Saturday, 7 March 2020

అన్ని కరోనాలు వైరస్‌లు కావు!

ఉదాహరణకు ఈ ఫోటోలోని అమ్మాయి...

లోపల్లోపల ఎంత భయంగా ఉన్నా... 'కరోనా' మీద లెక్కలేనన్ని కార్టూన్లు, మీమ్‌లు, టిడ్‌బిట్స్, ఎట్సెట్రా బోల్డన్ని వస్తున్నాయి.

సోషల్‌మీడియాలో క్రియేటివిటీ గురించి చెప్పేదేముంది?

ఈ ఫోటో కూడా అలాంటి క్రియేటివిటీలోంచి పుట్టిందే. ఆ అమ్మాయి షర్టుకున్న నేమ్ బ్య్యాడ్జ్ మీద 'కరోనా' అని ఉంది! 

ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా పుణ్యమాని మన సంస్కృతికి మళ్ళీ ఒక ఊపు వచ్చిందనిపిస్తోంది...

ఇప్పుడు ఎక్కడకెళ్లినా, ఎవరెదురైనా.. రెండుచేతులు జోడించి చక్కగా "నమస్కారం" పెడుతున్నారు. పెద్దా చిన్నా అంతా.

ఇది చేయలేనివాళ్ళు మామూలుగా "హాయ్" అంటూ చేయి ఊపుతున్నారనుకోండి. అది వేరే విషయం.

పలకరింపు విషయంలో మన "నమస్కారం" అన్నిరకాలుగా ఒక మంచి పధ్ధతి.

నా ఉద్దేశ్యంలో షేక్ హాండ్ అంత పరమ చెత్త అలవాటు ఇంకోటిలేదు...

పొద్దునలేస్తే కనీసం ఒక వందమందికి షేక్‌హాండిస్తూ పలకరిస్తాం. వారిలో ఎంతమంది చేతులు ఎంత పరిశుభ్రమైనవో ఎవ్వరైనా చెప్పగలరా?

ఎంతమంది జస్ట్ అప్పుడే ముక్కులో, మూతిలో, చెవిలో వేళ్ళు పెట్టుకొని ఉంటారు? ఎంతమంది ఎక్కడెక్కడో గోక్కొని ఉంటారు? ఎంతమంది అప్పుడే వాష్‌రూమ్‌కు వెళ్లి 'పాటపాడి' వచ్చుంటారు... చేతులు కడుక్కోకుండా...?!

నా అంచనా ప్రకారం ఒక 5% మంది మాత్రమే పై విషయాల్లో చాలా శుభ్రత పాటిస్తారు. మిగిలిన 95% మంది విషయంలో... షేక్ హాండిచ్చినవాళ్ళ ఖర్మ అనుకోవడం తప్ప మనం చేసేదేంలేదు.

అలాగని మనం రోజూ షేక్‌హాండిచ్చే వందమందిలో ఆ 5% మిస్టర్ నీట్స్, 95% డర్టీ డ్రాగన్స్  ఎవరన్నది ఎమ్మారై తీసినా ఎవరూ అంత ఈజీగా కనుక్కోలేరు.

ఈ టెన్షన్ కంటే సింపుల్‌గా ఒక "నమస్కారం" బెటర్...  

Friday, 6 March 2020

పబ్లిక్ అయిపోయిన పర్సనల్ డైరీ!

ఒకప్పుడు అందరికీ పర్సనల్‌గా డైరీలు రాసుకొనే అలవాటుండేది.

వాటిని ఎవరైనా పొరపాటున ఓపెన్ చేస్తే ఏదో అయిపోయినట్టు రోజులకి రోజులు విలవిల్లాడిపోయేవాళ్లం.

సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడా సున్నితత్వం, ఆ ఫీలింగ్స్ మనలో తుడిచిపెట్టుకుపోయాయి.

పర్సనల్ అంటూ ఇప్పుడేమీ లేదు. అంతా పబ్లిక్కయిపోయింది. మొత్తం ఆన్‌లైన్లో పెట్టేస్తున్నారు.

తాము సోషల్‌మీడియాలో పెట్టినవి అందరూ చదవకపోతేనే ఇప్పుడు బాధపడిపోతున్నారు జనాలు! 

పుట్టినరోజులు, పెళ్లిరోజులు, జీవనసహచరితో/సహచరునితో క్లోజ్ ఫోటోలు, వారిమధ్య గొడవలు, సరసాలు, లవర్స్, వారి లాంగ్‌డ్రైవ్‌ల వివరాలు, విరహాలు, ఆఖరికి తల్లి మరణిస్తే స్మశానంలో ఖననం చేస్తున్న సమయంలో ఫోటోలు... ఇంతకుమించిన ఉదాహరణలు ఇంకేం కావాలి?

దారుణం ఏంటంటే, ఆమధ్య ఒకతను ఆత్మహత్య చేసుకొంటూ ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్తడం!

మనం ఎంత వద్దనుకున్నా, మనం రాస్తున్నప్పుడు అప్పటి మన మానసిక, వ్యక్తిగత, సాంఘిక స్థితి... ఏదోరకంగా... ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన రాతల్లో కనిపిస్తుంది.

ఎంతో కంట్రోల్ ఉంటే తప్ప దాన్ని అణచలేం.

కొన్ని పరిమితులకు లోబడి, అసలు అలా అణచాల్సిన అవసరం లేదు.

మనిషికి ఒక "ఔట్‌లెట్" కావాలి. అది ఏరూపంలో అయినాకావచ్చు. బాధో, సంతోషమో అలా బయటకెళ్లిపోవాలి. లేదంటే బ్రతకలేడు.

ఇప్పటి జీవనశైలిలో అంత వత్తిడి ఉంది.

ఇది చాలదన్నట్టు - ఇప్పుడు ఫేస్‌బుక్‌లోనే వాట్సాప్ బటన్‌ను కూడా తగిలించేస్తున్నాడు జకెర్‌బర్గ్!

ఇంక జనాల చేతుల్లో మొబైల్స్ అసలు ఖాళీగా ఉంటాయా?

కొసమెరుపు ఏంటంటే, ఇన్నిరకాలుగా జనాలను ఫేస్‌బుక్‌కు ఎడిక్ట్ చేస్తున్న మార్క్ జకెర్‌బర్గ్ చేతిలో అసలెప్పుడూ మొబైల్ ఉండదు!

దటీజ్ బిజినెస్... 

Saturday, 29 February 2020

జీవితంలో ఆ స్వేచ్ఛ ముఖ్యం!

77 ఏళ్ల "మోస్ట్ సక్సెస్‌ఫుల్ మ్యాన్" అండ్ నా ఫేవరేట్ ప్రొఫెసర్ ఒకరు పొద్దున లేస్తే ఫేస్‌బుక్‌లో ఒక రష్యన్ బ్యూటీ ఫోటో పెడతారు. ఛీర్స్ అంటూ ఒక స్కాచ్ బాటిల్ బొమ్మ పెడతారు.

విషయం ఇక్కడ ఆయన ఏం పోస్ట్ చేస్తున్నారన్నది కాదు.

ఆయన అనుకున్నది చేస్తున్నారు!

ఒక కొడుకుగా, ఒక విద్యార్థిగా, ఒక ఉద్యోగిగా, ఒక లవర్‌బాయ్‌గా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక మామగా, ఒక తాతయ్యగా, ఒక రిటైర్డ్ ప్రొఫెసర్‌గా ... మా ప్రొఫెసర్ ప్రతి దశలోనూ తను అనుకున్నది చేశారు. అందరినీ మెప్పించారు. అందరి దృష్టిలో ఒక మోస్ట్ సక్సెస్‌ఫుల్ అండ్ మోస్ట్ కంప్లీట్ మ్యాన్‌గా ముద్రవేసుకున్నారు.

ఇప్పుడు ఆయన కొత్తగా సాధించాల్సిందీ, నిరూపించుకోవాల్సిందీ ఏమీ లేదు. కాబట్టే ఇంత స్వేచ్ఛగా తను అనుకున్నది చేయగలుగుతున్నాడు అనుకుంటాం మనందరం. 

కానీ, అది నిజం కాదు.

సుమారు గత 34 ఏళ్లుగా ఆయన నాకు బాగా తెలుసు. అప్పుడూ ఇప్పుడూ ఆయనలో ఎలాంటి మార్పు లేదు.

ఓయూ ఆర్ట్స్ కాలేజ్‌లో తన డిపార్ట్‌మెంట్ ముందు కారిడార్‌లో ఎలాంటి సంకోచం లేకుండా సిగరెట్ కాల్చేవారు. తనకంటే కనీసం పాతికేళ్లు చిన్నవారైన స్టుడెంట్స్‌తో రష్యన్ అమ్మాయిల అందం గురించి, మాస్కో యూనివర్సిటీ క్యాంపస్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి చేసుకొనే పార్టీల గురించి, చదువు గురించి, చదివే పద్ధతి గురించి, ఉద్యోగాల గురించీ... యూనివర్సిటీలో గొడవల గురించి, డిపార్ట్‌మెంట్‌లో రాజకీయాల గురించీ... చాలా ఫ్రీగా, ఎలాంటి హిపోక్రసి లేకుండా మాట్లాడేవారు.

ఏ నిజమైనా నిర్మొహమాటంగా మొహం మీదే చెప్పేవారు.

ఇలాంటి సంభాషణ యూనివర్సిటీలోని మా ఇతర ప్రొఫెసర్స్ దగ్గర జాడకైనా కనిపించేదికాదు. ప్రతి చిన్న విషయానికి నానా కవరింగులు, నానా మాస్కులు వేసి మాట్లాడేవాళ్లు. 

బహుశా తను అనుకున్నది మాట్లాడ్దం, అనుకున్నట్లే చేయడం అనే ఈ మైండ్‌సెట్టే, ఈ జీవనశైలే ఆయన అంత సంపూర్ణమైన మనిషిగా, అంత సక్సెస్‌ఫుల్ మ్యాన్‌గా రూపొందడానికి కారణమైందనుకుంటాను.

ఏదేమైనా, ఒక కంప్లీట్ మ్యాన్ అంటే నాకు ఠక్కున కళ్లముందు ఒక ఫ్లాష్‌లా మెరిసేది మా ప్రొఫెసరే.

ప్రాణం కంటే విలువైనది స్వేచ్ఛ.

ఎవరికైనా సరే, జీవితంలో ఆ స్వేచ్ఛ ముఖ్యం.

స్వేచ్ఛ ఒకరిస్తే వచ్చేది కాదు... ఎవరికివారు సంపాదించుకోవాల్సిందే. 

Friday, 21 February 2020

మనం బ్రతికేది ఎన్నిరోజులో ఒకసారి లెక్కేసుకుందామా?

మన పెద్దలు చాలా తెలివయినవాళ్లు. ఒకవైపు "నిదానమే ప్రదానం" అన్నారు. మరోవైపు, "ఆలస్యమ్ అమృతమ్ విషమ్" అని కూడా అన్నారు!

అవసరాన్నిబట్టి, సందర్భాన్నిబట్టి... ఈ రెంటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. ఆ నిర్ణయం మాత్రం మనదే.

ఆ నిర్ణయాన్ని కూడా తీసుకోవాల్సిన సమయంలో తీసుకొన్నవాడే విజేత. అది ఏ విషయంలోనయినా కావొచ్చు. సరైన నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకోవడం అనేది మాత్రం చాలా ముఖ్యం.

ఇందాకే చదివిన ఇంకో పాయింటు నన్ను అమితంగా కలచివేస్తోంది...

సగటున ఒక మనిషి జీవించేది 24,869 రోజులట!

అంటే సుమారు 68 ఏళ్లన్నమాట! తక్కువేం కాదు...

ఈ లెక్కన నేను బ్రతకడానికి ఇంకా చాలా వేల రోజులున్నాయి.

కాని, ఏంటి గ్యారంటీ?

ఏ ట్రాఫిక్ లేని సమయంలోనో రోడ్డు దాటుతోంటే, ఏ "పల్సర్"వాడో ఎక్కడ్నుంచో వచ్చి గుద్దేసి చంపేయొచ్చు. ఏ క్యాన్సరో ఎటాక్ అయి ఠపీమని పోవచ్చు. మనం ఎక్కిన ఏ బెంగుళూరు బస్సో తగలబడిపోవచ్చు.

గ్యారెంటీ ఏదీ లేదు.

దేనికీ లేదు.

అలాగని, ఇది నా నెగెటివ్ థింకింగ్ కాదు.

రియాలిటీ.

అయినా సరే... ఆ అంకెలు, ఆ లెక్కలే కళ్లముందు కనిపిస్తున్నాయి నాకు.

ఈ ఊహించని ప్రమాదాలు, రిస్కుల మధ్య ఇంకో పదేళ్లు బ్రతుకుతాము అనుకొంటే... అది జస్ట్ ఇంకో 3650 రోజులే!

లేదు, "అయిదేళ్లకంటే కష్టం" అనుకొంటే... అది జస్ట్ ఇంకో 1825 రోజులే!!

అంటే... ఇంక కౌంట్‌డౌన్ స్టార్ట్ అయినట్టేగా?!

మనం ఏదో అనుకుంటాం. ఏదో భ్రమలో బ్రతుకుతూ ఉంటాం. "ఇంకా టైమ్ చాలా ఉంది" అనుకుంటాం.

ఏదైనా కష్టం వస్తే భగవంతునిమీద భారం వేస్తాం. సుఖాల్లో ఉన్నప్పుడు అసలావైపే చూడం.

కాని... చూస్తుండగానే సంవత్సరాలు, దశాబ్దాలు ఇట్టే గడిచిపోతుంటాయి.

అసలు ఈ కోణంలో ఆలోచించడమే కష్టం...

అయితే ఇది భయం మాత్రం కాదు.

ఒకవేళ భయం అనుకున్నా, ఆ భయం నా చావు గురించి కాదు. చచ్చేలోపు నేను పూర్తి చేయాల్సిన బాధ్యతలను, పనులను ఎక్కడ అసంపూర్ణంగా వదిలిపెడతానో అన్న ఆందోళన.

ఒకవేళ దీన్ని భయం అనుకుంటే, ఈ భయం ఎవరికైనా సరే చాలా అవసరం.

నా విషయంలో అయితే... నిజంగా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి...

నా జీవితంలో మొట్టమొదటిసారిగా, పూర్తిచేయాల్సిన నా బాధ్యతల గురించి ఇప్పుడు నేను బాగా ఆలోచిస్తున్నాను.

ఈ విషయంలో ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకోడానికి ఇంతకంటే గొప్ప అవకాశం ఇంకెప్పుడొస్తుంది నాకు?

ఇప్పుడు కూడా నేను తొందరపడకపోతే, నిజంగా ఆలస్యమ్ అమృతమ్ విషమే!

Thursday, 20 February 2020

థాంక్ గాడ్!

పోస్టు పాతదే...

ఇదే బ్లాగ్‌లో కొన్ని నెలలక్రితం రాశాను. సందర్భం వచ్చి, ఇప్పుడు మళ్లీ  రాయాలనిపించింది.

కట్ చేస్తే -  

ఆమధ్య ఒక మాతాజీ ఉవాచ చదివాను.

మన కష్టాలు ఎవరితోనూ చెప్పుకోవద్దట. చెప్పుకున్నా లాభం ఉండదట.

ఒకవేళ చెప్పుకున్నా .. 20% మంది అసలు పట్టించుకోరట. 80% మంది "వీడికి బాగా అయ్యిందిలే" అని ఎంజాయ్ చేస్తారట.

ఏదన్నా ఉంటే ఆ పైవాడికి చెప్పుకోవడం బెటర్.. అంతా ఆయనే చూసుకుంటాడు అని.

"మతం అనేది మానవ సృష్టి" అనేది నేను బాగా నమ్ముతాను.

అలాగని నేను నాస్తికున్ని కాదు.

ఎదుటివాడిని బాధపెట్టనంతవరకు, అందరి వ్యక్తిగత నమ్మకాలను నేను విధిగా గౌరవిస్తాను.

అదొక క్రమశిక్షణ.

అదొక సంస్కారం.

అంతే.

ఇందాక మాత చెప్పినదాంట్లో .. "ఏదన్నా ఉంటే ఆ పైవాడికి చెప్పుకోండి. అంతా ఆయనే చూసుకుంటాడు" అన్న చివరి వాక్యం గురించి నాకంతగా తెలీదు. కానీ, ఆమె చెప్పిన అసలు పాయింట్‌లో మాత్రం చాలావరకు వాస్తవం ఉందని నేననుకుంటున్నాను.

లెక్కలోనే నాకు తోచిన ఒక చిన్న సవరణ...

మన కష్టాలు విని 80% ఎగతాళి చెయ్యొచ్చు. 19% అసలు కేర్ చెయ్యకపోవచ్చు.

కానీ 1% మాత్రం స్పందిస్తారు. కనీసం వింటారు. సహాయం చెయ్యకపోయినా ఒక నైతికబలాన్నిస్తారు. నీ ఇబ్బంది గురించి తెల్సిన నేనొకర్ని ఉన్నాను. నువ్వేం ఒంటరివి కాదు. పోరాడు. సమస్యను పరిష్కరించుకో. అది నీకు సాధ్యమే అన్న ఒక భరోసాని వారి ఉనికి ద్వారానే తెలియజేస్తారు.

ఇది నిజంగా చాలా పెద్ద సహాయం.

ఈ 1% మాత్రమే మన మిత్రులు, శ్రేయోభిలాషులు.

కంటికి కనిపించే మన నిజమైన దైవాలు. 

Wednesday, 19 February 2020

'30:30:40' ... ది రీస్ ఫిలాసఫీ!

"మన జీవితంలోని ఏ దశలోనైనా,
మన చుట్టూ ఉన్నవారిలో.. 
30 శాతం మందే మనల్ని ప్రేమిస్తారు.
30 శాతం మంది మనల్ని ద్వేషిస్తారు.
మిగిలిన 40 శాతం మంది
అసలు మన గురించి పట్టించుకోరు!"

గాబ్రియెలె రీస్ ఎంత సింపుల్‌గా చెప్పింది!

అమెరికన్ బీచ్ వాలీబాల్ స్టార్, ఫ్యాషన్ మోడల్, నటి, స్పోర్ట్స్ ఎనౌన్సర్, టీవీ హోస్ట్, ప్రేయసి, తల్లి, భార్య, (క్రమం అదే!) అథ్లెట్, ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్, బెస్ట్ సెల్లర్ రైటర్, మొత్తంగా ప్రపంచం మెచ్చిన ఒక సెలబ్రిటీ ...

ఇవన్నీ కలిస్తే ఒక గాబ్రియెలె రీస్.

ఫ్లారిడా స్టేట్‌కు వాలీబాల్ ఆడుతున్నప్పుడే రీస్ లుక్స్‌కి పడిపోయి ఫాషన్ మోడలింగ్ ఆమెని ఆహ్వానించింది. తర్వాత, "సెరెండిపిటీ" వంటి చిత్రాల్లో నటిగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. తర్వాత స్పోర్ట్స్ అనౌన్సర్‌గా, టీవీ హోస్ట్‌గా  ESPN, NBT, MTV Sports, Fit TV/Discovery వంటి పాప్యులర్ చానెల్స్‌లో వద్దంటే అవకాశాలు.

తర్వాత.. తనకు నచ్చిన స్నేహితునితో సహజీవనం చేసింది. ఇద్దరు అమ్మాయిలకు తల్లి అయింది. ఆ తర్వాతే తన సహజీవన నేస్తాన్ని పెళ్లి చేసుకొని భార్య అయింది. తర్వాత అథ్లెట్ అయింది. ఫిట్‌నెస్ ట్రైనర్ అయింది. మధ్యలో గోల్ఫ్‌ని కూడా వదల్లేదు. రెండు పుస్తకాలు రాసి బెస్ట్ సెల్లర్ రైటర్ కూడా అయింది రీస్.

ఇవి చాలవూ.. రీస్ ప్రపంచస్థాయి సెలెబ్రిటీగా పాప్యులర్ కావడానికి?

తను ఎన్నుకున్న ప్రతిరంగంలోనూ సక్సెస్ సాధించింది. తన మనస్సాక్షినే నమ్మింది. తను అనుకున్నది చేసుకుంటూపోయింది. తను కోరుకున్న జీవనశైలినే ఎంజాయ్ చేస్తూ హాయిగా సంతృప్తిగా జీవిస్తోంది రీస్.

మనకు తెలిసి, మనకున్న ఈ ఒక్క జీవితానికి అంతకన్నా ఏం కావాలి?

దటీజ్ గాబ్రియెలె రీస్ ...

కట్ టూ రీస్ ఇంటర్వ్యూ - 

ఈ మధ్యే రీస్ ఇంటర్వ్యూ ఒకటి విన్నాను. ఆ ఇంటర్వ్యూ మొత్తంలో నాకు నచ్చిన ఒకే ఒక్క మాట ఇది:

"మన జీవితంలోని ఏ దశలోనైనా, మన చుట్టూ ఉన్నవారిలో..  30 శాతం మందే మనల్ని ప్రేమిస్తారు. 30 శాతం మంది మనల్ని ద్వేషిస్తారు. మిగిలిన 40 శాతం మంది అసలు మన గురించి పట్టించుకోరు!"

ఈ జీవితవాస్తవం తెలిసినవాళ్లు అసలు దేన్నీ పట్టించుకోరు. తాము చేయాలనుకొన్నది చేసుకొంటూ వెళతారు.

కంప్లీట్ ఫ్రీడమ్! 

రీస్ విజయాల పరంపర వెనకున్న అసలు ఫిలాసఫీ ఇదన్నమాట!

సమాజంతో ముడిపడ్డ, సమాజంపట్ల మన మైండ్‌సెట్‌తో ముడిపడ్ద ఒక గొప్ప జీవితసత్యాన్ని చాలా సింపుల్‌గా చెప్పింది రీస్.

ఇంటాబయటా రకరకాల వత్తిళ్లతో, తీవ్రమైన స్ట్రెస్‌లో నేనున్న ఈ సమయంలో... ఈ సత్యం... ప్రపంచంపట్ల నా దృక్పథాన్నే సంపూర్ణంగా మార్చివేసిందంటే నేనే నమ్మలేకపోతున్నాను.

కానీ నిజం.

Tuesday, 18 February 2020

ఏదీ ఆగిపోకూడదు!

కుదిరితే పరిగెత్తు,
లేకపోతే నడువు.
అదీ చేతకాకపోతే,
పాకుతూ పో...
అంతేకానీ ఒకే చోట అలా
కదలకుండా ఉండిపోకు...
- శ్రీశ్రీ

గతకొద్దిరోజులుగా పూర్తిగా ఒకే ఒక్క లక్ష్యం ఫోకస్డ్‌గా పనిచేసుకొంటూ వెళ్తున్నాను.

స్వల్ప అనారోగ్యం ఇబ్బంది పెడుతున్నా, మరోవైపు సర్జరీ అయిన నా ఎడమకాలు ఊహించని సమయాల్లో స్టక్ అవుతూ, నడవనీయకుండా ఇబ్బందిపెడుతున్నాపెద్దగా పట్టించుకోవడంలేదు.

నా కొత్త సినిమా, కొత్త ఆఫీసు ప్రారంభించేదాకా వేటినీ పట్టించుకొనే మూడ్‌లో నేను లేను. నా టీమ్ లేదు. 

ఆ అవకాశం కూడా మాకు లేదు.

సుమారు పదిరోజులుగా సోషల్ మీడియాను పూర్తిగా మర్చిపోయాను.

'వ్రాయడం' నా ఫస్ట్ లవ్ కాబట్టి... ఒక స్ట్రెస్ బస్టర్‌లా, ఒక యోగాలా, ఒక థెరపీలా నాకు ఉపయోగపడుతుంది కాబట్టి... అప్పుడప్పుడూ ఏదో ఒకటి ఇలా బ్లాగ్‌లో స్క్రిబిల్ మాత్రం చేస్తున్నాను.

ఒక వారం పడుతుందో, నెల పడుతుందో తెలీదుగాని, ఒక నిర్మాణాత్మకమైన పర్పస్ లేకుండా  ఊరికే ఏవో టైమ్‌పాస్ పోస్టులు, ట్వీట్లు ఈ సమయంలో నాకస్సలు ఇష్టం లేదు. 

ఇప్పటిదాకా సెకండరీగా తీసుకొని, నేను పెద్దగా పట్టించుకోని సినిమాను ఇప్పుడు కొంతకాలం నా ప్రైమరీ ప్రొఫెషన్‌గా తీసుకొంటున్నాను. వరుసగా సినిమాలు చేసుకొంటూపోవడమే పని.

మధ్యలో కేసీఆర్ మీద నేను రాసి పబ్లిష్ చేస్తున్న పుస్తకం, నా సినిమాస్క్రిప్టు రచనాశిల్పం రివైజ్‌డ్ సెకండ్ ఎడిషన్ పుస్తకం... వరుసగా విడుదలకు లైన్లో ఉన్నాయి.

ఇంకా... ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ డాక్యుమెంటరీ, యాడ్ ఫిలింస్, మ్యూజిక్ వీడియోలు, వెబ్ సీరీస్‌లు, ప్రమోషన్ ఈవెంట్స్, ఫ్యాషన్‌షోలు, అవార్డ్ ప్రోగ్రాములూ, చారిటీ యాక్టివిటీ...  ఎట్సెట్రా ఎట్సెట్రా...       

సో మచ్ టు డు, సో లిటిల్ టైమ్...

“What you focus on expands. So focus on what you want, not what you do not want.”
― Esther Jno-Charles

Sunday, 16 February 2020

గాయం ఏదైనా కానీ...

మనిషన్నాక మనసంటూ ఒకటి ఉండక తప్పదు. మనసంటూ ఉన్నాక అది ఏదో ఒకరోజు గాయపడకా తప్పదు.

కారణం ఏదైనా కానీ, భరించేవారికే ఆ నొప్పి తెలుస్తుంది.

ఈ భూమ్మీద ఏదైనా ఒక మనసు బాధపడుతోందంటే ప్రధానంగా రెండే రెండు కారణాలుంటాయి:

ఒకటి మానవ సంబంధాలు. రెండోది ఆర్థిక సంబంధ కారణాలు.

ఇవి వ్యక్తిగతం.

కులాలు, మతాలు, జాత్యహంకారం, భౌతికపరమైన హింస... ఇలాంటివన్నీ మూడో కారణం  అనుకోవచ్చు.

ఇవి సాంఘికం లేదా సామాజికం.

గాయం ఏదైనా కానీ, అది మనకు బాధకలిగిస్తుంది.

కొన్ని సందర్భాల్లో ఆ పెయిన్ ఊహించలేనంత స్థాయిలో ఉంటుంది.

అయితే ఈ నొప్పి మనకు కలిగేది బాధపడటానికో, విచారపడడానికోకాదు... 'ఊహించనివిధంగా ఇలాంటి సందర్భాలు కూడా వస్తాయి జీవితంలో' అని మనల్ని అలర్ట్ చేయడానికి!

మనం ఎంత పెయిన్‌లో ఉన్నా, ఇంత పాజిటివ్‌గా ఆలోచించడం కూడా మనకు చాలా అవసరం.

ఎక్కన్నించో ఒక పదునైన బాణం ఏదో ఒక రూపంలో వచ్చి, సూటిగా గుండెల్లోకి దిగి, లోతైన గాయంచేసినప్పుడే కదా... నిజంగా మనం బాధపడేదీ, అలర్ట్ అయ్యేదీ...

"మనం అడవిలో ఉన్నాం అనుకొని ఎప్పుడూ అలర్ట్‌గా ఉండాలి. ఎప్పుడు, ఏవైపునుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో మనకు తెలీదు!"

కొన్ని నిజాల్ని పూరి జగన్నాథ్ చెప్పినంత బాగా మరొకరు చెప్పలేరు.     

Saturday, 15 February 2020

నేను బాగా ఇష్టపడే అందం

ఓ ఆరునెలల క్రితం అనుకుంటాను, ఈ బ్లాగ్‌లోనే, ఇదే టాపిక్ మీద ఒక పోస్ట్ రాశాను...

వైజాగ్, సముద్రం...

అవి నన్ను ఇంకా హాంట్ చేస్తున్నాయి. అందుకే మళ్లీ రాయాలనిపించింది. రాస్తున్నాను.

ఈ మధ్య నా ప్రొఫెషనల్ పనులమీద వైజాగ్ ఎక్కువసార్లు వెళ్తున్నాను.

వైజాగ్ నాకు చాలా బాగా, ప్రశాంతంగా, అందంగా కనిపిస్తోంది. ఏవిటా అందం అంటే తడుముకోకుండా కనీసం ఒక డజన్ అంశాల్ని చెప్పగలను.

వాటిల్లో నేను బాగా ఇష్టపడే అందం - సముద్రం.

సముద్రం మీద వ్యామోహంతో ఇంతకుముందు నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు .. ఎక్కువగా గోవా, పాండిచ్చేరిలకు వెళ్లేవాణ్ణి. ఈ రెండూ నాకు ఇప్పటికీ చాలా ఇష్టమైన ప్రదేశాలు. దేని ప్రత్యేకత దానిదే.

అయితే .. గోవా, పాండిచ్చేరిల కంటే ఇప్పుడు వైజాగే నాకు మరింత బాగా అనిపిస్తోంది.

బీచ్ రోడ్దు నుంచి భీమిలీ దాకా .. అలా సముద్రాన్ని చూసుకొంటూ కార్లో వెళ్తూ, నచ్చినచోట దిగి కాసేపు ఆగుతూ, రోజులకి రోజులే గడిపేయొచ్చు.

నాకెప్పుడు అవకాశం దొరికినా నేనిదే పని చేస్తాను.

ఈపని చేయడం కోసం, నా పనుల్లో ఎంతవరకు వీలైతే అంతవరకు ఇక్కడే వైజాగ్‌లో చేసుకోగలిగే అవకాశాల్ని సృష్టించుకొంటాను. ఈ బ్లాగ్ రాయడానికి కొన్ని నిమిషాల ముందువరకూ కూడా నేను చేసిందదే.

ఒక వారం రోజుల ఘోస్ట్ రైటింగ్ వర్క్ వుంది. ఈసారి ఆ పనిని వైజాగ్‌లో పూర్తిచేయడానికి ప్లాన్ చేస్తున్నాను.

తర్వాత నా సినిమాకోసం కూడా స్క్రిప్ట్ రైటింగ్ పూర్తిచేయాల్సివుంది. ఈ పని కూడా వైజాగ్‌లోనే ప్లాన్ చేస్తున్నాను.

సముద్రం అంటే నాకంత ఇష్టం.

సముద్రాన్ని నేనంతగా ప్రేమిస్తాను.

సముద్రం ఉన్నందుకు వైజాగ్‌ని మరింతగా ప్రేమిస్తాను.

అంతా ఒక స్పిరిచువల్ కనెక్షన్... 

Friday, 14 February 2020

ఈ రివ్యూకి ఎన్ని చుక్కలివ్వొచ్చు?

> సెకండాఫ్‌లో డైరెక్టర్‌ పూర్తిగా తేలిపోయాడు.
> కథను ఏ కోణంలో రక్తికట్టించలేకపోయాడు.
> బోరింగ్‌, సాగదీత సీన్లు థియేటర్‌లో ఉన్న ప్రేక్షకుడి ఓపికకు పరీక్ష పెట్టేలా ఉంటాయి.
> కొన్ని ఎమోషన్‌ సీన్లు కట్టిపడేసేలా ఉంటాయి.
> 'ప్రీ క్లైమాక్స్‌కు ముందు విజయ్‌ ఇచ్చే స్పీచ్‌ సినిమాను నిలబెట్టే విధంగా ఉంటుంద'నుకున్న తరుణంలో.. అర్జున్‌రెడ్డి క్లైమాక్స్‌తో దర్శకుడు సినిమాను ముగిస్తాడు.
> కథ కొత్తగా, వినూత్నంగా ఉంది.
> సీన్లు కూడా బాగున్నాయి.
> విజయ్‌ దేవరకొండ నటన ఈ సినిమాకు ప్రాణం పోసింది.
> అయినా ఎక్కడా కూడా ప్రేక్షకుడికి ఈ సినిమా కనెక్ట్‌ కాలేదు.
> దర్శకుడు తన ప్రతిభను, మ్యాజిక్‌ను తెరపై పర్‌ఫెక్ట్‌గా చూపించడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. 

> సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.
> హీరో, హీరోయిన్లను చాలా అందంగా చూపించారు.
> స్క్రీన్‌ ప్లే గజిబిజీగా కాకుండా సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యే విధంగా ఉంటుంది.
> ఎడిటింగ్‌పై కాస్త దృష్టి పెట్టి కొన్ని సీన్లకు కత్తెర వేయాల్సింది.
> పాటలు ఓ మోస్తారుగా ఉన్నాయి.
> బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ కొన్ని చోట్ల మె​స్మరైజ్‌ చేసేలా ఉంటుంది.
> క్రాంతి మాధవ్‌ అందించిన మాటలు ఆకట్టుకుంటాయి.
> ‘కలం కాగితం లేకుండా ప్రపంచ చచ్చిపోతుంది, రాయడం అంటే రచయిత తన ఆత్మను పంచడం' అంటూ చెప్పే డైలాగ్‌లు ఆలోచించే విధంగా ఉంటాయి. 
> నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి.
> నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గలేదని సినిమాను తెరపై చూస్తే అర్థమవుతుంది.
> చివరగా సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రం ప్రేక్షకుడికి కనెక్ట్‌ కాకపోయినా విజయ్‌ దేవరకొండ కనెక్ట్‌ అయ్యాడు.

కట్ చేస్తే - 

పైన మీరు చదివిందంతా ఇప్పుడే ఆన్‌లైన్లో నేను చదివిన ఒక రివ్యూలోని చివరి రెండు పేరాగ్రాఫులు. క్లారిటీ కోసం వాక్యం కింద వాక్యం పెట్టాను. 

"కథ కొత్తగా వినూత్నంగా ఉంది. దర్శకుని స్క్రీన్‌ప్లే బాగుంది. అతను రాసిన మాటలు బాగున్నాయి. సీన్లు కట్టిపడేసేలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. హీరోయిన్లను చాలా అందంగా చూపించారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్నిచోట్ల మెస్మరైజ్ చేస్తుంది. నిర్మాత ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గలేదు. హీరో విజయ్ దేవరకొండ నటన సినిమాకు ప్రాణంపోసేవిధంగా ఉంది..."

ఒక సినిమా విజయానికి ఇవన్నీ అతిముఖ్యమైనవి. మరి సినిమాకు మాత్రం రెండుంపావు చుక్కలే! అదే స్టార్స్...

ఒక వాక్యంలో ఒకటి బాగుందని చెప్తూ, ఇంకో వాక్యంలో ఒకటి బాగాలేదని చెప్తూ, ఇంత గొప్ప "బ్యాలెన్సింగ్" టోన్‌లో రాసిన ఈ రివ్యూ చదివిన ప్రేక్షకులు అసలు సినిమా బాగుందనుకోవాలా బాగాలేదనుకోవాలా?   

ఇదిలా వుంటే -

"వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రం ప్రేక్షకుడికి కనెక్ట్‌ కాకపోయినా విజయ్‌ దేవరకొండ కనెక్ట్‌ అయ్యాడు" ... ఈ చివరివాక్యం నాకు అస్సలు అర్థంకాలేదు!

సరదాగా... రివ్యూలకి కూడా చుక్కలిస్తే ఎలా ఉంటుంది?
Just kidding...   :)
^^^

Disclaimer:
ఈ సినిమా హీరోగానీ, దర్శకుడుగానీ, నిర్మాతగానీ నాకు చుట్టాలు కాదు.