Friday, 29 November 2024

సృజనాత్మక జీవితంలో ప్రయోగాలు తప్పనిసరి! కాని...


ఒక మల్టిఫేరియస్ క్రియేటివ్ ఫ్రీలాన్సర్‌గా, నా సుదీర్ఘ ప్రొఫెషనల్ ప్రయాణంలో క్రియేటివిటీతో ముడిపడివున్న పనులు ఇప్పటివరకు చాలా చేశాను. వీటిలో చాలావరకు ప్రయోగాలే. నా ఈ నిరంతర ప్రయోగాల నేపథ్యంలో - ఈమధ్య నేను మొదలెట్టిన మరో కొత్త ప్రయోగమే ఈ "మనోహరమ్" డిజిటల్ బులెటిన్.  

ఏదో ఒకటో రెండో సినిమాల్ని అన్-లిమిటెడ్‌గా, ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా, పెద్ద టార్గెట్‌తో చేస్తూ, ఈ జర్నీని బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. కాని, క్రియేటివిటీ కదా... నిర్ణయాలు మారుతుంటాయి. ఇప్పుడు వరుసగా ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ రెండు సినిమాలను ప్రారంభించి, వాటి ప్రి-ప్రొడక్షన్ పనుల బిజీలో తలమునకలై వున్నాను. కొన్నాళ్ళపాటు, పూర్తిస్థాయిలో సినిమాలు చేయబోతున్నాను. ఈ నేపథ్యంలో, మనోహరమ్ లాంటి అదనపు బాధ్యతలకు రెగ్యులర్‌గా సమయం దొరకడం కష్టం. దొరికినా, దీనివల్ల సినిమాలపైన నా డీప్ ఫోకస్ అనేది చెదిరిపోయే ప్రమాదం ఉంటుంది. 

సో, ఇక నా మొత్తం ఫోకస్ సినిమాలపైనే పెట్టాలి కాబట్టి, ఏదో ఒకరోజు దీనికి గుడ్‌బై తప్పదు.    

కట్ చేస్తే -

స్ట్రెస్ బస్టర్ కోసం ఎక్స్, ఇన్‌స్టా, బ్లాగ్ ఎలాగూ ఉన్నాయి. మనోహరమ్ ద్వారా ఏదైతే సాధించాలని టార్గెట్ చేశానో, దాన్ని నా సోషల్ మీడియా ద్వారా కూడా సాధించగలను అన్నది నా గట్ ఫీలింగ్! కావాలనుకుంటే, బ్లాగింగ్‌కు కూడా కొన్నాళ్ళు విరామం ఇవ్వచ్చునేమో!...   

- మనోహర్ చిమ్మని     

ఒక సంవత్సరంలో 10 సినిమాలు డైరెక్ట్ చేయగలరా?


"అవును, చేయొచ్చు" అని 1980 లోనే నిరూపించారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. అంటే నెలకి ఒక సినిమా కంటే ఎక్కువే! అలాగని ఏదో చుట్టచుట్టి అవతల పడేసిన సినిమాలు కావవి. వాటిల్లో కనీసం 80% సినిమాలు హిట్లు, సూపర్ హిట్లు, సిల్వర్ జుబ్లీలు. 

స్వప్న, శ్రీవారి ముచ్చట్లు, సర్కస్ రాముడు, సర్దార్ పాపారాయుడు, సీతారాములు మొదలైనవి ఆ లిస్ట్ లోనివే. ఇంకో విశేషం ఏంటంటే - ఈ 10 సినిమాల్లో 2 హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. జ్యోతి బనే జ్వాల, యే కైసా ఇన్సాఫ్. 

రెనగేడ్ ఫిలిం మేకింగ్ అంటే అది. 

నిజంగా గురువుగారికి వందనం... అభివందనం! ఆయన రికార్డుల గురించి, ఆయన గురించి ఒక పుస్తకమే రాయొచ్చు.

కట్ టూ 2024 - 
 
ఫిలిం నెగెటివ్‌తో సినిమాలు చేసిన ఆ రోజుల్లో ఎడిటింగ్ నుంచి, ప్రతి ఒక్క శాఖలో పని చాలా ఎక్కువే. ఒక్కొక్క ఫిలిం ముక్క చేత్తో పట్టుకొని చూస్తూ, అతికించాల్సిన రోజులవి. ప్రతి చిన్న ట్రాన్సిషన్స్‌కు కూడా గంటలకి గంటలు, రోజులకి రోజులు మాన్యువల్‌గా పనిచేసిన రోజులవి.

అలాంటి రోజుల్లోనే, నెలకో సినిమా తీయగలిగినప్పుడు - ఇంత అడ్వాన్స్‌డ్ డిజిటల్-ఏఐ టెక్నాలజీ వచ్చిన ఈ రోజుల్లో, ఒక్కో సినిమాకు సంవత్సరాలు పడుతుండటం నిజంగా గమ్మత్తైన విషయం. 

గ్రాఫిక్ వర్క్‌లతో తీసే మాగ్నమ్ ఓపస్‌ల గురించి నేను మాట్లాడ్డం లేదు. మామూలు మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాల గురించి మాట్లాడుతున్నాను.  
 
దీనికి వంద రీజన్స్ చెప్పుకోవచ్చు మనం. కాని, అదంతే. 

- మనోహర్ చిమ్మని    

Thursday, 28 November 2024

మన ఆలోచనలు, మైండ్‌సెట్ యంగ్‌గా ఉన్నప్పుడు...


ఆమధ్య ఒక మోస్ట్ ట్రెండీ సబ్జెక్ట్‌తో "ఓకే బంగారం" తీసి, హిట్ చేసి, ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ 2 ఎపిక్ హిస్టారికల్ బ్లాక్‌బస్టర్స్ ఇచ్చి, "నాయకుడు" తర్వాత 35 ఏళ్ళకు, కమల్‌హాసన్‌తో మళ్ళీ ఒక ఎపిక్ "థగ్ లైఫ్" ప్రారంభించిన మణిరత్నం వయస్సు 68. 

"వెస్ట్ సైడ్ స్టోరీ", "ది ఫేబుల్‌మాన్స్" సినిమాలను బ్యాక్ టు బ్యాక్ తీసి, మొన్నే 2022లో రిలీజ్ చేసిన స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఇప్పుడు మరో కొత్త సినిమా ప్లాన్‌లో ఉన్నారు. స్పీల్‌బర్గ్ వయస్సు 77. 2032 దాకా "అవతార్" 3, 4, 5 సినిమాలను ప్లాన్ చేసుకొని, ప్రస్తుతం ఒకవైపు "అవతార్ 3" పోస్ట్‌ప్రొడక్షన్ జరుపుతూ, మరోవైపు "అవతార్ 4" షూటింగ్ చేస్తూ, 2032లో రిలీజ్ ప్లాన్ చేసుకున్న "అవతార్ 5" క్రియేషన్ బిజీలో మునిగితేలుతూ తన క్రియేటివ్ జీవితపు ప్రతి నిముషం జుర్రుకొంటూ ఎంజాయ్ చేస్తున్న జేమ్స్ కెమెరాన్ వయస్సు 70. 

రంగీలా, కంపెనీ, సర్కార్ వంటి క్లాసిక్స్‌తో మెప్పించిన మేవరిక్ డైరెక్టర్ ఆర్జీవీ, ఆమధ్య పోర్న్‌స్టార్ మియా మల్కోవాతో "గాడ్, సెక్స్ అండ్ ట్రుత్" కూడా తీశాడు. ఏ కుర్ర డైరెక్టర్ కూడా పెట్టలేని కెమెరా యాంగిల్స్‌లో షాట్స్ పెట్టి "ఎంటర్ ది గాళ్ డ్రాగన్" తీసిన ఆర్జీవీ, తన క్రియేటివిటీని ఇప్పుడు పూర్తిగా ఒక అర్థం పర్థం లేని పొలిటికల్ మెస్‌కు అంకితం చేసుకున్నాడు అని అందరూ అనుకుంటూవుండగానే, కొత్తగా తన మార్క్ సినిమాల కోసం, ఒక మైండ్‌బ్లోయింగ్ "డెన్" ప్రారంభించి, మల్టిపుల్ సినిమాల్లో బిజీగా ఉన్నాడు. అవి ఏవైనా కానీ, అతనిష్టం. పని చేస్తున్నాడు. ఈ మేవరిక్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ వయస్సు ఇప్పుడు 62. "సర్కార్" అని ఫ్రెండ్లీగా ఆర్జీవీ పిలుచుకునే "బిగ్ బి" అమితాబ్ బచ్చన్ వయస్సు 82.  

సో వాట్?! 

నాగార్జునకు 65, చిరంజీవికి 69 అంటే ఎవరన్నా నమ్ముతారా? వారి ఫిజికల్ ఫిట్‌నెస్, మెంటల్ ఫిట్‌నెస్ ముందు ఇప్పటి యంగ్ హీరోలు ఎంతమంది పనికొస్తారు? మర్చిపోయాను... తన చిత్రాలకు, తనకు కలిపి 41 ఆస్కార్ నామినేషన్స్, 13 ఆస్కార్ అవార్డుల్ని ఖాతాలో వేసుకున్న ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు, దర్శకుడు క్లింట్ ఈస్ట్‌వుడ్ వయస్సుకి మామూలుగా అయితే అందరూ రిటైర్ అయిపోయి, మంచం మీద నుంచి లేవలేమని ఫిక్స్ అయిపోతారు. కాని, ఆయన తాజాగా వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ హౌజ్ కోసం "జూరర్ నంబర్ 2" అని కొత్త సినిమా ప్రారంభించారు, అయిపోవచ్చింది కూడా. క్లింట్ ఈస్ట్‌వుడ్ వయస్సు ఇప్పుడు జస్ట్ 94.  

ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్. మన ఆలోచనలు, మైండ్‌సెట్ యంగ్‌గా ఉన్నప్పుడు వయస్సు అనేది... జస్ట్ బుల్ షిట్. 

- మనోహర్ చిమ్మని  

(మొన్న 26/11/2024 నాడు, నా పుట్టినరోజు సందర్భంగా ఈ పాతపోస్టునే ఇప్పుడు మరోసారి ఫ్రెష్‌గా పోస్ట్ చేశాను.)

Wednesday, 27 November 2024

లక్ష్యం ఎప్పుడూ పెద్దదిగానే ఉండాలి!


అమెరికాలో ఒక దివాలా తీసిన వ్యక్తి - సర్వస్వం కోల్పోయి, పీకలదాకా అప్పుల్లో కూరుకుపోయిన స్థితి నుంచి, కేవలం మూడేళ్లలో 600 మిలియన్ల డాలర్లు సంపాదించాడు. అంటే, మన ఇండియన్ కరెన్సీలో సుమారు 5066 కోట్లు అన్నమాట!

"ఇదెలా సాధ్యమయ్యింది?" అని ఆయన్ని ప్రశ్నించినపుడు ఆ రహస్యాన్ని ఆయన కేవలం ఒకే ఒక్క వాక్యంలో చెప్పాడు - "నేను ఎప్పటినుంచయితే భారీ స్థాయిలో ఆలోచించటం మొదలెట్టానో, ఆ క్షణం నుంచే నా జీవితం పూర్తిగా మారిపోయింది!" 

ఆ తర్వాత ఆ వ్యక్తి ఇంకెన్నో వందల కోట్లు సంపాదించాడు. క్రమంగా ఒక మిలియనేర్ ట్రెయినర్ గా మారిపోయి, ఆ రంగంలోనూ కోట్లు సంపాదించాడు. అతనే బ్రయాన్ ట్రేసీ. ఇదంతా కొన్ని దశాబ్దాల క్రిందటి విషయం. ఇలాంటి విజయాలు మన దేశంలో కూడా వందలకొద్దీ రికార్డ్ అయి ఉన్నాయి.    

ఇక్కడ భారీ స్థాయిలో ఆలోచించడం అంటే "థింకింగ్ బిగ్" అన్న మాట. సక్సెస్ సైన్స్ కు సంబంధించి ఈ రెండు పదాలకి చాలా అర్థం ఉంది. ఇంట్లో ముసుగుతన్ని పడుకొని, పగటి కలలు కనడం, ఆకాశానికి నిచ్చెనలు వేయడం "థింక్ బిగ్" ఎప్పుడూ కాదు.

క్యాలిక్యులేటెడ్ రిస్క్ తో అతిపెద్ద లక్ష్యాల్ని నిర్దేశించుకొని, సంపూర్ణ సామర్థ్యంతో కృషి చేయడమే క్లుప్తంగా దీని నిర్వచనం.

కట్ చేస్తే -   

సినిమాల్లో అవకాశాల కోసం, గతంలో లాగా దశాబ్దాల పాటు వెతుక్కుంటూ సమయం వృధాచేసుకునే కాలం కాదిది.

ఇది డిజిటల్-సోషల్ మీడియా యుగం.

సరిగ్గా ప్లాన్ చేసుకుని, ఒక బ్లూప్రింట్‌తో కష్టపడితే ఏదీ అసాధ్యం కాదు. ఎన్నో రంగాల్లో, ఎందరో, ఎన్నెన్నో భారీ విజయాల్ని ఇలా సాధించి చూపిస్తున్నారు. యాక్టింగ్ రాదు అని ట్రోల్స్ చేయబడ్డ ఒక వర్ధమాన హీరో ఒకే ఒక్క శుక్రవారం తన జాతకం తానే మార్చేసుకుని, ఇప్పుడు పది కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.

ఇది సినిమాల్లో మాత్రమే సాధ్యం.  

సో, జర్నీకి కొంత టైమ్ పట్టొచ్చు. కాని, లక్ష్యం ఎప్పుడూ పెద్దదిగానే ఉండాలి.

- మనోహర్ చిమ్మని                             

Tuesday, 26 November 2024

కొన్ని జ్ఞాపకాలు బాగుంటాయ్! కానీ...


నా తొలి సినిమా హీరో రాజా, నేనూ ఇప్పుడు అసలు టచ్‌లో లేము. కాని, ఆ సినిమా ప్రీప్రొడక్షన్ సమయంలోనూ, షూటింగ్ జరుగుతున్నన్ని రోజులూ, ఆ తర్వాత సినిమా రిలీజయ్యేవరకూ... హీరో రాజాతో ముఖ్యంగా నాకు, మా టీమ్‌కు ఎన్నో మంచి మెమొరీస్ ఉన్నాయి. 

* మారుతీ వ్యాన్‌లో మౌంట్ ఒపెరాకు వెళుతూ/వెళ్లాక (డాన్స్ మాస్టర్ నిక్సన్‌తో కలిసి) నేను, రాజా పార్టీ చేసుకోవటం. 
* ప్యారడైజ్ చౌరస్తా నుంచి  నేను, రాజా అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లి ఒక హోటల్లో లంచ్ చేయటం. అప్పటికే రాజా మూడు సినిమాలు చేసి ఉన్నాడు! (ఓ చినదానా, అప్పుడప్పుడు, విజయం)
* షూటింగ్ కోసం మారిషస్ కు రెండు వారాలు వెళ్లినప్పుడు, ఒక టీం మెంబర్‌గా ఎలాంటి ఈగో లేని అతని కోపరేషన్.
* కెమెరా లెన్సులున్న బరువైన బాక్స్‌ని తన తలమీద పెట్టుకొని, టీమ్‌తో పాటు కనీసం ఒక మైలు దూరం సముద్రం అంచులవెంట రాళ్లమీద నడవటం.
* కాల్షీట్ టైమింగ్స్ లేకుండా, మారిషస్‌లో చాలా సరదాగా ఆడుతూ పాడుతూ షూటింగ్‌లో పాల్గొనటం, అందర్నీ ఉత్సాహపర్చటం.
* షూటింగ్ సమయంలో, బీచుల్లోని వేడికి బాగా నల్లబడిన నా ముఖానికి తనదగ్గరున్న కాస్మెటిక్స్ ఏవేవో పూసి, రాజా స్వయంగా రెండుమూడుసార్లు నాకు ఫేషియల్ చేయటం. 
* "మనోహర్ గారూ.. డైరెక్టర్ గారూ" అంటూ, ఇంగ్లిష్ యాక్సెంటుతో కూడిన తనదైన వాయిస్‌తో గౌరవంగా పిలవటం. 
* కొత్త సీన్ చేస్తున్న ప్రతిసారీ నా స్క్రిప్టుని పదే పదే మెచ్చుకోవడం.  
* అన్నపూర్ణ స్టూడియోలో ఒక మంచి ఎమోషనల్ సీన్  చేస్తున్నపుడు చనిపోయిన వాళ్ల అమ్మగారు గుర్తుకొచ్చి కన్నీళ్లు పెట్టుకోవటం. ఆ ఉద్వేగంలోనే, సెట్లో ఒక మూలన ఉన్న నా దగ్గరకు వచ్చి  "మీతో ఇంకో సినిమా తప్పకుండా చేస్తాను" అని చెప్పటం... ఇలా రాజాతో నాకూ, మా టీమ్‌కు చాలా మంచి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి.      

చాలా గ్యాప్ తర్వాత, ఒకసారి ది సేమ్ రాజాని మణికొండలోని తన కొత్త ఇంట్లో కలిశాను. అదే పలకరింపు. అదే మర్యాద. అదే చిరునవ్వు. "సినిమాల్లో నేను డబ్బు సంపాదించలేదు. పోగొట్టుకున్నాను. ఇప్పుడు సినిమాలు చేయాలన్న అవసరం కూడా  లేదు నాకు. లైఫ్ చాలా హాయిగా ఉంది" అన్నాడు క్రైస్తవ మత ఉపన్యాసకుడుగా ప్రస్తుతం బిజీగా ఉన్న రాజా. రాజాకు సేవాభావం ఎక్కువ. ఆ మధ్య ఒక ఫౌండషన్ కూడా ప్రారంభించాడు. 

కట్ చేస్తే -

కారణం నాకు తెలీదు కాని, రాజా ఇచ్చిన చాలా ఇంటర్వ్యూల్లో తను పనిచేసిన అందరు డైరెక్టర్ల పేర్లు చెప్పాడు కాని, నా ఒక్కడి పేరే ఎందుకో ఎప్పుడూ చెప్పలేదు!  

- మనోహర్ చిమ్మని  

Monday, 25 November 2024

Happy Birthday to Me!


ఇంకొన్ని గంటల్లో నా పుట్టినరోజు.

నేనేం పెద్ద సెలబ్రిటీ కాదు.

కానీ, ఫేస్‌బుక్ టైమ్‌లైన్ ఓపెన్ పెట్టాలి. వాట్సాప్‌లు, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్/ట్విట్టర్లు చూసుకొంటూ ఉండాలి. ఫోన్‌కు అందుబాటులో ఉండాలి. మిత్రులు, ఆత్మీయుల గ్రీటింగ్స్‌కు రెస్పాండ్ అవుతుండాలి. 

నా మిత్రులు, శ్రేయోభిలాషులైనవారందరి శుభాకాంక్షలను నేను తప్పక గౌరవిస్తాను. వారి అభిమానానికి సర్వదా కృతజ్ఞుణ్ణి. కానీ, ఎక్కువభాగం, ఇదంతా ఒక అనవసరమైన ఆబ్లిగేషన్, హిపోక్రసీ, అనవసరంగా కొనితెచ్చుకొనే ఒక మానసిక వత్తిడి... అని నాకనిపిస్తుంది. 

నేను కరెక్టు కాకపోవచ్చు, కాని నాకు మాత్రం అలాగే అనిపిస్తుంది. 

కొన్ని తప్పవు. అంతే. 

కట్ చేస్తే -

ఈసారి నా పుట్టినరోజు నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే పుట్టినరోజు అవుతుంది. ఎందుకంటే, ఈ పుట్టినరోజు నేపథ్యంగా, దాదాపు ఒక 40 రోజుల క్రితమే, ఒకటి రెండు చాలా పెద్ద నిర్ణయాలు తీసుకున్నాను... వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కూడా. గట్టిగా సంకల్పించాను. సాధిస్తాను కూడా. 

Wish me the best. 

- మనోహర్ చిమ్మని 

అసలు సినిమా ఇలా ఉంటుంది!


నా మొదటి సినిమాలో ఒక కొత్త నటున్ని ఫుల్ లెంగ్త్ పవర్‌ఫుల్ మెయిన్ విలన్ రోల్‌లో పరిచయం చేశాను. అతను నిజంగా చాలా మంచి నటుడు. చాలా బాగా చేశాడు. నేననుకున్న కథ ప్రకారం సినిమా చివర్లో కూడా హీరోకంటే ఎక్కువ వెయిటేజ్ ఆ విలన్ కేరెక్టర్‌కే ఇచ్చాను.

ఇలా చేయడం వల్ల నేను ఆ విలన్ దగ్గర బాగా డబ్బులు తీసుకున్నానని అప్పట్లో ఆ చిత్రంలోని హీరో అనుకోవడం, అతన్లోని ఆ ఫీలింగ్‌ను పైకే అనడం కూడా జరిగింది.

అప్పట్లో ఆ హీరో నేనూ మంచి ఫ్రెండ్స్. మధ్యలో కొందరుంటారుగా... చెడగొట్టారు. అది వేరే విషయం. దాని గురించి తర్వాత రేపటి బ్లాగ్‌లో చెప్తాను.       

కట్ చేస్తే - 

ఇప్పుడా విలన్ ఓ మాదిరి మంచి పొజిషన్‌లోనే ఉన్నాడు. ఇండస్ట్రీలోని కొన్ని సహజ లక్షణాల నేపథ్యంలో మేం అసలిప్పుడు టచ్‌లో లేము. టచ్‌లో ఉన్నా లేకపోయినా, నేను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నటుడు కాబట్టి నాకు నిజంగానే సంతోషంగా ఉంటుంది. ఆ నటునిపట్ల, అతని నటనపట్ల నా అలోచన మారదు, వ్యక్తిగా అతని పట్ల నా గౌరవం మారదు. 

ఇండస్ట్రీలో ఇన్నేళ్ళుగా ఉన్నాడు. బాగున్నాడు. అదే నా సంతోషం. ఇంతకు మించి నేను ఆలోచించను. వేరే ఆశించను. 

అయితే... ఆమధ్య ఒక మిత్రుడు చెప్పాడు. ఆ నటుని ఇంటర్వ్యూ ఒక దినపత్రిక ఆదివారం ఎడిషన్లో వచ్చింది. ఎవరెవరి గురించో చెప్పాడు కానీ... తొలి అవకాశం ఇచ్చి, ఇండస్ట్రీకి  పరిచయం చేసి, అంత పూర్తిస్థాయి మెయిన్ విలన్ రోల్ ఇచ్చిన నీ పేరు చెప్పలేదు ఆ నటుడు అని!   

నేను నవ్వాను. 
ఇదంతా ఉట్టి ట్రాష్. 
ఇలాంటివి అసలు పట్టించుకోకూడదు.
ఇక్కడ ఎవరు లైమ్‌లైట్‌లో ఉంటే వాళ్లే తోపులు. 
అసలు సినిమా అంటేనే ఇది.    

- మనోహర్ చిమ్మని  

Sunday, 24 November 2024

సినిమా తీసి చూడు!


"ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు" అన్నారు. కానీ, "సినిమా తీసి చూడు" అని మాత్రం ఎవరూ అనలేదు. అనలేకపోయారు. ఎందుకంటే, ఇది ఆ రెండింటి కంటే చాలా కష్టం. అంత ఈజీ కాదు.    

ఈజీ కాదు అంటే ఇక్కడ విషయం డబ్బు ఒక్కటే అని కాదు. చాలా ఉంది. అన్ని వ్యాపారాల్లానే సినిమా కూడా ఇప్పుడు ఒక వ్యాపారమే. కాకపోతే ఇదొక కళాత్మక వ్యాపారం. బిగ్ బిజినెస్. అంతిమంగా దీని గోల్ కూడా సేమ్ టూ సేమ్... రూపాయి పెడితే నాలుగు రూపాయలు లాభం రావాలన్నదే. ఇందులో ఎలాంటి డౌట్ లేదు.

మొన్నటివరకూ మన చుట్టూ సమాజంలో ఒక గుడ్డి వాదన ఉండేది. ఏ వ్యాపారంలో అయినా పెట్టుబడి పెట్టొచ్చు కానీ, సినిమాల్లో పెట్టొద్దు అని. ఇదొక "హెవీ గ్యాంబ్లింగ్" అని వాళ్ల ఉద్దేశ్యం. ఆ మాటకొస్తే, అసలు వ్యాపారమే ఒక గ్యాంబ్లింగ్. మన జీవితమే ఓ పెద్ద గ్యాంబ్లింగ్. ఈ నిజాన్ని ఇప్పటి తరం బిజినెస్‌మెన్ గుర్తించారు కాబట్టే "అబ్బో సినిమాల్లోనా!" అని ఇంతకుముందులా భయపడ్డంలేదెవ్వరూ.  

సినిమా ప్రొడ్యూసర్లలో 41 శాతం మంది ఎప్పుడూ లాభాల్లో ఉంటారు. ప్రపంచంలోని ఏ ఇతర బిజినెస్‌లతో పోల్చుకున్నా, సినిమా బిజినెస్‌లోని ఈ సక్సెస్ రేటు ఇంకే బిజినెస్‌లో లేదు.  

సినిమా తీయడానికి డబ్బొక్కటేకాదు, గట్స్ కావాలి. అవసరం లేనివాటికి అనవసరంగా టెంప్ట్ కాకుండా, ఫీల్డుమీద కొంచెం అవగాహనతో, మార్కెట్ స్టడీ చేస్తూ సినిమాలు చేస్తే మాత్రం ఎలాంటి భయాలు ఉండవు, నష్టాలుండవు.  

కట్ చేస్తే - 

సినిమా ఫీల్డులో ఉండే కొన్ని అద్భుత లాభాలు మరే ఇతర వ్యాపారంలోనూ లేవు. ఇతర అన్ని వ్యాపారాల్లో బాగా డబ్బు సంపాదించొచ్చు. కానీ, రాత్రికిరాత్రే ఫేమ్‌నూ, ఒక సెలబ్రిటీ హోదానూ, ప్రపంచవ్యాప్త గుర్తింపునూ తెచ్చుకోవడం మాత్రం ఒక్క సినిమాల్లోనే సాధ్యం. అంటే - మిగిలిన అన్ని బిజినెస్‌లలో డబ్బు సంపాదించుకోగలుగుతారు. కాని, ఫేమ్ రాదు.   

అదే ఫిలిం బిజినెస్‌లో అయితే - ఒక 40 టీవీ చానెళ్ళూ, అన్నీ కలిపి మరో 200 వెబ్‌సైట్స్, ఫిల్మ్ మేగజైన్స్, న్యూస్ పేపర్లు, యూట్యూబ్ చానెళ్ళు, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్... ఇవన్నీ ఓవర్‌నైట్‌లో మిమ్మల్ని ఒక రేంజ్‌కు తీసుకెళ్తాయి. ఈ అడ్వాంటేజ్ ప్రపంచంలోని మరే ఇతర బిజినెస్‌లో లేదు.   

దటీజ్ సినిమా.  

- మనోహర్ చిమ్మని     

Saturday, 23 November 2024

మనం చేసుకోగలిగే పనికి అవుట్‌సోర్సింగులు అవసరమా?


మనం ఎంతో మంచి ఉద్దేశ్యంతో పరోక్షంగా వారి అప్పటి అవసరానికి సహాయంచేస్తూ ఒక అవకాశం ఇస్తాం. ఆరోజు నిజంగా వారికి అవసరం కదా అని, అప్పటికప్పుడు వాళ్ళు అడిగిందానికి డబుల్ ఇస్తాం. 

మాట ప్రకారం మనం ఇచ్చిన పని మరింత ఇంకా వేగంగా చేస్తారు కదా అనుకుంటాం.

కాని, అలా జరగదు.  

కట్ చేస్తే - 

మనం ప్రయారిటీలో వెనక్కి వెళ్ళిపోతాం. కొత్త కమిట్‌మెంట్స్ పైకొస్తాయి. 

అంతా మర్చిపోతారు. మనం గుర్తుచేస్తేనే స్పందిస్తారు. వాళ్ళేదో మనకు సహాయం చేస్తున్నట్టు ఉంటుంది బిల్డప్. వాళ్ళ ప్రయారిటీలో మనం ఎక్కడికో అడుక్కి వెళ్ళిపోతాం. అసలు ఆ లిస్టులో మనం ఉన్నామా లేదా అన్న డౌట్ కూడా వస్తుంది.  

ఇలాంటి ఫేవర్స్ ఇంకా అవసరమా అన్నది బిగ్ కొశ్చన్. 

జరిగిన నష్టం చాలు, ఇదొక ఫైనల్ లెస్సన్ అనుకొని ఫ్యూచర్లో కొంచెం వొళ్ళు దగ్గరపెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం బెటర్. 

ఫినిషింగ్ టచ్ ఏంటంటే, అది మనకు చేతనైన పని. మన ఫస్ట్ ప్యాషన్. మనం ప్రూవ్ చేసుకున్న ప్రొఫెషన్. 

మనకు డబ్బులెక్కువయ్యాయా అన్నట్టుగా, ఆ పని మనం బయటివారికి అవుట్‌సోర్సింగ్ ఇవ్వటం ఏదైతే ఉందో... చివరికి ఇలాంటి బ్లాగులు రాసుకోడానికి కారణమవుతుంది... ఇంకోసారి ఇలాంటి మహాపరాధాలు చెయ్యకుండా!   

- మనోహర్ చిమ్మని      

నేను ఊహించని బహుమతి


అంతకు ముందు నా పుట్టినరోజుల్ని నేను పెద్దగా పట్టించుకొనేవాన్ని కాదు. ఈమధ్య మాత్రం బాగానే పట్టించుకుంటున్నాను. పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోవాలని మాత్రమే కాదు... 

నేను ఎంత పెద్దవాన్నయిపోతున్నానో గుర్తుచేసుకోడానికీ, నన్ను నేను చాలా విషయాల్లో అలర్ట్ చేసుకోడానికీ. 

ఈసారి మరింత బాగా గుర్తుపెట్టుకున్నాను నా పుట్టినరోజుని. ఎందుకంటే, ఈ పుట్టినరోజు నేపథ్యంగా, దాదాపు ఒక నెల క్రితమే, ఒకటి రెండు చాలా పెద్ద నిర్ణయాలు తీసుకున్నాను... వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కూడా. 

అందుకే, ఈసారి నా పుట్టినరోజు నాకు చాలా ముఖ్యమైంది.  

కట్ చేస్తే - 

ఈసారి నా పుట్టినరోజుకి సుమారు 14 వేల కిలోమీటర్ల దూరం నుంచి ఒక ప్రత్యేక అతిథి వస్తున్నాడు. ఇది నేను ఊహించని బహుమతి.   

- మనోహర్ చిమ్మని