Monday, 21 April 2025

అమృతం కురిసే ఆ రాత్రి కోసం


మాయాలోకపు మంత్రనగరి 
ఊపిరందని లోతుల్లో కూరుకుపోయి -
ఎదురుచూపుల ఆకాశంలోని 
వేనవేల చుక్కల్లో 
ఎన్ని వందల ఆనందాల్ని 
ఎంత దారుణంగా కోల్పోయావో 
ఒక్కొక్కటిగా లెక్కపెట్టుకొంటూ...
అలసి సొలసి, అంతర్ముఖుడవై 
కొన్ని వందలసార్లు 
"అటా ఇటా" అనుకొంటూ 
ఎటూ తేల్చుకోలేక,
"టు బి ఆర్ నాట్ టు బి" అని
పాత డ్రామాలో కొత్త హామ్‌లెట్‌లా 
నీలో నువ్వే ఊగిసలాడీ ఆడీ -
నువ్వు వేసే ఆ ఒక్క చిన్న అడుగే 
నీ జీవితంలో నువ్వు ఊహించని 
ఒక అద్భుతమైన మలుపుకి 
కారణమౌతుందని నీకు తెలీదా?   

అనంత విశ్వం నీ కోసం 
కసిగా కాన్స్‌పయిర్ అయ్యి... 
నీ శృంఖలాలను ఛేదిస్తూ - 
నిన్ను నిలువునా ముంచేసి, 
నీ స్వప్నాల్ని తొక్కిపెట్టిన  
సునామీ సముద్రాన్ని నిలువునా చీలుస్తూ -
నీకు రెడ్ కార్పెట్ రాజమార్గం వేస్తుండగా... 
నీ కలల కాంతివైపుకి నువ్వు కదిలే   
ఆ అడుగు తప్పక పడుతుంది -  
ఇవాళో, రేపో, ఇంకొన్నిరోజులకో!
అది తప్పదు గాక తప్పదని నీకు తెలీదా?
అమృతం కురిసే ఆ రాత్రిని
నీ తనివితీరా ఆస్వాదిస్తూ
ఆ ఆనందాల వెన్నెలధారల్లో  
నువ్వు స్నానించకా తప్పదని నీకు తెలీదా?          

ఓ నా ప్రియనేస్తమా!    
అప్పటిదాకా -
నువ్వు చేయాల్సిన పని ఒక్కటే...     
నీ వైపు ఎక్కుపెట్టిన 
చూపుడువేళ్ళను చూడకుండా, 
నీ దారంటా పడివున్న 
చెత్తా చెదారం పట్టించుకోకుండా 
అలా నడుస్తూ ఉండటమే!         

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani