Monday, 2 February 2026

గుమ్మడికాయ అందరూ కొట్టలేరు!


సినిమా షూటింగ్ ప్రారంభించిన రోజు పూజ చేసి కొబ్బరికాయలు కొడతారు. షూటింగ్ పూర్తయిన రోజు గుమ్మడికాయ కొడతారు. ఫిలిం ఇండస్ట్రీలో ఇదొక సాంప్రదాయం. ఎప్పటినుంచో ఉంది. 

ప్రతి సంవత్సరం వందల సినిమాలు కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తారు. కాని, వాటిలో ఒక 50 శాతం సినిమాలు మాత్రమే షూటింగ్ పూర్తిచేసుకొంటాయి. గుమ్మడికాయ కొడతారు. 

గుమ్మడికాయ కొట్టిన రోజు టీమ్‌లో చాలామందికి ఎమోషనల్‌గా ఉంటుంది. ముఖ్యంగా "ఈ సినిమా నాది" అని భావించినవారికి.

అప్పటివరకూ కలిసిపనిచేసి, "ఇంక రేపటి నుంచి షూటింగ్ ఉండదు, కలవము" అనుకున్నప్పుడు నిజంగానే ఎవరికైనా ఎమోషనల్‌గా ఉంటుంది. 

టీమ్‌లో ప్రతి ఒక్కరూ ప్రొడ్యూసర్, డైరెక్టర్‌ల దగ్గరికొచ్చి "కంగ్రాట్స్" చెప్తూ షేక్ హాండ్ ఇస్తారు. కొందరు హగ్ చేసుకుంటారు. మాటలు కరువైపోతాయి.  

భారీ బడ్జెట్ ప్రాజెక్టులైనా, చిన్న సినిమాలైనా గుమ్మడికాయ కొట్టినరోజు అక్కడ ఈ ఎమోషనల్ సీన్ తప్పదు.    

ఇలా నా మొదటి రెండు సినిమాలప్పుడు జరిగింది. కొందరు ఆర్టిస్టులు అయితే ఏడ్చేశారు.

"అలా" సినిమా గుమ్మడికాయ కొట్టినరోజున మా హీరోయిన్ విదిశ శ్రీవాస్తవ, వాళ్ళ నాన్న (ఆర్మీ ఆఫీసర్) కూడా దాదాపు ఏడ్చేశారు.  

కట్ చేస్తే -

మొన్నీమధ్య మేం షూటింగ్ పూర్తిచేసిన రోడ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా "ఎర్రగులాబి" గుమ్మడికాయ కొట్టిన రోజు మాత్రం ఏ ఒక్కరిలోనూ ఇలాంటి ఎమోషనల్ ఫీలింగ్ నేను చూళ్ళేదు. 

దాదాపు అందరూ ఎప్పుడెప్పుడు ఈ తతంగం అయిపోతుందా, వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉన్నారు. ఈ ఈవెంట్ ప్రాముఖ్యం తెలిసిన కొంతమంది లైట్ మెన్, కెమెరా అసిస్టెంట్స్ లాంటి ఒకరిద్దరు టెక్నీషియన్స్ మాత్రం అదే మూడ్‌లో నాకు కనిపించారు. నాతో అదే ఫీలింగ్‌తో మాట్లాడారు.  

కట్ చేస్తే - 

ఆరోజు నా టీమ్‌లో ఒకే ఒక్కరి ప్రవర్తన మాత్రం నాకు చాలా విచిత్రంగా అనిపించింది.

కనీసం డైరెక్టర్‌కు షేక్ హాండ్ ఇవ్వలేదు. కారెక్కి వెళ్ళిపోతున్న ఇంకొకరికి షేక్ హాండ్ ఇచ్చి, బాయ్ చెప్పడానికి మాత్రం చాలా తపన పడ్డారా వ్యక్తి. 

ఎవరా వ్యక్తి అన్నది నా టీమ్‌లో దాదాపు అందరికీ తెలుసు. ఎందుకంటే, వాళ్ళే ఇదంతా అబ్జర్వ్ చేస్తూ నాకు చెప్పారు. నేనూ చూశాను. 

మార్పు మానవ సహజం కదా? కాని, అది మార్పా... లేదంటే, "ఇంకేముంది పనయిపోయింది కదా" అనుకొని ఆరోజు బయటపడ్డ ఒరిజినాలిటీనా?   

- మనోహర్ చిమ్మని  

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani