Tuesday, 17 May 2016

యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్‌రైటింగ్ : వన్-టూ-వన్ పర్సనల్ కోచింగ్!

యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్‌రైటింగ్ లలో ఏదైనా ఒకదానిని సీరియస్‌గా నేర్చుకొని, దాన్నే తమ మెయిన్ ప్రొఫెషన్‌గా మలచుకోవాలనుకొనే ఔత్సాహికులకు "వన్-టూ-వన్" పర్సనల్ కోచింగ్ నేనే ఇస్తున్నాను.

సినీఫిల్డుకు సంబంధించి నా మరొక ప్యాషన్ ఇది.

లక్షలు పోసి .. ఏదో ఒక ఇన్స్‌టిట్యూట్‌లో చేరామా, ఏదో ఒకటి రొటీన్‌గా నేర్చుకొన్నామా, చివరికి ఏదో ఓ సర్టిఫికేట్ తీసుకొని బయటకొచ్చామా అని కాదు. పైగా .. ఈమాత్రం దానికి, ఫిలిం ఇన్స్‌టిట్యూట్‌లవాళ్లు తీసుకొంటున్న ఫీజు సుమారు 5 నుంచి 7 లక్షలవరకు ఉంటోంది. అదీ, మన హైద్రాబాద్‌లోనే!

అయితే, ఏ శిక్షణ అయినా నిజంగా సినిమా ఇండస్ట్రీకి పనికొచ్చేవిధంగా ఉండాలి. వెంటనే మిమ్మల్ని పనిలోకి దించేలా ఉండాలి.

సూటిగా ఒక్కముక్కలో చెప్పాలంటే - "సినిమా ఇండస్ట్రీకి ఎలా అయితే అవసరమో, పూర్తిగా ఆ పాయింటాఫ్ వ్యూ లోనే ఉంటుంది నా పర్సనల్ కోచింగ్."

ఈ కోచింగ్‌లో చేరిన ప్రతి ఒక్కరినీ, వారి వారి టాలెంట్‌ను బట్టి, నా తర్వాతి చిత్రాలకోసం నా టీమ్‌లోకి తీసుకుంటాను. ఇది కోచింగ్‌లో చేరుతున్నందుకు నేను మీకిస్తున్న గ్యారంటీ కాదు. నాకోసం, నా సినిమాలకోసం, ఈ కోచింగ్ ద్వారా నాకు అవసరమైనవిధంగా, కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో, నాదంటూ ఒక మంచి టీమ్‌ను క్రియేట్ చేసుకొనే క్రమంలో చెబుతున్నమాట.

"సో, నా సినిమాల్లో మీకు తప్పక ఛాన్స్ ఉంటుంది."    

అయితే, ఈ వన్-టూ-వన్ కోచింగ్ అందరికీ కాదు. అందరికీ అంత సులభంగా అందుబాటులో ఉండదు. దీనికోసం నేనెంతో సమయం కెటాయించాల్సి ఉంటుంది.

చెప్పాలంటే - ఈ ప్రొఫెషన్ పట్ల కనీసం ఒక స్థాయి ప్యాషన్, స్థోమత, సీరియస్‌నెస్ ఉన్న కొద్దిమంది సెలెక్టెడ్  ఔత్సాహికులకు మాత్రమే ఈ కోచింగ్ అందుబాటులో ఉంటుంది.

యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్‌రైటింగ్ ల్లో ఒక్కో డిపార్ట్‌మెంట్‌కు కేవలం అతి కొద్దిమందిని మాత్రమే తీసుకుంటాను. సో, కోచింగ్‌కు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది 'టూ సెలెక్టివ్' అన్నమాట!

కట్ టూ నా కోచింగ్ మెథడ్ -   

ఈ పర్సనల్ కోచింగ్ రొటీన్ ఫిలిం ఇన్స్‌టిట్యూట్స్ ట్రైనింగ్‌కు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు:

> రొటీన్ క్లాస్ రూం టీచింగ్ అస్సలు ఉండదు.

> నంది అవార్డ్ రచయిత-డైరెక్టర్‌తో "వన్ టూ వన్" శిక్షణ ఉంటుంది.

> పూర్తిగా అన్‌ట్రెడిషనల్‌గా ఉండే ఈ కోచింగ్, ప్రధానంగా టాలీవుడ్‌ను దృష్టిలోపెట్టుకొని ప్లాన్ చేసింది. మీరు టాలీవుడ్‌లోకి సులభంగా ప్రవేశించడానికి మీకు ఏదేది అవసరమో, దానికోసం మిమ్మల్ని ఎలా మౌల్డ్ చెయ్యాలో .. కేవలం ఆ పాయింటాఫ్ వ్యూలోనే ఈ కోచింగ్ ఉంటుంది.

> నా సినిమా జరుగుతున్న సమయంలో - మీకు స్క్రిప్ట్ వర్క్‌తోపాటు ఇతర ప్రిప్రొడక్షన్ వర్క్‌లోనూ, షూటింగ్‌లోనూ, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లోనూ .. అవసరాన్నిబట్టి, మీ సామర్థ్యాన్నిబట్టి, వీలైనంత నేరుగా పాల్గొనే అవకాశం కల్పిస్తాను.

> స్క్రిప్ట్ అసిస్టెంట్/అసిస్టెంట్ డైరెక్టర్/ఆర్టిస్ట్ గా శిక్షణ తీసుకొంటూనే, మీరు చేసిన పనికి/నటనకు స్క్రీన్ పైన మీకు టైటిల్ కార్డు ఇస్తాను.

> మీ సినీ కెరీర్ మొత్తంలో, ఎప్పుడు మీకు నానుంచి ఎలాంటి గైడెన్స్, సలహాలు అవసరం వచ్చినా నన్ను వెంటనే సంప్రదించవచ్చు. ఈ విషయంలో మీకు నా నుంచి 100% "లైఫ్‌టైమ్ సపోర్ట్" ఉంటుంది.

> వారానికి 2 కోచింగ్ క్లాసులు మినిమమ్ ఉంటాయి. అయితే క్లాస్ రూముల్లో మాత్రం కాదు. కోచింగ్ ఎక్కడైనా ఉండొచ్చు: ఆఫీస్/షూటింగ్ లొకేషన్/కార్లో వెళ్తూ/రోడ్డు మీద నడుస్తూ/కథా చర్చల్లో/మ్యూజిక్ సిట్టింగ్స్‌లో/నెక్లెస్ రోడ్డులో/ఐమాక్స్‌లో/సినీప్లానెట్‌లో .. ఎక్కడైనా ఉండొచ్చు. క్లాస్ ఎప్పుడు, ఎక్కడ అనేది ఎప్పటికప్పుడు మనం ముందే ఫిక్స్ చేసుకుంటాం .. ఆనాటి మన మన పనుల్నిబట్టి.

> మరో విషయం: ఈ పర్సనల్ కోచింగ్ ఒక్క ఆఫ్‌లైన్‌లోనే కాదు, అవసరాన్నిబట్టి అప్పుడప్పుడూ ఆన్‌లైన్‌లో కూడా ఉంటుంది. అసలు మీకు తెలుసా .. ఇప్పుడు ఫిలిం మేకింగ్‌కు సంబంధించిన చాలా పనులు ఆన్‌లైన్‌లోనే ఎక్కువగా జరుగుతున్నాయని?!

> ఇక, మీ మీ టాలెంట్, స్పీడ్‌ను బట్టి .. కోచింగ్ పీరియడ్ 3 నుంచి 6 నెలలవరకు మాత్రమే ఉంటుంది. మీ టాలీవుడ్ ఎంట్రీకి ఈమాత్రం సమయం చాలు. అన్నీ నేర్చుకుంటారు. ఫీల్డులోకి ఎంటర్ అవుతారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. డామ్ ష్యూర్ అన్నమాట!    

> మీ చదువుల్నీ, ఉద్యోగాలను ఈ కోచింగ్ అస్సలు డిస్టర్బ్ చేయదు. మీ మీ పనులు చేసుకొంటూనే ఈ కోచింగ్ మీరు తీసుకోవచ్చు. అందుకే దీన్ని "పర్సనల్ వన్ టూ వన్ కోచింగ్" అన్నాను.

> ముందే చెప్పినట్టు .. ఈ కోచింగ్ అందరికీ ఇవ్వటం సాధ్యం కాదు. అంత సమయం నాకు దొరకదు. అందుకని, యాక్టింగ్/డైరెక్షన్/స్క్రిప్ట్ రైటింగ్ ల్లో కేవలం చాలా కొద్దిమందిని మాత్రమే  తీసుకుంటాను. వీరికి మాత్రం తప్పకుండా నా సినిమాల్లో అవకాశం ఉంటుంది.
అంటే,  నాకంటూ నేను స్పెషల్‌గా తయారుచేసుకొనే నా టీమ్‌లో మీరుంటారన్నమాట!        

"సో .. మీకు నా ఈ కాన్సెప్ట్ నచ్చి .. మీలో నిజంగా ఆ స్థాయి ఆసక్తి, స్థోమత, ప్యాషన్ ఉండి, నాతో ఈ వన్-టూ-వన్ కోచింగ్ తీసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే - నా కోచింగ్ ఫీజు, ఇతర వివరాలకోసం నా ఫేస్‌బుక్ / ట్విట్టర్ ఇన్‌బాక్స్ కు మెసేజ్ చేయండి." 

బెస్ట్ విషెస్ ..  

Monday, 11 April 2016

ఎన్నారై స్వప్నానికి మరోవైపు

ఇండియాలో ఇంజినీరింగ్, మెడిసిన్, ఎమ్‌బిఏలు చదవడం .. కట్ చేస్తే, అమెరికా ఫ్లైట్ ఎక్కడం! ఇది మన దేశంలో చాలా మామూలు విషయం.

తమ పిల్లలు అమెరికా వెళ్లడం అనేది కొన్ని కుటుంబాలకు స్టేటస్ సింబల్ కాగా, వెళ్లే యువతకు తమ మిత్రబృందాల్లో అదొక ప్రత్యేక గుర్తింపు. చెప్పాలంటే, మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో, దాదాపు ప్రతి ఇంటినుంచీ కనీసం ఒక్కరైనా అమెరికావెళ్ళి ఎన్నారైలుగా స్థిరపడ్డవాళ్లున్నారు. ఈ ఎన్నారైలే ఇప్పుడు అమెరికాలోని ప్రతి ప్రధాన రంగంలోనూ కనీసం 20% ఉన్నారని ఒక అంచనా. పెంటగాన్, సీఇఏ, వైట్‌హౌజ్‌లు కూడా కూడా ఇందుకు మినహాయింపుకాదు! అయితే, ఇదంతా నాణేనికి ఒకవైపు ..

ఇండియా నుంచి అమెరికా వెళ్ళి, బాగా కష్టపడి చదువుకొని, మంచి ఉద్యోగాలూ డబ్బూ బాగా సంపాదించుకొని, ఎన్నారైలుగా అక్కడ ఎన్ని లక్జరీలు అనుభవిస్తూ జీవిస్తున్నా .. వీళ్లల్లో అతి కొద్దిమందికి మాత్రం ఎక్కడో ఏమూలో ఏదో ఒక అసంతృప్తి. మన మూలాలు, మన మాతృదేశం, మనం ఈ స్థాయికి చేరుకోడానికి కారణమైన మన తల్లిదండ్రులు, మన వాళ్లు, మన ఊరు, మన గాలి, మన నేల .. ఇవన్నీ మర్చిపోతున్నామన్న ఒక అంతరంగ మథనం. ఏదో చేయాలన్న తపన. ఇదంతా నాణేనికి మరోవైపు ..

ఇదిగో .. ఈ రెండో కోణంలోంచి పుట్టిన నవలే భరత్‌కృష్ణ రాసిన "గై ఆన్ ది సైడ్ వాక్".

అమెరికాలో ఉద్యోగంకోసం వెళ్లిన యువతరం జీవనశైలిని ఈ నవలలో చిత్రీకరించినట్టు బహుశా ఇంతకు ముందు ఏ ఇతర నవలలోనూ చేయలేదు. మరోవైపు, "గుంపులో గోవిందా" లాగా కాకుండా, ఒక ప్రత్యేక వ్యక్తిత్వంతో తన దేశంలోని పరిస్థితులు, పాలిటిక్స్, వెనకబాటుతనం, తానేమైనా చేయాలి అన్న తపన .. వీటన్నిటి గురించి నిరంతరం ఏదో ఒకటి ఆలోచించే ఈ నవలానాయకుడు "జే" (జయవర్థన్) వంటి పాత్ర కూడా ఇంతవరకు ఎన్నారై నేపథ్యంగా వచ్చిన ఏ ఇతర నవలల్లోనూ కనిపించదు.

అమెరికాలో చదవడంకోసం తను పడిన కష్టాలు, ఆ తర్వాత ఉద్యోగం, ఆదాయం అంతా బాగానే ఉన్నా, అమెరికాలోని అన్ని లక్జరీస్‌ను త్యజించి, చివరికి తన మనసుకు నచ్చిన నిర్ణయాన్నే తీసుకొని ఇండియాకు తిరిగివచ్చే ఈ నవలలోని జే పాత్ర వ్యక్తిత్వం గురించి ఎంతైనా రాయొచ్చు. ఈ ఒక్క ప్రధాన పాత్రే పాఠకులచేత నవలనంతా ఏకబిగిన చదివించేలా చేస్తుంది. అమెరికాలో ఉద్యోగం కోసం ఇండియానుంచి వెళ్లిన యువతరం జీవనశైలిని, "ఇక్కడున్నది ఇంతేనా" అని నిరంతరం మధనపడే నవలానాయకుడు జే పాత్ర ఆవిష్కరణనూ మంచి రీడబిలిటీతో, చాలా సున్నితమైన చమత్కార శైలిలో రచయిత భరత్‌కృష్ణ రాయడం విశేషం.

నవలా కథాంశం కొంచెం సీరియస్‌దే అయినా, దాన్ని నడిపించిన భరత్‌కృష్ణ కథనశిల్పం బాగుంది. చాలా సున్నితమైన చమత్కార శైలితోపాటు, అక్కడక్కడా సెటైర్లతో, "మోతాదు మించిందా" అనిపించే రియలిస్టిక్ రొమాన్స్ సన్నివేశాలుకూడా కావల్సినన్ని ఉన్నాయి.

తన తొలి నవలతోనే రచయిత భరత్‌కృష్ణ ఈ పట్టును సాధించడం మనం గుర్తించవచ్చు.

ముఖ్యంగా, సిరి పాత్రచిత్రణ అద్భుతం. సిరి, జే పాత్రలమధ్య రిలేషన్‌షిప్‌ను నిర్మొహమాటంగా, ఎలాంటి హిపోక్రసీ లేకుండా పూర్తి వాస్తవిక పధ్ధతిలో నడిపించడం బాగుంది. ఇది నిజంగా పాఠకులు చదివి ఫీలవ్వాల్సిన అంశం.

ప్రేమా, దేశం పట్ల తన బాధ్యతా .. ఏది ప్రధానం అన్నదాని గురించి కూడా ఈ నవలలో చెప్పిన పధ్ధతి పాఠకులకు బాగా నచ్చుతుంది.

రచయిత భరత్‌కృష్ణ తను ఎన్నుకున్న పాయింట్‌ను ఎంత బాగా చెప్పినా - నవల ముగింపు మాత్రం పాఠకులను కొంత నిరాశకు గురిచేస్తుంది. ఈ ముగింపు అందరికీ నచ్చదు. కానీ, అందరికీ నచ్చేలా రాయడం మళ్లీ ఒక రొటీనే అయిపోతుంది కాబట్టి అలా చేయలేదనుకోవచ్చు. మనసులోని ఆలోచనకు, సంఘర్షణకు ఒక సంపూర్ణ రూపం సంతరించుకోనప్పుడు దాన్నలా వదిలివేయడమే వాస్తవికంగా ఉంటుంది. భరత్‌కృష్ణ ఆ పనే చేశాడు.

అమెరికాలో సుమారు ఆరేళ్లపాటు ఉండి, చదివి, వివిధహోదాల్లో పనిచేసి, అక్కడి అన్ని లగ్జరీస్ చూసి ఇండియా తిరిగొచ్చిన నవలారచయిత భరత్‌కృష్ణ ఎన్నుకున్న ఈ నవలాకథాంశం చాలా విశిష్టమైనది. తమ పిల్లలను అమెరికా పంపాలనుకొనే తల్లిదండ్రులు, అమెరికావెళ్లి ఏదో సాధించాలనుకొనే యువతరం, ఇప్పటికే అమెరికాలో స్థిరపడి కూడా ఎదో కోల్పోతున్నామన్న ఆలోచనతో ఉన్నవాళ్లు తప్పక చదవాల్సిన నవల ఈ "గై ఆన్ ది సైడ్ వాక్".

గోవాలోని సిన్నమన్ టీల్ ద్వారా ప్రచురితమైన ఈ నవల - అమెజాన్ నుంచి, ఫ్లిప్‌కార్ట్ దాకా .. అన్ని ఆన్‌లైన్ సైట్స్‌లోనూ లభిస్తున్నది. విశేషం ఏంటంటే, ఈ నవల ఆవిష్కరణ కూడా రొటీన్‌కు భిన్నంగా జరిగింది. తన "గై ఆన్ ది సైడ్ వాక్" నవలను గత మార్చి 10వ తేదీనాడు ఆన్‌లైన్‌లో గూగుల్ ప్లస్, యూట్యూబ్‌ల ద్వారా  భరత్‌కృష్ణ లైవ్‌లో విడుదల చేయడం విశేషం.                                                                        

Friday, 1 April 2016

ఒక అడిక్షన్‌కు గుడ్‌బై!

ఫేస్‌బుక్ మీద నాకు నిజంగా విరక్తి వచ్చేసింది. ఇది ఉన్నట్టుండి వచ్చేసింది కాదు. సుమారు రెండు మూడు నెలలనుంచీ అనుకుంటున్నాను. కానీ, రావాల్సిన టైమ్ ఇప్పుడొచ్చింది!

మొన్న సాయంత్రం 6 గంటలకు నా ఎఫ్ బి మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ దీని గురించి ముందే చెప్పాను, నా టైమ్‌లైన్ ద్వారా.

చెప్పినట్టుగా అదే రోజు సాయంత్రం 6 గంటలకు నా ఎఫ్ బి ప్రొఫైల్‌ను, పేజ్ ని డియాక్టివేట్ చేశాను.

72 గంటలు గడిచింది. కొంపలేం మునగలేదు. సునామీ రాలేదు. వందలాది సిల్లీ సెల్ఫీలు, సొంతడబ్బాలు చూసే/రాసే/చదివే తలనొప్పి మాత్రం ఒక్క దెబ్బతో మాయమైపోయింది.

ఈ కారణాన్ని మించిన మరో కారణం కూడా ఉంది .. నా ఎఫ్ బి డీయాక్టివేషన్ వెనుక.

హిపోక్రసీ నావల్లకాదు.

లౌక్యం గురించిన ఎబిసిడిలు ఇప్పుడు నేను నేర్చుకోలేను.

నేను సంఘర్షణలో ఉన్నాను అంటే, సంఘర్షణలో ఉన్నాననే చెప్తాను. నా మనసులో నీ గురించి ఇలా అనుకుంటున్నాను అంటే, అలా అనుకున్నదే చెప్తాను కానీ, షుగర్ కోటింగిచ్చి మరొకటి చెప్పలేను.

నేను సూటిగా కమ్యూనికేట్ చేయలేని ఫ్రెండ్స్ కూడా (నా ఫ్రెండ్స్ లిస్ట్‌లో) ఉన్న ఫేస్‌బుక్‌లో నేనుండటం నాకు చాలా అసహజంగా అనిపించింది. ఫేస్‌బుక్ ను ఎప్పటినుంచో వదిలెయ్యాలి అనుకుంటున్న నా ఆలోచనకు ఇది కేటలిస్ట్‌గా పనిచేసింది.

ఇలా అనుకోవడం, డీయాక్టివేట్ చేయడం వెంటనే అయిపోయాయి.

సో, ఆల్ హాపీస్ .. 

Sunday, 27 March 2016

రెండోవారం ఏదీ?

రాత్రి ఒక ఇంటర్వ్యూ చూశాను. అది గురువుగారు దాసరి నారాయణరావు గారిది.

"స్వర్గం నరకం" జైహింద్ థియేటర్లో రిలీజయినప్పుడు, దాని ప్రారంభపు కలెక్షన్ కేవలం 200 రూపాయలట!

అలా 200 రూపాయల కలెక్షన్లతో ప్రారంభమైన అదే సినిమా, నెమ్మదిగా రెండోవారంలో పుంజుకొని, ఆ తర్వాత మూడోవారంలో సన్‌డే నాటికి 4 ఆటలూ హౌజ్‌ఫుల్ అయ్యిందట! ఆ తర్వాతంతా చరిత్రే.

గురువుగారి తొలిచిత్రం "తాత మనవడు" విషయంలోనూ ఇదే జరిగిందని విన్నాను.

కట్ టూ 2016 - 

కొత్తవాళ్లతోనూ, అప్‌కమింగ్‌వాళ్లతోనూ తీసే సినిమాలకు భారీ రేంజ్‌లో ప్రమోషన్ ఉంటే తప్ప అసలు ఓపెనింగ్స్ ఉండవు. అంతే కాదు. ఆ సినిమాకు ఎందుకు వెళ్లాలి అన్న ప్రశ్నకు ఠక్కున సమాధానం చెప్పే 'యుఎస్‌పి' కూడా ఒకటి ఆ సినిమాకు ఉండితీరాలి. ఇవి లేనప్పుడు, సినిమా ఎంత బాగున్నా జనం దృష్టిలోకి వెళ్లదు. ప్రేక్షకులు రారు.

ఇదంతా ఇప్పుడు పెద్ద సినిమాలకు కూడా వర్తిస్తుంది.

ఒక సినిమా బాగుంది అని మౌత్ టాక్, రివ్యూలు వచ్చి - అది రెండో వారంలోనో, మూడోవారం లోనో పికప్ అయ్యేదాకా ఆగే పరిస్థితి ఇప్పుడు లేదు. అలాగే - ఓపెనింగ్ కలెక్షన్లు బాగా రాని సినిమా చిన్నదా, పెద్దదా అన్న ప్రశ్న కూడా లేదు. ఓపెనింగ్స్ బాగా వచ్చి సినిమా నడిచిందా .. ఓకే. లేదంటే, ఆ ఒక్కవారం లోనే సినిమా ఎత్తేస్తున్నారు.

ఇదీ ఇప్పటి ఇండస్ట్రీ సిస్టమ్.

ఈ పరిస్థితే గనుక అప్పుడున్నట్లైతే, దర్శకరత్న దాసరితోపాటు ఇంకెంతమందో పెద్ద దర్శకులు అసలు ఫీల్డులో ఉండేవారేకాదు అని స్వయంగా గురువుగారే అన్నారు ఆ ఇంటర్వ్యూలో.

ఈ ఒక్క కారణంగా - ప్రస్తుతం ఎంతోమంది టాలెంట్ ఉన్న కొత్త దర్శకులు ఫీల్డులో నిలదొక్కుకోలేకపోతున్నారు. ఈ మాటకూడా వారే చెప్పారు.

ఎంత నిజం?  

Monday, 14 March 2016

మైండ్‌సెట్ మేటర్స్!

'నాగురించి ఎవరేమనుకుంటున్నారో' అని అస్సలు ఆలోచించవద్దు. అలా అనుకున్నవారెవరూ అడుగు ముందుకేయలేరు.

సినీఫీల్డులో ఉన్నవాళ్లకయితే ఇది మరీ ముఖ్యం. ఇక్కడ సిచువేషన్ అలా ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే - ఒక దట్టమైన అడవిలో ఉన్నామనుకోవాలి. ఎప్పుడూ అలర్ట్‌గా ఉండాలి. ఎటునుంచి ఏదైనా, ఎప్పుడైనా, ఏరూపంలోనైనా ఎటాక్ చేయొచ్చు.

ఈ బేసిక్ సూత్రం ఫీల్డులో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి, టాప్ రేంజ్‌లో ఉన్నవాళ్లనుంచి .. ఇప్పుడే ఎంట్రీ ఇచ్చిన న్యూ టాలెంట్ దాకా .. అందరికీ వర్తిస్తుంది. దీనికి ఎలాంటి మినహాయింపులు లేవు. సవరణలు లేవు.

కట్ టూ రియాలిటీ -

ఎంత బిజీ పనుల్లో మునిగి ఉన్నా, ఎక్కడ తిరుగుతున్నా .. గత రెండు మూడు రోజులనుంచి మనసెందుకో చాలా మూడీగా ఉంది. ఈ మూడీనెస్‌కు కారణం ఏంటీ అంటే, దాని మీద ఒక పుస్తకమే రాయొచ్చు. కాని, దానికి చాలా టైముంది. ఆ పని తర్వాతెప్పుడైనా చేసుకోవచ్చు. అది వేరే విషయం.

ఒక స్ప్లిట్ ఆఫ్ ది సెకండ్‌లో, ముందూ వెనకా ఆలోచించకుండా మనం తీసుకొనే కొన్ని ఫూలిష్ నిర్ణయాల ప్రభావం అలా ఉంటుంది మరి. తప్పదు.

ఇప్పుడంతా కళ్లముందున్న టార్గెట్స్, టైమ్ ఫాక్టర్.

వేరే ఆలోచించడం లేదు.

అయినా సరే - అనుక్షణం ఏవేవో నా ఆలోచనల్లోకి చొచ్చుకొని వస్తున్నాయి. ఊపిరాడనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నేను మాత్రం ఎక్కడా ఆగటం లేదు. పట్టించుకోవడంలేదు. ఒకరకంగా ఇది నాకు నేనే వేసుకున్న పనిష్‌మెంట్. కాని, ఈ పనిష్‌మెంట్ ఇప్పుడు నాకు చాలా అవసరం.

ఎట్ లీస్ట్, నా కొత్త ప్రాజెక్టును అఫీషియల్‌గా ఎనౌన్స్ చేసేదాకా. 

Sunday, 6 March 2016

చార్లీ చాప్లిన్ విజయరహస్యం!

తలరాత, విధిరాత, ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది .. వంటి శాస్త్రాలను నేను నమ్మలేను. నమ్మను.

మన కృషినిబట్టే ఫలితం ఉంటుంది. మన నిర్ణయాలనుబట్టే కొన్ని కలిసిరావడమో, లేదా కలిసిరాకపోవడమో జరుగుతుంది. ఇది నా వ్యక్తిగత నమ్మకం. చాలా సందర్భాల్లో నా అనుభవం కూడా.  

కట్ టూ చార్లీ చాప్లిన్ -

తన జీవితకాలంలో సుమారు 80 సినిమాల్లో నటించి, 3 అకాడమీ అవార్డుల్ని అందుకున్న చార్లీ చాప్లిన్ అంటే కేవలం ఒక్క నటుడుగానే అందరికి తెలుసు. కానీ - అతనొక మంచి రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, బిజినెస్‌మేన్ అన్న విషయం చాలామందికి తెలియదు.

మేరీ పిక్‌ఫోర్డ్, డగ్లస్ ఫెయిర్‌బాంక్స్, డి డబ్ల్యూ గ్రిఫిత్ లనే మరో ముగ్గురు ఆర్టిస్టులతో కలిసి చాప్లిన్ పూనుకోకపోతే, 1919 లో "యునైటెడ్ ఆర్టిస్ట్స్" అనే ప్రొడక్షన్ కంపెనీ అసలు హాలీవుడ్‌లో ఏర్పడేదే కాదు.

హాలీవుడ్ చరిత్రలో కేవలం ఆర్టిస్టులు మాత్రమే స్థాపించిన మొట్టమొదటి స్టూడియో అదే!    

చార్లీ చాప్లిన్ చెప్పిన ఒక మూడు కొటేషన్లను రికార్డ్ చేసుకోవడం కోసం, మరో కోణంలో స్వీయ విమర్శ కోసం మాత్రమే నేనీ బ్లాగ్ పోస్ట్ రాస్తున్నాను:

“Nothing is permanent in this world, not even our troubles.”

“I like walking in the rain, because nobody can see my tears.”

“The most wasted day in life is the day in which we had not laughed.”

చాప్లిన్ మార్కు ఎంటర్‌టైన్‌మెంట్ మొత్తాన్ని, ఆయన జీవితాదర్శాన్నీ ఈ మూడు కొటేషన్లలో మనం చూడొచ్చు. అలాంటి చార్లీ చాప్లిన్ తన ఆటోబయోగ్రఫీలో చెప్పుకున్నట్టు .. చాప్లిన్ విజయరహస్యం ఏ విధిరాతో కానే కాదు.

క్రియేటివ్ ఫ్రీడమ్!

ఈ క్రియేటివ్ ఫ్రీడమ్‌కు అడ్డుపడే చిక్కుల్ని ప్రారంభంలోనే గుర్తించకపోవడం, లేదా అలాంటి చిక్కుల్ని  కొనితెచ్చుకోవడం ఎంత తెలివితక్కువతనమో - వాటిల్లోంచి వెంటనే బయటపడకపోవడం అంతకంటే పెద్ద మూర్ఖత్వం.

ఈ చిక్కులు వ్యక్తిగతమైనవి కావొచ్చు, సాంఘికమైనవి కావొచ్చు, ఆర్ధికమైనవి కావొచ్చు. అడుగడుగునా మాత్రం అడ్డుపడతాయి. జీవితాన్ని అనుకున్నట్టుగా ముందుకు సాగనీయవు. జీవితంలో అసలు ఎన్నడూ ఊహించని అల్లకల్లోలం సృష్టిస్తాయి.    

ఈ లాజిక్ ఒక్క క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికే కాదు, అందరికీ వర్తిస్తుంది.

ఈ నిజాన్ని ముందే గ్రహించగలిగాడు కాబట్టే - చాప్లిన్ తన క్రియేటివ్ ఫ్రీడమ్‌కు అడ్డుపడే చిక్కులకు ముందే చెక్ పెట్టుకున్నాడు. 1919 లోనే హాలీవుడ్‌లో యునైటెడ్ ఆర్టిస్ట్స్ స్థాపించాడు. తను కోరుకున్న క్రియేటివ్ ఫ్రీడమ్‌ను సాధించుకొన్నాడు.

"చార్లీ చాప్లిన్" అనగానే పెదాలపైన నవ్వు వికసించేలా ప్రపంచ చలనచిత్ర చరిత్రలో నిల్చిపోయాడు.  

Saturday, 27 February 2016

'వంగవీటి' వర్మ!

ఒక సినిమా స్క్రిప్టు కూడా రెడీ అవకముందే, కేవలం దాని కాన్సెప్ట్‌తోనే ఒక రేంజ్ సంచలనం క్రియేట్ చేసి, తద్వారా ఆ సినిమా బిజినెస్ కూడా భారీరేంజ్‌లో జరిగేలా గేమ్ ఆడ్డం అనేది అంత ఆషామాషీ విషయం కాదు.

అదొక పెద్ద ఆర్ట్. ఒక పెద్ద బిజినెస్ జిమ్మిక్. ఒక పెద్ద ప్రమోషన్ ప్లాన్.  

నా ఉద్దేశ్యంలో, ఈ ఆర్ట్ రామ్‌గోపాల్‌వర్మలో ఉన్నంతగా ప్రస్తుతం మరే ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్‌లోనూ లేదు.

కొందరికి ఇది నచ్చకపోవచ్చు. తప్పుగా అనిపించవచ్చు. అది వేరే విషయం.

బట్ .. అన్ని వ్యాపారాల్లాగే సినిమా అనేది కూడా ఒక వ్యాపారమే. ఒక ఎంటర్‌టైన్‌మెంట్ బిజినెస్. లేదా క్రియేటివ్ బిజినెస్.

బిజినెస్ అన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఎవరి స్టయిల్లో వారు తమ బిజినెస్‌ను ప్రమోట్ చేసుకుంటారు. ఏ స్టయిల్ కరెక్ట్ అన్నది ఒక్కొక్కరి వ్యక్తిగత ఆలోచనావిధానాన్నిబట్టి ఉంటుంది. వీటిల్లో ఎవరి స్టయిల్ కరెక్ట్ అన్నది పాయింట్ కాదు. టార్గెట్ రీచ్ కావడమే పాయింట్.

కోట్లు కుమ్మరించిన నిర్మాతకు తిరిగి డబ్బులు వచ్చేలా చెయ్యడమే ఇక్కడ ప్రధాన టార్గెట్.

ఇప్పటి సినిమా బిజినెస్, ఒకప్పటి సినిమా బిజినెస్ పూర్తిగా వేరు .. ఏ యాంగిల్‌లో చూసినా.

సినిమా మేకింగ్ నుంచి, దాని ప్రమోషన్, ఎగ్జిబిషన్ విషయాల్లో ఆధునికంగా ఎన్నో ఊహించని మార్పులు వచ్చాయి. ఊహించనంత వేగంగా మరెన్నో మార్పులొస్తున్నాయి.

ఇదివరకటిలాగా - సినిమా ఎలా ఉన్నా, ఓపిగ్గా దాన్ని మూడు గంటలపాటు కూర్చొని చూసే ప్రేక్షకులెవ్వరూ లేరిప్పుడు. చెప్పాలంటే, ఫిలిం మేకర్స్ కంటే వ్యూయర్స్‌కే ఇప్పుడు చాలా విషయాలు చాలా బాగా తెలుసు.    

ఏ సినిమా చూడాలి, ఏ సినిమా చూడొద్దు అనేది క్షణంలో నిర్ణయం తీసుకోడానికి ఉపయోగపడే టెక్నాలజీ ఇప్పుడు వ్యూయర్ చేతుల్లో ఉంది.

అన్నింటికంటే ముఖ్యంగా .. ఇప్పుడు సినిమా అంటే ఒక వారం, లేదా రెండు వారాలే! 50 రోజులు, 100 రోజులు అని తమ సినిమా గురించి ఎవరైనా అన్నారు అంటే .. వారి గురించి కొంచెం కిందా మీదా చూసి ఆలోచించాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో - సినిమా ప్రమోషన్ అనేది అసలు సినిమా కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇవాల్సిన అంశంగా మారింది.

కట్ టూ వర్మ -

సింగిల్ పైసా ఖర్చులేకుండా మీడియాను ఎలా తనవైపు తిప్పుకోవాలో వర్మకు తెలిసినంతగా మరొక డైరెక్టర్‌కు తెలియదు:

> నా తర్వాతి సినిమా "వంగవీటి" అన్నాడు వర్మ. సెన్సేషన్ స్టార్టెడ్.
> తెలుగులో ఇది నా చివరి సినిమా అన్నాడు. ఇదింకో సెన్సేషన్.
> కమ్మ .. కాపు సాంగ్ రిలీజ్ చేశాడు. ఇదో పెద్ద రగడ.
> నాకు తెలిసినంతగా విజయవాడ గురించిగానీ, అక్కడి రౌడీయిజం గురించి గానీ ఇంకెవ్వరికీ తెలీదు అన్నాడు. ఇలాంటి మరెన్నో ట్వీట్ల వర్షం కురిపించాడు. ఇదో పెద్ద క్యూరియాసిటీ. 
> ఈలోపు ఆయనకు బెదిరింపులు! అవి నిజం కావొచ్చు. జిమ్మిక్ కావొచ్చు. కానీ, సెన్సేషన్!
> ఆ వార్నింగులకు వర్మ కౌంటర్ వార్నింగులు!! అది కూడా .. ఫ్లైట్ టికెట్, హోటల్ రూం  వగైరా పూర్తి వివరాలిస్తూ.

కట్ చేస్తే - 

ఇంతకుముందెన్నడూ లేని విధంగా .. ఒక ఫాక్షనిస్ట్ సినిమాను మించి పెద్ద కాన్వాయ్. వందలాది బైకులు. వేలాదిమంది జనం.

ఇంతకంటే పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ ఏముంటుంది?

ఒక సినిమా స్క్రిప్టు, షూటింగ్ కంటే ముందే దాని ప్రమోషన్, బిజినెస్ ఒక రేంజ్‌కెళ్లిపోయాయి.

సినిమా ఇండస్ట్రీ భాషలో .. 'వంగవీటి' హిట్టా ఫట్టా ఇక అనవసరం.

టార్గెట్ రీచ్‌డ్.

ఇప్పుడు కూల్‌గా తన రిసెర్చ్ పూర్తి చేసుకొని, తను అనుకున్నవిధంగా సినిమా తీసేస్తాడు వర్మ. ఈలోపు మరెన్నో సంచలనాలుంటాయి. ట్వీట్ల ద్వారా. వాటి రియాక్షన్ ద్వారా.

ఇలా చాలామంది డైరెక్టర్లు చేయాలనుకుంటారు. కానీ చేయలేరు. దానిక్కావల్సింది గట్స్. నా ఇష్టం అనుకొనే ఒక మైండ్‌సెట్. అదంత ఈజీ కాదు.

దటీజ్ వర్మ! 

Wednesday, 17 February 2016

హాపీ బర్త్‌డే, కె సి ఆర్!

రాష్ట్ర అసెంబ్లీలో ఒకప్పుడు తెలంగాణ పదాన్నే నిషేధించారు అని విన్నప్పుడు రక్తం మరుగుతుంది.

అదే అసెంబ్లీలో - తమ పార్టీ అధినేతలకు చెంచాగిరీ చేస్తూ, నోరెత్తక కూర్చున్న అనేకమంది ‘సన్నాసి’ తెలంగాణ ప్రాంత మంత్రులను, ఎమ్మెల్లేలను గుర్తు చేసుకున్నప్పుడు సిగ్గనిపిస్తుంది.

ఇలాంటి నేపథ్యంలో - దశాబ్దాలుగా లేస్తూ, పడిపోతూ .. నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసి, నింగిని అంటుకునేలా రగల్చడానికి ఒక ఉద్యమ నాయకుడు అవసరమయ్యాడు.

ఆ అవసరాన్ని గుర్తించి - తెలంగాణ సాధనే తన జీవితాశయంగా, జీవితంగా మార్చుకొని - తిరుగులేని ఉద్యమనాయకుని అవతారమెత్తిన ఒకే ఒక్కడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు .. ఉరఫ్ .. కె సి ఆర్.

తన తిండి, తిప్పలు, గాలి, నీరు, నిద్ర .. అన్నీ తెలంగాణగా పద్నాలుగేళ్లపాటు ఉద్యమంలో నానా విన్యాసాలు చేశాడు కె సి ఆర్.

ఎన్నో అడ్డంకులు. అవమానాలు. ఎదురుదెబ్బలు. ఎగతాళి. తిట్లు. శాపనార్థాలు.

అయినా చెక్కు చెదరని ఏకాగ్రతతో - ఎదుటివారికి ఎప్పటికప్పుడు ఊహించని ట్విస్టులు ఇస్తూ, తికమకపెడుతూ, అవేశం రగిలినప్పుడు తిడుతూ, అవసరమైనచోట అణకువ పాటిస్తూ, అందరిని కలుపుకుపోతూ - ఉద్యమాన్ని ముందుకే నడిపాడు తప్ప .. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ జ్వాల ఆరిపోనివ్వలేదు.

ఏం మేధస్సు .. ఎంతటి వాగ్ధాటి .. అసలు ఏమిటా జ్ఞాపక శక్తి ..

ఎంత పట్టుదల .. ఎంత ఓర్పు .. ఎంత శక్తి .. ఎంత మానవత్వం .. ఎంత చాకచక్యం .. ఎన్ని ఎత్తులు .. ఎన్ని జిత్తులు ..

అన్నీ ఒకే ఒక్క లక్ష్యం కోసం.

అది .. తెలంగాణ సాధన.

ఈ ఒక్క లక్ష్యమే కె సి ఆర్ నోటివెంట విసరడానికి సిధ్ధంగా ఉన్న గ్రెనేడ్ లాంటి ఒక మాటగా వేలాదిసార్లు వినిపించింది. తెలంగాణ ప్రజల గుండెల్లో ప్రతిధ్వనించింది:

"తెలంగాణ తెచ్చుడో .. సచ్చుడో!"

ఎంత ఆత్మ విశ్వాసం .. ఎంత తెగింపు .. ఎంత లేజర్ ఫోకస్ ..

చివరికి ఒక రోజు - "ఆంధ్రప్రదేశ్ నుంచి డిల్లీ వెళ్తున్నాను. మళ్ళీ నేను అడుగుపెట్టేది తెలంగాణ గడ్డమీదనే!" అని చెప్పిమరీ వెళ్లాడు కె సి ఆర్.

చెప్పినట్టుగానే, నాలుగురోజుల తర్వాత .. డిల్లీ నుంచి తెలంగాణ గడ్డమీదనే మళ్ళీ కాలుపెట్టాడు కె సి ఆర్.

దటీజ్ కె సి ఆర్!

విజయమే లక్ష్యంగా - వందలాది నాయకుల్ని, వేలాది గ్రూపుల్నీ సంఘాల్నీ, కోట్లాది ప్రజలను సమన్వయం చేసుకొంటూ - పడుతూ, లేస్తూ, పరుగెత్తుతూ, పరుగెత్తిస్తూ - ఉద్యమాన్ని ఉరకలెత్తించి గమ్యం చేర్చిన కె సి ఆర్ గత పద్నాలుగేళ్ల జీవితం, నా జీవితకాలంలో నేను స్వయంగా నా కళ్లముందు చూసిన ఒక విజయ గాథ.

కాగా - ఈ గమ్యం చేరుకోవడం కోసం ఆయన వేసుకున్న బ్లూప్రింటు, అనుసరించిన వ్యూహం, నడిపించిన డిప్లొమసీ, కూడగట్టిన లాబీయింగ్, వేసిన ఎత్తులు, చేసిన జిత్తులు, ఆవేశంలో అరచిన అరుపులు, పడిన తిట్లు, పాటించిన మౌనం, పెట్టిన చెక్‌లు .. అదంతా ఒక యుధ్ధ తంత్రం.

ఆరు దశాబ్దాలుగా రగిలిన తెలంగాణ ప్రజల మనోవాంఛను నిజం చేసిన అంతటి ఒక వ్యక్తికి, ఉద్యమశక్తికి .. రేపటి మన బంగారు తెలంగాణ రూపశిల్పికి, దాని సాధనకోసం మొక్కవోని దీక్షతో ముందుకు సాగిపోతున్న సిసలైన రెనెగేడ్ కార్యసాధకునికీ .. ఒక రచయితగా, ఒక చలనచిత్ర దర్శకుడిగా,  ఒక అభిమానిగా, ఒక తెలంగాణ బిడ్డగా ఇవే నా హార్దిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 

Monday, 15 February 2016

గై ఆన్ ది సైడ్‌వాక్

ఈ బెస్ట్ సెల్లర్ ఇంగ్లిష్ నవల వచ్చే మార్చి 10 నాడు  ప్రపంచమంతా విడుదల కాబోతోంది.

భరత్‌కృష్ణ తొలి నవల ఇది. అయినా, ముందే 'బెస్ట్ సెల్లర్' అని గర్వంగా చెప్పగలుగుతున్నానంటే .. అది నా నమ్మకం. రేపు కాబోయే నిజం.

చెప్పాలంటే .. ఈ నవలా రచయితకు నేను ఫ్యాన్‌ని!

కట్ టూ భరత్‌కృష్ణ - 

గుంటూరులోని ఓ కేంద్రప్రభుత్వ విద్యాసంస్థలో సుమారు పాతికేళ్లక్రితం ఓ రెండేళ్లు పనిచేశాన్నేను.

ఆ రెండేళ్లలో, నేను చాలా దగ్గరగా గమనించిన విద్యార్థులెందరి పేర్లో నేనిప్పుడు కూడా చెప్పగలను:  రాజశేఖర్ బాబు, సి హెచ్ వి కె ఎన్ ఎస్ ఎన్ మూర్తి, బోడా సాంబశివరావు, సజ్జా సాంబశివరావు, కొల్లూరి వీరరాఘవ, సురేష్‌బాబు, ఎన్ వి ఎస్ ఆర్ కె ప్రసాద్, దిలీప్, దుర్గారామ్, మోహన్‌రావు, మస్తాన్, సత్యంబాబు, ముత్తయ్య, నాగరాజు, లక్ష్మీకుమార్; లక్ష్మీకవిత, సౌజన్య, మమత, బేబి, ఉషారాణి, రమాదేవి, వీణ, విద్య, చైతన్య, సూరం మాధవి, సుష్మ,  వాగ్దేవి, లీల .. ఇలా కనీసం ఇంకో 100 మంది విద్యార్థుల పేర్లు నేను చాలా ఈజీగా చెప్పగలను.

వీళ్లంతా ఒక్కొక్కరు ఒక్కోవిధంగా నాకు గుర్తుండిపోయారు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేక లక్షణం. ఏదో ఒక ప్రత్యేకత.            

అప్పటి ఆ విద్యార్థుల్లో ఇప్పుడు కొందరు ఐ ఎ యస్ లయ్యారు. ఎందరో డాక్టర్లు, ఇంజినీర్లయ్యారు. చాలా మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, లెక్చరర్లు అయ్యారు. మరెందరో మంచి బిజినెస్‌మేన్‌లయ్యారు. ఇంకెందరో రకరకాల ఫీల్డుల్లో, వివిధహోదాల్లో, విదేశాల్లో కూడా ఉన్నారు.

ప్రస్తుతం తమిళనాడులోని మధురై జిల్లా కలెక్టర్ అప్పటి మా విద్యార్థి కొల్లూరి వీరరాఘవ! మొన్న ఫిబ్రవరి 2 నాడే ప్రెసిడెంట్స్ అవార్డ్ కూడా తీసుకున్నాడు.

అప్పుడు, అలా నేను చాలా దగ్గరగా గమనించిన విద్యార్థుల్లో కొందరితో నాకిప్పటికీ మంచి కమ్యూనికేషన్, మరెంతో మంచి అనుబంధం ఉంది. వాళ్లను నేను అభిమానిస్తాను. చెప్పాలంటే .. వారికి నేను ఫ్యాన్‌ని.

అదిగో, అలా .. నేను భరత్‌కృష్ణకు కూడా ఫ్యాన్‌ని!

భరత్ నవలను, దాని మాన్యుస్క్రిప్ట్ దశలోనే చదివిన క్రెడిట్, ఆనందం, గర్వం నాకున్నాయి. గర్వం ఎందుకంటే .. నేను చూస్తుండగా, నా కళ్లముందు ఎదిగిన నిలువెత్తు వ్యక్తిత్వం భరత్.

భరత్ ఈ నవల కాన్‌సెప్ట్‌ను అనుకున్న క్షణం నుండి, దాన్ని తను రాయడం పూర్తిచేసేవరకు ప్రతి స్టేజ్ నాకు తెలుసు. ప్రతి స్టేజ్‌లో తన భావాల్ని నాతో పంచుకున్నాడు. నిర్మొహమాటంగా తన ఉద్దేశ్యాల్ని నాకు చెప్పాడు.

బేసిగ్గా నేనూ రచయితనే కాబట్టి - నాకు తోచిన ప్రతి చిన్న అంశాన్నీ అతనితో చర్చిస్తూ, ప్రతి జాగ్రత్తనీ వివరిస్తూ, ఈ నవలను చాలా తొందరగా రాయమని భరత్‌ని బాగా పోరుపెట్టింది నేనే. అది బయటికి రావడం ఆలస్యమౌతుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తుండిపోయిన మొదటి సాక్షిని కూడా నేనే.

కట్ టూ మార్చి 10 -

ఇప్పుడు .. అన్ని అవాంతరాలను అధిగమించి, భరత్‌కృష్ణ రాసిన "గై ఆన్ ది సైడ్‌వాక్" నవల ఈ మార్చి 10 నాడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ ఎక్జైట్‌మెంట్‌ను ఎంజాయ్ చేస్తున్న మొదటి వ్యక్తినీ, మొదటి పాఠకుడినీ నేనే కావడం నాకు మరింత ఆనందంగా ఉంది. 

Tuesday, 9 February 2016

ఒక అంతశ్శోధన

కొత్త సినిమా స్టార్ట్ చేసే వరకూ ఇంక బ్లాగ్ వైపు చూడొద్దనుకున్నాను.

నగ్నచిత్రం ఏదో ఒకటి రాయడానికి కాదు. నేను రాసింది కనీసం ఒక్కరికైనా నచ్చాలి. ఆనందం ఇవ్వాలి. ఎట్‌లీస్ట్ ఆ క్షణం ఆలోచింపచేయాలి.

ఇంక ఈ బ్లాగ్ ద్వారా నేను ఆశించే మరో ప్రయోజనం .. నా సినిమాల ప్రమోషన్.

నా సినిమా జరుగుతున్నంతసేపూ - ఆ ప్రాసెస్‌లో .. నాకు తోచిన, రాయాలనిపించిన ప్రతి చిన్న అంశం మీద కూడా ఏదో ఒకటి రాస్తాను. ఇంక ఆ చిత్రానికి పనిచేస్తున్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లలో కూడా దాదాపు ప్రతి ఒక్కరి గురించీ రాస్తాను.

కట్ టూ అసలు పాయింట్ - 

నిన్ననే ఒక ట్వీట్ పెట్టాను. "ఫెబ్ ఈజ్ ఫర్ ఫ్రీడమ్" అని.

అంటే, ఈ ఫిబ్రవరి నెలలోనే ఎప్పటినుంచో నేను కోరుకొంటున్న ఫ్రీడమ్ తెచ్చుకోబోతున్నాను. కోరితెచ్చుకొన్న కొన్ని తలనొప్పుల్లోంచి ఫ్రీ అయిపోవాలనుకొంటున్నాను. కనీసం ఆ ప్రాసెస్ అయినా ప్రారంభం కావాలి. ప్రారంభిస్తాను.

అదీ, ఈ ఫిబ్రవరిలోనే!

మరోవైపు నా కొత్త సినిమాలు కూడా  ప్రారంభించబోతున్నాను. అందులో మొదటిది నా ఆత్మీయ మిత్రునితో కలిసి చేస్తున్నాను. నిజంగా అదొక చాలెంజింగ్ ప్రాజెక్ట్ అవుతుంది నాకు.

ఇదంతా ఎలా ఉన్నా .. అన్నిటికంటే ముందు, అసలు ఈ బ్లాగ్ నా కోసం నేను క్రియేట్ చేసుకున్నది. కాబట్టి, ఏదో క్షణికావేశంలో అర్థంలేని నిర్ణయాలను తీసుకోవడం ఫూలిష్‌నెస్ అవుతుంది.

సినిమాల దారి సినిమాలదే. బ్లాగింగ్ బ్లాగింగే.

నామట్టుకు నాకు .. బ్లాగింగ్ ఒక మినీ లేబొరేటరీ. ఒక థెరపీ. ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్. ఒక యోగా. ఒక ధ్యానం. ఒక అంతశ్శోధన. ఒక అంతర్మథనం.

నా ఈ నగ్నచిత్రం లో నన్ను నేను చూసుకుంటున్నాను. నాలో ఉన్న నన్ను ని విశ్లేషించుకుంటున్నాను.