Wednesday, 1 November 2017

అసలు ఎందుకురా బై నీ కులం?

నాకు అత్యంత దగ్గరి మిత్రుల్లో చాలామంది కులం ఏంటో నాకు ఇప్పటికీ తెలియదు.

వారికి కూడా నా కులం ఏంటో బహుశా తెలిసి ఉండదు.

ఒకే ఒక్క మేధావి మిత్రునితో ఒక సుధీర్ఘ చర్చా సమయంలో తప్ప, ఆ అవసరం నిజంగా మా మధ్య ఎప్పుడూ రాలేదు. 

కులం ప్రాతిపదికన నేనెప్పుడూ ఏదీ చెయ్యలేదు. ఎవ్వరినుంచి ఏదీ ఆశించలేదు. ఆ ప్రాతిపదికన ఎవ్వరికీ దగ్గర కాలేదు.

కానీ ..

బహుశా ఒక సంవత్సరం క్రితం అనుకొంటాను. ఒక మిత్రుడు ఈ విషయంలో నన్ను బాగా కెలికి, బలవంతంగా ఎలాగోలా ఒప్పించి, ఒక 'కుల పార్టీ' కి నేను కదిలేలా చేశాడు.

ఆ మిత్రుడు మాత్రం కులం ప్రాతిపదికనే నాకు దగ్గరయ్యాడని తర్వాత గ్రహించాను. అది పూర్తిగా అతని వ్యక్తిగతం. తప్పో ఒప్పో నేను చెప్పలేను.

కట్ చేస్తే -
సదరు మిత్రుడు చాలా మంచి ఉద్దేశ్యంతోనే నా దగ్గరో ప్రపోజల్ పెట్టాడు.

ఇప్పుడు నేనున్న ఒక ప్రధాన ప్రొఫెషన్‌లో నాకు అత్యంత వేగంగా అవసరమైన ఒకానొక అతి చిన్న సపోర్ట్‌ను తాను కనెక్ట్ చేయగలనన్నాడు.

అది .. కులం ప్రాతిపదికన!

ఆ ఒక్క 'కులం' అనే పదానికి పెద్ద ప్రాముఖ్యం ఇవ్వకుండా, నా తక్షణ ప్రొఫెషనల్ అవసరార్థం ఓకే చెప్పాను.

ఎలాగూ రెసిప్రోకల్‌గా, నేనూ ఏదో ఒకటి వారి సపోర్ట్‌కు మించింది వారికి తప్పక చేస్తానన్నది నాకు తెలుసు. నా మిత్రునికి కూడా తెలుసు.

సో, నా మిత్రుడు ఇంక పూనుకున్నాడు.


కట్ టూ 'కులం కనెక్షన్' - 

ఒక ఫైన్ సాయంత్రం నన్ను ఆ 'కుల పార్టీ'కి తీసుకెళ్లాడు నా మిత్రుడు.

మందు మస్త్‌గా నడుస్తోంది.

అక్కడే నా కులానికే చెందిన ఒక ఉన్నత స్థాయి వ్యక్తిని పరిచయం చేశాడు.

నా అవసరం చెప్పాడు. ఆయనకు నేనేం చేయగలనో చెప్పాడు. ఆయన నాకు ఇవ్వాల్సిన సపోర్ట్ గురించి చెప్పాడు.

ఎక్కడో అంతరాంతరాల్లో ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఆ సంభాషణంతా ఎలాగో భరించాను. ఆ క్షణం ఆయన్నుంచి ఆ సపోర్ట్‌ను నేను నిజంగా ఆశించాను.

ఆయన ఇచ్చుకున్న బిల్డప్ అలాంటిది.

అప్పటి నా అవసరం అలాంటిది.

కట్ చేస్తే -
జస్ట్ నాలుగంటే నాలుగు రోజుల్లో పని పూర్తిచేస్తానని కనీసం నాలుగు సార్లు ప్రామిస్ చేసిన సదరు ఉన్నతస్థాయి వ్యక్తి దాదాపు సంవత్సరమయినా తన మాట నిలుపుకోలేకపోయాడు.

నో ఇష్యూస్.

ఫరవాలేదు.

అర్థం చేసుకోగలిగాను.

కట్ చేస్తే -
ఆతర్వాత కొన్ని నెలలకు, ఇలాగే కులం నేపథ్యంలో ఇంకో వ్యక్తి కూడా నాకు పరిచయమయ్యాడు.

చాలా మంచి కుర్రాడు. చాలా మంచి భవిష్యత్తుంది ఆ కుర్రాడికి. ఆ మంచి భవిష్యత్తుకోసం ఆ కుర్రాడికి కులం అవసరం అస్సలు లేదు. 

ఆ కుర్రాడి దగ్గర కూడా అనుకోకుండా ఒకసారి ఇలాంటి టాపిక్కే వచ్చింది.

కట్ చేస్తే -
ఆ కుర్రాడి ద్వారా ఇంకో 'కుల మిత్రుడు' పరిచయమయ్యాడు. అతను కూడా మామూలుగానే ప్రామిస్‌ల వర్షం కురిపించాడు.

విచిత్రమేంటంటే - ఈ రెండు కేసుల్లోనూ, ఏ ఒక్కరూ, వారి ప్రామిస్‌లను నిలబెట్టుకోలేకపోయారు.

అంతవరకు ఓకే.

కానీ ..

వారి మీద గౌరవంతో వివిధ సందర్భాల్లో నేను పంపిన ఎన్నో నా రొటీన్ విషెస్‌కు, నా మెసేజెస్‌కు రిప్లై ఇవ్వాలన్న మినిమమ్ కర్టెసీని కూడా వారు పాటించలేకపోయారు!

అత్యంత బాధ్యతారాహిత్యమైన వారి ప్రామిస్‌ల కారణంగా నేను నిజంగా లక్షలు నష్టపోయినా, నా పట్ల మినిమమ్ కర్టెసీ కూడా చూపించని ఈ కులం, కులబాంధవులు నిజంగా నాకవసరమా?   

Tuesday, 31 October 2017

కులం ఒక సామాజిక నిజం!

ఈదేశంలో కులం నేపథ్యంలోనే ప్రతీదీ నడుస్తోంది అన్న ఉద్దేశ్యంలో, నాకత్యంత ప్రియమైన విద్యార్థుల్లో ఒకడు, "Guy On The Saidewalk" నవలా రచయిత కూడా అయిన భరత్‌కృష్ణ ఈమాట ఒకసారి నాతో అన్నాడు. 

నిజంగా ఇది నిజమే. 

పరిచయాలు, స్నేహాలు, వ్యాపారాలు, లాబీలు, రౌడీయిజాలు, రాజకీయాలు .. అన్నిటికీ మన దేశంలో కులమే నేపథ్యం.

అలాగని, ప్రతిచోటా ఈ కులం కార్డు పనిచేస్తుందన్న గ్యారంటీ కూడా లేదు.

ఉదాహరణకు, బాగా ఉన్న ఒక కులంవాడు, ఏమీలేని తన కులంవాడిని అసలు పట్టించుకోడు!  

వాస్తవానికి ఈ ప్రపంచంలో ఉన్నవి, ఉండేవి, అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ..  రెండే రెండు కులాలు: 

ఉన్న కులం. లేని కులం.

అయితే డబ్బు! లేదంటే పవర్!!

ఈ రెంటిలో .. ఏదో ఒకటి 'ఉన్న కులం' ఒకటి. ఏదీ 'లేని కులం' ఒకటి.  

మళ్లీ ఈ రెండింటికీ కూడా విడదీయరాని అనుబంధం ఉంటుంది. అది వేరే విషయం.   

ఎవరు ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా, ఇదే నిజం.


కట్ టూ నా అనుభవం - 

నాకేమాత్రం ఇష్టం లేని ఈ కులం నేపథ్యంగా, నేను దారుణంగా నష్టపోయిన ఒకే ఒక్క ఎపిసోడ్ గురించి మరో బ్లాగ్ పోస్టులో రాస్తాను. 

బహుశా రేపే. 

Friday, 20 October 2017

టాలెంట్ ఒక్కటే కాదు .. ఇంక చాలా ఉంది!

హాలీవుడ్‌ను 'ల్యాండ్ ఆఫ్ డ్రీమ్‌స్' అంటారు.

అక్కడికి ఏటా కనీసం 100,000 మందికి తక్కువకాకుండా వస్తారు.

ఆర్టిస్టులూ టెక్నీషియన్లూ.

వాళ్లల్లో కేవలం 1 నుంచి 2 శాతం మందికి మాత్రమే ఏదో ఒక అవకాశం దొరుకుతుంది. మిగిలినవాళ్లంతా కనీసం ఒక సంవత్సరం నుంచి, కొన్ని దశాబ్దాలపాటు నానా కష్టాలు పడి వెనక్కివెళ్ళిపోతారు.

ఇలా వెళ్ళిపోయినవాళ్లంతా అదే హాలీవుడ్‌ను 'ల్యాండ్ ఆఫ్ బ్రోకెన్ డ్రీమ్‌స్' అని తిట్టుకోవడంలో ఆశ్చర్యంలేదు. 


కట్ టూ మన టాలీవుడ్ - 

పైనచెప్పిన లెక్కంతా ప్రపంచంలోని అన్ని సినిమా ఇండస్ట్రీలకు వర్తిస్తుంది.

మన బాలీవుడ్, టాలీవుడ్‌లు కూడా అందుకు మినహాయింపు కాదు.

సినిమా పుట్టినప్పటినుంచి ఇప్పటిదాకా అంతే.

ఇకముందు కూడా అంతే.

ఇక్కడ సక్సెస్ అనేది ఎప్పుడూ కేవలం 2 శాతం లోపే.

ప్రపంచంలోని ఏ సినీ ఇండస్ట్రీలోనయినా, ఏ పీరియడ్‌లోనయినా కేవలం వేళ్లమీద లెక్కించగలిగిన ఒక డజన్ మంది మాత్రమే సక్సెస్‌లో ఉంటారు.

ఆర్టిస్టులూ, టెక్నీషియన్లూ.

మిగిలినవాళ్లంతా ఏదోవిధంగా వెనుదిరగాల్సిందే.

ఈ వాస్తవాన్ని గ్రహించినవాళ్లు జాగ్రత్తపడతారు. భ్రమలో బతికేవాళ్లు మాత్రం అలాగే సినిమాకష్టాలుపడుతూ కొనసాగుతుంటారు. ఈలోగా జీవితం కొవ్వత్తిలా కరిగిపోతుంది.

ఇండస్ట్రీ మంచిదే. కానీ దాని సిస్టమ్ దానిది. ఆ సిస్టమ్‌లో ఇమడగలిగినవాడే ఇక్కడ పనికొస్తాడు.

ఇక్కడ టాలెంట్ ఒక్కటే కాదు పనిచేసేది. దాన్ని మించి పనిచేసేవి చాలా ఉంటాయి.

వాటిల్లో ముఖ్యమైనవి ఒక మూడున్నాయి:

లాబీయింగ్.

మనీ.

మానిప్యులేషన్స్.

పైన చెప్పిన మూడింటిలో కనీసం ఏ రెండింటిలోనయినా ఎక్స్‌పర్ట్ అయినవాడు మాత్రమే ఇక్కడ బతికి బట్టకడతాడు. సక్సెస్ సాధిస్తాడు.      

Tuesday, 17 October 2017

క్రియేటివిటీ అన్‌లిమిటెడ్!

సిల్వర్ స్క్రీన్‌కు నేను పరిచయం చేసిన మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌చంద్రతో కలిసి, నేను ప్రారంభించిన కొత్త వెంచరే ఈ 'మాప్రాక్స్ ఇంటర్నేషనల్'.

సినిమాలు సినిమాలే.

ఈ విషయంలో, ఆల్రెడీ 'నమస్తే హైదరాబాద్' ట్రాక్ మీద ఉంది.

నేను ఇంతకుముందు తీసిన సినిమాలతో పోలిస్తే ఇదొక పెద్ద సినిమా. ఈ సినిమా బడ్జెట్, షూటింగ్ డేస్ వగైరా అన్నీ ఎక్కువే. ఈ ప్రొడక్షన్ దాని దారిలో అది అలా నడుస్తూ ఉంటుంది.

మరోవైపు -

ఈవెంట్స్, ప్రమోషన్స్, మ్యూజిక్ వీడియోస్, ఇండిపెండెంట్ ఫిలింస్, ఫిలిం ఆడిషన్ ఈవెంట్స్, షార్ట్ ఫిలింస్, షార్ట్ ఫిలిం ప్రీమియర్స్, బుక్స్ .. ఇలా మరెన్నో క్రియేటివ్ యాక్టివిటీస్‌లో నేనూ, ప్రదీప్ మునిగితేలాలనుకొంటున్నాం.

ఒక క్రమపద్ధతిలో ఆయా సృజనాత్మకరంగాల్లో దేశాల సరిహద్దులు కూడా దాటేయాలనుకొంటున్నాం.

ఒక్క ముక్కలో చెప్పాలంటే - మాప్రాక్స్ ఇంటర్నేషనల్ అనేది - మా ఇద్దరి విషయంలో - హద్దులులేని ఒక సృజనాత్మక తృష్ణ. 

మేం కోరుకొంటున్న సృజనాత్మక స్వేఛ్చకు ఒక రాచబాట.    

Monday, 16 October 2017

బ్యాక్ టు బ్లాగ్!

'బ్యాక్ టు స్కూల్' లాగా, 'బ్యాక్ టు బ్లాగ్' అన్నమాట!

నేననుకొన్న నా కొత్త బ్లాగ్ ప్రారంభించడానికి ఇంకా  సమయం ఉంది.

బహుశా 'నమస్తే హైదరాబాద్' షూటింగ్ పూర్తయిన తర్వాతనుంచి ప్రారంభించవచ్చు.

సో, బ్యాక్ టు మై నగ్నచిత్రం.

ఎట్‌లీస్ట్ ఇంకొన్నాళ్ళు. 


కట్ టూ ది గ్యాప్  - 

సరిగ్గా నాలుగు నెలల ఈ గ్యాప్‌లో చాలా జరిగాయి.

కలలో కూడా ఊహించలేని స్థాయిలో పెద్ద షాకింగ్ జెర్క్ ఇచ్చిన ఒక ఆరోగ్య సమస్య. అదుపు తప్పిన ఆర్థిక సమస్యలు. ఇంటా బయటా, ఒక్క క్షణం గుర్తుతెచ్చుకోడానికి కూడా బాధించే ఎన్నో అనుభవాల గాయాలు. నమ్మించి మోసాలు. నమ్మకద్రోహాలు.

ఇలాంటి ఎంతో నెగెటివిటీ మధ్య అక్కడక్కడా, అప్పుడప్పుడూ, వేళ్లమీద లెక్కించగలిగిన ఏవో కొన్ని అద్భుత అనుభవాలు, జ్ఞాపకాలు. స్నేహ సుగంధాలు, సౌరభాలు.  

జీవితం ఒక ఆట ఆడుకుంది నాతో.

ఇప్పుడు నేను చూపించదల్చుకున్నాను జీవితానికి. అసలు ఆటంటే ఎలా ఉంటుందో.

సరిగా నాలుగు నెలల క్రితం, ఈ 'నగ్నచిత్రం'లో ఇదే నా చివరి బ్లాగ్ పోస్ట్ అంటూ గుడ్‌బై చెప్పాను. ఇప్పుడు మళ్ళీ తిరిగొచ్చాను. కొత్త బ్లాగ్ ప్రారంభించేదాకా ఎప్పట్లా నాకు తోచిన ఏదో ఒక నాన్సెన్స్ ఇక్కడ రాసి పోస్ట్ చేస్తుంటాను.

వ్యక్తిగతంగా నాకు సంబంధించినంతవరకూ - బ్లాగింగ్ అనేది ఒక హాబీ. ఒక మెడిటేషన్. ఒక థెరపీ.

అన్నిటినీ మించి, చాలాసార్లు, నాలోని అంతస్సంఘర్షణకు ఒక ఔట్‌లెట్.   

Saturday, 17 June 2017

యాక్షన్!

ఇంక మాటల్లేవ్!

కమిట్ అయిన ఒకే ఒక్క సినిమా: 'నమస్తే హైదరాబాద్.'

అంతే.

ఒక సినిమా, ఎనిమిది నెలలు.

ఇప్పటికి ఇదొక్కటే లక్ష్యం.

ప్రస్తుతం దీనికి సంబంధించి, వివిధదశల్లో ఉన్న ప్రిప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది మా టీమ్.

నమస్తే హైదరాబాద్, పూర్తిగా మన హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్న ఇన్‌స్పైరింగ్, ట్రెండీ, యూత్ సినిమా.

నాకు, నా టీమ్‌కు ఇదొక ప్రిస్టేజియస్ సినిమా.

ఇంతకుముందటి నా మైక్రోబడ్జెట్ సినిమాలతో పోలిస్తే ఇదొక భారీ సినిమా. కాంప్రమైజ్ కాకుండా, కొంచెం లీజర్‌గా తీయాలనుకుంటున్న సినిమా.

సినిమా కంటెంట్, కాన్వాస్‌ను బట్టి దీన్లో .. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల లోని ఆర్టిస్టులు మాత్రమే కాకుండా .. ముంబై, ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రాంతాలనుంచి కూడా ఆర్టిస్టులు ఉండే అవకాశముంది.

నమస్తే హైదరాబాద్ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బహుశా అక్టోబర్ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాను. షూటింగ్ నవంబర్ నుంచి అనుకుంటున్నాము.

కట్ టూ నగ్నచిత్రం - 

ఇంతకు ముందే చెప్పినట్టు, ఈ నగ్నచిత్రం బ్లాగ్‌లో ఇదే చివరి పోస్టు!

ఈ విషయం చెప్పడానికి కొంచెం బాధగా ఉన్నా, నిర్ణయం నిర్ణయమే. దీన్లో ఎలాంటి మార్పు లేదు. ఉండదు.

నేను చెప్పిన నా కొత్త 'డైలీ బ్లాగ్'ను త్వరలోనే ప్రారంభిస్తాను. కాకపోతే, ఎప్పుడు అన్నది డిసైడ్ చెయ్యాల్సింది మాత్రం వేరొకరు!

ప్యూర్‌లీ, అదొక పర్సనల్ స్పిరిచువల్ కనెక్షన్. ఒక సెమీ ఆటోబయోగ్రఫీ. ఒక సెలెక్టివ్ మెమొరీ.

త్వరలోనే నా ఈ కొత్త బ్లాగ్‌ను, 'నగ్నచిత్రం' బ్లాగ్‌కు కనెక్ట్ చేస్తాను. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో కూడా ఈ కొత్త బ్లాగ్ వివరాలు పోస్ట్ చేస్తాను.

కట్ బ్యాక్ టూ మై సోషల్ యాక్టివిటీ - 

ఇకనుంచీ నా ప్రొఫెషనల్ యాక్టివిటీ అంతా సోషల్ మీడియాలోని నా ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ పేజి, 'నమస్తే హైదరాబాద్' ఫేస్‌బుక్ పేజి, ట్విట్టర్‌లలో .. నా వీలునుబట్టి, ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటాను.

వీటన్నిట్లో కూడా, నిజానికి ఇకనుంచీ నేను ఎక్కువగా ఉపయోగించేదీ, ఉపయోగించగలిగేదీ ఒక్క ట్విట్టర్‌ను మాత్రమే.

ఫేస్‌బుక్ మీద నా అయిష్టం రోజురోజుకూ పీక్స్ కు వెళ్తోంది. నమస్తే హైద్రాబాద్ సినిమా రిలీజ్ తర్వాత నేను ఫేస్‌బుక్‌ను పూర్తిగా వదిలేస్తున్నాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. 

తర్వాత నా సోషల్ మీడియా ప్రజెన్స్‌కు ట్విట్టర్ ఒక్కటి చాలు అనుకుంటున్నాను.       

టచ్‌లో ఉందాం.

థాంక్ యూ ఆల్! 

Monday, 12 June 2017

"పగలే వెన్నెల" కాయించిన సినారె ఇక లేరు!

'నన్ను దోచుకొందువటే' అంటూ ఆరంభించి, 'పగలే వెన్నెల' కాయించి, 'అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం' అని చెప్పిన జ్ఞానపీఠం మన 'సినారె' ఇక లేరు.

ఈ ఉదయం, ఈ విషాద వార్త తెలియగానే నేను పెట్టిన చిన్న ట్వీట్ అది.

సోషల్ మీడియా సంప్రదాయం ప్రకారం, దీన్ని కూడా యధావిధిగా కొందరు మహానుభావులు 'కాపీ పేస్ట్' చేశారు. అది వేరే విషయం. 

అయితే .. మన డైనమిక్ మినిస్టర్ 'కేటీఆర్' గారు నా ట్వీట్‌ను రీట్వీట్ చేయడం విశేషం.

కట్ చేస్తే - 

కవి, సినీ గేయరచయిత, విమర్శకుడు, విశ్వవిద్యాలయ అధ్యాపకుడు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ఎన్ టి ఆర్ కు అత్యంత సన్నిహితుడు కూడా అయిన సినారె గారి గురించి .. ఆయన జీవితం, జీవనశైలి గురించి .. ఆయనే రాసిన 'కర్పూరవసంతరాయలు' లాంటి ఒక రసాత్మాక కావ్యమే రాయొచ్చు.
 
సినారె గారి కవిత్వం, ఇతర పుస్తకాలు కొన్ని, కనీసం ఒక డజన్ దేశవిదేశీ భాషల్లోకి ఆనువదించబడి ప్రచురితమయ్యాయి.
  
ఆయన చేతులమీదుగా, నాకు తెలిసి, ఎలాంటి అతిశయోక్తి లేకుండా, కొన్ని వేల పుస్తకాలు ఆవిష్కరింపబడ్డాయి. వాటిలో నావి కూడా రెండు పుస్తకాలుండటం నా అదృష్టం.

వారి చేతులమీదుగా శాలువా కప్పించుకొన్న అదృష్టం కూడా నాకు కలిగినందుకు గర్విస్తున్నాను.

అంతే కాదు, ఒక సందర్భంలో, సినారె గారితో కూర్చొని గంటలకొద్దీ కొన్నిరోజులపాటు గడిపిన అద్భుత అనుభవం నేనిప్పటికీ మర్చిపోలేను.
 
తెలుగు సాహితీలోకంలో తెలంగాణ నిలువెత్తు సంతకం సినారె గారికి ముకుళిత హస్తాలతో ఇదే నా నివాళి. 

Wednesday, 7 June 2017

చదువుకూ సంపాదనకూ సంబంధం లేదు!

చదువుకున్న ప్రతివాడికీ సంస్కారం ఉంటుందన్న గ్యారంటీ ఎవరైనా ఇవ్వగలరా?

ఇవ్వలేరు.

అలాగే, మన చదువులకూ మన సంపాదనకూ అస్సలు సంబంధం ఉండదు.

ఈ నిజాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఎందరో బిలియనేర్లు, మిలియనేర్లు నిరూపించారు.

ప్రపంచంలో 5వ అత్యంత రిచెస్ట్ పర్సన్, తెల్లారిలేస్తే ప్రపంచం మొత్తాన్ని తన ఫేస్‌బుక్ తప్ప మరోటి చూడకుండా ఎడిక్ట్ చేసిన మార్క్ జకెర్‌బర్గ్‌ను కాలేజ్‌లోంచి మధ్యలోనే బయటికి పంపించేశారు.

ప్రపంచంలోనే నంబర్ వన్ రిచెస్ట్ పర్సన్ బిల్ గేట్స్ కేస్ కూడా సేమ్ టూ సేమ్! కాలేజ్ లోంచి మధ్యలోనే గెంటేశారు.  

చైనాలో అందరికంటే రిచెస్ట్ పర్సన్ జాక్ మా హార్వార్డ్‌లో చదవాలనుకొని 10 సార్లు అప్లై చేసినా సీటివ్వలేదు. సీట్ సంగతి పక్కనపెడితే, ప్రతిచోటా, ఆయన అప్లై చేసిన 30 ఉద్యోగాల్లో ఆయనొక్కడికి తప్ప అందరికీ ఉద్యోగాలిచ్చారు!

ఇక్కడ ఇండియాలో, మన ధీరూభాయ్ అంబానీ జీవితం ఈ విషయంలో మనందరికీ తెలిసిన మరో పెద్ద ఉదాహరణ. దేశ రాజకీయాలను అవలీలగా మానిప్యులేట్ చేయగలిగే ఒక అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్నే సృష్టించాడతను!

కట్ టూ  స్పీల్‌బర్గ్ - 

సౌత్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో 'థియేటర్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ కోర్స్' కోసం ఎన్నిసార్లు అప్లై చేసినా మన స్టీవెన్ స్పీల్‌బర్గ్‌కు ఆ యూనివర్సిటీ సీటివ్వలేదు. విధిలేక, చివరకు, యూనివర్సల్ స్టూడియోలో 'జీతం లేని' ఇన్‌టర్న్‌గా ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్‌లో చేరాడు స్పీల్‌బర్గ్. తర్వాతంతా చరిత్రే!

సో, ఇక్కడ మ్యాటర్ చదువు, డిగ్రీలు, మెడల్స్ కావు.

మైండ్‌సెట్.

అదంత ఈజీ కాదు .. 

Saturday, 3 June 2017

గన్స్ అండ్ థైస్

మొన్న ఆర్టిస్ట్ చలపతిరావు గారి ఇష్యూ గురించి ఓ రెండ్రోజులు నానా హంగామా జరిగింది. చానెల్స్‌లో, బయట సోషల్ మీడియాలో కూడా.

వున్నట్టుండి రామ్‌గోపాల్‌వర్మ తన "గన్స్ అండ్ థైస్" వెబ్ సీరీస్ టీజర్ వదిలాడు.

ఆ టీజర్లో ఉన్న స్థాయిలో న్యూడిటీని మనవాళ్లు ఇంతవరకు ఏ భారతీయ సినిమా లేదా సీరియల్ టీజర్లో చూసి ఉండరు.

చానెల్స్‌కు, మేధావులకు, మహిళా సంఘాలకు కావల్సినంత పని దొరికింది అని చాలా మంది అనుకున్నారు.

బట్ .. అలాగేం జరగలేదు.

జరగదని కూడా నాకు తెలుసు.

అందరూ హాయిగా ఆ టీజర్ చూసేసి గమ్మునున్నారు. జాతీయ స్థాయిలో అన్ని టీవీ చానెళ్లు  వర్మ "గన్స్ అండ్ థైస్" గురించి ఆయనతో బోల్డన్ని ఇంటర్వ్యూలను చేశాయి. ఇంకా చేస్తున్నాయి.

విచిత్రంగా .. ఏ అన్నపూర్ణ సుంకరగానీ, అన్నా వెట్టిక్కాడ్ గానీ సీన్లోకి ఎంటర్ కాలేదు!

అదంతే.

అదొక 'అడల్ట్ కంటెంట్' ఉన్న అంతర్జాతీయ స్థాయి వెబ్ సీరీస్. ఎవ్వరూ ఏమనడానికి లేదు. ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు అప్‌లోడ్ చేస్తాడా అని ఎదురుచూడ్డం తప్ప!

Friday, 2 June 2017

9 నిమిషాల్లో బ్లాగ్‌పోస్ట్ రాయడం ఎలా?

రెండు తెలుగు సినిమాలు, ఒక ఇంగ్లిష్ సినిమా, ఒక వెబ్ సీరీస్, ఒక ఈవెంట్, ఒక వర్క్‌షాప్, ఒక బుక్ రిలీజ్ మొదలైనవాటి పనులు, ఇతర వ్యక్తిగతమయిన వెరీ సీరియస్ 'టైమ్‌బౌండ్ కమిట్‌మెంట్‌'ల వత్తిడిలో ఇప్పుడు నాకు అస్సలు సమయం ఉండటం లేదు.

సమయం మిగుల్చుకోలేకపోతున్నాను.

ఇప్పుడిదంతా ఫేస్ బుక్కులూ, ట్విట్టర్ల యుగం.

లేటెస్ట్‌గా 'ఇన్స్‌టాగ్రామ్' మీద పడ్డారు.

షార్ట్ కట్ లో రెండు వాక్యాలు, లేదంటే జస్ట్ ఒక బొమ్మ!

అంతకు మించి పోస్ట్ చేసే సమయం ఎవరికీ లేదు. చదివే సమయం, ఓపికా నెట్ యూజర్లకు అసలే లేదు.

అందుకే - ఇకనించీ  ఈ బ్లాగ్ లోని పోస్టులన్నీ సాధ్యమయినంత చిన్నగా రాయాలని డిసైడయ్యాను. మరోవిధంగా చెప్పాలంటే - సినీ ఫీల్డు, క్రియేటివిటీ లకు సంబంధించి
ఈ బ్లాగ్‌లో నేను రాసే అవే నగ్న సత్యాలు ఇప్పుడు కొంచెం చిన్నగా వుంటాయి.

సో, నో వర్రీస్!

మీ సమయం విలువేంటో నాకు తెలుసు.

ఇకనుంచీ ఈ బ్లాగ్‌లో ఏది రాసినా పది నిమిషాల లోపే! ఇప్పుడు మీరు చదువుతున్నది కూడా ..


కట్ చేస్తే - 

ఇప్పటివరకు, ఈ బ్లాగ్ మొత్తంలో అతి పెద్ద బ్లాగ్‌పోస్టు .. నిన్న నేను గురువుగారు దాసరి నారాయణరావు గారి స్మృతిలో రాసిన పోస్టే కావడం విశేషం.