నాకోసం నేనుగా, నాకై నేనుగా...
నేనే పెనవేసుకున్నా నాకెన్నడూ సరిపడని
నా సృజనాత్మక పద్మవ్యూహం ఒకవైపు.
నిరంతరం నాతోవుంటూ
నన్ను పసిపిల్లాడిలా కాపాడే నా నీడే
నిముషనిముషం, నిర్దయగా
నా శ్వాసనిశ్వాసలను నియంత్రించిన
విచిత్ర నేపథ్యం ఇంకోవైపు.
నాకే తెలియకుండా, నా నిమిత్తమే లేకుండా
నన్నావహించి, అళ్ళుకుపోయి
నన్నావాహన చేసుకున్న స్వాధిష్టాన చక్రంలా
నిరంతరం నన్నుక్కిరిబిక్కిరిచేస్తూ
నేనెన్నడూ విడువలేని
నా అనుక్షణిక వ్యామోహాలు నా చుట్టూ.
అన్నీ కలిసికట్టుగా నన్నొంటరిని చేసి,
భయపెట్టి, బాధపెట్టి
నేను కలలో కూడా ఊహించని
భీభత్సపు సర్పపరిష్వంగాలై
నన్ను చుట్టుముట్టి,
నా మీద బుసకొట్టినప్పుడు...
జీవితం ఎంత కల్లోలంగా ఉంటుందో
అంతే కసిగా, కవ్వింతగా కూడా ఉంటుంది.
కొవ్వొత్తిలా కాలం కరిగిపోతున్నా
కళ్ళకు గంతలు కట్టుకొన్న కొత్త ధృతరాష్ట్రునిలా
నాకే తెలియని ఇంక దేనికోసమో ఎదురుచూస్తూ
నిశాచరుడిలా నిద్రపోతూనే వుంటాను.
కట్ చేస్తే -
పూర్తిగా రంగులు కలపకుండానే
నా వయ్యారి సుకుమార కుంచెలు
నా చేతివేళ్ళమధ్య నాట్యం చేయకుండానే
నేనింకా మొదలేపెట్టని నా జీవితచిత్రం
అప్పుడే పూర్తయిపోతుందే అన్న ఆశ్చర్యం
ఎంత వేదనో, అంతే సాంత్వన కదా.
హృదయాంతరాల్లో మెలిపెడుతున్న
అంతశ్శోధనల అలజడిలోంచి
నేనిప్పటిదాకా కూరుకుపోయిన ఊబికి
ఇంక రానంటూ నిష్క్రమిస్తూ,
నిండుగా ఊపిరిపీల్చుకొంటూ,
నా సుజనజీవన స్రవంతిలోకి వస్తూనే...
అప్పటిదాకా నేను కప్పేసుకున్న
నా ఇనుపతెర వెనుక...
ఇంకా నాకోసం చేతులుచాచి పిలుస్తున్న
నా ప్రేమలను, స్నేహాలను, జ్ఞాపకాలను
నా పుస్తకాలను, రచనలను, రాతలను...
మంచు దుప్పటి కప్పుకున్న
నా హృదయ శిఖరాగ్రం నుంచి
గొంతెత్తి పిలుస్తూ,
చేతులెత్తి స్వాగతిస్తూ -
స్వర్ణరేణువుల ఇసుకముద్దల్ని
చేతులనిండా కప్పేసుకొంటూ
ఎక్కడా సరిలేని, సాటిలేని
నా సృజనసముద్రపు అంచుల్లోకి
పునరాగమిస్తూ, పునీతమౌతూ -
నా కళ్ళు వర్షిస్తూ, నా హృదయం ద్రవిస్తూ -
చేరి, కోరి నేను మళ్ళీ కట్టుకొంటున్న
నా ప్రియమైన, నాకెంతో ఇష్టమైన
నా కొత్తబంగారు లోకపు ఊపిరుల గూటికి
ఆత్మీయంగా నేనందిస్తున్న ఈ చిన్న కవితే
ఓ కొత్త ఆరంభం కావచ్చు.
నా అంతరంగంలో పడిపడి లేస్తున్న
పిచ్చిఊహల పదబంధాల అలల్లో తడుస్తూ,
తిరిగివస్తూ, నేను మళ్ళీ మొదలెట్టిన
నా సిసలైన రంగులకలల కాన్వాసుకు
ఈ నాలుగువాక్యాలే నాంది కావచ్చు.
- మనోహర్ చిమ్మని
(Published in "Palapitta" Literary Magazine, April 2025 issue.)
100 Days, 100 Posts. 72/100.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani