Monday, 4 March 2019

టీ ఆర్ పీ మీడియా

ఇది అభినందన్ ఇంకా పాక్ కస్టడీలోనే ఉన్నప్పటి విషయం ...

అక్కడ పాకిస్తాన్‌లో ఆర్మీ కస్టడీలో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్‌ను "ఇండియాలో నీదే ప్రాంతం?" అని ప్రశ్నించారు.

"నేనది చెప్పకూడదు" అని ఎలాంటి భయంలేకుండా జవాబును దాటవేశాడు అభినందన్.

శతృదేశం చెరలో, అంత భయంకరమైన సిచువేషన్లో ఉండి కూడా!

కట్ చేస్తే - 

"ప్రస్తుతం మేము ఎక్కడున్నామో మీకు తెలుసా? చెన్నైలో, మన వింగ్ కమాండర్ అభినందన్ ఇంటి గేటు దగ్గరున్నాం. ఇదే పాకిస్తాన్ చెరలో ఉన్న మన అభినందన్ ఇల్లు. ఈ ఇంట్లో వాళ్ల అమ్మ, నాన్న ఉంటారు. అభినందన్ భార్య, కొడుకు ఢిల్లీలో ఉంటారు. అతని భార్య ..."

ఇదీ కామన్‌సెన్స్ లేని మన మీడియా జోష్!

ఒక బాధ్యతగల జవాన్‌గా అభినందన్ దాచిపెట్టిన విషయాన్ని, మన దేశపు 101 న్యూస్ టీవీ చానళ్లు చాలా సింపుల్‌గా, బాహాటంగా, బహిరంగపరిచాయి.

పాకిస్తాన్‌కు ఇంకేం కావాలి?

అందుకే .. మీడియా అయినా సరే, దేశభద్రత వంటి కొన్ని విషయాల్లో నియంతృత్వం అనేది చాలా అవసరం.

ఇదే సోషల్ మీడియాకు కూడా వర్తిస్తుంది. 

Thursday, 28 February 2019

ముందు అభినందన్‌ను వెనక్కి తెప్పించండి!

యుధ్ధంలో మొట్టమొదట గాయపడేది నిజం!

పుల్వామా టెర్రరిస్ట్ ఎటాక్ తర్వాత 12 రోజులపాటు రెండువైపుల నుంచి ఎలాంటి శబ్దంలేదు.

13వ రోజు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న భూభాగంలోని టెర్రరిస్ట్ క్యాంపులమీద సుమారు 20 నిమిషాలపాటు విజయవంతంగా సర్జికల్ స్ట్రైక్ చేసింది.

300 మంది టెర్రరిస్టులు, పాక్ ట్రెయినర్లను హతం చేశాం అని భారత్ చెప్పుకొంది. మనం కూడా "జయహో భారత్" అనుకొన్నాం. అయితే - పాక్ మీడియా కాని, విదేశీ మీడియా కాని సర్జికల్ స్ట్రైక్‌లో 300 మంది హతులైన విషయాన్ని ధృవీకరించలేదు.

ఏది నిజం?   

కట్ చేస్తే - 

మరొక 24 గంటల్లోనే పాక్ ఫైటర్ విమానాలతో మన భూభాగంపైన దాడి చేసింది .. దాన్ని తిప్పికొట్టడంలో మన వాళ్లు విజయం సాధించారు .. ఒక పాక్ ఫైటర్ విమానాన్ని కూల్చేశాం .. ఈ చర్యలో భాగంగా మన యుధ్ధవిమానం ఒకటి కూలిపోయింది .. మన పైలట్ ఒకరు మిస్సింగ్ .. పరిస్థితిని సమీక్షిస్తున్నాం ..

ఇలా చకచకా ఒకదానివెంట ఒకటి సంఘటనలు జరిగాయి. లేదా వివిధ సోర్సుల ద్వారా జరిగాయని విన్నాం, చదివాం, చూశాం.

నిజానికి భారత్ ఏమీ చెప్పక ముందే రష్యా టుడే, పాకిస్తాన్ న్యూస్ మన వింగ్ కమాండర్ అభినందన్‌ను పాక్ కస్టడీలోకి తీసుకొన్న వార్తను చెప్పేశాయి.

ప్రపంచమంతా అది నిజమా అబధ్ధమా అనుకుంటూ ఒక 4 గంటలు గడిపిన తర్వాత .. మన విదేశీ వ్యవహారాల ప్రతినిధి ప్రెస్‌ముందు ఆ విషయం ధృవీకరించాడు!

అసలు పాక్ భూభాగంలో మన పైలట్ అభినందన్ వారికి ఎలా దొరికాడు?

జెనీవా కన్వెన్షన్ రూల్స్‌కు వ్యతిరేకంగా పాక్ ఆర్మీ అభినందన్‌ను అంత ఓపెన్‌గా ఏ ధైర్యంతో అలా చిత్రవధ చేయగలిగింది? తర్వాత మళ్లీ అతన్ని మేం బాగా చూసుకుంటున్నాం అని ఒక వీడియో డ్రామా ఎందుకు ఆడింది? ఇప్పుడు అభినందన్‌ను గుప్పిట్లో పెట్టుకొని "మేం చర్చలకు సిధ్ధం" అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంత కూల్‌గా ఎలా అనగలుగుతున్నాడు?

అసలేం జరిగింది?

ఇప్పుడేం జరగబోతోంది?

జెనీవా కన్వెన్షన్ ప్రకారం పాక్ మన వింగ్ కమాండర్ అభినందన్‌ను 7 రోజుల లోపల సురక్షితంగా మనకు అప్పగించాలి. ఆ పని ఇప్పుడు పాక్ చేస్తుందా?

ఎన్నో అనుమానాలు .. మరెన్నో ప్రశ్నలు.

అందుకే అన్నారు - "The first casualty of war is - truth" అని.

పాక్ ఏమీ చెయ్యలేదు .. మనముందు ఉట్టిదే అనుకున్నాం.

అంత ఉట్టుట్టిదేం కాదు అని తేలిపోయిందిప్పుడు.

రెండు దేశాల మధ్య యుధ్ధమంటూ జరిగితే ఇదివరకటిలా నెలలూ, సంవత్సరాలు జరగదు. రెండు దేశాల్లోని ముఖ్యమైన ప్రధాన నగరాలు కేవలం కొన్ని గంటల్లోనే బూడిదైపోతాయి.

మనకున్న భారీ యుధ్ధ సామగ్రి, బలగం, శక్తి రీత్యా చివరికి మనమే గెలుస్తాం. కానీ అప్పటికే చాలా మూల్యం చెల్లించుకొంటాం.

పాక్ విషయంలో కూడా అంతే. దాదాపు నామరూపాల్లేకుండా పోతుంది.

ఇక యుధ్ధం అంటూ మొదలైతే అది ప్రపంచస్థాయిలో కూడా ఏ క్షణం ఎలాంటి మలుపుకయినా దారితీసే ప్రమాదముంటుంది.

కట్ బ్యాక్ టూ మన అభినందన్ -    

ఇప్పుడు పాక్ గుప్పిట్లో మన వింగ్ కమాండర్ ఉన్నాడు.

వాళ్లు చిత్రవధలు పెట్టినా "నన్ను బాగా చూసుకొంటున్నారు" అని కాఫీ తాగుతూ కూల్‌గా వీడియోలో చెప్పాడు. కానీ, అందులో నిజమెంతో అభినందన్‌ను పట్టుకున్న అంతకు ముందటి వీడియోనే చెప్తుంది.

ఇమ్రాన్ ఖాన్ చెప్పాల్సింది చెప్పాడు, "చర్చలకు మేం రెడీ" అని.

బాల్ ఇప్పుడు మన కోర్టులో ఉంది.

భారత్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోబోతోంది?

పాక్ కస్టడీలో ఉన్న మన వింగ్ కమాండర్  అభినందన్‌ను సురక్షితంగా వెనక్కి రప్పించగలదా?
 
ఈ ప్రశ్నకు జవాబు ఒక్క మోదీ మాత్రమే చెప్పగలడు.   

Tuesday, 26 February 2019

వొక నమ్మకం

"Religion is a man made thing" అన్న మాటను నేను బాగా నమ్ముతాను. దేవుడు అన్న కాన్‌సెప్ట్ అందులో భాగమే.

పై వాక్యాన్ని ఎంత బాగా నమ్ముతానో, అంత కంటే బాగా నేను నమ్మే నిజం ఇంకోటి కూడా ఉంది.

అది .. మనకు తెలియని ఏదో ఒక "శక్తి".

ఆ శక్తి లేకుండా మనమంతా లేము. మన చుట్టూ ఉన్న ఈ అద్భుతమైన ప్రకృతీ లేదు.

ఆ శక్తి రూపం మనకు తెలియదు. ఆ శక్తి ఉద్దేశ్యం ఏంటో కూడా మనకు తెలియదు.

ఎవరికి వారు ఏదో ఒక పేరు పెట్టుకొని ఆ శక్తిని నమ్మడంలో తప్పేమీ లేదు. ఇంకొకరిని ఇబ్బంది పెట్టనంతవరకూ నిజంగా అదొక మంచి డిసిప్లిన్.

ఇదంతా ఎలా ఉన్నా .. శతాబ్దాలుగా చాలా మంది మహామహులైన రచయితలు, తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు, మేధావులమనుకున్నవారి విషయంలో నేను చదివి తెలుసుకొన్న, ఇటీవలికాలంలో వ్యక్తిగతంగా గమనించిన పచ్చి నిజం కూడా ఇంకోటుంది.

అసలు దేవుడు అన్న కాన్‌సెప్ట్‌నే నమ్మకుండా, జీవిత పర్యంతం విశృంఖలంగా గడిపిన ఎందరో చివరికి ఏదో ఒక ఆధ్యాత్మిక ఆశ్రమంలో చేరిపోయారు!

సో, మళ్లీ మనం కొత్తగా ఒక చక్రాన్ని కనిపెట్టాల్సిన అవసరం లేదు. అనుభవం మీద అన్నీ మనకే తెలుస్తాయి.

అందుకే ఈ విషయంలో అనవసరంగా లాజిక్కుల జోలికి పోవడం వృధా.

ఆ సమయాన్ని మరోవిధంగా సద్వినియోగం చేసుకోవడం బెటర్.

అయినా సరే - ఈ ప్రపంచం "కాజ్ అండ్ ఎఫెక్ట్" సూత్రం మీదే ఎక్కువగా నడుస్తుందని నేను ఇప్పటికీ నమ్ముతాను.

అయితే, చాలాసార్లు నేను వేగంగా గోడకు విసిరికొట్టిన బంతి అంతే వేగంగా వెనక్కి తిరిగిరాలేదు. ఆశ్చర్యంగా ఆ గోడకి బొక్కచేస్తూ బంతి బయటికి వెళ్లిపోయింది. లేదా, అక్కడే ఆ గోడకి జారుకుంటూ కింద కూలబడింది.

దీన్ని ఏ లాజిక్ ఒప్పుకుంటుంది?

ఎవరు నమ్ముతారు?

ఏ లాజిక్ ప్రకారం ఆలోచించినా, ఏ కోణంలో చూసినా - నా అనుభవంలో చాలాసార్లు జరగాల్సినవి జరగలేదు. జరక్కూడనివి జరిగాయి. 

సో, లాజిక్కులు పనిచేయని సందర్భాలు మనిషి జీవితంలో చాలా వస్తాయి. అలాంటప్పుడు మనం చేయగలిగింది ఒక్కటే. మనకు కన్వీనియెంట్‌గా అనిపించిన ఏదో ఒక "శక్తి" మీద మన భారం అంతా వేసి ముందుకు వెళ్లడం.  

విచిత్రంగా అప్పుడంతా బాగానే ఉంటుంది.

అదే నమ్మకం. 

"ఓవర్ నైట్ సక్సెస్" అనేది అసలుందా?

"ఓవర్ నైట్ సక్సెస్" అనే మాట మనం తరచూ వింటుంటాం. 

అంటే రాత్రికి రాత్రే సక్సెస్ సాధించటం అన్న మాట.

అసలంత సీనుంటుందా? 

రాత్రికిరాత్రే దొంగతనం చేసి ధనవంతుడైన ఒక దొంగ విషయంలో కూడా అంతే. ఆ ఒక్క రాత్రి లూటీ చేసి విజయం సాధించడం వెనుక ఆ దొంగ ఎన్నేళ్ల ప్రాక్టీసు, ఎంత కష్టం ఉందో ఎవరికి తెలుసు?

ఒక సైంటిస్ట్ అయినా, ఒక క్రియేటివ్ పర్సన్ అయినా, ఒక ప్రొఫెషనల్ అయినా, ఇంకే రంగంలో వారైనా సరే .. అందరికీ ఇదే వర్తిస్తుంది. 
 

సో, నా దృష్టిలో అసలు ఓవర్‌నైట్ సక్సెస్ అనేది లేదు. 

దేశంలోని టాప్ దర్శకుల్లో ఒకరైన మణిరత్నం తన తొలిచిత్రం నుంచి వరుసగా నాలుగు కమర్షియల్ ఫ్లాప్‌లు ఇచ్చిన విషయం ఎంతమందికి తెలుసు?

"మౌనరాగం" హిట్టు ఆతర్వాతే! 


హిట్ దర్శకుడు కాదని అప్పట్లో లీడ్‌లో ఉన్న ఒక హీరోయిన్ మణిరత్నం చిత్రంలో పనిచేయడానికి ఒప్పుకోలేదు. టాప్ దర్శకుడయ్యాక, అదే మణిరత్నం ను ఆ హీరోయిన్ పెళ్లాడింది. ఇంక ఆ హీరోయిన్ పేరు చెప్పడం అవసరమా? 

Success is always sexy. 

ఆమధ్య నేను వెళ్లిన ఒక యువ దర్శకుడి ఆఫీస్ లో - పూరి జగన్నాథ్ ఫోటోతో పాటు కొటేషన్ ఒకటి గోడకి అతికించి ఉంది. 

“It took 15 years to get overnight success!”  అని. 

ఇదే కొటేషన్ను సుమారు పదేళ్ల క్రితం ఓ స్పిరిచువల్ మార్కెటింగ్ గురు Joe Vitale పుస్తకం లో చదివాను. 

ఓవర్ నైట్ సక్సెస్ వెనక ఎన్నో కష్టాలు, ఎంతో కృషి ఉంటుంది. అది బయటి వారికి కనిపించదు.

వారికి కనిపించేది రెండే రెండు విషయాలు: 
సక్సెస్, ఫెయిల్యూర్. 

Sunday, 24 February 2019

వొక నీహారిక కోసం

క్రియేటివిటీ వేరు, రాజకీయాలు వేరు.

ఈ ఒక్క వాక్యం నేను నా బ్లాగ్‌లో కనీసం ఒక డజన్ సార్లు రాసుంటాను.

అంతే కాదు.

రాజకీయాలు వేరు. వ్యక్తిగత సంబంధాలు కూడా వేరు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు ఒక రేంజ్‌లో ఉతికి ఆరేసుకున్న చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు .. కేసీఆర్, కేటీఆర్‌లు తర్వాత ఎలా సమావేశాలు, పార్టీల్లో కలుస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇక్కడ ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే.

తప్పేం లేదు.

ఆంధ్రాలో రెండు బధ్ధవిరోధ పార్టీలకు చెందిన లీడర్లు కొందరు సాయంత్రమైతే క్లబ్బుల్లో కలసి సరదాగా పెగ్గేసి మాట్లాడుకోవడం నాకు తెలిసిన మరొక చిన్న ఉదాహరణ.

ఇది కూడా తప్పేం కాదు.

నా వ్యక్తిగత/వృత్తిగత పనులమీద తరచూ నేను వైజాగ్, గుంటూరు, విజయవాడ వెళ్తుంటాను. ఆ నేపథ్యంలోనే నేను స్వయంగా తెలుసుకొన్న విషయం ఇది.

నాకు తెలంగాణలో ఉన్న స్నేహితులు బంధువులకంటే, ఏపీలోనే ఎక్కువమంది ఉన్నారు. నా టీమ్‌లో పనిచేసేవారిలో కూడా అందరూ ఉన్నారు. అదసలు పాయింట్ కానే కాదు.   

క్రియేటివిటీకి సంబంధించిన వృత్తుల్లో ఉన్నవారికి రాజకీయాల్లో సొంత అభిప్రాయాలు, సొంత భావనలు, దృక్కోణాలూ ఉండకూడదని ఎక్కడా లేదు. క్రీస్తు పూర్వం నుంచి కూడా ఇది చరిత్రలో ఉంది.

నా మాట మీద నమ్మకం లేనివాళ్లు ఒక్క సారి గూగుల్లో కొడితే సరిపోతుంది.

కావల్సినంత చరిత్ర దొరుకుతుంది.

అయితే, తవ్వకాల్లో దొరికే చరిత్ర, ఫిలాసఫీల్లో కూడా రకరకాల వ్యూ పాయింట్స్ ఉంటాయి.

ప్లేటో ఒకటి చెప్తాడు. అరిస్టాటిల్ ఇంకోటి చెప్తాడు.

అది వేరే విషయం.

కట్ టూ నీహారిక - 

నీహారిక పేరు బావుంటుంది.

నాకు గుర్తున్న వొక నీహారిక ('నీహారిక నాయుడు' అనుకుంటాను) అప్పట్లో ఫేస్‌బుక్‌లో మషీన్ గన్ పేల్చిన రేంజ్‌లో పోస్టులు పెడుతుండేవారు. సడెన్‌గా ఆ పేలుళ్ళు ఆగిపోయాయి. లేదా నేను ఫేస్‌బుక్‌ను పట్టించుకోవడం మానేశాను కాబట్టి ఆ నీహారికను మిస్ అవుతున్నానో తెలియదు.

ఎనీవేస్, ఆ నీహారిక వొకరు.

ఇంకో నీహారిక నా బ్లాగ్ పోస్టులను వొకటి రెండుసార్లు చడా మడా ఏకిపారేసిన నీహారిక.

బ్లాగ్ రాసే క్రియేటివ్ ఫ్రీడం నాకెంత ఉందో, నా బ్లాగ్ పోస్టులను విమర్శించే ఫ్రీడం రీడర్స్‌కు కూడా తప్పక ఉంటుంది. ఈ విషయాన్ని నేనంత పర్సనల్‌గా తీసుకోను.

నేనొక రాజకీయ నాయకుణ్ణి ఇష్ట పడతాను. ఆయన పార్టీని ఇష్టపడతాను.

ఇంకొకరు ఇంకో నాయకుణ్ణి/నాయకురాలిని ఇష్టపడొచ్చు. వారి పార్టీని ఇష్టపడొచ్చు.

ఈ కోణంలో చూసినప్పుడు - ఎవరి వ్యూ పాయింట్ వారికుంటుందనేది చాలా స్పష్టం. సమర్థించుకోడానికి కూడా ఎవరి వాదనలు వారికుంటాయి.

ఇది సర్వ సహజం.

దట్ సింపుల్.

నిజంగా ఇలాంటి నీహారికలు లేకపోతే, బ్లాగింగ్ కూడా బోరింగ్ అవుతుంది.

సో, థాంక్స్ టూ మై బ్లాగ్ రీడర్ నీహారిక.

అంతకు ముందు తన కామెంట్‌తో నా బ్లాగ్‌లో ఒక పోస్ట్ గురించి ఈ నీహారిక ఏకేసినప్పుడు, తన ఆ కామెంట్ ఇన్స్‌పిరేషన్‌తో ముత్యాలముగ్గు సినిమాలోని ఒక మంచిపాట గుర్తుకొచ్చింది నాకు.

వెంటనేదాని మీద ఒక బ్లాగ్ పోస్ట్ రాశాను.

సో, అంతా మన మంచికే అన్నమాట! 

ఈ నీహారిక, నేను ముందు చెప్పిన నీహారిక బహుశా ఒక్కరే అయ్యుంటారేమోనని నాకెందుకో ఎక్కడో కొడుతోంది.

కావొచ్చు, కాకపోవచ్చు కూడా.

ఏదేమైనా, నా తర్వాతి సినిమా హిట్ కోసం ఆశిస్తున్న ఈ నీహారిక త్వరలోనే ఒక మంచి స్క్రిప్టు నాకు ఇస్తారనీ, ఒక మంచి సౌండ్ ప్రొడ్యూసర్‌ను కూడా కనెక్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.

థాంక్స్ ఇన్ అడ్వాన్స్! :)  

వొక పుల్వామా తర్వాత ...

మహాత్మా గాంధీ, మహమ్మద్ అలీ జిన్నా వారి ఈగోలు పక్కనపెట్టి కాసేపు మాట్లాడుకొంటే అసలు దేశ విభజన జరిగేదే కాదు. 

పాకిస్తాన్ అనేది ప్రత్యేకంగా ఈ ప్రపంచపటంలో ఉండేది కాదు. కాశ్మీర్ సమస్య అసలు ఉత్పన్నమయ్యేదే కాదు.

ఒక హైద్రాబాద్‌లాగా, కాశ్మీర్ రాజ్యం కూడా భారత్‌లో భాగమయిపోయేది. ఆ భూతలస్వర్గం మరింతగా భాసించేది.

ఒక లాల్ బహదూర్ శాస్త్రిలాగానో, ఒక ఇందిరా గాంధీలాగానో మన దేశపు తొలి ప్రధాని నెహ్రూ కూడా కేవలం దేశంకోసమే నిర్ణయాలు తీసుకొని ఉంటే, ఒక రావణకాష్టంలా కాశ్మీర్ సమస్య ఈరోజుకి కూడా ఇలా రగులుతుండేది కాదు. 

కేవలం తన వ్యక్తిగత ప్రపంచ ఖ్యాతి వ్యామోహం కోసం, వాస్తవ పరిస్థితుల్లో ఏ మాత్రం సాధ్యం కాని తన "పంచశీల" అనే పనికిరాని ఐదు సూత్రాలతో, ఐక్యరాజ్యసమితిలో గొప్పలకోసం, అప్పటి ప్రధాని జవర్‌లాల్ నెహ్రూ తీసుకొన్న అనేక తప్పుడు నిర్ణయాల ఫలితమే ఇప్పటి కల్లోల కాశ్మీర్.

1 జనవరి 1948 నాడు, మనకు చేతకాదు అన్నట్టుగా ఐక్యరాజ్యసమితికి పెత్తనం ఇస్తూ ఎప్పుడైతే కాశ్మీర్ వివాదాన్ని నెహ్రూ ఐక్యరాజ్యసమితి ముందు పెట్టాడో, ఆ రోజునుంచీ, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదమూకలతో భూతలస్వర్గం కాశ్మీర్ ఈనాటికీ రగులుతూనే ఉంది.

1947 నుంచి, మొన్నటి ఫిబ్రవరి 14 పుల్వామా టెర్రరిస్ట్ ఎటాక్ దాకా, ఈ రావణకాష్టం ఇట్లా రగులుతూ ఉండటానికి మూలకారణం నెహ్రూనే అని ఒప్పుకోడానికి మనలో చాలామంది ఏమాత్రం ఇష్టపడకపోవచ్చు.

కానీ, చరిత్ర చెప్తున్న నిజం అదే.

ఆ తర్వాత సుమారు అర్థ శతాబ్దం పైగా ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అధికార వ్యామోహం, అధికారంలో ఉండటం కోసం ఎప్పటికప్పుడు ఆ పార్టీ ప్రభుత్వాలు, ప్రధానులు తీసుకొన్న మరిన్ని తప్పుడు నిర్ణయాలు, రూపొందించిన పాలసీలు, చట్టాలు కాశ్మీర్‌ను ఎప్పటికప్పుడు ఒక అశాంతిమయమైన రాష్ట్రంగానే మిగిల్చాయి తప్ప ఒక పరిష్కారం దిశగా తీసుకెళ్లలేకపోయాయి.

అయితే, అప్పటి నుంచీ ఇప్పటి దాకా బలయ్యింది మాత్రం సుమారు 40 వేలమంది సైనికులు, వారి కుటుంబాలు.

మొన్నటి పుల్వామా టెర్రరిస్ట్ ఎటాక్ కూడా అలాంటిదే.

మరోవైపు చైనా విషయంలో కూడా మన ప్రభుత్వాల చేతకానితనం అత్యంత బాధాకరం. చైనాతో వాణిజ్య సంబంధాలు పూర్తిగా తెంచేసుకొని, ఆదేశం నుంచి దిగుమతులను పూర్తిగా ఆపేస్తే చాలు. ఆ దేశపు ఆర్థిక చిత్రం ఒక్కసారిగా ఛిద్రమైపోతుంది. ఆ ఒక్క పని మన ప్రభుత్వాలు చేయవు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే - చైనా విషయంలో మనమే డబ్బు అందిస్తూ, మన పక్కలో శత్రువును మనమే బలంగా పెంచుకుంటున్నాం. 

తమ దేశ భద్రత విషయంలో అణుమాత్రం కూడా రాజీపడని అమెరికా వంటి అగ్రదేశం పైన కూడా టెర్రరిస్టులు అత్యంత దారుణమైన స్థాయిలో దాడిచేయగలిగారు. తర్వాత అంతే కర్కశంగా ప్రపంచంలో ఎవ్వరూ ఊహించనివిధంగా ఆ దాడికి కారణమైన ఒసామా బిన్ లాడెన్‌ను ఇదే పాకిస్తాన్ నుంచి పట్టుకెళ్లి హతం చేసింది అమెరికా.

బిన్ లాడెన్‌ ఖననస్థలం కూడా ప్రపంచపటంలో లేకుండా ఎక్కడో ఎవ్వరికీ తెలియని సముద్ర గర్భంలో బూడిదలా కలిపేసింది.

తమ దేశ పౌరుల భద్రత విషయంలో, టెర్రరిస్టుల విషయంలో అమెరికా తీసుకొనే చర్యలు చాలావరకు అనుసరణీయం.

కానీ ఈ విషయంలో మనమెక్కడున్నాం? ఎంత వెనుకుబడి ఉన్నాం?     

అటు పాకిస్తాన్‌తో అయినా, ఇటు చైనాతో అయినా - ద్వైపాక్షిక సంబంధాల చర్చల విషయంలో మనం ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. అవన్నీ ఎప్పుడూ అర ఇంచు ముందుకు కదలవు. మీడియాల్లో వార్తలు, ఫోటోలు, ఎయిర్‌పోర్టుల్లో కటౌట్‌లవరకే పరిమితం. ఖర్చుమాత్రం కోట్లల్లో చేస్తారు.

ఎంత పెద్ద స్థాయి సమస్యలకయినా కొంచెం ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో కూర్చొని మాట్లాడుకొంటే పరిష్కారం అనేది తప్పక దొరుకుతుంది. కాకపోతే, దానికి కావల్సింది కేవలం రాజకీయాలు తెలవడం ఒక్కటే కాదు. ఆయా సమస్యల మూలాలపట్ల సమగ్ర అవగాహన ఉండాలి. పరిష్కారం దిశగా గురి తప్పని ఒక  వ్యూహం ఉండాలి. వీటన్నిటికీ తోడు, వ్యక్తిగత స్నేహపూర్వక సంబంధాల స్థాయికి కూడా ఎదిగి, సమస్యలకు పరిష్కారం సాధించుకోగల నేర్పు కూడా కావాలి. ప్రస్తుతం మన దేశంలో ఈ స్థాయి, ఈ లక్షణాలన్నీ ఉన్న రాజకీయవేత్త కేసీఆర్ ఒక్కరే.

కేసీఆర్ లాంటి నాయకుడు దేశప్రధానిగా ఉండటం వల్ల దశాబ్దాలుగా నత్తనడక నడుస్తున్న ఎన్నో సమస్యలు అతివేగంగా పరిష్కరించబడతాయండంలో సందేహంలేదు.

ఈ దిశలో కేసీఆర్ చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ఫలించేలా భావ సారూప్యత ఉన్న పలు ప్రాంతీయ పార్టీలు ఒక్కటవ్వటం ఇప్పుడు చాలా అవసరం.   

తను బ్రతుకున్న దేశం శాంతియుతంగా ఉండాలనే ఏ ముస్లిం అయినా కోరుకుంటాడు. కేవలం వారి వోటు బ్యాంక్ కోసం లేనిపోని అభద్రతాభావాలతో అవసరమైనప్పుడు కూడా దేశం లోపలా, బయటా స్పందించాల్సిన విధంగా స్పందించకపోవడం కేవలం చేతకానితనం, దేశద్రోహం కూడా. 

మన రాజకీయపార్టీలు, ప్రభుత్వాలు అలాంటి ద్రోహాన్నే చేశాయి. ఇంకా చేస్తున్నాయి.

ఒక్క కాశ్మీర్ విషయంలోనే కాదు. దేశ సమగ్రతకు, భద్రతకు సంబంధించిన అనేక విషయాల్లో కూడా ఇదే చేతకాని సంప్రదాయాన్ని ఇంకా కొనసాగిస్తుండటం అత్యంత విచారకరం.

ఈమధ్యకాలంలో ఒక్క 1999 కార్గిల్ వార్ విజయం ఒక్కటే దీనికి మినహాయింపు. ఆ ఘనత మచ్చలేని దేశభక్తుడు, రాజకీయవేత్త, అప్పటి ప్రధాని వాజపేయీకే దక్కుతుంది. మన సైన్యానికి దక్కుతుంది.

బంపర్ మెజారిటీతో, ఏ ఇతరపార్టీల సహాయం అక్కరలేకుండానే ప్రభుత్వం ఏర్పాటుకోగలిగిన ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదీ కూడా గత అయిదేళ్ల కాలంలో ఈ దిశలో ఏమీ చెయ్యలేకపోవడం అత్యంత ఆశ్చర్యకరం. కానీ, ఇప్పుడు అవకాశం మోదీ కళ్ళముందుంది. ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి. ఒకే దెబ్బకు రెండు పిట్టలు!

శాశ్వత శాంతి కోసం స్వల్పకాలిక విధ్వంసం కొన్నిసార్లు తప్పదు. ఆ ధ్వంసరచన ఇప్పటికే జరిగి ఉండాల్సింది ..

మన 40 మంది పుల్వామా వీర జవాన్ల ఖననానికి ముందే. 

Saturday, 23 February 2019

వొక చరిత్రకు అయిదేళ్లు!

తెలంగాణ వస్తే అదైపోద్ది, ఇదైపోద్ది అని ఓ నానారకాల కథలు చెప్పారు.

ఇప్పుడేమైంది?

కరెంటు లేక, తెలంగాణ మొత్తం అంధకారమైపోతుందన్నాడొకాయన.

నియాన్ లైట్ల వెలుగులో అసలు కంటికి కనిపించకుండాపోయిన అతనెక్కడ?

నిండు అసెంబ్లీలో "మీ తెలంగాణకు ఒక్క పైసా ఇయ్యనుపోండి" అని .. అదే చిత్తకార్తె మనిషి మొరిగాడు.

ఇప్పుడు అదే అసెంబ్లీలో మా తెలంగాణకు 2 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాం.

ఎక్కడా పెద్దమనిషి?

రాయాలంటే ఇదో పెద్ద లిస్ట్ అవుతుంది.

కట్ చేస్తే - 

400 కి పైగా పథకాలు.
40 వేల కోట్లకు పైగా నిధులు.

నిరంతరం కరెంటు.
నిండిన చెరువులు.
పారుతున్న నీళ్లు.
గ్లోబల్ బిజినెస్‌ల ప్రవాహం.
పెరుగుతున్న ఆదాయం.
ప్రపంచవ్యాప్తంగా పేరు.
అనుసరిస్తున్న ఇతర రాష్ట్రాలు, కేంద్రం.

గత 70 ఏళ్లలో దేశంలో ఎక్కడా జరగని పనులు ఇక్కడ ఒకే ఒక్క టర్మ్‌లో పూర్తిచేసి మరీ చూపించడం.

గత 70 ఏళ్లలో ఏ ఇతర రాష్ట్రంలో కాని, కేంద్రంలో కాని ఎవ్వరూ కలలో కూడా చూడని పథకాలను విజయవంతంగా ప్రవేశపెట్టి పరుగెత్తించడం.   

అనుక్షణం తెలంగాణ కోసం తపన.
అహరహం ఆలోచనలు.
అమితవేగంతో ఆచరణ.

విజయవంతమైన మొదటి ఐదేళ్లలో ఇవీ మనం చూసిన నిజాలు.

రెండోసారి ఎలెక్షన్లలో కూడా తిరుగులేని విజయ దుందుభి.

దటీజ్ కేసీఆర్.

కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర రావు, సి ఎం మాత్రమే కాదు. కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమానికి పర్యాయపదం. తెలంగాణకు పర్యాయపదం. మూర్తీభవించిన మానవత్వానికి పర్యాయపదం.

కేసీఆర్ అంటే .. ఒక చరిత్ర. 

Friday, 22 February 2019

Time to Take Massive Action!

రెండు కొత్త సినిమాలు, సోషల్‌మీడియా ప్రమోషన్, మ్యూజిక్ వీడియోలు, మ్యూజిక్ ఈవెంట్స్, షోస్, ఒక బుక్ రిలీజ్, ఒక డాక్యుమెంటరీ .. ఇట్లా చిన్నా, పెద్దా ఎన్నో ప్రాజెక్టులకు సంబంధించిన పనులు ఒకేసారి జరుగుతున్నాయి.

ఏప్రిల్ 30 దాకా ఊపిరి తీసుకోడానికి కూడా వీలు కానంతగా పనులు పెట్టుకున్నాము.   


Taking massive action! 


వీటిలో ప్రతి ఒక్కటీ వృత్తిపరంగా ఇప్పుడు నాకు చాలా ముఖ్యమైనదే. దేన్నీ అంత ఈజీగా తీసుకోవడం లేదు.

అన్నీ టైమ్ బౌండ్ ఉన్నవే.

సో, ఎన్నోరకాల వత్తిళ్ళు ఉన్నా
 ఏ ఒక్క పనినీ నేను వాయిదా వెయ్యటం లేదు. 

ఇవి ఒక్కొక్కటి ప్రారంభమౌతుంటే .. 
వీటికి సంబంధించిన చిన్న చిన్న తలనొప్పులు, అడ్డంకులు ఏవైనా ఉంటే అవే తొలగిపోతాయి. 

నా ఈ జర్నీలో నాతోపాటు పయనిస్తున్న 
వీరేంద్ర లలిత్, ప్రదీప్‌చంద్ర, ఇంకా మొత్తం
నా టీమ్‌కు 
అభినందనలు.

క్రియేటివిటీకి సంబంధించిన పనుల్లోని అన్‌సర్టేనిటీని అర్థం చేసుకొని, మాకు సహకరిస్తున్న మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ 
కూడా బిగ్ థాంక్స్.

కట్ చేస్తే - 

ఈరోజునుంచే కొత్త ఆర్టిస్టులు, సింగర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, రైటర్స్ కోసం యాడ్స్ ప్రారంభిస్తున్నాము. ఆడిషన్, సెలెక్షన్స్ మార్చిలో ఉంటాయి.   

Wednesday, 20 February 2019

ఇప్పుడు సోషల్ మీడియాను మించిన ప్రమోషన్ లేదు!

నేను టీవీ చూడక, న్యూస్‌పేపర్ చదవక అర్థ దశాబ్దం దాటింది. దీనివల్ల ఇప్పటివరకు నేనేదీ నష్టపోలేదని నాకు ఖచ్చితంగా తెలుసు.

నిజంగా అంత అవసరమైన న్యూస్ గాని, ఇంకేదైనా ముఖ్యమైన సమాచారం గానీ ఉంటే, అది ఏదోవిధంగా సరైన సమయానికి నాకు వెంటనే చేరుతోంది.

క్రెడిట్ గోస్ టూ సోషల్ మీడియా!

నాకున్న పరిమిత నాలెడ్జి ప్రకారం ఇంతకుముందులా ఇప్పుడెవ్వరూ టీవీ, న్యూస్‌పేపర్‌లను పెద్దగా పట్టించుకోవడం లేదు. అంత టైమ్ ఎవ్వరికీ ఉండటంలేదు.

అది పాలిటిక్స్ కావొచ్చు, స్పోర్ట్స్ కావొచ్చు, బిజినెస్ కావొచ్చు, ఇంకేదైనా కావొచ్చు.

అంతా అరచేతిలో ఉన్న మొబైల్‌లోనే.

ఆ మొబైల్‌లో ఉన్న సోషల్ మీడియా ప్రపంచంలోనే. 

కట్ టూ సినిమా ప్రమోషన్ - 

ఎప్పటినుంచో ఉన్న ఒక పనికిరాని రొటీన్ సంప్రదాయం ప్రకారం .. ఇన్వెస్టర్‌లకు కాన్‌ఫిడెన్స్ ఇవ్వడం కోసం, టీవీ చానెల్స్‌కు సినిమా న్యూస్ కంటెంట్ ఇవ్వటం కోసం తప్పిస్తే .. ఈ రొటీన్ సినిమా ఈవెంట్స్, ఓపెనింగ్స్, ప్రెస్‌మీట్స్, ఎట్సెట్రాలు అసలెందుకూ పనికిరావన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.

ఖర్చు కూడా ఎక్కువే. 

ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఫిలిం మ్యాగజైన్స్ ఎట్సెట్రా ఇచ్చే ప్రచారం కంటే ఎన్నోరెట్లు ఎక్కువ ప్రమోషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే సాధ్యం.

హాలీవుడ్ నుంచి, టాలీవుడ్ వరకు .. ఈ మధ్య హిట్టయిన ఏ సినిమానయినా తీసుకోండి. వాటి ప్రమోషన్‌లో ప్రధాన పాత్ర సోషల్ మీడియాదే!

ఖర్చు చాలా తక్కువ.

చెప్పాలంటే మొత్తం ఫ్రీ! 

ఉదాహరణ: 'లక్ష్మీ's NTR' సినిమా. ఆర్జీవీ ట్వీట్స్.

ఆఖరికి ఆ సినిమా ట్రయలర్లు కూడా ట్విట్టర్ ద్వారానే రిలీజ్!  


ఇంక ఆ సినిమాకు వేరే ప్రమోషన్ అక్కర్లేదని నా అభిప్రాయం. 

అందరూ ఆర్జీవీలా చేయలేకపోవచ్హు. కానీ, సోషల్ మీడియా ఆయుధం అక్కడుంది కళ్లముందు. ఎవరి టాలెంట్ వారిది. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత!
  

అయితే, సోషల్ మీడియా పవర్ గురించి ఎంత తెలిసినా .. సినిమా ప్రమోషన్‌లో భాగంగా, ఇండస్ట్రీలోని కొంతమంది సంతృప్తికోసం కొన్ని పాతపధ్ధతులు కూడా పాటించక తప్పటంలేదు. 

అది మనవాళ్ల మైండ్‌సెట్. 

కానీ, ఎవరు ఎన్ని పాత పధ్ధతులు పాటించినా,  సినిమా ప్రమోషన్ విషయంలో సోషల్ మీడియాను విస్మరించడం మాత్రం ఖచ్చితంగా అతి పెద్ద తప్పవుతుంది. 

అది హాలీవుడ్ అయినాసరే, టాలీవుడ్ అయినాసరే.   

Tuesday, 19 February 2019

మనీ .. 3 సూత్రాలు!

నా పాత బ్లాగ్ పోస్టులను ఒక్క నిమిషం అలా బ్రౌజ్ చేస్తోంటే ఇది కనిపించింది:

"Research shows that the more a boy misbehaves in school, the more likely he is to earn a lot of money as an adult!"

నా దృష్టిలో ఇదేదో ఉత్తుత్తి స్టేట్‌మెంట్ కాదు.

నా అనుభవంలో నేను కూడా చూసిన ఒక సత్యం.

దీనికి అనుబంధంగా మరికొన్ని నిజాలు కూడా నేను చెప్పగలను, ఎలాంటి హిపోక్రసీ లేకుండా.

> రోడ్డుమీద వెళ్తూ కనిపించిన ప్రతి రాయికీ, రప్పకూ విచిత్రంగా అలా దండం పెట్టుకుంటూ వెళ్తుంటారు కొంతమంది. అది తప్పు అనటంలేదు. కానీ, వీరి వ్యవహారశైలిగానీ, భాషగానీ అవతలివారికి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ కేటగిరీకి చెందిన చాలామంది నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గరగా తెలుసు. వీళ్లల్లో చాలామందికి కాగితం పైన పెన్నుపెట్టి రాయటం రాదు. కానీ వీరందరి దగ్గర డబ్బు పిచ్చిగా ఉంటుంది. పిచ్చిపిచ్చిగా సంపాదిస్తారు!

> అంతర్జాతీయంగా వివిధరంగాల్లో  అత్యుత్తమ స్థాయి విజయాల్నిసాధించి బిలియనేర్లు అయినవారిలో 96 శాతం మంది చదువులో గుండు సున్నాలే. లేదా స్కూల్, కాలేజ్ స్థాయిలో "డ్రాప్ అవుట్"లే!
 
> సినీ ఫీల్డులో కూడా అంతే. అత్యున్నతస్థాయి విజయాలు సాధించి కోట్లు సంపాదించుకున్న ఆర్టిస్టులూ, టెక్నీషియన్లలో అత్యధికభాగం మంది చదువుకు పంగనామాలు పెట్టినవాళ్లే!

కట్ టూ నీతి -       

1. చదువుకోనివాడి లక్ష్యం స్పష్టంగా ఉంటుంది. మొండిగా ఆ ఒక్కదాని గురించే కష్టపడి సాధిస్తాడు.

2. చదువుకున్నవాడికి పది లక్ష్యాలుంటాయి. పది పడవలమీద కాళ్లు పెడతాడు. ఏ ఒక్కటీ సాధించలేడు.

3. చదువుకు, సంపాదనకు అస్సలు సంబంధం లేదు. "నాకేం కావాలి? నేనెంత సంపాదించాలి? దానికోసం నేనేం చేయాలి?" అన్న వెరీ సింపుల్ 'ఫినాన్షియల్ ఇంటలిజెన్స్' చాలు.

పై 1, 2, 3 లను చాలా ఆలస్యంగా రియలైజ్ కావడమంత దురదృష్టం ఇంకొకటి లేదు.

బట్, నో వర్రీ ...

ఇప్పుడు, రియలైజ్ అయిన మరుక్షణం నుంచైనా, వొళ్లు దగ్గరపెట్టుకొని, "మనమేం చేస్తున్నాం, మనకేం కావాలి" అన్న విషయంలో కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకొంటే చాలు.

ఫలితాలు అవే ఫాలో అవుతాయి.

డబ్బు కూడా.