ఆర్టిస్టుగానో , టెక్నీషియన్‌గానో, చివరికి సినిమా ఆఫీస్ లో ఒక ఆఫీస్‌బాయ్‌గానో... సినీ ఫీల్డులోకి ఎంటర్ కావాలనుకొనే న్యూ టాలెంట్... ముందుగా తెల్సుకోవాల్సిన లెక్క ఒకటుంది.
అదేంటంటే -
ఫీల్డులోకి ప్రవేశించాలనుకొని... ఫిలిమ్‌నగర్‌కు వచ్చే ప్రతి 1000 మందిలో ఒక 10 మందికి మాత్రమే సినిమాల్లో చాన్స్ దొరుకుతుంది.
అదీ... ఎంతో కష్టంగా!
అవకాశం దొరికిన ఆ పదిమందిలో కూడా - ఏ ఒక్కరో ఇద్దరో మాత్రమే క్లిక్ అవుతారు.
వాళ్లే ఫీల్డులో కొన్నాళ్ళు నిలబడగలుగుతారు.
అలా నిలబడ్డవాళ్ళ టాప్ ప్రయారిటీస్ లో సినిమానే ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది.
ఆర్టిస్టులయినా, టెక్నిషియన్స్ అయినా... సినిమా తప్ప వేరే పనిలేకుండా, సినిమానే జీవితంగా తీసుకోగలిగే వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో దశాబ్దాలపాటు ఉంటారు. వాళ్ళల్లోనే కొందరు లెజెండ్స్ అవుతారు.
కట్ చేస్తే -
ఒక సంవత్సరంలో ఎన్ని సినిమాలు తీస్తారు? వాటిలో కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చే సినిమాలు ఎన్నుంటాయి? అసలు ఒక సినిమాలో ఎంతమంది కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వడానికి వీలవుతుంది?
రెండే రెండు నిమిషాలు ఆలోచిస్తే, సింపుల్ గా మ్యాటర్ అర్థమైపోతుంది.
ఒక్క టాలీవుడ్‌లోనే కాదు. ఏ వుడ్డులోనయినా ఇదే లెక్క!
వెయ్యి మందిలో ఒక్క పది మందికే చాన్స్.
అది కూడా అతి కష్టం మీద దొరుకుతుంది. ఆ పది మందిలో ఒక్కరో ఇద్దరో సక్సెస్ అవుతారు. మిగిలినవాళ్ళంతా అలా అలా లాగిస్తుంటారు.
ఇలా లాగిస్తున్నవాళ్ళ గురించి చెప్పాలంటే... అదొక ఎవర గ్రీన్ సీరియల్ అవుతుంది. ఆ ఎపిసోడ్లకు అంతుండదు...
ఇప్పుడు ఓటీటీ లొచ్చాయి... వెబ్ సీరీస్ లొచ్చాయి. కొత్తవాళ్ళకే కాదు, అప్ కమింగ్ వాళ్లకు కూడా అవకాశాలు పెరిగాయి.
ఈమధ్య షార్ట్ ఫిలింస్ కూడా బాగా పాపులర్ అయ్యాయి. దాదాపు ఇంటికో డైరెక్టర్ ఉన్నాడు. వీళ్ళల్లో అద్భుతంగా షార్ట్ ఫిలిమ్స్ తీసి... ఇండస్ట్రీ దృష్టికి రీచ్ అయ్యేవారికి సినిమా అవకాశాలు కూడా పెరిగాయి.
అయితే - ఎన్ని అవకాశాలు పెరిగినా, లెక్క లెక్కే.
ఈ లెక్క మారదు.
హాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా సుమారుగా రేషియో మాత్రం ఇదే.
వెయ్యి మందిలో ఒక్క పది మందికే చాన్స్. ఆ 10 మందిలో - ఒక్కరో, ఇద్దరో సక్సెస్ అవుతారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటారు.
వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా - ఇదే రియాలిటీ.
ఈ రియాలిటీని ఎదుర్కొనే గట్స్ ఉన్నవాళ్లకే సినీఫీల్డు వెల్కం చెప్తుంది.
మరి మీలో ఆ గట్స్ ఉన్నాయా?! ... ఒకసారి చెక్ చేసుకోండి.
ఏవో లెక్కలు చెప్పి డిస్కరేజ్ చేస్తున్నా అనుకోవద్దు... ఈ లెక్కలన్నిటినీ ఓవర్ నైట్లో బైపాస్ చేసే మార్గాలు కూడా కొన్నుంటాయి. వాటిగురించి... తర్వాత మాట్లాడుకుందాం.
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani