Saturday, 9 November 2024

శిలాశాసనం లాంటి నిజం!


సినీఫీల్డులోకి ప్రవేశించాలనుకొనే ఆర్టిస్టులయినా, టెక్నీషియన్లయినా, ఇంకెవరయినా... ముందుగా తెల్సుకోవల్సిన విషయాలు ప్రధానంగా రెండు:

1. సినీఫీల్డులో "ఇది ఇలా జరుగుతుంది" అని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఫీల్డులో ఎంట్రీ దొరకడమే చాలా కష్టం. దొరికాక దాన్ని సరైన విధంగా వినియోగించుకొని నిలదొక్కుకోవడం మరీ కష్టం. ఒక్క ముక్కలో చెప్పాలంటే - ఇక్కడ దేనికీ గ్యారంటీ లేదు. కాబట్టి, దేన్నీ టేకిట్ ఫర్ గ్రాంటెడ్‌లా తీసుకోడానికి లేదు. ప్రతిక్షణం, ప్రతి విషయంలో చాలా జాగ్రత్తపడాల్సి ఉంటుంది.  

2.  ఇక్కడ అవకాశం దొరికి, పేరు తెచ్చుకొనేవరకూ దాదాపు ఎవ్వరూ ఒక్క రూపాయి పారితోషికం ఇవ్వరు. అలా ఇస్తారనుకోవడం, అలా అని ఎవరైనా చెప్తే వినడం... ఉఠ్ఠి భ్రమ. మన జేబులోంచే వేలు, లక్షలు ఖర్చుపెట్టుకుంటూ బ్రతకాల్సి ఉంటుంది. ఆర్టిస్టు అయినా, టెక్నీషియన్ అయినా - ఇలాంటి ఖర్చు లేకుండా ఎవరికైనా ఒక చోట అవకాశం దొరికిందంటే దాన్ని నిజంగా ఒక అదృష్టంగా భావించాలి. ఈ విషయంలో కేవలం ఒకే ఒక్క కేటగిరీకి మాత్రమే మినహాయింపు ఉంటుంది. అది - హీరోయిన్లు, ఇతర ఫిమేల్ సపోర్టింగ్ ఆర్టిస్టులు. వీళ్లు దొరకడమే కష్టం కాబట్టి ఈ వెసులుబాటు! అదే హీరోలయితే ఎదురు పెట్టుబడి పెట్టాల్సికూడా రావొచ్చు. అది వేరే విషయం.      

పైన చెప్పిన రెండు అంశాల్ని దృష్టిలో పెట్టుకొని, కొత్తగా ఫీల్డులోకి రావాలనుకొనేవాళ్లు తీసుకోవల్సిన జాగ్రత్త ఒకే ఒక్కటి...

ఇక్కడ ఫీల్డులో అవకాశం దొరికి, నిలదొక్కుకొనేవరకూ - ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరొక ఆదాయమార్గాన్ని లేదా జాబ్‌ని ముందుగానే చూసుకోవాలి. అది మీ సినీ కెరీర్ ప్రయత్నాలకు ఎలాంటి అడ్డంకి కానిదై ఉండాలి. లేదంటే - సింపుల్‌గా మీరు బాగా డబ్బున్నవాళ్లయి ఉండాలి. మీ కుటుంబం మీకు పూర్తిగా సహకరించాలి. అప్పుడే ఫీల్డులో మీరు ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది.  

కట్ చేస్తే - 

శిలాశాసనం లాంటి ఈ జాగ్రత్త తీసుకోకుండా ఫీల్డులోకి ఎవరు ఎంటరయినా... తర్వాత సినిమా కష్టాలు తప్పవు.

అన్నీ అవుతున్నట్టే ఉంటుంది. కానీ, ఏదీ జరగదు. సాంఘికంగా, ఆర్థికంగా ఎన్నో ఛాలెంజ్‌లు ఎదుర్కోవాల్సి వస్తుంది. చూస్తుండగానే జీవితం మీ చేతుల్లోంచి జారిపోతుంది.

సో, మరొక ఇన్‌కమ్ స్ట్రీమ్ గాని, ఒక సపోర్ట్ సిస్టమ్ గాని లేకుండా ఇక్కడ ఎవ్వరూ ఏం సాధించలేరు.      

ఇలాంటి సిచువేషన్‌కు పూర్తి వ్యతిరేకంగా - కొందరు ఏ బాదరబందీల్లేకుండా ఫీల్డులోకి దిగుతారు. ఇంకొందరు యు యస్ లో బాగా సంపాదించుకొని వచ్చి, ఇక్కడో కంపెనీ పెట్టుకొని, ఫీల్డులో పూర్థిస్థాయిలో దిగుతారు. వీళ్లకి ఎలాంటి భయం ఉండదు. వత్తిడిలో నిర్ణయాలు తీసుకొనే అవసరం వీరికి అసలుండదు. వీళ్ళు చాలా కూల్‌గా ఈ జర్నీని ఎంజాయ్ చేస్తూ, అనుకున్నది సాధించుకొంటూ వెళ్తారు. అయితే - పరోక్షంగా వీళ్ళు కూడా శిలాశాసనం లాంటి ఆ జాగ్రత్త పాటించినట్టే అని నా ఉద్దేశ్యం.

సో, బి కేర్‌ఫుల్!        

- మనోహర్ చిమ్మని  

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani