ఒక చిరంజీవి, ఒక విజయశాంతి-సుహాసిని, ఒక వీరేంద్రనాథ్, ఒక ఇళయరాజా-వేటూరి... ఇలాంటి దిగ్గజాలు నాలుగుస్థంభాల్లా అలా ఉన్నారంటేచాలు... ఇంక ఆ సినిమా షూటింగ్‌కి ముందే హిట్ కదా? అప్పుడు డైరెక్టర్ కోదండరామిరెడ్డి అయితే ఏంటి, రవిరాజా పినిశెట్టి అయితే ఏంటి?
ఏ సినిమాకైనా సగం హిట్ కాంబినేషన్‌తోనే వస్తుంది. మిగిలిన సగం వారి టాలెంట్, స్కిల్స్, మన్నూ మశానం ఏదైనా కావచ్చు. ఒక్కోసారి అలాంటిదేం లేకుండానే అతి చెత్తగా తీసిన సినిమా కూడా హిట్ కావచ్చు. దాన్నే లక్ అంటాం.
అదీ లెక్క.
అప్పుడైనా ఇప్పుడైనా, హిట్ డైరెక్టర్ల సక్సెస్‌ల వెనుక రహస్యం ఇదే.
హిట్ కాంబినేషన్.
హిట్ కాంబినేషన్.
నేను సినిమాల్లోకి రాకముందే ఇలాంటి సమీకరణాల లెక్క గురించి నాకు చెప్పింది, ఒక సీనియర్ కోడైరెక్టర్.
కట్ చేస్తే -
ఇదే సీనియర్ కోడైరెక్టర్ నాతో ఇంకో రెండు మాటలు అప్పట్లోనే చెప్పాడు...
"నువ్వు నీ మొదటి సినిమా ఎట్టిపరిస్థితుల్లో హిట్ చెయ్యాలి. అలా కాలేదంటే మాత్రం చాలా స్ట్రగుల్ ఉంటుంది తర్వాత."
"ఇప్పుడు నువ్వు హీరో రాజాతో, ఇంతమంది పేరున్న కమెడియన్స్, సపోర్టింగ్ ఆర్టిస్టులతో చేస్తున్నావు. వాల్యూ విషయంలో, నీ తర్వాతి సినిమాలు ఖచ్చితంగా ఇంకా పైపైకే వెళ్ళాలి" అని.
మొదటి విషయం జరగలేదు. రెండో విషయం నేను వినలేదు.
"కొన్ని జ్ఞానోదయాలు చాలా ఆలస్యంగా అవుతాయి" అని అప్పుడప్పుడూ నేను అంటుంటాను. ఇదీ అలాంటిదే ఇంకో జ్ఞానోదయం.
తర్వాత, ఇదే సీనియర్ కోడైరెక్టర్ నా మొదటి సినిమా "కల"కు కోడైరెక్టర్‌గా పనిచేశాడు. నాకు మంచి మిత్రుడయ్యాడు. ఇప్పటికీ నిర్మొహమాటంగా మేము చాలా విషయాలు గంటలు గంటలు మాట్లాడుకుంటాము.
ఇప్పుడు అదే సీనియర్ కోడైరెక్టర్ మిత్రుడు, నేను కలిసి ఇంకో సినిమా చెయ్యబోతున్నాం. ఆ వివరాలు ఇంకో పోస్టులో.
- మనోహర్ చిమ్మని
100 Days, 100 Posts. 65/100.
100 Days, 100 Posts. 65/100.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani