Monday, 22 June 2026

నాన్న నేర్పిన రాత


పొస్టులో రాసుకునే లెటర్స్ అంటే ఇప్పటి తరానికి తెలియదు.

ఈ ఇంటర్నెట్లూ, ఈమెయిల్సూ రాకముందు... నా చిన్నతనం నుంచి, తను మమ్మల్ని వదిలివెళ్లిపోయేదాకా... మా నాన్న, నేను రాసుకున్న ఉత్తరాల సంఖ్య ఒక రికార్డ్. 

వందల్లో ఉంటాయి.
బహుశా వేయి అంకెను కూడా దాటి ఉండొచ్చు. 

ఆయన బొంబాయిలో, భీవండీలో పనిచేస్తున్నప్పుడు నాకు వరంగల్‌కు, హైద్రాబాద్‌కు రాసిన ఉత్తరాలు... నేను హైద్రాబాద్‌కు పూర్తిగా వచ్చేశాక, ఆయన వరంగల్ నుంచి నాకు రాసిన ఉత్తరాలు... ఇప్పుడు గుర్తుచేసుకుంటే నాకు తెలియకుండానే నా కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి.  

బహుశా చిన్నప్పటినుంచీ మా నాన్న, నేను రాసుకున్న ఉత్తరాలే క్రమంగా నాలో రైటింగ్ పట్ల ఆసక్తి, ఇష్టం పుట్టడానికి కారణమయ్యాయనిపిస్తోంది. ఆ తర్వాత అదే అలవాటు నాలో కొనసాగిందనుకుంటాను.   

ఆకాలంలో మా నాన్న పెద్దగా చదువుకోలేదు. ఇంగ్లిష్ అర్థం చేసుకోడానికి ఆయన కొనుక్కొన్న శంకర్ నారాయణ డిక్షనరీ, దాచేపల్లి డిక్షనరీలను నేను వరంగల్లో ఉన్నంతకాలం నా అల్మారాలో భద్రంగా దాచిపెట్టాను. 

నేను నా చెక్క అల్మారాలో దాచిపెట్టుకున్న ప్రతి పుస్తకాన్నీ, ప్రతి కాగితాన్ని, ప్రతి పెన్నునూ తను బ్రతికున్నంత కాలం మా అమ్మ కూడా మరింత జాగ్రత్తగా కాపాడింది. 

ఇప్పుడా అల్మారా లేదు. ఎన్నెన్నో జ్ఞాపకాలను ఇచ్చిన ఆ ఇల్లూ లేదు. అమ్మా, నాన్నా ఇద్దరూ లేరు. 

కోల్పోయిన తర్వాతే కొన్నిటి గురించి మరింత లోతుగా అర్థం చేసుకోగలుగుతాము. 

వెనుకట బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో ఉత్తరం చదువుతున్నప్పుడు, ఆ ఉత్తరంలో ముఖం కనిపించినట్టే... నాకు మా నాన్న రాసిన వందలాది ఉత్తరాలూ, వాటిలోంచి నన్ను చూస్తున్న ఆయన ముఖం ఇప్పుడు నాకు కనిపిస్తున్నాయి. 

మా నాన్న లేకుండా నా ఈ రాతలు లేవు, ఈ బుక్స్, బ్లాగులూ లేవు.   

వెల కట్టలేని ఆ ప్రేమ ఇప్పుడు నా కళ్ళముందుంటే ఎంత బాగుండునో కదా అని ఇప్పుడు దుఃఖిస్తున్నాను.  

Happy Father's Day!  

- మనోహర్ చిమ్మని  

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani