Monday, 12 November 2012

మా మురుంకర్ సర్


ఓయూ లో నేను చదివిన మూడేళ్ల రష్యన్ డిప్లొమా లో నన్ను అమితంగా ప్రభావితం చేసిన మురుంకర్ సర్ గురించి నేను ఎంతయినా రాయగలను. కానీ, నేనలా చేయబోవటంలేదు. నా రష్యన్ క్లాస్ మేట్స్ ఎవరికీ తెలియనిదీ, సర్ మనసునీ, గొప్పతనాన్ని తెలిపేదీ అయిన ఒకే ఒక్క విషయం మాత్రం ఈ బ్లాగ్ పోస్ట్ లో తప్పకుండా చెప్పాలనుకుంటున్నాను.

అది 1989 అనుకుంటాను. 72% మార్కుల డిస్టింక్షన్ తో నాకు BLISc లో గోల్డ్ మెడల్ వచ్చింది. అది నేను అస్సలు ఊహించని విషయం. నాకూ, రెండో ర్యాంకుకు మధ్య కనీసం 40 మార్కుల తేడా! ఇప్పటికీ అదే రికార్డ్ అని మా వాళ్లు చెప్తారు. అది వేరే విషయం.

గోల్డ్ మెడల్ వచ్చినందుకు అంతకు ముందటి నా MA క్లాస్ మేట్స్, నా BLISc క్లాస్ మేట్స్ అందరూ నాకు కంగ్రాట్స్ చెప్పారు. ఆ రాత్రి - నా MA క్లాస్ మేట్ రామ్‌దాస్, యూనివర్సిటీ  ఫుట్ బాల్ స్టేడియం పై అంచు మీదకి ఎక్కించి మరీ నాకు పార్టీ ఇచ్చాడు. (ఆ పార్టీ గురించి మరో సారి ఇంకో బ్లాగ్ పోస్ట్ రాయాలి!) నా రష్యన్ డిప్లొమా క్లాస్ మేట్స్ కూడా బాగా అభినందించారు. యూనివర్సిటీ కేంటీన్లో, బయటా - వాళ్ల రేంజిలో వాళ్లు  "ట్రీట్"లు కూడా ఇచ్చారు.  అప్పుడు చాలా ఇబ్బంది పడ్డ విషయం, ఇప్పుడు ఆలోచిస్తేనే నవ్వొచ్చే విషయం ఏంటంటే - అలా నాకు పార్టీ ఇచ్చిన నా రష్యన్ క్లాస్ మేట్స్ అంతా అమ్మాయిలే!

ఇదిలా ఉంటే - ఒక రోజు మా రష్యన్ క్లాస్ అయిపోయాక, మురుంకర్ సర్ నన్ను పక్కకి పిల్చి అడిగారు - "తర్వాతేంటి?" అంటూ. "ఏముంది సర్, ఏదయినా జాబ్ చూసుకుని చేరిపోతాను" అన్నాను సింపుల్ గా.

"లేదు, నువ్వు MLISc ఎంట్రన్స్ రాయి. నీకు సీట్ ఈజీగా వస్తుంది. అది పూర్తయ్యాక జాబ్ చెయ్యి" అన్నారు సర్.

అప్పటికే యూనివర్సిటీలో నాకు మూడేళ్లు నిండాయి. ఇంకో సంవత్సరం కష్టపడాలంటే నా వల్ల కాదనిపించింది. వెంటనే సర్ కి సమాధానం చెప్పలేకపోయాను ..

బహుశా ఆ మర్నాడు అనుకుంటాను. సర్ ఆర్ట్స్ కాలేజ్ లో ఉన్న SBH బ్యాంక్ దగ్గర తన ట్రేడ్ మార్క్ అయిన పాత "ల్యాంబ్రెట్టా" స్కూటర్ పార్క్ చేస్తూ కనిపించారు. "జ్ద్రాఫ్ స్త్ వూయిత్సే!" అని రష్యన్ లో మామూలుగా ఎప్పట్లాగే విష్ చేశాను.

రమ్మంటూ, సర్ నన్ను తనతోపాటు బ్యాంకులోపలికి తీసుకెళ్లారు. అయిదు నిమిషాల్లో తన పని ఏదో ముగించుకున్నారు. తర్వాత – లోపలే, అక్కడున్న బెంచీ మీద తన పక్కనే నన్ను కూర్చోమన్నారు. ఇబ్బందిగా ఫీలవుతూనే కూర్చున్నాను.

అప్పుడు, అక్కడ, సర్ నాతో మాట్లాడిన మాటలన్నిటినీ అక్షరం అక్షరం చెప్పలేను గానీ, వాటన్నిటి సారాంశాన్ని మాత్రం ఇక్కడ క్లుప్తంగా రాస్తున్నాను ..

"MLISc కోసం ఇంకో సంవత్సరం క్యాంపస్ లో ఉండి చదవటం నీకు ఆర్థికంగా వీలుకాదని నాకు అర్ధమవుతోంది. కానీ, నా మాట విని నువ్వు MLISc చదువు. 'MLISc కూడా అప్పుడే చదివుంటే నాకు ఇంకా మంచి జాబ్స్ వచ్చేవే' అని నువ్వు ఫ్యూచర్ లో బాధపడతావు. అలా పడకూడదనే చెప్తున్నాను. నీకు సీట్ తప్పకుండా వస్తుంది. చూస్తుంటే సంవత్సరం ఈజీగా గడిచిపోతుంది." అన్నారు సర్.

నేనేం చెప్పలేకపోయాను. అలాగే నిశ్శబ్దంగా ఉన్నాను ..

"నీకు కావాలంటే ప్రతినెలా పాకెట్ మనీ నేనిస్తాను. దాని గురించి నువ్వు వర్రీ కావొద్దు!" - అని, నెల నెలా తను నాకు ఇవ్వగలిగిన పాకెట్ మనీ ఎంతో ఒక ‘అంకె’ చెప్పారు. అంతకు మించి మాత్రం ఇవ్వలేనన్నారు.

కానీ నిజానికి, ఎక్కడో వరంగల్ నుంచీ; అందులోనూ, చదువు గురించి అసలు ఏమాత్రం తెలియని బ్యాగ్రౌండ్ నుచి వచ్చిన నాకు అదే ఒక పెద్ద అంకె!

సర్ చెప్పినట్టుగానే MLISc ఎంట్రన్స్ రాశాను. మొత్తం సీట్లు పది లోపే అయినా, టాప్ ర్యాంకులో నాకు సీట్ వచ్చింది. చేరిపోయాను. నిజానికి ఇదంతా నా క్లోజ్ ఫ్రెండ్స్ కి కూడా తెలియదు. ఏదో మామూలుగా అందర్లాగే, BLISc తర్వాత, MLISc చేస్తున్నాడు అనే అనుకున్నారంతా.

MLISc చదువుతున్న చివరి రోజుల్లోనే జవహర్ నవోదయ విద్యాలయ, గుంటూరులో నాకు మొదటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఆ జాబ్ లో చేరి పని చేస్తూనే, లీవ్ పెట్టి వచ్చి, ఇక్కడ హైద్రాబాద్ లో MLISc పరీక్షలు రాశాను.

మురుంకర్ సర్ ఆ రోజు నాకు బ్యాంకులో ఆఫర్ చేసిన ఆర్థిక సహాయాన్ని నేను తీసుకోలేదు. నా MA మిత్రుడు దయానంద్ రావ్ ద్వారా బర్కత్ పురా లో ఒక అబ్బాయికి హిందీ ట్యూషన్ చెప్తూ కొన్నాళ్లు, మరో పార్ట్ టైం జాబ్ చేస్తూ కొన్నాళ్లు అడ్జస్ట్ అవుతూ.. ఎలాగో సర్ చెప్పిన సలహాను పాటించి, MLISc చదివాను. అందులో కూడా  యూనివర్సిటీ టాపర్ గా నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. అది కూడా నేను అస్సలు ఊహించని విషయం. ఆ MLISc ఉండటం వల్లనే తర్వాత నాకు ఆలిండియా రేడియో లో జాబ్ వచ్చింది .. 

మురుంకర్ సర్ మనసునీ, గొప్పతనాన్నీ తెలిపే ఇలాంటి ఉదాహరణలు నేనూ, నా రష్యన్ డిప్లొమా క్లాస్ మేట్స్ ఎన్నయినా చెప్పగలం ..

కుడి చేతికి ఉన్న తన వాచ్ ని ఎప్పుడూ అడ్జస్ట్ చేసుకుంటూ, అప్పుడప్పుడూ ఒక సిగరెట్ వెలిగిస్తూ, ఎంతో సింపుల్ గా, తన పాత గ్రీన్ "ల్యాంబ్రెట్టా" మీద తిరిగిన మా మురుంకర్ సర్ గురించి - మా బ్యాచ్ స్టూడెంట్స్ కి తెలిసినంతగా బహుశా మిగిలిన బ్యాచ్ ల వాళ్లకు తెలియక పోవచ్చు.  నిజానికి మురుంకర్ సర్ దగ్గర పాఠాలు నేర్చుకున్న ఏ స్టూడెంటయినా ఆయన్ని అంత సులభంగా మర్చిపోవటం జరగదు.

అలాంటి మురుంకర్ సర్ ని చాలా కాలంగా కలవలేకపోవడమనేది ఆయన విద్యార్థులెవరికయినా గిల్టీగానే ఉంటుంది. నా క్లాస్ మేట్ స్వరూపతో కలిసి, 22 ఏళ్ల తర్వాత,  మొన్న సర్ ని కలవడానికి వెళ్లినపుడు నేను ఫీలయిన గిల్టీ కూడా అలాంటిదే!    

Saturday, 10 November 2012

నా రష్యన్ డిప్లొమా


చేతుల నిండా కందెన మరకలతో, ఎక్కడో ఫ్యాక్టరీల్లో మెషినిస్టుగా పనిచేసుకుంటూ ఉండేవాన్ని .. అనుకోకుండా ఒక రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కి వెళ్ల్లాల్సివచ్చింది. అంతే. ‘ఈ ఆర్ట్స్ కాలేజ్ లో పీజీ చేయకపోతే నా లైఫ్ వేస్ట్’ అనిపించింది.

కట్ చేస్తే - 

కాకతీయ యూనివర్సిటీ నుంచి డిగ్రీ ప్రయివేటుగా (ఎక్స్ టర్నల్) రాశాను. దాని రిజల్ట్స్ రాకముందే, ఇక్కడ ఉస్మానియాలో తెలుగు, ఆర్కియాలజీ, ఫిలాసఫీ లకు ఎంట్రన్సులు రాశాను. మూడిట్లోనూ మంచి ర్యాంకుల్లో సీట్లొచ్చాయి. ఓయూ ఎంట్రన్స్ రిజల్ట్స్ తీసుకుని కేయూ కి వెళ్లాను - నేను రాసిన డిగ్రీ రిజల్ట్స్ కోసం!

కట్ చేస్తే -

ఎమ్మే తెలుగులో చేరాను, తెలుగే కదా చాలా ఈజీగా ఉంటుందనుకుని.  చేరాకగాని అసలు విషయం తెలియలేదు! ఎం ఏ స్థాయిలో తెలుగు చదవటం చాలా కష్టం. అలా, పదో తరగతి ఫెయిలయ్యాక, డైరెక్ట్ గా పీజీలోనే నా కాలేజ్ లైఫ్. అదీ ఓయూ ఆర్ట్స్ కాలేజీలో..

కట్ చేస్తే -

రెండేళ్లు బాగా హాస్టల్లో తిని, ఎమ్మే తెలుగు పూర్తిచేశాక గానీ తెలియలేదు అసలు దాంతో యెలాంటి ఉద్యోగం వెంటనే రాదని. అప్పటి నా మైండ్ సెట్ ప్లస్ అవసరం - వెంటనే ఉద్యోగం చేయాలని. అంతే. మళ్లీ ఎంట్రన్సులు! లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్  సైన్సులో BLISc, MLISc రెండూ చక చకా పూర్తిచేశాను. రెండు గోల్డ్ మెడల్స్ సంపాదించుకున్నాను. వెరసి, మొత్తం నాలుగేళ్లు ఓయూ ఆర్ట్స్ కాలేజీలో చదివాను.

ఈ నాలుగేళ్లలో, ఓయూ ఆర్ట్స్ కాలేజ్ లో నేను చదివిన ఈ మూడు కోర్సులు ఒక ఎత్తు అయితే.. ఇవి చదువుతూనే, అదే ఓయూ ఆర్ట్స్ కాలేజ్ లో, పార్ట్ టైం గా మూడేళ్లపాటు నేను చదివిన రష్యన్ డిప్లొమా మరొక ఎత్తు. ఇప్పుడు నేను ఏ కొంచెమయినా ఇంగ్లిష్ మాట్లాడగలుగుతున్నాను, రాయగలుగుతున్నాను అంటే - ఆ క్రెడిట్ అంతా నేను చదివిన రష్యన్ డిప్లొమాదే.

ఓయూ ఆర్ట్స్ కాలేజ్ లో నేను నిజంగా బాగా ఎంజాయ్ చేస్తూ చదివిన చదువు - ఆ మూడేళ్ల రష్యన్ డిప్లొమా.  నేనే యూనివర్సిటీ టాపర్. ఆ మూడేళ్ల డిప్లొమాలో నన్నూ, నా వ్యక్తిత్వాన్ని అమితంగా ప్రభావితం చేసిన వ్యక్తులు ఇద్దరు. వారిద్దరూ నాకు రష్యన్ నేర్పిన గురువులు. ప్రొఫెసర్ మురుంకర్, ప్రొఫెసర్ కల్పన.

మురుంకర్ సర్ ని ఈ మధ్యనే వెళ్లి కలిశాను. నాతోపాటు అప్పటి నా క్లాస్ మేట్ స్వరూప కూడా వచ్చింది. సర్ ని కలవటానికి వెళ్తున్నపుడు చాలా గిల్టీగా ఫీలయ్యాను. ఫీల్ అవ్వాలి, తప్పదు. ఎందుకంటే - నన్ను అమితంగా ప్రభావితం చేసిన నా గురువు ని సుమారు 22 ఏళ్ల తర్వాతగాని కలవలేకపోయాను! అదే జీవన వైచిత్రి. అదే జీవన వైరుధ్యం. అదే జీవితం.

ఇక్కడ కట్ చేయక తప్పదు. ఎందుకంటే, తర్వాతి బ్లాగ్ పోస్ట్ సర్ గురించే ..

Sunday, 4 November 2012

బ్యాన్ ది సినిమా!


2010 లో డేవిడ్ ఫించర్ అనే డైరెక్టర్ "ది సోషల్ నెట్ వర్క్" అనే ఒక హాలీవుడ్ పిక్చర్ తీశాడు. అది పూర్తిగా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ తీసిన సినిమా. ఆ వ్యక్తి, ఒక రకంగా ఆలోచిస్తే, ఎవరో సామాన్యమైన వ్యక్తి కాదు. ఫేస్ బుక్ ని లాంచ్ చేసిన మార్క్ జుకేర్బర్గ్. ప్రపంచవ్యాప్తంగా కనీసం 100 మిలియన్ల మందిని అమితంగా ప్రభావితం చేసిన వ్యక్తి.

"ది సోషల్ నెట్ వర్క్" అనే ఆ సినిమా తననూ, తన జీవితంలోని అత్యంత సున్నితమైన అంశాలనూ గ్లోరిఫై చేస్తూ తీస్తున్న సినిమా అని మార్క్ కి తెలుసు. దీని గురించి ఆ సినిమా మేకింగ్ సమయం లోనే అంత బాహాటంగా ప్రమోషన్ జరిగింది మరి!

తను కావాలనుకొంటే - అనుకున్న క్షణంలోనే - ఆ సినిమాను, దాని నిర్మాణ సమయంలోనే ఆపేయించగల సత్తా, నెట్ వర్క్, ధనం మార్క్ కి ఉంది. కానీ, మార్క్ ఆ పని చేయలేదు. అలా చేయకపోవటంవల్ల - తను ఎంతో కష్టపడి, ఎంతో జాగ్రత్తగా నిర్మించుకున్న అద్దాలమేడలాంటి తన ఇమేజ్ కి ఎంతో రిస్క్ ఉందన్న విషయం తనకి తెలుసు. అయినా మార్క్ ఆ పని చేయలేదు. కనీసం ఆ సినిమా రిలీజ్ సమయంలో కూడా ఆపవచ్చు.   తను కావాలనుకొంటే కనీసం ఓ వంద మిలియన్ డాలర్ల నష్టపరిహారం కోసం కోర్టుకెళ్లవచ్చు. కానీ, ఆ పని కూడా చేయలేదు మార్క్.

జస్ట్ - ఆ సినిమా రిలీజ్ కి ముందు ఫేస్ బుక్ తరపున న్యూజెర్సీ లోని నెవార్క్ స్కూల్ సిస్టం కు ఓ వంద మిలియన్ డాలర్లు ఉదారంగా సహాయం చేశాడు మార్క్.   తను ఏంటో, తన వ్యక్తిత్వం ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేశాడు. తన స్థాయిని ఏ హాలీవుడ్ సినిమానో, ఏ ఎల్లో టాబ్లాయిడ్ పత్రికలో పడగొట్టలేవని నిరూపించుకున్నాడు. అప్పుడు, మార్క్ వయస్సు కేవలం 26 సంవత్సరాలు!

కట్ చేస్తే -

మన దగ్గర ఏం జరుగుతోంది? సృజనాత్మక స్వాతంత్ర్యం ముసుగులో ఏదయినా వీడియో గానీ, సినిమా గానీ, మరేదయినా కళారూపంగానీ -  ఒక వ్యక్తినయినా, ఒక  ప్రాంతాన్నయినా, ఒక ఉద్యమాన్నయినా నిజంగా కించపర్చిందనుకొంటే - దాన్ని వ్యతిరేకించడానికి, నిరసన తెలపడానికి తెలివైన మార్గాలు, చట్టపరమైన మార్గాలు  చాలా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోకుండా, ఏవో చవకబారు పధ్ధతులద్వారా  ఏదో సాధించగలుగుతున్నాం అనుకోవటంలో అంత అర్థం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం.    

(ఇక్కడ - ఒక సినిమాలో - వందలాది మంది విద్యార్థులు జీవితాల బలిదానంతో, సీరియస్ గా కొనసాగుతున్న ఒక ఉద్యమాన్ని తక్కువచేసి కించపర్చటం అనే విషయాన్ని పక్కన పెడదాం. వివరంగా డిస్కస్ చేయాలంటే, ఇది ఇంకో పెద్ద బ్లాగ్ పోస్ట్ అవుతుంది!)

పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన టీవీ చానెళ్లు కూడా - తమకు వేయడానికి మరే ప్రోగ్రాములు లేక, ఏవో "ఫిల్లర్స్" వేస్తున్నట్లు - పొద్దున లేస్తే ఇదే నిరసనల సోదితో గంటలు గంటలుగా ప్రోగ్రాముల్ని లైవ్ గా నడిపించటం మరింత దారుణం.

లేదూ, మనం చేస్తున్నదే కరెక్ట్ అనుకొంటే మాత్రం - 1922 లో మన తెలుగువాడు ఆర్ యస్ ప్రకాష్ నిర్మించిన తొలి తెలుగు మూకీ సినిమా "భీష్మ ప్రతిజ్ఞ" నుంచి, ఇప్పటి "దేనికయినా రెడీ" వరకు - ప్రతి సినిమాకూ మళ్లీ ఒక రివ్యూ కమిటీ వేయటం చాలా చాలా అవసరం. ఎందుకంటే - అప్పటి నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి ఒక్క సినిమానూ, ఏదో ఒక గొప్ప/చెత్త కారణంతో బ్యాన్ చేయవచ్చు. ఆయా దర్శక నిర్మాతలను (బ్రతికుంటే వారినీ, లేకపోతే వారి వారసుల్ని!) కటకటాల్లోకి నెట్టవచ్చు.  అప్పుడింక సినిమా ఇండస్ట్రీ అనేదే ఉండకుండా పోతుంది. అంతా సుఖాంతం..

మరి - వాట్ నెక్స్ ట్? మనవాళ్లకి టైమ్ పాస్ ఎలా?? మన టీవీ చానెళ్లకి ఫుడ్ ఎలా దొరుకుతుందీ, పాయింట్స్ ఎలా వస్తాయి???  

డోంట్ వర్రీ .. సంవత్సరాలుగా సాగుతున్న సీరియళ్లున్నాయిగా! ఏ సీరియల్ ను పట్టుకున్నా చేతినిండా పనే!!