Sunday, 13 April 2025

సోషల్ డైనమిజమ్ ఆమె బ్రాండ్!


నేనప్పుడు ఎర్రగడ్డలోని మా స్వర్ణసుధ ప్రాజెక్ట్స్ ఆఫీసులో ఎమ్‌డీగా ఏవో రియల్ ఎస్టేట్ ఫైల్స్ చూస్తూ బిజీగా ఉన్న సమయంలో వచ్చిందా అమ్మాయి. తను ఒక్కతే రాలేదు... 18 నెలల వయసున్న వాళ్ళ చిన్నబ్బాయి ప్రియాంశ్, ఆమె భర్త వచ్చారు. 

ఆన్‌లైన్‌లో నన్ను బాగా ఫాలో అయి, నా దగ్గర "అసిస్టెంట్‌గా చేరుతా" అని వచ్చిందా అమ్మాయి. 

ఒక 15 నిమిషాలు మాట్లాడాక "సరే" అన్నాను. 

ఆరోజు నేను ఆ అమ్మాయిని నా టీమ్‌లో చేర్చుకోడానికి రెండు బలమైన కారణాలున్నాయి...

ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నా, "నేను సినిమాల్లో పనిచేస్తా" అని పల్లెటూళ్ళో పుట్టిపెరిగిన ఒక తెలంగాణ అమ్మాయి అంత ఆసక్తితో రావడం ఒకటి. నేను తనతో మాట్లాడిన ఆ 10-15 నిమిషాల్లో చాలా కాన్‌ఫిడెంట్‌గా, సహజమైన తెలంగాణ భాషలో ఆ అమ్మాయి మాట్లాడిన విధానం రెండో కారణం. 

నిజానికి ఆ అమ్మాయి నాదగ్గర చేరడానికి వచ్చింది రైటింగ్ డిపార్ట్‌మెంట్లో అసిస్టెంట్‌గా చెయ్యడానికి. మంచి కథలు క్రియేట్ చెయ్యగలదు. కథ కోసం "ఇప్పటివరకు రాని పాయింట్ ఇంకేదో కావాలి" అని తపిస్తుంటుంది. కాని, కొద్దిరోజుల తర్వాత, తనని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత చెప్పాను... 

"నువ్వు రైటింగ్ వైపు ఎంత కష్టపడ్డా - అంత ఈజీగా నువ్వనుకున్న స్థాయికి ఎదగలేవు. డైరెక్టర్ కావడమే నీకు కరెక్టు. నీ గోల్ మార్చుకో, డైరెక్టర్‌ అవుతావు" అని చెప్పాను.


ఆ అమ్మాయి పేరు లహరి జితేందర్ రెడ్డి. ఎమ్మెస్సీ బీయెడ్ చదివింది. తను టీచర్ కావాలని వాళ్ళ నాన్న కోరిక. కాని, టీచర్ జాబ్ కోసం అసలు డీయస్సీనే రాయలేదు లహరి!        

జితేందర్ రెడ్డి లహరి భర్త. చిన్న వయస్సులోనే ఆర్మీలో చేరి, మొన్నీ మధ్యే రిటైరయి వచ్చారాయన. ప్రస్తుతం రియల్ ఎస్టేట్‌లో ఉన్నారు. లహరి కెరీర్ కోసం జితేందర్ రెడ్డి ఇస్తున్న సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఈ జంటకు ప్రీతమ్, ప్రియాంశ్ అని ఇద్దరబ్బాయిలు. 

కట్ చేస్తే - 

ఒక 6, 7 నెలల దాకా  లహరి ఎప్పుడో ఒకసారి ఆఫీసుకి వచ్చి కనిపించేది. ఇంట్లో చిన్నపిల్లల్ని చూసుకోడానికి వాళ్ళ అమ్మను ఊరినుంచి రప్పించుకోడానికి కొంత సమయం పట్టింది బహుశా.  

ఆఫీసుకి వచ్చినప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా, బుద్ధిగా వినేది. కొంచెం తక్కువ మాట్లాడేది. సస్పెన్స్-క్రైమ్-థ్రిల్లర్ సినిమాలు ఆ అమ్మాయికి చాలా ఇష్టం. ఏదైనా ఒక అంశం మాట్లాడుతున్నప్పుడు - ఆ కాన్‌టెక్స్‌ట్‌లో - టక్కున బెస్ట్ స్క్రీన్‌ప్లే ఉన్న సినిమా ఒకటి క్షణంలో ఎగ్జాంపుల్‌గా చెప్పేది నాకు.

అమ్మాయిల్లో అసిస్టెంట్ డైరెక్టర్స్, డైరెక్టర్స్ అంతకు ముందు కూడా నాకు తెలిసినవాళ్ళు కొందరున్నారు. కాని, వారెవ్వరిలోనూ ఈ అమ్మాయిలోని ఈ ప్రత్యేక అంశం నేను చూడలేదు.     

"ఏ మాయ చేసావె" సినిమాలోని ఒక సీన్లో పూరి జగన్నాధ్, నాగచైతన్యతో ఒక మాటంటాడు... "ఇక్కడెవ్వరూ నీకు పని నేర్పరు. చూడు, పని చెయ్యి, నేర్చుకో" అని. లహరి విషయంలో ప్రాక్టికల్‌గా అదే జరిగింది.


Yo! సినిమా కోసం మేం కొత్త ఆఫీసులోకి మారినప్పటి నుంచి లహరిని పూర్తిగా అన్ని పనుల్లోకి ఇన్వాల్వ్ చేశాను.

అప్పటివరకూ అసలు ప్లాన్‌లో లేని రోడ్-క్రైమ్-థ్రిల్లర్ మొన్నటి "ఎర్ర గులాబి" సినిమా షూటింగ్ అప్పుడు కూడా, మాకు కావల్సిన షూటింగ్ లొకేషన్స్ కోసం పూర్తిగా ఇన్వాల్వ్ అయి, తన సొంత సినిమాలా, లహరి అన్నీ అరేంజ్ చేసిన విధానం సూపర్బ్. 

కట్ చేస్తే -

ఏదో టైమ్‌పాస్ చేస్తూ, వాళ్లమీద వీళ్ళమీద కామెంట్స్ చేస్తూ, సమయం గడిపేవాళ్ళు వేరు. టైమ్ వాల్యూ తెలిసినవాళ్ళు వేరు.

లహరికి తన టైమ్ వాల్యూ తెలుసు. ఎక్కడ ఎంతసేపుండాలి, ఎక్కడినుంచి ఎప్పుడు బయటపడాలి, ఎవరితో మాట్లాడొచ్చు, ఎవరితో మాట్లాడ్డం వేస్టు, తన ప్రజెన్స్ ఎక్కడ అవసరం, ఎక్కడ ఎవరి ద్యారా తన కెరీర్ కోసం అవసరమైన కాంటాక్ట్స్ దొరుకుతాయి, ఎవర్ని కలవాలి, ఎవరికి కాల్ చెయ్యాలి... ఈ సోషల్ డైనమిజమ్ లహరి బ్రాండ్.  


నా దగ్గర జాయినయిన కొత్తలో నేను లహరితో ఒకటే మాట చెప్పాను... "అసిస్టెంట్‌గా నా దగ్గర సినిమా అయిపోయే లోపు నీ సబ్జెక్ట్ రెడీ చేసుకొని, డైరెక్టర్‌గా నీ మొదటి సినిమా ఎనౌన్స్ చెయ్యాలి" అని. 

లహరి అది చేసి చూపించినందుకు నేనిప్పుడు గర్వంగా ఫీలవుతున్నాను. ఆమెకిప్పుడు కనీసం ముగ్గురు ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వారిలో ఒకరిని రిజెక్ట్ చేసింది. ఒక యువ హీరోకి కథ చెప్పి ఒప్పించింది. డైరెక్టర్‌గా తన డెబ్యూ సినిమా త్వరలో ఎనౌన్స్ చేయబోతోంది... తెలుగు తెరకు మరో కొత్త మహిళాదర్శకురాలు... లహరి జితేందర్ రెడ్డి!   

దటీజ్ మై చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్, నా ప్రియ శిష్యురాలు... లహరి! All the best to Lahari for a wonderful future in the Tinsel World!! 

- మనోహర్ చిమ్మని 

2 comments:

Thanks for your time!
- Manohar Chimmani