Friday, 20 December 2013

కింగ్‌ఫిషర్ కేలెండర్లో తెలుగు మెరుపు!

యూబీ గ్రూప్ అధిపతి విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ కేలెండర్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అంతర్జాతీయస్థాయి క్రేజ్ అది. ఒక కేలెండర్‌కు ఆ రేంజ్ బ్రాండ్‌ని క్రియేట్ చేయగలిగింది బహుశా, నాకు తెలిసి, విజయ్ మాల్యా ఒక్కడే! 

కింగ్‌ఫిషర్ కేలెండర్‌ కోసం మోడల్‌గా ఎంపిక కావడమనేది కూడా ఏదో ఆషామాషీ వ్యవహారం కాదు. దానికోసం జరిగే స్క్రీన్‌టెస్టులు, సెలెక్షన్లు కూడా ఊహించని స్థాయిలో ఉంటాయి.

కేవలం మనవాళ్లేకాదు, ఎందరో అంతర్జాతీయస్థాయి మోడళ్లు కూడా ఈ కేలెండర్లో కనిపించడంకోసం పోటీ పడతారు.

ఎవరైనా ఒక అమ్మాయి, ఒక్కసారి కింగ్‌ఫిషర్ కేలెండర్లో మోడల్‌గా కనిపించిందంటే చాలు. జన్మ ధన్యం అయినట్టే. ఇంక ఆ అమ్మాయి కొత్తగా సాధించాల్సింది ఏమీ ఉండదంటే అతిశయోక్తికాదు. ఇంక అక్కడనుంచి "రా..రమ్మంటూ" ఎన్నో ఇతర క్రియేటివ్ రంగాలనుంచి రెడ్‌కార్పెట్ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.

ఓవర్‌నైట్‌లో టాప్‌రేంజ్ సెలెబ్రిటీలయిపోతారు.

మన బాలీవుడ్ హీరోయిన్లలో కూడా కొందరు ఈ కింగ్‌ఫిషర్ ప్లాట్‌ఫామ్ ద్వారానే బాలీవుడ్‌లోకి ఎంటరయి, అత్యున్నత స్థాయికి చేరుకోగలిగారంటే నమ్మగలరా?

ఈ మధ్య వరుసగా 5 హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా మెప్పించి, బాలీవుడ్‌లో టాప్ రేంజ్‌లో ఉన్న దీపికా పడుకొనే కూడా కింగ్‌ఫిషర్ కేలెండర్లో మోడల్‌గానే ఈ రంగులప్రపంచంలోకి ఎంటరయిందన్న విషయం చాలామందికి తెలియని నిజం.

ఇంకా - కత్రినా కైఫ్, యానా గుప్తా, ఉజ్వల రావత్, నర్గిస్ ఫక్రి, లిసా హేడెన్, కరిష్మ కొటాక్ మొదలైన వాళ్లంతా కూడా ఈ కింగ్‌ఫిషర్ కేలెండర్ ద్వారా వెలుగులోకి వచ్చినవాళ్లే.  

కట్ టూ తెలుగు శోభిత - 

2014 కింగ్‌ఫిషర్ కేలెండర్‌కు ఓ ప్రత్యేకత ఉంది. మొట్టమొదటిసారిగా ఒక తెలుగు మోడల్ (ఫ్రమ్ తెనాలి!)   కింగ్‌ఫిషర్ కేలెండర్‌కి మోడల్‌గా ఎంపికయింది. ఒక రకంగా ఇది సంచలనమే.

ఈ సంచలనం పేరు శోభిత ధూళిపాళ .. మిస్ ఇండియా ఎర్త్ 2013.

శోభిత మోడలింగ్‌తో కూడిన కింగ్‌ఫిషర్ 2014 కేలెండర్ ప్రపంచమంతా మరికొద్ది గంటల్లో (21 డిసెంబర్) రిలీజవబోతోంది. లెటజ్ ఆల్ విష్ శోభిత.. ఎ వెరీ ఫేసినేటింగ్ ఫ్యూచర్! 

శఠగోపాన్ని దొంగిలించిన జీవితం!

ఆ మధ్య మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ పీ పట్నాయక్, పాటల రచయిత కులశేఖర్ కాంబినేషన్లో అద్భుతమైన మ్యూజిక్ ట్రెండు ఒక ఊపు ఊపింది. అది కొంతకాలమే కావొచ్చు.

కానీ, అప్పటి ఆ ట్రెండుని అంత సులభంగా  మనం మర్చిపోలేం.

క్రమంగా ఆర్పీ పట్నాయక్ సంగీతాన్ని పక్కనపెట్టాడు. డైరెక్టరయ్యాడు. యాక్టరయ్యాడు. ఈ మధ్యే డైరెక్టర్‌గా ఒక ఇంగ్లిష్ సినిమా కూడా చేస్తున్నట్టు ఎక్కడో చదివాను. బహుశా అది కూడా ఇప్పటికి అయిపోయే ఉంటుంది. నేను నిజంగా ఆర్పీ పట్నాయక్‌ని అభినందిస్తున్నాను. తన అభిరుచి, ఆశయాలమేరకు.. తన ఇష్టానుసారం జీవితంలో ముందుకు వెళ్తున్నాడు.

కానీ, ఇక్కడ విషయం అది కాదు ..

కులశేఖర్ ఎందుకోమరి.. లిరిక్ రైటర్‌గా కూడా క్రమంగా తెరమరుగైపోయాడు. తర్వాత ఆయన కూడా దర్శకుడయ్యాడు.

కులశేఖర్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం "ప్రేమలేఖ రాశా" ఫ్లెక్సీని బేగంపేట్ లైఫ్‌స్టైల్ బిల్డింగ్ పైన కనీసం ఓ సంవత్సరంపాటు చూశాన్నేను. ఫ్లైఓవర్ పైన కార్లో వెళ్తున్నపుడు.. దాదాపు ప్రతిసారీ, ఎదురుగా అంత ఎత్తున కనిపించే ఆ ఫ్లెక్షీపైనే నా దృష్టి పడేది. తర్వాత ఆ ఫ్లెక్సీ కూడా కనుమరుగైపోయింది.

కట్ టూ శఠగోపం -

ఉన్నట్టుండి నిన్నటి "ఈనాడు" పేపర్లో కులశేఖర్ గురించి ఒక వార్త చదివాను. ఏదో గుళ్లో శఠగోపం దొంగిలించాడన్న నేరం నిర్ధారణ అయి, కులశేఖర్‌కు 6 నెలలు జైలు శిక్షపడిందని!

వెంటనే ఫోన్లద్వారా, ఇండస్ట్రీ మిత్రులద్వారా ఎంక్వయిరీ చేశాను. ఇది నిజం అయ్యుండదు అని నా ఉద్దేశ్యం. నిజం కాకూడదని కూడా.

కానీ ఇది నిజం. నేర నిర్ధారణ అయి, ప్రస్తుతం కులశేఖర్ జైల్లో ఉన్నాడు.

కానీ, దీన్ని మించిన బాధాకరమైన వార్త ఇంకొకటి తెలిసింది. సుమారు 100 కు పైగా సినిమాల్లో పాటలు రాసిన కులశేఖర్ ప్రస్తుతం అల్జీమర్స్ తరహా వ్యాధితో బాధపడుతున్నాడనీ, మనుషులను గుర్తుపట్టడం లేదనీ!

ఇంక నేనేం రాయలేకపోతున్నాను .. 

Wednesday, 18 December 2013

"1" హచ్ డాగ్ పోస్టర్!

ట్విట్టరంటే నాకు చాలా ఇష్టం. ఫేస్‌బుక్ కంటే కొన్ని విషయాల్లో దీనికే రెస్పాన్స్ రేట్ ఎక్కువ. కాకపోతే, ట్విట్టర్‌ని సరిగ్గా (లేదా చెత్తగా!) ఉపయోగించుకోగల సత్తా మాత్రం నేను కొందర్లోనే చూశాను.

ఉదాహరణకి - ఆర్‌జీవీ, అమితాబ్ బచ్చన్, ఎన్‌డీటీవీ సోనియా, నరేంద్ర మోడీ, వగైర వగైరా. ఈ మధ్య నారా లోకేష్, దిగ్విజయ్ సింగ్‌ల ట్వీట్ల గురించి కూడా చానెల్స్‌లో బ్రేకింగ్ న్యూస్‌లు చాలా చూశాం.

కట్ టూ సమంత ట్వీట్ -

ఈ మధ్యే విడుదలైన ఓ తెలుగు సినిమా పోస్టర్ ఆడవాళ్ల స్థాయిని దిగజార్చేవిధంగా ఉందంటూ ట్వీట్ చేసింది సమంత. దీని మీద మరెన్నో టీట్లు, న్యూస్ ఐటమ్‌లు, ఆన్‌లైన్ టిట్‌బిట్స్ చాలా వచ్చాయి.

నేను చదివిన వార్తల ఆధారంగా, నాకర్థమైంది ఏంటంటే - అందరూ గోల పెడుతున్న ఆ సమంత ట్వీట్ సుకుమార్-మహేష్‌ల "1" (నేనొక్కడినే) చిత్రం పోస్టర్‌పైనే!

నేనూ చూశాను ఆ పోస్టర్‌ని. సముద్రం ఒడ్డున చెప్పులు చేత్తో పట్టుకొని ముందు మహేష్‌బాబు నడుస్తోంటే, వెనకాల మోకాళ్లమీద, చేతులమీద పాకుతూ అతన్ని ఫాలో అవుతోంది హీరోయిన్ కృతి సనన్!  

నా అంచనా ప్రకారం - ఆ షాట్, ఆ చిత్రంలోని ఏదో ఓ పాటలో చక్‌మని అలా ఫ్లాష్‌లా వచ్చిపోయే ఒక చిన్న షాట్ అయి ఉంటుంది. వాళ్లు దాన్నిలా పోస్టర్‌గా రిలీజ్ చేయడమే సమంత ట్వీట్‌కి కారణమై ఉంటుంది బహుశా!

ఒక క్రియేటివ్ పర్సన్‌గా నేనా షాట్‌ని తప్పు పట్టడం లేదు. కానీ, క్రియేటివ్ ఫ్రీడమ్ (ఉండాల్సిన విధంగా) లేని మన సొసైటీలో, దాన్నొక పోస్టర్‌గా రిలీజ్ చేయటం మాత్రం అంత కరెక్టు కాదు. చెప్పాలంటే, ఒక పెద్ద రిస్క్!

ఇంకా చెప్పాలంటే - లేని నెగెటివిటీని కోరి ఆహ్వానించడమే అవుతుంది. తర్వాత ఏ మహిళా సంఘాలో ధర్నాలు చేయొచ్చు. పోస్టర్లూ చించేయొచ్చు. అదంతా చివరికి ఇంకెక్కడికో దారి తీయవచ్చు ..

కోట్లతో కూడిన మన హెవీ గ్యాంబ్లింగ్‌ను దృష్టిలో పెట్టుకొంటే - ఇంతకంటే ఇంకెంతో బెటర్ పోస్టర్స్‌ని ఎన్నయినా సృష్టించగల సత్తా సుకుమార్‌కు ఉందనే నా ఉద్దేశ్యం.        

కట్ టూ మళ్లీ సమంత -

మనసులో అనిపించింది ఎలాంటి హిపోక్రసీ లేకుండా ట్వీట్ చేసినందుకు హార్టీ కంగ్రాట్స్ టూ సమంత! అయితే, ఒక టాప్ రేంజ్ హీరోయిన్ స్థానంలో ఉండీ - సినిమా చూస్తేగాని తెలీని ఒక అంశంపైన నువ్వు మరీ అంతలా రియాక్ట్ అవకపోతేనే మంచిదేమో సమంతా!

టేక్ కేర్ అండ్ హప్పీ ట్వీటింగ్ ..   

Monday, 16 December 2013

విభజన తర్వాత ఇండస్ట్రీ ఎలా ఉండబోతోంది?

ఇండస్ట్రీలోని చాలామంది మనస్సుల్ని తొలుస్తున్న ఏకైక ప్రశ్న ఇదే. ఈ ప్రశ్నతో సతమతమౌతున్నవారిలో తెలంగాణ, సీమాంధ్ర వాళ్లు ఇద్దరూ ఉన్నారు.

ఇది నూటికి నూరుపాళ్లూ ఒక వ్యాపారపరమైన ప్రశ్న.

మొన్నామధ్య మా ఆఫీసుకి ఓ ఔత్సాహిక నిర్మాత వచ్చాడు. 101 డౌట్స్‌తొ చంపేశాడు. తర్వాత తోక ముడిచాడనుకోండి. అది వేరే విషయం. ఎంతసేపూ అతని ప్రశ్న ఒక్కటే.

"ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టి సినిమా తీస్తాం. అది పూర్తయ్యి, రిలీజ్‌కి వచ్చేటప్పటికి  ఒకవేళ రెండు రాష్ట్రాలు ఏర్పడిపోతే .. ఏంటి మన పరిస్థితి?"

నా ఉద్దేశ్యం ప్రకారం - ఇందులో తల బద్దలు కొట్టుకోవాల్సినంత సీన్ ఏమీ లేదు.

అప్పట్లాగే ఇప్పుడు కూడా మన తెలుగు సినిమాలు - తెలంగాణ, సీమాంధ్ర తేడా లేకుండా - రెండుచోట్లా విడుదలవుతాయి మామూలుగానే. అప్పుడు డీల్ చేసిన వాళ్లే ఇప్పుడూ డీల్ చేస్తారు. అవే పధ్ధతులు, అదే రొటీన్ కంటిన్యూ అవుతుంది దాదాపు.

ఒక్క విషయంలో మాత్రం మార్పు ఉంటుంది. ఇప్పటి వరకూ ఒక్క (సమైక్య) ఆంధ్రప్రదేశ్‌కు  మాత్రమే పోయే మన టాక్స్‌లు, విభజన తర్వాత (నవ్య) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... రెండు రాష్ట్రాలకూ వెళతాయి. ఎక్కడి టాక్సులు అక్కడే అన్నమాట! 

ఈరూపంలో నిర్మాతలకు అదనంగా ఇంకొంచెం భారం పడొచ్చు. 

అంతకు మించి ఇండస్ట్రీలో పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు. దీనికి కారణాలు అనేకం. వాటిగురించి మరోసారి... మరో బ్లాగ్ పోస్ట్‌లో.  

Sunday, 15 December 2013

నందితా దాస్ బాలీవుడ్ డాన్స్!

జాతీయ, అంతర్జాతీయ అవార్డులెన్నో గెల్చుకొన్న సీరియస్ సినిమాల నటి, దర్శకురాలు నందితా దాస్ తొలిసారిగా ఒక ఫక్తు బాలీవుడ్ డాన్స్ చేయబోతోంది! కాకపోతే, అది హిందీ సినిమా కాదు. స్పానిష్ సినిమా.

"ఫైర్" చిత్రం కోసం షబనా అజ్మీని ముద్దుపెట్టుకొనే హాట్ సీన్లో నటించి సంచలనం సృష్టించిన నందిత - ఎర్త్, బవందర్, బిఫోర్ ది రెయిన్ వంటి ఎన్నో చిత్రాల్లో అద్భుతంగా నటించింది. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్స్‌లో అవార్డుల్ని పొందింది.

2008 లో "ఫిరాక్" చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం కూడా వహించి, పలు అంతర్జాతీయ అవార్డుల్నీ రివార్డుల్నీ కొల్లగొట్టింది నందిత.

కట్ టూ నందిత బాలీవుడ్ డాన్స్ -

ఇప్పటివరకు 10 భాషల్లో, 30 సినిమాల్లో నటించిన నందిత - తొలిసారిగా ఓ స్పానిష్ సినిమాలో నటిస్తోంది. అంతవరకూ ఓకే. కానీ, ఈ సినిమాలో తన పాత్ర డిమాండు మేరకు, ఓ పక్కా బాలీవుడ్ ఐటమ్ తరహా పాటలో నందిత నర్తించాల్సి వస్తోంది.

మరియా రిపోల్ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పానిష్ చిత్రానికి అంతా "విమెన్ క్రూ"నే పని చేస్తూండటం మరొక విశేషం. అంటే, మొత్తం టీమ్ అంతా ఆడాళ్లేనన్నమాట!

తన 17 ఏళ్ల కెరీర్లో, ఎప్పుడూ సీరియస్ తరహా సినిమాల్లోనే నటించిన నందితకు అసలు డాన్స్ చేయాల్సిన అవసరం రాలేదు. ఈ స్పానిష్ సినిమా కూడా సీరియస్ తరహా సినిమానే. కానీ, కథాపరంగా ఇందులో ఆమె ఓ పక్కా బాలీవుడ్ డాన్స్ చేయాల్సివస్తోంది.

మరో విశేషం ఏంటంటే, నందిత చేయబోతున్న ఈ బాలీవుడ్ సాంగ్‌కి కోరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్! ఇంక పాటలో నందిత ఊపులు, విరుపులూ ఏ రేంజ్‌లో ఉంటాయో ఒక్కసారి అలా.. ఇమాజినేషన్లోకి వెళదామా ..

Saturday, 14 December 2013

దస్విదానియా .. బాలీవుడ్‌లో మరో జంట మఠాష్!

ఆ మధ్య సయీఫ్ అలీ ఖాన్, అమీర్ ఖాన్‌లు.. ఇప్పుడు హృతిక్ రోషన్! అంతకు ముందు ఇలా ఇంకెందరో సెలబ్రిటీలు, సెలబ్రిటీ జంటలు. విఛ్ఛిన్నమయిన వారి వివాహాలు, వెక్కిరిస్తున్న వ్యవస్థలు ..

నాఉద్దేశ్యంలో - వివాహ వ్యవస్థకు వీడ్కోలు చెప్పకుండా ఆర్‌జీవీ సినీఫీల్డులో ఒక ఐకాన్ అయివుండేవాడు కాడు. ఒక్క సినీ ఫీల్డులోనే కాదు. క్రియేటివిటీకి సంబంధించిన ఏ ఫీల్డులోనయినా అప్పుడప్పుడూ, అక్కడక్కడా ఇది తప్పదు.

అంతా ఓకే అనుకుంటే ఓకే. రాజీ పడ్డారా ఇంక జీవితం లేదు.  

ఇదంతా మామూలే. ముఖ్యంగా సినీఫీల్డులో. ఇంకా చెప్పాలంటే, క్రియేటివిటీకి సంబంధించిన మరే ఇతర ఫీల్డులకు చెందిన వ్యక్తుల జీవితాల్లోనయినా , జంటల్లోనయినా ఇలాంటి ఊహంచని పరిణామాలు, ముగింపులు మామూలే.

క్రియేటివిటీకి చెందినవాళ్లు ఏ బంధనాల చట్రాల్లోనూ ఇమడలేరు. అంతే!

దీనికి వంద కారణాలుంటాయి. లేదంటే, అసలు కారణాలే ఉండవు. "ఎందుకిలా?" అని శోధించడంకన్నా తెలివితక్కువతనం మరొకటి ఉండదు.

ఇదంతా కేవలం తాత్కాలిక వ్యామోహాలు, ఆకర్షణలు, సెక్స్ కోసమే అనుకోవడానికి లేదు. అలా అనుకోవడం కన్నా మూర్ఖత్వం లేదు. ఇంకేదో ఉంది.      

మగ అయినా, ఆడ అయినా - ఎదుటి వ్యక్తిలోని క్రియేటివిటీని, దాన్ని పెంపొందించుకొని ఏదో సాధించాలనుకొనే ఆ వ్యక్తిలోని తపనని.. అర్థం చేసుకొని, అప్రిషియేట్ చేయగల శక్తిలేని జీవిత భాగస్వామివల్ల - ఆ రెండు జీవితాలూ దారుణంగా నష్టపోతాయి. ఏమీ మిగలదు. ఎవరూ సంతోషంగా ఉండలేరు. పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి.

దానికన్నా, ఒక అవగాహనతో.. స్నేహంగానే విడిపోయి, సంతోషంగా బ్రతకడమే ఎంతో మంచిది. అదే మన వివాహ వ్యవస్థకి మనం ఇచ్చే నిజమైన గౌరవం.

కారణాలు ఏవయినా కావొచ్చు. హృతిక్-సుసానే ల 17 ఏళ్ల ప్రేమబంధం చెదిరిపోయింది. ఆశ్చర్యం ఏంటంటే - ఆ ఇద్దరికీ మన వివాహ వ్యవస్థమీద ఎంతో నమ్మకం.. ఎంతో గౌరవం. విడిపోతున్నప్పుడూ అదే చెప్పారు!   

Thursday, 12 December 2013

రెస్ట్ ఇన్ పీస్!

మొన్న శ్రీహరి, నిన్న ఏవీయస్, ఇవాళ ధర్మవరపు సుబ్రహ్మణ్యం...

ముగ్గురూ దాదాపు ఒకే విధమైన అనారోగ్యంతో, ఒకటి రెండు నెలల వ్యవధిలోనే స్వర్గస్తులయ్యారు. అదీ విచిత్రం!

శ్రీహరి గారితో కలిసి పని చేసే అవకాశం నాకు రాలేదు. కానీ చాలా సార్లు ఆయనతో మాట్లాడాను.

నా మొదటి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ప్రసాద్ ల్యాబ్‌లో జరుగుతున్నప్పుడు, శ్రీహరి గారి సినిమా ఒకటి కూడా అక్కడ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది అప్పుడు. రెండూ పక్క పక్క ఎడిట్ సూట్లే. మధ్య మధ్య టీ బ్రేక్ కోసం బయటకు వచ్చినపుడల్లా బాగా మాట్లాడుకొనేవాళ్లం. "ఇంక చెప్పు బ్రదర్.." అంటూ, అప్పుడు ఆయన ఒకటి తర్వాత ఒకటి నోట్లో వేసుకొనే పొట్లాలు గుట్కాలు అన్న విషయం అప్పుడు నాకు తెలియదు!

కట్ టూ ఏవీయస్ -

ఏవీయస్ గారితో నా తొలి చిత్రంలో కలిసి పనిచేశాను. ఇటీవలి చిత్రం "వెల్‌కమ్"లో కూడా ఆయన నటించారు. ("వెల్‌కమ్" నిజానికి కథ, దర్శకత్వం నాది కాదు. ఆ సమయంలో నాకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అయినా, నా పేరుతోనే ఆ సినిమా పూర్తయ్యింది, మార్కెట్ అయ్యింది. అది వేరే విషయం.)

ఏవీయస్ గారు ఎర్రమంజిల్లో ఉన్నప్పుడు.. మా అన్న గారి ఫ్లాట్, ఆయన ఫ్లాట్ పక్క పక్కనే ఉండేవి. నాకు అవార్డ్ తెచ్చిపెట్టిన సినిమా స్క్రిప్ట్ పుస్తకం కూడా ఒక పది కాపీలు అడిగి మరీ తీసుకున్నరాయన. పుస్తకాన్ని ఎంతో మెచ్చుకున్నారు. ఎప్పుడు ఎదురైనా, "మనోహర్ గారూ!" అని ఎంతో బాగా పలకరించేవారు. నేను ఎప్పుడూ జేబులో చేయిపెట్టుకొని ఉండటాన్ని, ఒక్కోసారి ఒక్కో రకంగా, సరదాగా జోక్ చేసేవారు. ఆ జోకులు నాకు ఇప్పటికీ నవ్వుతెప్పిస్తుంటాయి.

కట్ టూ ధర్మవరపు -

నా తొలి చిత్రం కోసం నానక్‌రామ్‌గూడ లోని రామానాయుడు స్టూడియోలో షూట్ చేస్తున్నాము. నైట్ షూట్. ఒక ఇన్స్‌పెక్టర్ రోల్ కోసం ధర్మవరపు గారిని తీసుకున్నాము.

ఒక్కటే కాల్ షీట్. రావటం రావటమే నేరుగా నా దగ్గరికి వచ్చారు ధర్మవరపు. "డైరెక్టర్ గారూ! నేను నైట్ షిఫ్ట్‌లు చేయటం లేదు. చక చక లాగించేసి. నన్ను 9, 9 న్నరకల్లా పంపించేయండి. అంతకంటే మించి నేను ఉండలేను. మరి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో.. చూసుకోండి" అని చెప్పేసి మేకప్ వేసుకోడానికి వెళ్లారు.

ఇక మా మేనేజర్, కోడైరెక్టర్ నన్ను తెగ టెన్షన్ పెట్టేయటం మొదలెట్టారు. నాకు ధర్మవరపు గారు చెప్పినదానికంటే ముందు వీళ్ల టెన్షన్ ఎక్కువైపోయింది!

మా కెమెరామన్ శంకర్ గారు, నేను మాట్లాడుకున్నాం. అంత పెద్ద సీన్‌ని ఎంత తొందరగా, ఎలా చేయాలా అన్నది మా చర్చ. ఏదో ప్లాన్ చేసేసుకున్నాం. కానీ, మా డౌట్లు మావి..

మేకప్ పూర్తి చేసుకొని రాగానే - ధర్మవరపు గారికి సీన్ వివరించాను. పూర్తిగా సీన్లోకి వెళ్లిపోయారాయన. సీన్‌ని యమ యెంజాయ్ చేయసాగారు. (పైన వర్కింగ్ స్టిల్ అదే!)

ఆయన రోల్ ఇన్స్‌పెక్టర్ రోలే అయినా - అది, బాలకృష్ణ "లక్ష్మీనరసిం హ" కు పేరడీలా ఉంటుంది.. డైలాగులూ అవీ, రీ రికార్డింగుతో సహా!

అంతే.. "9 గంటలకి వెళ్లిపోతాను" అన్నవాడల్లా.. ఆ రోల్‌ని పిచ్చ యెంజాయ్ చేస్తూ, తెల్లవారుజామున 2 గంటలవరకూ కూల్‌గా చేసేసి, హాప్పీగా వెళ్లారు. వెళ్తూ వెళ్తూ, "డైరెక్టర్ గారూ! బాగుందయ్యా, భలే డిజైన్ చేశారు కారెక్టర్ని! అసలెలా వచ్చింది ఈ ఐడియా మీకు?.." అంటూ బాగా నవ్వుకుంటూ వెళ్లారు.

ఇప్పుడు ఈ ముగ్గురూ "ఇక లేరు".. అంటే నమ్మటం కొంచెం కష్టంగా ఉంది. నిజం కాదు అనిపిస్తోంది. కానీ, నిజం. ఆ నిజమే జీవితం. 

Thursday, 5 December 2013

ఇరోస్ గ్యాంబ్లింగ్ 72 కోట్లు!

సుకుమార్-మహేష్‌బాబుల ప్రతిష్టాత్మక చిత్రం "1" (నేనొక్కడినే) డిస్ట్రిబ్యూషన్/మార్కెట్ హక్కుల్ని ప్రముఖ మీడియా కార్పొరేట్ సంస్థ ఇరోస్ అక్షరాలా 72 కోట్లకు కొనుక్కున్నట్టు సమాచారం.

ఇదే నిజమయితే - మహేష్‌బాబు "1" చిత్రం .. ఇటీవల బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసిన త్రివిక్రమ్-పవన్ ల చిత్రం "అత్తారింటికి దారేది" కలెక్షన్లను క్రాస్ చేయాల్సి ఉంటుంది. మహేష్‌బాబు ఎంత టాప్ హీరో అయినప్పటికీ, అదంత సులభం కాదని నా ఉద్దేశ్యం. చిత్రం పైన "సూపర్ డూపర్ హిట్" టాక్ వస్తే తప్ప ఇది సాధ్యం కాదు.

ఏ మాత్రం అటూఇటూ అయినా ఇరోస్ చతికిలపడిపోవాల్సి వస్తుంది. 72 కోట్లు మఠాష్ అవక తప్పదు. అందుకే ఇది హెవీ గ్యాంబ్లింగ్ ఒకరకంగా.

సుకుమార్-మహేష్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంగా "1" పైన ఆకాశాన్నంటే అంచనాలున్నాయి. అటు ఇండస్ట్రీలో, ఇటు ప్రేక్షకుల్లో కూడా. మరోవైపు, మహేష్ కి దేవిశ్రీప్రసాద్ మొదటిసారిగా సంగీతం అందిస్తున్న చిత్రం ఇదే కావడం ఇంకో విశేషం. అంతే కాదు. మహేష్ కుమారుడు గౌతమ్ కూడా ఈ చిత్రం ద్వారా తొలిసారిగా తెరమీద కనిపించబోతున్నాడు!

వీటన్నిటి నేపథ్యంలో, మహేష్ అభిమానుల భారీ అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో కూడా ఇట్టే ఊహించవచ్చు.  

ఇప్పటికే తెలుగు, ఇతర సౌత్ చానెల్స్ నుంచి "1" చిత్రానికి శాటిలైట్ రైట్స్ 12 కోట్లు వచ్చిందని మార్కెట్లో సమాచారముంది.

ఇక ఏరియావైజ్ సేల్స్ విషయానికొస్తే - తెలంగాణ నుంచి సుమారు 14 కోట్లు, ఆంధ్ర నుంచి 20 కోట్లు, సీడెడ్ నుంచి
8 కోట్ల బిజినెస్ అంచనా వేస్తున్న ఇరోస్‌కు, మిగిలిన ఎన్ని సోర్స్‌ల ద్వారా లెక్కించినా, కనీసం ఓ 10 కోట్ల రిస్క్ ఉంది.

అదీ హిట్ అయితేనే. అదికూడా ..బ్రేక్ ఈవెన్ కోసమే!

"పెట్టిన డబ్బు రావడం కోసమే ఇంత గ్యాంబ్లింగ్ ఆడటం దేనికి?" అని మనకు అనిపించడం సహజం. కార్పొరేట్ ఆటలు ఇలాగే ఉంటాయి. ముందు సౌత్ మార్కెట్లో బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేసుకోవడం వాళ్లకి ముఖ్యం. తర్వాత ఎంత డబ్బయినా సంపాదించుకొనే ప్లాన్లు వాళ్లదగ్గర బోలెడన్ని ఉంటాయి.

ఈ కోణంలో చూస్తే మాత్రం - ఇరోస్ ఆడుతున్నది ఏమంత పెద్ద గ్యాంబ్లింగ్ కాదు.

Wednesday, 4 December 2013

అంతా దీపిక లీల!

విమర్శకుల ప్రశంసలతోపాటు, బాక్సాఫీసు కనక వర్షం కుపిస్తున్న భన్సాలి "రామ్-లీల" చిత్రం కోసం ముందుగా అనుకున్న హీరోయిన్ దీపిక కాదు. కరీనా కపూర్! నమ్మగలరా?

ఇంకో విచిత్రం ఏంటంటే, "గోరి తేరా ప్యార్ మే" అనే ఒక మామూలు రొటీన్ చిత్రం చేయడం కోసం రామ్-లీల చిత్రాన్ని వదులుకుంది కరీనా!

ఇది కరీనా కపూర్ తీసుకొన్న మరో అనాలోచిత నిర్ణయం. ఇంతకు ముందు కూడా - "కహోనా ప్యార్ హై", "కల్ హో న హో", "చెన్నై ఎక్స్‌ప్రెస్" వంటి సినిమాలను వదులుకున్న నేపథ్యం కరీనాకుంది. "అవును, సినిమాల ఎన్నిక విషయంలో నేను పొరపాట్లు చేశాను. నేను పిచ్చ్చిదాన్ని!" అని ఇప్పుడు రియలైజ్ అయింది కరీనా.

"ఖామోషి", "హమ్ దిల్ దే చుకే సనమ్", "బ్లాక్", "దేవదాస్" వంటి చిత్రాను రూపొందించిన భన్సాలీ వంటి అగ్రశ్రేణి దర్శకుని మరో భారీ సినిమా రామ్-లీల. ఈ చిత్రంలోని ప్రతి ఫ్రేమ్‌నూ దేనికదే ఒక "ఆర్ట్" పీస్‌గా ఉపయోగించుకోవచ్చ్చు.

సబ్జెక్ట్ ఏదయినా కానీ, ప్రతి ఫ్రేమ్ కూడా ఒక విజువల్ ట్రీట్‌లా ఇవ్వటం భన్సాలీ అలవాటు. ఈ ప్యాషన్ భన్సాలీ ప్రతి చిత్రంలోనూ మనం చూడవచ్చు.

శేఖర్ కపూర్ ఈ సినిమా చూసి దీపికను ప్రశంసలతో ముంచెత్తాడు.

అమితాబ్ బచ్చన్ ఈ సినిమాను 3 సార్లు చూశాట్ట! భన్సాలీకి, రణ్‌వీర్‌కు, దీపికకు తన అభినందనలు చెప్పాడు. దీపిక నటనకు మతిపోయిందన్నాడు. ఒక్క అమితాబ్ మాత్రమే కాదు, నా ఫేస్‌బుక్/ట్విట్టర్ మిత్రులు చాలామంది "మూడోసారి రామ్-లీలా చూస్తున్నాను!" అని పోస్ట్ చేశారు.

"కాక్‌టెయిల్", "రేస్ 2", "యే జవానీ హై దీవానీ", "చెన్నై ఎక్స్‌ప్రెస్" తర్వాత.. దీపికకు ఇది వరుసగా 5 వ హిట్టు!

తన మొదటి చిత్రం "ఓం శాంతి ఓం" నాటి దీపిక నటనాపరంగా ఎంతో మెచ్యూర్ అయింది. ఆమె విజయ రహస్యం ఒక్కటే. "తను చేస్తున్న పనిని 100% మనసు పెట్టి చెయ్యటం!". అంతకు మించి ఏమీ లేదంటుంది దీపిక.

భన్సాలీ రచన-సంగీతం-దర్శకత్వం, రణ్‌వీర్‌ సింగ్ పోటాపోటీ నటన, భారీ చిత్రీకరణ, అందమైన ఫ్రేమింగ్.. ఇవన్నీ ఎన్నయినా ఉండనీయండి. తన పాత్రలో పూర్తిగా లీనమయిపోయిన దీపికా పడుకొనే అత్యంత సహజమైన నటనే ఈ చిత్రానికి కేంద్ర బిందువు. ఆ పాత్రలో దీపికను తప్ప మరొకరిని ఊహించలేం. ఇంకొకరు ఎవరు ఆ పాత్రను చేసినా సినిమా ఫలితం మరోలా ఉండేది. ఒకరకంగా, కరీనా తప్పుకొని భన్సాలీని బ్రతికించింది.

ఈ రామ్-లీల.. నిజానికి దీపిక లీల! 

Sunday, 1 December 2013

"వర్ణ"నాతీతం .. అనుష్క!

ఒక నంది అవార్డు, రెండు ఫిలిమ్‌ఫేర్ అవార్డులు, మరో రెండు సినీ'మా' అవార్డులు అందుకొన్న ఈ 5 అడుగుల 6 అంగుళాల 'మంగుళూరు సైరెన్' అనుష్క, 2013 ఆరంభం నుంచి కొత్తగా ఏ సినిమాలకు సైన్ చేయలేదంటే నమ్మలేం. కానీ నిజం.
 
అయితే ఇలా సైన్ చేయకపోవటం హీరోయిన్ ఆఫర్లు లేక, రాక కాదు. ప్రస్తుతం అనుష్క దగ్గర డేట్లు లేవు! రుద్రమదేవి, బాహుబలి చిత్రాలతో యమ బిజీగా ఉంది. అవి పూర్తయ్యేవరకూ డేట్స్ ఇవ్వటం కుదరదు ..

కట్ టూ సూపర్ ఎంట్రీ -

2005 లో పూరి జగన్నాథ్ "సూపర్" తో నాగార్జున సరసన సిల్వర్‌స్క్రీన్‌కు పరిచయమైన ఈ నిలువెత్తు అందం, 2006 లో "విక్రమార్కుడు" హిట్‌తో ఒక్కసారిగా టాప్ రేంజ్ హీరోయిన్ అయిపోయింది. అదే, హీరోయిన్‌గా అనుష్కకు తొలి కమర్షియల్ సక్సెస్. ఈ సక్సెస్.. అదే సంవత్సరం అనుష్క తమిళ ఇండస్ట్రీలోకి కూడా ఎంటర్ కావడానికి తోడ్పడింది.

ఆ మధ్య జరిగిన "వర్ణ" ఆడియో ఫంక్షన్‌లో అనుష్కని పొగడ్తలతో ముంచెత్తారు అందరూ. ఆ పొగడ్తల్లోకల్లా ముఖ్యమైన పొగడ్త ఏంటంటే.. అనుష్కతో ప్రొడ్యూసర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని. ప్రొడ్యూసర్-ఫ్రెండ్లీ అని. హీరోయిన్‌గా తన పని పట్ల అంకిత భావం, కమిట్‌మెంట్ తప్ప వేరే తలనొప్పులు ఆమెతో ఉండవు అన్నది ఆ ఫంక్షన్ వేదికపై నుంచి దాదాపు అంతా చెప్పారు.

ఒక టాప్ రేంజ్ హీరోయిన్ కావడానికి ఈ ఒక్క క్వాలిఫికేషన్ చాలు. అందం, అభినయం అనేవి ఏ హీరోయిన్‌కయినా మామూలుగా ఉండేవే. కాని, తను చేస్తున్న పని పట్ల "ఇంకా ఏదో చెయ్యాలి.. ఇంకా బాగా నటించాలి" అన్న తపన అనుష్కలో ఎక్కువ అని డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్లు చెబుతారు.

ఆ తపనే ఓ "అరుంధతి" నీ, ఓ "వేదం" నీ ఆమెకు అందించాయి. అయితే, అరుంధతి తర్వాత అనుష్కకి ఎక్కువగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలే వచ్చాయి. లేదా, అనుష్క అలా సినిమాలను ఎన్నుకోవడం జరిగింది.

అది పెద్ద పొరపాటు అని అనుష్క ఈ మధ్యే గ్రహించినట్టుంది. ఇక మీదట తను ఎక్కువగా గ్లామర్ రోల్స్‌నే చేయాలనుకుంటున్నట్టు చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. హీరోయిన్-సెంట్రిక్ మూసలో చిక్కుకుపోయిన ఏ హీరోయిన్ అయినా రిస్కులో పడిపోయిన దాఖలాలే ఎక్కువగా ఉన్నాయి. తర్వాత చేద్దామన్నా, అంతకు ముందులా గ్లామర్ రోల్స్ రావు గాక రావు!       

ప్రభాస్ సరసన నటించిన "బిల్లా"లో ఎలాంటి అరమరికలు లేకుండా అందాలని ఆరబోసిన అనుష్క, తమిళంలో కూడా "సింగం" వన్, టూ లతో అక్కడ కూడా టాప్ రేంజ్ పేరు తెచ్చుకుంది.

కట్ టూ "వర్ణ" -

"7 జి బృందావన్ కాలనీ", "ఆడవారి మాటలకు అర్థాలే వేరులే" వంటి హిట్ సినిమాలనిచ్చిన దర్శకుడు శ్రీ రాఘవ "వర్ణ" మాత్రం అనుష్క కెరీర్‌కు చాలా పెద్ద దెబ్బ అనక తప్పదు. అయితే, ఒక్క "వర్ణ" ఫెయిల్యూర్ వల్ల అనుష్కకు వచ్చే నష్టమేమీ లేదు పెద్దగా.  

లక్కీగా ఇప్పటికే పీరియడ్ డ్రామా "రుద్రమదేవి", 100 కోట్ల ద్విభాషా చిత్రం "బాహుబలి" చిత్రాల్లో నటిస్తూ బిజీగాఉంది అనుష్క. ఇవి పూర్తయ్యేవరకూ డేట్స్ లేకే కొత్త సినిమాలేవీ సైన్ చెయ్యలేదు. ఏ కోణంలో చూసినా, ఈ రెండు చిత్రాలూ హీరోయిన్‌గా అనుష్క ఇమేజ్‌ని మరింతగా పెంచేవే.

ఇప్పుడు తాజాగా 16 వ శతాబ్దం నేపథ్యంగా సాగే చారిత్రాత్మక ప్రేమకథా చిత్రం "భాగమతి" లో కూడా నటించడానికి అనుష్క ఒప్పుకున్నట్టు తెలిసింది. అదే నిజమైతే, ఒక విధంగా చెప్పాలంటే, ఈ భాగమతి పాత్రకూడా అనుష్కకు బాగా పేరు తెచ్చేదే.

అయితే, వీటి తర్వాత మాత్రం,  ఈ 32 సంవత్సరాల అందాలరాశి  అనుష్క .. ఖచ్చితంగా రెగ్యులర్ గ్లామర్ చిత్రాలే ఎక్కువగా చేస్తుంది. చేయక తప్పదు. ఎందుకో మీకు బాగా తెలుసు.