సముద్రం మీద వ్యామోహంతో ఇంతకుముందు నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు... ఎక్కువగా గోవా, పాండిచ్చేరిలకు వెళ్లేవాణ్ణి.
గత కొన్నేళ్లుగా... ఊపిరాడనివ్వని కొన్ని ప్రొఫెషనల్ సమస్యల్లో ఇరుక్కొని, ఎంతకూ బయటపడలేక, నేను ఎక్కువగా ట్రావెల్ చెయ్యటం లేదు.
అయితే - నిజానికి సమస్య అది కాదు.
వివిధ దశల్లో నేను ఎన్నుకున్న మనుషులు, నేను తీసుకున్న నిర్ణయాల ఫలితం ఇదీ అని... ఎవరికీ చెప్పుకోలేని ఒక రేంజ్లో బాగా నష్టపోయి, చివరికి నన్ను నేనే పరామర్శించుకున్నాను. "జరిగిందేదో జరిగింది... ఇప్పుడిక ఈ పాయింట్ నుంచే జీవితం"... అని నా మైండ్ సెట్ చేసుకున్నాను. ఒకప్పటి నా వీక్ మెంటాలిటీ నుంచి దాదాపు పూర్తిగా బయటపడ్డాను.
రాగ్స్ నుంచి మళ్ళీ పనులు ప్రారంభించాను.
కట్ చేస్తే -
సముద్రం మీద వ్యామోహంతో, ఇంతకుముందు నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు... ఎక్కువగా గోవా, పాండిచ్చేరిలకు వెళ్లేవాణ్ణి.
ఈ రెండూ... నాకు ఇప్పటికీ చాలా ఇష్టమైన ప్రదేశాలు.
దేని ప్రత్యేకత దానిదే.
అయితే... గోవా, పాండిచ్చేరిల కంటే ఇప్పుడు వైజాగే నాకు మరింత బాగా అనిపిస్తోంది.
బీచ్ రోడ్దు నుంచి భీమిలీ దాకా... కార్లో వెళ్తూ, కుడి వైపు అలా సముద్రాన్ని చూసుకొంటూ, నచ్చినచోట దిగుతూ, ఆగుతూ, రోజంతా గడిపేయొచ్చు.
నాకెప్పుడు అవకాశం దొరికినా నేనీ పనే చేస్తాను.
ఈ పని చేయడం కోసం, నా పనుల్లో ఎంతవరకు వీలైతే అంతవరకు వైజాగ్‌లోనే చేసుకునేటట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాను. ఈ మధ్య నా ప్రొఫెషనల్ పనులమీద కూడా, అనుకోకుండా వైజాగ్‌కే నేను ఎక్కువసార్లు వెళ్లాల్సిరావడం కూడా నాకే ఆశ్చర్యంగా ఉంది.
లేటెస్ట్గా, మొన్న ఏప్రిల్‌లో, కరోనా సెకండ్ వేవ్ టైంలో కూడా వైజాగ్ వెళ్ళాను.
వైజాగ్ అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది సముద్రం.
తర్వాత - చలం, భీమ్లీ... ఆ తర్వాత - అరకు, స్టీల్ ప్లాంట్, పోర్ట్, గంగవరం బీచ్‌లో నేను షూట్ చేసినప్పుడు, స్టీల్ ప్లాంట్ గెస్ట్ హౌజ్‌లో, మా టీమ్‌తో నేనున్న ఆ నాలుగు రోజులూ...
ఇంకోసారి, అదే గెస్ట్ హౌస్ లో నాకు పరిచయమై దగ్గరైన ఒక స్టార్, ఇప్పటికీ కొనసాగుతున్న మా స్నేహం...
ఆర్కే బీచ్, అక్కడి కాఫీడే... రిషికొండ బీచ్, అక్కడి రిసార్ట్స్... రియోబీచ్, నొవాటెల్ హోటళ్ళు... ఎయిర్పోర్టూ, బస్‌స్టాండూ... లలితా జ్యువెల్లరీస్ దగ్గర్లో ఫుట్‌పాత్ మీద బొకేలమ్మే చిన్న షాపూ... వైజాగ్ కి కొంచెం దూరంలో - గాజువాకలోని సినిమా హాళ్ళూ, అక్కడి గ్రీన్ యాపిల్ హోటల్...
వైజాగ్ సిటీలోనూ, స్టీల్‌ప్లాంట్ చుట్టుపక్కలా వున్న నా ఆత్మీయ మిత్రులు, శ్రేయోభిలాషులూ... ఇంకా బోల్డన్నున్నాయి నాకు గుర్తొచ్చేవి.
1987లో అనుకుంటాను, మా ఎమ్మే క్లాస్‌మేట్స్‌తో నేను మొట్టమొదటిసారిగా వైజాగ్ వెళ్ళాను. ఒరిస్సాలోని కోణార్క్, భువనేశ్వర్‌ల నుంచి మా తిరుగు ప్రయాణంలో వైజాగ్ వెళ్లాం. అప్పుడే మొదటిసారి... నేను అరకులోయ చూడ్డం!
కొన్నేళ్ళ క్రితం... నా మొదటి సినిమా షూటింగ్ కోసం కూడా, నా టీమ్‌తో ఓ నాలుగయిదు రోజులున్నాను వైజాగ్‌లో. ఒక మంచి లొకేషన్‌గా తప్ప, అప్పుడు కూడా వైజాగ్ అంటే నాకు మరీ అంత ప్రత్యేకమైన ఫీలింగేమీ కలగలేదు. తర్వాత ఎన్నోసార్లు వైజాగ్ వెళ్లాను గానీ, ఏ ఒక్క సారి కూడా - వైజాగ్‌ను మరీ అంత స్పెషల్‌గా నేనేం ఫీలవ్వలేదు.
నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత, బహుశా ఓ పదేళ్ల క్రితం అనుకుంటాను... ఉన్నట్టుండి - అసలు మొత్తంగా వైజాగ్‌కే మారిపోవాలని అనుకున్నాం. అక్కడున్న తెలిసినవారితో కనెక్ట్ అయి - ఫ్లాట్ కొనుక్కుంటే ఎక్కడ బాగుంటుంది... రెంట్స్ ఎలా ఉన్నాయి... ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కి దగ్గర్లో ఉన్న మంచి రెసిడెన్షియల్ ఏరియా ఏది... ఇవన్నీ కనుక్కున్నాం. ఇదే పని మీద రెండుసార్లు నేను వైజాగ్ వెళ్ళాను కూడా. కాని, ఎందుకో ఆ ఆలోచన అప్పుడు సఫలం కాలేదు.
మళ్ళీ - గత మూడు నాలుగేళ్ళుగానే... ఉన్నట్టుండి ఒక్కసారిగా... వైజాగ్ నాకు అత్యంత ఇష్టమైన విజిటింగ్ ప్లేస్ అయింది!
ఈ పాండిచ్చేరి, గోవా... ఇవన్నీ వైజాగ్ తర్వాతే కదా అని ఇప్పుడనిపిస్తోంది.
అసలు 'వైజాగ్ అందమే వేరు'... అని నేను పూర్తిగా ఫిక్స్ అయిపోయాను.
గొప్ప గొప్ప రచయితలు, కవులకు... వారి రచనలకూ పుట్టిల్లుగా... వైజాగ్ సాహితీ సాంస్కృతిక నేపథ్యం నాకు ముందే తెలుసు. అయితే - వైజాగ్ నన్ను ఇంత బాగా ఆకర్షించడానికి ఇదొక్కటే కారణం కాదు.
కొన్నిటికి కారణాలుండవు. లాజిక్కులుండవు. అలా జరిగిపోతాయ్.
అంతా ఒక మాయలా, ఒక మహాద్భుతంలా అనిపిస్తుంది.
అసలేంటీ... ఒక ప్రదేశంపైన అంత ఈజీగా చెప్పలేని ఈ ప్రేమ... కాదల్... ఇష్క్... ప్యార్... మొహబ్బత్... ల్యుబోఫ్... లవ్... ?!
లవ్... అనగానే నాకు ముందుగా గుర్తొచ్చేది కూడా... వైజాగే.
బాలచందర్ అపూర్వ సృష్టి 'మరోచరిత్ర'... బాలు-స్వప్న క్యారెక్టర్స్... అందమైన భీమిలి లొకేషన్ బ్యాక్ డ్రాప్... కమలహాసన్, సరిత... 'పదహారేళ్ళకూ' అని యస్ జానకి గారు పాడిన పాట...
ఐ థింక్... నా లవ్ కూడా అక్కడే ఉంది, వైజాగ్‌లో.
వైజాగ్‌లో ఉన్న నా లవ్, నా ప్రేయసి, నా వాలెంటైన్ మరెవరో కాదు... సముద్రం.
"సముద్రం ఇంకా చాలా చోట్ల ఉంది కదా?"... అంటే, ఉండొచ్చు. బట్, ఇది వేరే.
"ఎందుకలా?"... అంటే చెప్పడానికి నాదగ్గర కారణాల్లేవు.
ఏదో 'స్పిరిచువల్ కనెక్షన్' అనుకుంటాను... అంతే.
“Our souls speak a language that is beyond human understanding. A connection so rare the universe won't let us part.”
― Nikki Rowe