Friday, 29 November 2024

సృజనాత్మక జీవితంలో ప్రయోగాలు తప్పనిసరి! కాని...


ఒక మల్టిఫేరియస్ క్రియేటివ్ ఫ్రీలాన్సర్‌గా, నా సుదీర్ఘ ప్రొఫెషనల్ ప్రయాణంలో క్రియేటివిటీతో ముడిపడివున్న పనులు ఇప్పటివరకు చాలా చేశాను. వీటిలో చాలావరకు ప్రయోగాలే. నా ఈ నిరంతర ప్రయోగాల నేపథ్యంలో - ఈమధ్య నేను మొదలెట్టిన మరో కొత్త ప్రయోగమే ఈ "మనోహరమ్" డిజిటల్ బులెటిన్.  

ఏదో ఒకటో రెండో సినిమాల్ని అన్-లిమిటెడ్‌గా, ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా, పెద్ద టార్గెట్‌తో చేస్తూ, ఈ జర్నీని బాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. కాని, క్రియేటివిటీ కదా... నిర్ణయాలు మారుతుంటాయి. ఇప్పుడు వరుసగా ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఆల్రెడీ రెండు సినిమాలను ప్రారంభించి, వాటి ప్రి-ప్రొడక్షన్ పనుల బిజీలో తలమునకలై వున్నాను. కొన్నాళ్ళపాటు, పూర్తిస్థాయిలో సినిమాలు చేయబోతున్నాను. ఈ నేపథ్యంలో, మనోహరమ్ లాంటి అదనపు బాధ్యతలకు రెగ్యులర్‌గా సమయం దొరకడం కష్టం. దొరికినా, దీనివల్ల సినిమాలపైన నా డీప్ ఫోకస్ అనేది చెదిరిపోయే ప్రమాదం ఉంటుంది. 

సో, ఇక నా మొత్తం ఫోకస్ సినిమాలపైనే పెట్టాలి కాబట్టి, ఏదో ఒకరోజు దీనికి గుడ్‌బై తప్పదు.    

కట్ చేస్తే -

స్ట్రెస్ బస్టర్ కోసం ఎక్స్, ఇన్‌స్టా, బ్లాగ్ ఎలాగూ ఉన్నాయి. మనోహరమ్ ద్వారా ఏదైతే సాధించాలని టార్గెట్ చేశానో, దాన్ని నా సోషల్ మీడియా ద్వారా కూడా సాధించగలను అన్నది నా గట్ ఫీలింగ్! కావాలనుకుంటే, బ్లాగింగ్‌కు కూడా కొన్నాళ్ళు విరామం ఇవ్వచ్చునేమో!...   

- మనోహర్ చిమ్మని     

ఒక సంవత్సరంలో 15 సినిమాలు డైరెక్ట్ చేయగలరా?


"అవును, చేయొచ్చు" అని 1980 లోనే నిరూపించారు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు. అంటే నెలకి ఒక సినిమా కంటే ఎక్కువే! అలాగని ఏదో చుట్టచుట్టి అవతల పడేసిన సినిమాలు కావవి. వాటిల్లో కనీసం 70% సినిమాలు హిట్లు, సూపర్ హిట్లు, సిల్వర్ జుబ్లీలు. 

స్వప్న, శ్రీవారి ముచ్చట్లు, సర్కస్ రాముడు, సర్దార్ పాపారాయుడు, సీతారాములు మొదలైనవి ఆ లిస్ట్ లోనివే. ఇంకో విశేషం ఏంటంటే - ఈ 15 సినిమాల్లో 2 హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. జ్యోతి బనే జ్వాల, యే కైసా ఇన్సాఫ్. 

రెనగేడ్ ఫిలిం మేకింగ్ అంటే అది. 

నిజంగా గురువుగారికి వందనం... అభివందనం! ఆయన రికార్డుల గురించి, ఆయన గురించి ఒక పుస్తకమే రాయొచ్చు.

కట్ టూ 2024 - 
 
ఫిలిం నెగెటివ్‌తో సినిమాలు చేసిన ఆ రోజుల్లో ఎడిటింగ్ నుంచి, ప్రతి ఒక్క శాఖలో పని చాలా ఎక్కువే. ఒక్కొక్క ఫిలిం ముక్క చేత్తో పట్టుకొని చూస్తూ, అతికించాల్సిన రోజులవి. ప్రతి చిన్న ట్రాన్సిషన్స్‌కు కూడా గంటలకి గంటలు, రోజులకి రోజులు మాన్యువల్‌గా పనిచేసిన రోజులవి.

అలాంటి రోజుల్లోనే, నెలకో సినిమా తీయగలిగినప్పుడు - ఇంత అడ్వాన్స్‌డ్ డిజిటల్-ఏఐ టెక్నాలజీ వచ్చిన ఈ రోజుల్లో, ఒక్కో సినిమాకు సంవత్సరాలు పడుతుండటం నిజంగా గమ్మత్తైన విషయం. 

గ్రాఫిక్ వర్క్‌లతో తీసే మాగ్నమ్ ఓపస్‌ల గురించి నేను మాట్లాడ్డం లేదు. మామూలు మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాల గురించి మాట్లాడుతున్నాను.  
 
దీనికి వంద రీజన్స్ చెప్పుకోవచ్చు మనం. కాని, అదంతే. 

- మనోహర్ చిమ్మని    

పి యస్: 
* ఇది నా పాత పోస్టే. ఈరోజు దీన్ని మళ్ళీ పోస్ట్ చేయడం వెనుక ఒక మంచి కారణం ఉంది. దాని గురించి తర్వాత మళ్ళీ ఇంకో పోస్టులో వివరంగా రాస్తాను.  

Thursday, 28 November 2024

మన ఆలోచనలు, మైండ్‌సెట్ యంగ్‌గా ఉన్నప్పుడు...


ఆమధ్య ఒక మోస్ట్ ట్రెండీ సబ్జెక్ట్‌తో "ఓకే బంగారం" తీసి, హిట్ చేసి, ఇటీవలే బ్యాక్ టు బ్యాక్ 2 ఎపిక్ హిస్టారికల్ బ్లాక్‌బస్టర్స్ ఇచ్చి, "నాయకుడు" తర్వాత 35 ఏళ్ళకు, కమల్‌హాసన్‌తో మళ్ళీ ఒక ఎపిక్ "థగ్ లైఫ్" ప్రారంభించిన మణిరత్నం వయస్సు 68. 

"వెస్ట్ సైడ్ స్టోరీ", "ది ఫేబుల్‌మాన్స్" సినిమాలను బ్యాక్ టు బ్యాక్ తీసి, మొన్నే 2022లో రిలీజ్ చేసిన స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఇప్పుడు మరో కొత్త సినిమా ప్లాన్‌లో ఉన్నారు. స్పీల్‌బర్గ్ వయస్సు 77. 2032 దాకా "అవతార్" 3, 4, 5 సినిమాలను ప్లాన్ చేసుకొని, ప్రస్తుతం ఒకవైపు "అవతార్ 3" పోస్ట్‌ప్రొడక్షన్ జరుపుతూ, మరోవైపు "అవతార్ 4" షూటింగ్ చేస్తూ, 2032లో రిలీజ్ ప్లాన్ చేసుకున్న "అవతార్ 5" క్రియేషన్ బిజీలో మునిగితేలుతూ తన క్రియేటివ్ జీవితపు ప్రతి నిముషం జుర్రుకొంటూ ఎంజాయ్ చేస్తున్న జేమ్స్ కెమెరాన్ వయస్సు 70. 

రంగీలా, కంపెనీ, సర్కార్ వంటి క్లాసిక్స్‌తో మెప్పించిన మేవరిక్ డైరెక్టర్ ఆర్జీవీ, ఆమధ్య పోర్న్‌స్టార్ మియా మల్కోవాతో "గాడ్, సెక్స్ అండ్ ట్రుత్" కూడా తీశాడు. ఏ కుర్ర డైరెక్టర్ కూడా పెట్టలేని కెమెరా యాంగిల్స్‌లో షాట్స్ పెట్టి "ఎంటర్ ది గాళ్ డ్రాగన్" తీసిన ఆర్జీవీ, తన క్రియేటివిటీని ఇప్పుడు పూర్తిగా ఒక అర్థం పర్థం లేని పొలిటికల్ మెస్‌కు అంకితం చేసుకున్నాడు అని అందరూ అనుకుంటూవుండగానే, కొత్తగా తన మార్క్ సినిమాల కోసం, ఒక మైండ్‌బ్లోయింగ్ "డెన్" ప్రారంభించి, మల్టిపుల్ సినిమాల్లో బిజీగా ఉన్నాడు. అవి ఏవైనా కానీ, అతనిష్టం. పని చేస్తున్నాడు. ఈ మేవరిక్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ వయస్సు ఇప్పుడు 62. "సర్కార్" అని ఫ్రెండ్లీగా ఆర్జీవీ పిలుచుకునే "బిగ్ బి" అమితాబ్ బచ్చన్ వయస్సు 82.  

సో వాట్?! 

నాగార్జునకు 65, చిరంజీవికి 69 అంటే ఎవరన్నా నమ్ముతారా? వారి ఫిజికల్ ఫిట్‌నెస్, మెంటల్ ఫిట్‌నెస్ ముందు ఇప్పటి యంగ్ హీరోలు ఎంతమంది పనికొస్తారు? మర్చిపోయాను... తన చిత్రాలకు, తనకు కలిపి 41 ఆస్కార్ నామినేషన్స్, 13 ఆస్కార్ అవార్డుల్ని ఖాతాలో వేసుకున్న ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు, దర్శకుడు క్లింట్ ఈస్ట్‌వుడ్ వయస్సుకి మామూలుగా అయితే అందరూ రిటైర్ అయిపోయి, మంచం మీద నుంచి లేవలేమని ఫిక్స్ అయిపోతారు. కాని, ఆయన తాజాగా వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ హౌజ్ కోసం "జూరర్ నంబర్ 2" అని కొత్త సినిమా ప్రారంభించారు, అయిపోవచ్చింది కూడా. క్లింట్ ఈస్ట్‌వుడ్ వయస్సు ఇప్పుడు జస్ట్ 94.  

ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్. మన ఆలోచనలు, మైండ్‌సెట్ యంగ్‌గా ఉన్నప్పుడు వయస్సు అనేది... జస్ట్ బుల్ షిట్. 

- మనోహర్ చిమ్మని  

(మొన్న 26/11/2024 నాడు, నా పుట్టినరోజు సందర్భంగా ఈ పాతపోస్టునే ఇప్పుడు మరోసారి ఫ్రెష్‌గా పోస్ట్ చేశాను.)

Wednesday, 27 November 2024

లక్ష్యం ఎప్పుడూ పెద్దదిగానే ఉండాలి!


అమెరికాలో ఒక దివాలా తీసిన వ్యక్తి - సర్వస్వం కోల్పోయి, పీకలదాకా అప్పుల్లో కూరుకుపోయిన స్థితి నుంచి, కేవలం మూడేళ్లలో 600 మిలియన్ల డాలర్లు సంపాదించాడు. అంటే, మన ఇండియన్ కరెన్సీలో సుమారు 5066 కోట్లు అన్నమాట!

"ఇదెలా సాధ్యమయ్యింది?" అని ఆయన్ని ప్రశ్నించినపుడు ఆ రహస్యాన్ని ఆయన కేవలం ఒకే ఒక్క వాక్యంలో చెప్పాడు - "నేను ఎప్పటినుంచయితే భారీ స్థాయిలో ఆలోచించటం మొదలెట్టానో, ఆ క్షణం నుంచే నా జీవితం పూర్తిగా మారిపోయింది!" 

ఆ తర్వాత ఆ వ్యక్తి ఇంకెన్నో వందల కోట్లు సంపాదించాడు. క్రమంగా ఒక మిలియనేర్ ట్రెయినర్ గా మారిపోయి, ఆ రంగంలోనూ కోట్లు సంపాదించాడు. అతనే బ్రయాన్ ట్రేసీ. ఇదంతా కొన్ని దశాబ్దాల క్రిందటి విషయం. ఇలాంటి విజయాలు మన దేశంలో కూడా వందలకొద్దీ రికార్డ్ అయి ఉన్నాయి.    

ఇక్కడ భారీ స్థాయిలో ఆలోచించడం అంటే "థింకింగ్ బిగ్" అన్న మాట. సక్సెస్ సైన్స్ కు సంబంధించి ఈ రెండు పదాలకి చాలా అర్థం ఉంది. ఇంట్లో ముసుగుతన్ని పడుకొని, పగటి కలలు కనడం, ఆకాశానికి నిచ్చెనలు వేయడం "థింక్ బిగ్" ఎప్పుడూ కాదు.

క్యాలిక్యులేటెడ్ రిస్క్ తో అతిపెద్ద లక్ష్యాల్ని నిర్దేశించుకొని, సంపూర్ణ సామర్థ్యంతో కృషి చేయడమే క్లుప్తంగా దీని నిర్వచనం.

కట్ చేస్తే -   

సినిమాల్లో అవకాశాల కోసం, గతంలో లాగా దశాబ్దాల పాటు వెతుక్కుంటూ సమయం వృధాచేసుకునే కాలం కాదిది.

ఇది డిజిటల్-సోషల్ మీడియా యుగం.

సరిగ్గా ప్లాన్ చేసుకుని, ఒక బ్లూప్రింట్‌తో కష్టపడితే ఏదీ అసాధ్యం కాదు. ఎన్నో రంగాల్లో, ఎందరో, ఎన్నెన్నో భారీ విజయాల్ని ఇలా సాధించి చూపిస్తున్నారు. యాక్టింగ్ రాదు అని ట్రోల్స్ చేయబడ్డ ఒక వర్ధమాన హీరో ఒకే ఒక్క శుక్రవారం తన జాతకం తానే మార్చేసుకుని, ఇప్పుడు పది కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.

ఇది సినిమాల్లో మాత్రమే సాధ్యం.  

సో, జర్నీకి కొంత టైమ్ పట్టొచ్చు. కాని, లక్ష్యం ఎప్పుడూ పెద్దదిగానే ఉండాలి.

- మనోహర్ చిమ్మని                             

Tuesday, 26 November 2024

కొన్ని జ్ఞాపకాలు బాగుంటాయ్! కానీ...


నా తొలి సినిమా హీరో రాజా, నేనూ ఇప్పుడు అసలు టచ్‌లో లేము. కాని, ఆ సినిమా ప్రీప్రొడక్షన్ సమయంలోనూ, షూటింగ్ జరుగుతున్నన్ని రోజులూ, ఆ తర్వాత సినిమా రిలీజయ్యేవరకూ... హీరో రాజాతో ముఖ్యంగా నాకు, మా టీమ్‌కు ఎన్నో మంచి మెమొరీస్ ఉన్నాయి. 

* మారుతీ వ్యాన్‌లో మౌంట్ ఒపెరాకు వెళుతూ/వెళ్లాక (డాన్స్ మాస్టర్ నిక్సన్‌తో కలిసి) నేను, రాజా పార్టీ చేసుకోవటం. 
* ప్యారడైజ్ చౌరస్తా నుంచి  నేను, రాజా అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లి ఒక హోటల్లో లంచ్ చేయటం. అప్పటికే రాజా మూడు సినిమాలు చేసి ఉన్నాడు! (ఓ చినదానా, అప్పుడప్పుడు, విజయం)
* షూటింగ్ కోసం మారిషస్ కు రెండు వారాలు వెళ్లినప్పుడు, ఒక టీం మెంబర్‌గా ఎలాంటి ఈగో లేని అతని కోపరేషన్.
* కెమెరా లెన్సులున్న బరువైన బాక్స్‌ని తన తలమీద పెట్టుకొని, టీమ్‌తో పాటు కనీసం ఒక మైలు దూరం సముద్రం అంచులవెంట రాళ్లమీద నడవటం.
* కాల్షీట్ టైమింగ్స్ లేకుండా, మారిషస్‌లో చాలా సరదాగా ఆడుతూ పాడుతూ షూటింగ్‌లో పాల్గొనటం, అందర్నీ ఉత్సాహపర్చటం.
* షూటింగ్ సమయంలో, బీచుల్లోని వేడికి బాగా నల్లబడిన నా ముఖానికి తనదగ్గరున్న కాస్మెటిక్స్ ఏవేవో పూసి, రాజా స్వయంగా రెండుమూడుసార్లు నాకు ఫేషియల్ చేయటం. 
* "మనోహర్ గారూ.. డైరెక్టర్ గారూ" అంటూ, ఇంగ్లిష్ యాక్సెంటుతో కూడిన తనదైన వాయిస్‌తో గౌరవంగా పిలవటం. 
* కొత్త సీన్ చేస్తున్న ప్రతిసారీ నా స్క్రిప్టుని పదే పదే మెచ్చుకోవడం.  
* అన్నపూర్ణ స్టూడియోలో ఒక మంచి ఎమోషనల్ సీన్  చేస్తున్నపుడు చనిపోయిన వాళ్ల అమ్మగారు గుర్తుకొచ్చి కన్నీళ్లు పెట్టుకోవటం. ఆ ఉద్వేగంలోనే, సెట్లో ఒక మూలన ఉన్న నా దగ్గరకు వచ్చి  "మీతో ఇంకో సినిమా తప్పకుండా చేస్తాను" అని చెప్పటం... ఇలా రాజాతో నాకూ, మా టీమ్‌కు చాలా మంచి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి.      

చాలా గ్యాప్ తర్వాత, ఒకసారి ది సేమ్ రాజాని మణికొండలోని తన కొత్త ఇంట్లో కలిశాను. అదే పలకరింపు. అదే మర్యాద. అదే చిరునవ్వు. "సినిమాల్లో నేను డబ్బు సంపాదించలేదు. పోగొట్టుకున్నాను. ఇప్పుడు సినిమాలు చేయాలన్న అవసరం కూడా  లేదు నాకు. లైఫ్ చాలా హాయిగా ఉంది" అన్నాడు క్రైస్తవ మత ఉపన్యాసకుడుగా ప్రస్తుతం బిజీగా ఉన్న రాజా. రాజాకు సేవాభావం ఎక్కువ. ఆ మధ్య ఒక ఫౌండషన్ కూడా ప్రారంభించాడు. 

కట్ చేస్తే -

కారణం నాకు తెలీదు కాని, రాజా ఇచ్చిన చాలా ఇంటర్వ్యూల్లో తను పనిచేసిన అందరు డైరెక్టర్ల పేర్లు చెప్పాడు కాని, నా ఒక్కడి పేరే ఎందుకో ఎప్పుడూ చెప్పలేదు!  

- మనోహర్ చిమ్మని  

Monday, 25 November 2024

Happy Birthday to Me!


ఇంకొన్ని గంటల్లో నా పుట్టినరోజు.

నేనేం పెద్ద సెలబ్రిటీ కాదు.

కానీ, ఫేస్‌బుక్ టైమ్‌లైన్ ఓపెన్ పెట్టాలి. వాట్సాప్‌లు, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్/ట్విట్టర్లు చూసుకొంటూ ఉండాలి. ఫోన్‌కు అందుబాటులో ఉండాలి. మిత్రులు, ఆత్మీయుల గ్రీటింగ్స్‌కు రెస్పాండ్ అవుతుండాలి. 

నా మిత్రులు, శ్రేయోభిలాషులైనవారందరి శుభాకాంక్షలను నేను తప్పక గౌరవిస్తాను. వారి అభిమానానికి సర్వదా కృతజ్ఞుణ్ణి. కానీ, ఎక్కువభాగం, ఇదంతా ఒక అనవసరమైన ఆబ్లిగేషన్, హిపోక్రసీ, అనవసరంగా కొనితెచ్చుకొనే ఒక మానసిక వత్తిడి... అని నాకనిపిస్తుంది. 

నేను కరెక్టు కాకపోవచ్చు, కాని నాకు మాత్రం అలాగే అనిపిస్తుంది. 

కొన్ని తప్పవు. అంతే. 

కట్ చేస్తే -

ఈసారి నా పుట్టినరోజు నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే పుట్టినరోజు అవుతుంది. ఎందుకంటే, ఈ పుట్టినరోజు నేపథ్యంగా, దాదాపు ఒక 40 రోజుల క్రితమే, ఒకటి రెండు చాలా పెద్ద నిర్ణయాలు తీసుకున్నాను... వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కూడా. గట్టిగా సంకల్పించాను. సాధిస్తాను కూడా. 

Wish me the best. 

- మనోహర్ చిమ్మని 

అసలు సినిమా ఇలా ఉంటుంది!


నా మొదటి సినిమాలో ఒక కొత్త నటున్ని ఫుల్ లెంగ్త్ పవర్‌ఫుల్ మెయిన్ విలన్ రోల్‌లో పరిచయం చేశాను. అతను నిజంగా చాలా మంచి నటుడు. చాలా బాగా చేశాడు. నేననుకున్న కథ ప్రకారం సినిమా చివర్లో కూడా హీరోకంటే ఎక్కువ వెయిటేజ్ ఆ విలన్ కేరెక్టర్‌కే ఇచ్చాను.

ఇలా చేయడం వల్ల నేను ఆ విలన్ దగ్గర బాగా డబ్బులు తీసుకున్నానని అప్పట్లో ఆ చిత్రంలోని హీరో అనుకోవడం, అతన్లోని ఆ ఫీలింగ్‌ను పైకే అనడం కూడా జరిగింది.

అప్పట్లో ఆ హీరో నేనూ మంచి ఫ్రెండ్స్. మధ్యలో కొందరుంటారుగా... చెడగొట్టారు. అది వేరే విషయం. దాని గురించి తర్వాత రేపటి బ్లాగ్‌లో చెప్తాను.       

కట్ చేస్తే - 

ఇప్పుడా విలన్ ఓ మాదిరి మంచి పొజిషన్‌లోనే ఉన్నాడు. ఇండస్ట్రీలోని కొన్ని సహజ లక్షణాల నేపథ్యంలో మేం అసలిప్పుడు టచ్‌లో లేము. టచ్‌లో ఉన్నా లేకపోయినా, నేను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నటుడు కాబట్టి నాకు నిజంగానే సంతోషంగా ఉంటుంది. ఆ నటునిపట్ల, అతని నటనపట్ల నా అలోచన మారదు, వ్యక్తిగా అతని పట్ల నా గౌరవం మారదు. 

ఇండస్ట్రీలో ఇన్నేళ్ళుగా ఉన్నాడు. బాగున్నాడు. అదే నా సంతోషం. ఇంతకు మించి నేను ఆలోచించను. వేరే ఆశించను. 

అయితే... ఆమధ్య ఒక మిత్రుడు చెప్పాడు. ఆ నటుని ఇంటర్వ్యూ ఒక దినపత్రిక ఆదివారం ఎడిషన్లో వచ్చింది. ఎవరెవరి గురించో చెప్పాడు కానీ... తొలి అవకాశం ఇచ్చి, ఇండస్ట్రీకి  పరిచయం చేసి, అంత పూర్తిస్థాయి మెయిన్ విలన్ రోల్ ఇచ్చిన నీ పేరు చెప్పలేదు ఆ నటుడు అని!   

నేను నవ్వాను. 
ఇదంతా ఉట్టి ట్రాష్. 
ఇలాంటివి అసలు పట్టించుకోకూడదు.
ఇక్కడ ఎవరు లైమ్‌లైట్‌లో ఉంటే వాళ్లే తోపులు. 
అసలు సినిమా అంటేనే ఇది.    

- మనోహర్ చిమ్మని  

Sunday, 24 November 2024

సినిమా తీసి చూడు!


"ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు" అన్నారు. కానీ, "సినిమా తీసి చూడు" అని మాత్రం ఎవరూ అనలేదు. అనలేకపోయారు. ఎందుకంటే, ఇది ఆ రెండింటి కంటే చాలా కష్టం. అంత ఈజీ కాదు.    

ఈజీ కాదు అంటే ఇక్కడ విషయం డబ్బు ఒక్కటే అని కాదు. చాలా ఉంది. అన్ని వ్యాపారాల్లానే సినిమా కూడా ఇప్పుడు ఒక వ్యాపారమే. కాకపోతే ఇదొక కళాత్మక వ్యాపారం. బిగ్ బిజినెస్. అంతిమంగా దీని గోల్ కూడా సేమ్ టూ సేమ్... రూపాయి పెడితే నాలుగు రూపాయలు లాభం రావాలన్నదే. ఇందులో ఎలాంటి డౌట్ లేదు.

మొన్నటివరకూ మన చుట్టూ సమాజంలో ఒక గుడ్డి వాదన ఉండేది. ఏ వ్యాపారంలో అయినా పెట్టుబడి పెట్టొచ్చు కానీ, సినిమాల్లో పెట్టొద్దు అని. ఇదొక "హెవీ గ్యాంబ్లింగ్" అని వాళ్ల ఉద్దేశ్యం. ఆ మాటకొస్తే, అసలు వ్యాపారమే ఒక గ్యాంబ్లింగ్. మన జీవితమే ఓ పెద్ద గ్యాంబ్లింగ్. ఈ నిజాన్ని ఇప్పటి తరం బిజినెస్‌మెన్ గుర్తించారు కాబట్టే "అబ్బో సినిమాల్లోనా!" అని ఇంతకుముందులా భయపడ్డంలేదెవ్వరూ.  

సినిమా ప్రొడ్యూసర్లలో 41 శాతం మంది ఎప్పుడూ లాభాల్లో ఉంటారు. ప్రపంచంలోని ఏ ఇతర బిజినెస్‌లతో పోల్చుకున్నా, సినిమా బిజినెస్‌లోని ఈ సక్సెస్ రేటు ఇంకే బిజినెస్‌లో లేదు.  

సినిమా తీయడానికి డబ్బొక్కటేకాదు, గట్స్ కావాలి. అవసరం లేనివాటికి అనవసరంగా టెంప్ట్ కాకుండా, ఫీల్డుమీద కొంచెం అవగాహనతో, మార్కెట్ స్టడీ చేస్తూ సినిమాలు చేస్తే మాత్రం ఎలాంటి భయాలు ఉండవు, నష్టాలుండవు.  

కట్ చేస్తే - 

సినిమా ఫీల్డులో ఉండే కొన్ని అద్భుత లాభాలు మరే ఇతర వ్యాపారంలోనూ లేవు. ఇతర అన్ని వ్యాపారాల్లో బాగా డబ్బు సంపాదించొచ్చు. కానీ, రాత్రికిరాత్రే ఫేమ్‌నూ, ఒక సెలబ్రిటీ హోదానూ, ప్రపంచవ్యాప్త గుర్తింపునూ తెచ్చుకోవడం మాత్రం ఒక్క సినిమాల్లోనే సాధ్యం. అంటే - మిగిలిన అన్ని బిజినెస్‌లలో డబ్బు సంపాదించుకోగలుగుతారు. కాని, ఫేమ్ రాదు.   

అదే ఫిలిం బిజినెస్‌లో అయితే - ఒక 40 టీవీ చానెళ్ళూ, అన్నీ కలిపి మరో 200 వెబ్‌సైట్స్, ఫిల్మ్ మేగజైన్స్, న్యూస్ పేపర్లు, యూట్యూబ్ చానెళ్ళు, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్... ఇవన్నీ ఓవర్‌నైట్‌లో మిమ్మల్ని ఒక రేంజ్‌కు తీసుకెళ్తాయి. ఈ అడ్వాంటేజ్ ప్రపంచంలోని మరే ఇతర బిజినెస్‌లో లేదు.   

దటీజ్ సినిమా.  

- మనోహర్ చిమ్మని     

Saturday, 23 November 2024

మనం చేసుకోగలిగే పనికి అవుట్‌సోర్సింగులు అవసరమా?


మనం ఎంతో మంచి ఉద్దేశ్యంతో పరోక్షంగా వారి అప్పటి అవసరానికి సహాయంచేస్తూ ఒక అవకాశం ఇస్తాం. ఆరోజు నిజంగా వారికి అవసరం కదా అని, అప్పటికప్పుడు వాళ్ళు అడిగిందానికి డబుల్ ఇస్తాం. 

మాట ప్రకారం మనం ఇచ్చిన పని మరింత ఇంకా వేగంగా చేస్తారు కదా అనుకుంటాం.

కాని, అలా జరగదు.  

కట్ చేస్తే - 

మనం ప్రయారిటీలో వెనక్కి వెళ్ళిపోతాం. కొత్త కమిట్‌మెంట్స్ పైకొస్తాయి. 

అంతా మర్చిపోతారు. మనం గుర్తుచేస్తేనే స్పందిస్తారు. వాళ్ళేదో మనకు సహాయం చేస్తున్నట్టు ఉంటుంది బిల్డప్. వాళ్ళ ప్రయారిటీలో మనం ఎక్కడికో అడుక్కి వెళ్ళిపోతాం. అసలు ఆ లిస్టులో మనం ఉన్నామా లేదా అన్న డౌట్ కూడా వస్తుంది.  

ఇలాంటి ఫేవర్స్ ఇంకా అవసరమా అన్నది బిగ్ కొశ్చన్. 

జరిగిన నష్టం చాలు, ఇదొక ఫైనల్ లెస్సన్ అనుకొని ఫ్యూచర్లో కొంచెం వొళ్ళు దగ్గరపెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం బెటర్. 

ఫినిషింగ్ టచ్ ఏంటంటే, అది మనకు చేతనైన పని. మన ఫస్ట్ ప్యాషన్. మనం ప్రూవ్ చేసుకున్న ప్రొఫెషన్. 

మనకు డబ్బులెక్కువయ్యాయా అన్నట్టుగా, ఆ పని మనం బయటివారికి అవుట్‌సోర్సింగ్ ఇవ్వటం ఏదైతే ఉందో... చివరికి ఇలాంటి బ్లాగులు రాసుకోడానికి కారణమవుతుంది... ఇంకోసారి ఇలాంటి మహాపరాధాలు చెయ్యకుండా!   

- మనోహర్ చిమ్మని      

నేను ఊహించని బహుమతి


అంతకు ముందు నా పుట్టినరోజుల్ని నేను పెద్దగా పట్టించుకొనేవాన్ని కాదు. ఈమధ్య మాత్రం బాగానే పట్టించుకుంటున్నాను. పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోవాలని మాత్రమే కాదు... 

నేను ఎంత పెద్దవాన్నయిపోతున్నానో గుర్తుచేసుకోడానికీ, నన్ను నేను చాలా విషయాల్లో అలర్ట్ చేసుకోడానికీ. 

ఈసారి మరింత బాగా గుర్తుపెట్టుకున్నాను నా పుట్టినరోజుని. ఎందుకంటే, ఈ పుట్టినరోజు నేపథ్యంగా, దాదాపు ఒక నెల క్రితమే, ఒకటి రెండు చాలా పెద్ద నిర్ణయాలు తీసుకున్నాను... వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కూడా. 

అందుకే, ఈసారి నా పుట్టినరోజు నాకు చాలా ముఖ్యమైంది.  

కట్ చేస్తే - 

ఈసారి నా పుట్టినరోజుకి సుమారు 14 వేల కిలోమీటర్ల దూరం నుంచి ఒక ప్రత్యేక అతిథి వస్తున్నాడు. ఇది నేను ఊహించని బహుమతి.   

- మనోహర్ చిమ్మని  

Friday, 22 November 2024

నిన్ను ప్రేమించేవారిని గురించి ఆలోచించు...


మన జీవితంలోని ఏ దశలోనైనా, మన చుట్టూ ఉన్నవారిలో...  30 శాతం మందే మనల్ని ప్రేమిస్తారు. 30 శాతం మంది మనల్ని ఇష్టపడరు , లేదా ద్వేషిస్తారు. మిగిలిన 40 శాతం మంది అసలు మన గురించి పట్టించుకోరు! 

ఎవరి గొడవలు వారికున్నాయి. ఇంకొకరి గురించి ఆలోచించే అంత తీరిక, ఓపిక ఎవరికీ లేవు.

ఒకవేళ ఎవడైనా అంత తీరిగ్గా మీ గురించి ఆలోచిస్తూ బయట కామెంట్ చేస్తున్నాడు అంటే అసలు వాడికేం పనిలేదు. వాడెందుకూ పనికిరానివాడని ఖచ్చితంగా అనుకోవచ్చు. 

అలాంటి నీ చుట్టుపక్కల ప్రపంచానికి భయపడి, ఎవరేమనుకుంటారో అని అనుకొంటూ, నువ్వు చెయ్యాలనుకున్న పని చక్కగా చెయ్యలేకపోతున్నావు అంటే ఆ తప్పు నీ చుట్టుపక్కల వారిది కాదు, నీది. 

నిన్ను ప్రేమించేవారిని గురించి ఆలోచించు,
నీ గురించి ఆలోచించు.
మిగిలిందంతా ఉట్టిదే... జస్ట్ బి యస్.  

- మనోహర్ చిమ్మని 

రిచ్ కిడ్స్, సెలబ్రిటీ కిడ్స్ చాలామందే ఉంటారు. కాని...


ప్రైమ్‌లో "ది రానా దగ్గుబాటి షో" రేపు నవంబర్ 23 నుంచి ప్రారంభమవుతోంది. ఇది ప్రతి శనివారం స్ట్రీమ్ అవుతుంది. ఇందులో పెద్ద గొప్పేముంది... సవాలక్ష టాక్ షోల్లో ఇదొకటి అనుకొంటున్నారా?

కాదు.

ప్రైమ్‌లో ఇది మొట్టమొదటి టాక్ షో. రానా అంతకు ముందు కూడా ఒక టాక్ షో చేశాడు. కాని, ఇది పూర్తిగా వేరే స్టయిల్, వేరే ఫ్లేవర్. స్క్రిప్ట్ ఉండదు, ఫిల్టర్స్ ఉండవు, ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా కూర్చొని, రొటీన్ టాక్ షోలకు భిన్నంగా ఫుల్ ఓపెన్ అప్ అయి మాట్లాడుకోడం!

ఈ సీజన్‌లో మొత్తం 8 ఎపిసోడ్‌లుంటాయి. తన సొంత బ్యానర్ "స్పిరిట్ మీడియా" ద్వారా రానా చేస్తున్న ఈ షోకు ప్రజెంటర్, క్రియేటర్ కూడా అతనే.  

దుల్కర్ సల్మాన్, రిషబ్ షెట్టి, నాగచైతన్య, సిద్దూ జొన్నలగడ్డ, శ్రీలీల, యస్ యస్ రాజమౌళి, రామ్‌గోపాల్‌వర్మ ఈ సీరీస్‌లో రానా షోలో పాల్గొంటున్నారు. ప్రతి ఎపిసోడ్ సుమారు 40 నిమిషాలుంటుందన్నది మామూలు విషయం. కాని, షోలో కంటెంట్ మాత్రం మామూలుగా ఉండదు.

ఇదంతా నేను ఒక న్యూస్ ఐటమ్‌గా రాయడం లేదు. ఇది ఎందుకు నాకిష్టమైన షో కాబోతోందో ఈ బ్లాగ్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 

అంతకు ముందు రానా అంటే "ఆ ఏముందిలే, అందరిలా అతనో రిచ్ కిడ్, సెలబ్రిటీ కిడ్" అనుకునేవాణ్ణి. కాని, రానా నిజంగా డిఫరెంట్. గత కొన్నేళ్ళుగా అతని కెరీర్‌ను, అతని యాక్టివిటీని అప్పుడప్పుడూ అనుకోకుండా గమనిస్తూండటం ద్వారా ఇలా నేను చెప్పగలుగుతున్నాను. వీటన్నిటినీ మించి, మొన్నీ మధ్య "రా టాక్స్ విత్ వీకే"లో రానా ఇంటర్వ్యూ చూశాక ఇది కన్‌ఫర్మ్ చేసుకున్నాను. సుమారు 2 గంటల 10 నిమిషాల ఆ వీడియోను నేను పూర్తిగా చూశానంటే... జస్ట్ రానా వల్లే.  

ఆ ఇంటర్వ్యూలో కొన్ని చమక్కులు, కొన్ని నగ్గెట్స్ చూడండి:  

* "హైద్రాబాద్‌ల ఉంటూ వెజ్ ఎట్ల తింటవ్ బాసూ నువ్వు?" 
* "మూడు నెలలు వెజ్ తిన్నాక, మళ్ళీ ఫస్ట్ టైమ్ నాన్-వెజ్ హలీమ్ తిన్నప్పుడు నా కళ్ళ వెంబడి నీళ్ళొచ్చాయి!"  
* "2005 లోనే నేనొక ఫిలిం ప్రొడ్యూస్ చేశాను. దాని పేరు: బొమ్మలాట. రెండు నేషనల్ అవార్డులొచ్చాయి. దాన్ని థియేటర్లో చూడ్దానికి మాత్రం జనం రాలేదు." 
* "I am a guy who likes to see things grow."
* "If I fail I can get my hands off and move."  
* "సినిమాల్లో 80 శాతం ఫెయిల్యూర్స్ ఎందుకు అంటే, ఇక్కడ ఎంట్రీ బారియర్స్ ఉండవు. ఎవరైనా సినిమా తీయొచ్చు."  
* "నీకున్న 5 మిలియన్ ఫాలోయర్స్ 'మా మొత్తం దేశ జనాభా' అని చెప్పింది నా ఫారిన్ ఫ్రెండొకమ్మాయి." 
* "నువ్వు మంచి చెప్తే ఎవ్వరు మెరిట్ ఇవ్వరు, వ్యూస్ రావు, డబ్బులు రావు."
* "Constantly you must create some sensational stuff."

ఇలాంటివి దాదాపు రానా మాట్లాడే ప్రతి వాక్యంలో వెరీ ఇంట్రెస్టింగ్‌గా మనకు దొరుకుతాయి. రానా ఎక్కువ మాట్లాడుతాడు అంటారు. కాని, నా ఉద్దేశ్యంలో, రానా ఎక్కువ మాట్లాడినా తక్కువ మాట్లాడినా, అందులో పనికొచ్చే స్టఫ్ కూడా చాలా ఉంటుందన్నది నేను గమనించిన విషయం.


కట్ చేస్తే - 

"And she said Yes" అని రానా ఒక ట్వీట్ పెట్టి, తన పెళ్ళి విషయంలో క్రియేట్ చేసిన సెన్సేషనల్ బజ్ మనం అంత త్వరగా మర్చిపోలేం. ఆర్జీవీ కూడా ఈమధ్యనే రానా గురించి ఒక ట్వీట్ పెడుతూ, "I am simply amazed at @RanaDaggubati‘s versatility in terms of the multiple hats he wears not limited to acting, producing, business, entrepreneuring, interviewing and only he and God knows what else" అన్నాడు. 

దటీజ్ రానా. 

రిచ్ కిడ్స్, సెలబ్రిటీ కిడ్స్ చాలామందే ఉంటారు. కాని, ఇలా రానా లాగా ఎప్పుడూ ఇంత హైపర్ యాక్టివ్‌గా ఉంటూ, ఇంత మల్టీ-ఫేసెటెడ్‌గా, అంత ఈజీగా ఎదగలేరు అన్నది నా పాయింట్. 

I wish "The Rana Daggubati Show" on Prime Great Success!   

- మనోహర్ చిమ్మని 

Thursday, 21 November 2024

నీ టైమ్ నీ చేతిలో ఉండాలంటే...


డబ్బు ముఖ్యం కాదు అని కొందరు ఏదేదో చెప్తుంటారు. అలాంటివాళ్ళు... అయితే ఇప్పటికే బాగా డబ్బు సంపాదించినవాళ్ళయినా అయ్యుండాలి. లేదంటే అసలు డబ్బు సంపాదించటం చేతకానివాళ్లయినా అయ్యుండాలి. 

కట్ చేస్తే - 

డబ్బు నీ చేతిలో ఉంటే, నీ టైమ్ నీ చేతిలో ఉన్నట్టే. నువ్వు చెయ్యాలనుకున్న పనే చేస్తావు. నీకిష్టం లేని పని చెయ్యవు. 

డబ్బు నీ చేతిలో ఉంటే, నీకు నచ్చని వాతావరణం నుంచి, నీకు నచ్చని వ్యక్తుల నుంచి క్షణంలో దూరంగా వెళ్ళిపోగలుగుతావు. 

డబ్బుంటేనే కదా ఎమర్జెన్సీలో నువ్వు హాస్పిటల్ బిల్స్ కట్టగలిగేది? ఇష్టమైనవి కొనుక్కోగలిగేది, ఇష్టమైనవాళ్లతో గడపగలిగేది, ఇష్టమైనట్టుగా బ్రతకగలిగేది కూడా డబ్బుంటేనే కదా?

డబ్బుంటేనే కదా అసలు నిన్ను ఎవడైనా పట్టించుకునేది?  

ఇంత ఫ్రీడం నీకిచ్చేది డబ్బే. అందుకే డబ్బు ముఖ్యం కాదు అని కథలు, కవిత్వం రాసేవాళ్ళకు, అలాంటి మాటలు చెప్పేవాళ్ళకు ముందు నువ్వు దూరంగా ఉండు. 

నీకు చేతనైన పనులన్నీ చెయ్యి. బాగా సంపాదించుకో. నీకు అవసరమైన ఫ్రీడంతో ఆనందంగా ఉండు.

- మనోహర్ చిమ్మని  

Sunday, 17 November 2024

నయనతార... ధనుష్... ఒక 3 సెకన్ల క్లిప్పు!


ఈమధ్య వరుసగా నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ ఓటీటీల్లో సెలబ్రిటీల మీద మంచి మంచి డాక్యుమెంటరీలు వస్తున్నాయి. సలీం-జావేద్‌ది ఒకటి చూశాం. తర్వాత యస్ యస్ రాజమౌళి డాక్యుమెంటరీ చూశాం. ఆర్జీవీ మీద కూడా ఒక డాక్యుమెంటరీ హాట్ హాట్‌గా రెడీ అవుతున్నట్టు చదివాను.   

లేటెస్టుగా, నెట్‌ఫ్లిక్స్‌లో "నయనతార - బియాండ్ ద ఫెయిరీ టేల్" అని... "సెల్ఫ్ మేడ్ హీరోయిన్" నయనతార సినీప్రయాణం, ఆమె విఫల ప్రేమలు, చివరికి తనని "నయన్ మేడమ్" అని పిలిచే యువ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌తో ఆమె పరిచయం, ఆమె స్నేహం, ప్రేమ, పెళ్ళి... ఇదంతా అత్యున్నత ప్రమాణాలతో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ డాక్యుమెంటరీగా రూపొందించారని చదివాను.

ఇందులో నాగార్జున, రానా, తాప్సీ, రాధికా శరత్ కుమార్, డైరెక్టర్ అట్లీ, ఉపేంద్ర వంటి సెలబ్రిటీలు కూడా కనిపించనున్నారు. 

ఈ డాక్యుమెంటరీ రేపు నవంబర్ 18 నాడు, "లేడీ సూపర్ స్టార్" నయన్ 40 వ పుట్టినరోజు సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది.  

కట్ చేస్తే - 

ఇది రాస్తున్న సమయానికి ఒక నాలుగు గంటల ముందు నయనతార తన ఇన్‌స్టాగ్రామ్‌లో హీరో ధనుష్‌ను ఉద్దేశిస్తూ ఒక సెన్సేషనల్ పబ్లిక్ లెటర్ పోస్ట్ చేసింది.

దాని సారాంశం ఏంటంటే - ఈ డాక్యుమెంటరీ కోసం, ధనుష్ ప్రొడ్యూసర్‌గా తాను హీరోయిన్‌గా చేసిన సినిమా "నానుమ్ రౌడీ దాన్" సినిమాలోంచి ఒక చిన్న క్లిప్ వాడుకోడానికి సుమారు రెండేళ్ళపాటు అతన్ని రిక్వెస్ట్ చేసి, చివరికి ధనుష్ పర్మిషన్ ఇవ్వడు అని ఫిక్స్ అయిపోయి, ఆ ప్రయత్నం ఇంక వదిలేసిందట నయనతార.

ఇప్పుడు ట్రయలర్ రిలీజ్ అవ్వగానే అదే ధనుష్ నుంచి నయన్‌కు లీగల్ నోటీస్ వచ్చింది. తాను ప్రొడ్యూస్ చేసిన సినిమాలోంచి 3 సెకన్ల క్లిప్ నయనతార పర్మిషన్ లేకుండా తన డాక్యుమెంటరీలో వాడుకొంది. సో, 10 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలి అని! 

తోటి సెలబ్రిటీ, టాప్ హీరోయిన్, ఒక డాక్యుమెంటరీ కోసం తాను నటించిన సినిమాలోని ఒక చిన్న క్లిప్ కోసం పర్మిషన్ అడిగితే, తమ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలున్నా, ఎంత శతృత్వం ఉన్నా ధనుష ఇవ్వాల్సింది. ఇవ్వలేదు. ఓకే. కాని, బయట ఆల్రెడీ అందుబాటులో ఉన్న ఒక చిన్న 3 సెకన్ల క్లిప్ తను వాడుకొంది. దానికి లీగల్ నోటీస్, 10 కోట్ల నష్టపరిహారం... ఇదంతా ఎంత నాన్సెస్?

ఇన్‌స్టాగ్రామ్‌లో నయనతార రాసిన పెద్ద లెటర్లో ఇంకా చాలా రాస్తూ ధనుష్‌ను ఏకిపడేసింది. ప్రముఖ డైరెక్టర్ కస్తూరి రాజా (ధనుష్ తండ్రి), డైరెక్టర్ సెల్వరాఘవన్ (ధనుష్ అన్న) కుటుంబంలోంచి వచ్చావు. ఈ లెటర్ ద్వారా నీ గురించి నీ వాళ్ళకు తెలియాలి అని రాసుకొచ్చింది నయనతార.

విఘ్నేశ్ శివన్ డైరెక్షన్లో, విజయ్ సేతుపతితో కలిసి తను నటించిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటం అసలు ధనుష్ జీర్ణించుకోలేకపోయాడట. ధనుష్ బయట స్టేజీ పైన మాట్లాడే దాంట్లో, తన అమాయక ఫ్యాన్స్ కోసం, కనీసం సగం అయినా పాటించాలి అంది. రెండేళ్ళుగా అడుగుతున్నా పర్మిషన్ ఇవ్వకుండా, బయట అందుబాటులో ఉన్న ఒక 3 సెకన్ల క్లిప్ వాడుకున్నందుకు నువ్వు 10 కోట్లు నష్టపరిహారం అడుగుతూ లీగల్ నోటీస్ పంపడమే నువ్వేంటో చెప్తోంది... అంటూ ధనుష్‌ను ఉతికి ఆరేసింది నయన్.  

కట్ చేస్తే - 

నిజానికి ఇదంతా కాపీరైట్ చట్టం ఇష్యూ కాదు. ధనుష్-నయన్‌లకు ఎక్కడో ఏదో బెడిసికొట్టింది. లేదా, ఇద్దరికీ ఏదో గొడవై ఉంటుంది. దానికి ధనుష్ వైపు నుంచి కక్ష సాధింపు మరీ ఇంతలా ఉండకూడదు. అప్పట్లో యస్ పి బాలు గారి మీద ఇళయరాజా వేసిన కాపీరైట్ కేసు కూడా ఇలాంటిదే.    

Wishing the Lady Superstar Nayanthara a Very Happy Birthday! Have a Wonderful Year Ahead!

- మనోహర్ చిమ్మని

Saturday, 16 November 2024

ఒక టీజర్ విధ్వంసం!


ఆయన సినిమానే ఒక స్పెషల్ జోనర్. 
ఆ జోనర్‌లో ఆయన్ని బీట్ చేసేవాడు లేడు. 
ఆయనొక ఒక సరదా మనిషి. చాలా మంచి వాడు. 
చేసేదొకటి చెప్పేదొకటి ఉండదు. అంతా ఒక్కటే.  
నో హిపోక్రసీకి బ్రాండ్ అంబాసిడర్ ఆయన!

ఆయన లైఫ్‌స్టయిల్ నాణేనికి కూడా 
"జీవించే జీవితం, జీవించాలనుకునే జీవితం" అని 
అందరిలా రెండు పార్శ్వాలుండవు. అంతా ఒక్కటే. 
ఒక్కటే లైఫ్ అన్నది బాగా తెలుసనుకుంటాను,
ఒక రేంజ్‌లో లైఫ్ ఎంజాయ్ చేస్తాడు. 
రెండు ముక్కల్లో సింపుల్‌గా చెప్పాలంటే 
'ఆర్జీవీ' కంటే అరవై రెట్లు ఎక్కువ.   

స్టేజీ మీద ఈ మాటంటే ఎవరు ఏమనుకుంటారో, 
ఎవరు ఎలాంటి అర్థాలు తీస్తారో, 
సోషల్ మీడియాలో ఏం ఆడుకుంటారో, 
పొలిటీషియన్స్ ఎలా వాడుకుంటారో... 
ఇవన్నీ ఆయనకు పట్టదు. పట్టాల్సిన పన్లేదు. 
డోంట్ కేర్... జస్ట్ *క్కాఫ్.  

తన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా 
'జోన్ అవుట్' అవ్వకుండా, 
తన ఆరాలో ఉండితీరాలనుకుంటాడు. 
ఎప్పుడూ ఒక ఫ్లోలో ఉంటాడు. 
అదే ఆయన జగ్గర్‌నాట్ స్టయిల్.  
మిగిలిందంతా జస్ట్ బుల్‌షిట్.   

అక్కడ యు యస్ లో అయినా, 
ఇక్కడ హైద్రాబాద్‌లో అయినా... 
పబ్బుల్లో ఆయన పాటలు మోత మోగుతుంటాయి.
ఆ ఫాన్స్, ఈ ఫాన్స్ అన్న తేడా లేకుండా 
అందరూ ఆయన పేరుని జై కొడుతుంటారు. 
తీన్మార్‌లో డాన్స్ చేస్తుంటారు. 
ఆయనొక మేనియా. ఆయనొక మ్యాజిక్. 
ఆయనే ఒక తాండవం.  

లైఫ్ ని ఎంజాయ్ చెయ్యడంలో  
ఈతరం యూత్ కూడా బహుశా ఆయనకు సరిపోరు. 
అందుకే అనుకుంటాను, ఈ మధ్యకాలంలో 
క్లబ్బులో, పబ్బుల్లో కూడా లాస్ట్ సౌండ్ 
ఆయన పేరే అవుతోంది... జై బాలయ్య!    

అఖండ అయినా, అన్‌స్టాపబుల్ అయినా 
డాకు మహరాజ్ అయినా,
మహరాజ్-కా-డాకు అయినా - 
ఆయన రేంజ్ వేరే... రీచ్ కావడం కష్టం.  

-మనోహర్ చిమ్మని



Friday, 15 November 2024

మీరు కొత్తవారా? న్యూ టాలెంటా?


ప్రపంచంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా… వారి జీవనశైలికి సంబంధించి రెండే రెండు దారులుంటాయి. ఎవరైనా సరే – ఆ రెండు దారుల్లోనే ఏదో ఒక దారిని ఎంచుకుంటారు.

మొదటి దారి – మనల్ని మనం చాలా తక్కువగా అంచనా వేసుకొని “ఏదో అలా” అన్నట్టుగా బతుకు వెళ్లదీయటం. రెండో దారి – మనలోని సంపూర్ణ సామర్థ్యాన్ని వినియోగించుకొంటూ, ఎప్పుడూ అనుకున్న పనినే చేస్తూ, అనుకున్న పధ్ధతిలోనే జీవిస్తూ, జయాపజయాల్ని స్థితప్రజ్ఞతతో స్వీకరిస్తూ, కష్టాల్లోనూ, సుఖాల్లోనూ జీవితాన్ని అనుక్షణం ఎంజాయ్ చేయడం.

మొదటి దారిలో – “నాకు రాదు”, “నాకు లేదు”, “ఇలా వుంటే చేసేవాణ్ణి”, “అలాగయితే సాధించేదాణ్ణి”… వంటి నెగెటివ్ థింకింగ్ సాకులన్నీ ఈ దారిలో పుష్కలంగా దొరుకుతాయి. తక్కువపని చేయటం, తక్కువ సంపాదించటం, సంతృప్తి లేకపోయినా ఉన్నామన్న భ్రమలో బ్రతకటం, ఏ విషయంలోనూ ఎక్కువగా ప్రయత్నించకపోవడం, వ్యక్తిగత వికాసానికి సంబంధించి గానీ, హాబీగా గానీ ఏమీ చదవకపోవడం, అసలు ఆలోచించకపోవడం… ఇదీ మొదటి దారిని ఎంచుకున్నవాళ్ల బతుకుబాట. ఆశ్చర్యంగా ప్రతివందమందిలో 95 మంది ఈ బాటనే ఇష్టపడతారు. దీనికి కారణాలు అనేకం.

రెండో దారిలో… ప్రతి విషయంలోనూ ఉత్సాహం, ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలన్న తపన. “ఇలాగే ఎందుకు చేయాలి.. ఇలాగే ఎందుకుండాలి?” అన్న ప్రశ్న. నిరంతర ఆలోచన. అవతలి వారికి “తలతిక్క”గా కనిపించే తమకు తామే ఏర్పరచుకున్న క్రమశిక్షణ. ఎప్పటికప్పుడు ఏదో ఒక లక్ష్యం ఏర్పర్చుకోవడం, దాన్ని సాధించాలన్న నిరంతర ఆసక్తిలో సజీవంగా ఉండటం. నచ్చిన ప్రతి పుస్తకాన్నీ చదవటం, ప్రతిదాన్నీ నిర్మాణాత్మకంగా ఆలోచించడం… ఇవన్నీ ఈ రెండో దారిని ఎన్నుకున్నవారి సాధారణ లక్షణాలు. 

అంతేకాదు. ఎప్పుడూ పని రాక్షసుల్లా కాకుండా, కుటుంబంతో, స్నేహితులతో తగినంత సమయం గడుపుతూ, ఆ సమయానికి ఒక గొప్ప విలువని తీసుకురావడం; చిన్నవి పెద్దవి ఎన్నో లక్ష్యాల్ని సాధించడం, బాగా సంపాదించడం, లేదా సంపాదించే ప్రయత్నంలో ముందుకెళ్తుండటం (అప్పుడప్పుడూ బాగా కోల్పోవడం కూడా!)... ప్రతిక్షణం సంపూర్ణ జీవితాన్ని గడపడం… ఇవన్నీ కూడా ఈ రెండవ దారిని ఎంచుకొన్న వాళ్ల జీవనశైలిలో ఒక భాగం.

ప్రతి వందమందిలో 5 గురు మాత్రమే ఈ బాటలో ఉంటారు. మనసులో మెరిసిన ప్రతి ప్రయోగం చేసుకుంటూపోతుంటారు. అది సఫలమైందా, విఫలమైందా అన్నది పట్టించుకోరు. ఆ ప్రాసెస్‌ను, ఆ జర్నీని ఇష్టపడతారు. కొన్నిసార్లు ఎదురుదెబ్బలు తగలొచ్చు, కాని ఫలితాలు విజయవంతంగా అవే ఫాలో అవుతుంటాయి. 

కట్ చేస్తే - 

సినిమా ఫీల్డులో కూడా అంతే. ఒక్క 5 శాతం మందే ఎప్పుడూ పనిలో బిజీగా ఉంటారు. 95 శాతం మంది పనిలేకుండా బిజీగా ఉంటారు.

మీరు కొత్తవారా? న్యూ టాలెంటా? రైటర్ కావాలనుకుంటున్నారా, డైరెక్టర్ కావాలనుకుంటున్నారా, యాక్టర్ కావాలనుకుంటున్నారా? సినిమా మీద నిజంగా మీలో అంత ప్యాషనుందా? ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంటరయ్యి, బాగా సంపాదిస్తూ, నిజంగా బిజీగా ఉండే ఆ 5 శాతం మందిలో మీరూ ఉండాలనుకొంటున్నారా? లేదా, మీకు తెలిసినవాళ్ళు ఎవరైనా ఇలాంటి ఆలోచనలో ఉన్నారా? రేపు ఇదే 'మనోహరమ్' డిజిటల్ డెయిలీ రెండో పేజీలో మా ఫుల్ పేజీ యాడ్ చూడండి... 

వెల్‌కమ్ టు ఫిలిం ఇండస్ట్రీ!    

-మనోహర్ చిమ్మని

***

(ఇది 'మనోహరమ్', డిజిటల్ డెయిలీ కోసం రాసిన పోస్టు.)

Thursday, 14 November 2024

టాలెంట్ ఒక్కటే కాదు... ఇంక చాలా ఉంది!


హాలీవుడ్‌ను 'ల్యాండ్ ఆఫ్ డ్రీమ్స్" అంటారు.

అక్కడికి ఏటా కనీసం 100,000 మందికి తక్కువ కాకుండా వస్తారు ఆర్టిస్టులూ టెక్నీషియన్లూ. వాళ్లల్లో కేవలం 1 నుంచి 2 శాతం మందికి మాత్రమే సినిమాల్లో ఏదో ఒక అవకాశం దొరుకుతుంది. మిగిలినవాళ్లంతా కనీసం ఒక సంవత్సరం నుంచి, కొన్ని దశాబ్దాలపాటు నానా కష్టాలు పడి, వెనక్కివెళ్ళిపోతారు.

ఇలా వెళ్ళిపోయినవాళ్లంతా అదే హాలీవుడ్‌ను 'ల్యాండ్ ఆఫ్ బ్రోకెన్ డ్రీమ్‌స్' అని తిట్టుకుంటారు.  

పైనచెప్పిన ఇదే లెక్క ప్రపంచంలోని అన్ని సినిమా ఇండస్ట్రీలకు వర్తిస్తుంది. మన బాలీవుడ్, టాలీవుడ్‌లు కూడా అందుకు మినహాయింపు కాదు.

సినిమా పుట్టినప్పటినుంచి ఇప్పటిదాకా అంతే. ఇకముందు కూడా అంతే.

ఇక్కడ సక్సెస్ అనేది ఎప్పుడూ కేవలం 2 నుంచి 5 శాతం లోపే. ప్రపంచంలోని ఏ సినీ ఇండస్ట్రీలోనయినా, ఏ పీరియడ్‌లోనయినా... ఇండస్ట్రీలోని ప్రతి విభాగంలో, కేవలం వేళ్లమీద లెక్కించగలిగిన ఒక డజన్ మంది మాత్రమే సక్సెస్‌లో ఉంటారు. ఆర్టిస్టులయినా, టెక్నీషియన్లయినా అంతే. మిగిలినవాళ్లంతా పనిలేకుండా ఎదురుచూస్తుండాల్సిందే. లేదంటే, ఏదోవిధంగా వెనుదిరగాల్సిందే. 

ప్రొడక్షన్ విషయానికొస్తే, ఒక అంచనా ప్రకారం, సినిమాల సక్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా 41 శాతం మంది లాభాల్లో ఉంటారు, 59 శాతం మంది నష్టాల్లో ఉంటారు.

అర్టిస్టులయినా, టెక్నీషియన్లయినా, ప్రొడ్యూసర్లయినా, డైరెక్టర్స్ అయినా... ఈ స్టాటిస్టిక్స్‌ను, ఈ వాస్తవాలను గ్రహించినవాళ్లు జాగ్రత్తపడతారు. ఒక అవగాహనతో, కాలిక్యులేటెడ్ రిస్క్‌తో దూకుడుగా ముందుకు దూసుకెళ్తుంటారు.

భయపడేవాళ్ళు, భ్రమల్లో బతికేవాళ్లు మాత్రం సినిమాకష్టాలు పడుతూ అక్కడే కొనసాగుతుంటారు. ఈలోగా జీవితం కొవ్వత్తిలా కరిగిపోతుంది.   

కట్ చేస్తే - 

ఇండస్ట్రీకి బయట ఉండి, యూట్యూబ్ థంబ్‌నెయిల్స్‌ను నమ్మే అమాయకులకు తెలిసిన ఫిలిం ఇండస్ట్రీ వేరు. నిజమైన ఫిలిం ఇండస్ట్రీ వేరు.

టు బి ఫ్రాంక్, ఫిలిం ఇండస్ట్రీ మంచిదే. దాని సిస్టమ్ దానిది. ఆ సిస్టమ్‌లో ఇమడగలిగినవాడే ఇక్కడ పనికొస్తాడు.

ఇక్కడ టాలెంట్ ఒక్కటే కాదు పనిచేసేది. దాన్ని మించి పనిచేసేవి చాలా ఉంటాయి. వాటిల్లో ముఖ్యమైనవి ఒక మూడున్నాయి: 

* నెట్‌వర్క్.
* మనీ.
* మానిప్యులేషన్స్.

పైన చెప్పిన మూడింటిలో కనీసం ఏ రెండింటిలోనయినా ఎక్స్‌పర్ట్ అయినవాడు మాత్రమే ఇక్కడ సక్సెస్ సాధిస్తాడు.   

- మనోహర్ చిమ్మని       

Wednesday, 13 November 2024

టీమ్ అంతా ఎక్కడ కలిస్తే అదే ఆఫీస్!


కేఫే మిలాంజ్. కాఫీడే. కేబీఆర్ పార్క్. నెక్లెస్ రోడ్డు. ఐమాక్స్ లాబీలు. జీవీకేవన్-ఫోరమ్-ఇనార్బిట్ మాల్స్. ట్యాంక్ బండ్. యాత్రి నివాస్. సినీ ప్లానెట్... ఈ డిజిటల్ & సోషల్ మీడియా యుగంలో... ఇండిపెండెంట్ సినిమాలకు ఇప్పుడు ఇవే నిజమైన ఆఫీసులు!

ఇంతకుముందులా కాకుండా, సినిమా నిర్మాణానికి సంబంధించిన పని ఏదయినా ఇప్పుడు ఊహించని విధంగా సూపర్‌ ఫాస్ట్‌గా జరిగిపోతున్న రోజులివి. మొబైల్, వాట్సాప్, ఫేస్‌బుక్, ఈమెయిల్, స్కైప్, జూమ్... ఇలా ప్రతి ఆధునిక మీడియా సాధనం సినిమా నిర్మాణానికి ఏదోరకంగా బాగా ఉపయోగపడుతోంది.

ఇవన్నీ పక్కనపెట్టి, ఇదివరకులా పాత చింతకాయ పచ్చడి పధ్ధతిలో, ఎప్పుడూ ఒకే నాలుగు గోడల మధ్య పని చేయడానికి ఎవరూ ఇష్టపడటంలేదు.  

కొత్త నటీనటులు, టెక్నీషియన్ల ఎన్నిక దాదాపు ఆన్‌లైన్ ద్వారానే జరిగిపోతోంది. ఫోటోలు, వీడియో క్లిప్స్ ఆన్‌లైన్లో అందుబాటులో ఉన్నప్పుడు, ఇంక ప్రత్యేకంగా ముంబై, ఢిల్లీ లకు వెళ్లాల్సిన అవసరమే లేదు. స్క్రీన్‌టెస్టులంటూ వారాలకి వారాలు అవుటాఫ్ ద సిటీ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. అయితే - వీటి ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసుకున్నవాళ్లని ఫైనల్ చేసుకోడానికి మాత్రం ఒక్కసారి డైరెక్ట్ ఆడిషన్ అవసరమౌతోంది. దానికి కూడా ఎక్కడికెళ్తే అక్కడ ప్రత్యేకంగా ఆఫీస్ అవసరం ఎంతమాత్రం లేదు.

ఇక కథా చర్చలు, ప్రొడక్షన్ డిజైనింగ్, షెడ్యూలింగ్ లాంటి ప్లానింగ్స్ అన్నీ కాఫీడేల్లో, నెక్లెస్ రోడ్ చెట్లక్రింద, ఐమాక్స్‌లో... ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా స్మూత్‌గా చేసుకోవచ్చు. కేవలం సినిమా షూటింగ్ సమయంలో మాత్రం ఒక్క నెలపాటు... ఏ గెస్ట్‌హౌజ్‌ లోనో, లేదంటే... ఓనర్స్ అభ్యంతర పెట్టని ఏ బ్యాచిలర్ పెంట్ హౌస్ లోనో, లేదంటే... ఓ నెల పాటు ఒక ఎయిర్ బి ఎన్ బి ఇండిపెండెంట్ హౌజ్ తీసుకొని గాని పనులు పూర్తిచేసుకోగలిగితే చాలు. (లొకేషన్స్ వేరే అన్న విషయం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.)

పోస్ట్ ప్రొడక్షన్‌కి మళ్లీ మామూలే. ఎక్కడ పని జరుగుతోంటే అక్కడే అవసరమైన టీమ్ మెంబర్లు వాలిపోతారు. అంతే. ఫైనల్ కాపీ రెడీ! ఇక బిజినెస్ కోసం అయితే అసలు ఆఫీసే అక్కర్లేదు!!  

సో... ఇప్పుడంతా కేఫే మిలాంజ్, నెక్లెస్ రోడ్డు, ఐమాక్స్ లాబీలు, ట్యాంక్ బండ్, యాత్రి నివాస్, సినీ ప్లానెట్, కాఫీడేలు, ఇరానీ హోటల్లూ, పార్కులు, బ్యాచిలర్ రూముల్లోనే మన "చిన్న సినిమా"లనబడే "ఇండిపెండెంట్ సినిమా"ల ప్లానింగ్, వర్క్ అంతా జరిగిపోతోంది. ఎప్పుడూ డైనమిక్‌గా ఉండి, ఎనర్జీ లెవెల్స్ పెంచే ఇంతమంచి నేచురల్ లొకేషన్స్‌ని మించిన ఆఫీస్ ఏముంటుంది? ఇలాంటిచోట్ల పని జరిగినప్పుడే ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు మెరుపుల్లాంటివి వస్తాయి. పైగా, నెలకో లక్ష రూపాయలు ఆఫీసు మెయింటేన్ చేసే ఖర్చులు మిగుల్తాయి. ఆ లక్షతో హాయిగా ఒక పూట షూటింగ్ చేసుకోవచ్చు!   

ఇదంతా హాలీవుడ్లో ఎప్పట్నుంచో ఉంది. ఇప్పుడూ ఉంది. కేన్స్ వంటి ఫిలిం ఫెస్టివల్స్‌లోనూ, హాలీవుడ్‌లోనూ సంచలనాలు సృష్టించిన "ఎల్ మరియాచి", "బ్లెయిర్‌విచ్ ప్రాజెక్ట్", "పారానార్మల్ యాక్టివిటీ", "బిఫోర్ సన్‌రైజ్", "ఫర్ లవర్స్ ఓన్లీ", "న్యూలీ వెడ్స్"... వంటి ఎన్నో ఇండిపెండెంట్ సినిమాలకు వాటి నిర్మాణ సమయంలో ఆఫీసుల్లేవు!

అయితే, ఇన్వెస్టర్స్ పాయింటాఫ్ వ్యూలో - ఇక్కడ మనం గొప్పల కోసం షో చేసుకోవటమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఇదంతా ఎవరూ పాటించరు. ఎవరూ నమ్మరు. కానీ, నిజం మాత్రం ఇదే.

నేను కూడా అప్పట్లో నా టీమ్‌తో కలిసి, ఇలాంటి మల్టీ లొకేషన్ మొబైల్ ఆఫీసుల్లోనే మొత్తం ప్రి-ప్రొడక్షన్ పని పూర్తిచేశాను. దీనికి మేం అప్పట్లో ముద్దుగా పెట్టుకున్న పేరు... "డిజిటల్ ఆఫీస్!"

అయితే ఇప్పుడిదంతా చెప్తోంది... "మాకు ఆఫీసు లేదు, లేకపోతే ఒక మాంచి మణిరత్నం రేంజ్ సినిమా తీసేవాళ్ళం" అని ఫీలయ్యే అప్‌కమింగ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కోసం. 

కట్ చేస్తే -   

"మరి మీకు ఆఫీసు లేదా?" అని అడక్కండి. మా ఆఫీసు, ఏదో ఒకే ఒక్క ఇండిపెండెంట్ సినిమా కోసం పెట్టుకున్న ఆఫీసు కాదు. అది... నాన్-స్టాప్ మల్టిపుల్ ఫిలిం ప్రాజెక్టుల కంటెంట్ ఫ్యాక్టరీ!

- మనోహర్ చిమ్మని  

Tuesday, 12 November 2024

ప్రతి సినిమాకూ ఓ కథ ఉంటుంది!


నేను చెప్పేది మామూలు సినిమా కథ గురించి కాదు. ప్రతి సినిమాకు ఒక విభిన్న నేపథ్యం ఉంటుంది.

అంటే -  సినిమా వెనుక కథ అన్నమాట!

అసలా ఆలోచన ఎలా వచ్చింది... మార్కెట్ అవుతున్న కాంబినేషన్స్‌ను క్యాష్ చేసుకోవడం అన్న ఆలోచనలోంచి పుట్టిందా? ఒక హీరోని దృష్టిలో పెట్టుకొని రాయడం వల్ల పుట్టిందా? నిర్మాతతో ఒక సిట్టింగ్ వేశాక పుట్టిందా? కొత్తవాళ్లతో చిన్న బడ్జెట్‌లో తీయాలి అనుకొని ప్రారంభించిందా? ప్యానిండియా ఆలోచన బుర్రలో పెట్టుకొని తీసిందా? ఇన్వెస్ట్‌మెంట్‌తో వచ్చిన ఒక కొత్త హీరోని పరిచయం చేయాలన్న లక్ష్యంతో మొదలెట్టిందా? ఒక హీరోయిన్‌తో ఉన్న పర్సనల్ ఆబ్లిగేషన్‌తో ఆమెను పైకి తీసుకురావాలని చేసిన ప్రాజెక్టా? అసలు ఎలాంటి ఆర్థిక వనరులు లేకుండా ప్రారంభించి అలా అలా కొనసాగించిందా? ఒక బిజినెస్ మ్యాన్ మనీ మానిప్యులేషన్స్, ఇన్‌కమ్ ట్యాక్స్ అవసరాల కోసం తీసిందా? ... ఇంకా చాలా ఉంటాయి.    

ఇలా - ప్రతి సినిమా వెనుక నిజంగా ఇంకో కథ ఉంటుంది. ఈ కథ గురించి కేవలం ఒకరిద్దరికే తెలిసే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇంకో నలుగురు ముఖ్యమైన వ్యక్తులకో, టీమ్‌మెంబర్స్‌కో తెలిసే అవకాశం ఉంటుంది.

ఈ నేపథ్యం తెలియకుండా చేసే జడ్జ్‌మెంట్-aka-విశ్లేషణ ఏదైతే ఉందో... దాన్ని చూసి ఆయా సినిమాల నేపథ్యం తెలిసిన ఆ కొద్దిమంది నవ్వుకోడం తప్ప వేరే ఏమీ ఉండదు. 

'అద్భుతం' అని వీళ్ళు విశ్లేషించి రాసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొడతాయి. వీళ్ళు అది తక్కువుంది... ఇది ఎక్కువుంది... ఇలా తీయాల్సింది... అలా తీయాల్సింది అని ఏకేసి, 'చెత్త సినిమా' అని తేల్చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్‌లవుతాయి!

అయితే - 80 శాతం మంది సినీ ప్రేక్షకులకు ఈ విశ్లేషణలు, రివ్యూలు అసలు పట్టవు.

టికెట్స్ తెగేదీ, సినిమా జయాపజయాలు నిర్థారించబడేదీ మాత్రం ఈ సగటు 80 శాతం ప్రేక్షకులవల్లే అన్నది మనం అర్థం చేసుకోవాల్సిన నిజం.

మరోవైపు, ఆయా విశ్లేషణలు రాసినవాళ్ళకు అదో తుత్తి. అలా రాయడమే వారి గోల్. అదీ వారి విశ్లేషణల వెనుక కథ! 

నాకున్న పరిమిత జ్ఞానంతో నేను గ్రహించింది ఏంటంటే - "సినిమా ఇలా తీయాలి, అలా తీయాలి, ఇక్కడ స్లో అయింది, అక్కడ చప్పగా ఉంది, సెకండాఫ్ పోయింది..." అని అంత బాగా సినిమా ఆర్ట్ గురించి తెలిసినవాళ్ళూ, అంత బాగా చెప్పేవాళ్ళూ ఎవ్వరూ దేశంలోనే ఇంతవరకు ఒక్క సినిమా తీయలేదు!

తీసిన ఒకరిద్దరు, దశాబ్దాలుగా వారు చెబుతూవచ్చిన విశ్లేషణలు, రివ్యూల తూనికల లెక్కలకు సరితూగే హిట్ సినిమా ఒక్కటి కూడా చేయలేకపోయారు. చేయలేరు!

హాలీవుడ్ నుంచి, బాలీవుడ్ మీదుగా, కోలీవుడ్, టాలీవుడ్... ఎక్కడయినా ఇంతే. సినిమా తీసేవాళ్లు తీస్తుంటారు. వాటి గురించి రాసేవాళ్ళు రాసుకుంటారు.

ఎవరి బిజినెస్ వారిది. ఎవరి పని వారిది.    

కట్ చేస్తే - 

ఇప్పుడు సినిమా ఒక బిగ్ బిజినెస్. ఈ బిజినెస్‌లో - బాలీవుడ్‌ను కూడా వెనక్కి తోసి - చాలా కోణాల్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు నంబర్ వన్ స్థానానికి చేరుకుంది.

సినిమా అంటే ఇప్పుడు - క్రియేటివిటీ ఒక్కటే కాదు. సమీకరణాలు, లెక్కలు కూడా. ఎవరితో చేస్తున్నాం... ఏ స్థాయిలో చేస్తున్నాం...  ఎంత డబ్బు పెడుతున్నాం... ఎంతొస్తుంది... అంత రావడానికి ప్రేక్షకులకు ఇంకా ఏమిస్తే బాగుంటుంది... ఎలాంటి ప్రమోషన్ చేయాలి?

ఇదే ఇప్పటి సినిమా.

ప్యూర్ ఎంటర్‌టైన్మెంట్, పక్కా బిజినెస్. ఆ తర్వాతే ఇంకేదైనా. 

Filmmaking is an art. A passion. And... a big business too.   

- మనోహర్ చిమ్మని 

Monday, 11 November 2024

సెలబ్రిటీల సపోర్ట్ ఎప్పుడుంటుందంటే...


ఓ రెండువారాల క్రితం ఇప్పుడు నేను చేస్తున్న ఒక సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌ను జూబ్లీహిల్స్ దస్పల్లా హోటెల్లో ప్లాన్ చేశాం.

'అంత అవసరమా' అని అడక్కండి. అది వేరే ఇంటర్నల్ విషయం. 

ఒక టాప్ రేంజ్ చీఫ్ గెస్టుని, ఇంకో టాప్ రేంజ్ వీఐపీతో చెప్పించుకొని ఓకే చేయించుకున్నాం. ఈవెంట్ ఇంకో రెండున్నర రోజులుందనగా మా చీఫ్ గెస్ట్ ఆఫీసు నుంచి రావట్లేదని కాల్ వచ్చింది. ఈయన వస్తున్నాడు కదా అని ఇంకెవరూ అవసరం లేదనుకున్నాను. ఎవరూ లేని పరిస్థితి.

ఏం చెయ్యాలి?

ఏం ఆలోచించకుండా ప్రోగ్రాం కాన్సిల్ చేసేశాను. మళ్ళీ ఇంకో పది రోజుల తర్వాత పెట్టుకున్నాం. 

ఈసారి సెలబ్రిటీ గెస్టుల కోసం మా టీమ్, నేను, మా సీఈవో ప్రదీప్ చంద్ర చాలా ట్రై చేశాం. స్టార్ హోటెల్లో చేస్తున్నాం... అంతో ఇంతో పరిచయాలున్నాయి... ఒకరిద్దరు ఇప్పుడూ లైమ్‌లైట్‌లో వున్న గెస్టులు రాకపోతారా అనుకున్నాం.

జస్ట్ రెండు రోజుల్లోనే "రారు" అని అర్థమైంది. వెంటనే నేను మా TDFA (తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్) ప్రెసిడెంట్ వీరశంకర్ గారికి కాల్ చేశాను. ఆరోజు షూటింగ్ బిజీ ఉన్నప్పటికీ, ఇండస్ట్రీ రియాలిటీస్ తెలిసిన ఒక సీనియర్ డైరెక్టర్‌గా "వస్తాను" అని నాకు మాటిచ్చారు. 

వెంటనే డైరెక్టర్స్ చంద్ర మహేశ్, గాంధీ, బాబ్జీ, ప్రియదర్శిని గార్లను కూడా ఆహ్వానించాను.

ఇది నేను తీసుకొన్న సరైన నిర్ణయం.

మన డైరెక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్, మన దర్శక మిత్రులుండగా ఇంకెవరో రాని సెలబ్రిటీల కోసం ఎందుకు అనవసరంగా తంటాలు పడ్డం?

మన ప్రోగ్రాం సందర్భంగా మనవాళ్ళను కలుసుకోవడం, మనవాళ్ళను గౌరవించుకోవడం, ఆహ్లాదంగా మాట్లాడుకోవడం, ఆత్మీయంగా ఫోటోలు తీసుకోవడం కన్నా ఆనందం ఏముంటుంది?

ప్రోగ్రాం బాగా జరిగింది. ఆల్ ఓకేస్.  

కట్ చేస్తే -      

మొన్న ప్రొడ్యూసర్ దిల్ రాజు ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు...

"ఎవ్వరూ రారు, ఎవ్వరూ మీకు సపోర్ట్ ఇవ్వరు. మీకు మీరు సొంతంగా ప్రూవ్ చేసుకోండి, సక్సెస్ సాధించండి. అప్పుడు... ఇదిగో ఇలా మేం వస్తాం, అభినందిస్తాం" అన్నారాయన.

ఇంకేం కావాలి? చాలా క్లియర్‌గా చెప్పాల్సింది చెప్పారు. గతంలో ఆయన కూడా అలా ఎదిగినవాడే కదా?

అసలు సెలబ్రిటీలు గెస్టులుగా రావట్లేదు అని బాధపడే కొత్త హీరోలు ఒక చిన్న లాజిక్ గురించి ఒక్క క్షణం ఆలోచించాలి... 

సెలబ్రిటీలు గెస్టులుగా రావటం ద్వారా మీ సినిమా హిట్ అవుతుందా? మీ సినిమాలో కంటెంట్ బాగుంటే హిట్ అవుతుందా?  

- మనోహర్ చిమ్మని

Sunday, 10 November 2024

ఏప్రిల్లో మళ్ళీ అమెరికా ప్రయాణం!


ఏప్రిల్లో మళ్ళీ అమెరికా వెళ్తున్నాను. ఈసారి కూడా ఒక 20 రోజులకంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు. కాని వెళ్లాలి అనుకున్నాను. వెళ్తున్నాను. 

కట్ చేస్తే -

Everything is Spiritual in this World. 

నేను చెయ్యాల్సింది ఇంకేదో ఉంది. 

ఇప్పుడు నేను చెయ్యాలని కమిట్ అయిన సినిమా షూటింగ్ అంతా అయిపోయి, ఏప్రిల్ నాటికి దాదాపు కాపీ వచ్చేస్తుంది. ఫైనల్ ప్రమోషన్స్, బిజినెస్ నెగొషియేషన్స్ ఉండే టైంలో ఇలా అమెరికా ప్రయాణం పెట్టుకోవడం అంత కరెక్టు కాదేమో అనిపిస్తుంది. 

కాని, అంత టెన్షన్ ఏం లేదు. ఫోన్లు, జూం మీటింగ్స్ ద్వారానే ఇప్పుడు అన్ని డీల్సూ అయిపోతున్నాయి. 

ఎలాంటి టెన్షన్స్ లేవు, ఉద్యోగసద్యోగాల్లేవు, బాదర బందీల్లేవు, ఘోస్ట్ రైటింగుల్లేవు, ఫ్రీలాన్సర్ ప్రాజెక్టుల్లేవు... మంచి ఫ్రీ టైం ఎంజాయ్ చేస్తూ, ఒక 2, 3 సినిమాలు చాలా బాగా చెయ్యాలనుకున్నాను. ఈ ఫిలిం మేకింగ్ జర్నీని సంపూర్ణంగా ఆస్వాదించాలనుకున్నాను.   

కాని, నా చుట్టూ వున్న మరీ నిరాసక్త, నిర్లిప్త, ఇమ్‌ప్యాషనేట్, ఇన్ఎఫెక్టివ్, ఇనాక్టివ్, అన్‌సెక్సీ టీమ్ పనితీరు, వాతావరణం... నాలో పూర్తిగా అసలు సినిమా పట్లనే విరక్తికి కారణమయ్యాయి. 

తప్పు టీమ్‌ది కాదు... నాది, నా నమ్మకానిది. 

ఎలాగూ సగం దాకా ఇరుక్కుపోయాం కాబట్టి పూర్తిచెయ్యక తప్పదు. దీనికో టైం పెట్టుకున్నాను. ఏప్రిల్ వరకు అన్ని షూటింగ్స్ అయిపోతాయి. ఇంకో 3 నెలలు బిజినెస్, రిలీజ్ గట్రా అయిపోతాయి.  

ఖేల్ ఖతం, దుకాణ్ బంద్! 

ఇన్‌వెస్టర్స్ హాపీ, నేనూ హాపీ. 

నేను హాపీ, నాకొచ్చే ప్రాఫిట్ షేర్ వల్ల కాదు. నేను పొందబోయే ఫ్రీడం వల్ల! 

సో, అదంతా ఇప్పుడే ఫీలవుతున్నాను. మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది కాబట్టి గుడ్-బై చెప్పినట్టే. ఇంక ఈ 6 నెలలు నేను చేస్తున్నదీ, చేయబోయేదీ అంతా ఉట్టి బ్యాలెన్స్ వర్క్ అన్నమాట. 

అలా నా మైండ్‌ను సెట్ చేసేసుకున్నాను. 

ఈ డిజిటల్ డెయిలీలు, ఈ సినిమా రాతలు... ఇవన్నీ పూర్తిగా బంద్. ఈ నగ్నచిత్రం బ్లాగ్ కూడా బంద్. షూటింగ్ తర్వాత, అసలు సినిమాలతో సంబంధం లేని అద్భుతమైన ఇంకో కొత్త బ్లాగ్ ప్రారంభిస్తున్నాను.  

కొన్నిటిని బాహాటంగానే ప్రకటించుకోవాలి. అప్పుడే దానికి కట్టుబడి ఉంటాం. ఇదీ అలాంటిదే. 

నేను ఫిక్స్ అయిపోయాను. నా ఎకౌంటబిలిటీ పార్టనర్ నేనే. 
    
ఖచ్చితమైన టార్గెట్స్ ఉన్నాయి కాబట్టి, నాక్కొంచెం స్ట్రెస్ ఉంటుంది. కొంచెమేంటి, చాలానే ఉంటుంది. కాని,  తప్పదు.

తెచ్చుకోబోయే ఫ్రీడం ఊహించుకొంటూ, నేను ఫుల్ హాపీ. 

దస్విదానియా... మై డియర్ సినిమా! 

- మనోహర్ చిమ్మని   

Saturday, 9 November 2024

ఓవర్‌నైట్‌లో హీరో కావడం ఎలా?


సినీఫీల్డులో హీరోగా మీ ప్రవేశానికి టాలెంట్ ఒక్కటే సరిపోదు. బై డిఫాల్ట్ ఎవరికైనా టాలెంట్ ఉండాల్సిందే. అయితే - ఆ టాలెంట్ మిమ్మల్ని ఇండస్ట్రీకి పరిచయం చేయగలిగినవారి దృష్టికి తీసుకెళ్ళగలగాలి. అదెలా సాధ్యమవుతుందో మీకు తెలిసుండాలి.

ఈ నేపథ్యంలో - నిజంగా సినీఫీల్డు మీద చచ్చేంత ప్యాషన్, ఏమైనా సరే సాధించాలన్న తపన ఉన్న యాస్పయిరింగ్ హీరోలకు, కొత్త ఆర్టిస్టులకు ఇది బాగా పనికొచ్చే ఆర్టికిల్. హీరోగా ఇంట్రొడ్యూస్ కావాలనుకొనే కొత్త ఆర్టిస్టులు... ఈ పోస్ట్ చదివాక, ఈజీగా ఒక డెసిషన్ తీసుకోవచ్చు.   

చాలా సందర్భాల్లో ఒక కొత్త హీరో బయటినుంచి పరిచయమవడం అన్నది చాలా అరుదుగా జరిగే అంశం. డబ్బు, ఇండస్ట్రీ లింక్స్, కాంటాక్ట్స్ లేకుండా దాదాపు ఇది అసాధ్యం. 

కేవలం అతి కొద్ది మంది విషయంలో మాత్రమే టాలెంట్ సపోర్ట్ చేస్తుంది. అది షార్ట్ ఫిలిమ్స్‌లో మీ యాక్షన్ గుర్తించి కావచ్చు. అంతకు ముందు చిన్న చిన్న కారెక్టర్స్‌లో మీరు ప్రూవ్ చేసుకున్న మీ నటన చూసి కావచ్చు. ఇలా కొద్దిమందికి మాత్రమే సాధ్యమవుతుంది. 

ఎవరో ఒకరిద్దరిని ఉదాహరణగా తీసుకొని, "నేనూ అలాగే హీరో అవుతా" అని అనుకోవడం ఇప్పుడున్న భారీ కాంపిటీషన్‌లో దాదాపు అసాధ్యం. విలువైన మీ సమయం... ఏళ్లూ దశాబ్దాలూ... వృధాకావడం తప్ప వేరేదేం జరగదు.  

సినిమా అంటేనే - ప్రతిరోజూ లక్షల్లో ఖర్చు. అంతా కొత్తవాళ్లతోనే, ఒక మాడరేట్ స్థాయిలో సినిమా తీయాలంటేనే... కనీసం ఓ 2 కోట్లు అవుతుంది. మరీ తక్కువలో తక్కువ అనుకుంటే కనీసం ఓ 60 లక్షలవుతుంది. 

కొత్త హీరోలకు చాన్స్ ఇచ్చే సినిమాలు 99% చిన్న బడ్జెట్ సినిమాలే. ఈ చిన్న బడ్జెట్ సినిమాలకు ఎప్పుడూ ఒక పెద్ద సమస్య ఉంటుంది. 

డబ్బు! 

ఒక కొత్త హీరోను ఇంట్రొడ్యూస్ చెయ్యాలనుకున్నప్పుడు, ఎవరైనా టాలెంట్‌కే ఫస్ట్ ప్రెఫరెన్స్ ఇస్తారు. అందులో డౌట్ లేదు. అయితే - అలా టాలెంట్ ఉన్నవాళ్ళు వందల్లో ఉంటారు. సో, వారిలో ఎవరి ద్వారా ప్రాజెక్టుకు సపోర్ట్ ఉంటుందో వారికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. 

ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది... 

కొత్త హీరోలను ఎక్కువగా వారి బంధువులో, ఫ్రెండ్సో ప్రొడ్యూసర్స్‌గా ఉండి ఇంట్రొడ్యూస్ చేస్తారు. కొంతమంది కొత్త హీరోలు వారే స్వయంగా బడ్జెట్లో కొంత భాగం ఇన్వెస్ట్ చేస్తారు. వారికి ఆ స్థోమత లేనప్పుడు, వారి సర్కిల్లో తెలిసినవారి ద్వారా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయిస్తారు. 

ఓవర్‌నైట్‌లో  హీరోలయిపోతారు! 

ఇది ఎప్పుడూ జరిగేదే. 

ఈమధ్య కూడా - ఈ పధ్ధతిలో హీరోలుగా పరిచయమైన హీరోలు, పరిచయమై నిలదొక్కుకున్న హీరోలు... ఎవరైనా గుర్తొస్తున్నారా మీకు? తప్పకుండా వస్తారు. 

ఇది... ఏ వైపు నుంచి చూసినా, ఎలాంటి తప్పులేని ఒక మామూలు విషయం. హిపోక్రసీ ముసుగులు పక్కనపెట్టి ఒప్పుకోవాల్సిన రియాలిటీ. కొంతమందికి మాత్రం నచ్చని నిజం.   

కట్ చేస్తే - 

కొత్త హీరోల ఇంట్రడక్షన్ వెనకున్న ఈ ఆర్థిక కోణాన్ని అర్థం చేసుకోలేక - చాలా మంది తప్పుగా అనుకుంటారు... డబ్బులు పెడితేనే  చాన్స్ ఇస్తారనీ, ప్రొడ్యూసర్లు - డైరెక్టర్లు వాళ్లకు తెలిసిన వాళ్లకే చాన్స్ ఇస్తున్నారనీ... రకరకాలుగా అనుకుంటారు.

ఏదీ ఊరికే రాదు, ఊరికే అందరూ హీరోలవ్వలేరు. హీరోలయ్యాక వారికి కూడా ఊరికే కోట్లల్లో రెమ్యూనరేషన్ ఇవ్వరు. ప్రతిదానికీ ఓ లెక్కుంటుంది.

ఈ  రియాలిటీని అర్థం చేసుకుంటే చాలు. జీవితంలో మీ టైం వేస్ట్ కాదు.

సో, ఇప్పుడు తీసుకోండి మీ డెసిషన్... 

Welcome to the Glamour World! 

- మనోహర్ చిమ్మని 

శిలాశాసనం లాంటి నిజం!


సినీఫీల్డులోకి ప్రవేశించాలనుకొనే ఆర్టిస్టులయినా, టెక్నీషియన్లయినా, ఇంకెవరయినా... ముందుగా తెల్సుకోవల్సిన విషయాలు ప్రధానంగా రెండు:

1. సినీఫీల్డులో "ఇది ఇలా జరుగుతుంది" అని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఫీల్డులో ఎంట్రీ దొరకడమే చాలా కష్టం. దొరికాక దాన్ని సరైన విధంగా వినియోగించుకొని నిలదొక్కుకోవడం మరీ కష్టం. ఒక్క ముక్కలో చెప్పాలంటే - ఇక్కడ దేనికీ గ్యారంటీ లేదు. కాబట్టి, దేన్నీ టేకిట్ ఫర్ గ్రాంటెడ్‌లా తీసుకోడానికి లేదు. ప్రతిక్షణం, ప్రతి విషయంలో చాలా జాగ్రత్తపడాల్సి ఉంటుంది.  

2.  ఇక్కడ అవకాశం దొరికి, పేరు తెచ్చుకొనేవరకూ దాదాపు ఎవ్వరూ ఒక్క రూపాయి పారితోషికం ఇవ్వరు. అలా ఇస్తారనుకోవడం, అలా అని ఎవరైనా చెప్తే వినడం... ఉఠ్ఠి భ్రమ. మన జేబులోంచే వేలు, లక్షలు ఖర్చుపెట్టుకుంటూ బ్రతకాల్సి ఉంటుంది. ఆర్టిస్టు అయినా, టెక్నీషియన్ అయినా - ఇలాంటి ఖర్చు లేకుండా ఎవరికైనా ఒక చోట అవకాశం దొరికిందంటే దాన్ని నిజంగా ఒక అదృష్టంగా భావించాలి. ఈ విషయంలో కేవలం ఒకే ఒక్క కేటగిరీకి మాత్రమే మినహాయింపు ఉంటుంది. అది - హీరోయిన్లు, ఇతర ఫిమేల్ సపోర్టింగ్ ఆర్టిస్టులు. వీళ్లు దొరకడమే కష్టం కాబట్టి ఈ వెసులుబాటు! అదే హీరోలయితే ఎదురు పెట్టుబడి పెట్టాల్సికూడా రావొచ్చు. అది వేరే విషయం.      

పైన చెప్పిన రెండు అంశాల్ని దృష్టిలో పెట్టుకొని, కొత్తగా ఫీల్డులోకి రావాలనుకొనేవాళ్లు తీసుకోవల్సిన జాగ్రత్త ఒకే ఒక్కటి...

ఇక్కడ ఫీల్డులో అవకాశం దొరికి, నిలదొక్కుకొనేవరకూ - ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరొక ఆదాయమార్గాన్ని లేదా జాబ్‌ని ముందుగానే చూసుకోవాలి. అది మీ సినీ కెరీర్ ప్రయత్నాలకు ఎలాంటి అడ్డంకి కానిదై ఉండాలి. లేదంటే - సింపుల్‌గా మీరు బాగా డబ్బున్నవాళ్లయి ఉండాలి. మీ కుటుంబం మీకు పూర్తిగా సహకరించాలి. అప్పుడే ఫీల్డులో మీరు ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది.  

కట్ చేస్తే - 

శిలాశాసనం లాంటి ఈ జాగ్రత్త తీసుకోకుండా ఫీల్డులోకి ఎవరు ఎంటరయినా... తర్వాత సినిమా కష్టాలు తప్పవు.

అన్నీ అవుతున్నట్టే ఉంటుంది. కానీ, ఏదీ జరగదు. సాంఘికంగా, ఆర్థికంగా ఎన్నో ఛాలెంజ్‌లు ఎదుర్కోవాల్సి వస్తుంది. చూస్తుండగానే జీవితం మీ చేతుల్లోంచి జారిపోతుంది.

సో, మరొక ఇన్‌కమ్ స్ట్రీమ్ గాని, ఒక సపోర్ట్ సిస్టమ్ గాని లేకుండా ఇక్కడ ఎవ్వరూ ఏం సాధించలేరు.      

ఇలాంటి సిచువేషన్‌కు పూర్తి వ్యతిరేకంగా - కొందరు ఏ బాదరబందీల్లేకుండా ఫీల్డులోకి దిగుతారు. ఇంకొందరు యు యస్ లో బాగా సంపాదించుకొని వచ్చి, ఇక్కడో కంపెనీ పెట్టుకొని, ఫీల్డులో పూర్థిస్థాయిలో దిగుతారు. వీళ్లకి ఎలాంటి భయం ఉండదు. వత్తిడిలో నిర్ణయాలు తీసుకొనే అవసరం వీరికి అసలుండదు. వీళ్ళు చాలా కూల్‌గా ఈ జర్నీని ఎంజాయ్ చేస్తూ, అనుకున్నది సాధించుకొంటూ వెళ్తారు. అయితే - పరోక్షంగా వీళ్ళు కూడా శిలాశాసనం లాంటి ఆ జాగ్రత్త పాటించినట్టే అని నా ఉద్దేశ్యం.

సో, బి కేర్‌ఫుల్!        

- మనోహర్ చిమ్మని  

Friday, 8 November 2024

నిజంగా మీలో ఆ క్రియేటివిటీ వుంటే...


ఐఫోన్‌తోనే మొత్తం సినిమా షూట్ చేసి, అదే ఐఫోన్‌లో ఎడిటింగ్‌తో సహా మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసి, ఆ సినిమాలను ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో పోటీకి పంపిస్తున్న రోజులివి. 

ఒకవైపు వందల కోట్లల్లో బడ్జెట్లు ఎలా పెరిగిపోతున్నాయో, మరోవైపు దాదాపు అసలు బడ్జెట్టే అవసరంలేని విధంగా "నో బడ్జెట్", "రెనగేడ్ సినిమాలు" కూడా రూపొందుతున్న రోజులివి. 

యాక్టర్‌గా కావచ్చు, స్క్రిప్ట్ రైటర్‌గా కావచ్చు, డైరెక్టర్‌గా కావచ్చు... ఇప్పుడెవరైనా సులభంగా సినీఫీల్డులోకి ప్రవేశించవచ్చు. 

ఇంతకుముందు సినిమా ఫీల్డు వేరు. డిజిటల్ టెక్నాలజీ వచ్చాక సినిమా ఫీల్డు వేరు. ఇంకా చెప్పాలంటే, కరోనాకు ముందు సినీఫీల్డ్ వేరు, కరోనా తర్వాత సినీఫీల్డు వేరు. 

కమ్యూనికేషన్ విషయంలో కొంచెం కమాండ్ వుంటే చాలు, సోషల్ మీడియా ద్వారానే ఎందరో సెలబ్రిటీలతో డైరెక్ట్‌గా కనెక్ట్ అయిపోవచ్చు ఇప్పుడు. ఒక చిన్న షార్ట్ ఫిలింను చాలా ఎఫెక్టివ్‌గా తీసి మెప్పించడం ద్వారా సినీఫీల్డు దృష్టిలో పడొచ్చు. 

ఎవ్వరిదగ్గరా అసిస్టెంట్‌గా పనిచేయకుండానే, డైరెక్ట్ డైరెక్టర్‌గా ఇలా ఆఫర్లు పొందినవాళ్ళు కూడా ఇప్పుడున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ బజ్‌లో ఉండి, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా సినీఫీల్డు దృష్టిలో పడి, యాక్టర్స్ అవుతున్నవాళ్ళు కూడా ఇప్పుడెందరో ఉన్నారు. 

ఒక నాలుగైదేళ్ళ క్రితం ఇండస్ట్రీతో పోలిస్తే, ఇప్పుడు సినిమాల్లో చాన్స్ సంపాదించుకోవడం చాలా ఈజీ.    

డైరెక్టర్ కావడానికి  కూడా గతంలో లాగా ఒక పదేళ్ళపాటు 10 సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు. నిజంగా మీలో ఆ క్రియేటివిటీ వుంటే డైరెక్ట్‌గా డైరెక్టర్ అయిపోవచ్చు. 

రైటర్ విషయంలో కూడా అంతే. ఒక సెన్సేషనల్ స్క్రిప్టు రాసే సత్తా మీలో నిజంగా వుంటే ఇంకెవ్వరిదగ్గరా ఓ పదేళ్ళపాటు అసిస్టెంట్‌గా పనిచెయ్యాల్సిన అవసరంలేదు.

కట్ చేస్తే - 

ఔత్సాహికులైన కొత్తవాళ్ళు తెలుసుకోవల్సిన బేసిక్స్ అంటూ కొన్నుంటాయి...

ఫిలిం ఇండస్ట్రీ అసలు ఎలా పనిచేస్తుంది? ఎలా చాన్సులు దొరుకుతాయు? అసలు కొత్తవాళ్లలో ఇండస్ట్రీకి ఏం కావాలి? కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వారిలో ఉన్న స్కిల్స్‌ను ఎలా ఇండస్ట్రీ కోరుకొనే విధంగా మౌల్డ్ చేసుకోవాలి... వంటి కొన్ని అతి ముఖ్యమైన విషయాల్లో అవగాహన అవసరం. 

ఈ ప్రాథమిక అవగాహన లేకుండా చేసే యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రయత్నాలు ఏవీ ఫలించవు. మీ అత్యంత విలువైన సమయం, డబ్బూ వృధా అయిపోతాయి. 

దీనికోసమే సీనియర్స్ సలహాలు అవసరం. పనికొచ్చే వన్-టు-వన్ పర్సనల్ కోచింగ్ అవసరం. లేదా, ఒక సినిమా టీమ్‌లో పూర్తిస్థాయిలో పనిచేయడం అవసరం. 

ఇప్పుడు నాదగ్గర పనిచేస్తున్న టీమ్‌లో కనీసం ఇద్దరు ఏడీలు త్వరలో డైరెక్టర్స్ కాబోతున్నారు. 

- మనోహర్ చిమ్మని 

Wednesday, 6 November 2024

ఇది ఈలన్ మస్క్ విజయం!


ట్రంప్ కోసం ట్విట్టర్‌నే కొనిపడేశాడు.
నిజంగా మస్క్ కాన్‌ఫిడెన్స్‌కు హాట్సాఫ్. 
కొంచెం అటూ ఇటూ అయినా 
కమలా హారిస్‌తో కథ వేరే ఉండేది. 
రియల్లీ గట్సీ...
అందుకే అతను ఈలన్ మస్క్ అయ్యాడు. 
మిలియన్ల కొద్దీ డాలర్స్ ఓపెన్‌గా 
ట్రంప్ విజయం కోసం కంట్రిబ్యూట్ చేశాడు. 
ఈ విజయం గురించి ముందే చెప్పాడు,
చెప్పింది, చేసి చూపించాడు. 
నిజంగా ఇది ఈలన్ మస్క్ విజయం.

- మనోహర్ చిమ్మని   

No Guts, No Glory!


డొనాల్డ్ ట్రంప్... తన 78 వ ఏట 
చాలెంజ్ చేసి మరీ గెల్చాడు. 

ట్రంప్... 
ఒక రియాల్టర్. ఒక బిజినెస్‌మ్యాన్.
ఒక రైటర్. ఒక మీడియా పర్సనాలిటీ.  
ఒక టెలివిజన్ షో ప్రజెంటర్.
ఒక పొలిటీషియన్. 
జీవితాన్ని అన్‌లిమిటెడ్‌గా
ఎంజాయ్ చెయ్యటంలో - 
అసలెక్కడా ఇంచ్ కూడా తగ్గనోడు.   

తన 78 వ ఏట,
ఇప్పుడు మళ్ళీ ప్రపంచంలోనే 
అత్యంత శక్తివంతమైన దేశం
అమెరికాకు రెండోసారి 
ప్రెసిడెంట్ అయ్యాడు.  

అదీ గట్స్ అంటే!
అంతే గాని...
ప్రతి చిన్న పనిని చెయ్యలేక,
ప్రతి చిన్న లక్ష్యాన్న్ని సాధించలేక... 
ముక్కుతూ మూల్గుతూ, చెప్పిందే చెప్తూ
చేతకాలేదని చెప్పలేక, 
కొత్తగా ఏం చెప్దామా అని  
వంద సాకులు వెతుక్కోవడం కాదు!  

కట్ చేస్తే - 

Trump has once again proven that 
Age Is Just A Number!
Congratulations to Donald Trump 
on being elected as U.S. President 
for a second term. 
Wishing him a successful tenure, 
and I truly believe he’ll 
Make America Great Again! 

- Manohar Chimmani 

Tuesday, 5 November 2024

చదువుకు, సినిమాకు సంబంధం లేదు!


"Research shows that the more a boy misbehaves in school, the more likely he is to earn a lot of money as an adult!"

ఇదేదో ఉత్తుత్తి స్టేట్‌మెంట్ కాదు. నా అనుభవంలో నేను కూడా చూసిన ఒక సత్యం. దీనికి అనుబంధంగా మరికొన్ని నిజాలు కూడా నేను చెప్పగలను. ఎలాంటి హిపోక్రసీ లేకుండా!

* రోడ్డుమీద వెళ్తూ కనిపించిన ప్రతి రాయికీ, రప్పకూ విచిత్రంగా అలా దండం పెట్టుకుంటూ వెళ్తుంటారు కొంతమంది. కొంతమంది మాట్లాడుతూ మాట్లాడుతూనే గాల్లోనే ఎవరికో దండం పెడుతుంటారు. దండం పెట్టడం తప్పుకాదు, అసలు అదంతా ఒక స్క్రూలూజ్ వ్యవహారంలా కనిపిస్తుంది మనకు. వీరి వ్యవహారశైలిగానీ, భాషగానీ అవతలివారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ కేటగిరీకి చెందిన చాలామంది నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గరగా తెలుసు. వీళ్లల్లో చాలామందికి కాగితం పైన పెన్నుపెట్టి రాయటం రాదు. కానీ వీరందరి దగ్గర డబ్బు పిచ్చిగా ఉంటుంది. పిచ్చిపిచ్చిగా సంపాదిస్తారు!  

* అంతర్జాతీయంగా వివిధరంగాల్లో అత్యుత్తమ స్థాయి విజయాల్ని సాధించి బిలియనేర్లలో 80 శాతం మంది చదువులో గుండు సున్నాలే. లేదా స్కూలు, కాలేజ్ స్థాయిలో "డ్రాప్ అవుట్"లే!     

ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే...        

1. చదువుకోనివాడి లక్ష్యం స్పష్టంగా ఉంటుంది. మొండిగా ఆ ఒక్కదాని గురించే కష్టపడి సాధిస్తాడు. 
2. చదువుకున్నవాడికి పది లక్ష్యాలుంటాయి. పది పడవలమీద కాళ్లు పెడతాడు. ఏ ఒక్కటీ సాధించలేడు. 
3. చదువుకు, సంపాదనకు అస్సలు సంబంధం లేదు. "నేనెంత సంపాదించాలి? దానికోసం నేనేం చేయాలి?" అన్న వెరీ సింపుల్ 'ఫినాన్షియల్ ఇంటలిజెన్స్' చాలు.
4. పైన 1, 2, 3 లను చాలా ఆలస్యంగా రియలైజ్ కావడమంత దురదృష్టం ఇంకొకటి లేదు.  

కట్ చేస్తే - 

సినీ ఫీల్డులో కూడా అంతే. అత్యున్నతస్థాయి విజయాలు సాధించి కోట్లు సంపాదించుకున్న ఆర్టిస్టులూ, టెక్నీషియన్లలో చాలామంది చదువుకు పంగనామాలు పెట్టినవాళ్లే! లేదా, చదువుకుంటామని చెప్పి ఊళ్ళోంచి బయటపడి వచ్చి ఇక్కడ సినిమాల్లో చేరినవాళ్ళే.

ఇది ఇప్పటి విషయం కాదు. ఎప్పుడైనా ఎక్కడైనా - హాలీవుడ్‌లో అయినా, టాలీవుడ్‌లో అయినా - ఇంతే. చదువుకు, సినిమాల్లో నీ స్కిల్‌కు సంబంధం లేదు. ఈ స్కిల్ మీద నీకెంత ప్యాషన్ ఉన్నది, దానికోసం నువ్వు ఏఏ త్యాగాలు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నావన్నదే ముఖ్యం.

అలాగని బాగా చదువుకున్నవాళ్ళు సినీ ఫీల్డులోఅసలు ఉండరని కాదు. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఉంటారు, ఉన్నారు. కాని, ఫీల్డులో వారి సంఖ్య ఒక 20 శాతం మించదు. వీళ్లంతా కూడా ఎప్పుడెప్పుడు చదువు ముగించుకుందామా అని ఎదురుచూస్తుంటారు. ఎప్పుడెప్పుడు చేస్తున్న ఉద్యోగాల్ని వదిలిపెడదామా అని ఎదురుచూస్తుంటారు.

వీళ్ళకు కూడా చదువు మీదకంటే, చేస్తున్న ఉద్యోగాల మీదకంటే, సినిమా మీద వ్యామోహమే టాప్ ప్రయారిటీలో ఉంటున్నది సత్యం.

అలా లేకపోతే వారికి ఇక్కడ ఎంట్రీ, ఎగ్జిస్టెన్స్ రెండూ ఉండవు.         

- మనోహర్ చిమ్మని 

అసలేందీ కోపరేటివ్ ఫిలిమ్ మేకింగ్?!


ఈ సెటప్‌లో... చాలా మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా ముందు ఇవ్వటం అనేది ఉండదు. సినిమా పూర్తయ్యి, రిలీజయ్యి, లాభాలు వచ్చాకే ఆ లెక్కలు. దీనికి ఒప్పుకున్నవాళ్లే మా సినిమాలో పనిచేస్తారు.

ఇదే టర్మ్‌స్ మీద అగ్రిమెంట్స్ ఉంటాయి. లైక్-మైండెడ్ ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది.           

మా సినిమాల బడ్జెట్లు రెండు కోట్లు కావొచ్చు, ఆరు కోట్లు కావచ్చు. ఉన్న ఆ కొద్ది బడ్జెట్‌ను మేకింగ్‌కు, ప్రమోషన్‌కు మాత్రమే వాడతాం. ఇదేం కొత్త కాన్సెప్ట్ కాదు. ఆల్రెడీ ఆర్జీవీ ఈ కాన్సెప్ట్‌తో సినిమాలు చేశాడు.

చాలా మంచి కాన్‌సెప్ట్ ఇది.  ముఖ్యంగా చిన్న, మిడ్-రేంజ్ బడ్జెట్ సినిమాలకు సంబంధించి మాత్రం ఇదే చాలా చాలా కరెక్టు.

సినిమాకు మార్కెట్లో బజ్ కోసం, మంచి ఓపెనింగ్స్ కోసం... ప్రమోషన్ పరంగా ఎన్నో జిమ్మిక్కులు చేయాల్సి ఉంటుంది. ఎంతో ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు ముందే రెమ్యూనరేషన్ ఇవ్వకుండా ఉండటం ద్వారా ప్రమోషన్ విషయంలో మనీ పరంగా కొంత ఫ్రీడం ఉంటుంది. రిలీజ్ సమయంలో సౌండ్‌గా ఉంటాం.

మా మీద నమ్మకం పెట్టిన ఇన్వెస్టర్లకు మంచి ఫలితాలు, లాభాలు తెప్పించాలంటే ఇదే మంచి పధ్ధతి.       

ఇలాంటి ఇండిపెండెంట్ సినిమాలకు ఈ మూడు అంశాలు చాలా ముఖ్యం: 

టీమ్ వర్క్. 
కంటెంట్.
ప్రమోషన్.

ఆమాటకొస్తే, ఒక్క ఇండిపెండెంట్ సినిమాలే కాదు... ఈ మూడూ లేకుండా ఏ సినిమా కూడా విజయం సాధించలేదు.

కట్ చేస్తే -     

ఫిలిం ప్రొడక్షన్‌కు సంబంధించి దాదాపు ఇదే కాన్సెప్ట్‌తో ప్రస్తుతం నేను, నా కోర్ టీమ్ కలిసి... మల్టిపుల్ సినిమాలు ప్లాన్ చేశాము. ప్రస్తుతం రెండు సినిమాల ప్రి-ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తికావొచ్చింది. వీటిలో మొదటి ప్రాజెక్టును లాంఛనంగా వారం క్రితం ప్రారంభించాము. ఇంకో సినిమాకు ప్రారంభాలు, లాంచింగ్స్ ఏమీ ఉండవు. డైరెక్టుగా ఈ నెలాఖరు నుంచి షూటింగ్‌కే.

అన్నట్టు, ఈ రెండు సినిమాల షూటింగ్ దాదాపు ఏక కాలంలోనే జరుగుతుంది. దయచేసి, 'అదెలా?' అని అడక్కండి. ఈ విషయంలో గురువుగారు దాసరి నారాయణ రావు గారే మాకు ఆదర్శం.    

ఇక మేకింగ్ విషయానికొస్తే... మా టీమ్ అందరి ఫోకస్ మేకింగ్ మీదనే తప్ప... కాల్ షీట్స్, టైమింగ్స్ మీద కాదు. అంతా రెనగేడ్ ఫిల్మ్ మేకింగ్. గెరిల్లా ఫిల్మ్ మేకింగ్.              

"కలిసి పనిచేద్దాం. కలిసి ఎదుగుదాం."  

ఇదే మా కాన్సెప్ట్. 

- మనోహర్ చిమ్మని      

Sunday, 3 November 2024

ఎవరైనా ఎన్ని పనులనయినా, ఏకకాలంలో చేయొచ్చు... ఒక్క సినిమా తప్ప!


ప్రపంచస్థాయిలో సక్సెస్‌ఫుల్ పీపుల్ అంతా ఏకకాలంలో ఎన్నోరకాల పనుల్లో, వృత్తుల్లో, వ్యాపకాల్లో, వ్యాపారాల్లో మునిగితేలుతున్నవాళ్లే!

మన ప్రయారిటీలనుబట్టి, ఏయే పనులు ఎప్పుడు చేయాలో, అప్పుడు అలా వాటికవే జరుగుతూపోతుంటాయి. అలా చేయడానికి మనం అతి సహజంగా అలవాటుపడిపోతాం.

పనిలేనప్పుడే మనం బిజీగా ఉంటాం. చేతినిండా పనులున్నప్పుడు అసలు బిజీ అన్న పదమే మనకు గుర్తుకురాదు.

ఇప్పుడు నేనొక అరడజన్ పనుల్ని అత్యంత వేగంగా, ఎలాంటి సమస్యల్లేకుండా చేయగలుగుతున్నాను. నేను చేస్తున్న ఏపనీ నా మరో పనికి అడ్డురావడంలేదు. విచిత్రంగా అన్ని పనులూ చాలా ఈజీగా జరిగిపోతున్నాయి. చెప్పాలంటే, ఒకప్పుడు నేను చేయడానికి ఇష్టపడని ఎన్నో ఫ్రీలాన్సర్ పనుల్ని ఇప్పుడు యాడ్స్ ఇచ్చి మరీ చేస్తున్నాను.

నాకే అర్థం కావడం లేదు, నాలో ఇంత మార్పు ఏమిటో.

అయితే - ఈ పనులన్నిటికి వ్యతిరేకంగా, సినిమా ఒక్కటే నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. ఒక్క సినిమాల్లో మాత్రమే మనం ప్లాన్ చేసుకున్నట్టుగా, ఒక గీత గీసుకున్నట్టుగా పని జరగదు. అదంతే.

అయితే, ఇప్పుడు దీనికి కూడా ఒక చిన్న చిట్కా కనుక్కున్నాను. నో వర్రీస్.    

సినిమా అనేది ముందు ఒక డైరెక్టర్స్ విజన్. కాని, అది పూర్తిగా ఒక టీమ్ వర్క్ అన్న వాస్తవం కూడా గుర్తించాలి.

సినిమా చూస్తున్నప్పుడు ఎంత ఎంటర్‌టైన్మెంటో, చేస్తున్నప్పుడు అంత డిస్ట్రాక్షన్.

ఇతర ఎన్నో ప్రొఫెషన్స్ వేరు, సినిమా ప్రొఫెషన్ వేరు. డిస్ట్రాక్షన్స్‌కు ఇక్కడ విధిగా, మానసికంగా సిద్ధపడి ఉండాలి. మన ప్లానింగ్‌లో మనం ఊహించనివి ఎన్నో చాలా కామన్‌గా జరిగిపోతుంటాయి. ఇంకేం ఉండదు, 'ఆల్ సెట్' అనుకుంటాం. కాని, మనం కలలో కూడా ఊహించనివి జరిగి, ఇంకో కొత్త ప్రాబ్లం వచ్చి మన ముందు నిల్చుంటుంది.

సో... సమస్యలు, అడ్డంకులు, అవాంతరాలు, ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా ఊహించనిదేదో జరిగి స్మూత్‌గా జరుగుతున్న పని ఒక్కసారిగా ఆగిపోవటం వంటివి... ఇక్కడ సర్వసాధారణం.

వీటన్నిటి కోసం, ప్రతి విషయంలో ప్లాన్-ఏ, ప్లాన్-బి అనే కాదు, ఈలన్ మస్క్ చెప్పినట్టు ప్లాన్-జెడ్ కూడా మనదగ్గర రెడీగా ఉండాలి. 

ఇదంతా రాసుకోవడం ఈజీ, చెప్పటం ఇంకా ఈజీ. డిస్ట్రాక్షన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఉంటుంది అసలు మజా.

మచ్చుకి: అప్పటిదాకా అంతా బాగా నడుస్తుంటుంది... షాట్ రెడీ అనగానే ఒక ఆర్టిస్టు కనిపించడు. ఉన్నట్టుండి అక్కన్నించి ఎలా మాయమయ్యాడో తెలీదు. ఫోన్ చేస్తే స్విచాఫ్ ఉంటుంది. షూటింగ్ ఆగిపోతుంది. రెండు గంటల తర్వాత "నేను బెంగుళూరు ఫ్లైట్‌లో ఉన్నానయ్యా. మీ డైరెక్టర్‌కు చెప్పు" అని ఏడీకి కాల్ వస్తుంది. ఎవరూహిస్తారు దీన్ని?...

ఇంకోటి: టాకీ మొత్తం అయిపోతుంది. పాటలకు షెడ్యూల్ అంతా ఫిక్స్ చేసుకుంటాం. అప్పటిదాకా టాకీ పార్ట్ ఎంతో అద్భుతంగా, తన సొంత ప్రాజెక్టు అన్నంత బాధ్యతగా చేసిన హీరోయిన్ ఉన్నట్టుండి ఫోన్‌కు అందదు. షూటింగ్ కాన్సిల్! రెండు వారాల తర్వాత తెలుస్తుంది... ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్‌తో న్యూజీలాండ్ చేక్కేసిందని! ఈ న్యూస్ ఆ హీరోయిన్ పేరెంట్స్‌కు కూడా తెలీదు. మనమే కనుక్కుంటాం!...

ఇదైతే కలలో కూడా ఊహించం: లంచ్‌లో బొమ్మిడాయిల కర్రీ తేలేదని షూటింగ్ మధ్యలో ఒక చీఫ్ టెక్నీషియన్ అలుగుతాడు! అప్పట్నుంచి, సాయంత్రం షూటింగ్ ప్యాకప్ దాకా, ఆ డైరెక్టర్‌కు, అతని టీమ్‌కు నరకమే!... జస్ట్ ఇవి చిన్న శాంపుల్స్.

ఇంక ఫండింగ్ మ్యాటర్స్, ఈగో ప్రాబ్లమ్స్ వంటివాటికి లెక్క పత్రం ఉండదు.    

కట్ చేస్తే -

సినిమా అనేది ఎవరో ఒక్కరి డెసిషన్ మీద ఆధారపడి నడిచే వ్యవస్థ కాదు. ప్రతి స్టేజ్‌లో ఎంతో మంది ప్రమేయం ఉంటుంది. ఎంతో మంది "యస్", "నో"ల మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఎన్నో మనకి నచ్చని "యస్"లకు మనం "నో" చెప్పలేని పరిస్థితులుంటాయి. మనకెంతో ఇష్టమైనవాటికి అవతల నుంచి సింపుల్‌గా ఒక "నో" వస్తుంది, వినాలి.

ఇలాంటివన్నీ భరించాలి. చేతనైతే కన్విన్స్ చెయ్యాలి. అవసరమైతే కన్‌ఫ్యూజ్ చెయ్యాలి. తప్పదు అనుకుంటే, మ్యానిప్యులేట్ కూడా చెయ్యగలగాలి.

ఇదంతా చిరునవ్వుతో చాలా కూల్‌గా చెయ్యగలగాలి. అప్పుడే నువ్వు డైరెక్టర్‌గా సక్సెస్ అవుతావు.  

- మనోహర్ చిమ్మని 

Saturday, 2 November 2024

శేఖర్ కపూర్, మణిరత్నం, సినీఫీల్డులో ఒక వాస్తవం!


"When people ask me how to become a director, I ask: "How much humiliation can you take?" - Shekhar Kapur   

మిస్టర్ ఇండియా, బాండిట్ క్వీన్, ఎలిజబెత్ వంటి సినిమాలను తీసిన హాలీవుడ్ స్థాయి దర్శకుడే లేటెస్టునా నిన్న ఉదయం ఎక్స్‌లో పోస్ట్ చేసిన మాట ఇది. 

దీన్ని కోట్ చేస్తూ, నేను వెంటనే ఒక పోస్టు పెట్టాను.

'మణిరత్నం కూడా దాదాపు ఇదే చెప్పారు: "నువ్వు సినిమాల్లోకి రావాలని డిసైడ్ అయినప్పుడే బాధ, అవమానం అనే మాటలు విడిచి పెట్టాలి. ఎందుకంటే, ఇక్కడ నీకు అవి అడుగడుగున ఎదురవుతాయి" అని.

శేఖర్ కపూర్ వెంటనే ఎక్స్‌లో నా పోస్టుకు లైక్ కొట్టారు. 

ఆమధ్య మణిరత్నం బర్త్‌డే నాడు ఒక ఆర్టికిల్ చూస్తున్నపుడు అతను చెప్పిన ఈ మాట నాకు కనిపించింది. ఇంటా బయటా ఎన్నో అనుభవించకపోతే, మణిరత్నం ఇంత గొప్ప వాస్తవం చెప్పేవాడు కాదు కదా అని నాకనిపించింది. అంతదాకా ఎందుకు... మణిరత్నం డైరెక్టర్‌గా నిలదొక్కుకుంటున్న రోజుల్లో సుహాసిని డేట్స్ అడిగితే ఇవ్వలేదు. మణిరత్నం అప్పుడు అంత పెద్ద డైరెక్టర్ కాదు. సుహాసిని మాత్రం అప్పటికే ఫుల్ స్వింగ్‌లో ఉన్న హీరోయిన్! తర్వాత, 1987లో అనుకుంటాను, మణిరత్నం 'నాయకుడు' సినిమాతో డైరెక్టర్‌గా ఇండియాలోనే టాప్ రేంజ్‌కి ఎదిగిపోయాడు. 1988లో సుహసిని అతన్ని పెళ్ళిచేసుకుంది.

దటీజ్ సినిమా.

మామూలుగా క్రిష్ణానగర్ సినిమా కష్టాలు వేరు. అవి అందరికీ కామన్. 

కాని, ఇండస్ట్రీలోకి ప్రవేశించి, ఒక స్థాయికి వచ్చినవాళ్ళు కూడా ఎన్నెన్నో బాధలు, అవమానాలు ఫేస్ చేయాల్సిన పరిస్థితులు రావడం ఈ ఫీల్డులో సర్వసాధారణం. 

మణిరత్నం, శేఖర్ కపూర్ స్థాయివాళ్ళే అంత సింపుల్‌గా సినీఫీల్డులో లైఫ్ గురించి చెప్పారంటే, ఇది మరీ అంత సింపుల్‌గా తీసుకొనే విషయమేం కాదు.

ఇలాంటివాటికి భయపడో బాధపడో సెంటిమెంటల్‌గా ఫీలయ్యేవాళ్ళు ఇక్కడ పనికిరారు. ఏం సాధించలేరు. 

పెద్ద పెద్ద హీరోలకు ఇండస్ట్రీ రికార్డు బ్లాక్‌బస్టర్ హిట్లిచ్చిన పూరి జగన్నాధ్ లాంటివారు వరుసగా రెండు మూడు ఫ్లాపులిచేటప్పటికి, ప్రతివాడూ కామెంట్ చేసేవాడే. అసలు సినిమా ఎట్లా తీస్తారన్న విషయంలో అ-ఆలు తెలియనివాడు కూడా నీతులు చెప్పడమే. 

హీరోల విషయంలో కూడా అంతే... వరుసగా ఒక రెండు ఫ్లాపులొస్తే చాలు, "ఎలాంటి సబ్జెక్ట్ ఎన్నుకోవాలన్న విషయంలో ఆ హీరోకి జడ్జ్‌మెంట్ లేదు" అంటూ నానా కామెంట్స్ చేస్తారు. సినిమా ఇండస్ట్రీలో ఒక సీనియర్ అన్నాడంటే ఒక అర్థముంటుంది. సినీఫీల్డు గురించి ఏం తెలియనివాళ్ళు కూడా చాలా సింపుల్‌గా అనేస్తారు. ఇక యూట్యూబుల్లో అయితే చర్చలే చర్చలు! 

ఇంక ఇక్కడ లిస్టు చెయ్యని అవమానాలు వెయ్యుంటాయి...       

కట్ చేస్తే -

ఒక డైరెక్టరయినా సరే, ఒక హీరో అయినా సరే... తమ సినిమాల విషయంలో ఎన్నో కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కొన్ని వర్కవుట్ అవుతాయి, కొన్ని కావు. కొంచెం అటూయిటూ అయ్యిందా, వీళ్ళంతా లోపలివాళ్ళు-బయటివాళ్లనుంచి ఎన్నో అవమానకరమైన కామెంట్స్, ట్రీట్‌మెంట్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటన్నిటినీ పట్టించుకుంటే బ్రతకలేరు. 

అయితే... ఇవన్నీ ఫేస్ చేసే దమ్మున్నవాళ్లకే ఇక్కడ ఏ కొంచెమైనా సాధించే అవకాశం ఉంటుంది. లేదంటే, ఇంకేదైనా పని చూసుకుంటే మంచిది.        

- మనోహర్ చిమ్మని 

Friday, 1 November 2024

ఎప్పుడూ ఒక సినిమా చేస్తుండటం ముఖ్యం!


కమర్షియల్ సినిమానా, కాన్స్‌కు వెళ్లే సినిమానా... ఇది కాదు ప్రశ్న. నీకెంత ఫ్రీడమ్ ఉంది? నువ్వేం చేయగలుగుతున్నావు అన్నదే అసలు ప్రశ్న.

తను అనుకున్న జీవనశైలిని సృష్టించుకోడాన్ని మించిన ఆనందం ఇంకొకటి ఉండదు. అది బిచ్చగాడయినా ఒకటే. బిలియనేర్ అయినా ఒకటే. ఎవడి పిచ్చి వాడికానందం.

మరోవిధంగా చెప్పాలంటే - అది సినిమానా, పుస్తకాలా, పెయింటింగా, ఇంకొకటా అన్నది కూడా కాదు ప్రశ్న. నువ్వు చేస్తున్నపనిలో నీకెంత ఆనందం ఉంది అన్నదే అసలు ప్రశ్న.

ఆ ఆనందమే స్వేఛ్చ. ఆ స్వేఛ్చకోసమే అన్వేషణ.

అది నేనయినా, నువ్వయినా, ఎవరయినా. 

ఇంగ్లిష్‌లో ఓ సామెత ఉంది... "మైండ్ చేంజెస్ లైక్ వెదర్!" అని. ఇప్పుడు నేను మళ్లీ ఒక రెండేళ్ళో, మూడేళ్ళో వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నాను. వాటిలో మొదటి సినిమా మొన్న లాంచ్ చేశాము. నవంబర్ చివర్లో ప్రారంభమై, ఏకధాటిగా ఒకే షెడ్యూల్లో షూటింగ్ పూర్తిచేసుకుంటుంది.

ఇంతకుముందులా ఇప్పుడు సినిమాలంటే ప్యాషన్ ఒక్కటే కాదు. ఒక క్రియేటివ్ వ్యాపకం. ఒక పాష్ ప్రొఫెషన్. ఒక ఎఫెక్టివ్ అండ్ పవర్‌ఫుల్ ప్లాట్‌ఫామ్.

అనవసరంగా ఇంత మంచి ప్లాట్‌ఫామ్‌ను చాలా అశ్రధ్ధ చేశాను. అసలు పట్టించుకోలేదు. ఎవరో ఏదో అనుకుంటారనో, లేదంటే మనం చేసే ఒక పని, మనమే చేసే ఇంకోపనిమీద వ్యతిరేక ప్రభావం చూపిస్తుందనో అనుకోవడం ఉట్టి అవివేకం. దేని దారి దానిదే. 

మన గురించి అనుకునేవాళ్లెవరూ మన ఫోన్ బిల్స్ కట్టరు, మన ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయరు. అవసరంలో మనల్ని ఆదుకోరు. అలాంటి ఎవరో ఏదో అనుకుంటారని మనం అనుకోవడం పెద్ద ఫూలిష్‌నెస్. ఈ యాంగిల్లో చూసినప్పుడు, అనవసరంగా మనల్ని మనమే అణగతొక్కేసుకుంటున్నామన్నమాట!

అదొక పనికిరాని మైండ్‌సెట్. జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో మనకు అడుగడుగునా అడ్డుపడే మైండ్‌సెట్. జీవితంలో ఆనందాన్ని అనుభవించనివ్వని మైండ్‌సెట్. 

కట్ చేస్తే - 

సినిమా ఇప్పుడొక బిగ్ బిజినెస్ కూడా.

ఇండస్ట్రీలో సక్సెస్ స్టోరీలనే ఆదర్శంగా తీసుకో. ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకో. నెగెటివ్ మనుషులు, నెగెటివ్ వాతావరణం నీ చుట్టూ లేకుండా చూసుకో. ఖర్మకొద్దీ మనచుట్టూ ఎక్కువగా ఉండేది వాళ్ళే. ఎప్పటికప్పుడు ఫిల్టర్ వేసి చూసుకో.

అండ్, ఫైనల్లీ... చిన్న సినిమానా, పెద్ద సినిమానా అన్నది అసలు ఆలోచించకు. ఎప్పుడూ ఒక సినిమా చేస్తుండటం ముఖ్యం. ట్రాక్ మీదుండటం ముఖ్యం, లైమ్‌లైట్‌లో ఉండటం ముఖ్యం.

ఇదొక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది.  

- మనోహర్ చిమ్మని