Thursday, 31 January 2019

సినిమా ఇప్పుడొక బిగ్ బిజినెస్!

"మా వాడు చదువుకోవట్లేదు. ఉద్యోగం చేయడు. బిజినెస్ చేయలేడు. ఏ పనీ చేతకాదు. ఎందుకూ పనికిరాడు. కొంచెం నీ దగ్గర డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పెట్టుకో!"

ఒకరోజు పొద్దున్నే గురువుగారు దాసరిగారికి కాల్ చేసి అలా అడిగాట్ట ఆయన స్నేహితుడు! 

బయటివాళ్ల దృష్టిలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అంటే మరీ అంత పనికిరానిదన్నమాట ...

ఈ జోక్‌ని స్వయంగా గురువుగారు, దర్శకరత్న దాసరి నారాయణరావుగారు అప్పటి తన బంజారాహిల్స్ ఆఫీసులో నాతో చెప్పారు.

ఒక్క డైరెక్షన్ డిపార్ట్‌మెంటే కాదు. టోటల్‌గా సినీఫీల్డులో పనిచేసేవారంతా ఎందుకూ పనికిరానివాళ్లని ఇతర ఫీల్డులవాళ్ల అభిప్రాయం.

"చదువుకోవడం చేతకానివాళ్లంతా సినీఫీల్డంటారు!" అని కూడా అంటారు కొంతమంది.

"అబ్బో సినిమావాళ్లా!" అంటారు కొందరు. మిగిలినవాళ్లంతా ఏదో సొక్కమైనట్టు. వీళ్లేదో చేయరాని పని చేస్తున్నట్టు.

సరే, ఎవరు ఎలా అనుకున్నా ఏం ఫరవాలేదు. "మ్యాటర్ ఎప్పుడూ ఫీల్డు కాదు. మన మైండ్‌సెట్" అనేది కామన్‌సెన్స్.

అయితే మన ప్యాషన్‌తో, మన ప్రొఫెషన్‌తో అవతలి వాళ్లను ఎంత చిన్నస్థాయిలోనయినా సరే ఇబ్బంది పెట్టకూడదు అనేది సినీఫీల్డులో ఉన్న ఎవరైనా విధిగా గుర్తుపెట్టుకోవాల్సిన మరొక కామన్ సెన్స్, మొట్టమొదటి రూల్ కూడా.

కానీ, అప్పుడప్పుడూ ఇది మిస్ అవుతుంటుంది.

ముఖ్యంగా డబ్బు విషయంలో. ఇంకా కొన్ని వ్యక్తిగత ప్రామిస్‌ల విషయంలో. 

తాడిచెట్టు కిందకి వెళ్లినప్పుడు అక్కడ తాగాల్సింది కల్లు. పాలు తాగుతానంటే కుదరదు. చూస్తుంటే జీవితం జస్ట్ అలా చేజారిపోతుంది.

ఫీల్డు అలాంటిది.

టోటల్ అన్‌సర్టేనిటీ!

బయటికి క్రియేటివిటీ అని, తపస్సు అనీ, ప్యాషన్ అనీ ఎందరో ఎన్నో మాస్కులు వేసుకోవచ్చు. ఒక జాబ్‌లా, ఒక మంచి ఆదాయమార్గంగా, ఒక బిజినెస్‌లా తీసుకున్నప్పుడు మాత్రమే ఏ గొడవా ఉండదు.

అవును.

సినిమా ఇప్పుడొక బిగ్ బిజినెస్.

దాని అల్టిమేట్ టార్గెట్ డబ్బు ... 

^^^
#Cinema #CineField #Movies #Creativity #Life #PassionForFilms #CinemaAsProfession  #BigMoneyInFilms #BigBusiness 

Tuesday, 29 January 2019

వొకింత స్వేఛ్చ కోసం

"నా జీవితాన్ని నేను సృష్టించుకుంటాను!" ...

"జీవితంలో ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది!" ...

ఈ రెండూ .. రెండు విభిన్న అలోచనా విధానాలు.

భూమ్యాకాశాల అంతరం ఉన్న రెండు భిన్న ధ్రువాలు.

ప్రపంచ వ్యాప్తంగా ఏ కాలమాన పరిస్థితుల్లోనయినా ప్రధానంగా ఈ రెండు అలోచనా విధానాలే కొనసాగుతుంటాయి.

మొదటి వ్యక్తి జీవన వాహనానికి సంబంధించిన "స్టీరింగ్" అతని చేతుల్లోనే ఉంటుంది. రెండో వ్యక్తి తన స్టీరింగ్ ను గాలికి వదిలేస్తాడు. దేని ఫలితం ఎలా ఉంటుందో ఎవరయినా  ఇట్టే ఊహించవచ్చు.

ప్రస్తుతం నా స్టీరింగ్ మళ్లీ  నాచేతుల్లోకి తీసుకున్నాను.

కొంచెం ఆలస్యంగా.

కట్ చేస్తే - 

సామర్థ్యం ఉన్నప్పుడు మరింతగా ఎదగడానికి ప్రయత్నించడం, మరింత ఉన్నతమైన జీవనశైలిని కోరుకోవటం తప్పు కాదు.

అసంతృప్తితో బాధితుడుగా మిగిలిపోవటమా, సంతృప్తితో అనుకున్నస్థాయికి ఎదగడమా అన్నది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది.

ప్రస్తుతం అలాంటి ఒక మలుపుకి దగ్గరలో ఉన్నాను.

ఈ ప్రస్థానంలో - నా మొత్తం 'క్రియేటివ్ అండ్ అదర్ ప్రొఫెషనల్ యాక్టివిటీస్‌'లో సినిమా అనేది జస్ట్ ఒక పది శాతం మాత్రమే.

ఒక అతి చిన్న భాగం మాత్రమే.

ఇంకా చెప్పాలంటే .. మంచి ఆదాయం, గొప్ప కాంటాక్ట్స్ ఇచ్చే ఒక గ్లామరస్ జాబ్.

అయితే, నా ఉద్దేశ్యంలో .. సినిమా రంగాన్ని మించిన ఫేసినేటింగ్ క్రియేటివ్ సామ్రాజ్యాలు ఇంకెన్నో ఉన్నాయి. నాకెంతో ఇష్టమయిన అలాంటి ఒక సామ్రాజ్యంలోకి పూర్తిస్థాయిలో ప్రవేశించే ఫ్రీడమ్‌ కోసమే నేను ఎదురుచూస్తున్నాను.

ఆ ఫ్రీడమ్‌ను సృష్టించుకొనే క్రమంలోనే ప్రస్తుతం కొంచెం బిజీగా ఉన్నాను.

ఈరోజు కూడా అలాంటి వొక 'బిజీయెస్ట్ డే'నే ..

ఇంకో పది రోజులదాకా ఈ బిజీ ఇలాగే కొనసాగుతుందనుకుంటున్నాను. అప్పటికి నేను కోరుకొన్న స్వేఛ్చను తప్పక సాధించుకొంటానన్న నమ్మకం నాకుంది.

ఐ విష్ మైసెల్ఫ్ బెస్టాఫ్ లక్ ...   

^^^
#CinemaField #Movies #CineField #Creativity #CreativeFreedom #Mpire #Swechcha #ManoharChimmani #Nagnachitram #ManoharChimmaniBlog 

Sunday, 27 January 2019

అఫ్సర్ నుంచి వొక కాల్

ఈమధ్య నేనస్సలు ఫేస్‌బుక్‌లోకి రావటంలేదు.

కనీసం నాలుగు నెలలవుతోంది.

వొక మిత్రుని కాంటాక్ట్ కోసం వెదుకుతూ, మొన్న ఎందుకో అనుకోకుండా ఫేస్‌బుక్‌లోకి తొంగిచూశాను.

మెసేజ్‌ల అంకె 334 చూపిస్తోంది.

వాటిల్లో ఎక్కువగా మొన్న నవంబర్‌లో నా పుట్టినరోజు సందర్భంగా వచ్చుంటాయి.

అయితే ఇక్కడ పాయింట్ అది కాదు.

పైనుంచి కనిపిస్తున్న నాలుగు మెసేజ్‌లలో ..
కవి, రచయిత, విమర్శకుడు, ఇంకా బోల్డన్ని కూడా అయిన క్యాంపస్ రోజులనాటి వొక గొప్ప ఆత్మీయ మిత్రుని మెసేజ్ కూడా ఉంది. 

అఫ్సర్!

వెంటనే రిప్లై ఇచ్చాను.

ఆన్‌లైన్‌లోనే ఉన్నాడనుకుంటాను .. వెంటనే ఎఫ్‌బీ కాల్ రింగయ్యింది అఫ్సర్ నుంచి.

స్పిరిచువల్ కనెక్షన్!

ఆనందంగా రెండు నిమిషాలు మాట్లాడుకున్నాం.

బహుశా వొక రెండు దశాబ్దాల తర్వాత అనుకుంటాను అఫ్సర్ గొంతు నేను విన్నాను.

కొన్ని ఆనందాలకు కొలతలుండవ్.

జస్ట్ వొక అద్భుతం.

అంతే.

ఆ అద్భుతాన్ని అనుభవించాను అఫ్సర్‌తో మాట్లాడిన ఆ కొన్ని క్షణాలు ...

నా ఓయూ క్యాంపస్ రోజులతర్వాత .. నాకు గుర్తున్నంతవరకూ, చివరిసారి నేను అఫ్సర్‌తో కలిసి మాట్లాడింది వారాసిగూడాలోని వొక ఇరానీ హోటల్‌లో. తర్వాతెప్పుడు కలిసినా అతని రచనల్లో, లేదంటే ఎప్పుడైనా వొక మెరుపులాంటి చాటింగ్‌లో.

కట్ టూ "సాహిల్ వస్తాడు" - 

ఇండియా వచ్చానన్నాడు అఫ్సర్. రేపు హైదరాబాద్ స్టడీ సర్కిల్‌లో బుక్ రిలీజ్ ఉందని చెప్పాడు.

తప్పకుండా వస్తానని చెప్పాను.

తప్పకుండా వెళ్లాలని డిసైడ్ అయ్యాను .. ఇప్పుడు నేనున్న అస్తవ్యస్త హడావిడి పరిస్థితుల నుంచి వొక చిన్న బ్రేక్ కోసం, అక్కడ కలిసే ఎందరో పాతమిత్రుల పలకరింపులకోసం. 

ఆ తర్వాత వెంటనే కాల్ చేసి వొకరిద్దరికి చెప్పాను కూడా .. "మనం ఫలానా ప్రోగ్రామ్‌కు వెళ్తున్నాం రేపు" అని.

అయితే - దురదృష్టవశాత్తూ, నా అస్తవ్యస్తపు హడావిడే హైదరాబాద్ స్టడీ సర్కిల్‌ వెళ్లే నాదారిని హైజాక్ చేసింది.

నిన్న సాయంత్రం ఆ ప్రోగ్రామ్‌కు వెళ్లలేకపోయాను. అఫ్సర్‌ను కలవలేకపోయాను.

ఇదిగో ఇలాంటి స్థితినుంచే .. నన్ను నేను బయటేసుకొనే ప్రయత్నంలోనే .. ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాను.

ఈ బిజీ అంతా కూడా నేను కోరుకొనే, నాకిష్టమైన వొక క్రియేటివ్ ఫ్రీడం కోసం ..

^^^
#Afsar #SahilVastadu #HyderabadStudyCircle #Creativity #Life #CreativeFreedom #ManoharChimmani #Nagnachitram #ManoharChimmaniBlog 

Sunday, 13 January 2019

జీవితం ఎవ్వరినీ వదలదు!

అవును ..

జీవితం ఎవ్వరినీ వదలదు.

ఊహించనివిధంగా ఏదో ఒక దశలో ఒక చూపు చూస్తుంది.

అప్పుడు తెలుస్తుంది, అసలు జీవితం ఏమిటో.

మొన్నటి నవంబర్ 25 సాయంత్రం నుంచి, ఈ రాత్రివరకు నా జీవితంలో ఊహించని సంఘటనలు ఎన్నో ..

నాకత్యంత ప్రియమైన నా చిన్నతమ్ముడి ఆకస్మిక మరణం అందులో ఒకటి.

మనిషి వ్యక్తిగత జీవితానికి సంబంధించి, మన దేశంలో ఇంకా వికృతాట్ఠాసం చేస్తున్న నాకు నచ్చని వొకానొక సామాజిక వ్యవస్థ .. ఆ సో కాల్డ్ వ్యవస్థ ఉన్న మన ఈ సమాజం పట్ల మన మైండ్‌సెట్ .. నా తమ్ముడిని, వాడి వ్యక్తిగత జీవితాన్ని ఎంతో మానసిక వ్యధకు గురిచేశాయి.

వాడు నాకు మళ్లీ కనిపించనంత దూరం చేశాయి.

డిసెంబర్ 27, 2016 .. సరిగ్గా 2 సంవత్సరాలక్రితం, మా అమ్మ మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది.

జీవితం చాలా చిన్నది అని చెప్తూ, మొన్న డిసెంబర్ 16 నాడు, నా చిన్నతమ్ముడు శ్రీనివాస్ కూడా, చాలా చిన్నవయసులో మమ్మల్ని విడిచి వెళ్ళిపోయాడు.

కట్ చేస్తే - 

ఎంతోమంది గురించి నా బ్లాగ్ లో, ట్విట్టర్లో, ఫేస్‌బుక్‌లో ఎంతో రాశాను, పోస్ట్ చేశాను.

కానీ, నాకెంతో ప్రియమైన నా చిన్నతమ్ముడి గురించి మాత్రం ఏం రాయలేకపోతున్నాను.

వాసూ, నిన్ను కాపాడుకోలేకపోయాను .. కానీ, నువ్విలా చేసివుండాల్సిందికాదు, బతికున్నంతకాలం నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నేను బాధపడేలా .. వలవల ఏడ్చేలా .. 

Saturday, 12 January 2019

రెండు తప్పుల సాగరసంగమం

తెలిసో తెలియకో ..  తొందరపాటుతోనో .. మరింకేదైనా ప్రభావంవల్లో ..  ప్రతి ఒక్కరూ వారి జీవితంలోని ఏదో ఒక దశలో, ఏదో ఒక తప్పు నిర్ణయం తీసుకొంటారు.

అది సహజం.

అంతవరకు తప్పు కాదు.

కానీ, ఆ నిర్ణయం తప్పు అని తెలిసిన తర్వాత కూడా దాన్ని సరిదిద్దుకొనే ప్రయత్నం వెంటనే చేయకపోవడం మాత్రం చాలా పెద్ద తప్పే అవుతుంది.

మొదటి తప్పు ఫలితంగా కొంత నష్టం జరగొచ్చు. కానీ, 'చేసిన తప్పును సరిదిద్దుకొనే ప్రయత్నం వెంటనే చేయకపోవడం' అనే రెండో తప్పు వల్ల మాత్రం చాలా అనర్థాలు జరుగుతాయి.

ఎన్నడూ కలలో కూడా ఊహించని పరిస్థితులను ఎన్నిటినో  ఎదుర్కోవాల్సివస్తుంది.

అలాంటి తప్పు నిర్ణయం నా జీవితంలో ఒక్కసారి కాదు, రెండుసార్లు తీసుకొన్నాను. అంతా తెలుస్తున్నా, ఆ తప్పుల్ని సరిదిద్దుకోలేకపోయాను.

అదే విధి విచిత్రం అంటారు చాలామంది.

మైండ్‌సెట్ అంటాను నేను.

చాలా ఏళ్ల తర్వాత .. ఇప్పుడు .. ఆ రెండిట్లో ఒక తప్పు నిర్ణయాన్ని సమూలంగా తుడిచేశాను.

ఆ ఆనందాన్ని మనసారా అనుభవిస్తున్నాను.

కానీ, ఇంకో తప్పు నిర్ణయాన్ని మాత్రం తుడిచేయలేకపోతున్నాను. అది .. నా జీవితంలో నేను తీసుకొన్న మొట్టమొదటి అతి పెద్ద తప్పు నిర్ణయం. అదే, నా జీవితంలో నేను చేసిన మొట్టమొదటి అతిపెద్ద తప్పు.

ఆ తప్పుని మొదట్లోనే సరిద్దుకోవాల్సింది. అప్పుడా పని చేసుంటే, ఆ తర్వాత నేను చేసిన రెండో తప్పు అసలు జరిగేదేకాదు. జరిగినా అది తప్పు అయ్యేదికాదు.

ఒకటి వ్యక్తిగతం, మరొకటి వృత్తిగతం.

కట్ చేస్తే - 

సుమారు పాతికేళ్లక్రితం ఒకటి, పదిహేనేళ్లక్రితం ఇంకొకటి ..

నేను చేసిన ఆ రెండు తప్పుల సాగరసంగమం ఖరీదు .. ఒక జీవితం. 

Saturday, 22 December 2018

బుక్ ఫెయిర్, మిస్ యూ దిస్ టైమ్!

హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఒక పండుగ.

పుస్తకాలు, పుస్తకపఠనం మీద ఆసక్తి ఉన్నవాళ్లు, ప్రచురణకర్తలు ఇంకా ఉన్నారనే ఒక నిజాన్ని తెలిపే పండుగ.

లాపీలు, మొబైల్ ఫోన్స్, కిండిల్స్ లో చదవడానికి అలవాటుపడ్డ ఈ డిజిటల్ యుగంలో .. ఒక పుస్తకం చదివేటప్పుడు భౌతికంగా ఆ పుస్తకస్పర్శను ఇష్టపడే పాఠకుల కోసం ఈ పండుగ.

డిజిటల్ విస్ఫోటనం తర్వాత 'పుస్తకాలు ఇక ఉండవు' అని చాలా మంది జోస్యం చెప్పారు. కానీ, అది నిజం కాదని ప్రపంచవ్యాప్తంగా పాఠకులు నిరూపించారు.

ఈ లెక్కల్ని ఎప్పటికప్పుడు ప్రఖ్యాత 'అమెజాన్ డాట్ కాం' చెప్తూనే ఉంది.

ఎన్నిరకాల డిజిటల్ పుస్తకాలు వచ్చినా, పుస్తకం పుస్తకమే.

ఈ డిజిటల్ యుగంలో కూడా పుస్తకప్రేమికుల సంఖ్య తగ్గలేదు. ఇంకా పెరిగింది.

అయితే, ఈ పుస్తక ప్రేమికుల పెరుగుదల మనదేశంలోకన్నా, బాగా అభివృధ్ధిచెందిన దేశాల్లోనే ఎక్కువగా ఉండటం అసలు కొసమెరుపు!

కమింగ్ టు ద పాయింట్ ...

నా వ్యక్తిగత కారణాలరీత్యా, ఈ సంవత్సరం, హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌ను మిస్ అవుతున్నాను. బుక్‌ఫెయిర్‌లో అనుకోకుండా కలిసే ఎందరో మిత్రులను కూడా మిస్ అవుతున్నాను.    

Saturday, 1 December 2018

కౌంట్ డౌన్ .. 6

"చంద్రబాబు తెలంగాణ దుష్మన్!"

ఈమధ్యకాలంలో ఇంత క్యాచీ 'బ్యానర్ హెడింగ్' చూళ్లేదు నేను.

రెండ్రోజుల క్రితం నమస్తే తెలంగాణ పత్రికలో పెట్టిన బ్యానర్ హెడ్డింగ్ అది.

థాంక్స్ టూ ది ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి గారు అండ్ హిజ్ టీమ్.

ఆల్రెడీ దీన్నే ట్వీట్ కూడా పెట్టాను.

అదే పేపర్లో ఇంకో రోజు కార్టూనిస్ట్ మృత్యుంజయ కార్టూనొకటి చూశాను. సూపర్బ్!

అదేంటంటే, "సార్ లేరా ఇంట్లో?" అని టీడీపీ ఆఫీసు ముందు ఒకతను అడుగుతుంటాడు. "లేడు, పక్కింటికి పెత్తనానికెళ్ళాడు" అని చెప్తాడు అక్కడున్న ఆఫీసు బంట్రోతు.

అదీ విషయం. 

కట్ చేస్తే - 

ఇక్కడ తెలంగాణలో 2018 ఎన్నికల సందర్భంగా ది గ్రేట్ బాబు గారు చేస్తున్నది అదే.

అక్కడ అమరావతిలో సొంతిల్లు కట్టుకోడమే ఇంకా చేతకాలేదు. పక్కింటిమీద పెత్తనానికొచ్చాడు.

ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎవ్వరూ ప్రశాంతంగా ఉండొద్దు.
కేసీఆర్ మళ్లీ అధికారం లోకి రావద్దు.
ఎక్కడ వీలైతే అక్కడ మళ్లీ ఆంధ్ర-తెలంగాణ ఫీలింగ్‌ను గుర్తు చేయాలి.
రెచ్చకొట్టాలి .. ఎట్సెట్రా ఎట్సెట్రా ..
ఇట్లా చెప్పుకుంటూపోతే ఇంకో వంద ఆలోచనలుంటాయి బాబు గారి ఎజెండాలో.
నిజానికి, అవి ఆలోచనలు కావు. కుట్రలు.

అవన్నీ తెలంగాణకు, తెలంగాణ అభివృధ్ధికి నష్టం కలిగించేవే. ఇక్కడ హాయిగా ఉన్న మనుషులందరిమధ్య కొత్తగా ఫీలింగ్స్‌ను రేకెత్తించే ప్రయత్నంలో భాగంగా బాబు గారు ఇంకో మాస్టర్ ప్లాన్ వేశారు.

హరికృష్ణ కుమార్తె చుండ్రు సుహాసినిని, "నందమూరి సుహాసిని" చేసి, కుక్కట్‌పల్లి బరిలోకి దింపారు.

పాపం బలిపశువు సుహాసిని.

ఆమె గెలవదుగాక గెలవదు. అయినా సరే నిలబెట్టాడు. వాళ్ల పరువు తీయడంకోసం. ఇంక ఆ నందమూరి వంశంవల్ల పార్టీకి ఏం ప్రయోజనంలేదని రేపు ఎలెక్షన్ల తర్వాత చెప్పడం కోసం.

"నిజంగా నీకు అంత ప్రేమ వాళ్లమీద ఉంటే, నీ కొడుకు లోకేష్‌ను మినిస్టర్ చేసినట్టు, ఈ సుహాసినిని కూడా అక్కడ ఏపీలో మినిస్టర్‌ను చెయ్యాల్సింది. ఎందుకు చెయ్యలేదు?"

ఇది మొన్న కుక్కట్‌పల్లి రోడ్‌షోలో మన మంత్రి కేటీఆర్ సూటిగా అడిగిన ప్రశ్న.

దీనికి ఆ ప్రపంచ మేధావి సమాధానం చెప్పగలడా?

చెప్పలేడు.

తెలంగాణ బాగుపడకూడదు. ఇక్కడ ఏ ప్రాజెక్టులు నిర్మాణం కాకూడదు. ప్రతిదానికీ అడ్దంగా కేసులు పెట్టించడం, లేదంటే, వద్దు వద్దంటూ వందలకొద్దీ లెటర్లు కేంద్రానికి రాయడం.

ఆయనకు తెలంగాణవాళ్లు అన్నా పడదు. తెలంగాణ పదం అన్నా ఇష్టం ఉండదు.

అందుకే .. పాపం అక్కడ ఏపీలో ప్రజలను, ప్రభుత్వాన్ని గాలికొదిలేసి ఇక్కడ తన కుటిల చక్రంతో నానా కుట్రలు చేస్తున్నారు.

అందుకే మన ముఖ్యమంత్రి కేసీఆర్ బాగానే అన్నారు:

చంద్రబాబు తెలంగాణ దుష్మన్!

ఆ దుష్మన్ కనుసన్నల్లో నడుస్తున్న మాయాకూటమికి వోటేస్తారా? 60 ఏళ్లుగా తెలంగాణలో లేని అభివృధ్ధిని ఆఘమేఘాలమీద చేసి చూపించి, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు కూడా  పొందుతున్న మన ఇంటిపార్టీ టీఆరేస్‌కు వోటేస్తారా?

ఆలోచించండి.

రేపు 7వ తేదీ నాడు మీ వోటు ద్వారా ఇలాంటి దుష్మన్‌ల ఆటలకు చెక్ పెట్టండి. 
మీ వోటుతో బుధ్ధి చెప్పండి.

మరోసారి ఇటివైపు రాకుండా చెయ్యండి.

Friday, 30 November 2018

7 రోజుల కౌంట్ డౌన్!

2001 నుంచి, దాదాపు ఒకటిన్నర దశాబ్దంపాటు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో పోరాడి తెలంగాణ సాధించుకొన్నాం.

ఈ విజయం అందరిదీ,  ప్రతి తెలంగాణ బిడ్డదీ.

అయితే - కేసీఆర్ లేకుండా ఈ ఉద్యమం లేదు. తెలంగాణ లేదు. ఎవరు ఒప్పుకొన్నా, ఒప్పుకోకపోయినా ఇదే నిజం.

ఉద్యమ విజయం నేపథ్యంలో, 2014 ఎన్నికల్లో మన ఇంటి పార్టీ టీఆరెస్ గెలిచింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఇదంత గొప్ప విషయం కాదు. ఎందుకంటే, ఉద్యమ విజయ నేపథ్యం అప్పటికింకా హాట్ హాట్‌గా ఉంది.

కట్ చేస్తే - 

తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ సాధించిన విజయాలు, తెలంగాణను కనీసం ఒక 24 అంశాల్లో దేశంలోనే "నంబర్ వన్‌"గా నిలబెట్టాయి. పక్కరాష్ట్రాల నుంచి, జాతీయస్థాయిమీదుగా, ఐక్యరాజ్యసమితి వరకు .. ఎంతో గుర్తింపు తన చేతల ద్వారా సాధించి చూపెట్టారు కేసీఆర్. ఇప్పుడు ఇతర రాష్ట్రాలు, కేంద్రం కూడా మన తెలంగాణలో జరుగుతున్న పనులు, పథకాలను అనుసరిస్తున్నాయి.

60 ఏళ్లుగా, తెలంగాణలో కలలో కూడా ఊహించని ప్రగతిని, కేవలం 4 ఏళ్లలో సాధించి చూపించారు కేసీఆర్ అండ్ టీమ్.

ఇప్పుడిదంతా కొనసాగాలంటే, ఈ ఎన్నికల్లో విధిగా టీఆరెస్ గెలవాలి. మళ్లీ మన కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి.

కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి తప్పక అవుతారు. కానీ ఎంత మెజారిటీతో, ఎన్ని సీట్లతో అన్నది ఇప్పుడు మనకు చాలా ముఖ్యం.

ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఈ 2018 ఎన్నికలే మనకు సిసలైన ఎన్నికలు.

తెలంగాణ వోటర్లందరికీ రేపు డిసెంబర్ 7 నాడు, పోలింగ్ బూత్‌లోని ఈవీఎం మీద ఒక్క "కారు గుర్తు" మాత్రమే కనిపించాలి. దాన్నే అందరూ కసిదీరా నొక్కాలి.

ఎంత కసి అంటే, "కేసీఆర్‌ను గద్దె దించడం" అనే ఒకే ఒక్క స్వార్థ ఎజెండాతో నిర్లజ్జగా ఏర్పడిన మాయాకూటమి, దాని తెరవెనుక పాత్రధారులు అంతా మన కసికి మసై కొట్టుకుపోవాలి.

మళ్లీ చెప్తున్నాను. రేపు డిసెంబర్ 7 నాడు జరగబోయే ఎన్నికలే మన తెలంగాణకు అతి ముఖ్యమైన ఎన్నికలు.

ఇజ్జత్ కా సవాల్ ...   

Thursday, 22 November 2018

వారసత్వం కాదు, చూడాల్సింది సత్తా!

కేవలం ప్రతిపక్షాలేకాదు, వ్యక్తిగత ఎజెండాలున్న చాలామంది ఒకటే పాట పాడుతుంటారు: "వారసత్వం కదా, ఏదైనా చేయొచ్చు" అని.

ఇంతకంటే పనికిరాని వాదన ఇంకోటి లేదు.

ఇది ఒక్క రాజకీయాల్లోనే అని కాదు. సినిమా ఫీల్డులో అయినా, బిజినెస్‌లో అయినా ఒకటే. దీని గురించి చాలా స్పష్టంగా ఒకసారి ఆర్జీవీ తన "రామూఇజం"లో బాగా చెప్పాడు.

కట్ బ్యాక్ టూ పాలిటిక్స్ - 

టీఆరెస్ కు ముందు గత 58 ఏళ్లలో, ఎంతమంది ముఖ్యమంత్రులు, మంత్రులు లేరు తెలంగాణలో? వారికి ఎంతమంది వారసులు లేరు? ఎవరో ఒకరిద్దరు తప్ప .. వారిలో ఏ ఒక్కరైనా ఎందుకని ఈ స్థాయిలో పనిచేసి నిరూపించుకోలేకపోయారు?

పోనీ, ఇప్పుడు దేశంలో ఉన్న ప్రముఖ రాజకీయనాయకుల్లో ఎంతమంది వారసులు ఏ విషయంలోనైనా, ఏ స్థాయిలో ఉన్నారో ప్రపంచమంతా తెలుసు. ప్రత్యేకంగా వారి పేర్లు ప్రస్తావించనవసరం లేదు.

ఢిల్లీలో ఒకరు, ఇక్కడ మన పక్కనే ఒకరు. అంత బ్రహ్మాండంగా వారికి వచ్చిన వారసత్వాన్ని ఎందుకని వినియోగించుకొని తమ సామర్థ్యాన్ని నిరూపించుకోలేకపోతున్నారు?

జస్ట్ గూగుల్‌లో కొడితే చాలు, రెండక్షరాల్లో దేశం మొత్తం వారికి పెట్టిన ముద్దు పేరు ఎలా కనిపిస్తోంది? అందులో ఒకరు స్వయంగా పార్లమెంటులో మాట్లాడుతూ, తనకా ముద్దు పేరు ఉన్నట్టు ఒప్పేసుకోవడం మరో పెద్ద విశేషం.   

సో, ఇక్కడ వారసత్వం అనేది అసలు పాయింట్ కానేకాదు.

ప్రజలకోసం, దేశంకోసం ఏదో చేయాలన్న నిరంతర తపన, అది సాధించి చూపగల సామర్థ్యం ముఖ్యం.

అది కవితలో, కేటీఆర్ లో అత్యున్నతస్థాయిలో ఉంది. ఎం పి గా ఒకరు, మంత్రిగా ఒకరు .. వాళ్లిద్దరూ చేస్తున్న పనులు, సాధిస్తున్న విజయాలు, పొందుతున్న మెచ్చుకోళ్ల గురించి ఎంతయినా చెప్పవచ్చు. వాళ్లలో సత్తా ఉంది. వాళ్లు కేసీఆర్ వారసులు కావడం అనేది అసలు ఇక్కడ పాయింటే కాదు. 

కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్జిక్యూషన్‌లో హరీష్‌రావు అహోరాత్రులు ఎంత కృషి చేస్తున్నారో అందరికీ తెలిసిందే. పార్టీకి గానీ, ప్రభుత్వంలో ముఖ్యమైన పనులకు గానీ, హరీష్‌రావును ఒక "ట్రబుల్ షూటర్"గా విజయవంతంగా పనిచేయించుకోవడం కూడా అందరికీ తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో సిద్దిపేట ఇప్పుడొక మాడల్ టవున్ అయ్యిందంటే అతిశయోక్తికాదు. హరీష్‌రావు కేసీఆర్ మేనల్లుడు కావడం ఆయన తప్పుకాదు.

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ చాయిస్ ఉంటుంది. నిజంగా నీలో సత్తా ఉంటే, ఒంటరిగా ఏదయినా ప్రారంభించు. పోరాడు. సాధించు. ఎవ్వరూ నిన్ను ఆపలేరు.

2001 లో తన పోరాటం ప్రారంభించినప్పుడు కేసీఆర్ కూడా ఒక్కడే అన్న విషయం మనం మర్చిపోవద్దు.

వారసత్వం అంటే దేశం మీదపడేలా పెంచడం కాదు. దేశానికి ఉపయోగపడేలా పెంచాలి. ఈ విషయంలో కేసీఆర్ గారికి చాలా స్పష్టత ఉంది.  

Tuesday, 20 November 2018

టీఆరేస్ విజయం పక్కా!

టీఆరెస్ అతి పెద్ద మెజారిటీతో గెలవబోతున్నది.

నాకెందుకో అలా అనిపిస్తోంది.

ఇది జోస్యం కాదు. నా ఇంట్యూషన్ అలా చెబుతోంది.

అంతా ఒక పక్కా ప్లాన్‌లా జరుగుతున్నట్టుగా నేను ఫీలవుతున్నాను. ప్లాన్ అనే కంటే, "వ్యూహం" అనడం కరెక్టు అనుకుంటాను.

నా దగ్గర ఖచ్చితమైన సమాచారం అంటూ ఏం లేదు కానీ, కేసీఆర్ గారు చాలా కూల్‌గా ఒక వ్యూహం రచించి, దాని ప్రకారం, ఇంకా కూల్‌గా దానికదే ఎగ్జిక్యూట్ అవుతుండటం చూస్తున్నారని అనుకుంటున్నాను.

మాయాకూటమి ఎప్పుడో చేతులెత్తేసింది.

నిజానికి, టీఆరెస్ ఘనవిజయాన్ని ముందుగా గ్రహించిందీ, వెంటవెంటనే జాగ్రత్తపడిందీ కూడా ఆ కూటమి లేదా అందులోని కొందరు అన్నది చాలా స్పష్టంగా తెలిసిపోయింది.

టీఆరెస్ వేసుకొన్న 100 అంకె ఇప్పుడు 105 వరకూ వెళ్లింది.

ఇంక ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు అనేది ఒక ఫార్మాలిటీ మాత్రమే. స్వల్పంగా హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే, అది కేవలం మెజారిటీ విషయంలోనే.

చలో ... నేనైతే, డిసెంబర్ 11 తర్వాత, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ మరొకసారి ప్రమాణస్వీకారం చేసే రోజుకోసం చూస్తున్నాను.

జయహో కేసీఆర్!