Tuesday, 26 November 2024

కొన్ని జ్ఞాపకాలు బాగుంటాయ్! కానీ...


నా తొలి సినిమా హీరో రాజా, నేనూ ఇప్పుడు అసలు టచ్‌లో లేము. కాని, ఆ సినిమా ప్రీప్రొడక్షన్ సమయంలోనూ, షూటింగ్ జరుగుతున్నన్ని రోజులూ, ఆ తర్వాత సినిమా రిలీజయ్యేవరకూ... హీరో రాజాతో ముఖ్యంగా నాకు, మా టీమ్‌కు ఎన్నో మంచి మెమొరీస్ ఉన్నాయి. 

* మారుతీ వ్యాన్‌లో మౌంట్ ఒపెరాకు వెళుతూ/వెళ్లాక (డాన్స్ మాస్టర్ నిక్సన్‌తో కలిసి) నేను, రాజా పార్టీ చేసుకోవటం. 
* ప్యారడైజ్ చౌరస్తా నుంచి  నేను, రాజా అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లి ఒక హోటల్లో లంచ్ చేయటం. అప్పటికే రాజా మూడు సినిమాలు చేసి ఉన్నాడు! (ఓ చినదానా, అప్పుడప్పుడు, విజయం)
* షూటింగ్ కోసం మారిషస్ కు రెండు వారాలు వెళ్లినప్పుడు, ఒక టీం మెంబర్‌గా ఎలాంటి ఈగో లేని అతని కోపరేషన్.
* కెమెరా లెన్సులున్న బరువైన బాక్స్‌ని తన తలమీద పెట్టుకొని, టీమ్‌తో పాటు కనీసం ఒక మైలు దూరం సముద్రం అంచులవెంట రాళ్లమీద నడవటం.
* కాల్షీట్ టైమింగ్స్ లేకుండా, మారిషస్‌లో చాలా సరదాగా ఆడుతూ పాడుతూ షూటింగ్‌లో పాల్గొనటం, అందర్నీ ఉత్సాహపర్చటం.
* షూటింగ్ సమయంలో, బీచుల్లోని వేడికి బాగా నల్లబడిన నా ముఖానికి తనదగ్గరున్న కాస్మెటిక్స్ ఏవేవో పూసి, రాజా స్వయంగా రెండుమూడుసార్లు నాకు ఫేషియల్ చేయటం. 
* "మనోహర్ గారూ.. డైరెక్టర్ గారూ" అంటూ, ఇంగ్లిష్ యాక్సెంటుతో కూడిన తనదైన వాయిస్‌తో గౌరవంగా పిలవటం. 
* కొత్త సీన్ చేస్తున్న ప్రతిసారీ నా స్క్రిప్టుని పదే పదే మెచ్చుకోవడం.  
* అన్నపూర్ణ స్టూడియోలో ఒక మంచి ఎమోషనల్ సీన్  చేస్తున్నపుడు చనిపోయిన వాళ్ల అమ్మగారు గుర్తుకొచ్చి కన్నీళ్లు పెట్టుకోవటం. ఆ ఉద్వేగంలోనే, సెట్లో ఒక మూలన ఉన్న నా దగ్గరకు వచ్చి  "మీతో ఇంకో సినిమా తప్పకుండా చేస్తాను" అని చెప్పటం... ఇలా రాజాతో నాకూ, మా టీమ్‌కు చాలా మంచి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి.      

చాలా గ్యాప్ తర్వాత, ఒకసారి ది సేమ్ రాజాని మణికొండలోని తన కొత్త ఇంట్లో కలిశాను. అదే పలకరింపు. అదే మర్యాద. అదే చిరునవ్వు. "సినిమాల్లో నేను డబ్బు సంపాదించలేదు. పోగొట్టుకున్నాను. ఇప్పుడు సినిమాలు చేయాలన్న అవసరం కూడా  లేదు నాకు. లైఫ్ చాలా హాయిగా ఉంది" అన్నాడు క్రైస్తవ మత ఉపన్యాసకుడుగా ప్రస్తుతం బిజీగా ఉన్న రాజా. రాజాకు సేవాభావం ఎక్కువ. ఆ మధ్య ఒక ఫౌండషన్ కూడా ప్రారంభించాడు. 

కట్ చేస్తే -

కారణం నాకు తెలీదు కాని, రాజా ఇచ్చిన చాలా ఇంటర్వ్యూల్లో తను పనిచేసిన అందరు డైరెక్టర్ల పేర్లు చెప్పాడు కాని, నా ఒక్కడి పేరే ఎందుకో ఎప్పుడూ చెప్పలేదు!  

- మనోహర్ చిమ్మని  

2 comments:

  1. Sorry for being Harsh... he was a struggling Actor and he buttered you like every struggling Actor does.

    ReplyDelete
    Replies
    1. "కారణం నాకు తెలీదు కాని, రాజా ఇచ్చిన చాలా ఇంటర్వ్యూల్లో తను పనిచేసిన అందరు డైరెక్టర్ల పేర్లు చెప్పాడు కాని, నా ఒక్కడి పేరే ఎందుకో ఎప్పుడూ చెప్పలేదు!" ... This was my point. You missed that, Venkat. :-)

      Delete

Thanks for your time!
- Manohar Chimmani