Wednesday, 17 February 2021

హాపీ బర్త్‌డే, కేసీఆర్!

రాష్ట్ర అసెంబ్లీలో ఒకప్పుడు తెలంగాణ పదాన్నే నిషేధించారు అని విన్నప్పుడు రక్తం మరుగుతుంది. 

అదే అసెంబ్లీలో - తమ పార్టీ అధినేతలకు చెంచాగిరీ చేస్తూ, నోరెత్తక కూర్చున్న అనేకమంది ‘సన్నాసి’ తెలంగాణ ప్రాంత మంత్రులను, ఎమ్మెల్లేలను గుర్తు చేసుకున్నప్పుడు సిగ్గనిపిస్తుంది. 

ఇలాంటి నేపథ్యంలో - దశాబ్దాలుగా లేస్తూ, పడిపోతూ .. నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసి, నింగిని అంటుకునేలా రగల్చడానికి ఒక ఉద్యమ నాయకుడు అవసరమయ్యాడు. 

ఆ అవసరాన్ని గుర్తించి - తెలంగాణ సాధనే తన జీవితాశయంగా, జీవితంగా మార్చుకొని - తిరుగులేని ఉద్యమనాయకుని అవతారమెత్తిన ఒకే ఒక్కడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు .. ఉరఫ్ .. కేసీఆర్.  

తన తిండి, తిప్పలు, గాలి, నీరు, నిద్ర .. అన్నీ తెలంగాణగా పద్నాలుగేళ్లపాటు ఉద్యమంలో నానా విన్యాసాలు చేశాడు కేసీఆర్. 

ఎన్నో అడ్డంకులు. అవమానాలు. ఎదురుదెబ్బలు. ఎగతాళి. తిట్లు. శాపనార్థాలు. 

అయినా చెక్కు చెదరని ఏకాగ్రతతో - ఎదుటివారికి ఎప్పటికప్పుడు ఊహించని ట్విస్టులు ఇస్తూ, తికమకపెడుతూ, అవేశం రగిలినప్పుడు తిడుతూ, అవసరమైనచోట అణకువ పాటిస్తూ, అందరిని కలుపుకుపోతూ - ఉద్యమాన్ని ముందుకే నడిపాడు తప్ప .. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ జ్వాల ఆరిపోనివ్వలేదు. 

ఏం మేధస్సు .. ఎంతటి వాగ్ధాటి .. అసలు ఏమిటా జ్ఞాపక శక్తి .. 

ఎంత పట్టుదల .. ఎంత ఓర్పు .. ఎంత శక్తి .. ఎంత మానవత్వం .. ఎంత చాకచక్యం .. ఎన్ని ఎత్తులు .. ఎన్ని జిత్తులు .. 

అన్నీ ఒకే ఒక్క లక్ష్యం కోసం. 

అది .. తెలంగాణ సాధన. 

ఈ ఒక్క లక్ష్యమే కేసీఆర్ నోటివెంట విసరడానికి సిధ్ధంగా ఉన్న గ్రెనేడ్ లాంటి ఒక మాటగా వేలాదిసార్లు వినిపించింది. తెలంగాణ ప్రజల గుండెల్లో ప్రతిధ్వనించింది: 

"తెలంగాణ తెచ్చుడో .. సచ్చుడో!" 

ఎంత ఆత్మ విశ్వాసం .. ఎంత తెగింపు .. ఎంత లేజర్ ఫోకస్ .. 


చివరికి ఒక రోజు - "ఆంధ్రప్రదేశ్ నుంచి డిల్లీ వెళ్తున్నాను. మళ్ళీ నేను అడుగుపెట్టేది తెలంగాణ గడ్డమీదనే!" అని చెప్పి మరీ వెళ్లాడు కె సి ఆర్. 

చెప్పినట్టుగానే, నాలుగురోజుల తర్వాత .. డిల్లీ నుంచి తెలంగాణ గడ్డమీదనే మళ్ళీ కాలుపెట్టాడు కేసీఆర్. 

దటీజ్ కేసీఆర్! 

విజయమే లక్ష్యంగా - వందలాది నాయకుల్ని, వేలాది గ్రూపుల్నీ సంఘాల్నీ, కోట్లాది ప్రజలను సమన్వయం చేసుకొంటూ - పడుతూ, లేస్తూ, పరుగెత్తుతూ, పరుగెత్తిస్తూ - ఉద్యమాన్ని ఉరకలెత్తించి గమ్యం చేర్చిన కేసీఆర్ గత పద్నాలుగేళ్ల జీవితం, నా జీవితకాలంలో నేను స్వయంగా నా కళ్లముందు చూసిన ఒక విజయ గాథ. 

ఒక లైవ్ సక్సెస్ స్టోరీ. 

కాగా - ఈ గమ్యం చేరుకోవడం కోసం ఆయన వేసుకున్న బ్లూప్రింటు, అనుసరించిన వ్యూహం, నడిపించిన డిప్లొమసీ, కూడగట్టిన లాబీయింగ్, వేసిన ఎత్తులు, చేసిన జిత్తులు, ఆవేశంలో అరచిన అరుపులు, పడిన తిట్లు, పాటించిన మౌనం, పెట్టిన చెక్‌లు .. అదంతా ఒక యుద్ధతంత్రం. 

అప్పుడు ఉద్యమ సమయంలో తెలంగాణ సాధనకోసం - ఇప్పుడు ముఖ్యమంత్రిగా తెలంగాణ అద్భుత భవిష్యత్తు కోసం - ఇంటా బయటా ఇంచుమించు అదే యుద్ధతంత్రం! 

ఆరు దశాబ్దాలుగా రగిలిన తెలంగాణ ప్రజల మనోవాంఛను నిజం చేసిన అంతటి ఒక వ్యక్తికి, ఉద్యమశక్తికి .. తన కలల తెలంగాణ రూపశిల్పికి, దాని సాధనకోసం మొక్కవోని దీక్షతో ముందుకు సాగిపోతున్న సిసలైన రెనెగేడ్ కార్యసాధకునికీ .. ఒక రచయితగా, ఒక చలనచిత్ర దర్శకుడిగా,  ఒక అభిమానిగా, ఒక తెలంగాణ బిడ్డగా ఇవే నా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు... 

Tuesday, 16 February 2021

ఇది పోస్ట్ చెయ్యొచ్చా?!

"ఇది పోస్ట్ చేస్తే ఎట్లా?... అందరూ ఏమనుకుంటారు?! ఎలాంటి రియాక్షన్ ఉంటుందో?!!" 

ఈ ఘర్షణ లేకుండా, ఇప్పటివరకు ఒక్క బ్లాగ్ కూడా పోస్ట్ చేయలేదట - నా ఫేవరేట్ బ్లాగర్స్‌లో ఒకరు, James Altucher!  

జేమ్స్ ఒక బెస్ట్ సెల్లర్ రైటర్. దాదాపు డజన్ బుక్స్ రాశాడు. భారీ ఫినాన్షియల్ ఎక్స్‌పర్ట్ కూడా. పొద్దున లేస్తే మిలియన్లు, బిలియన్లు ఇన్వెస్ట్ చేసేవాళ్లతోనే అతని పని. స్వయంగా జేమ్స్ కూడా ఒక పెద్ద సీరియల్ ఎంట్రప్రెన్యూర్. 

కట్ చేస్తే -  

మిషన్ అంటే దానికొక ఖచ్చితమైన టార్గెట్ ఉంటుంది. దాన్ని పూర్తిచెయ్యడానికో డెడ్‌లైన్ ఉంటుంది. ప్రస్తుతం నేనూ అలాంటి ఒక వెరీ సీరియస్ షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకొని పనిచేస్తున్నాను. 

అందులో భాగంగా - ఇకనుంచీ నా బ్లాగ్‌లో, సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేసే 'స్టఫ్' అంతా సినిమాలు, ఫ్రీలాన్స్ రైటింగ్, కోచింగ్, కన్సల్టింగ్, క్రియేటివిటీకి సంబంధించిన అంశాలపైనే ఉంటుంది. 

కొన్ని పోస్టుల్లో సొంత డబ్బా, కొన్నిట్లో అగ్రెసివ్ మార్కెటింగ్ ఉండొచ్చు. ఉంటాయి. 

నా ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న కొంతమందికి ఇవి నచ్చకపోవచ్చు. చికాకు తెప్పించవచ్చు. బోర్ కొట్టొచ్చు. సహజం.

అన్నీ అందరికీ నచ్చాలని రూలేం లేదు. అది అసాధ్యం కూడా. 

ఈ స్టఫ్ నచ్చని మిత్రులు, పెద్దలు నిర్మొహమాటంగా నన్ను బ్లాక్ చెయ్యొచ్చు, అన్‌ఫ్రెండ్ చెయ్యొచ్చు, అన్‌ఫాలో కావచ్చు... అని నా సవినయ మనవి. 

ఎంజాయ్ చేసే మిత్రులకు, పెద్దలకు ఛీర్స్!     

రోజూ ఎన్నో బిలియన్ల ఫండ్స్ డీల్ చేసే జేమ్స్ ఆల్టుచరే - తాను పోస్ట్ చేసే ప్రతి పోస్ట్‌కూ "పోస్ట్ చెయ్యాలా వద్దా?" అని తన్నుకుచస్తాడట. ఆఫ్టర్ ఆల్... నేనెంత?

సో, నో వర్రీస్. నేను జేమ్స్ అంత కూడా ఆలోచించను. ఆ టెన్షన్‌లో పడిపోకముందే పోస్ట్ చేసేస్తాను. 


చివరగా ఇంకో మాట - 

"అవతల ఎవరో ఏమనుకుంటారో అని ఆలోచించటం వృధా. వాళ్లంతా వచ్చి మన బిల్స్ కట్టరు" అన్నాడొక పెద్దాయన.

సో - మన పనులు, మన బాధ్యతలు, మన టార్గెట్స్, మన ఫ్రీడమ్ మనకు చాలా ముఖ్యం. 

థాంక్యూ సో మచ్...     

Monday, 15 February 2021

Make Movies That Make Money!

"జీవితం అన్నాక ఛాలెంజెస్ తప్పవు. ఆ మాత్రం అప్స్ అండ్ డౌన్స్ లేని జీవితాన్ని జీవించడంలో అసలు మజా ఏముంటుంది?"
- రతన్ టాటా

లాక్‌డౌన్ సమయంలో – ఫిలిం ఇండస్ట్రీలో ఓటీటీలు, ఏటీటీల నేపథ్యంలో చాలా గమ్మత్తులు జరిగాయి. కేవలం సినిమా బిజినెస్ పాయింటాఫ్ వ్యూలో మాత్రమే చూసినట్టైతే మాత్రం, ATT (Any Time Theater) అనేది ఒక గొప్ప టర్నింగ్ పాయింట్!

ఈ విషయంలో శ్రేయాస్ మీడియాను, ఆర్జీవీని మెచ్చుకోకతప్పదు.

ఇండస్ట్రీ అంతా ఆందోళనతోనో, కన్‌ఫ్యూజన్‌తోనో అన్నీ మూసేసుకొని ఒకవైపు టెన్షన్‌పడిపోతోంటే – ఒక్క ఆర్జీవీ మాత్రం దాదాపు ప్రతి రెండు వారాలకు ఒక సినిమా ఎనౌన్స్ చేస్తూ, తీస్తూ, చూపిస్తూపోయాడు!

100 రూపాయల టికెట్ పెట్టి, CLIMAX సినిమాకు కేవలం 24 గంటల్లో ఒక రెండున్నర కోట్లు సంపాదించుకున్నాడు. క్లైమాక్స్ ఇచ్చిన కిక్‌తో వెంటనే ఒక 22 నిమిషాల NAKED సినిమా తీసి దానికి 200 రూపాయల టికెట్ పెట్టి, ఇంకో అరకోటి సంపాదించుకున్నాడు.

చాలా పెద్ద గ్యాప్ తర్వాత ప్రొడ్యూసర్ ఎం ఎస్ రాజు DIRTY HARI అనే టైటిల్‌తో ఒక హాట్ రొమాంటిక్ డ్రామా, తనే డైరెక్ట్ చేసి, ఏటీటీలో రిలీజ్ చేశారు. టికెట్ రేట్ 120 రూపాయలు. జస్ట్ 24 గంటల్లో 91 వేలమంది చూశారు. సుమారు కోటి పది లక్షల కలెక్షన్!

“ఆర్జీవీ కాబట్టి అంత పబ్లిసిటీ వచ్చింది. వేరేవాళ్లకు అట్లా కలెక్షన్స్ రావు” అని ఒక లాజిక్. కాని, ఇప్పుడున్న సోషల్‌మీడియా పవర్ నేపథ్యంలో ఈ లాజిక్ నిలబడదు. 

మనం ఎలా ప్రమోట్ చేస్తాం… ఎంత ఎఫెక్టివ్‌గా ప్రమోట్ చేస్తాం అన్నదే ముఖ్యం. 

ఏటీటీలు కూడా మొత్తం అడల్ట్ కంటెంట్‌తో రన్‌చేస్తేనే డబ్బులొస్తాయి అనుకోవడం కూడా కరెక్టు కాదు. 

బూతే చూడాలనుకొంటే ఇంటర్నెట్ నిండా ఒక మనిషి చూడ్డానికి జీవితకాలం కూడా సరిపోనంతటి పోర్న్ ఉంది. అదంతా వదులుకొని, ఇక్కడ 100 రూపాయల టికెట్ కొనుక్కొని ఈ సినిమాల్లో ఏదో రెండు హాట్ సీన్లు చూడ్డానికి ఎవరో వస్తారనుకోవడం ఉట్టి భ్రమ.

కట్ చేస్తే - 

సినిమా ఇప్పుడొక కార్పొరేట్ బిజినెస్. బిగ్ బిజినెస్. 

కంటెంట్ బాగున్నప్పుడు థియేటర్ రిలీజ్ కూడా కష్టం కాదు.  

చిన్న సినిమా అయినా -  'పర్లేదు' అంటే పది నుంచి పాతిక కోట్లు, 'హిట్' అన్నారంటే 100 కోట్లు! 


ఈ గోల్డెన్ అపార్చునిటీని వినియోగించుకొనే ప్రయత్నంలో భాగంగా – ఒక నంది అవార్డు రైటర్-డైరెక్టర్‌గా, కేవలం ఏటీటీలో రిలీజ్ కోసమే, న్యూ టాలెంట్‌తో, సీరీస్ ఆఫ్ మూవీస్ ప్లాన్ చేస్తున్నాను.  

తర్వాత, ఇదే ఒక భారీ ప్రొడక్షన్ హౌజ్ అయినా ఆశ్చర్యం లేదు. నో జోక్స్... ప్రస్తుతం ఆ స్థాయిలోనే నా పనులు కదులుతున్నాయి. 

ఫిలిం ప్రొడక్షన్ మీద, ఇండస్ట్రీ మీద, సెలెబ్ స్టేటస్ మీద ఆసక్తి, ప్యాషన్ ఉన్న డైనమిక్ ఫండింగ్ పార్ట్‌నర్స్ కోసం చూస్తున్నాను. ఈ దిశలో మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. 

అనుకున్నట్టు అన్నీ జరిగేట్టు చూసుకొని - అతిత్వరలో నా కొత్త సినిమా ప్రారంభించే పనిలో వున్నాను. 

కట్ చేస్తే -  

కరోనా తర్వాత... కొత్త ఉత్సాహంతో ఇప్పుడు నేను చేయబోయేది నా మొదటి సినిమా అవుతుంది! 

Make Movies That Make Money!      

Sunday, 14 February 2021

బీచ్ రోడ్దు నుంచి భీమిలీ దాకా...


It's not a question of being in love with some one. It's a question of being love.

వాలెంటైన్స్ డే అనగానే నాకు ముందు గుర్తొచ్చేది వైజాగ్. 

నా వాలెంటైన్ అక్కడే ఉంది, వైజాగ్‌లో.  

కట్ చేస్తే - 

వైజాగ్ అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది సముద్రం. 

తర్వాత చలం .. భీమ్‌లీ .. ఆ తర్వాత అరకు .. స్టీల్ ప్లాంట్ .. గంగవరం బీచ్‌లో నేను షూట్ చేసినప్పుడు, అదే స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌజ్‌లో మేమున్న నాలుగు రోజులూ... ఇంకా బోల్డన్నున్నాయి నాకు గుర్తొచ్చేవి. 

1987లో అనుకుంటాను, నేను వైజాగ్ మొట్టమొదటిసారిగా వెళ్లాను... 

తర్వాత మరికొన్నిసార్లు వైజాగ్ వెళ్లానుగానీ, ఎప్పుడు కూడా వైజాగ్‌ను అంత పెద్ద స్పెషల్‌గా నేనేం ఫీలవ్వలేదు.

ఈ మధ్య నా ప్రొఫెషనల్ పనులమీద వైజాగ్ ఎక్కువసార్లు వెళ్తున్నాను. లేటెస్ట్‌గా మొన్న డిసెంబర్‌లో వెళ్ళాను. ఈ 2021 జనవరిలో కూడా వెళ్ళాను.  

వైజాగ్ నాకు చాలా బాగా, ప్రశాంతంగా, అందంగా కనిపిస్తుంది. ఏవిటా అందం అంటే తడుముకోకుండా కనీసం ఒక డజన్ అంశాల్ని చెప్పగలను. వాటిల్లో నేను బాగా ఇష్టపడే అందం - సముద్రం. 

సముద్రం మీద వ్యామోహంతో ఇంతకుముందు నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు .. ఎక్కువగా గోవా, పాండిచ్చేరిలకు వెళ్లేవాణ్ణి. ఈ రెండూ నాకు ఇప్పటికీ చాలా ఇష్టమైన ప్రదేశాలు. దేని ప్రత్యేకత దానిదే. అయితే .. గోవా, పాండిచ్చేరిల కంటే ఇప్పుడు వైజాగే నాకు మరింత బాగా అనిపిస్తోంది. 


బీచ్ రోడ్దు నుంచి భీమిలీ దాకా .. అలా సముద్రాన్ని చూసుకొంటూ కార్లో వెళ్తూ, నచ్చినచోట దిగి కాసేపు ఆగుతూ, రోజులకి రోజులే గడిపేయొచ్చు. నాకెప్పుడు అవకాశం దొరికినా నేనిదే పని చేస్తాను. 

ఈపని చేయడం కోసం, నా పనుల్లో ఎంతవరకు వీలైతే అంతవరకు ఇక్కడే వైజాగ్‌లో చేసుకోగలిగే అవకాశాల్ని సృష్టించుకొంటాను.  

సముద్రాన్ని నేనంతగా ప్రేమిస్తాను. సముద్రం ఉన్నందుకు వైజాగ్‌ని మరింతగా ప్రేమిస్తాను. అంతా ఒక స్పిరిచువల్ కనెక్షన్. 

వైజాగ్‌లో ఉన్న నా ప్రేయసి, నా వాలెంటైన్ మరెవరో కాదు... సముద్రం.  

Saturday, 6 February 2021

సాదిక్... నేనూ... మా జామై ఉస్మానియా చాయ్ అడ్డా!

ఓయూలో మా సీనియర్, నా హాస్టల్‌మేట్ సాదిక్ భాయ్ అంటే నాకు చాలా ఇష్టం. 

కట్ చేస్తే -

సాదిక్ చెప్పింది చేస్తాడు. ఏదైనా తను చెప్పింది చెయ్యలేకపోతే, అవ్వకపోతే ఆ విషయం వెంటనే  నేరుగా, నిర్మొహమాటంగా చెప్పేస్తాడు... "మనూ, ఆ పని ఇంక కాదు" అని. 

అతనిలో ఇది నాకు చాలా ఇష్టం. 

సుమారు ఓ ఆరేళ్లక్రితం అనుకుంటాను. నాకో మాటిచ్చాడు సాదిక్ భాయ్. అప్పుడు నా సినిమా పనుల హడావుడి, బిజీల్లో ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. దాదాపు మర్చిపోయాను. 

వన్ ఫైన్ ఈవెనింగ్ తన మాట నిలబెట్టుకున్నాడు పెద్దన్న! అది కూడా - చాలా డీసెంట్‌గా, డిగ్నిఫైడ్‌గా, ఎంతో హుందాగా... నేను షాక్‌తో ఉబ్బి తబ్బిబ్బయిపోయి సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోటంతగా!

పైన రాసినదాంట్లో ఎలాంటి అతిశయోక్తిలేదని మిత్రులందరికి సవినయ మనవి. నేను సాదిక్ భాయ్‌ని ఇంచ్ కూడా పొగడ్డం లేదు. 

కట్ చేస్తే - 

ఒకసారి రామ్‌నగర్‌లో ఒక "తోపుడు బండి" చూపించాడు సాదిక్. 

"ఏందన్నా ఇది?" అనడిగా. 

ఆ తోపుడు బండితో తాను మర్నాటి నుంచి ఏమేం చేయాలనుకుంటున్నది చెప్పాడు. తన ఆలోచన నాకు నచ్చింది. చరిత్రలో నిల్చిపోయే ఒక బ్రాండ్ క్రియేట్ చెయ్యగల సత్తా ఆ ఆలోచనకుంది. అదే చెప్పాను. కంగ్రాట్స్ చెప్పి బయటపడ్డాను. 

సాదిక్‌ను నేనెప్పుడూ లైట్ తీసుకోలేదు. కాని, ఈ తోపుడు బండి విషయంలో మాత్రం - దాని వెనకున్న ఎంతో శ్రమ దృష్ట్యా - కొంచెం లైట్ తీసుకున్నాను. 

సాదిక్ చేసి చూపించాడు. 

లోకల్ స్క్రైబ్స్ నుంచి, బీబీసీ దాకా సాదిక్ తోపుడు బండి ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్ ఐటమ్ అయింది.  

ఈమధ్య - లాక్‌డౌన్ టైమ్‌లో ఊళ్ళల్లో పిల్లలకు పుస్తకాలు, యాండ్రాయిడ్ ఫోన్లు, చలికి వణుకుతున్న పిల్లలకు, పెద్దలకు బ్లాంకెట్లు, ఆకలితో ఉన్నవారికి నిత్యావసర వస్తువులు... చాలానే చేశాడు. 

అదీ - వ్యక్తిగతంగా తనకు రిస్క్ ఉంటుందని తెలిసీ!

ఇదిగో - ఇప్పుడు మళ్ళీ అక్కడెక్కడో అడవిలో ఒక పర్ణశాల వేశాడు మా సాదిక్ భాయ్. 

తెల్లారితే అక్కడ అదో సంచలనం. పండగ. 400 మందికి భోజనాలూ, ఊహించని ఇంకేవో సంభ్రమాశ్చర్యాలూ... 

అయితే - తోపుడు బండి నుంచి, పర్ణశాల దాకా - సాదిక్ ఇదంతా చేస్తున్నది ఏదో సెన్సేషన్ కోసమో, పేరు కోసమో కాదు. తన సంతృప్తి కోసం. 

కట్ చేస్తే -  

అనుకోకుండా ఒక సింగిల్ సిట్టింగ్‌లో, ఒక ఫ్లోలో రాస్తున్నా కాబట్టి - ఇదంతా ఒక నాన్ లినియర్ స్క్రీన్‌ప్లేలా ఉంటుంది. క్షమించాలి. 

కాని, ఇది ఇలా రాయటం అవసరం అనిపించి రాస్తున్నాను. రెండు కారణాలున్నాయి: ఒకటి - నా బ్లాగింగ్ ప్యాషన్. రెండు - సాదిక్‌లోని ఇంకో గొప్ప గుణం గురించి మిత్రులకు చెప్తూ, నాకు నేను ఒక పాఠం నేర్చుకోవాలన్న "సెల్ఫ్ మోటివేషన్" కోసం! 

సాదిక్ తను ఏం చెయ్యాలనుకుంటే అది చేసేస్తాడు. తను ఎలా బ్రతకాలనుకుంటే అలా బ్రతుకుతాడు. ఇంక దీంట్లో ఎలాంటి రెండో మాటకు తావు లేదు. 

ఒక అయిదేళ్ళక్రితం - మా జామై ఉస్మానియా చాయ్ అడ్డా దగ్గర - వన్ ఫైన్ మార్నింగ్, మేమిద్దరం కూర్చొని మాట్లాడుకొంటున్నప్పుడు - మా ఇద్దరికి మాత్రమే తెలిసిన ఒకరి గురించి, సమయం విలువ గురించీ - నాతో చెప్పిన ఒక మాట చెప్పి ఇది ముగిస్తాను... 

"మనూ! నేను ఆ వ్యక్తి మీద నా పూర్తి నమ్మకం పెట్టి, నా పూర్తి సపోర్ట్ ఇచ్చాను. అంతా వృధా అని అర్థమయింది. నా జీవితంలో ఒక్క సంవత్సరం అంటే దానికి ఎంతో వాల్యూ ఉంది. చాలా నష్టపోయాను. అదే ఒక్క సంవత్సరం నా మీద నేను ఫోకస్ చేసుకుంటే - ఏం చేయగలనో చూపిస్తాను" అన్నాడు. 

సంవత్సరం తిరక్కముందే ఎన్నో చేసి చూపించాడు! 

దటీజ్ సాదిక్...

తను అనుకున్నది చేస్తాడు. అనుకున్నట్టుగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తాడు. 

అందుకే మా సాదిక్ భాయ్ అంటే నాకిష్టం. అడవిలో ఈ పర్ణశాల సెటప్‌తో ఇప్పుడతనికి ఫ్యాన్‌ని కూడా అయ్యాను.  

Wednesday, 13 January 2021

నా బ్లాగింగ్ ఇకనుంచీ మ్యాగజైన్ రూపంలోనే!

ఇంతకుముందే ఒకటిరెండుసార్లు వేర్వేరు పోస్టుల్లో చెప్పాను... నా బ్లాగింగ్ ప్యాషన్‌కి ఎక్స్‌టెన్షన్ లాంటిది 'మనోహరమ్' వెబ్ మ్యాగజైన్ అని.   

గత కొన్ని వారాలుగా బేటా రూపంలో వస్తున్న మనోహరమ్ డిజిటల్ మ్యాగజైన్, ఈ ఫిబ్రవరి 1 నుంచి పూర్తిస్థాయిలో రాబోతోంది. 

జనవరి 28 నాడు మనోహరమ్ మ్యాగజైన్ అఫీషియల్ ప్రాంభం ఉంటుంది. 

మ్యాగజైన్ ఫైనల్ వెర్షన్ రూపం జనవరి 28 నాడు లాంచ్ చేస్తున్న మనోహరమ్ ఫిబ్రవరి సంచిక నుంచి మీరు ఎంజాయ్ చేస్తారు. రెగ్యులర్‌గా ప్రతి నెలా 1వ తేదీ నాడు 00.10 గంటలకు పబ్లిష్ అవుతుంది. 

కట్ చేస్తే - 

ఇక నుంచీ ప్రత్యేకంగా నేను నగ్నచిత్రం బ్లాగ్‌లో బ్లాగింగ్ చేయటం ఉండదు. బహుశా ఇదే ఈ బ్లాగ్‌లో చివరి పోస్టు. 

సక్సెస్ సైన్స్, సినిమాలు, సరదాలు - ఈ మూడే (మైండ్‌సెట్, మూవీస్, మస్తి) ప్రధాన విభాగాలుగా - మనోహరమ్ మ్యాగజైన్‌లో నా బ్లాగింగ్ పూర్తిస్థాయిలో కొనసాగుతుంది. 

ప్రధాన అగ్రిగేటర్ అయిన మాలిక, మొదలైన వాటిల్లో మనోహరమ్ అప్‌డేట్స్ ఉంటాయి. 

సమస్యల్లా ఒక్కటే. మంత్లీ అప్‌డేట్స్ కాబట్టి అగ్రిగేటర్లలో రెగ్యులర్‌గా మనోహరమ్‌లోని ఆర్టికిల్స్ ఎట్సెట్రా కనిపించే ఆస్కారం ఉండదు. ఈ లోటుని ఎట్లా భర్తీ చేయొచ్చో ఆలోచించాలి.  

మిత్రులు, శ్రేయోభిలాషులు... మీ అభిప్రాయాలు, సలహాలను నాకు మనోహరమ్ ద్వారా కూడా అందించగలరని సవినయ మనవి. 

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో,
- మీ... మనోహర్ చిమ్మని
Editor, 'Manoharam', Elite Web Magazine

Sunday, 10 January 2021

ప్రణయ్ పుట్టినరోజు

ఉదయం 10.45...

సరిగ్గా 24 ఏళ్ళక్రితం... ఇదే సమయానికి నేను కర్నూలు నుంచి హైద్రాబాద్ వెళ్తున్న బస్‌లో ఉన్నాను. 

పొద్దున 6 గంటలకే నా భార్య సుజాతను హైద్రాబాద్‌లోని ధరమ్ కరణ్ రోడ్‌లో ఉన్న వాళ్ల అమ్మవాళ్లింటినుంచి బేగంపేటలో ఉన్న డాక్టర్ సవితాదేవి గారి స్వప్న నర్సింగ్ హోమ్‌కు తీసుకెళ్ళారు. 

ఎర్రమంజిల్ నుంచి సుజాత వాళ్ళ అక్కవాళ్ళు వెంటనే హాస్పిటల్‌కు వెళ్ళారు. 

వాళ్ళంతా చాలా బాగా చూసుకుంటారు అన్న విషయం నాకు తెలుసు. అయినా సరే, చాలా టెన్షన్...  

నేనప్పుడు కర్నూలు ఆలిండియా రేడియో ఎఫ్ ఎమ్ లో పనిచేస్తున్నాను. ఆఫీసుకెళ్ళి, లీవ్ పెట్టి హైద్రాబాద్ బయల్దేరాను. 1997 అది. ఇప్పట్లా మొబైల్ ఫోన్స్ అప్పుడు లేవు. గౌలిగూడ బస్ స్టాండ్‌లో దిగాకనే పబ్లిక్ ఫోన్ నుంచి ఫోన్ చెయ్యాలి. 

కట్ చేస్తే - 

నేను మధ్యాహ్నానికి ఎర్రమంజిల్ చేరుకున్నాను. అక్కడినుంచి బేగంపేట స్వప్న నర్సింగ్ హోమ్ కి వెళ్ళాను. 

అప్పుడే డాక్టర్స్ సుజాతను లోపలికి సిజేరియన్ కోసం తీసుకెళ్తున్నారు. డాక్టర్ సవితాదేవి నాకు 2 నిమిషాలు అంతా వివరంగా చెప్పారు. పేపర్స్ పైన నా సంతకాలు తీసుకున్నారు. స్ట్రెచర్ మీద సుజాత ఏడుస్తూనే ఉంది. ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకెళ్ళారు స్టాఫ్. 

కట్ చేస్తే - 

3 గంటల 15 నిమిషాలకు డాక్టర్స్ బయటకొచ్చి చెప్పారు:

"అబ్బాయి పుట్టాడు. ఇద్దరూ బాగున్నారు" అని. 

ఓ గంట తర్వాత రూమ్‌కి - ఒక తెల్లటి కోన్‌లో పింక్ కలర్ ఐస్‌క్రీమ్‌ను చుట్టి తీసుకొచ్చినట్టు - మా ప్రణయ్‌ని తీసుకొచ్చారు నర్స్‌లు. 

అప్పుడే పుట్టిన చిన్న పిల్లలను అంత దగ్గరగా చూడటం నాకు అదే మొదటిసారి. అదొక అద్భుతమైన ఫీలింగ్...

చూస్తుంటే 24 ఏళ్ళు గడిచాయి.

నిజంగా ఒక్క కంప్లయింట్ లేదు...

సెయింట్ పీటర్స్ నుంచి-ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి-బెంగుళూరు జైన్ యూనివర్సిటీ వరకూ... ప్రతి దశలోనూ... చదువులో ఎప్పుడూ టాప్.

త్వరలో ఉద్యోగంలో చేరబోతున్నాడు.  

నేనే మంచి తండ్రిని కాలేకపోయాను... 

హాప్పీ బర్త్‌డే ప్రణయ్!

Saturday, 9 January 2021

మనోహరమ్ ఎలైట్ వెబ్ మ్యాగజైన్

సాంకేతికంగా, కంటెంట్ పరంగా కూడా మనోహరమ్ మ్యాగజైన్ బేటా వెర్షన్‌లో అన్ని ప్రయోగాలూ పూర్తయ్యాయి.

మొన్న జనవరి 1 నుంచే మ్యాగజైన్ పూర్తి వెర్షన్‌ను ప్రారంభిద్దామని అనుకున్నాను. కొన్ని ప్రొఫెషనల్ కారణాలవల్ల, ఇంకా, నా శ్రేయోభిలాషులైన కొందరు పెద్దవాళ్ల సలహా అనుసరించి కూడా ఆ పని చేయలేదు. 

మనోహరమ్ మ్యాగజైన్ పూర్తి వెర్షన్ అఫీషియల్‌ లాంచ్‌ ఈ నెల 28 వ తేదీనాడు ఉంటుంది.

ఎవరు లాంచ్ చేస్తారన్నది 2, 3 రోజుల ముందు తెలియజేస్తాను. 

ఫిబ్రవరి సంచిక నుంచి "మనోహరమ్" తెలుగులో ఒక పూర్తిస్థాయి ఎలైట్ వెబ్ మ్యాగజైన్ రూపం సంతరించుకొంటోంది. రెగ్యులర్‌గా ప్రతి నెలా 1వ తేదీ నాడు 00.10 గంటలకు పబ్లిష్ అవుతుంది. 

కట్ చేస్తే - 

ప్యాషన్, పాజిటివ్ దృక్పథమే ప్రధానంగా - నా బ్లాగింగ్‌ హాబీకి పూర్తిస్థాయి ఎక్స్‌టెన్షన్ ఈ మ్యాగజైన్.

ఇంతకుముందు కూడా ఒక పోస్టులో చెప్పినట్టు... సక్సెస్ సైన్స్-సినిమాలు-సరదాలు (Mindset-Movies-Masti)... ఈ మూడే ప్రధాన విభాగాలుగా నేను ప్లాన్ చేసిన ఈ మ్యాగజైన్ పూర్తిగా ఒక బిందాస్ పాజిటివ్ మ్యాగజైన్.

పాలిటిక్స్, హేట్రెడ్‌కు ఇందులో స్థానం లేదు. 

ఏ రంగంలోంచి ఏ వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినా-లేదా- అతడు/ఆమె గురించి ఒక స్టోరీ రాసినా, అది సక్సెస్ సైన్స్ పాయింటాఫ్ వ్యూలోనే ఉంటుంది. 

కథలు, కవితలు కూడా ఇలాగే ఉండాలన్న రూల్ లేదు. క్రియేటివిటీ అనేది ఎలాంటి తూనికలకు లొంగాల్సిన అవసరంలేదు. ఇంకొక వ్యక్తినో, వర్గాన్నో బాధపెట్టకుండా ఉంటే చాలు.

జీవితం పట్ల, జీవనశైలిపట్ల పాజిటివ్ దృక్పథమే ప్రధానం. 

ఇలా ఉండాలి, అలా ఉండాలి అన్న ప్లానింగ్స్, రీప్లానింగ్స్ అన్నీ దాటుకొని - మ్యాగజైన్‌ను ఒక ఫైనల్ వెర్షన్‌కు తీసుకురాగలిగాను.

ఫైనల్ వెర్షన్ రూపం జనవరి 28 నాడు లాంచ్ చేస్తున్న మనోహరమ్ ఫిబ్రవరి సంచిక నుంచి మీరు ఎంజాయ్ చేస్తారు. 

ఎందరో మిత్రులు, శ్రేయోభిలాషులు... మీ ప్రోత్సాహమే నాకు కొండంత బలం. అందరికీ నా వందనాలు.  

Friday, 8 January 2021

2021 లో మొదటి 8 రోజులు

"ఒకసారి పబ్లిక్‌లోకి వచ్చాక పర్సనల్ అంటూ ఏమీ ఉండదు!"

ఇలా అని గతంలో పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ గురించి అంటుండేవాళ్ళు.

కాని, సోషల్ మీడియా వచ్చాక, ఇప్పుడు ప్రతి ఒక్కరి పర్సనల్ లైఫ్ కూడా పబ్లిక్ అయిపోయింది! 

మరీ ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ యాండ్రాయిడ్ వాడే ప్రతి సగటు మనిషి జీవితాన్ని ఒక రచ్చబండ చేసేశాయి. 

బయటివాడెవడో అస్సలు తనకు సంబంధం లేనివాని పర్సనల్ విషయాల్ని గెలకటం ఒక టైపు రచ్చ. కాగా, ఎవరికివారే వాళ్ల కుటుంబ విషయాల్ని, ఇతర పర్సనల్ విషయాల్ని ఓపెన్‌గా వాల్స్ పైన పెట్టుకోవడం ఇంకో టైపు రచ్చ. పైగా, వీటికి లైక్ కొట్టి కామెంట్ చెయ్యలేదని అలకలూ, నిష్టురాలూ... కొండొకచో ఆ విషయం మీద కూడా పోస్టులు, ట్వీట్లు! 

కట్ చేస్తే - 

9 నెలల పాండెమిక్-లాక్‌డౌన్ ప్రభావమైనా మనలో కనీసం ఒక్క శాతం మార్పునైనా తీసుకురాలేదంటే - మనలో ఏదో లోపం ఉన్నట్టే! ముందు దానిగురించి ఆలోచించాలి. 


జర్నలింగ్-లేదా-డైరీ రాసుకోవడంలో తప్పులేదు. ఒక మంచి అలవాటు కూడా! దానివల్ల అసలు మన జీవితంలో ఏం జరుగుతుందో ప్రతి 24 గంటలకు ఒకసారి మనకి మనం చూసుకుంటాం. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ బాధ్యతాయుతంగా ముందుకెళ్తుంటాం.

చాలావరకు బ్లాగింగ్ కూడా ఇలాంటిదే. ఎన్నో దురలవాట్లకంటే ఈ ఎడిక్షన్ చాలా బెటర్. బ్లాగింగ్‌లో రిఫ్లెక్ట్ అయ్యే మన ఆలోచనా విధానం, మన మైండ్‌సెట్ ఎటుపోతున్నాయో మనకు తెలుస్తుంటుంది. మనం ఎటుపోతున్నామో కూడా మనకు తెలుస్తుంది.

బ్లాగింగ్ మంచి స్ట్రెస్‌బస్టర్ కూడా. 

వ్యక్తిగతంగా అయినా, వృత్తిపరంగా అయినా - సోషల్‌మీడియాను నిజంగా బాగా ఉపయోగించుకోగలిగితే చాలా విషయాల్లో అదొక గోల్డ్ మైన్ అంటే అతిశయోక్తికాదు. 

సోషల్‌మీడియాకు సంబంధించినంతవరకూ... 2021లో నేను పూర్తిగా ఆ దిశలోనే వెళ్తున్నాను. మిగిలిన అన్ని విషయాల్లో 10 రెట్లు వేగం పెంచాను. 

సమయం చాలా విలువైంది. అది ఎవ్వరికోసం ఆగదు. 

జీవితం ఒక్కటే. దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. 

Friday, 1 January 2021

Happy New Year !!

న్యూ ఇయర్ అయినా, ఉగాది అయినా... కొత్త సంవత్సరం అని నాకు ప్రత్యేకంగా సెంటిమెంట్లు ఎప్పుడూ లేవు. కాని, పెద్దలు ఇలాంటివి ఊరికే పెట్టలేదు అనేది మాత్రం చాలా గట్టిగా నమ్ముతాను. 

ఇలాంటిదేదో ఒక ప్రత్యేకమైన సందర్భం వస్తే తప్ప మనం కొన్ని  నిమిషాలయినా ఆగి, అసలు ఏం జరుగుతోంది, ఏం చేస్తున్నాను, ఎన్ని బాధ్యతలున్నాయి, టైమ్ చూసుకుంటున్నామా అసలు... అనే యాంగిల్‌లో ఫోకస్‌డ్‌గా  ఆలోచించము. ఈ కోణంలో నాకు ఉగాది చాలా ముఖ్యమైంది. అలాగే న్యూ ఇయర్ కూడా. 

కట్ చేస్తే - 

రాత్రి నుంచి ఇప్పటివరకు నాకు వచ్చిన ప్రతి గ్రీటింగ్,  ప్రతి మెసేజ్‌కూ రిప్లై ఇచ్చాను. నేనుగా ఒకరిద్దరు పెద్దవాళ్లకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పంపించాను. 

2021 లో కనీసం ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్నాను. 2 పుస్తకాలు పబ్లిష్ చేస్తున్నాను.  

ఇవి ప్రత్యేకంగా గోల్స్ లాంటివి కాదు. ప్రొఫెషనల్‌గా నా పనిలో భాగం. చేస్తున్నాను. అంతే.