Monday, 11 January 2016

సినిమా స్క్రిప్టు రచనాశిల్పం - 1

నేను రాసిన "సినిమా స్క్రిప్టు రచనాశిల్పం" పుస్తకం అప్పట్లో హాట్‌కేక్‌లా 5 వేల కాపీలు అమ్మటం జరిగింది. తర్వాతనే నేను డైరెక్టర్ అయ్యాను. ఆ అనుభవంతో పుస్తకాన్ని రివైజ్ చేసి మళ్లీ ప్రింట్ చేయొచ్చులే అనుకున్నాను. కానీ, నాలుగు సినిమాలు పూర్తయినా ఆ పని చేయలేకపోయాను ఈ రోజువరకూ!

కట్ టూ జిరాక్స్-

నవోదయ, విశాలాంధ్రవాళ్లు ఎన్నిసార్లు అడిగినా నేను మళ్లీ వేయలేకపోయిన నా పుస్తకాన్ని - ఫిలిం నగర్ కాంప్లెక్స్‌లో ఉన్న జిరాక్స్ సెంటర్‌లో బాహాటంగానే జిరాక్స్ కాపీలుగా అమ్మారు. నేనూ ఒక కాపీ కొనుక్కున్నాను .. ఆ విషయం నిజమే అని తెలుసుకోడానికి!

అయితే నేనే ఆ పుస్తక రచయితనని ఆ జిరాక్స్ షాప్ వాళ్లకు తెలీదు. నేనా పుస్తకం రాసిందే చదవటం కోసం కాబట్టి - అలా అమ్మడం నాకు సంతోషంగానే అనిపించింది. కాపీరైట్ చట్టప్రకారం అది నేరమే అయినా!

కట్ టూ ఫిల్మ్ స్కూల్ - 

నా పుస్తకాన్ని దేవదాస్ కనకాల గారి ఫిల్మ్ ఇన్స్‌టిట్యూట్‌లో చేరిన విద్యార్థులకు ఒక కాపీ ఇచ్చేవారట .. విధిగా చదివితీరాలని! థాంక్స్ టూ దేవదాస్ కనకాల గారు ..

కట్ టూ వి ఏ కె - 

సుప్రసిధ్ధ "సకలకళావల్లభులు" వి ఏ కె రంగారావు గారు నా పుస్తకం చదివి నాకు ఉత్తరం రాశారు. 5 కాపీలు తీసుకున్నారు, తనకు తెలిసినవాళ్లకు ఇవ్వడానికి. ఆ తర్వాత మేము చెన్నైలోని వారి ఇంట్లో మూడునాలుగు సార్లు కలిశాము. ఆప్యాయంగా నా చేత "తాతా" అని పిలిపించుకున్నారు. వారింట్లో ఉన్న వేలాది గ్రాంఫోన్ రికార్డులు, పుస్తకాల మధ్య కూర్చుని తాత గారిని నేను ఇంటర్వ్యూ కూడా చేశాను. ఆ క్యాసెట్ నా దగ్గర ఇంకా ఉంది. వారి మీద ఓ పెద్ద ఆర్టికిల్ కూడా రాశాను.    

కట్ టూ ఫినిషింగ్ టచ్ -

స్క్రిప్ట్ రైటింగ్ పైన రాసిన నా ఈ పుస్తకం వచ్చాక - అప్పటిదాకా ఈ అలోచనే రాని పెద్ద సినీ రచయితలు ఇలాంటిదే ఓ పుస్తకం రాసి పబ్లిష్ చేశారు. అదంతగా పాపులర్ అవ్వలేదు. మరికొందరు చవకబారు రైటర్స్ ఈ పుస్తకాన్ని కాపీ కొట్టి కూడా బుక్స్ రాశారు. ఆఖరుకు టైటిల్ కూడా దగ్గర దగ్గరగా ఉండి పాఠకులని మిస్ లీడ్ చేసే రేంజ్‌లో!    

ఈ విశేషాలన్నీ నాకు ఆనందాన్నే ఇచ్చాయి. ఎందుకో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను. 

Sunday, 10 January 2016

ఒక్క ఛాన్స్!

ఇది ఇండస్ట్రీలో చాలా పాపులర్ డైలాగ్.

డైలాగ్ ఓకే. కానీ ఛాన్స్ మాత్రం అంత ఈజీ కాదు. అందుకే ఈ డైలాగ్‌కు అంత పాపులారిటీ!

పెద్ద హీరోల, పెద్ద డైరెక్టర్ల, భారీ బ్యానర్ల సినిమాల డిక్షనరీల్లో ఈ "ఒక్క ఛాన్స్" అనే పదం అసలు ఉండదు. వీళ్లు తీసే అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ఎంత చిన్న పాత్రకైనా సరే కొత్తవాళ్లను తీసుకొనే రిస్క్ తీసుకోరు. అంత అవసరం వాళ్లకు లేదు.

చాలా అరుదుగా, సంవత్సరానికి వేళ్లమీద లెక్కించగలిగిన ఏ ఒకటో రెండో భారీ సినిమాల్లో మాత్రం కొన్ని వెరైటీ క్యారెక్టర్ల కోసం కొత్త ఆర్టిస్టులను పరిచయం చేస్తారు. అలా ఒక్క ఛాన్స్ కొట్టేసినవాడు మాత్రం నిజంగా లక్కీ ఫెలో! భారీ సినిమా, భారీ ప్రమోషన్స్ ఉంటాయి కాబట్టి - సినిమా హిట్టయినా, ఫట్టైనా .. ఆ ఒక్క ఛాన్స్‌తోనే మన కొత్త ఆర్టిస్టు దాదాపు ఎస్టాబ్లిష్ అయిపోతాడు.

చిన్న బడ్జెట్ సినిమాల విషయంలో అలాకాదు. బడ్జెట్‌లు తక్కువగా ఉండటంవల్ల, తప్పనిసరి పరిస్థితుల్లో - కొంతమంది అప్‌కమింగ్ ఆర్టిస్టులతో, కొంతమంది కొత్త ఆర్టిస్టులతో సినిమాలు తీస్తారు.

కొత్త ఆర్టిస్టులు ఎక్కువగా ఛాన్స్ కొట్టేసేది ఈ చిన్న బడ్జెట్ సినిమాల్లో మాత్రమే!

కానీ - వీటికీ ఓ లిమిట్ ఉంటుంది. ఒక సినిమాలో సగటున ఓ 12 మందిని మించి ప్రధాన కేరెక్టర్లు ఉండే అవకాశంలేదు. ఆ 12 మందిలో సగం మంది అప్‌కమింగ్ వాళ్లను తీసుకున్నా, మిగిలిన సగం మందిని కొత్తవాళ్లను తీసుకుంటారు.

ఈ బ్యాగ్రౌండ్ అంతా తెలియకుండా - ప్రతి కొత్త ఆర్టిస్టూ ఆవేశపడుతుంటాడు/పడుతుంది. ఆ ఒక్క ఛాన్స్ తనకొస్తే తఢాఖా చూపించేవాన్నని/దాన్నని ఆ కొత్త ఆర్టిస్టు అభిప్రాయం.

వాస్తవానికి, ఇలా టాలెంట్ ఉన్న ఎందరో వందల్లో ప్రతిరోజూ సినిమా ఆఫీసులచుట్టూ తిరుగుతుంటారు. కానీ, వారిలో ఏ ఒకరిద్దరినో మాత్రమే అదృష్టం వరిస్తుంది.

అలాగని సెలెక్టుకాని ఆర్టిస్టుల్లో టాలెంట్ లేదని కాదు. ఆయా డైరెక్టర్ల స్క్రిప్టుకు వారు సరిపోలేదని మాత్రమే అనుకోవాలి. ప్రయత్నాలు మళ్ళీ షురూ చేయాలి. అదే ఒక్క ఛాన్స్ కోసం ..

కట్ టూ అమిత్ కుమార్ - 

నేనిప్పటివరకు నా సినిమాల్లో చాలామంది కొత్త ఆర్టిస్టులను, టెక్నీషియన్లను పరిచయం చేశాను. వాళ్లల్లో చాలామంది తర్వాత చాలా సినిమాల్లో మంచి అవకాశాల్ని పొందారు. బాగా పాపులర్ అయ్యారు కూడా.

భారీ సినిమాల్లో కూడా మీరిప్పుడు చూసే ప్రముఖ విలన్ అమిత్ కుమార్ ను నా తొలి చిత్రం "కల"లో నేనే పరిచయం చేశాను.   

Saturday, 9 January 2016

ఇదీ లెక్క!

ఆర్టిస్టుగా కానీ, టెక్నీషియన్‌గా కానీ సినీ ఫీల్డులోకి ఎంటర్ కావాలనుకొనేవారు ముందుగా తెల్సుకోవాల్సిన లెక్క ఒకటుంది.

అదేంటంటే -

ఫీల్డులోకి ప్రవేశించాలనుకొని ఫిలిమ్‌నగర్‌కు వచ్చే ప్రతి 1000 మందిలో కేవలం ఒక 10 మందికి మాత్రమే అవకాశం దొరుకుతుంది.

అదీ ఎంతో కష్టంగా!

ఆ పదిమందిలో కూడా - ఏ ఒక్కరికో ఇద్దరికో మాత్రమే క్లిక్ అయ్యే అవకాశం లభిస్తుంది. వాళ్లే ఫీల్డులో కొద్దిరోజులు నిలబడగలుగుతారు. ఎందుకలా అంటే .. దాని లాజిక్కులు దానికున్నాయి.

సంవత్సరానికి ఎన్ని సినిమాలు తీస్తారు?
వాటిలో కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చే సినిమాలు ఎన్నుంటాయి?
ఆ సినిమాల్లో ఎంతమందికని అవకాశం ఇవ్వడం వీలవుతుంది?

ఒక్క టాలీవుడ్‌లోనే కాదు. ఏ వుడ్డులోనయినా ఇదే లెక్క!

ఎవరిలో ఎంత టాలెంట్ ఉందని అనుకున్నా, నిజంగా ఉన్నా .. వాస్తవం మాత్రం ఇదే. ఈ వాస్తవాన్ని ఎదుర్కొనే దమ్మున్నవాళ్లకే సినీఫీల్డు స్వాగతం పలుకుతుంది.

మరి మీలో ఆ దమ్ముందా?!

కట్ టూ సోక్రటీస్ - 

ఈ మహా తత్వవేత్త చెప్పిన ఒక మాట ఈ సందర్భంగా కోట్ చెయ్యాలనిపిస్తోంది:

"నిన్ను నువ్వు తెల్సుకో!" 

Wednesday, 6 January 2016

ఇండస్ట్రీ చాలా విచిత్రమైంది!

తెలుగు సినిమా ఇండస్త్రీ కి సంబంధించి నా లక్ష్యం చాలా చిన్నది. ఎన్నో చోట్ల, ఎన్నో విషయాల్లో ఎదురులేకుండా ముందుకు సాగిన నేను ఇక్కడ మాత్రం ఒక అతి చిన్న లక్ష్యాన్ని సాధించలేకపోయాను.

ఇట్ ఫీల్స్ రియల్లీ రియల్లీ బ్యాడ్. చాలా సార్లు.

కాని, ఇది ఫెయిల్యూర్ అని నేను అనుకోను. నిజానికి, మన ఫెయిల్యూర్ని నిర్ధారించేది బయటివారు కూడా కాదు. మనమే. మనం స్వయంగా అనుకున్నపుడే అది ఫెయిల్యూర్.

మనం ఒక లక్ష్యం అనుకొంటాం. ఆ లక్ష్యాన్ని చేరుకొనే దిశలో ఎన్నో ఢక్కా మొక్కీలు తినాల్సివస్తుంది. వాటివల్ల మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడం ఇంకా ఆలస్యం అవుతుండవచ్చు. అంత మాత్రాన మనం ఓడిపోయాం అనే ఎందుకు అనుకోవాలి? లక్ష్యాని సాధించే క్రమంలో ఒక్కో స్టేజిలో ఒక్కో ఛాలెంజ్ ను ఎదుర్కొంటూ ముందుకే వెళ్తున్నాం అని ఎందుకు అనుకోకూడదు?

కట్ టూ ఇండస్ట్రీ - 

ఇండస్ట్రీ నిజంగా చాలా విచిత్రమైంది. ఇక్కడ అనుకునేది ఒకటి. జరిగేది మరొకటి. ఇందుకు కారణాలు ఏవైనా కావొచ్చు. ఎవరైనా కావొచ్చు. కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే ఈ 'అన్ సర్టేనిటీ' అనే ఒక్క కారణం వల్ల - ఇక్కడ చాలా మంది చెప్పేది ఒకటి, చేసేది ఒకటిలా కనపడుతుంది.  

వాస్తవాలు వేరు. అవి అందరికీ తెలియవు. అనుభవించినవాళ్లకే తెలుస్తాయి.

లక్ష్యం విషయం ఎలా ఉన్నా .. ఇండస్ట్రీ నేపథ్యంగానే నాకు కొన్ని తక్షణ బాధ్యతలు, అవసరాలున్నాయి. ఆ దిశలో నేను ముందుకే వెళ్తున్నాను.     

Sunday, 3 January 2016

ఫేస్‌బుక్‌తో బుక్కైపోతే ఎలా?

ఫేస్‌బుక్‌తో ఉన్నట్టుండి నాకు 2 సమస్యలు కనిపిస్తున్నాయి:

1. ప్రస్తుతం సినీఫీల్డులో ఉన్నాను కాబట్టి ఇష్టం ఉన్నా, లేకపోయినా రోజూ ఓ అరగంటైనా ఫేస్‌బుక్ కు కెటాయించి ఏదో ఓ 'స్టఫ్' పోస్ట్ చేయక తప్పదు నాకు. తప్పనిసరి కూడా.

2. నా పోస్టులను, ఫోటోలను చూసి - "వీడికేం తక్కువ. అంతా బానే ఉంది" అన్న పాయింటాఫ్ వ్యూలో .. సరిగ్గా ఏదైనా చాలా ముఖ్యమైన పనో, మీటింగో ఉన్నప్పుడే .. నేనూహించని విధంగా, ఊహించని మిత్రులు శ్రేయోభిలాషులనుండి పర్సనల్‌గా భారీ రేంజ్‌లో నానా రియాక్షన్స్ వస్తున్నాయి.

ఇదంతా చూసాక ఒకటనిపిస్తోంది ..

సినిమా పనిలో ఉన్నపుడే ఫేస్‌బుక్ యాక్టివేట్ చేసి, మిగిలిన టైమ్‌లో డీయాక్టివేట్ చేస్తే ఎలా ఉంటుందీ అని!?

కట్ చేస్తే - 

రేపు ఏదో ఒక టైమ్‌లో నా ఫేస్‌బుక్ డీయాక్టివేట్ అయిపోవచ్చు!

Thursday, 31 December 2015

2015 .. ఇప్పుడొక జ్ఞాపకం!

చాలా గ్యాప్ తర్వాత డైరెక్టర్‌గా మళ్లీ  ఒక సినిమా తీసి రిలీజ్ చేశాను. అదీ - ఇండియా, యు కె ల్లో.

స్విమ్మింగ్‌పూల్!

శ్రీ శ్రీ మూవీ క్రియేషన్స్, శ్రీ శ్రీ ఇంటర్నేషనల్ అధినేత అరుణ్ కుమార్ గారి సంకల్పం, సహకారం నాకు ఈ విషయంలో బాగా తోడ్పడ్డాయి.

స్విమ్మింగ్‌పూల్ రిలీజ్ తేదీని 40 రోజులముందే ప్రకటించాను. మాకున్న పరిమిత రిసోర్సెస్‌తోనే - ఆ తేదీకే - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో భారీగానే రిలీజ్ చేశాను. ఇది చిన్న సినిమాల విషయంలో అంత ఈజీ కాదు. ఆమాటకొస్తే, కోట్లు పెట్టి తీసిన  సినిమాలు కూడా ఎన్నో అసలు రిలీజ్‌కు నోచుకోక ఇంకా అలా పడిఉన్నాయి. అది వేరే విషయం.

ఈ అనుభవంతో నా తర్వాతి సినిమా రిలీజ్ డేట్‌ను షూటింగ్ ప్రారంభం రోజే ప్రకటించగల ఆత్మవిశ్వాసం నాలో మరింతగా పెరిగింది.

సినిమా హిట్టా, ఫట్టా అన్నది ఓ పెద్ద సబ్జెక్టు. దాన్ని గురించి ఇక్కడ చర్చించడంలేదు. దాని వెనక ఎన్నో కారణాలుంటాయి. ఎప్పుడూ ట్రాక్‌మీద లైవ్‌గా లైమ్‌లైట్‌లో ఉండటం అనేది చాలా ముఖ్యం. అది ఈ సినిమాతో నేను సాధించగలిగాను.

కట్ టూ ది అదర్ సైడ్ ఆఫ్ సినిమా - 

వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, ఆర్థికంగా .. సమస్యలూ, సంఘర్షణ సమాంతరంగా 2015 అంతా వెంటాడాయి. షోబిజినెస్ కాబట్టి అంతా బాగున్నట్టే ఉండాలి. ఉన్నాను. దటీజ్ సినిమా! ఈ విషయంలో కొందరు స్నేహితులు, శ్రేయోభిలాషులకు ఇబ్బంది కలిగించాను. సినీఫీల్డులో ఎప్పుడూ ఉండే అనిశ్చితి వల్లనే తప్ప ఇది కావాలని చేసింది కాదు అని వారికీ తెలుసు. అయినా - బాధ్యత బాధ్యతే.

జీవితంలో ఏ తప్పైనా చేయొచ్చు కానీ, అప్పు మాత్రం చేయకూడదన్న వాస్తవాన్ని 2015 లో మరింత బాగా అర్థం చేసుకోగలిగాను. కానీ, భారీ సక్సెస్‌లు ఇచ్చిన పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లకే ఇది తప్పలేదు. నేనెంత!

కట్ బ్యాక్ టూ సినిమా - 

స్విమ్మింగ్‌పూల్ సినిమా విషయంలో నా సినిమాటోగ్రాఫర్ మిత్రుడు వీరేంద్రలలిత్, హీరో అఖిల్ కార్తీక్, ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్లంతా నాకు బాగా సహకరించారు.

ప్రదీప్‌చంద్రను స్విమ్మింగ్‌పూల్ చిత్రం ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేయడం వ్యక్తిగతంగా నాకెంతో సంతృప్తినిచ్చిన విషయం.

మా రష్యన్ ప్రొఫెసర్ మాధవ్ మురుంకర్, కామేశ్వర రావు, కె జె దశరథ్, శీను6ఫీట్, ఐశ్వర్య, బ్రాహ్మిణి లతోపాటు హీరోయిన్ ప్రియ వశిష్టను ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేశాను. రష్యన్ ఇంటర్నేషనల్ మోడల్ కాత్య ఐవజోవాను ఈ చిత్రం ద్వారా ఐటమ్ డాన్సర్‌గా పరిచయం చేశాను.

ఈ సినిమాలో నటించిన మిత్రుడు 'జబర్దస్త్' రచ్చ రవి, ఈ సినిమా రిలీజ్ తర్వాతవరకు కూడా ఇచ్చిన కోపరేషన్ గురించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించడం నా బాధ్యత.

అలాగే, యు ఎస్ లో నా ఆత్మీయ మిత్రుడు సదానందం భరత నా కోసం, ఈ సినిమాకోసం చాలా శ్రమ తీసుకోవడం మరో గొప్ప విశేషం.    

దాదాపు ఒక దశాబ్దం క్రితం నేను కోల్పోయిన క్రియేటివ్ ఫ్రీడమ్‌ను తిరిగి సంపాదించుకొనే క్రమంలో మొన్నటి స్విమ్మింగ్‌పూల్ సినిమా నా ఫస్ట్ స్టెప్ గా భావిస్తున్నాను. 2016 లో ఈ పరంపర ఇక మరింత వేగంగా కంటిన్యూ అవుతుంది.

అయితే - సినిమా ఒక్కటే జీవితం కాదు. సినిమా అవతల కూడా లైఫ్ ఉంది. ఆ లైఫ్ కూడా చాలా ముఖ్యం అన్న వాస్తవం ఎప్పుడూ వాస్తవమే. ఈ వాస్తవాన్ని నేను అశ్రధ్ధ చేయదల్చుకోలేదు. మర్చిపోదల్చుకోలేదు.  

Wednesday, 23 December 2015

ఫేస్ లేని ఫేస్‌బుక్ ఫ్రెండ్స్!

జకెర్‌బర్గ్ పెట్టిన లిమిట్ 5000 టచ్ అయ్యాక గానీ తెలియలేదు .. ఫేస్‌బుక్ లో ఫ్రెండ్స్ ఎంత తక్కువుంటే అంత మంచిదని!

ఏదో .. యాడ్ రిక్వెస్ట్ పెట్టినవాళ్లెందరినీ ఏమాత్రం ఆలోచించకుండా, వారిని డిసప్పాయింట్ చెయ్యలేక, యాడ్ చేసుకున్నాను.

కానీ, చాలా చిత్రమైన ఎక్స్‌పీరియన్స్ అది.

కొన్ని ఫ్రెండ్ రెక్వెస్టులొస్తాయి. సమ్ సుబ్బారావ్ అని పేరుంటుంది. అక్కడ ప్రొఫైల్ ఫోటోలో, కవర్ ఫోటోలో మాత్రం ఏ ప్రభాసో, పవన్ కల్యాణో ఉంటాడు! కొందరి పేర్లు అసలు ఉండటమే చిత్రంగా ఉంటాయి. న్యూటన్, టింగ్ టాంగ్, టఫ్ గై, బులెట్ కిక్ .. ఇలా ఉంటాయి. ప్రొఫైల్ ఫోటోలో ఏ విప్లవకారుడో, ఇంకే అర్థంలేని ఫోటోనో, అసలు ఫేస్ కనిపించని ఫోటోనో ఉంటుంది.

ఇక కొందరు ఆడాళ్లు, అమ్మాయిల విషయం మరీ గమ్మత్తుగా ఉంటుంది. వీరిలో దాదాపు 90% పేర్లు నిజం కావనిపిస్తుంది. హరి హరిణి, సిని హాసిని, సుని సునీత, ఆ పండు, ఈ పండు .. ఇలా ఉంటాయి పేర్లు. ప్రొఫైల్ పిక్చర్లో సమంత, నందిత, రకుల్‌ప్రీత్ ఉంటారు!

తమ ఐడెంటిటీని ఓపెన్‌గా చెప్పుకోలేని ఇలాంటి ఎఫ్ బి ఫ్రెండ్స్ "ఎబౌట్"లో కూడా ఏముండదు. జస్ట్ శూన్యం!

ఎవరో ఏంటో తెలీని ఇలాంటి ఫోర్స్‌డ్ ఎడాలిసెంట్స్ అసలు మన ఫేస్‌బుక్‌లో అవసరమంటారా?

5000 టచ్ అయ్యాకగానీ ట్యూబ్‌లైట్ వెలగలేదు .. :) 

Saturday, 12 December 2015

తెలుగు ఇండస్ట్రీ, 2 స్కూళ్లు!

ఓ గుప్పెడు టాప్‌స్టార్స్, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు .. వారి కుటుంబాలు, వారసులు. ఇదొక స్కూలు. ఈ స్ఖూల్లో ఎవరికి వాళ్లకే ఫిక్స్‌డ్‌గా లాబీలుంటాయి. ఆ లాబీలు దాటుకొని ఓ కొత్త డైరెక్టర్ ఈ స్కూళ్లోకి ప్రవేశించడం చాలా అరుదు. అసాధ్యం. ఈ స్కూల్‌తో సంబంధం లేకుండా బయట ఏదయినా పెద్ద హిట్ ఇచ్చినప్పుడే ఇక్కడ కొత్తవాళ్లకు ఎంట్రీ సాధ్యమౌతుంది.

ఇది పక్కా ట్రెడిషనల్ స్కూల్.

రెండో స్కూల్ పూర్తిగా ఇండిపెండెంట్ స్కూల్. ఆర్‌జివి, శేఖర్ కమ్ముల లాంటి డైరెక్టర్లు ఈ కేటగిరీలోకొస్తారు. ఎవరినో దృష్టిలో పెట్టుకొని కాకుండా, అనుకున్నట్టుగా సినిమా తీస్తూ వీళ్లకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటారు.

ఇది పూర్తిగా ఒక అన్‌ట్రెడిషనల్ స్కూల్.

వీళ్లు క్రియేట్ చేసుకున్న బ్రాండ్‌ని బట్టి వీళ్లకు అప్పుడప్పుడూ ట్రెడిషనల్ స్కూల్లోని హీరోలు, నిర్మాతలతో సినిమాలు తీసే అవకాశముంటుంది.

కట్ టూ నా స్కూల్ -

హీరోలకోసం ప్రత్యేకంగా రాసుకొన్న బౌండెడ్ స్క్రిప్టులు చంకలో పెట్టుకొని, ఎలాంటి గ్యారంటీలేని ఈ ట్రెడిషనల్ స్కూళ్ల చుట్టూ ఏళ్లతరబడి తిరగడం నాకు కుదరని పని. ఎందుకంటే సినిమానే నా జీవితం కాదు. దాన్ని మించిన జీవితం బయట ఎంతో ఉంది.

సినిమాలపట్ల అమితమైన ప్యాషన్ ఉన్న కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, నిర్మాతలను నేనే క్రియేట్ చేసుకుంటాను. వారికోసం నా అన్వేషణ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అలా అన్నీ కుదిరినప్పుడే సినిమా తీస్తాను.

తక్కువ బడ్జెట్‌లో, అతి తక్కువ షూటింగ్ డేస్‌లో సినిమా తీసి క్లిక్ కావడమే నాకిష్టం. చెప్పాలంటే - కొంచెం అంట్రెడిషనల్, కొంచెం అగ్రెసివ్ కూడా.

ఇదే నా స్కూల్ ..   

Friday, 11 December 2015

9 మినిట్ బ్లాగింగ్!

ఇకనుంచీ నా బ్లాగ్‌పోస్టుల్లో అనవసరపు "ఇంట్రో"లుండవు. "కట్ టూ"లుండవు. ఉంటే గింటే ఒకే ఒక "కట్ టూ" ఉంటుంది. దాంతర్వాత ఒకే ఒక్క వాక్యంలో బ్లాగ్ పోస్ట్ ముగుస్తుంది. అంటే - ఓ రకంగా - అది "కట్ టూ ఫినిషింగ్" అన్నమాట!

అరుదుగా ఎప్పుడో ఒకసారి భారీ సైజులో నేనేదైనా బ్లాగ్ పోస్ట్ రాయొచ్చుగానీ, ఇకనుంచీ నా బ్లాగ్ పోస్టులన్నీ సుమారు 10-12 లైన్లలోనే  "టిడ్‌బిట్స్" సైజులో ఉంటాయి.

మినీ బ్లాగ్ పోస్టులన్నమాట!

నేను సినిమాల్లో ఉన్నంతకాలం, "నగ్నచిత్రం"లో పోస్టులన్నీ దాదాపు సినిమాలకు, క్రియేటివిటీకి సంబంధించినవే అయ్యుంటాయి.

ఈ 9 మినిట్ బ్లాగింగ్ గురించి అప్పట్లో అనుకున్నానుగానీ, కొనసాగించలేకపోయాను. కానీ, ఇప్పుడు నేనే దీన్ని తప్పనిసరి చేసుకుంటున్నాను.

ఏదో ఒకటి రాసే నాకత్యంత ప్రియమైన హాబీని నేనే కిల్ చేసుకోదల్చుకోలేదు.

రాయడం అనేది ఒక ఎడిక్షన్ నాకు. ఒక రిలాక్స్. ఒక రిలీఫ్. ఒక మెడిటేషన్. ఒక ఆనందం.

సో, బ్యాక్ టూ మై 9 మినిట్ బ్లాగింగ్ ..  

Wednesday, 11 November 2015

నా బ్లాగింగ్ ఎందుకు స్లో అయ్యింది?

ఏదో కొంచెం స్లో అవుతుందనుకున్నాను కానీ, మరీ ఇంతలా నెలకు కేవలం ఓ 5, 6 పోస్టుల స్థాయికి పడిపోతుందనుకోలేదు!

నా కొత్త సినిమాల ప్లానింగ్, మీటింగ్స్, అగ్రిమెంట్లు, కమిట్‌మెంట్లు వంటి అన్నో అతిముఖ్యమైన పనుల్లో పూర్తిగా మునిగిపోయి పిచ్చి బిజీగా ఉంది లైఫ్.

కట్ టూ నాణేనికి మరోవైపు - 

పైన చెప్పిన బిజీ షెడ్యూల్ కారణంగానే నిజంగా ఏమీ రాయలేకపోతున్నానా? నాకెంతో ఇష్టమైన ఒక హాబీని, థెరపీని నిర్లక్ష్యం చేస్తున్నానా?

దీన్ని కేవలం ఒక 10 శాతం కారణంగానే నేను ఒప్పుకుంటాను.

ఎన్ని వ్యక్తిగతమైన, ఆర్థిక, వృత్తిపరమైన వత్తిళ్లు ఉన్నా - ఒక మెడిటేషన్ ప్రక్రియలా కనీసం ఓ పది నిమిషాలు ఏదో ఒకటి రాయగల శక్తి, ఓపిక, ఇష్టం నాకున్నాయి.

అయినా ఆ పని చేయటంలేదు, చేయలేకపోతున్నాను అంటే ఇంకేదో కారణం ఉండాలి.

ఉంది.  

2016 చివరివరకు, ఎన్ని వీలైతే అన్ని ఫీచర్ ఫిలిం ప్రాజెక్టులను సెట్ చేసుకుంటున్నాను. వచ్చే 365 రోజులూ చాలా చాలా బిజీగా ఉండేట్టు చూసుకుంటున్నాను.

ఈ స్టేజ్‌లో ఇప్పుడిది చాలా అవసరం నాకు.

నాకున్న అతికొద్దిమంది ఆత్మీయ మిత్రులలో ఒకరిద్దరితో నాకున్న ఒకటిరెండు కమిట్‌మెంట్‌లు, నా కుటుంబం, నా బాధ్యతలు, నా వ్యక్తిగత క్రియేటివ్ ఫ్రీడమ్ - ఇప్పుడు ప్రతి క్షణం నా ఫోకస్ అంతా ఇదే.

వీటి మీదే.

ఇదే ఆర్డర్‌లో.

ఈ ఫోకస్‌ను పక్కనపెట్టి ఒక పది నిమిషాలు బ్లాగ్ రాసినా, దానికొక ప్రయోజనం ఉండాలి. ఆ ప్రయోజనం నా ఫోకస్‌తో కనెక్ట్ అవ్వాలి. అందుకే ఈ మధ్య నేను బ్లాగ్ రాయడం చాలా స్లో అయ్యింది.

నా ఫేస్‌బుక్ టైమ్‌లైన్‌లో చాలా కొటేషన్లు, పోస్ట్‌లు నాకోసం నేను పోస్ట్ చేసుకున్నట్తే .. ఈ బ్లాగ్ పోస్ట్ కూడా నాకోసం నేను రాసుకున్నది.

ఇది సంజాయిషీ కాదు. స్వీయ అంతరంగ విశ్లేషణ.