Tuesday, 5 November 2024

చదువుకు, సినిమాకు సంబంధం లేదు!


"Research shows that the more a boy misbehaves in school, the more likely he is to earn a lot of money as an adult!"

ఇదేదో ఉత్తుత్తి స్టేట్‌మెంట్ కాదు. నా అనుభవంలో నేను కూడా చూసిన ఒక సత్యం. దీనికి అనుబంధంగా మరికొన్ని నిజాలు కూడా నేను చెప్పగలను. ఎలాంటి హిపోక్రసీ లేకుండా!

* రోడ్డుమీద వెళ్తూ కనిపించిన ప్రతి రాయికీ, రప్పకూ విచిత్రంగా అలా దండం పెట్టుకుంటూ వెళ్తుంటారు కొంతమంది. కొంతమంది మాట్లాడుతూ మాట్లాడుతూనే గాల్లోనే ఎవరికో దండం పెడుతుంటారు. దండం పెట్టడం తప్పుకాదు, అసలు అదంతా ఒక స్క్రూలూజ్ వ్యవహారంలా కనిపిస్తుంది మనకు. వీరి వ్యవహారశైలిగానీ, భాషగానీ అవతలివారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ కేటగిరీకి చెందిన చాలామంది నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గరగా తెలుసు. వీళ్లల్లో చాలామందికి కాగితం పైన పెన్నుపెట్టి రాయటం రాదు. కానీ వీరందరి దగ్గర డబ్బు పిచ్చిగా ఉంటుంది. పిచ్చిపిచ్చిగా సంపాదిస్తారు!  

* అంతర్జాతీయంగా వివిధరంగాల్లో అత్యుత్తమ స్థాయి విజయాల్ని సాధించి బిలియనేర్లలో 80 శాతం మంది చదువులో గుండు సున్నాలే. లేదా స్కూలు, కాలేజ్ స్థాయిలో "డ్రాప్ అవుట్"లే!     

ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే...        

1. చదువుకోనివాడి లక్ష్యం స్పష్టంగా ఉంటుంది. మొండిగా ఆ ఒక్కదాని గురించే కష్టపడి సాధిస్తాడు. 
2. చదువుకున్నవాడికి పది లక్ష్యాలుంటాయి. పది పడవలమీద కాళ్లు పెడతాడు. ఏ ఒక్కటీ సాధించలేడు. 
3. చదువుకు, సంపాదనకు అస్సలు సంబంధం లేదు. "నేనెంత సంపాదించాలి? దానికోసం నేనేం చేయాలి?" అన్న వెరీ సింపుల్ 'ఫినాన్షియల్ ఇంటలిజెన్స్' చాలు.
4. పైన 1, 2, 3 లను చాలా ఆలస్యంగా రియలైజ్ కావడమంత దురదృష్టం ఇంకొకటి లేదు.  

కట్ చేస్తే - 

సినీ ఫీల్డులో కూడా అంతే. అత్యున్నతస్థాయి విజయాలు సాధించి కోట్లు సంపాదించుకున్న ఆర్టిస్టులూ, టెక్నీషియన్లలో చాలామంది చదువుకు పంగనామాలు పెట్టినవాళ్లే! లేదా, చదువుకుంటామని చెప్పి ఊళ్ళోంచి బయటపడి వచ్చి ఇక్కడ సినిమాల్లో చేరినవాళ్ళే.

ఇది ఇప్పటి విషయం కాదు. ఎప్పుడైనా ఎక్కడైనా - హాలీవుడ్‌లో అయినా, టాలీవుడ్‌లో అయినా - ఇంతే. చదువుకు, సినిమాల్లో నీ స్కిల్‌కు సంబంధం లేదు. ఈ స్కిల్ మీద నీకెంత ప్యాషన్ ఉన్నది, దానికోసం నువ్వు ఏఏ త్యాగాలు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నావన్నదే ముఖ్యం.

అలాగని బాగా చదువుకున్నవాళ్ళు సినీ ఫీల్డులోఅసలు ఉండరని కాదు. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఉంటారు, ఉన్నారు. కాని, ఫీల్డులో వారి సంఖ్య ఒక 20 శాతం మించదు. వీళ్లంతా కూడా ఎప్పుడెప్పుడు చదువు ముగించుకుందామా అని ఎదురుచూస్తుంటారు. ఎప్పుడెప్పుడు చేస్తున్న ఉద్యోగాల్ని వదిలిపెడదామా అని ఎదురుచూస్తుంటారు.

వీళ్ళకు కూడా చదువు మీదకంటే, చేస్తున్న ఉద్యోగాల మీదకంటే, సినిమా మీద వ్యామోహమే టాప్ ప్రయారిటీలో ఉంటున్నది సత్యం.

అలా లేకపోతే వారికి ఇక్కడ ఎంట్రీ, ఎగ్జిస్టెన్స్ రెండూ ఉండవు.         

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani