Friday, 22 February 2019

Time to Take Massive Action!

రెండు కొత్త సినిమాలు, సోషల్‌మీడియా ప్రమోషన్, మ్యూజిక్ వీడియోలు, మ్యూజిక్ ఈవెంట్స్, షోస్, ఒక బుక్ రిలీజ్, ఒక డాక్యుమెంటరీ .. ఇట్లా చిన్నా, పెద్దా ఎన్నో ప్రాజెక్టులకు సంబంధించిన పనులు ఒకేసారి జరుగుతున్నాయి.

ఏప్రిల్ 30 దాకా ఊపిరి తీసుకోడానికి కూడా వీలు కానంతగా పనులు పెట్టుకున్నాము.   


Taking massive action! 


వీటిలో ప్రతి ఒక్కటీ వృత్తిపరంగా ఇప్పుడు నాకు చాలా ముఖ్యమైనదే. దేన్నీ అంత ఈజీగా తీసుకోవడం లేదు.

అన్నీ టైమ్ బౌండ్ ఉన్నవే.

సో, ఎన్నోరకాల వత్తిళ్ళు ఉన్నా
 ఏ ఒక్క పనినీ నేను వాయిదా వెయ్యటం లేదు. 

ఇవి ఒక్కొక్కటి ప్రారంభమౌతుంటే .. 
వీటికి సంబంధించిన చిన్న చిన్న తలనొప్పులు, అడ్డంకులు ఏవైనా ఉంటే అవే తొలగిపోతాయి. 

నా ఈ జర్నీలో నాతోపాటు పయనిస్తున్న 
వీరేంద్ర లలిత్, ప్రదీప్‌చంద్ర, ఇంకా మొత్తం
నా టీమ్‌కు 
అభినందనలు.

క్రియేటివిటీకి సంబంధించిన పనుల్లోని అన్‌సర్టేనిటీని అర్థం చేసుకొని, మాకు సహకరిస్తున్న మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ 
కూడా బిగ్ థాంక్స్.

కట్ చేస్తే - 

ఈరోజునుంచే కొత్త ఆర్టిస్టులు, సింగర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, రైటర్స్ కోసం యాడ్స్ ప్రారంభిస్తున్నాము. ఆడిషన్, సెలెక్షన్స్ మార్చిలో ఉంటాయి.   

Wednesday, 20 February 2019

ఇప్పుడు సోషల్ మీడియాను మించిన ప్రమోషన్ లేదు!

నేను టీవీ చూడక, న్యూస్‌పేపర్ చదవక అర్థ దశాబ్దం దాటింది. దీనివల్ల ఇప్పటివరకు నేనేదీ నష్టపోలేదని నాకు ఖచ్చితంగా తెలుసు.

నిజంగా అంత అవసరమైన న్యూస్ గాని, ఇంకేదైనా ముఖ్యమైన సమాచారం గానీ ఉంటే, అది ఏదోవిధంగా సరైన సమయానికి నాకు వెంటనే చేరుతోంది.

క్రెడిట్ గోస్ టూ సోషల్ మీడియా!

నాకున్న పరిమిత నాలెడ్జి ప్రకారం ఇంతకుముందులా ఇప్పుడెవ్వరూ టీవీ, న్యూస్‌పేపర్‌లను పెద్దగా పట్టించుకోవడం లేదు. అంత టైమ్ ఎవ్వరికీ ఉండటంలేదు.

అది పాలిటిక్స్ కావొచ్చు, స్పోర్ట్స్ కావొచ్చు, బిజినెస్ కావొచ్చు, ఇంకేదైనా కావొచ్చు.

అంతా అరచేతిలో ఉన్న మొబైల్‌లోనే.

ఆ మొబైల్‌లో ఉన్న సోషల్ మీడియా ప్రపంచంలోనే. 

కట్ టూ సినిమా ప్రమోషన్ - 

ఎప్పటినుంచో ఉన్న ఒక పనికిరాని రొటీన్ సంప్రదాయం ప్రకారం .. ఇన్వెస్టర్‌లకు కాన్‌ఫిడెన్స్ ఇవ్వడం కోసం, టీవీ చానెల్స్‌కు సినిమా న్యూస్ కంటెంట్ ఇవ్వటం కోసం తప్పిస్తే .. ఈ రొటీన్ సినిమా ఈవెంట్స్, ఓపెనింగ్స్, ప్రెస్‌మీట్స్, ఎట్సెట్రాలు అసలెందుకూ పనికిరావన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.

ఖర్చు కూడా ఎక్కువే. 

ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఫిలిం మ్యాగజైన్స్ ఎట్సెట్రా ఇచ్చే ప్రచారం కంటే ఎన్నోరెట్లు ఎక్కువ ప్రమోషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే సాధ్యం.

హాలీవుడ్ నుంచి, టాలీవుడ్ వరకు .. ఈ మధ్య హిట్టయిన ఏ సినిమానయినా తీసుకోండి. వాటి ప్రమోషన్‌లో ప్రధాన పాత్ర సోషల్ మీడియాదే!

ఖర్చు చాలా తక్కువ.

చెప్పాలంటే మొత్తం ఫ్రీ! 

ఉదాహరణ: 'లక్ష్మీ's NTR' సినిమా. ఆర్జీవీ ట్వీట్స్.

ఆఖరికి ఆ సినిమా ట్రయలర్లు కూడా ట్విట్టర్ ద్వారానే రిలీజ్!  


ఇంక ఆ సినిమాకు వేరే ప్రమోషన్ అక్కర్లేదని నా అభిప్రాయం. 

అందరూ ఆర్జీవీలా చేయలేకపోవచ్హు. కానీ, సోషల్ మీడియా ఆయుధం అక్కడుంది కళ్లముందు. ఎవరి టాలెంట్ వారిది. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత!
  

అయితే, సోషల్ మీడియా పవర్ గురించి ఎంత తెలిసినా .. సినిమా ప్రమోషన్‌లో భాగంగా, ఇండస్ట్రీలోని కొంతమంది సంతృప్తికోసం కొన్ని పాతపధ్ధతులు కూడా పాటించక తప్పటంలేదు. 

అది మనవాళ్ల మైండ్‌సెట్. 

కానీ, ఎవరు ఎన్ని పాత పధ్ధతులు పాటించినా,  సినిమా ప్రమోషన్ విషయంలో సోషల్ మీడియాను విస్మరించడం మాత్రం ఖచ్చితంగా అతి పెద్ద తప్పవుతుంది. 

అది హాలీవుడ్ అయినాసరే, టాలీవుడ్ అయినాసరే.   

Tuesday, 19 February 2019

మనీ .. 3 సూత్రాలు!

నా పాత బ్లాగ్ పోస్టులను ఒక్క నిమిషం అలా బ్రౌజ్ చేస్తోంటే ఇది కనిపించింది:

"Research shows that the more a boy misbehaves in school, the more likely he is to earn a lot of money as an adult!"

నా దృష్టిలో ఇదేదో ఉత్తుత్తి స్టేట్‌మెంట్ కాదు.

నా అనుభవంలో నేను కూడా చూసిన ఒక సత్యం.

దీనికి అనుబంధంగా మరికొన్ని నిజాలు కూడా నేను చెప్పగలను, ఎలాంటి హిపోక్రసీ లేకుండా.

> రోడ్డుమీద వెళ్తూ కనిపించిన ప్రతి రాయికీ, రప్పకూ విచిత్రంగా అలా దండం పెట్టుకుంటూ వెళ్తుంటారు కొంతమంది. అది తప్పు అనటంలేదు. కానీ, వీరి వ్యవహారశైలిగానీ, భాషగానీ అవతలివారికి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ కేటగిరీకి చెందిన చాలామంది నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గరగా తెలుసు. వీళ్లల్లో చాలామందికి కాగితం పైన పెన్నుపెట్టి రాయటం రాదు. కానీ వీరందరి దగ్గర డబ్బు పిచ్చిగా ఉంటుంది. పిచ్చిపిచ్చిగా సంపాదిస్తారు!

> అంతర్జాతీయంగా వివిధరంగాల్లో  అత్యుత్తమ స్థాయి విజయాల్నిసాధించి బిలియనేర్లు అయినవారిలో 96 శాతం మంది చదువులో గుండు సున్నాలే. లేదా స్కూల్, కాలేజ్ స్థాయిలో "డ్రాప్ అవుట్"లే!
 
> సినీ ఫీల్డులో కూడా అంతే. అత్యున్నతస్థాయి విజయాలు సాధించి కోట్లు సంపాదించుకున్న ఆర్టిస్టులూ, టెక్నీషియన్లలో అత్యధికభాగం మంది చదువుకు పంగనామాలు పెట్టినవాళ్లే!

కట్ టూ నీతి -       

1. చదువుకోనివాడి లక్ష్యం స్పష్టంగా ఉంటుంది. మొండిగా ఆ ఒక్కదాని గురించే కష్టపడి సాధిస్తాడు.

2. చదువుకున్నవాడికి పది లక్ష్యాలుంటాయి. పది పడవలమీద కాళ్లు పెడతాడు. ఏ ఒక్కటీ సాధించలేడు.

3. చదువుకు, సంపాదనకు అస్సలు సంబంధం లేదు. "నాకేం కావాలి? నేనెంత సంపాదించాలి? దానికోసం నేనేం చేయాలి?" అన్న వెరీ సింపుల్ 'ఫినాన్షియల్ ఇంటలిజెన్స్' చాలు.

పై 1, 2, 3 లను చాలా ఆలస్యంగా రియలైజ్ కావడమంత దురదృష్టం ఇంకొకటి లేదు.

బట్, నో వర్రీ ...

ఇప్పుడు, రియలైజ్ అయిన మరుక్షణం నుంచైనా, వొళ్లు దగ్గరపెట్టుకొని, "మనమేం చేస్తున్నాం, మనకేం కావాలి" అన్న విషయంలో కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకొంటే చాలు.

ఫలితాలు అవే ఫాలో అవుతాయి.

డబ్బు కూడా.   

Monday, 18 February 2019

సర్వమ్ ఆధ్యాత్మికమ్!

క్రియేటివిటీ, స్పిరిచువాలిటీ .. ఈ రెండూ నాకత్యంత ఇష్టమైన అంశాలు.

ఈ రెండూ చూడ్డానికి విభిన్నధృవాల్లా అనిపిస్తాయి. కానీ, రెండింటి సోల్ ఒక్కటే.

ఆనందం.

పల్ప్ ఫిక్షన్ రాసే ఒక రచయితలో, కమర్షియల్ సినిమాలు చేసే ఒక దర్శకునిలో ఆధ్యాత్మిక చింతన ఉండకూడదా? ఆధ్యాత్మిక చింతన ఉన్న ఒక ఆర్టిస్ట్ బొమ్మలువేసి ఎగ్జిబిషన్ పెట్టకూడదా? భారీ వ్యాపారాల్లో మునిగితేలే ఒక బడా వ్యాపారవేత్త ఒక ఆధ్యాత్మిక చిత్రం నిర్మించకూడదా?

ఎవరి వృత్తి, వ్యాపారం ఏమైనా కావొచ్చు. వారు ఏదైనా చేయొచ్చు. ఏ స్థాయికైనా ఎదగొచ్చు. కానీ, చివరికి అందరి అంతిమ గమ్యం ఆధ్యాత్మికమే అవుతుంది.

ఆ మార్పు తప్పదు.

ఒక అలెగ్జాండర్ కావొచ్చు. ఒక అశోకుడు కావొచ్చు. ఒక చలం కావొచ్చు. ఒక మహేష్‌భట్ కావొచ్చు. అందరూ అంతిమంగా ఆధ్యాత్మికానందం వొడికి చేరినవాళ్లే.

ఈ నిజాన్ని చరిత్ర పదేపదే రుజువుచేసింది.

నిజానికి ఈరెండూ కలిసినప్పుడే మనం కోరుకున్న స్వేఛ్చ, ఆనందం మన సొంతమవుతాయి.

ఈ నిజాన్ని కూడా చరిత్ర పదేపదే రుజువు చేసింది.

అంతే తప్ప, అన్నీ వదిలేయడమే ఆధ్యాత్మికం కాదు .. కాకూడదు. 

కొత్త సింగర్స్‌కు ఛాన్స్ ఎందుకు?

ఇండస్ట్రీకి నేను పరిచయం చేసిన మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్రకు నా గతచిత్రం 'స్విమ్మింగ్‌పూల్' మ్యూజిక్ సిట్టింగ్స్ 'డే వన్' నుంచి నేనొక విషయం చెబుతూ వస్తున్నాను ...

"మన సినిమాలో పాటలకోసమని నువ్వు ఇండస్ట్రీలోని టాప్ సింగర్స్‌తోనే పాడించాలని పొరపాటున కూడా అనుకోకు. నాకలాంటి భ్రమలు లేవు.

అలా .. టాప్ సింగర్స్ పేర్లు నీ సీడీలో ఉంటేనే నీకు పేరొస్తుందనీ, మ్యూజిక్ కంపెనీలవాళ్లు ఆడియో రైట్స్ కొనుక్కోడానికి ఎగబడతారనీ అనుకోకు.

ఏ క్యాబ్ వాడో తప్ప, ఇప్పుడు ఆడియో సీడీలు ఫ్రీగా ఇచ్చినా ఎవ్వడు తీసుకోడంలేదు. ఇంకా చెప్పాలంటే - ఇప్పుడు ఆడియో రిలీజ్ కంటే ముందే ఆ సాంగ్స్ ఇంటర్‌నెట్‌లో లీకయిపోతున్నాయి.

సో, మన పాటలు కూడా బాగుంటే వద్దన్నా పబ్లిక్‌లోకి వెళ్లిపోతాయి. వినాలనుకున్నవాడు డౌన్‌లోడ్ పెట్టుకుంటాడు."

కాబట్టి -

"నువ్వు కొత్త సింగర్స్‌ను పరిచయం చేసి, వాళ్లను నీ ద్వారా టాప్ సింగర్స్‌ను చెయ్యి!" అని ప్రదీప్‌చంద్రకు చెప్పాను.

అలాగని నేను పాత సింగర్స్‌కు వ్యతిరేకం ఏం కాదు.

నా తొలిచిత్రం 'కల' కోసం చిత్ర, యస్ పి బాలు నుంచి కార్తీక్, టిప్పు, పాప్ శాలిని మొదలైన ఎందరో టాప్ సింగర్స్‌తో పాడించాను. ఆ నాస్తాల్జియా గురించి మరోసారి రాస్తాను. 

కట్ బ్యాక్ టూ మన న్యూ సింగర్స్ -  

కొత్త సింగర్స్‌ను పరిచయం చేద్దాం అని నేను ప్రదీప్‌చంద్రతో చెప్పడానికి చాలా కారణాలున్నాయి ..

వెనకటి రోజుల్లో గాయనీగాయకుల్లాగా ఏ ఒకరిద్దరో మాత్రమే పాడుతూ .. 'దశాబ్దాలకొద్దీ గాన సామ్రాజ్యాల్ని ఏలాలి' అనుకొనే రోజులు కావివి.

అప్పుడంటే అలా నడిచింది. ఇప్పుడలా నడవదు గాక నడవదు.

ఇప్పటి ప్రేక్షకులు, శ్రోతలు ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకొంటున్నారు. కొత్త గొంతులు వినాలనుకొంటున్నారు. విని ఆనందిస్తున్నారు.

సినిమాలతో, భాషతో సంబంధం లేకుండా, ఒకే ఒక్క 'ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో'తో ఓవర్‌నైట్‌లో టాప్ సింగర్స్ అయిపోతున్న రోజులివి. 

ఈ కోణంలో ఆలోచించినప్పుడు - టాలెంట్ బాగా ఉండి, అవకాశం కోసం ఎదురుచూస్తున్న కొత్త సింగర్స్‌ను పరిచయం చెయ్యాలన్నది నా ఉద్దేశ్యం.

అలాగే - ఇప్పటికే పరిచయమైనా, రకరకాల కారణాలవల్ల, టాలెంట్ ఉండీ పైకి రాలేకపోతున్న 'అప్‌కమింగ్ సింగర్స్‌'ను కూడా వీలయినంత ఎంకరేజ్ చెయ్యాలన్నది నా ఇంకో ఆలోచన.

మా కొత్త ప్రాజెక్టులకోసం, మార్చిలో 'న్యూ సింగర్స్' ఆడిషన్స్ ఉంటాయి. టాలెంట్ ఉన్న సింగర్స్‌కు తప్పక అవకాశం దొరుకుతుంది.

మా సినిమాలో కేవలం పాటల ద్వారా మాత్రమే కాకుండా, 'ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియో'ల ద్వారా కూడా మేము పరిచయం చేసే కొత్త సింగర్స్‌ను పాపులర్ చేస్తాము.

ఇప్పటి టాప్ సింగర్స్ అంతా కూడా ఒకప్పుడు కొత్త సింగర్సే!

సో, గెట్ రెడీ న్యూ సింగర్స్ ...

కొంచెం టచ్‌లో ఉందాం. :)

మార్చిలో కొత్త ఫీచర్ ఫిల్మ్ ఆడిషన్స్

కొత్త హీరోహీరోయిన్‌లు, సపోర్టింగ్ ఆర్టిస్టులు, సింగర్స్ కోసం ఆడిషన్స్ ఈ మార్చిలో నిర్వహిస్తున్నాము.

ఈ ఆడిషన్స్‌కు సంబంధించిన పూర్తి యాడ్‌ను నా ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్, ఫేస్‌బుక్‌, ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేయటంతోపాటు, కొన్ని వెబ్‌సైట్స్, ఫిల్మ్ మేగజైన్స్ లో కూడా త్వరలోనే ఇస్తున్నాను.

ఆర్టిస్టులు, సింగర్స్ సెలెక్షన్స్ హైద్రాబాద్‌తో పాటు - వైజాగ్‌, ముంబైల్లో కూడా ఉండే అవకాశముంది.

ఇవి కాకుండా, టెక్నీషియన్స్ లో - కొత్త అసిస్టెంట్ డైరెక్టర్స్, కొత్త లిరిక్ రైటర్స్‌ మొదలైన వాటికోసం కూడా ఎప్పటికప్పుడు విడివిడిగా యాడ్స్ ఇచ్చి, సెలెక్షన్లకు పిలుస్తాము.

ఆడిషన్స్‌కు అప్లై చేసుకొనే అభ్యర్థుల్లో - సినిమా పట్ల ప్యాషన్, టాలెంట్ .. ఈ రెండే నాకు ముఖ్యం.

వీటి ప్రాతిపదికగానే నాకు అవసరమైన 'లైక్‌మైండెడ్ టీమ్' ఎన్నిక జరుగుతుంది.

త్వరలో ప్రారంభం కానున్న నా రెండు కొత్త సినిమాల కోసం ఈ ఆడిషన్స్.

పూర్తి వివరాలతో మార్చిలో కలుద్దాం. అప్పటిదాకా కొంచెం టచ్‌లో ఉందాం. :)

బెస్ట్ విషెస్ .. 

Sunday, 17 February 2019

నెట్‌వర్క్ పెంచుకుందాం రా!

మనిషిని "సోషల్ యానిమల్" అన్నాడో తత్వవేత్త.

సంఘంలోని ఇతర వ్యక్తుల ప్రమేయం లేకుండా ఏ ఒక్కడూ ఉన్నత స్థాయికి ఎదగలేడు. కనీసం బ్రతకలేడు.

ఇది ఎవ్వరూ కాదనలేని నిజం.

మనం ఎంచుకున్న ఫీల్డులో ఉన్నత స్థితికి ఎదగడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంఘంలోని ఎంతోమంది సహకారం - లేదా - ప్రమేయం మనకు తప్పనిసరి.

ఈ వ్యక్తులే మన నెట్ వర్క్.

మన నెట్‌వర్క్ ని బట్టే మనం చేసే పనులు, వాటి ఫలితాలు ఉంటాయి. మన నెట్ వర్క్ లో సరయిన వ్యక్తులు లేకుండా ఫలితాలు మాత్రం సరయినవి కావాలంటే కుదరదు.

మనకు పనికి రాని నెగెటివ్ థింకర్స్, మనల్ని వాడుకుని వదిలేసే ముదుర్లు, మన సహాయంతోనే ఎదిగి, మనల్నే వేలెత్తి చూపే మోసగాళ్లు... ఇలాంటి జీవాలు ఏవయినా ఇప్పటికే మన నెట్‌వర్క్ లో ఉంటే మాత్రం వాటిని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది.

ఇలా చెప్పటం చాలా ఈజీ. కానీ, ఈ జీవుల్ని గుర్తించటానికి కొన్ని అనుభవాలు, కొంత టైమ్ తప్పక పడుతుంది. అయినా సరే, తప్పదు.

ఈ విషయంలో ఎలాంటి మొహమాటాలకు పోయినా జీవితాలే అతలాకుతలమైపోతాయంటే అతిశయోక్తికాదు.

అలాంటి అనుభవాలు నేను చాలా తక్కువగా పనిచేసిన ఒక్క సినీ ఫీల్డులోనే ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది.

కట్ టూ మన నెట్‌వర్క్ - 

ఏ చిన్న పనిలోనయినా సరే, ఎంత చిన్న లక్ష్యమయినా సరే, ఎంతో పెద్ద గోల్ అయినా సరే - సక్సెస్ సాధించాలనుకొనే ప్రతి ఒక్కరూ - తమకు ఉపయోగపడే నెట్‌వర్క్ ను నిరంతరం పెంచుకుంటూ ఉండాలి.

ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్, ఫేస్‌బుక్ ఈ విషయం లో కొంతవరకు ఉపయోగపడతాయి.

ఇంకెన్నో ఉన్నా కూడా, ఇప్పుడు మాత్రం ఈ మూడే బాగా పాపులర్ అని నా ఉద్దేశ్యం.

నేను ఇన్స్‌టాగ్రామ్‌లోకి ఈమధ్యే ఎంటరయ్యాను.

వ్యక్తిగతంగా ఫేస్‌బుక్ మీద నాకు సంపూర్ణంగా విరక్తి వచ్చేసింది. గత అక్టోబర్ నుంచి ఆవైపు వెళ్లటంలేదు.

అయితే ఫేస్‌బుక్‌ను ఎవరైనా అంత ఈజీగా వదలడం కష్టం. అదొక పక్కా "ఊర మాస్" సోషల్ మీడియా సాధనం. భారీ రేంజ్‌లో ఎదైనా ప్రమోట్ చేసుకోవాలనుకొంటే ఫేస్‌బుక్ ఉపయోగపడినంతగా మరేదీ ఉపయోగపడదు. 

ట్విట్టర్, అప్పుడప్పుడూ ఇన్స్‌టాగ్రామ్ ... ఇప్పుడీ రెండే నా సోషల్ మీడియా లోకం.

ఈలోకంలో నేను విహరించేది ఏవో కొన్ని నిమిషాలే.

నెట్‌వర్కింగ్ ఒక్కటే అని కాదు. ఈ కొద్దినిమిషాల సోషల్ మీడియా సంచారం మన రొటీన్ జీవితంలోని రకరకాల ఉరుకులు పరుగుల నుంచి కొంత రిలీఫ్‌నిస్తుంది. ఒక స్ట్రెస్ బస్టర్‌లా కూడా పనిచేస్తుంది.

Please follow me on Twitter! :) 

పేరు + అధికార వ్యామోహం = కల్లోల కాశ్మీర్

కాశ్మీర్ విషయంలో కేవలం దేశంకోసమే .. ఒక లాల్ బహదూర్ శాస్త్రి లాగానో, ఒక ఐరన్ లేడీ ఇందిరా గాంధీలాగానో .. ఓం ప్రథమంగా మన దేశపు తొలి ప్రధాని నెహ్రూ కూడా ఆలోచించి ఉంటే .. భూతల స్వర్గం కాశ్మీర్‌లో పరిస్థితి ఈరోజు ఇలా ఉండేది కాదు.

తాజాగా మొన్నటి పుల్వామా టెర్రరిస్ట్ ఎటాక్‌లో 40 మందికిపైగా మన సీఆర్‌పీఎఫ్ జవానులు అమరులయ్యేవారు కాదు.

తన వ్యక్తిగత ప్రపంచ ఖ్యాతి వ్యామోహం కోసం, వాస్తవ పరిస్థితుల్లో ఏ మాత్రం సాధ్యం కాని "పంచశీల" అనే తన పనికిరాని ఐదు సూత్రాలతో, యునైటెడ్ నేషన్స్‌లో గొప్పలకోసం .. అప్పటి ప్రధాని జవర్‌లాల్ నెహ్రూ తీసుకొన్న అనేక తప్పుడు నిర్ణయాల ఫలితమే ఇప్పటి కల్లోల కాశ్మీర్.

1 జనవరి 1948 నాడు, మనకు చేతకాదు అన్నట్టుగా ఇంకెవడికో పెత్తనం ఇస్తూ ఎప్పుడైతే కాశ్మీర్ వివాదాన్ని నెహ్రూ ఐక్యరాజ్యసమితి ముందు పెట్టాడో .. ఆ రోజునుంచీ కాశ్మీర్ రగులుతూనే ఉంది.

1948 నుంచి, మొన్నటి ఫిబ్రవరి 14 పుల్వామా టెర్రరిస్ట్ ఎటాక్ దాకా .. ఈ రావణకాష్టం ఇట్లా రగులుతూ ఉండటానికి మూలకారణం నెహ్రూనే అని మనలో చాలామంది ఒప్పుకోకపోవడానికి ఇష్టపడరు.

కానీ, చరిత్ర చెప్తున్న నిజం మాత్రం ఇదే.

కట్ చేస్తే - 

కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌తో మనం క్రికెట్ ఆడతాం. వ్యాపారం చేస్తాం. ఆ దేశానికివెళ్ళి విందు వినోదాల్లో పాల్గొంటాం. ఆ దేశపు ఆర్మీ ఆఫీసర్స్‌ను ఆలింగనం చేసుకుంటాం. అప్పుడు మాత్రం మనవాళ్లకు కాశ్మీర్ గుర్తుకు రాదు.

ఆ లోయలో ఆహోరాత్రులు దేశంకోసం, మనకోసం కాపలా కాస్తూ .. అదే పాకిస్తాన్ నేపథ్యపు టెర్రరిస్టుల ఆర్డీఎక్స్ ఎటాక్‌ల్లో తమ దేహాల్ని ముక్కలు ముక్కలుగా త్యాగం చేస్తున్న మన వీరజవాన్లు గుర్తుకురారు.

సిగ్గుపడాలి. చావాలి.   

Monday, 11 February 2019

తెలంగాణలో బయోపిక్‌లు ఎందుకని రావు?

ఒక్క ఎన్ టి ఆర్ మీదనే ఏకకాలంలో మూడు బయోపిక్‌లు తయారయ్యాయి. వాటిల్లో ఒకటి మొన్నీమధ్యే రిలీజయింది. దాని రెండో భాగం త్వరలో రిలీజ్ కాబోతోంది.

క్రిష్ దర్శకత్వంలో ముందు ఒక్క సినిమాకే ప్లాన్ చేసి, తర్వాత దాన్ని రెండు సినిమాలుగా రూపొందించారు. అది వేరే విషయం.

మరోవైపు, దర్శకుడు ఆర్జీవీ "లక్ష్మీస్ NTR" అనే టైటిల్‌తో, అదే ఎన్ టి ఆర్ మీద ఇంకో భారీ బయోపిక్ తీస్తున్నాడు.

దీని ట్యాగ్‌లైన్: 'అసలు కథ' .. టాప్‌లైన్: 'ఇది కుటుంబ కుట్రల చిత్రం!'

ఎన్ టి ఆర్, లక్ష్మీపార్వతిల ప్రేమను సింబాలిక్‌గా తీసుకొని అనుకుంటా .. ప్రేమికులరోజు ఫిబ్రవరి 14 నాడు, ఉదయం 9.27 నిమిషాలకు ఆర్జీవీ తను తీస్తున్న "లక్ష్మీస్ NTR" బయోపిక్ ట్రయలర్ రిలీజ్ చేయబోతున్నాడని ఇందాకే ఒక ట్వీట్ చదివాను.

ఇది సెన్సార్ దగ్గర ఏమవుతుందో ఆ పైనున్న ఎన్ టీ ఆర్ కే తెలియాలి. అసలా చాన్స్ ఎవ్వరికీ ఇవ్వకుండా తన మియా మల్కోవా సినిమాలా దీన్ని కూడా ఆన్‌లైన్‌లోనే రిలీజ్ చేస్తాడా వర్మ అన్నది ఆ సినిమా బడ్జెట్ అంత ప్రశ్న!

మొన్న 8వ తేదీనాడు వైయస్సార్ బయోపిక్ 'యాత్ర' రిలీజైంది. బాగా నడుస్తోంది.

ఒక బయోపిక్ సినిమాగా 'యాత్ర' ను బాగా తీసి, విజయవంతం చేసిన డైరెక్టర్ మహి వి రాఘవ్‌కు  శుభాకాంక్షలు. వైయస్సార్ పాత్రకు మమ్ముట్టిని ఎన్నుకోవడంలోనే మహి తొలి విజయం సాధించాడు.

క్రిష్ తీసిన ఎన్ టి ఆర్ బయోపిక్ మొదటి భాగం బాగుందో లేదో తెలీయదు కాని, బాగా నడవలేదు. భారీ నష్టాలపాలయ్యింది.

ఇంక హిందీలో అయితే లెక్కలేనన్ని బయోపిక్‌లు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి.

త్వరలోనే మన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మీద కూడా ఒక బయోపిక్ రాబోతోందని లేటెస్ట్ న్యూస్.

కట్ చేస్తే - 

తెలంగాణలో ఈ మధ్య మన కేసీఆర్ మీద ఒకట్రెండు బయోపిక్‌లు తీసినట్టుగా చదివాను. అవి రిలీజయ్యాయో లేదో కూడా నాకు తెలియదు. వాటి నిర్మాణ విలువలు పైన చెప్పుకొన్న బయోపిక్‌ల స్థాయికి కనీసం దరిదాపుల్లో కూడా ఉండే అవకాశం లేదు.

దీనికి కారణం ఇక్కడ ఆ టాలెంట్ లేక కాదు.

డబ్బు పెట్టే నిర్మాతలు ఇక్కడ లేక!

ఎవరో ఒకరిద్దరున్నా, వారు కూడా ఎక్కడ, ఏ సినిమాలకు, ఏ హీరోలకు డబ్బు పెట్టాలో అక్కడే పెడతారు.

వారి తప్పేం లేదు.

బిజినెస్!

ప్రస్తుతం తెలంగాణలో "మల్లేశం" బయోపిక్ ఒకటి రెడీ అవుతోంది. చాలా మంచి ప్రయత్నం అది. ఆ సినిమా పూర్తయ్యాక, దాని రిలీజ్ నుంచి పెట్టిన డబ్బులు వెనక్కి తెచ్చుకొనేవరకూ ఆ టీమ్‌కు ఎలాంటి అడ్డంకులు, కష్టాలు రావొద్దని మనస్పూర్తిగా కోరుకొంటున్నాను. 

ఇక్కడి దర్శకుల టాలెంట్ గురించి మనవాళ్లే వాగే వాగుడుకి .. ఈ మధ్య ఎడాపెడా ట్రెండీ సూపర్ డూపర్ హిట్స్‌తో బాగా నిరూపించారు మన తెలంగాణ దర్శకులు. ఇంక దాని గురించి మాట్లాడే అవసరం లేకుండా.

ఆ దర్శకులు కూడా ఆ స్థాయి విజయాలను సాధించడానికి ఎన్ని రిస్కులు తీసుకొని, ఎన్ని కష్టాలు పడ్దారో వారి ఇంటర్వ్యూలే చెప్తాయి.

మామూలు కమర్షియల్ సినిమాలకే అట్లా ఉంటే .. ఇంక బయోపిక్‌లకు ఎవరు పెడతారు మన దగ్గర?

అల్లాని శ్రీధర్ "కొమరం భీమ్" తీయడానికి పడ్ద కష్టాలు ఎవరికి తెలుసు?

ఒక్క ముక్కలో చెప్పాలంటే, తెలంగాణలో దర్శకుల టాలెంట్‌లో 90 శాతం టాలెంట్, వారి విలువైన సమయం .. బడ్జెట్ ఎట్లా అన్న ఆలోచన, ఆ బడ్జెట్‌ను నానా రకాలుగా సమకూర్చుకొనే ప్రయత్నాలతోనే వృధా అవుతుంది.

తెలంగాణ దర్శకుల కష్టాలు ఒక బి నర్సింగరావుకు తెలుసు, ఒక అల్లాని శ్రీధర్‌కు తెలుసు, ఒక రమేష్ రెడ్డి తుమ్మలకు తెలుసు, ఇంకా .. ఇలాంటి చాలా మందికి తెలుసు. వారిలో ఎక్కడో ఒక మూలన మనోహర్ చిమ్మని కూడా ఉంటాడు.

సినిమా అంటే కోట్లు కుమ్మరిస్తారు. కోట్లు సంపాదిస్తారు.

ఆ దమ్ము ఇక్కడ లేదు.

ఇంక బయోపిక్‌ల కోసం వాళ్లలా ఒక్కో సినిమాకు 50, 60 కోట్లు మనవాళ్లెప్పుడు పెట్టాలి? 

Wednesday, 6 February 2019

ప్యూన్ ఉద్యోగాలకు పీహెచ్‌డీ అభ్యర్థులు!

62 ప్యూన్ ఉద్యోగాలు పడ్డాయి.

అదీ పోలీస్ డిపార్ట్‌మెంట్లో.

ఈ 62 మెసెంజర్-కమ్-ప్యూన్ ఉద్యోగాలకు రికార్డ్ స్థాయిలో 93,000 మంది నిరుద్యోగులు అప్లైచేసుకున్నారు.

ఎంతమంది అప్లై చేసుకున్నా తప్ప్పులేదు.

కానీ, ఈ 93,000 మందిలో -
3,700 మంది పీహెచ్‌డీ చేసినవాళ్లున్నారు.
28,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లున్నారు.
50,000 మంది గ్రాడ్యుయేట్లున్నారు.

ఈ ప్యూన్ ఉద్యోగానికి కావల్సిన రెండే రెండు ప్రాథమిక అర్హతలు ఇవి:
1. సైకిల్ తొక్కడం రావాలి.
3. 5వ తరగతి చదువుకొని వుంటే చాలు.

ఎక్కువమంది అప్లై చేసుకున్నారు కాబట్టి ఇప్పుడా ప్యూన్ ఉద్యోగాల సెలెక్షన్స్‌కు నానా రకాల టెస్టులు పెడుతున్నారు పోలీస్ డిపార్ట్‌మెంట్‌వాళ్లు.

కట్ చేస్తే - 

ప్యూన్ ఉద్యోగం అంటే 'చేయకూడని ఉద్యోగం' ఏమీ కాదు.

ఏ పని విలువ దానిదే.

కాకపోతే, '5 వ తరగతి చదివితే చాలు' అనే స్థాయి ఉద్యోగాలు చేయడం కోసం పీహెచ్‌డీలు, పీజీలు, డిగ్రీలు చేయాల్సినపనిలేదు.

గవర్నమెంటుకు నష్టం. మనకూ నష్టమే.

డబ్బూ, సమయం కూడా ఎంతో వృధా.

నిజానికి .. తిట్టాల్సింది 71 ఏళ్లుగా మన దేశాన్ని పాలించిన ప్రభుత్వాలను, ఆయా ప్రభుత్వాల్లో పనిచేసిన విద్యామంత్రిత్వ శాఖలను. మొత్తంగా మనవాళ్ళు అస్సలు పట్టించుకోని మన విద్యా వ్యవస్థని.

అభివృధ్ధి చెందిన దేశాల్లో .. స్కూలు స్థాయినుంచే చదువుకొంటూ పనిచేసుకొని డబ్బులు సంపాదించుకొనేట్టుగా అలవాటుచేసే ఒక డిసిప్లిన్ అక్కడి విద్యావ్యవస్థల్లో ఉంది.

'డిగ్నిటీ ఆఫ్ లేబర్' ఆయా దేశాల్లో ఉంది.

ఎవరు ఏ క్షణమైనా చదువు మానేసి, తమకు ఇష్టమైన పని చేసుకొని బ్రతకగలిగే ఆత్మవిశ్వాసాన్ని అక్కడి విద్యావ్యవస్థలు అందిస్తున్నాయి.

బిల్ గేట్స్‌లూ, జకెర్‌బర్గ్‌లూ అలాగే తయారయ్యారు. గవర్నమెంట్ ఉద్యోగాలకోసం ముసలోళ్లు అయ్యేదాకా ఎదురుచూస్తూ వారి సమయం వృధాచేసుకోలేరు.

మరిక్కడ .. మనదగ్గరో?

సిగ్గుపడాలి ...

71 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా ఒక దేశం ఇంకా "అభివృధ్ధిచెందుతున్న దేశం" గానే ఉంది.

ప్యూన్ ఉద్యోగాలకు పీహెచ్‌డీ చేసినవాళ్లు కూడా అప్లై చేసుకొంటున్నారు ... 

ఉద్యోగం అంటే కేవలం గవర్నమెంట్ ఉద్యోగమే కాదన్న కామన్‌సెన్స్ ఇవ్వలేని మన విద్యావ్యవస్థ ఇంకా అలాగే కొనసాగుతోంది.

కట్ చేస్తే - 

ఈ 62 ప్యూన్ ఉద్యోగాలు పడింది ఎక్కడో చెప్పలేదు కదూ?

ఉత్తరప్రదేశ్‌లో.