ఆమె ఏ పార్టీ అయినా కావచ్చు. కొన్ని కొన్నిసార్లు అర్థం లేకుండా ఏదైనా మాట్లాడొచ్చు. సోషల్ మీడియాలో ఎవరిమీదైనా క్రేజీ పోస్టులు పెట్టొచ్చు. వీటన్నిటితో సంబంధం లేకుండా... కంగనా రనౌత్ లోని కిల్లర్ ఇన్‌స్టింక్ట్, భయంలేనితనం నాకు బాగా నచ్చుతాయి.
ఎక్కడో భంబ్లా, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒక్కతే ముంబై వచ్చింది. అప్పుడామె వయస్సు 16 ఏళ్ళు. ఇంగ్లిష్ రాదని తనను ఎగతాళి చేసిన అదే బాలీవుడ్‌లో ఆమె హీరోయిన్ స్థాయికి ఎదిగింది. మొదటి సినిమా రిలీజైనప్పుడామె వయస్సు 17.
తర్వాత తెలుగు, తమిళంలో కూడా నటించింది. 60 కోట్లతో ముంబైలో ఒక ఫిలిం ప్రొడక్షన్ ఆఫీస్ పెట్టింది. ప్రొడ్యూసర్‌గా సినిమాలు నిర్మించింది. దర్శకురాలయింది.
రాజకీయాల్లో తన 37వ ఏట, 2014లో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ (యంపి) కూడా అయ్యింది కంగనా.
కట్ చేస్తే -
పద్మశ్రీ అవార్డుతో పాటు, 3 జాతీయ అవార్డులు, 4 ఫిలిం ఫేర్ అవార్డులు కూడా గెల్చుకొన్న కంగానాను, జస్ట్ ఒక "అందాలు ఆరబోసే రొటీన్ గ్లామర్ డాల్" అని అంత ఈజీగా తీసుకోడానికిలేదు. ఆమె వ్యక్తిగత జీవితంతో పాటు, ఆమె వృత్తిజీవితం కూడా అనేక చాలెంజ్‌లతో కొనసాగుతూ వస్తోంది.
కరణ్‌జోహార్ లాంటి బాలీవుడ్ మొఘల్స్‌తో ఢీ అంటే ఎంత పెద్ద విషయమో కంగనాకు తెలియక కాదు. "తుఝే క్యా లగ్తాహై ఉధ్ధవ్ థాకరే..." అని సాక్షాత్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రినే ఏకవచనంలో సంభోధిస్తూ, సవాల్ విసరడం అంత ఈజీ కాదు.
ప్రతి మనిషిలోనూ కొన్ని బలహీనతలుంటాయి. కొన్ని తెలియనివి కావచ్చు, కొన్ని తెలిసినవే కావచ్చు. ఎవరి రీజన్స్ వారికుంటాయి. ఎవరి జీవితం వారిది.
మనం మనుషులం. అది సహజం.
కాని, ఎప్పుడూ ఏదో ఒక సాకు చెప్పుకుంటూ సమర్థించుకునేవాళ్ళు ఇంకా ఇంకా వెనక్కే పోతుంటారు. అలా కాకుండా, జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును "కమాన్" అంటూ ఎదుర్కొనేవాళ్ళు ఎప్పటికప్పుడు ముందుకు దూసుకెళ్తూనే ఉంటారు.
ఎవరిలోనైనా నన్ను ఆకర్షించే మొట్టమొదటి అంశం ఇదే...
ఉన్నచోటే ఆగిపోకుండా ముందుకు దూసుకెళ్ళే ఆ గట్స్.
తర్వాత నాకు ఎక్కువగా నచ్చేది - వారిలోని నిరంతర ఉత్సాహం. జీవితం పట్ల వారికున్న ప్యాషన్. ఒక రొటీన్‌కు అలవాటుపడకుండా ఉండటం. "వెయిట్ అండ్ సీ" అన్న ధోరణికి ఎడిక్ట్ కాకుండా ఉండగలగటం.
ఇవేవీ అంత ఈజీ కాదు.
ఇలాంటి లక్షణాలన్నీ తన డి ఎన్ ఏ లో భాగం చేసుకొన్న కంగానా... నిజంగా ఒక ఫైటర్.
ఆ ఫైటర్ పోరాటం వెనుక సుమారు 18 ఏళ్ల ఫిలిం ఇండస్ట్రీ జీవితపు మర్చిపోలేని అనుభవాలున్నాయి. ఘోరమైన అవమానాలున్నాయి. అంతులేని సంఘర్షణ ఉంది. ఆ సంఘర్షణంతా ఆమె నిరంతర పోరాటంలో కనిపిస్తుంది.
ఇప్పుడు పార్లమెంట్‌లో కూడా ఆమెది అదే పోరాటం.
కంగనా రనౌత్.
- మనోహర్ చిమ్మని

She is a born fighter of very high calibre.
ReplyDelete