Friday, 20 March 2026

అసలు మనుషులా, రాక్షసులా, నరమాంస భక్షకులా?


ఎవరు విలన్, ఎవరు హీరో అన్నది కాదు పాయింట్.
సబ్జెక్ట్ ఏంటి అన్నది కూడా కాదు పాయింట్. 
అసలు ఏం చూపిస్తున్నాం, ఎంత రాక్షసంగా మారిపోతున్నాం అన్నది పాయింట్.

ఆ మధ్య యానిమల్ సినిమా చివర్లో, యానిమల్ పార్క్ గురించిన ఒక సీన్ ఉంటుంది. అందులో రణబీర్ కపూర్ పెద్ద కత్తితో మనుషుల్ని కైమా కొడతాడు. అతని మొహం మీదకి రక్తం చిమ్ముతుంటే ఈ పని చేస్తాడు.

హీరో నాని హిట్-3 సినిమాలో కూడా అత్యంత దారుణమైన రక్తపాతం ఉంటుంది. ఒక నెలరోజుల చిన్న బేబీని పట్టుకొని కూడా ఇలాంటి రక్తపాతపు సీన్ ఉంటుంది. ఏం చెప్పాలి? ఎంత క్రూరమైన విజన్?

"అసలు వయొలెన్స్ అంటే ఎలావుంటుందో నేను చూపిస్తా" అని ఒకరి మీద ఇంకొకరు పోటీపడుతున్నారు. 

ధురంధర్, ధురంధర్ ది రివేంజ్‌లో కూడా రక్తపాతం మనుషులు చూసేలా లేదు. 

మనుషుల్ని అత్యంత దారుణంగా నరకటాలు, రక్తం చిమ్మే శబ్దాలు, పుచ్చెలు పేలిపోవటాలు అతి సాధారణమైపోయాయి. ఒక మనిషి తలను తెగనరికి, ఆ తలతో నడిబజార్లో ఫుట్‌బాల్ ఆడుకోవడం సీన్ ఏదైతే ఉందో... నిజంగా మెచ్చుకుందామా?

మనుషుల్లో క్రమంగా అసలు సున్నితత్వం అనే ఫీలింగే లేకుండా చేస్తున్న వీరి రాక్షస ఆలోచనలకు బాధపడదామా? 

కట్ చేస్తే -

ఇలాంటివాటన్నిటి రిఫ్లెక్షన్ సమాజంలో ఉండదా? 
తప్పకుండా ఉంటుంది. 
అది మనం చూస్తున్నాం కూడా.  

మీరొకటి గమనించారా?

ఓటీటీల్లో మనవాళ్ళు తెగబడి చూస్తున్న అత్యంత జుగుప్సాకరమైన రక్తసిక్త-బూతు వెబ్ సీరీస్‌లు, సినిమాలు ఎన్నెన్నో కదా? వీటికి దాదాపు పూర్తిగా ఎడిక్ట్ అయిపోయారు కదా? 

ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ తప్ప వేరేవి చూడ్డం ఇష్టంలేని స్థాయికి మగవాళ్ళే కాదు, మహిళలూ వచ్చారు. 

"ఆ లవ్ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు ఏం చూస్తాం సార్... ఏముంటది వాటిలో? క్రైమ్ థ్రిల్లర్లే మజా!" అని మహిళలు కూడా అంటున్నారు అంటే... మార్పు ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకోవచ్చు. 

ఒకసారి ఇలాంటి మానసికస్థితికి వచ్చిన సామాన్య ప్రేక్షకులను... నిజ జీవితంలో జరిగే హత్యలు, రక్తపాతం, రేపులు పెద్దగా ప్రభావితం చెయ్యలేవు. 

ఇదంతా ఆల్రెడీ ఇప్పటి సమాజంలో మనం చూస్తున్నాం కూడా. 

బ్లూ డ్రమ్ములు, సిమెంట్ బస్తాలు, కైమా కొట్టి కుక్కర్లలో పెట్టడం... మనిషిని చంపి, ముక్కలు చేసి మూటకట్టి అవతలపడేయడం... ఇవ్వన్నీ ఇప్పుడు మామూలయిపోతున్నాయి. 

ఇలాంటి సినిమా ప్రభావం వల్ల కొంతమంది ఇంకా దారుణమైన రాక్షసోత్తములయ్యారు... 
ఎలాగంటే... 
మనలాంటి ఒక మనిషే మన కళ్ళముందే ఆత్మహత్య చేసుకుంటుంటే... మొబైల్‌తో వీడియో తీస్తూ తమాషా చూసేంతగా!

సినిమా ఒక ఎంటర్‌టైన్మెంట్ టూల్ నిజమే. కాని, మనుషుల్ని రాక్షసులుగా మార్చే స్థాయి వినోదసాధనం మాత్రం కాదు. 

- మనోహర్ చిమ్మని   

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani