంది మనస్సుల్ని తొలుస్తున్న ఏకైక ప్రశ్న ఇదే. ఈ ప్రశ్నతో సతమతమౌతున్నవారిలో తెలంగాణ, సీమాంధ్ర వాళ్లు ఇద్దరూ ఉన్నారు.

ఇది నూటికి నూరుపాళ్లూ ఒక వ్యాపారపరమైన ప్రశ్న.

మొన్నామధ్య మా ఆఫీసుకి ఓ ఔత్సాహిక నిర్మాత వచ్చాడు. 101 డౌట్స్‌తొ చంపేశాడు. తర్వాత తోక ముడిచాడనుకోండి. అది వేరే విషయం. ఎంతసేపూ అతని ప్రశ్న ఒక్కటే.

"ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టి సినిమా తీస్తాం. అది పూర్తయ్యి, రిలీజ్‌కి వచ్చేటప్పటికి  ఒకవేళ రెండు రాష్ట్రాలు ఏర్పడిపోతే .. ఏంటి మన పరిస్థితి?"

నా ఉద్దేశ్యం ప్రకారం - ఇందులో తల బద్దలు కొట్టుకోవాల్సినంత సీన్ ఏమీ లేదు.

అప్పట్లాగే ఇప్పుడు కూడా మన తెలుగు సినిమాలు - తెలంగాణ, సీమాంధ్ర తేడా లేకుండా - రెండుచోట్లా విడుదలవుతాయి మామూలుగానే. అప్పుడు డీల్ చేసిన వాళ్లే ఇప్పుడూ డీల్ చేస్తారు. అవే పధ్ధతులు, అదే రొటీన్ కంటిన్యూ అవుతుంది దాదాపు.

ఒక్క విషయంలో మాత్రం మార్పు ఉంటుంది. ఇప్పటి వరకూ ఒక్క (సమైక్య) ఆంధ్రప్రదేశ్‌కు  మాత్రమే పోయే మన టాక్స్‌లు, విభజన తర్వాత (నవ్య) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు రాష్ట్రాలకూ వెళతాయి. ఎక్కడి టాక్సులు అక్కడే అన్నమాట! 

ఈ రూపంలో నిర్మాతలకు అదనంగా ఇంకొంచెం భారం పడొచ్చు. 

అంతకు మించి ఇండస్ట్రీలో పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు. దీనికి కారణాలు అనేకం. వాటిగురించి మరోసారి... మరో బ్లాగ్ పోస్ట్‌లో." 
---

తెలంగాణ ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ రాష్ట్రంలోని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో, గత ఆరేళ్లలో... ఎలాంటి మార్పులు వచ్చాయి? అసలు వచ్చాయా? భవిష్యత్తులో రానున్నాయా? వస్తాయా?...  

వీటి గురించి త్వరలోనే ఇంకోసారి తప్పక చర్చిద్దాం. ఇంకో బ్లాగ్ పోస్ట్‌లో.