Tuesday, 8 April 2025

నాకు తెలిసిన "కెమెరామన్ అశోక్‌రెడ్డి ఫ్రమ్ ఆదిలాబాద్!"


అది... 2005. 
పాత ఆదిలాబాద్ జిల్లా. 
నిర్మల్ దగ్గర పార్పెల్లి గ్రామం. 
పదో తరగతి ఎలాగో పాసయ్యాడు. 
ఇంక చదువు తనవల్ల కాదనుకున్నాడు.
ఇంటర్‌లో చదువు డిస్కంటిన్యూ చేశాడు.

కట్ చేస్తే - 

హైద్రాబాద్‌లో మొట్టమొదటి డిజిటల్ కెమెరామన్, వెండి మబ్బులు సినిమా, రుతురాగాలు, చక్రవాకం వంటి మాగ్నం-ఓపస్ సీరియళ్ళకు కెమెరామన్ అయిన పోతన రమణ దగ్గర అసిస్టెంట్‌గా చేరిపోయాడా యువకుడు. 

కొన్నాళ్ళ తర్వాత దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ స్టూడియోల్లో ఒకటైన డిజిక్వెస్ట్‌లో ఉద్యోగంలో చేరాడు. 

కట్ చేస్తే - 

బెంగుళూరు, ముంబై, కొచ్చి, హైద్రాబాద్ డిజిక్వెస్ట్ బ్రాంచ్‌ల మధ్య కెమెరాలతో ఫ్లయిట్ ప్రయాణాలు, షూటింగులు. అలా ముంబైలో పనిచేస్తున్నప్పుడే రిషి పంజాబి వటి యాడ్ ఫిలిం మేకర్స్‌తో కూడా పనిచేశాడా యువకుడు. 


డిజిక్వెస్ట్‌లో పనిచేస్తున్నప్పుడే నా రొమాంటిక్ హారర్ సినిమా "స్విమ్మింగ్‌పూల్"కు కెమెరా డిపార్ట్‌మెంట్‌లో పనిచేయడానికి వచ్చి, అప్పుడు నాకు మొదటిసారిగా పరిచయమయ్యాడా యువకుడు. 

అప్పటినుంచీ మధ్య మధ్య కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. మొన్నీ మధ్యనే మా స్వర్ణసుధ ప్రాజెక్ట్స్ ఆఫీసులో కూడా కలుసుకున్నాము. తర్వాత మళ్ళీ మొన్నటి రోడ్-క్రైమ్-థ్రిల్లర్ "ఎర్ర గులాబి" సినిమా షూటింగ్‌లోనే మేం కలవడం. 

అయితే - ఈ సారి, కెమెరా అసిస్టెంటుగానో అసిస్టెంట్ కెమెరామన్‌గా మాత్రమే రాలేదతను. టాలీవుడ్‌లో కెమెరాలను షూటింగ్ కోసం రెంటుకిచ్చే "స్కంద ఫిలిం గేర్స్"  పార్టనర్‌గా కూడా వచ్చాడు. మా డిఓపి వీరేంద్రలలిత్‌తో, నాతో కలిసి అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా ఎప్పట్లాగే మా టీమ్‌లో పనిచేశాడా యువకుడు. 

ఆ యువకుని పేరు... అశోక్ రెడ్డి. 

కట్ చేస్తే - 

అశోక్ రెడ్డి ఇప్పటికే ఒక తమిళ సినిమాకు, 2 తెలుగు సినిమాలకు ఇండిపెండెంట్ డిఓపిగా పనిచేశాడు. డైరెక్టర్ రవిబాబుతో కూడా ఒక సినిమా చేశాడు. ఇకమీదట డిఓపి గానే కొనాసాగాలనుకుంటున్నాడు. 

నాకున్న సమాచారం ప్రకారం, తన పర్సనల్ లైఫ్‌లో వచ్చిన ఒక పెద్ద డిస్టర్బెన్స్ వల్ల అశోక్ రెడ్డి కెరీర్‌లో కొన్ని ఒడిదొడుకులు వచ్చాయి గాని, లేదంటే ఇప్పటికే టాలీవుడ్‌లో సినిమాటోగ్రాఫర్‌గా ఒక స్థాయికి రీచ్ అయ్యి, చాలా బిజీగా ఉండేవాడు. 

తెలంగాణలో అసలు ఎలాంటి డెవలప్‌మెంట్‌కు నోచుకోని ఆదిలాబాద్ జిల్లా (ఇప్పుడు నిర్మల్ జిల్లా) నుంచి 2005 లోనే ఒక కుర్రాడు సినిఫీల్డులోకి వచ్చి, ఈ స్థాయికి ఎదగడం అన్నది నిజంగా నేను ఊహించని విషయం. 


వ్యక్తిగతంగా చాలా మంచివాడు, సౌమ్యుడు అయిన అశోక్ రెడ్డి నాకు పదేళ్ళ క్రితం మొదటిసారి పరిచయం అయినప్పుడు ఎలా ఉన్నాడో, ఇప్పుడూ అలాగే ఉన్నాడు. ఇండస్ట్రీలో ఇది చాలా అరుదు. ఒక్క సినిమా చేస్తారో లేదో... ఒక్కొక్కరు ఎలా యాటిట్యూడ్ లెవల్స్ చూపిస్తారో మనకు తెలుసు. అశోక్ రెడ్డిలో అలాంటిదేం లేకపోవడం నిజంగా గొప్ప విషయం. 

ఫినిషింగ్ టచ్ ఏంటంటే - 

త్వరలో మా ఇద్దరి కోంబోలో ఒక సినిమా ఉండబోతోంది. స్క్రిప్ట్ వర్క్, ప్రి-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. టైటిల్ కూడా మొన్నీమధ్యే రిజిస్టర్ అయింది...

"Warangal Vibes!"
A dark romantic crime comedy. 

Wishing Ashok Reddy a remarkable journey and a shining career as a DOP in the film industry!

- మనోహర్ చిమ్మని  

ఇండిపెండెంట్ ఫిలిం మేకర్స్ హవా నడుస్తున్న వేళ!


ఓ గుప్పెడు టాప్‌స్టార్స్, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, వారి బంధుమిత్రులు, వారసులు. ఇదొక స్కూలు. ఈ స్కూల్లో ఎవరికి వాళ్లకే ఫిక్స్‌డ్‌గా లాబీలు, నెట్‌వర్క్‌లుంటాయి. వాటిని దాటుకొని ఓ కొత్త డైరెక్టర్ ఈ స్కూళ్లోకి ప్రవేశించడం చాలా అరుదు. బయట ఏదయినా పెద్ద హిట్ ఇచ్చినప్పుడే ఇక్కడ కొత్తవాళ్లకు ఎంట్రీ సాధ్యం.  

ఇది పక్కా ట్రెడిషనల్ స్కూల్. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఏ ఇండస్ట్రీ అయినా ఇలాగే నడుస్తుంది.         

రెండో స్కూల్ పూర్తిగా ఇండిపెండెంట్ స్కూల్. ఎప్పటికప్పుడు రిసోర్సెస్ క్రియేట్ చేసుకుంటూ, అందుబాటులో ఉన్న రిసోర్సెస్‌తోనే సినిమాలు తీస్తూ వీళ్లకంటూ ఒక ట్రాక్ క్రియేట్ చేసుకుంటారు. సాధారణంగా వీరి సినిమాల బడ్జెట్లు చాలా తక్కువగా ఉంటాయి. 

ఇది పూర్తిగా ఒక అన్‌ట్రెడిషనల్ స్కూల్. ఇండిపెండెంట్ స్కూల్.  

వీళ్ళు అనుకున్నది సాధించడానికి కొంత సమయం పడుతుంది. సాధించలేకపోవచ్చు కూడా. అది వేరే విషయం. 

ట్రెడిషనల్ స్కూల్ నుంచి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సంవత్సరానికి సుమారు 20 సినిమాలు తయారవుతే, ఇండిపెండెంట్ స్కూల్ నుంచి ఒక 180 సినిమాలు తయారవుతాయి. ఈ నేపథ్యంలో కొత్త ఆర్టిస్టులు, కొత్త టెక్నీషియన్స్‌కు అవకాశం ఏ స్కూల్లో దొరుకుంతుందన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.     

కట్ చేస్తే - 

హీరోలకోసం ప్రత్యేకంగా రాసుకొన్న బౌండెడ్ స్క్రిప్టులు చంకలో పెట్టుకొని, ఎలాంటి గ్యారంటీలేని ఈ ట్రెడిషనల్ స్కూళ్ల చుట్టూ ఏళ్లతరబడి తిరగడం చాలామంది ఇండిపెండెంట్ డైరెక్టర్స్‌కు కుదరని పని. 

వీరికి సినిమానే జీవితం కాదు. దాన్ని మించిన జీవితం బయట ఎంతో ఉంటుంది. 

సినిమాలపట్ల అమితమైన ప్యాషన్ ఉన్న కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, నిర్మాతలను వీరే క్రియేట్ చేసుకుంటారు. వారి కోసం అన్వేషణ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అలా అన్నీ కుదిరినప్పుడే వీళ్ళు సినిమాలు తీస్తారు. తక్కువ బడ్జెట్‌లో, అతి తక్కువ షూటింగ్ డేస్‌లో సినిమా తీసి క్లిక్ కావడమే వీరికిష్టం. 

ఇంతకు ముందులా కాకుండా వీరికి అవకాశాలు, విజయావకాశాలు ఇప్పుడు చాలా రకాలుగా పెరిగాయి. ఓటీటీలు వచ్చాక, బిజినెస్ కూడా విస్తరించింది. దీన్ని ఎవరు ఎలా క్యాష్ చేసుకుంటారన్నది వారి వారి అనుభవం, అవగాహన మీద ఆధారపడిఉంటుంది.   

ఈ చిన్న బడ్జెట్ సెగ్మెంట్‌లోనే, లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్స్ సపోర్ట్‌తో వరుసగా సినిమాలు చేసే కొన్ని ప్రొడక్షన్ హౌజ్‌లు కూడా ఒక్కొక్కటిగా ప్రారంభం అవుతున్నాయి. ఇంకా అవుతాయి.    

Doing the unrealistic is easier than doing the realistic!

- మనోహర్ చిమ్మని 

ప్రదీప్ ఇంకా సీన్లో ఉన్నాడు!


"స్విమ్మింగ్‌పూల్" చిత్రం ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా నేను పరిచయం చేసిన ప్రదీప్‌చంద్ర మద్దిరాలకు మ్యూజిక్ ఒక ప్యాషన్, ప్రాణం కూడా.

ఎమ్మే క్లాసికల్ మ్యూజిక్, ఎమ్మే వెస్టర్న్ మ్యూజిక్ పూర్తిచేశాడు ప్రదీప్‌. తర్వాత... చదవడం చేతకాదు అనుకునేవాళ్లను సంతృప్తిపర్చడం కోసం కంప్యూటర్ సైన్స్‌లో ఎమ్‌టెక్ చేశాడు. ఎమ్మెస్సీ సైకాలజీ కూడా చేశాడు.

నేను హెచ్ఎమ్‌టి, జవహర్ నవోదయ విద్యాలయ, ఆలిండియా రేడియో వంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసి వదిలేసినట్టు, ప్రదీప్ కూడా డెల్ లాంటి కంపెనీల్లో పనిచేశాడు, వదిలేశాడు. 

ఆ తర్వాతే, ఆ "మంద మెంటాలిటీ" దుకాణం మూసేసి, మళ్ళీ తనకెంతో ప్రియమైన మ్యూజిక్‌ని చేరుకున్నాడు. అక్కున చేర్చుకున్నాడు.  

స్విమ్మింగ్‌పూల్ ఒక రొమాంటిక్ హారర్ సినిమా. ఈ చిత్రం కోసం ప్రదీప్ చేసిన పాటల్లో ఒక్క మెలొడీ చాలు. తన టాలెంట్ ఏంటో గుర్తించడానికి. చివరి రీల్, చివరి సీన్‌లో అతనిచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలు. అసలు అతనేంటో తెలుసుకోడానికి! 

అయితే, ఆ సినిమా పరిమితులు దానికున్నాయి. ఒక మామూలు సినిమా స్టోరీ సిట్టింగ్స్‌కు అయ్యే ఖర్చుతో ఆ సినిమా పూర్తిచేసి, రిలీజ్ చేశాం. క్వాలిటిదగ్గర ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా. 

చాలామంది బయటివాళ్లు, లోపలివాళ్లు కూడా ఆ సినిమా జరుగుతున్న సమయంలో ప్రదీప్ విషయంలో చాలా కామెంట్స్ చేశారు. అలా కామెంట్ చేసినవాళ్లంతా ఇప్పుడు తెరమరుగయ్యారు.

ప్రదీప్ ఇంకా సీన్లో ఉన్నాడు... భారీ టార్గెట్స్‌తో. 


ప్రదీప్‌లో ఉన్న ప్యాషన్‌ను చూసి - మ్యూజిక్ డైరెక్టర్‌గా అతని తొలి ఆడియో వేడుకను బంజారా హిల్స్ లోని రావి నారాయణ రెడ్డి హాల్‌లో "లైవ్" చేశాను. ఒక రేంజ్‌లో ప్లాటినమ్ జుబ్లీ ఫంక్షన్ కూడా చేశాను. 

ప్రదీప్‌ టాలెంట్ విషయానికొస్తే - స్విమ్మింగ్‌పూల్ జస్ట్ ఒక చిన్న ప్రారంభం మాత్రమే. ప్రాక్టికల్ పాయింటాఫ్ వ్యూలో తను చేయాల్సింది, చేసి తీరాల్సిందీ చాలా ఉంది.

నాకు తెలుసు. ప్రదీప్ అనుకున్నది సాధిస్తాడు. ఆ రోజు కూడా వస్తుంది. 

కట్ చేస్తే - 

మొన్న నేను చేసిన రోడ్-క్రైమ్-థ్రిల్లర్ "ఎర్ర గులాబి" సినిమాలో బడ్జెట్, కొన్ని ఇతర సాంకేతిక, వ్యక్తిగత కారణాల వల్ల... "నేను మీరు ఆశించే మ్యూజిక్ ఇవ్వలేను, సర్" అని చాలా మర్యాదగా చెప్పి, ఈ సినిమా బాధ్యత నుంచి తప్పుకున్నాడు ప్రదీప్. 

కాని, తప్పించుకోలేడు. ఆ వివరాలు త్వరలో తెలుస్తాయి.    


మ్యూజిక్ విషయం పక్కనపెడితే - నా సినిమాలన్నింటికి, నా తరపున "డైరెక్టర్స్ సీ.ఈ.వో." గా ప్రదీప్ తెరవెనుక చాలా పనిచేస్తుంటాడు. 

మేమిద్దరం కలిసి చేసే ఫీచర్ ఫిలిం ప్రాజెక్టులు కనీసం ఇప్పుడొక రెండు ఉన్నాయి. ఆ పనుల్లో ప్రదీప్ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. 

ఇద్దరం కలిసి ఇప్పుడు చాలా చెయ్యబోతున్నాం. చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఛాలెంజెస్ ఉన్నాయి. చిన్న కిక్ స్టార్ట్ ఒక్కటే జరగాల్సి ఉంది. అదీ జరుగుతుంది.       

నా అంచనా ప్రకారం, ఒక వారం రోజుల ముంబై ట్రిప్‌తో మా ఇద్దరి క్రియేటివ్ జర్నీ మళ్ళీ ఊపందుకుంటుంది.  

- మనోహర్ చిమ్మని    

Monday, 7 April 2025

మిస్టర్ కాంప్లెక్సిటీ!


నా సినిమాటోగ్రాఫర్ మిత్రుడు వీరేంద్రలలిత్‌కు, నాకూ మాత్రమే తెలిసిన కొన్ని కోడ్ వర్డ్స్ ఉన్నాయి. సెట్స్ లోపల, బయటా సందర్భం వచ్చినప్పుడు మా కోడ్ భాషలో మేము తరచూ ఉపయోగించే పదం - కాంప్లెక్సిటీ!

జీవితంలో కాంప్లెక్సిటీ అంటే మా ఇద్దరికీ చాలా ఇష్టం. "కాంప్లెక్సిటీ లేని లైఫ్ అసలు లైఫే కాదు" అన్నది మా ఫిలాసఫీ. 

అయితే - ఇది అందరూ మామూలుగా అనుకొనే కాంప్లెక్సిటీ కాదు. మా కోడ్ భాషలో దీనర్థం వేరే!

నా రెండో చిత్రం "అలా" తో పరిచయమయ్యాడు వీరేంద్రలలిత్. అప్పటినుంచీ  ప్రొఫెషనల్‌గా దాదాపు రెండు దశాబ్దాల పరిచయం మాది. అంతకుమించి, వ్యక్తిగతంగా రెండు దశాబ్దాల స్నేహం మాది. ఈ రెండు దశాబ్దాల్లో ఇద్దరం కలిసి 3 సినిమాలు చేశాము. 

బయట అందరికీ తెలిసింది ఒక్కటే. వీరేన్‌కు సినిమా అన్నా, ఫోటోగ్రఫీ అన్నా పిచ్చి ప్యాషన్ అని. కానీ, దీన్ని మించి ఆయన గురించి నేను చెప్పాల్సింది చాలా ఉంది.

డిల్లీ యూనివర్సిటీలో ఫిలాసఫీలో ఎం ఫిల్ చేశాడు వీరేన్. పెద్ద ఒరేషియస్ రీడర్. ఎప్పుడు నిద్రపోతాడో తెలియదు. మన చరిత్ర, మన సంస్కృతి, మనం మర్చిపోయిన మన సంస్కృత భాష, మన వేదాలు, మన వైద్యం, మన ఫిలాసఫీల గురించి ఎంతయినా మాట్లాడగలడు.

అయితే - ఇదంతా ఏదో ఉపన్యాసంలా చెప్పడు. చాలా సింపుల్‌గా చెప్తాడు. జీవితంలో మనం మళ్లీ మర్చిపోకుండా!

సినిమాటోగ్రఫీకి సంబంధించి తనకు నచ్చిన ప్రతి పనీ చేస్తాడు. ఒక్క సినిమాలకే కాదు .. డాక్యుమెంటరీలకు, మ్యూజిక్ వీడియోలకు, యాడ్‌లకు కూడా పనిచేసే ఈ అంతర్జాతీయ స్థాయి కెమెరామన్ పాస్‌పోర్ట్ బుక్కులు బుక్కులుగా అయిపోతుంటుంది.

సినిమాటోగ్రాఫర్‌గా ఇప్పటికే ఒక 20 సినిమాలు, డైరెక్టర్‌గా 4 సినిమాలు, వందలాది కమర్షియల్ యాడ్స్, డాక్యుమెంటరీస్ చేసిన వీరేన్ .... మన భూమ్మీద ఉన్న దాదాపు 195 దేశాలుంటే, ఒక 20 తప్ప అన్ని దేశాలు విజిట్ చేశాడు. నాకు తెలిసి, ఇంకో అయిదారేళ్లలో మిగిలిన ఆ కొన్ని కూడా కవర్ చేసి "లోకం చుట్టిన వీరుడు" అవుతాడు. 

ఇండస్ట్రీలో కొంతమంది కెమెరామన్‌లు సెట్స్ పైన ఎంత గొడవ గొడవగా అరుస్తారో అందరికీ తెలిసిందే. వీరేన్ నోటి నుంచి ఎప్పుడూ అరుపులూ కేకలు రావు. లైట్‌మెన్‌నీ, అసిస్టెంట్‌లనీ బూతులు తిట్టడు. లైట్ బాయ్‌లు చెయ్యాల్సిన ఎన్నో పనుల్ని తనే స్వయంగా చేసుకుంటాడు.

ఈగో లేదు. కోపం రాదు. చిరునవ్వు చెరగదు.

వీరేన్ లేకుండా కూడా నేను మరో కెమెరామన్‌తో షూటింగ్ చేయగలను. కానీ, ప్రతిరోజూ 101 కొత్త టెన్షన్‌లను ఎదుర్కొంటూ ఇంత కూల్‌గా మాత్రం చేసేవాన్ని కాదేమో. 

కట్ చేస్తే -  

వీరేంద్ర లలిత్ రెమ్యూనరేషన్‌ను మొన్న నేను చేసిన రోడ్-క్రైమ్-థ్రిల్లర్ సినిమా "ఎర్ర గులాబి" బడ్జెట్ భరించలేదు. "ఇంతే ఇవ్వగలుగుతాం... చెయ్యాలి" అన్నాను. నాకోసం సంతోషంగా ఒప్పుకొన్నాడు. 

ముంబై నుంచి వచ్చాడు. సుమారు 40 రోజులపాటు హైద్రాబాద్‌లోనే మేం ఏర్పాటు చేసిన ఒక చిన్న గెస్ట్ హౌజ్‌లో ఎలాంటి కంప్లెయింట్ లేకుండా అడ్జస్ట్ అయి ఉన్నాడు.

ఒక్క సినిమాటోగ్రాఫర్‌గానే కాదు... అన్ని డిపార్ట్‌మెంట్లూ తనవే అనుకొని ప్రాజెక్టు త్వరగా పూర్తికావడం కోసం చాలా కష్టపడ్డాడు. ఇందుకు ప్రతిఫలంగా - ఆయన స్థాయిని గుర్తించలేని కొంతమందిచేత ప్రత్యక్షంగా, పరోక్షంగా అవమానించబడ్డాడన్న విషయం నా ఒక్కడికే తెలుసు. 

ఇలాంటి విషయాల ప్రస్తావన తెచ్చినప్పుడు "వదిలేయండి. వాళ్లకు ఏం తెలీదు. మనకు ప్రాజెక్టు ముఖ్యం" అంటాడు వీరేన్. 

మొన్న "ఎర్ర గులాబి" షూటింగ్ పూర్తయ్యాక దాదాపు టీమ్ అంతా ప్రాజెక్టు గురించి మర్చిపోయారు... ముఖ్యమైనవాళ్లతో సహా. వీరేన్ మాత్రం, తను ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా, దాదాపు ప్రతిరోజూ నన్ను అడుగుతుంటాడు, "పోస్ట్ ప్రొడక్షన్ ఏ స్టేజిలో ఉంది సర్... ఎలా వస్తోంది" అని. 

అదీ వీరేన్ సిన్సియారిటీ.

థాంక్యూ సో మచ్ వీరేన్!    

త్వరలో ప్రారంభం కానున్న "Yo!" షూటింగ్‌తో పాటు, మేమిద్దరం కలిసి పూర్తిగా ముంబైలోనే ఇంకో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాము. దానికి ముహూర్తాలు, ఓపెనింగ్స్, ఎనౌన్స్‌మెంట్స్ ఏమీ ఉండవు. 

లైట్స్-కెమెరా-యాక్షన్! ... దట్సిట్. 

- మనోహర్ చిమ్మని    

అందరికీ అరవింద్, దిల్ రాజు కావాలంటే కుదరదు!


ఇప్పుడు ఫీల్డులో ఉన్న ప్రొడ్యూసర్స్ ఒక్కొక్కరి దగ్గర కనీసం ఒక అరడజన్ మంది డైరెక్టర్స్ క్యూలో ఉంటారు. అరడజన్ ప్రాజెక్టులు లైన్లో ఉంటాయి. అలాంటి సిచువేషన్లో, ఇంక ప్రతి ఒక్క డైరెక్టర్ వెళ్ళి అదే లైన్లోనే నిల్చుని, "నేను కూడా కథ చెప్తాను, ఒప్పిస్తాను" అనుకోవటం అంత ఫూలిష్‌నెస్ ఇంకోటి ఉండదు. 

కాని, మనం కూడా సినిమా చేయాలి. ట్రాక్‌లో ఉండాలి. 

ఎలా? 

ఎలా అంటే... ఇందులో అంత న్యూక్లియర్ సైన్స్ ఏం లేదు. మన ప్రొడ్యూసర్స్‌ను మనమే క్రియేట్ చేసుకోవాలి. మన ఇన్వెస్టర్స్‌ను మనమే చూసుకోవాలి. ఇది మామూలుగా అందరు చేసేదే. తెలీనివారికే కొంచెం కొత్తగా, వింతగా ఉంటుంది.        

Create your own producer and start your film. That's it. 

కట్ చేస్తే -

ఈమధ్య చాలామంది ఒక రొటీన్ మాట చెప్తున్నారు, "మార్కెట్లో అసలు మనీ లేదు" అని! ఇలాంటి మాట నేను చిన్నప్పట్నుంచి వింటున్నాను. 

అప్పుడు తెలుగులో సంవత్సరానికి 100 సినిమాలు తయారయ్యేవి. ఇప్పుడు 200 తయారవుతున్నాయి! మరి మార్కెట్లో మనీ లేకుండా ఇన్ని సినిమాలు ఎలా తయారవుతున్నాయి? 

ఈమధ్య ఇంకో కొత్త పాట పాడుతున్నారు చాలామంది... "రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయింది. మనీ ఫ్లో అసల్లేదు" అని. 

నిజమే కావచ్చు. కాని, దీనికి కూడా నా హంబుల్ కొశ్చన్ సేమ్...

మనీ ఫ్లో లేకుండానే అందరూ బంగారం కొంటున్నారు, కార్లు కొంటున్నారు. మన టాలీవుడ్లో ఎప్పట్లాగే 200+ సినిమాలు తయారవుతున్నాయి. 

మార్కెట్ లేని హీరో సినిమా అయినా సరే... 60-70 కోట్లు పెడుతున్నారు. కొత్తవాళ్లతో తీసే సినిమాలకైతే 5-6 కోట్లు అనేది ఇప్పుడొక చిన్న స్టార్టప్ లెవెల్ అయిపోయింది. ఇక పెద్ద హీరోల సినిమాలకైతే 400 నుంచి 700, 1000 కోట్లదాకా కూడా పోతోంది బడ్జెట్.    

నిజంగా మార్కెట్లో మనీ ఫ్లో లేకుండా ఇదంతా ఎలా సాధ్యం?

అదే నాకర్థం కావటం లేదు... 

Whatever hits, whatever hurts… the damn show must go on. Create your own producer. Start your film. Period. 

- మనోహర్ చిమ్మని             

ఇదీ లెక్క!


ఆర్టిస్టుగా కానీ, టెక్నీషియన్‌గా కానీ, ఆఫీస్‌బాయ్‌గా అయినా కానీ... సినీ ఫీల్డులోకి ఎంటర్ కావాలనుకొనేవారు ముందుగా తెల్సుకోవాల్సిన చిన్న లెక్క ఒకటుంది. అదేంటంటే - 

ఫీల్డులోకి ప్రవేశించాలనుకొని ఫిలిమ్‌నగర్‌కు వచ్చే ప్రతి 1000 మందిలో కేవలం ఒక 10 మందికి మాత్రమే అవకాశం దొరుకుతుంది.

అదీ ఎంతో కష్టంగా!

ఆ పదిమందిలో కూడా - ఏ ఒక్కరికో ఇద్దరికో మాత్రమే క్లిక్ అయ్యే అవకాశం లభిస్తుంది. వాళ్లే ఫీల్డులో కొద్దిరోజులు నిలబడగలుగుతారు. ఎందుకలా అంటే .. దాని లాజిక్కులు దానికున్నాయి. అదంతా తర్వాత. 

మళ్లీ పాయింటుకొస్తే - 

సంవత్సరానికి ఎన్ని సినిమాలు తీస్తారు? వాటిలో కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చే సినిమాలు ఎన్నుంటాయి? ఆ సినిమాల్లో ఎంతమందికని అవకాశం ఇవ్వడం వీలవుతుంది?

అసలు ఒక సినిమాలో ఎంతమంది కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వడానికి వీలవుతుంది? ఎంత ఇన్‌ఫ్లుయెన్స్ చేసినా ఎలా వీలవుతుంది? 

పూర్తిగా కొత్తవాళ్లతో తీసే సినిమాకు కూడా ఒక పరిమితి ఉంటుంది కదా? ప్రతిరోజూ సినిమా ఆఫీసులకొచ్చే వందలమందిలో ఎంతమంది కొత్తవారికి అవకాశం ఇచ్చే వీలుంటుంది?

ఈ లెక్కంతా టాలెంట్‌తో సంబంధం లేకుండా చెప్తున్నది. టాలెంట్ విషయానికి తర్వాత వద్దాం. ఆ సబ్జక్టు వేరే... డీటెయిల్‌గా డిస్కస్ చెయ్యాల్సిన సబ్జక్టు అది.

ఒక్క టాలీవుడ్‌లోనే కాదు. ఏ వుడ్డులోనయినా ఇదే లెక్క!

ఎవరిలో ఎంత టాలెంట్ ఉందని అనుకున్నా, నిజంగా ఉన్నా, వాస్తవం మాత్రం ఇదే. ఈ వాస్తవాన్ని ఎదుర్కొనే దమ్మున్నవాళ్లకే సినీఫీల్డు స్వాగతం పలుకుతుంది.

మరి మీలో ఆ దమ్ముందా?!

ఆ దమ్ముందంటేనే ఎక్కడో ఒకచోట చాన్స్ తగుల్తుంది. తర్వాత ఏమవుద్ది అనేది వేరే విషయం... మళ్లీ మాట్లాడుకుందాం.

కట్ టూ సోక్రటీస్ - 

ఈ మహా తత్వవేత్త చెప్పిన ఒక మాట ఈ సందర్భంగా కోట్ చెయ్యాలనిపిస్తోంది: 

"నిన్ను నువ్వు తెల్సుకో!" 

-మనోహర్ చిమ్మని 

Sunday, 6 April 2025

ఏంటా రెండు తప్పులు?


సినిమాఫీల్డులో మీకు అవకాశం దొరికి, దాన్ని మీరు సద్వినియోగం చేసుకొని, నిలదొక్కుకొని, కాస్త ఊపిరిపీల్చుకొనేదాకా... మీరు ఆర్టిస్టు అయినా, టెక్నీషియన్ అయినా మీకు ఎవ్వరూ ఎలాంటి పారితోషికం ఇవ్వరు. డబ్బులు రావు.

కొద్దిమంది ఎంతో కొంత ఇస్తారు. ఆ కొంత అసలు లెక్కలోకిరాదు.

90 శాతం పైగా కొత్తవారి విషయంలో ఇది నిజం.

ఎందుకివ్వరు అనేది అదో పెద్ద కథ. దానిగురించి తర్వాత మాట్లాడుకుందాం.

కొత్తగా పరిచయంచేసే హీరోయిన్స్, ఇతర సపోర్టింగ్ ఫిమేల్ ఆర్టిస్టులకు మాత్రం పారితోషికం ఉంటుంది.

మన హీరోయిన్స్‌లో దాదాపు అందరూ ముంబై నుంచే వస్తారు. అక్కడ సెలెక్టు అవగానే, కొంత అడ్వాన్స్ ఇచ్చి, అగ్రిమెంట్ వేయకుండా ఏ హీరోయిన్ కూడా ముంబైలో ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి షూటింగ్‌కి రాదు. 

సో, హీరోయిన్స్‌కు పేమెంట్ ఉంటుంది... వారు కొత్తవారైనా కూడా.

ఫిమేల్ సపోర్టింగ్ ఆర్టిస్టులకు కూడా కొత్త పాతతో సంబంధం లేకుండా పారితోషికం ఉంటుంది. వాళ్లకు పేమెంట్ విషయంలో ఎలాంటి సమస్య ఉండదు. చెప్పిన రెమ్యూనరేషన్ తప్పకుండా ఇచ్చేస్తారు. 

ఎటొచ్చీ... హీరో నుంచి, చిన్న సపోర్టింగ్ క్యారెక్టర్ వరకు, కొత్తవారైన అబ్బాయిలకు  మాత్రం చాలా అరుదుగా పేమెంట్ ఉంటుంది. కొన్ని ప్రొడక్షన్ కంపెనీలు మాత్రం ఎంతో కొంత రెన్యూనరేషన్ పే చేస్తాయి. కాని, అలాంటి ప్రొడక్షన్ కంపెనీల సంఖ్య చాలా తక్కువ.  

ఈ నేపథ్యంలో, కొత్తవారికి అవకాశం ఎప్పుడు రావాలి? అది ఎప్పుడు క్లిక్ అవ్వాలి?

అలా ఒక క్యారెక్టర్ క్లిక్ అయ్యాక, ఆ గుర్తింపుతో మళ్లీ ఇంకో సినిమాలో అవకాశం వచ్చినపుడు మాత్రమే కాస్త పనికొచ్చే రెమ్యూనరేషన్ వస్తుంది.

ఒక కొత్త ఆర్టిస్టు ఈ దశకు రావడానికి 6 నెలలు పట్టొచ్చు... సంవత్సరం పట్టొచ్చు. ఇంకెంతకాలమయినా పట్టొచ్చు. ఇది ఆయా కొత్త ఆర్టిస్టుల టాలెంట్ కన్నా కూడా, ఇండస్ట్రీలో వారికుండే పరిచయాలు, పరిచయాలు చేసుకొని చొరవగా ముందుకు దూసుకెళ్లడం వంటివాటిమీద ఆధారపడి ఉంటుంది.

ఇదంతా ఒక పెద్ద జర్నీ. 

ఈ జర్నీ సాగినంతకాలం సిటీలో ఉండటానికి, ఫుడ్డుకు, తిరగడానికి డబ్బులు ఎక్కన్నించివస్తాయి?

ఈ వైపు ఎలాంటి ఇబ్బంది లేనప్పుడే, ఆవైపు అవకాశాలకోసం తిరగడానికి ఫ్రీడం ఉంటుంది.

సో, సినిమాల్లో మీకు డబ్బు వచ్చేదాకా - మీకు తప్పనిసరిగా ఏదున్నా లేకపోయినా - మీరేం చేసినా చేయకపోయినా - నెల నెలా వచ్చే ఒక ఆదాయం అవసరం. ఇది ఎలా ఏర్పాటు చేసుకుంటారన్నది మీ ఇష్టం.

జాబ్ కావొచ్చు, ఇంటినుంచి రావొచ్చు. లేదంటే - మీ ఫ్రెండో, లవరో, ఇంకెవరో సహాయం చేస్తుండవచ్చు. కాని, ఈ ఏర్పాటు మాత్రం ఖచ్చితంగా అవసరం.  

మీ ఫినాన్షియల్ సపోర్టుకి ఎలాంటి ఏర్పాటు చేసుకోకుండా మీరు ఇండస్ట్రీకి రావడం అనేది మీ మొదటి తప్పు. 

అన్నీ ఉంటేనే ఇక్కడ అవకాశాలు దొరకడం కష్టం. ఇక తిండీతిప్పలుకు ఇబ్బందిపడుతూ అవకాశాలెలా వెతుక్కుంటారు?

దురదృష్టవశాత్తూ, ఇండస్ట్రీకి వచ్చేవారిలో 90 శాతం మంది ఈ తప్పు చేస్తారు. చేయాలని కాదు. అలా జరుగుతుంది అంతే. వారి నేపథ్యం వల్ల కావచ్చు. అప్పటి పరిస్థితులు కావచ్చు.  

కట్ చేస్తే -     

ఆర్టిస్టుగా అయినా, టెక్నీషియన్‌గా అయినా ఇండస్ట్రీలో అవకాశంకోసం వచ్చేవారిలో... 10th ఫెయిల్ నుంచి, ఉన్న ఉద్యోగాలను వదులుకొని వచ్చేవాళ్లదాకా ఉంటారు.

సరే ఏ వయస్సులో అయినా ఎంటర్ అవొచ్చు. తప్పేం లేదు. కానీ, ఫీల్డులో మీ ప్రయత్నాలకు ఒక 'టైమ్ లిమిట్' అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు... చివరికి అయిదేళ్ళు కూడా కావొచ్చు. కానీ, ఆ డెడ్‌లైన్ అనేది తప్పనిసరిగా పెట్టుకోవాలి.

ఆ డెడ్‌లైన్‌లోపు అవకాశం సంపాదించుకొని, నిలదొక్కుకొని, ఓకే అనుకుంటే ఉండాలి. లేదంటే... తర్వాత బ్యాక్ టూ పెవిలియన్ వెళ్ళాక ఏం చేయాలన్నది కూడా ముందే డిసైడ్ చేసుకొని ఉండాలి.

బ్యాడ్‌లక్ ఏంటంటే, ఇండస్ట్రీకి వచ్చేవారిలో 90 శాతం మంది ఈ తప్పుకూడా చేస్తారు. 

ఇది రెండో తప్పు. 

అన్నీ కలిసొచ్చి, లేదా కలిసొచ్చేలా చేసుకొని... ఇండస్ట్రీలో అవకాశం అందిపుచ్చుకొని, తర్వాత నిలదొక్కుకొని... అంతా బాగుంటే ఎలాంటి సమస్య ఉండదు. అలా జరగనప్పుడు మాత్రమే జీవితం అల్లకల్లోలం అవుతుంది.

ఇది ఎవరికయినా అనుభవం మీద మాత్రమే తెలుస్తుంది.

ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లు, హీరోలు, ఇతర ఆర్టిస్టులు ఎవరైనా కొత్తగా అవకాశం కోసం వచ్చినప్పుడు చెప్పే మొదటిమాట జనరల్‌గా ఇలా ఉంటుంది: "ఎందుకు బాబూ...హాయిగా చదువుకొని... ఉద్యోగం చేసుకోక!" అని.

ఆ కష్టాలన్నీ వాళ్లకు తెలుసు కాబట్టి ఇలా చెప్తారు. అంతే తప్ప, అవకాశం ఇవ్వద్దనో, రావద్దనో కాదు.

ఇది ఎవ్వరూ అర్థం చేసుకోరు. అర్థమయ్యేలా తెలిసేటప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

సో, పైన చెప్పిన రెండు అంశాల విషయంలో కరెక్ట్ ప్లానింగ్‌తో వస్తే... మీకు టెన్షన్స్ ఉండవు. మీ మొత్తం ఫోకస్ ఆ 'ఒక్క చాన్స్' మీదే ఉంటుంది. ప్రయత్నాలు బాగా చేస్తారు. అవకాశాలు కూడా మీకు ఈజీగా దొరుకుతాయి.

ఆ దొరికిన అవకాశాన్ని మరిన్ని చాన్స్‌లు రావడానికి బాగా ఉపయోగించుకొన్నామా లేదా? ఆ తర్వాతేంటి? 

అదంతా అప్పుడు మీకే తెలుస్తుంది. అంతా మీ చేతుల్లోనే ఉంటుంది.  

- మనోహర్ చిమ్మని  

Saturday, 5 April 2025

సినీఫీల్డులోకి ఎందుకు వెళ్ళితీరాలి?


పాలిటిక్స్, క్రికెట్, సినిమాలు...

ఈ మూడు లేకుండా మన దేశంలో సగటు మనుషులు బ్రతకలేరు. వీటిలో మొదటి రెండు రంగాల వాళ్లకు మూడోరంగం అంటే మంచి క్రేజ్. వాళ్లూ వీళ్లూ మంచి రిలేషన్‌షిప్స్ కూడా మెయింటేన్ చేస్తుంటారు.

ఇక 'ఫిలిం బేస్డ్' ప్రోగ్రామ్స్ లేకుండా టీవీ చానెల్స్ బ్రతకలేవు. న్యూస్‌పేపర్స్, మ్యాగజైన్స్ వంటివి కూడా 'సినిమాపేజీ' లేకుండా, సినిమా స్టార్స్ ఫోటోలు లేకుండా, సినిమావాళ్లమీద రాసే గాసిప్స్, టిడ్‌బిట్స్ లేకుండా అస్సలు బ్రతకలేవు. 

ఇక ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (గతంలో ట్విట్టర్), యూట్యూబ్ లాంటి ఫ్రీ సోషల్ మీడియా వచ్చాక - ప్రతివాడి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఒక న్యూస్ చానెల్ అయిపోయింది. విశ్లేషకులు, రివ్యూయర్స్, సినిమాల్ని చెండాడే సోకాల్డ్ మేధావులు కూడా ఒక్కసారిగా పెరిగిపోయారు. వీరంతా కూడా సినిమాల్లేకుండా బ్రతకలేరు. ఊపిరి పీల్చుకోలేరు.    

సినిమాకున్న పవర్ అది!

ఎవరు ఎన్ని లాజిక్స్ చెప్పినా ఇది నిజం. ఇదే నిజం. 

ఒకప్పుడు కోటి, రెండు కోట్లు అంటే ఫీల్డులో పెద్ద అంకె! ఇప్పుడు... 100, 200, 300, 500, 700, 1000 కోట్లు కూడా చాలా రొటీన్‌గా వినే ఫిగర్స్ అయ్యాయి. 

సినిమా ప్యూర్‌లీ ఒక బిగ్ బిజినెస్... ఇప్పుడు!  

కట్ చేస్తే -

'సక్సెస్ ఈజ్ సెక్సీ' అనేది ఇక్కడ అక్షరాలా నిజం. 

నువ్వు ఆర్టిస్టు కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు... ఒకే ఒక్క సక్సెస్ నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. భారీ స్థాయిలో డబ్బూ, ఊహించని రేంజ్ వ్యక్తులతో సంబంధాలూ, ఓవర్‌నైట్‌లో ఫేమ్... ఇవన్నీ ఇక్కడే సాధ్యం.

చిన్నదో పెద్దదో... ఒకే ఒక్క సక్సెస్‌తో బెల్లం చుట్టూ ఈగల్లా నీ చుట్టూ ఎందరో చేరతారు... నువ్వే ఆశ్చర్యపోయేంతగా! ఆ తర్వాత నువ్వెన్ని గుడ్డి నిర్ణయాలు తీసుకొన్నా, కనీసం ఒక దశాబ్దం నీకెలాంటి కష్టం ఉండదు. ఏ లోటూ ఉండదు. నువ్వు కలలో కూడా ఊహించని వ్యక్తులు ఓవర్‌నైట్‌లో నీ నెట్‌వర్క్‌లోకొస్తారు. అప్పటిదాకా నిన్ను కేర్ చేయని, నిన్ను వెలివేసిన నీ సోకాల్డ్ మిత్రులూ బంధువులూ "ఆహా ఓహో" అంటూ నిన్ను వెతుక్కుంటూ నీదగ్గరకొస్తారు. వీళ్లందరి నటన ముందు... నువ్వు అప్పటిదాకా డైరెక్ట్ చేసిన నీ నటీనటులు కూడా ఎందుకూ పనికిరారు.

అంతా ఒక మాండ్రెక్స్ మత్తులా ఉంటుంది... 24/7 x365 డేస్. ఇలాంటి సక్సెస్ ఇచ్చిన కిక్కుతో వెంటనే మరో సక్సెస్‌ని కూడా ముద్దాడావనుకో... ఇక అంతే. భూమ్మీదనే నువ్వు స్వర్గం అనుభవిస్తావు. స్వర్గం అంటే... 'చచ్చాక వెళతారు' అనే ఏదో సోకాల్డ్ నాన్సెన్సికల్ ఇల్యూజనరీ డెస్టినేషన్ కాదు. అక్కడి రంభ, ఊర్వశి, మేనకలు అసలే కాదు. 

అదొక అనిర్వచనీయమైన అనుభూతి. ఫాలోడ్ బై... రకరకాల అనుభవాల పరంపర. నీ ఫాంటసీలన్నీ నిజమవుతాయి.

అనుక్షణం ఆనందో బ్రహ్మ!

ఇంకేం కావాలి?

నువ్వు బాగుంటావు. నీ కుటుంబం, నీ బంధుమిత్రులు, నీ శ్రేయోభిలాషులు అంతా బాగుంటారు. ఫీల్డులో, లైమ్‌లైట్‌లో ఉన్నంతసేపూ నువ్వు ఏ పనులంటే ఆ పనులు అలా అలా పూర్తయిపోతుంటాయి. నువ్వు చేసుకొనే ఇతర వ్యాపారాలకు సినిమా అనే నీ నేపథ్యం ఒక పెద్ద సపోర్ట్ 
అవుతుంది. పొలిటీషియన్స్, క్రికెట్ స్టార్స్, బిజినెస్ మాగ్నెట్స్, బాబాలు, గురూజీలను కలవడం అనేది నీకు వెరీ సింపుల్ అయిపోతుంది. ఇంకెవరిని కలవాలన్నా అపాయింట్‌మెంట్ అనేది నీకసలు సమస్యేకాదు. లిటరల్లీ, ఎక్కడికెళ్లినా నీకు రెడ్ కార్పెటే. 

మనీ, మందు, ఆపోజిట్ సెక్స్‌తో ఫ్రెండ్‌షిప్స్ అనేవి... సక్సెస్ ఉన్నచోట, ఏ ఫీల్డులో అయినా మామూలే. అయితే... ఇక్కడ కొంచెం గ్లామర్ కూడా యాడ్ అవుద్ది కాబట్టి... అసలా కిక్కే వేరుగా ఉంటుంది. ఎక్కడో స్టీల్‌ప్లాంట్ గెస్ట్ హౌజ్‌లో... నువ్వు కాఫీ త్రాగుతూ రిలాక్స్ అవుతున్నప్పుడు, నీచేతిలో ఉన్న జెఫ్రీ ఆర్చర్ నవల... అక్కడే ఇంకో సినిమా షూటింగ్‌లో ఉన్న ఒక టాప్ హీరోయిన్‌తో నువ్వూహించని ఫ్రెండ్‌షిప్‌కు దారితీయవచ్చు. అంతకుముందు నువ్వు చూస్తే చాలు అనుకున్న ఒక సూపర్ స్టార్‌ను, గండిపేటలో ఆయన షూటింగ్ లొకేషన్‌లో కలిసి కబుర్లు చెప్పొచ్చు. కలవటమే అదృష్టం అని అప్పటివరకూ నువ్వనుకొన్న ఒక సీనియర్ డైరెక్టర్ ఇంట్లో, ఆయనతో కలిసి భోజనం చేస్తూ గంటలు గంటలు గడపొచ్చు. 

స్టార్ హోటళ్ళు, ఫ్లయిట్ జర్నీలు, కార్లు, లాంగ్ డ్రైవ్‌లు అనేవి... చూస్తుండగా నీకు మామూలయిపోతాయి. నువ్వెన్నడూ  కలలో కూడా ఊహించని ఒక ట్రెండీ బిజినెస్‌ను... సింగిల్‌గా... 24 గంటల్లో నువ్వే ప్రారంభిస్తావు. నీలో కాన్‌ఫిడెన్సుకి, నీ క్రియేటివిటీకి ఆకాశమే హద్దవుతుంది. నీకే ఆశ్చర్యం వేసేలా, నువ్వేదనుకొంటే అది, ఎప్పుడనుకొంటే అప్పుడు... అన్నీ డెడ్-ఈజీగా చెయ్యగలుగుతుంటావు. నువ్వూహించని ఎన్నో చిన్న చిన్న అందమైన అనుభవాలను నీ జీవితంలో ప్రతిరోజూ, ప్రతిపూటా ఆహ్వానిస్తూనే ఉంటావు... నాన్‌స్టాప్‌గా. స్వర్గం ఎక్కడో లేదు, నీ కళ్లముందే ఉన్నట్టుగా నువ్వు అనుక్షణం ఫీలవుతుంటావు.

సో... ఆ స్వర్గద్వారాల్ని స్పృశించడానికైనా నువ్వు సినీఫీల్డులోకి వెళ్లితీరాలి. 

ఇక్కడ ఫినిషింగ్ టచ్ ఏంటంటే -

ఈ స్టేజికి చేరుకొనే అవకాశం అందరికీ రాదు... అందరికీ సాధ్యంకాదు. ఫీల్డులోకి ఎంటరయ్యి, అవకాశం అందిపుచ్చుకొన్న ప్రతి 100 మందిలో కేవలం ఒకరిద్దరికి మాత్రమే సాధ్యమవుతుంది. ఆ ఇద్దరిలో నేను కూడా ఉంటాను అన్న నమ్మకం నీకున్నట్లైతే... ఆ ఒక్కన్ని నేనే అవుతాను అన్న ఆత్మవిశ్వాసం నీకున్నట్టయితే... ఇంక ఒక్క క్షణం ఆగొద్దు. 

నువ్వు ఫీల్డులోకి వెళ్లితీరాలి... దూకేసెయ్యాలి.

అయితే... ఒక 2 తప్పులు మాత్రం చెయ్యొద్దు. దురదృష్టవశాత్తూ... ఫీల్డులోకి ఎంటరయ్యే 90 శాతం మంది ఆ రెండుతప్పులే చేస్తారు. ఫలితంగా, స్వర్గం ఎప్పుడూ వారికి ఇంచ్ దూరంలో ఉన్నట్టే ఉంటుంది. ఎన్నేళ్లయినా ఆ ఇంచు అంచును కూడా వారు తాకలేరు!

ఆ రెండు తప్పులేంటన్నది నా తర్వాతి పోస్టులో! 

- మనోహర్ చిమ్మని 

Friday, 4 April 2025

సినీఫీల్డులోకి ఎందుకు వెళ్లకూడదు?


అంతకుముందు ఎక్కడా ఓడిపోనివాడు ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అవుతాడు. అంతకుముందు జీవితంలో ఎవ్వరిముందూ తలదించుకోనివాడు ఇక్కడ ఎంటరయ్యాక, అదే తలను పాతాళంలోకి పెట్టుకోవల్సిన పరిస్థితుల్ని ఎదుర్కొంటాడు. 

అంతకుముందు - తనముందు చేతులు కట్టుకొని నిలబడటానికి కూడా అర్హతలేని అనామక వ్యక్తుల సమక్షంలో ఇక్కడ గంటలు గంటలు గడపాల్సి వస్తుంది. పనికిరాని సొల్లు వినాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది... ఇష్టం లేకపోయినా!

అప్పటివరకూ నిన్ను మెచ్చుకొంటూ ఆకాశానికెత్తిన నీ అతి దగ్గరి మిత్రులు, ఆత్మీయులు - అదే నోటితో నువ్వు కలలో కూడా ఊహించని మాటలంటోంటే విధిలేక వినాల్సివస్తుంది... ఇక్కడ ఇరుక్కుపోయిన తర్వాత!

నీ చదువు, నీ సంస్కారం, నీ సిన్సియారిటీ, నీ సెన్సిటివ్‌నెస్, నీలోని మానవత్వం, నీ మంచితనం, నీ నీతి, నీ నిజాయితీలకు ఇక్కడ అస్సలు విలువుండదు. అలా ఉంటుందనుకుంటే... అది నీ మూర్ఖత్వం.     

అయితే, అప్పుడప్పుడు, సక్సెస్ సాధించి ఒక రేంజ్‌లో ఉన్నవాళ్లలో కూడా కొందరు దాదాపు ఇలాంటి పరిస్థితుల్నే ఇక్కడ ఎదుర్కోవాల్సిరావడం అత్యంత విషాదం. జీర్ణించుకోలేని ఒక వాస్తవం. 

ఇదే వాస్తవం మణిరత్నం చెప్పారు, శేఖర్ కపూర్ చెప్పారు. 

డిమాండ్ అండ్ సప్లై తప్ప ఇంకేం లేదిక్కడ.  

ప్రపంచంలో ఎక్కడైనా, ఏ వృత్తివ్యాపారాల్లో అయినా ఇదే మూల సూత్రం కదా పనిచేసేది? ఖచ్చితంగా అవును.

కాని, ఇది గ్లామర్ ఫీల్డు కాబట్టి ఇక్కడ ప్రతి చిన్నదీ ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతుంది. సొషల్‌గా, వ్యక్తిగతంగా ప్రభావం కూడా ఎక్కువే చూపిస్తుంది. చెప్పాలంటే - ఇక్కడ ప్రతి చిన్న అంశం ఒక బ్రేకింగ్ న్యూస్ అవుద్ది...

ఎక్కువగా నెగెటివ్‌గా!     

దటీజ్... ది గ్రేట్ సినీఫీల్డు.

కట్‌చేస్తే -  

అంత నిరాశపడకండి...

ఇదంతా నాలోని నెగెటివిటీ కాదు. ఫీల్డులోని రియాలిటీ.

బట్, ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే! 

నాణేనికి మరోవైపు కూడా ఉంది.

అది గోల్డ్. ఉట్టుట్టి గోల్డ్ కాదు, మెకన్నాస్ గోల్డ్. అదేంటో నా తర్వాతి పోస్టు, "సినీఫీల్డులోకి ఎందుకు వెళ్ళితీరాలి?"లో చూడండి. రేపు.  

- మనోహర్ చిమ్మని   

Tuesday, 1 April 2025

అనుక్షణమ్ యవ్వనమ్!


ఆమధ్య ఒక మోస్ట్ ట్రెండీ సబ్జెక్ట్‌తో "ఓకే బంగారం" సినిమా తీసి హిట్ చేసి, ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ 2 ఎపిక్ హిస్టారికల్ బ్లాక్‌బస్టర్స్ ఇచ్చి, "నాయకుడు" తర్వాత 35 ఏళ్ళకు, కమల్‌హాసన్‌తో మళ్ళీ ఒక ఎపిక్ "థగ్ లైఫ్" ప్రారంభించిన మణిరత్నం వయస్సు 68.

"వెస్ట్ సైడ్ స్టోరీ", "ది ఫేబుల్‌మాన్స్" సినిమాలను బ్యాక్ టు బ్యాక్ తీసి, మొన్నే 2022లో రిలీజ్ చేసిన స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఇప్పుడు మరో కొత్త సినిమా ప్లాన్‌లో ఉన్నారు. స్పీల్‌బర్గ్ వయస్సు 78. 
 
2032 దాకా "అవతార్" 3, 4, 5 సినిమాలను ప్లాన్ చేసుకొని, ప్రస్తుతం ఒకవైపు "అవతార్ 3" (19 Dec 2025 release) పోస్ట్‌ప్రొడక్షన్ జరుపుతూ, మరోవైపు "అవతార్ 4" షూటింగ్ చేస్తూ, 2032లో రిలీజ్ ప్లాన్ చేసుకున్న "అవతార్ 5" క్రియేషన్ బిజీలో మునిగితేలుతూ తన క్రియేటివ్ జీవితపు ప్రతి నిముషం జుర్రుకొంటూ ఎంజాయ్ చేస్తున్న జేమ్స్ కెమెరాన్ వయస్సు 70. 

రంగీలా, కంపెనీ, సర్కార్ వంటి క్లాసిక్స్‌తో మెప్పించిన మేవరిక్ డైరెక్టర్ ఆర్జీవీ, ఆమధ్య పోర్న్‌స్టార్ మియా మల్కోవాతో "గాడ్, సెక్స్ అండ్ ట్రుత్" కూడా తీశాడు. ఏ కుర్ర డైరెక్టర్ కూడా పెట్టలేని కెమెరా యాంగిల్స్‌లో షాట్స్ పెట్టి "ఎంటర్ ది గాళ్ డ్రాగన్" తీసిన ఆర్జీవీ, తన క్రియేటివిటీని ఆమధ్య "పూర్తిగా ఒక అర్థం పర్థం లేని పొలిటికల్ మెస్‌కు అంకితం చేసుకున్నాడు" అని అందరూ అనుకుంటూవుండగానే, కొత్తగా తన మార్క్ సినిమాల కోసం, ఒక మైండ్‌బ్లోయింగ్ "డెన్" ప్రారంభించాడు. ఇప్పుడు మళ్ళీ ఒక భారీ స్టార్-స్టడ్డెడ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ మేవరిక్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ వయస్సు ఇప్పుడు 63. 
 
సో వాట్?!

నాగార్జునకు 65, చిరంజీవికి 69 అంటే ఎవరన్నా నమ్ముతారా? వారి ఫిజికల్ ఫిట్‌నెస్, మెంటల్ ఫిట్‌నెస్ ముందు ఇప్పటి యంగ్ హీరోలు ఎంతమంది పనికొస్తారు?

మర్చిపోయాను...

తన చిత్రాలకు, తనకు కలిపి 41 ఆస్కార్ నామినేషన్స్, 13 ఆస్కార్ అవార్డుల్ని ఖాతాలో వేసుకున్న ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు, దర్శకుడు క్లింట్ ఈస్ట్‌వుడ్ వయస్సుకి మామూలుగా అయితే అందరూ రిటైర్ అయిపోయి, మంచం మీద నుంచి లేవలేమనో, చచ్చిపోతామనో ఫిక్స్ అయిపోతారు. కాని, ఆయన తాజాగా వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ హౌజ్ కోసం "జూరర్ నంబర్ 2" అని ఓ కొత్త సినిమా ప్రారంభించారు, అయిపోవచ్చింది కూడా. క్లింట్ ఈస్ట్‌వుడ్ వయస్సు ఇప్పుడు జస్ట్ 94.  

Age is just a number.
 
మన ఆలోచనలు, మైండ్‌సెట్ యంగ్‌గా ఉన్నప్పుడు వయస్సు అనేది... జస్ట్ బుల్ షిట్. 

ఒక్క సినిమాలే కాదు... ఎవరు ఎప్పుడు ఏదైనా ప్రారంభించవచ్చు. ఏదైనా సాధించవచ్చు. 

- మనోహర్ చిమ్మని