Sunday, 21 June 2026

నాన్న ఒక జ్ఞాపకం


అమ్మ ప్రాముఖ్యం అమ్మదే. 
కాదనలేం.
కాని-

అమ్మతో పోల్చినపుడు- 
కనీస గుర్తింపుకు కూడా నోచుకోని,
అసలు దాని గురించి పట్టించుకోని-
పిచ్చివాడు,  
కష్టజీవి, 
త్యాగమూర్తి, 
మౌని, 
ప్రేమి...
నాన్న.

తన చివరి నిమిషం వరకూ 
పిల్లలూ కుటుంబం కోసమే 
నానా కష్టాలు పడుతూ,
ఎన్నో అవమానాలు భరిస్తూ,
ఎప్పుడూ పిల్లల కోసమే-
ఆలోచించే వ్యక్తి, 
శ్రమించే శక్తి... 
నాన్న.

తరతరాలుగా అమ్మకు వచ్చిన గుర్తింపు 
ఎందుకనో నాన్నకు రాలేదు.

మరో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే-
చాలా మంది విషయంలో...
తండ్రి విలువ తెలుసుకునేటప్పటికి 
ఆ తండ్రి ఉండడు.

మగపిల్లలకు ఇది ఇంకో శాపం. 

"అసలు ఈ "ఫాదర్స్ డే"లు, "మదర్స్ డే"లు ఏంటి?... మన కల్చర్ కాదు... మనం తల్లిదండ్రుల్ని ప్రతిరోజూ గుర్తుంచుకోవాలి... గుర్తు చేసుకోవాలి... వారిపైన ప్రేమను వర్షించాలి... వారిని 365 రోజులూ పూజించాలి... అదీ మన సంస్కృతి" అని కొందరు అంటుంటారు.

వాస్తవంలో అలా జరుగుతున్నప్పుడు ఇంక సమస్యేముంది? అంతకంటే కావల్సిందేముంటుంది? 

అయినా సరే, నా ఉద్దేశ్యంలో మాత్రం ఇలాంటి 'డే' లు ఉండాలి. ఉండి తీరాలి.   

మన హిపోక్రసీ పక్కన పెట్టి, రెండు నిమిషాలు ఆలోచిస్తే చాలు. మొత్తం కళ్లముందు కనిపిస్తుంది.  

ఒకే ఇంట్లో కళ్ళముందున్న ముసలి తల్లిదండ్రుల వైపు కళ్ళెత్తి కూడా చూడలేని కొడుకులున్న కాలం ఇది... ఎక్కడో ఊళ్ళో ఉన్న తల్లిదండ్రులను చూడ్డానికి సంవత్సరానికి ఒక్కసారో, రెండుసార్లో చుట్టపుచూపుగా కొడుకులు వెళ్తున్న కాలం ఇది... విదేశాల్లో ఉండి, తండ్రి చనిపోయినా రాలేకపోతున్న రోజులు ఇవి... నిజంగా తల్లిదండ్రులపైన మనసులో ఎంతో ప్రేమ ఉన్నా, ఆవైపు అసలు ఆలోచించనీయని వత్తిళ్ల మధ్య పిల్లలు నలుగుతున్న కాలం ఇది. 

కేవలం అతి తక్కువ శాతం మంది మాత్రమే ఇలాంటి పరిస్థితులకు మినహాయింపుగా ఉండవచ్చు. వారికి మాత్రం నిజంగా హాట్సాఫ్.   

ఇలాంటి పరిస్థితుల్లో, సంవత్సరానికి ఒక రోజు 'ఫాదర్స్ డే' అనో, 'మదర్స్ డే' అనో ఉంటే తప్పేంటి? 

కనీసం ఆ ఒక్క రోజైనా నిజమైన ప్రేమతో కొందరు, సమాజం కోసం కొందరు, ఫేస్‌బుక్ పోస్టుల కోసం కొందరు... వారి తల్లిదండ్రులను కొంతసేపైనా ఖచ్చితంగా గుర్తుచేసుకుంటారు. మంచిదే కదా?

ఒక ఫోన్ చేస్తారు. వెళ్ళి కలుస్తారు. సెల్ఫీలు తీసుకుంటారు. ఫేస్‌బుక్‌లో ఫోటోలు పెడతారు. జ్ఞాపకాలు నెమరేసుకుంటారు. పొద్దున్నే, అన్ని పనులూ పక్కనపెట్టి, ఇలా బ్లాగులు రాసుకొంటూ గతించిపోయిన నాన్నని గుర్తు తెచ్చుకుంటారు.  

అసలు పూర్తిగా మర్చిపోయేకంటే, ఇది మంచిదే కదా! 

To all the fathers, sons, and daughters celebrating the beautiful bond of family—Happy Father's Day! ❤️  

 - మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani