Sunday, 3 November 2024

ఎవరైనా ఎన్ని పనులనయినా, ఏకకాలంలో చేయొచ్చు... ఒక్క సినిమా తప్ప!


ప్రపంచస్థాయిలో సక్సెస్‌ఫుల్ పీపుల్ అంతా ఏకకాలంలో ఎన్నోరకాల పనుల్లో, వృత్తుల్లో, వ్యాపకాల్లో, వ్యాపారాల్లో మునిగితేలుతున్నవాళ్లే!

మన ప్రయారిటీలనుబట్టి, ఏయే పనులు ఎప్పుడు చేయాలో, అప్పుడు అలా వాటికవే జరుగుతూపోతుంటాయి. అలా చేయడానికి మనం అతి సహజంగా అలవాటుపడిపోతాం.

పనిలేనప్పుడే మనం బిజీగా ఉంటాం. చేతినిండా పనులున్నప్పుడు అసలు బిజీ అన్న పదమే మనకు గుర్తుకురాదు.

ఇప్పుడు నేనొక అరడజన్ పనుల్ని అత్యంత వేగంగా, ఎలాంటి సమస్యల్లేకుండా చేయగలుగుతున్నాను. నేను చేస్తున్న ఏపనీ నా మరో పనికి అడ్డురావడంలేదు. విచిత్రంగా అన్ని పనులూ చాలా ఈజీగా జరిగిపోతున్నాయి. చెప్పాలంటే, ఒకప్పుడు నేను చేయడానికి ఇష్టపడని ఎన్నో ఫ్రీలాన్సర్ పనుల్ని ఇప్పుడు యాడ్స్ ఇచ్చి మరీ చేస్తున్నాను.

నాకే అర్థం కావడం లేదు, నాలో ఇంత మార్పు ఏమిటో.

అయితే - ఈ పనులన్నిటికి వ్యతిరేకంగా, సినిమా ఒక్కటే నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. ఒక్క సినిమాల్లో మాత్రమే మనం ప్లాన్ చేసుకున్నట్టుగా, ఒక గీత గీసుకున్నట్టుగా పని జరగదు. అదంతే.

అయితే, ఇప్పుడు దీనికి కూడా ఒక చిన్న చిట్కా కనుక్కున్నాను. నో వర్రీస్.    

సినిమా అనేది ముందు ఒక డైరెక్టర్స్ విజన్. కాని, అది పూర్తిగా ఒక టీమ్ వర్క్ అన్న వాస్తవం కూడా గుర్తించాలి.

సినిమా చూస్తున్నప్పుడు ఎంత ఎంటర్‌టైన్మెంటో, చేస్తున్నప్పుడు అంత డిస్ట్రాక్షన్.

ఇతర ఎన్నో ప్రొఫెషన్స్ వేరు, సినిమా ప్రొఫెషన్ వేరు. డిస్ట్రాక్షన్స్‌కు ఇక్కడ విధిగా, మానసికంగా సిద్ధపడి ఉండాలి. మన ప్లానింగ్‌లో మనం ఊహించనివి ఎన్నో చాలా కామన్‌గా జరిగిపోతుంటాయి. ఇంకేం ఉండదు, 'ఆల్ సెట్' అనుకుంటాం. కాని, మనం కలలో కూడా ఊహించనివి జరిగి, ఇంకో కొత్త ప్రాబ్లం వచ్చి మన ముందు నిల్చుంటుంది.

సో... సమస్యలు, అడ్డంకులు, అవాంతరాలు, ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా ఊహించనిదేదో జరిగి స్మూత్‌గా జరుగుతున్న పని ఒక్కసారిగా ఆగిపోవటం వంటివి... ఇక్కడ సర్వసాధారణం.

వీటన్నిటి కోసం, ప్రతి విషయంలో ప్లాన్-ఏ, ప్లాన్-బి అనే కాదు, ఈలన్ మస్క్ చెప్పినట్టు ప్లాన్-జెడ్ కూడా మనదగ్గర రెడీగా ఉండాలి. 

ఇదంతా రాసుకోవడం ఈజీ, చెప్పటం ఇంకా ఈజీ. డిస్ట్రాక్షన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఉంటుంది అసలు మజా.

మచ్చుకి: అప్పటిదాకా అంతా బాగా నడుస్తుంటుంది... షాట్ రెడీ అనగానే ఒక ఆర్టిస్టు కనిపించడు. ఉన్నట్టుండి అక్కన్నించి ఎలా మాయమయ్యాడో తెలీదు. ఫోన్ చేస్తే స్విచాఫ్ ఉంటుంది. షూటింగ్ ఆగిపోతుంది. రెండు గంటల తర్వాత "నేను బెంగుళూరు ఫ్లైట్‌లో ఉన్నానయ్యా. మీ డైరెక్టర్‌కు చెప్పు" అని ఏడీకి కాల్ వస్తుంది. ఎవరూహిస్తారు దీన్ని?...

ఇంకోటి: టాకీ మొత్తం అయిపోతుంది. పాటలకు షెడ్యూల్ అంతా ఫిక్స్ చేసుకుంటాం. అప్పటిదాకా టాకీ పార్ట్ ఎంతో అద్భుతంగా, తన సొంత ప్రాజెక్టు అన్నంత బాధ్యతగా చేసిన హీరోయిన్ ఉన్నట్టుండి ఫోన్‌కు అందదు. షూటింగ్ కాన్సిల్! రెండు వారాల తర్వాత తెలుస్తుంది... ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్‌తో న్యూజీలాండ్ చేక్కేసిందని! ఈ న్యూస్ ఆ హీరోయిన్ పేరెంట్స్‌కు కూడా తెలీదు. మనమే కనుక్కుంటాం!...

ఇదైతే కలలో కూడా ఊహించం: లంచ్‌లో బొమ్మిడాయిల కర్రీ తేలేదని షూటింగ్ మధ్యలో ఒక చీఫ్ టెక్నీషియన్ అలుగుతాడు! అప్పట్నుంచి, సాయంత్రం షూటింగ్ ప్యాకప్ దాకా, ఆ డైరెక్టర్‌కు, అతని టీమ్‌కు నరకమే!... జస్ట్ ఇవి చిన్న శాంపుల్స్.

ఇంక ఫండింగ్ మ్యాటర్స్, ఈగో ప్రాబ్లమ్స్ వంటివాటికి లెక్క పత్రం ఉండదు.    

కట్ చేస్తే -

సినిమా అనేది ఎవరో ఒక్కరి డెసిషన్ మీద ఆధారపడి నడిచే వ్యవస్థ కాదు. ప్రతి స్టేజ్‌లో ఎంతో మంది ప్రమేయం ఉంటుంది. ఎంతో మంది "యస్", "నో"ల మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఎన్నో మనకి నచ్చని "యస్"లకు మనం "నో" చెప్పలేని పరిస్థితులుంటాయి. మనకెంతో ఇష్టమైనవాటికి అవతల నుంచి సింపుల్‌గా ఒక "నో" వస్తుంది, వినాలి.

ఇలాంటివన్నీ భరించాలి. చేతనైతే కన్విన్స్ చెయ్యాలి. అవసరమైతే కన్‌ఫ్యూజ్ చెయ్యాలి. తప్పదు అనుకుంటే, మ్యానిప్యులేట్ కూడా చెయ్యగలగాలి.

ఇదంతా చిరునవ్వుతో చాలా కూల్‌గా చెయ్యగలగాలి. అప్పుడే నువ్వు డైరెక్టర్‌గా సక్సెస్ అవుతావు.  

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani