ఆమధ్య హైద్రాబాద్ బుక్ ఎగ్జిబిషన్లో ఒక మిత్రుడి స్టాల్ ఎదురుగా నేను, మా కవి యాకూబ్, ఇంకొందరు మిత్రులం నిల్చుని మాట్లాడుకుంటున్నాం. అప్పుడే కవి గోరటి వెంకన్న వచ్చారు. మా యాకూబ్ నన్ను వెంకన్నకు పరిచయం చేశాడు...
"వీడు నా క్లాస్‌మేట్, ఫ్రెండ్... ఫిలిం డైరెక్టర్" అని.
"ఫిలిం డైరెక్టరా?!" అని నన్ను హగ్ చేసుకొని షేక్ హాండిచ్చారు వెంకన్న. తర్వాత నా భుజం మీద చెయ్యేసి, ఒక మాటన్నారాయన...
"డైరెక్టర్... లైఫ్ చాలా దారుణమైన నరకం కదా అన్నా?!" అని.
కట్ చేస్తే -
ఇవ్వాళ మధ్యాహ్నమే నా డైరెక్టర్ మిత్రుడు ఒకరితో కాసేపు ఫోన్లో మాట్లాడాను. ప్రస్తుతం ఒక వంద కోట్ల సినిమా మీద ఫోకస్ పెట్టి, ఆ సినిమా ప్రిప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా తిరుగుతున్నాడు నా మిత్రుడు.
"మీరు మీ మొహమాటాలన్నీ పక్కనపెట్టి, ముందు ఆ అడ్వాన్స్ ఏదో తీసుకోండి. మీ రెమ్యూనరేషన్... అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి కనీసం ఈ సినిమా నుంచైనా! ఏంటో, పేరుకే డైరెక్టర్... మీకు చిన్న సినిమాలకు డబ్బులు రావు, ఇప్పుడు చేస్తున్న పెద్ద సినిమాక్కూడా అంతే అంటే ఎట్లా?!"... ఇదీ నా డైరెక్టర్ మిత్రుని భార్య ఆవేదన.
(అప్పట్లో సినిమా హిట్ అయినా సరే, డైరెక్టర్‌కు మొండి చెయ్యే అని కొంతమంది డైరెక్టర్ మిత్రుల ద్వారా తెలిసింది!)
కట్ చేస్తే -
డైరెక్టర్ అనేవాడు చాలామందికి అవకాశాలిస్తాడు, రెమ్యూనరేషన్స్ ఇప్పిస్తాడు. ప్రొడ్యూసర్‌కు ఎక్కడికక్కడ డబ్బు వృధా కాకుండా తన బాధ్యత కాని ఎన్నెన్నో విషయాల్ని కూడా తన భుజాలమీద మోస్తుంటాడు. తన జేబులోంచి కూడా ఎంతో ఖర్చుపెడుతుంటాడు.
కాని, టీంలో అందరికీ డబ్బిచ్చే ప్రొడ్యూసర్... ఒక్క డైరెక్టర్ పేమెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆపేస్తుంటాడు-లేదా-నిర్దాక్షిణ్యంగా కోతలుపెడుతుంటాడు. ఇంకా చెప్పాలంటే, అసలేమీ ఇవ్వకుండా పెండింగ్‌లో పెడతాడు.
ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అడిగినట్టుగా నిర్మొహమాటంగాతన పేమెంట్ గురించి అడగలేకపోతాడు డైరెక్టర్.
అప్పులు, ఆకలి మధ్య, ఎప్పుడూ చెదరని చిరునవ్వుతో, వందమంది టీమ్‌తో కలిసి పనిచేస్తుంటాడు.
ప్రొడ్యూసర్స్ అందరూ ఇలాగే ఉంటారని కాదు. చాలామంది ప్రొడ్యూసర్స్ మాత్రం... ఒక్క డైరెక్టర్ పేమెంట్ విషయంలోనే ఎందుకో ఇవ్వాలంటే బాధపడుతుంటారు.
గోరటి వెంకన్న ఇలాంటి డైరెక్టర్స్ జీవితాలు ఎందరివి చూసుండకపోతే ఆరోజు నాతో ఆమాట అనుంటారు?
- మనోహర్ చిమ్మని

No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani