Wednesday, 6 May 2026

అనుకోకుండా ఒక ఉదయం


అప్పట్లో నేను మద్రాసు (ఇప్పుడు చెన్నై) ఎక్కువగా వెళ్తుండేవాణ్ణి. ఇది దాదాపు పాతికేళ్ళ క్రితం మాట. నా ఘోస్ట్ రైటింగ్, ఇతరత్రా పనులు అయిపోయిన తర్వాత, సినీఫీల్డులోని ఎవరో ఒకరిని తప్పకుండా కలిసి, మాట్లాడి వచ్చేవాణ్ణి.  

కర్నూలు-టు-మద్రాసు, మద్రాసు-టు-కర్నూలు. 

ఇదంతా నేను కర్నూలు ఆలిండియా రేడియో (ఎఫ్ ఎమ్) లో పనిచేస్తున్నప్పటి నేపథ్యం. 

ఇలాంటి ఒక సందర్భంలోనే, నేను చెన్నై వెళ్ళినప్పుడు దర్శకులు బాపు గారిని, సింగీతం శ్రీనివాసరావు గారిని కూడా కలిసి మాట్లాడాను. వారితో మాట్లాడినదంతా, ఒక ఇంటర్వ్యూలా నా వాక్‌మన్‌లో రికార్డ్ చేశాను. ఆ టేప్స్ ఇంకా నా దగ్గరున్నాయి. వాటిని త్వరలో డిజిటలైజ్ చెయ్యాలి.  

అప్పుడే, ఎన్నో వందరోజుల చిత్రాలకు కథలు అందించిన సినీరచయిత సత్యమూర్తి గారిని కూడా వాళ్ళింట్లో రెండురోజులు వరుసగా కలిశాను. వాళ్ళింట్లో భోజనం చేస్తూ, నా తొలిసినిమా స్క్రిప్టు గురించి కూడా చర్చించాము. అప్పటికి నేనింకా డైరెక్టర్ అవలేదు.  

సత్యమూర్తి గారి అబ్బాయే మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్. 

దేవిశ్రీప్రసాద్‌ను కూడా మొదటిసారిగా మద్రాసులోని వాళ్ళింట్లోనే కలిశాను, అది వేరే ఎపిసోడ్.        

ఇలాంటి ఇంకో సందర్భంలో చెన్నైలో వి ఏ కే రంగారావు గారిని కూడా కలిశాను. వారి దగ్గరున్న వేలాది గ్రామఫోన్ రికార్డుల కలెక్షన్‌ చూసి నాకు మతిపోయింది. పుస్తకాలైతే లెక్కే లేదు. డజన్ల కొద్దీ రాక్స్.

బ్రిటిష్ ఫిలిం ఈన్‌స్టిట్యూట్ బుక్స్, "వెరైటీ" మ్యాగజైన్ స్పెషల్ ఇష్యూస్ మొట్టమొదటిసారిగా నేను వీ ఏ కే గారి దగ్గరే చూశాను. 

వీ ఏ కే గారిని రెండోసారి వాళ్ళింట్లో కలిసినప్పుడు... అక్కడే లాయర్, కాలమిస్టు, వీ ఏ కే గారి లాగే సినిమా చరిత్రను మునివేళ్ల మీద చెప్పగలిగే "రాండార్ గై" గారిని కూడా కలిశాను.    

అసలు వీ ఏ కే గారి లోకం వేరే. 
ఆయన దగ్గరికి కలవడానికి వచ్చే మనుషులు వేరే. 

అక్కడ నేనున్నప్పుడే ఒకసారి ఒక క్లాసికల్ డాన్సర్ అమెరికా నుంచి వచ్చారు. మద్రాసులో ఆమె డాన్స్ ప్రోగ్రాం కోసం వీ ఏ కే గారి సలహాలు తీసుకున్నారు. 

అన్నట్టు వీ ఏ కే గారు క్లాసికల్ డాన్సర్ కూడా.  

"మనోహర్, నన్ను తాతగారూ అని పిలవ్వోయ్!" అన్నారొకసారి... ఇద్దరం కలిసి వాళ్ళింట్లో భోజనం చేస్తుండగా. 

మా మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా బాగానే నడిచాయి అప్పట్లో. 

చెన్నైలో, మాజీ కేంద్రమంత్రి చిదంబరం ఇంటికి సరిగ్గా ఎదురుగా విశాలంగా ఉండే వీ ఏ కే గారి ఇంటి పేరు... "రామ్ మహల్" అని నాకింకా గుర్తుంది.

బహుశా ఇప్పుడక్కడ ఆ ఇల్లు ఉండకపోవచ్చు. 
వీ ఏ కే గారు ఇప్పుడు చెన్నైలోనే ఇంకోచోట ఉంటున్నట్టు తెలిసింది.    

కట్ చేస్తే -                

"ఒక సినీ విజ్ఞాన సర్వస్వం జీవనశైలి" అన్న శీర్షికతో దాదాపు 15 ఏళ్ల క్రితం వి ఏ కే రంగారావు గారి మీద ఒక పెద్ద వ్యాసం నేను రాశాను. నా చేతి వ్రాతలో సుమారు 20 పేజీలుంటుంది.  

"ఇండియా టుడే" స్పెషల్ ఇష్యూలో గాని, "వార్త" సండే ఎడిషన్లో గాని పబ్లిష్ చేయించాలని నా ఆలోచన. కాని, ఎప్పటికప్పుడు "నెక్స్‌ట్ వీక్ చూద్దాం" అనుకొంటూ, అదలా పక్కన పడిపోయింది. క్షమించరానంత ఆలస్యం జరిగింది.

ఈ మధ్యే వీ ఏ కే గారిని సంప్రదించి, ఇటీవలి విషయాలు కూడా కనుక్కొని, నా వ్యాసాన్ని మళ్ళీ కొత్తగా, తాజాగా పూర్తిచేశాను.

మొన్నీమధ్యే, వీ ఏ కే గారి మీద నా వ్యాసాన్ని నా మిత్రుడు, "పాలపిట్ట" ఎడిటర్ గుడిపాటికి పంపించాను. త్వరలో పాలపిట్టలో ఈ వ్యాసం వస్తుంది. 

దీని కోసం, నేను వీ ఏ కే గారితో తీసుకొన్న ఒకే ఒక్క ఫోటో కోసం ఇవ్వాళ ఉదయం వెతుకుతుండగా, నా కళ్ళముందు కనిపించిన ఎన్నెన్నో ఫోటోలు నన్ను చాలా బాధపెట్టాయి. ప్రశ్నించాయి. 

అప్పటి నేను వేరే. 
ఇప్పుడు నేను ఏంటి అనేది నాకే తెలీదు. 

- మనోహర్ చిమ్మని  

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani