Tuesday, 24 February 2026

సంపాదించినదాంట్లో నువ్వెంత ఖర్చుపెట్టావన్నదే నీ విలువ !!


"మనం ఏ సామాన్లతో ఎక్కామో వాటితోనే దిగుతాం. మిగిలి పోయిన తినుబండారాలు, న్యూస్ పేపర్లు రైల్లోనే వదిలేస్తాము. జీవితం కూడా అంతే. బ్రతుకు కంపార్ట్‌మె౦ట్‌లోకి ఏమీ లేకుండా కాలు పెట్టిన మనం, వెళ్ళేటప్పుడు కూడా అలాగే పోవాలి. సంపాదించినది కేవలం సుఖంగా బ్రతకటానికి మాత్రమే. కూడబెట్టి వారసులకు పంచటానికి కాదు."  

- యండమూరి వీరేంద్రనాధ్, 
"ఒక దెయ్యంతో నా ప్రేమ కథ" పుస్తకం నుంచి

కట్ చేస్తే -

ఒకసారి రామ్‌గోపాల్ వర్మ కూడా ఇలాంటిదే ఇంకో మాట చెప్పాడు... 

"నువ్వు ఎన్ని వందల కోట్లు సంపాదించావన్నదానికి అసలు విలువే లేదు. ఆ సంపాదించినదాంట్లో నువ్వెంత ఖర్చుపెట్టావన్నదే నీ విలువ" అంటాడు వర్మ. 

బిల్ గేట్స్ లాంటి ప్రపంచస్థాయి బిలియనేర్లు కూడా వాళ్ళు సంపాదించినదాంట్లోంచి ఒక్క పైసా వాళ్ళ వారసులకు ఇవ్వలేదు. వాళ్ళకు నచ్చిన చారిటీస్‌కు రాసేశారు. వాళ్ళకు ఇష్టమైనవిధంగా బ్రతుకుతున్నారు. 

కట్ చేస్తే - 

ఇప్పుడే ఫేస్‌బుక్‌లో వీరేంద్రనాధ్ గారి పోస్ట్ చూశాక ఇది రాయాలనిపించింది... 

వీరేంద్రనాధ్ పోస్ట్ ద్వారానే నాకు ఇంకో విషయం తెలిసింది... మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలకు సహాయం చేశారని. 

దేన్నీ లెక్కచెయ్యకుండా విచ్చలవిడిగా జీవితాన్ని అనుభవించినవాళ్ళంతా చివరికి ఆధ్యాత్మిక జీవితానికి అంకితమైపోయినట్టు, ఒకప్పుడు చారిటీ వైపు అసలు ఆలోచించనివాళ్ళంతా చివరి దశలో చారిటీకి, వ్యక్తిగత ఇష్టాలకు, వ్యక్తిగత జీవితానికి ఊహించనంత డబ్బు ఖర్చుపెడతారన్నది నేను అధ్యయనం చేసిన ఇంకో జీవిత వాస్తవం. 

- మనోహర్ చిమ్మని 

No comments:

Post a Comment

Thanks for your time!
- Manohar Chimmani