Wednesday, 30 November 2016

మోదీ ఎఫెక్టు .. చిన్న సినిమాలకు గిఫ్టు!

నిజంగా 500, 1000 నోట్ల రద్దు తర్వాతి పరిణామాలు ఇంకా ముందు ముందు ఎలా ఉంటాయో తెలీదు కానీ, ఒక్కటిమాత్రం నిజం.

ఇది ఖచ్చితంగా సినీ ఫీల్డులో చిన్న సినిమాల నిర్మాణం ఊపందుకోడానికి బాగా ఉపయోగపడుతుంది.

అల్రెడీ ఒక టాప్ స్టార్ చెప్పనే చెప్పింది. నేను నా పారితోషికం అంతా వైట్‌లోనే తీసుకుంటాను అని!

కోట్ల బడ్జెట్‌లతో భారీ సినిమాలు తీసేవాళ్లకు ఇప్పుడు చాలా విషయాలు 'మేనేజ్' చేయడం అంత ఈజీకాదు.

చిన్న బడ్జెట్ సినిమాలకు అలా మేనేజ్ చేయాల్సిన అవసరమే లేదు!


కట్ టూ మన టాపిక్ - 

ఇలాంటి పరిస్థితుల్లో సత్తా ఉన్న చిన్న బడ్జెట్ సినిమాల హవానే బాగా నడుస్తుంది. బడ్జెట్ కోటిలోపే కాబట్టి నో వర్రీ. పెద్ద రిస్క్ కాదు.

నేను చెప్తున్న "కోపరేటివ్ ఫిల్మ్ మేకింగ్" పధ్ధతిలో అయితే బడ్జెట్ + రిస్క్ శాతం ఇంకా తగ్గుతుంది.

కేవలం ఒక 90 రోజుల్లో, ఒక సత్తా ఉన్న నీట్ కమర్షియల్ సినిమా తీసి రిలీజ్ చేయొచ్చు. సక్సెస్ రేంజ్‌నుబట్టి కోట్లలో లాభాలు పొందొచ్చు.

సినిఫీల్డుపైన ప్యాషన్ ఉన్న కొత్త నిర్మాతలకు, ఇన్వెస్టర్స్‌కు ఇదే రైట్ టైమ్! బడ్జెట్ అంతా ఒక్కరే పెట్టాల్సిన అవసరంకూడా లేదు ..

నా ఫేస్‌బుక్/ట్విట్టర్/బ్లాగ్ ఫ్రెండ్స్‌లో ఈవైపు ఆసక్తి ఉండి, వెంటనే ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నవారెవరైనా .. నా మెసేజ్ బాక్స్‌కు మీ వివరాలు, మొబైల్ నంబర్ పంపండి. నేనే కాల్ చేస్తాను.

తక్కువ ఇన్వెస్ట్‌మెంట్.
ఎక్కువ లాభాలు.
ఓవర్‌నైట్‌లో సెలబ్రిటీ హోదా, ఫేమ్!

ఇంకేం కావాలి? :) 

Tuesday, 29 November 2016

దీక్షా దివస్!

"తెలంగాణ తెచ్చుడో, కె సి ఆర్ సచ్చుడో!"

ఈమాటనడానికి ఎన్ని గుండెలుండాలి? ఎంత ఆత్మ విశ్వాసం కావాలి? ఎంత సంకల్పబలం తోడవ్వాలి?

ఒక కమిట్‌మెంట్.
ఒక కన్విక్షన్.
ఒక కంపల్షన్.

ఒక్కటే గోల్.

అది తెలంగాణ సాధన.

ఎన్నో వెటకారాలు, వెక్కిరింపులు, తిట్లు, శాపనార్థాలు, ఛీత్కరింపులు, కుట్రలు, కుతంత్రాలు. ఒకటా రెండా ..

ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి ఇంటా బయటా నానా ప్లాన్లు.  

అన్నీ ఒకవైపే గురి. ఒక్కడిపైనే గురి.

కె సి ఆర్.

అయితే - ఆ రాళ్లతోనే తనచుట్టూ ఒక శత్రునిర్భేద్య దుర్గం నిర్మించుకోగలిగిన వ్యక్తి, ఉద్యమశక్తి కె సి ఆర్. ఆ దుర్గాన్ని ఛేదించి, కె సి ఆర్ దరిదాపుల్లోకి కూడా ఏ శత్రువూ చేరుకోలేకపోయాడు.

ఆ దుర్గం మరేదో కాదు.

యావత్ తెలంగాణ ప్రజలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, ఉద్యోగులు, ఆ జేయేసీలూ, ఈ జేయేసీలూ, సోషల్ మీడియా .. అన్నీ.

అదంతా ఒక డైనమిక్ స్ట్రాటజీ.

ఎవరెన్ని చెప్పినా, ఏం చెప్పినా, ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా .. చరిత్ర సాక్షిగా బంగారు అక్షరాలతో చెక్కిన నిజం ఒక్కటే.

కె సి ఆర్ లేకపోతే మొన్నటి తెలంగాణ ఉద్యమం లేదు. తెలంగాణ వచ్చేది కాదు.

జయహో కె సి ఆర్! 

Monday, 28 November 2016

ఇ-ఆఫీస్ కు స్వాగతం!

తెలంగాణ రాష్ట్రంలో "పేపర్‌లెస్" బోర్డు సమావేశాన్ని నిర్వహించిన తొలి సంస్థ రాష్ట్ర ఖనిజాభివృధ్ధి సంస్థ (TSMDC).

అది మొన్న నవంబర్ 22వ తేదీనే విజయవంతంగా జరిగింది.


కట్ చేస్తే - 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ గారికి పొలిటికల్ సెక్రెటరీ, TSMDC ఛైర్మన్ కూడా అయిన శేరి సుభాష్ రెడ్డి, ఇదే TSMDC వేదికగా అతిత్వరలో మరో సంచలనానికి తెరలేపనున్నారు.

అది డిసెంబర్ 1, 2016.

ఆరోజునుంచీ, తెలంగాణ రాష్ట్రంలో తొలి పేపర్‌లెస్ "ఇ-ఆఫీస్" గా TSMDC కార్యాలయం పనిచేయబోతోంది!

రాష్ట్ర పరిశ్రమలు, ఐ టి శాఖ మంత్రి కె టి ఆర్ గారి ఆదేశాలమేరకు ఈ విషయంలో ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి.

కొత్తగా రూపాంతరం చెందనున్న ఈ "ఇ-ఆఫీస్" ప్రక్రియ వల్ల ప్రధానంగా ఆఫీసుల్లో ఉండే రెడ్‌టేపిజం పోయి, పనివేగం పెరుగుతుంది. ఎక్కడ ఏ ఫైల్ ఉందీ, ఎక్కడ ఎందుకు ఆలస్యం జరుగుతోందీ ఒకే ఒక్క క్లిక్‌తో తెలిసిపోతుంది. పారదర్శకత, జావాబుదారీతనం, సిబ్బంది పనితీరు మరింతగా మెరుగుపడతాయి.

ఆఫీస్ కార్యకలాపాల నిర్వహణలో ఆధునికమైన ఒక సెన్సేషనల్ మార్పు దిశగా తొలి అడుగు వేస్తున్నTSMDC ఛైర్మన్ శేరి సుభాష్ రెడ్డి గారికీ, వారి సిబ్బందికీ ఈ సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు.

వెల్‌కమ్ డిజిటల్ తెలంగాణ! 

Thursday, 24 November 2016

విజయీభవ!

ఆయనే ఒక ఉద్యమం, ఉద్యమస్పూర్తి, ఉద్యమశక్తి.

చెక్కుచెదరని ఏకాగ్రత, కట్టిపడేసే వాగ్ధాటి.

ప్రతి విషయంపైన సాధికారిక పరిజ్ఞానం.

పట్టుదల, ఓర్పు, చాకచక్యం, చాణక్యం.

తెలంగాణ సాధన అనే జీవితలక్ష్య సాకారం. 

బంగారు తెలంగాణకోసం నిరంతర తపన.

అనుక్షణం అలోచన, అహరహం అధ్యయనం.

అవిశ్రాంత కృషి, అద్వితీయ రాజనీతి.

రాజకీయనాయకునిలో మనం చూడని మహోన్నత మానవీయ కోణం.

జనహితం కోసం ఎవ్వరూ ఊహించని కార్యక్రమాలు.

బృహత్ పథకాలు, భగీరథ ప్రయత్నాలు, వేగంగా సత్ఫలితాలు.

ప్రజలకోసం ఇంకెన్నో చేయాలన్న ఆరాటం.

పెద్దల పట్ల గౌరవం, మర్యాద.

మనం మర్చిపోకూడని మన సంస్కృతిపట్ల మమకారం.

ఒక్కడు - 

మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ..

"ప్రగతి భవన్", నూతన అధికారిక గృహప్రవేశం సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు!                                                                         

Tuesday, 22 November 2016

భజన వెర్సస్ అభిమానం!

"కె సి ఆర్ కు, టి ఆర్ ఎస్ కు నువ్వు భజన చేయకు!" అని మొన్నొక మిత్రుడు నాతో చెపాడు, కార్లో వెళ్తుండగా.

నేను సూటిగా చెప్పాను:

"క్రియేటివిటీ వేరు. రాజకీయాలు వేరు .. నా మనసుకు నచ్చింది నేను చేస్తాను. నేను చేయాలనుకున్నది చేస్తాను. నా ఫేస్‌బుక్, నా వాల్, నా బ్లాగ్, నా ట్విట్టర్, నా ఫీలింగ్స్, నా రాతలు, నా ఇష్టం."

"నీకో, ఇంకొకరికో నచ్చడంకోసం నేను రాయడంలేదు. పోస్ట్ చేయడంలేదు. ఆ సమయంలో నాకు తోచింది నేను రాస్తున్నాను. నీకు నచ్చితే లైక్ కొట్టు. నచ్చకపోతే సింపుల్‌గా ఒకే ఒక్క క్లిక్‌తో నన్ను అన్‌ఫ్రెండ్ చెయ్యి!" అని కూడా చెప్పాను.

"అంతేనంటావా?" అన్నాడు నా మిత్రుడు.

"అంతే. అంతకంటే ఈ టాపిక్ మీద డిస్కషన్ పెంచి నీ విలువైన టైమ్‌నీ, నా విలువైన టైమ్‌నీ నేను వృధా చేయలేను!" అన్నాను.

నా మిత్రుని దగ్గర సమాధానం లేదు.

ఎలా ఉంటుంది?

మిగిలినవారెవరి విషయమో నాకు తెలియదు. కానీ, నా విషయంలో మటుకు .. భజన వేరు. అభిమానం వేరు.

భజన ఒక భ్రమ. అభిమానం ఒక రియాలిటీ.

భజన వెనుక ఆశలు, కోరికలు, అవసరాలుంటాయి. అభిమానం వెనుక కేవలం ఫీలింగ్స్ ఉంటాయి.

ఈ రెండింటి మధ్య తేడాని గుర్తించలేనివాళ్లే నానా కామెంట్స్, నానా సౌండ్స్ చేస్తుంటారు.  అదే అసలైన భజన అని నా ఉద్దేశ్యం.

Thursday, 17 November 2016

ది లీడర్

సుమారు 130 కోట్ల జనాభా ఉన్న ఒక దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఏదో ఆదరా బాదరాగా రాత్రికి రాత్రే ఓ చెత్త నిర్ణయం తీసుకుంటాడని ఎవ్వరూ అనుకోరు.

ఒకవేళ దాని వెనుక ఏదైనా చిన్న రాజకీయ అవసరం ఉన్నా, దేశ ప్రయోజనం అనే గట్టి బేస్ లేకుండా ఇలాంటి నిర్ణయం మోదీ తీసుకోలేడు. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి సందేహం ఉండనక్కరలేదు.

కానీ, ఏ నల్లకుబేరులనైతే టార్గెట్ చేసి ఈ నిర్ణయం తీసుకున్నారో, వారి సంఖ్య మొత్తం దేశ జనాభాలో కేవలం 2 శాతాన్ని మించి ఉండదని ఒక అంచనా.

ఈ 2 శాతం మేనిప్యులేటర్స్‌ను ట్రాక్ చేసి పట్టుకొనే ఒక పటిష్టమైన సిస్టమ్‌ను రూపొందించలేనంత బలహీనమైందా మనదేశ ఆర్థిక యంత్రాంగం ? అంత సామర్థ్యం లేనిదా? నిజంగా నమ్మశక్యం కాదు.

ఆ 2 శాతం బ్లాక్‌మనీ వాళ్లకోసం మిగిలిన 98% మంది దైనందిన జీవితం రాత్రికి రాత్రే ఊహించనివిధంగా తల్లకిందులు కావల్సిందేనా?

ఈ స్థంభన, ఈ గందరగోళం ఇంకెన్నాళ్లు అంటే ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేకపోవడం నిజంగా విచారకరం.


కట్ టూ కె సి ఆర్ -    

ఏరంగంలోనైనా సరే, ఊహించకుండా వచ్చే ప్రతికూల పరిస్థితులను కూడా తనకు అనుకూలం చేసుకొని ముందుకుపోగలిగినవాడే తిరుగులేని నాయకుడవుతాడు.

మన తెలగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ అలాంటి నాయకుడు. ఇదే లక్షణాన్ని మన IT మినిస్టర్ KTR కూడా పుణుకిపుచ్చుకున్నాడు.

ముందు నవంబర్ 11 వరకు అని, తర్వాత నవంబర్ 14 వరకు అని, ఇప్పుడు నవంబర్ 24 వరకు అని .. ఇదే అదునుగా, ఏళ్లుగా బకాయిలున్న టాక్స్‌లన్నిటినీ ఒక్క దెబ్బతో మోదీ చెల్లు చెప్పిన ఆ పాత 500, 1000 నోట్లతోనే కట్టించేసుకున్నారు మనవాళ్లు.

ఒక్క బకాయిలేకాదు, ఫ్యూచర్ టాక్స్‌లు కూడా ఇప్పుడే కట్టించుకోవడం అనేది నిజంగా ఒక అద్భుతమైన టాలెంట్!

కేంద్రాన్ని ఒప్పించి మనవాళ్లు తీసుకొన్న ఈ చొరవ వల్ల, దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా ఇది మంచి లాభదాయకమైంది. వాళ్లూ మనల్నే ఫాలో అవుతున్నారు.

ముందు దేశం. తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు. ఇది కె సి ఆర్ కు బాగా తెలుసు.

ఇది తెలుసు కాబట్టే - దేశంలోని మిగిలిన అందరు CM ల లాగా మందలో కలిసిపోయి గందరగోళం చేయటంలేదు.

ఇప్పుడు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో కూడా మన రాష్ట్ర ఎం పి లకు ఈ విషయంలో ఖచ్చితమైన ఆదేశాలిచ్చాడు కె సి ఆర్:

"ఈ చర్య వల్ల మనకు రాష్ట్రంలో ఎదురవుతున్న తీవ్రమైన అసౌకర్యం గురించీ, ప్రతిరోజూ భారీస్థాయిలో కోల్పోతున్న మన ఆదాయం గురించీ వివరంగా చెప్పండి. కానీ, సమావేశాలు మాత్రం సజావుగా జరుగనివ్వండి" అని.

రేపు నవంబర్ 24వ తేదీన ప్రధాని ఇచ్చే వివరణ పూర్తిగా విన్నతర్వాతే దీనిపైన తగిన నిర్ణయం తీసుకోవాలన్నది కె సి ఆర్ ఉద్దేశ్యం.

కేవలం రాజకీయం కోసమో, మొహమాటానికో గుంపులో గోవిందా అనే రకం కాదు మన కె సి ఆర్.

మన దేశం. మన రాష్ట్రం. మన ఐడెంటిటీ. మన ఆలోచన.

వెరసి - ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్. ఒక సిన్సియర్ స్టేట్స్‌మన్. ఒక రియల్ లీడర్.

అది .. మన కె సి ఆర్.   

Tuesday, 15 November 2016

న్యూ-ఏజ్ లైఫ్‌స్టయిల్!

దేశంలో ఇప్పుడున్న కరెన్సీ కన్‌ఫ్యూజన్ సిచువేషన్‌తో ఎలాటి సంబంధంలేకుండా .. తన పనినీ, తన లైఫ్‌నీ సంపూర్ణ స్వేఛ్ఛతో లీడ్ చేయగలుగుతున్నవాడే సిసలైన మగాడు.

ఇలాంటోన్ని అనొచ్చు ..

"ఆడు మాగాడ్రా బుజ్జీ" అని!

అలాగని చెప్పి, వాడు బాగా బ్లాక్‌మనీ ఉన్నవాడనికాదు నా ఉద్దేశ్యం.

ఫైనాన్షియల్ ఇంటలిజెన్స్ మస్త్‌గా ఉన్నోడని!

ఫైనాన్షియల్‌గా ఇలాంటి స్థితప్రజ్ఞ దశకు చేరుకోవడం అంత సులభమైన విషయం కాదు. నూటికి 90% మందికి ఇది అస్సలు చేతకాదు.

ఈ 10% ఆర్థిక స్థితప్రజ్ఞులను ఇకనుంచైనా ఫాలో అయ్యి, వారి మైండ్‌సెట్‌ను, లైఫ్‌స్టయిల్‌ను బాగా అధ్యయనం చేసి బాగుపడటం అనేది చాలా అవసరం.

మన జీవితంలో చెప్పాపెట్టకుండా ఇలా సడెన్‌గా వచ్చే చిన్న చిన్న సునామీలకు ఏమాత్రం ఎఫెక్టు కాకుండా, ఈ స్థాయిలో బాగుపడటాన్నే నా దృష్టిలో సిసలైన "ఫ్రీడమ్" అందురు. :) 

సినిమా చూపించాడు మోదీ!

ఒక్క దెబ్బకు దేశవ్యాప్తంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు 90% సినిమాల షూటింగ్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

మిగిలిన 10% కొంచెం ఎక్కువ ముందు జాగ్రత్తపరులై ఉంటారు. అంతే తేడా.

ఇండస్ట్రీలో "సినిమా తీస్తున్నాం" అని అనుకొన్న రోజు నుంచి, ప్రతిరోజూ డబ్బు పెట్టటమే ఉంటుంది కాని ఎలాంటి రొటేషన్ ఉండదు. సినిమా పూర్తయ్యి, రిలీజయ్యి, కలెక్షన్లు వచ్చినతర్వాతే .. మళ్లీ డబ్బు వెనక్కిరావడం చూస్తారు సినిమావాళ్లు.

ఈ నేపథ్యంలో - ప్రతిరోజూ షూటింగ్‌లో ట్రాన్స్‌పోర్ట్, భోజనం, ఇక్విప్‌మెంట్ రెంట్లు, ఇతర రోజువారీ రెంట్లు, డీజెల్, టీమ్‌లో కిందిస్థాయి వర్కర్స్ కు ఇవ్వాల్సిన రోజువారీ భత్యాలు .. ఇవ్వన్నీ ఏరోజుకారోజు తప్పనిసరి. వీటిల్లో దాదాపు మొత్తం క్యాష్ రూపంలోనే అవసరం.

మోదీజీ పుణ్యమా అని ఒక్క దెబ్బతో సీన్ మారిపోయింది.

నో క్యాష్! నో షూటింగ్!!

దేశాన్ని మోదీ ఏదో చేద్దామనుకొంటోంటే నీ సినిమాలెవడిక్కావాలయ్యా అనొచ్చు.

కరెక్ట్. అదే నెక్స్‌ట్ కొష్చన్. నాకు తెలుసు.

ఇక్కడ సినిమాలా, టీవీలా అన్నది కాదు ముఖ్యం. ఇదొక అతిపెద్ద ఇండస్ట్రీ. దేశానికి వేల కోట్ల ఆదాయం తెచ్చిపెడుతున్న ఒక ప్రధాన పరిశ్రమ. ఈ పరిశ్రమ మీద ఆధారపడి దేశవ్యాప్తంగా కొన్ని లక్షల కుటుంబాలు బ్రతుకుతున్నాయి.

ఆ లక్షల కుటుంబాల్లో 90% మంది సినిమా నిర్మాణంలోని వివిధ డిపార్ట్‌మెంట్లలో రోజు కూలీకి పనిచేసే కార్మికులు. సినిమా భాషలో ఏరోజుకారోజు వీరికిచ్చే డబ్బుని "డైలీ బేటా" అంటారు. తెలుగులో దిన భత్యం. ఇదిలేకుండా వారికి దినం గడవదు.

ఒక్క సినిమా ఇండస్ట్రీనే కాదు. ఇలాంటి డైలీ వేజెస్‌కు కార్మికులు పనిచేసే ఇండస్ట్రీలు, వ్యాపారాలు దేశంలో ఇంకెన్నో ఉన్నాయి.  

వీళ్లంతా ఎన్నిరోజులు అప్పులు చేస్తారు? ఎన్నాళ్లని అప్పు దొరుకుతుంది? అసలెవరిస్తారు?

మనం మనం అనుకోవడం కాదు. కేంద్రంలో ఎన్నో కసరత్తులు 24 గంటలూ జరుగుతుంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ సమస్య తొందరగానే ఒక కొలిక్కివస్తుందని ఆశిద్దాం.

ఎందుకంటే ..

మనిషి రోడ్డునపడ్డాడు.       

Sunday, 13 November 2016

ఈరోజు నుంచే, ఈక్షణం నుంచే .. అనుక్షణం!

జీవితంలో ఎవరైనా, ఏ దశనుంచైనా ఒక కొత్త అధ్యాయం ప్రారంభించవచ్చు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఇప్పటికే ప్రూవ్ చేసి ఉన్నారు.

చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తూ, కొత్త రిజల్టు రావాలనుకోవడంకన్నా ఫూలిష్‌నెస్ మరొకటుండదు.

డబ్బు, ఆస్తులు ఎంత నష్టపోయినా ఫర్వాలేదు. కానీ, చూస్తూ చూస్తూ కాలాన్ని నష్టపోకూడదు. నోటినుంచి మాటను జారవిడుచుకోకూడదు.

కాలం వెనక్కి రాదు. మాటని వెనక్కి తీసుకోలేం.

ఇలాంటి పరిస్థితుల్లో రిలేషన్‌షిప్పే నాకు చాలా ముఖ్యం తప్ప వేరే ఏ విషయం కాదు.

ఆ మరేదో విషయం మన బేసిక్ కమ్యూనికేషన్‌నే దెబ్బతీస్తున్నప్పుడు, ఆ మరేదో విషయాన్ని వదులుకోవడమే అన్నివిధాలా మంచిది. అన్నివిధాలా ఉత్తమం కూడా.

కనీసం ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్‌లోని ఆ పరస్పర అభిమానం, ఆ గౌరవమైనా మిగుల్తాయి.


కట్ టూ గట్స్ -  

కాన్‌ఫిడెన్స్, గట్స్ ఉంటే చాలు. ఏదయినా సాధించవచ్చు.

ఈరోజే, ఈక్షణమే .. ఒక అతి చిన్న గోల్ పెట్టుకొని, దాన్ని పూర్తిచేసి పడుకోవడంతో ప్రారంభించినా చాలు. తర్వాత లక్ష్యం ఎంత పెద్దదయినా సరే, సాధించడం అనేది  అలవాటయిపోతుంది.

మళ్లీ ఆ ట్రాక్ ఎక్కుతాం. ట్రాక్‌లో ఉంటాం.

అయితే .. 'మన నమ్మకాలకు, మన నిర్ణయాలకు మనమే బాధ్యులం' అనే వాస్తవాన్ని మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోవద్దు.

అలా మర్చిపోనంతవరకు ఏదయినా సాధ్యమే. 

Saturday, 12 November 2016

బ్లాక్ మనీవాళ్లా, సామాన్యప్రజలా .. ఎవరు టార్గెట్?

> ఇవాళ ఉదయం 10.30 నుంచి, మధ్యాహ్నం 2.30 వరకు నా చీఫ్ టెక్నీషియన్ ఒకరు 2 ATM లు మారి, 4 గంటల్లో 2 వేలు డ్రా చేసుకోగలిగాడు!

> కొంపల్లిలో కూరగాయలమ్మే ఒక వృధ్ధురాలు తనదగ్గరున్న ఎనిమిది 500 నోట్లను మార్చుకోడానికి పని మానుకొని, ఓ ప్రభుత్వరంగ బ్యాంకులో 3 గంటలు నిల్చోవాల్సివచ్చింది. తర్వాత ఆమె ఆధార్ కార్డును కూలంకషంగా పరిశీలించి, ఆమెకు 4 వేలిచ్చారు బ్యాంకువాళ్లు.  

> కొత్త 2000 కాగితంతో పక్కనే ఉన్న కిరాణాషాపుకు వెళ్లిన మా వాచ్‌మన్ నిత్యావసర వస్తువులు ఏవీ కొనుక్కోకుండా వెనక్కి రావాల్సి వచ్చింది. కారణం .. అక్కడ 2000 లకు చిల్లర లేదు!

> సంవత్సరంలో 365 రోజులూ కస్టమర్లు ఎప్పుడూ వెయిటింగ్‌లో ఉండే "మినర్వా" లాంటి హోటల్‌లో నిన్న సాయంత్రం కేవలం ముగ్గురంటే ముగ్గురున్నారు!

> చికెన్ షాపులు, పాన్ షాపులు, ఇరానీ హోటళ్లు, చిన్న స్థాయి నుంచి బడా షాపింగ్ సెంటర్లు, సినిమా హాళ్లు .. అన్నీ గత నాలుగురోజులుగా దాదాపు నిర్మానుష్యమైపోయాయి. ప్రతిచోటా గిరాకీ లేక ఎవ్వరూ ఊహించని ఒకరకమైన స్మశాన వైరాగ్యం!

ఇలాంటి లైవ్ ఉదాహరణలు కనీసం ఇంకో 2 డజన్లు ఇవ్వగలను ..

ఎందుకు ..  అసలెందుకిలా జరిగింది?


కట్ టూ మన ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక యంత్రాంగం -

బ్లాక్‌మనీ వెలికి తీయాల్సిందే, ఆర్థిక నేరస్థులను శిక్షించాల్సిందే. నాలుగు రోజులక్రితం ప్రధాని మోదీజీ తీసుకొన్న నిర్ణయం హర్షించదగిందే.

కానీ, ఇంత పెద్ద స్టెప్ తీసుకొంటున్నప్పుడు ఎంతదూరం ఆలోచించాలి? ఎన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని ఉండాలి?

నాదగ్గరున్న సమాచారం ప్రకారం గతంలో RBI మొత్తం 17.5 లక్షల కోట్ల కరెన్సీ ముద్రించింది. దీన్లో 86% కేవలం 500, 1000 నోట్లు.

అంటే, మనదేశం మొత్తం కరెన్సీలో కేవలం 14% మాత్రమే 100, 50, 20, 10 నోట్లన్నమాట!

ఈ కరెన్సీ రేషియో నేపథ్యంలో - మోదీజీ ప్రకటించిన రోజు అర్థరాత్రినుంచే 500, 1000 నోట్లు చెల్లవు అన్నప్పుడు .. తెల్లారినప్పట్నుంచి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం.

ప్రధాని తీసుకొనే ఒక పెద్ద నిర్ణయం వెనుక ఎంత కసరత్తు ఉంటుంది? .. ఉండాలి?

ప్రధాని నిర్ణయాన్ని ఆచరణలో పెట్టాల్సిన మన దేశ ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, ఫైనాన్స్ సెక్రెటరీ శక్తికాంత్ దాస్, ఆర్ బి ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ .. ఈ ఆర్థిక దిగ్గజాల సమగ్ర దేశవ్యాప్త యంత్రాంగం అసలేం చేసినట్టు? .. చేస్తున్నట్టు? 


కట్ టూ ది రియాలిటీ టుడే - 

నల్లధన కుబేరులైన బడా బడా ఇండస్ట్రియలిస్టులు, క్రికెట్ స్టార్స్, ఫిల్మ్ స్టార్స్, రియాల్టర్స్ ఎట్సెట్రా ఎవరైనా పనులు మానుకొని, లైన్లల్లో నిల్చుని, ఏ చిన్న ఇబ్బందయినా పడుతున్న విజువల్స్ మీకు ఎక్కడైనా కనిపిస్తున్నాయా?

కానీ, మరోవైపు .. కష్టపడి అంతో ఇంతో సంపాదించుకొని కూడబెట్టుకొనే వ్యవసాయదారులు, గ్రామీణ మహిళలు, మధ్యతరగతివాళ్లు, ఔత్సాహిక చిన్న పారిశ్రామికవేత్తలు, డైలీ వేజర్స్ ..
ఏ బ్యాంక్ దగ్గర చూసినా, ఏ ATM ల దగ్గర చూసినా వందల సంఖ్యలో పనులుమానుకొని వీళ్లే కనిపిస్తున్నారు.

ప్రతి చిన్నా పెద్దా వ్యాపారం దాదాపు పూర్తిగా స్థంభించిపోయింది.

ఈ పరిస్థితి ఒక్క మన రాష్ట్రంలోనే కాదు. దేశంలోని మొత్తం 29 రాష్ట్రాల్లోనూ ఇంతే.

ఫలితం .. వృధ్ధిరేటులో మరింత పతనావస్థ!

నిజంగా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే - అసలు ఇన్‌కమ్ టాక్స్ పట్ల ఏమాత్రం అవగాహన లేని వ్యవసాయదారులు, మహిళలు, నిరంతరం ఆర్థికంగా స్ట్రగుల్ అయ్యే వివిధ రంగాల ప్రొఫెషనల్స్, ఔత్సాహిక చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు, ఇతర సామాన్య ప్రజలే బాధపడుతున్నారు.

అసలు భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అని జీవితంలో మొట్టమొదటిసారిగా .. భయపడుతున్నారు.

తెలిసో తెలియకో 2.5 లక్షలకు మించి ఏ కొంచెం డిపాజిట్ లేదా, ట్రాన్సాక్షన్ చేసిన చాలామంది వ్యవసాయదారులు, మహిళలు, సామాన్య ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. ఎక్కడ ప్రాసిక్యూట్ చేసి, శిక్షించబడతామేమోనని!

ఇదంతా ఒకెత్తయితే - చేతిలోనో, బ్యాంకులోనో ఉన్న ఆ కొంచెం డబ్బుని కూడా తీసి ఖర్చుపెట్టడానికి ఎవ్వరూ ధైర్యం చేయడంలేదు. రేపేం జరగబోతోందో అన్న భయంతో!

సో, బయట మనీ రొటేషన్ పూర్తిగా స్థంభించిపోయింది.

ఒకే ఒక్క దెబ్బతో మనదేశ ఆర్థిక వ్యవస్థ విశ్వరూపం, సామర్థ్యం, బలం, బలహీనతలు బట్టబయలయిపోయాయి. అది కూడా సామాన్య ప్రజానీకానికి కూడా కూలంకషంగా అర్థమయ్యే స్థాయిలో!

ఒక సదుద్దేశ్యంతో మోదీజీ చేపట్టిన ఈ చర్య ఎందుకని ఇంత ఆర్థిక విధ్వంసానికి కారణమైంది? మన దేశ ఆర్థిక యంత్రాంగం ఏం చేస్తున్నట్టు?

ఈ మొత్తం పిక్చర్ చూస్తున్న ఆర్థిక నిపుణులు, సామాజికవేత్తలు ఏం చేస్తున్నారు? ఎందుకని మౌనంగా ఉన్నారు?

ఎందుకీ మౌనం?

అసలెవరికీ శిక్ష?!