Friday, 13 February 2015

ఆమె ఎవరు?

రెండ్రోజుల్లో "స్విమ్మింగ్‌పూల్" ప్రమోషనల్ సాంగ్ రెడీ అవుతోంది.

రికార్డింగ్ అయిపోయాక, దాన్ని వీడియో అవుట్‌పుత్‌తో ఎడిట్ చేసి, ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయడానికి మరో నాలుగయిదు రోజులు పడుతుంది.

ఈ ప్రమోషనల్ సాంగ్ కోసం అవసరమయిన కొన్ని షాట్స్‌లో ఒక కొత్త హీరోయిన్‌ను గానీ, ఆ స్థాయిలో ఉన్న ఓ మంచి మోడల్‌ను గానీ చూపించాలన్నది నా తాజా ఆలోచన.

కట్ టూ స్టార్ హంట్ - 

విచిత్రంగా, షూటింగ్ తర్వాత చేస్తున్న ఈ స్టార్ హంట్ కోసం ఫేస్‌బుక్ లో నేనిచ్చిన చిన్న యాడ్‌కి కొన్ని అప్లికేషన్లు వచ్చాయిగాని అవి నేను ఊహించిన రేంజ్‌లో లేవు. నేను అనుకున్న విధంగా షూట్ చేయడానికి వారు సరిపోరు.

కొన్ని క్లోజప్ షాట్స్‌తోపాటు - మిడ్, ఫుల్ షాట్స్ లో కొన్ని వాకింగ్ షాట్స్ ఉంటాయి. అన్నీ కలిపి ఓ పది షాట్స్. కేవలం ఓ రెండు గంటల షూటింగ్.

ఈ అదృష్టం ఎవరిని వరిస్తుందో తెలియదుగాని, ఓవర్‌నైట్‌లో బాగా పాపులర్ అయ్యే అవకాశం ఉంటుంది.

యు ఎస్, రుమేనియా, రష్యా, కెనడా, న్యూజీలాండ్, మారిషస్ లలో నాకు తెలిసిన యాక్టర్స్, మోడల్స్ కొందరున్నారు. అడిగితే - ఫ్రీగా అక్కడినుంచే షూట్ చేసి పంపిస్తారు. అవుట్‌పుట్ కూడా సూపర్ రిచ్‌గా వస్తుంది. కాని, మరింత ఆలస్యం అవుతుంది.

నిజానికి ముందు ఈ షాట్స్‌ని హీరోయిన్ ప్రియ వశిష్ట తోనే తీయాలనుకున్నాను. అది కుదిరేపనిలా అనిపించడంలేదిప్పుడు. ఆ ఆలోచన మానుకున్నాను కూడా.

మరెలా?

ఇంకో రెండు మూడు రోజుల్లో తేలిపోతుంది. అప్పటిదాకా నాక్కొంచెం టెన్షన్. మీకు సస్పెన్స్.

అంతే. 

Thursday, 12 February 2015

ఎవరు దయ్యం?

దయ్యం 1: 
ఈ దయ్యానికి ఎప్పుడూ డేట్స్ ప్రాబ్లం, ట్రాన్స్‌పోర్ట్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం.

వచ్చేవరకూ వస్తుందా రాదా అని మా టెన్షన్. వచ్చాక తొందరగా ఎప్పుడు బయటపడిపోదామా అని తనవైపు టెన్షన్. మొత్తం తను నటించిన నాలుగయిదు రోజుల్లో - లాస్ట్ డే, లాస్ట్ షాట్ వరకూ పెద్ద టెన్షన్ మాకు.

కానీ బాగా నటించింది. ఆ ఒక్క యాంగిల్ చాలు. ఇది మంచి దయ్యం అని చెప్పడానికి.

నాకు కావల్సింది కూడా తెరమీద తను బాగా నటించడమే కాబట్టి, ఈ దయ్యం నిజంగా మంచి దయ్యమే.

దయ్యం 2:
హబ్బో.. ఈ దయ్యం ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. మంచి ఎట్రాక్టివ్ స్మయిల్. ఆ చిరునవ్వు ఎంత అమాయకంగా ఉంటుందంటే - తను ఎంత లేట్‌గా వచ్చినా, దానివల్ల మాకు ఎంత టెన్షన్ అయినా .. అంతా ఇట్టే మర్చిపోతాం.

స్మయిల్ తర్వాత, ఈ దయ్యం విషయంలో చెప్పుకోవాల్సింది యాక్టింగ్.

సింగిల్ టేక్ ఆర్టిస్ట్!

పక్కవాళ్ల యాక్టింగ్‌లోనే ఏదయినా తేడారావాలి తప్ప తన విషయంలో రాదు. అంత మంచి నటి తనలో ఉంది. మా ప్రొఫెసర్ "ఆమె కళ్లల్లోనే ఉంది అంతా" అంటారు. మొన్న డబ్బింగ్ రోజు కూడా ఇద్దరూ కలిశారు. అప్పుడు కూడా ప్రొఫెసర్ ఇదే మాట!

సో, ఈ దయ్యం కూడా మంచి దయ్యమే అన్నమాట.

దయ్యం 3:
ఈ దయ్యం గురించి చెప్పాలంటే చాలా ఉంది. బండ దయ్యం. పైకి అలా కనిపిస్తుంది కానీ, పెద్ద డేర్‌డెవిల్.
ఈ దయ్యంతో మాట్లాడాలంటే ముందు శాటిలైట్‌కు కనెక్ట్ కావాలి. అదన్నమాట విషయం.

యాక్టింగ్ అంటే ప్రాణం. బుద్ధిగా డైలాగులూ అవీ బట్టీ పడుతుంది. ఎలా చెయ్యమంటే అలా చేస్తుంది. ఇంకా బాగా చేస్తుంది. కొన్ని క్యాజువల్ డైలాగుల విషయంలో అప్పుడప్పుడూ "ఇది ఇలా కూడా అనొచ్చుకద సర్?" అని అడుగుతుంది. తను చెప్పిన ఆ చిన్న ఇంప్రొవైజేషన్ బాగున్న ప్రతిసారీ ఓకే చెప్పాన్నేను.

ఒకటి రెండు సార్లు కంటిన్యుటీ విషయంలో తెలియక కేర్‌లెస్‌గా పప్పులో కాలేసింది. తర్వాత కంటిన్యుటీ ఏమిటో, ఎందుకో అర్థమయ్యాక అలాంటి పొరపాటు మళ్లీ చెయ్యలేదు.

సో, ఈ దయ్యం కూడా చాలా మంచి దయ్యమే.

కట్ టూ అసలు దయ్యం - 

నాకున్న చనువుతో ముగ్గురినీ "దయ్యం" అని అలా సరదాకి అన్నాను గానీ, నిజానికి "స్విమ్మింగ్‌పూల్"లో
ఈ ముగ్గురిలో ఒక్కరే నిజంగా దయ్యం.

ఆ ఒక్కరు ఎవరన్నది మీకే తెలుస్తుంది. తెరమీద చూశాక.

అలాగే .. వీరిలో దయ్యం 1 ఎవరో, 2 ఎవరో, 3 ఎవరో కూడా మీరు అప్పుడే ఈజీగా గెస్ చేయగలుగుతారు. నవ్వుకుంటారు. ఎంజాయ్ చేస్తారు.

అప్పుడేం భయమనిపించలేదు గానీ, ఈ మూడు దయ్యాల్ని తలచుకుంటే ఇప్పుడు మాత్రం చాలా భయమేస్తోంది. మూడు దయ్యాల్నీ మధ్యలో పెట్టుకొని అంత కూల్‌గా షూటింగ్ ఎలా చేశానా అని! 

Wednesday, 11 February 2015

ఇద్దరు

స్విమ్మింగ్‌పూల్ సినిమాకు సంబంధించి ఇకనుంచీ చాలా విషయాలు, విశేషాలు ఈ బ్లాగ్ ద్వారా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను.

కనీసం రోజుకి ఒక్కటయినా నా బ్లాగ్ పోస్ట్ ఉంటుంది. ఎంత బిజీలో ఉన్నా. ఎంత వర్క్ లోడ్ లో ఉన్నా.

ఇది నాకు నేనే పెట్టుకొన్న ఒక డిసిప్లిన్. ఒక లక్ష్యం కోసం. ఒకే ఒక్క లక్ష్యం కోసం.

అది .. ఈ సినిమాను నేను, అరుణ్ కుమార్ ముందే ప్లాన్ చేసుకున్నట్టుగా రిలీజ్ చేయడం. అది మా రెండో సక్సెస్.

కట్ టూ మొదటి సక్సెస్ -

ఈ సినిమా షూటింగ్ ని నేను 12 రోజుల్లో పూర్తి చేయడానికి ప్లాన్ చేశాను. షూటింగ్ డే అండ్ నైట్ ఉంటుంది. కాల్ షీట్లూ, తొక్కా తోలూ ఏవీ ఉండవు. ఇదసలు ట్రెడిషనల్ ఫిలిం మేకింగ్ కానే కాదు. అందరూ ప్రాజెక్ట్ కోసం పనిచేయాలి. ఎలాంటి ఈగోలు లేకుండా.

అదీ కాన్సెప్ట్. అదే ఒప్పందం.

ఇదే ప్రతి ఒక్క టెక్నీషియన్ కూ, ఆర్టిస్టుకూ నేను ముందే చెప్పాను. అలా ఒప్పుకున్న లైక్ మైండెడ్ ఫ్రెండ్స్‌తోనే సినిమా ప్రారంభించాను.

ఒకటీ అరా చిల్లర చికాకులు తప్పిస్తే, అంతా నేను ప్లాన్ చేసినట్టుగానే షూటింగ్ పూర్తయ్యింది.

షూటింగ్ 13 రోజుల్లో పూర్తయ్యింది. పాటలతో సహా. ఆ ఒక్క రోజుకూడా కేవలం కొన్ని టెక్నికల్ కారణాలవల్ల పెరిగింది తప్ప మరోవిధంగా కాదు.

షూటింగ్ అనుకున్నది అనుకున్నట్టుగా జరగడానికి దాదాపు అందరూ బాగా కోపరేట్ చేశారు. టెన్షన్లు లేకుండా చాలా కూల్ గా పూర్తయింది షూటింగ్.

అయితే -

అందరి సహకారం, కోపరేషన్ వేరు. హీరో కార్తీక్, డి ఓ పి వీరేద్రలలిత్ ఇచ్చిన సపోర్ట్ వేరు. వీరిద్దరి అన్‌కండిషనల్ సపోర్ట్ లేకుండా షూటింగ్ అంత ఫాస్జ్ట్‌గా, అంత కూల్‌గా, అంత క్వాలిటీతో పూర్తయ్యేది కాదు. అందులో డౌట్ లేదు.

ఎదురయిన ప్రతి సమస్యనూ అప్పటికప్పుడు "ప్లాన్ బి" లోకి మార్చుకొని ప్రొసీడ్ అయిపోయాం. అనుకున్నట్టుగా షూటింగ్ పూర్తిచేశాం.

ఇదే మా మొదటి సక్సెస్.    

ఈ సినిమాకు సంబంధించి ఈ ఇద్దరిలో నాకు బాగా నచ్చిందీ, బాగా ప్లస్ అయ్యిందీ ఒక్కటే. ఒక్క క్షణం కూడా వీళ్లు ట్రెడిషనల్ ఫిల్మ్ మేకింగ్ పద్ధతిలో ఆలోచించలేదు. వీరినుంచి నేను ఆశించింది కూడా అదే.

త్రీ ఛీర్స్ టూ మై డియర్ కార్తీక్ అండ్ వీరేన్! 

Thursday, 29 January 2015

అసలేంటీ కెమిస్ట్రీ!

హారర్ కథలన్నీ సాధారణంగా ఓ రెండు మూడు ఫార్ములాల్లో నడుస్తాయి.

ఫార్ములా ఏదయినా, అన్నింటి అంతిమ లక్ష్యం - ప్రేక్షకుల్ని భయపెట్టడమే.

ఎట్‌లీస్ట్ కొన్ని సన్నివేశాల్లోనయినా.

ఫార్ములా విషయం ఎలాఉన్నా, "స్విమ్మింగ్ పూల్" లో తెలుగులో నేనొక కొత్త ఎలిమెంట్ పరిచయం చేస్తున్నాను.

అది నాకు వ్యక్తిగతంగా బాగ పరిచయం ఉన్న ఎలిమెంట్ కావడం వల్ల, స్క్రీన్‌ప్లే విషయంలో నేను పెద్దగా కష్టపడాల్సిన అవసరంలేకపోయింది.

"స్విమ్మింగ్‌పూల్" .. ఓ హారర్ సినిమా.

రొమాంటిక్ హారర్.

ఇంకా చెప్పాలంటే, 'హాట్' రొమాంటిక్ హారర్.

ఈ సినిమాలో హీరో హీరోయిన్ల రొమాన్స్ ఓ డోస్ ఎక్కువగానే ఉంటుందని దర్శకునిగా నేనే చెప్తున్నాను. బట్ .. ఏదయినా, అంతా క్లాసిక్‌గానే ఉంటుంది. చర్చించాలంటే ఇదే ఓ పెద్ద టాపిక్ అవుతుంది. దీని గురించి మరోసారి మాట్లాడుకుందాం.

కట్ టూ కెమిస్ట్రీ -

ఇలాంటి హాట్ రొమాంటిక్ సినిమాలో ప్రియ వశిష్ట లాంటి కొత్త అమ్మాయిని పరిచయం చేయడం అనేది పెద్ద రిస్క్. అయినా చేశాను.

నా నమ్మకం.

గట్స్.

కొత్త నటి అయినా ప్రియ వశిష్ట చాలా బాగా చేసింది. బోల్డ్‌గా చేసింది. ఇది, ఏదో రొటీన్‌గా చెప్పడం కాదు. నిజంగా బాగా చేసింది.

ప్రియ ఎంత బాగా నటించిందంటే - పోస్ట్ ప్రొడక్షన్‌లో ఎడిటింగ్ స్టేజ్ నుంచి, డబ్బింగ్ వరకు - పని చేస్తూ, సీన్స్ చూసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్ ఒకటే మాట.

"అఖిల్ కార్తీక్, ప్రియ వశిష్ట ల కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది!" అని.

ప్రియకు డబ్బింగ్ చెప్పిన మహతి అనే అమ్మాయయితే ఇంకో మాటంది:

"నాకెందుకో ఈ సినిమా షూటింగ్ తర్వాత కూడా వీళ్లిద్దరూ రొమాన్స్ కంటిన్యూ చేస్తుంటారనిపిస్తోంది!" అని.

సో, అదన్నమాట కెమిస్ట్రీ అంటే!

అఖిల్ కార్తీక్ మంచి వర్సటైల్ యాక్టర్. బాగా చేయగలడు. చాలా బాగా చేశాడు కూడా. కానీ, డెబ్యూ ఆర్టిస్ట్ అయిన హీరోయిన్ ప్రియ విషయంలో ఇదో పెద్ద కాంప్లిమెంట్ అని నా ఫీలింగ్.

ఏమయినా, "స్విమ్మింగ్‌పూల్" లో అఖిల్ కార్తీక్, ప్రియ వశిష్ట పూర్తిగా వారి పాత్రల్లో జీవించారు.

రేపు ప్రేక్షకులూ ఇదే చెప్తారు.

సిల్వర్ స్క్రీన్‌పై చూశాక. 

Monday, 19 January 2015

"అలా"నాటి అఖిల్ కార్తీక్!

2006 జూన్‌కు, 2015 ప్రారంభానికి మధ్యలో దాదాపు ఎనిమిదేళ్లు గడిచాయి.

ఎనిమిదేళ్లంటే అంత తక్కువ సమయమేం కాదు. ఈ మధ్యలో ప్రతి మనిషి జీవితంలోనూ ఎన్నో సంఘటనలు జరుగుతాయి. మనిషి ఎన్నోరకాలుగా మారిపోతాడు.

నిజానికి, మన అనుభవాలు మనల్ని అలా మారుస్తాయి.

అలాంటి ఎన్నో మార్పులు జరగటానికి కారణమైన సంఘటనలు ఈ ఎనిమిదేళ్లలో నా జీవితంలో చాలా జరిగాయి. బహుశా అఖిల్ కార్తీక్ జీవితంలోనూ ఎన్నో జరిగుంటాయి.

ఇది సహజం.

కట్ టూ మా ఫేవరేట్ "అలా" - 

అప్పట్లో నేనూ, నా మిత్రులు కొందరు డబ్బులు మోబిలైజ్ చేసి తీసిన చిత్రం "అలా".

ఈ అనఫీషియల్ విషయాన్ని ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే - "అలా" చిత్రానికి అఫీషియల్‌గా నేనే ప్రొడ్యూసర్, డైరెక్టర్‌ని కూడా కాబట్టి!

ఆ విషయం అలా వదిలేద్దాం ..

"అలా"లో నేను పరిచయం చేసిన హీరోయిన్ విదిశ శ్రీవాస్తవ సొంత చెల్లెలే ఇప్పటి రైజింగ్ సౌత్ హీరోయిన్ శాన్వి శ్రీవాస్తవ (వర్మ "రౌడీ" ఫేమ్).

ట్రెడిషనల్‌గా చెప్పాలంటే - "అలా" హీరో హీరోయిన్లు రోహన్, విదిశ శ్రీవాస్తవ. కథలో వీరిదో సెపరేట్ ట్రాక్. అంతే.

కానీ - కథాపరంగా అయితే, "అలా" లో అసలు హీరో కార్తీక్.

మరో ముగ్గురు ఫ్రెండ్స్ క్యారెక్టర్లు ఉన్నా కూడా .. మొత్తంగా కథంతా కార్తీక్ పాత్ర చుట్టూ జరిగేదే.

ఒక సినిమా నిడివి ఎలా రెండున్నర గంటలో .. "అలా" చిత్రంలో కథ జరిగే సమయం కూడా రెండున్నర గంటలే.
ఆ విధంగా చూసినప్పుడు "అలా" సినిమా ఒక రియల్ టైమ్ స్టోరీ అన్నమాట!

ముంబై హైవేలో ఉన్న ఇస్నాపూర్ ఫిల్లింగ్ స్టేషన్‌లోనే దాదాపు అత్యధికభాగం చిత్రీకరించిన ఆ సినిమా అంటే వ్యక్తిగతంగా నాకెంతో ఇష్టం.

కార్తీక్ కి కూడా.

కర్ణుడి చావుకి ఎన్నో కారణాలున్నాయంటారుగానీ, "అలా" నడవకుండాపోవడానికి రెండే రెండు కారణాలున్నాయి. ఒకటి: కనకపు సిమ్‌హాసనమిచ్చి ఓ వ్యక్తిని గుడ్డిగా నమ్మటం. రెండోది:  తనమీద పెట్టిన ఆ నమ్మకాన్ని ఆ వ్యక్తి కనీసం ఒక మనిషిగానైనా నిలుపుకోలేకపోవడం.

సినీ ఫీల్డులో ఇది చాలా సర్వసహజమయిన విషయం అని తర్వాత అనుభవం మీద గ్రహించాను. అలాంటి చెత్త నిర్ణయాలు ఇకమీదట నావైపు నుంచి జరక్కుండా ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నాను.

దీనర్ధం .. ఫీల్డులో అలాంటి షార్క్స్ ఎప్పుడూ ఉంటాయన్నమాట!  

మొన్నీమధ్య ఒక పార్టీలో కలిసినప్పుడు - "అలా" నడవకపోడానికి కార్తీక్ కూడా రెండే రెండు కారణాలు చెప్పాడు. ఒకటి ప్రమోషన్, రెండోది రిలీజ్ అని.

పైన నేనుచెప్పిన కారణాలకు, కార్తీక్ చెప్పిన ఈ కారణాలు కేవలం పర్యాయపదాలు మాత్రమే. సేమ్ టు సేమ్!

అప్పటి ట్రెండ్‌లో ఒక "ఐతే" లా బ్రహ్మాండంగా నడిచే స్టఫ్ ఉన్న మా "అలా" సినిమాని, కేవలం వ్యక్తిగతమైన శుష్క, స్వార్థ, నీచ, మనీ కక్కుర్తి ప్రయోజనాలకోసం కావాలని అలా జరక్కుండా చేశారు.

ఇలాంటివే మరికొన్ని నాదృష్టికి రాని కొన్ని సంఘటనలు, అవమానాలు కూడా జరిగాయని ఇటీవలే కార్తీక్ ద్వారా విని నేను నిజంగా షాకయ్యాను. బాధపడ్డాను కూడా.

అ యి నా .. 

"అలా" నాటి అఖిల్ కార్తీక్‌కీ, ఇప్పటి "స్విమ్మింగ్‌పూల్" అఖిల్ కార్తీక్‌కీ - మనోహర్ చిమ్మనితో స్నేహంలో, అనుబంధంలో ఎలాంటి మార్పులేదు.

దటీజ్ అఖిల్ కార్తీక్!  

Friday, 16 January 2015

స్విమ్మింగ్‌పూల్ నిజంగా ఎంత HOT?

"ఏ మాయ చేసావె"లో నాగచైతన్య సమంతతో అంటాడు.

"యూ ఆర్ సో హాట్!" అని.

చురుగ్గా చూస్తుంది సమంత. "ఐ మీన్ క్లైమేట్ చాలా హాట్‌గా ఉందీ అంటున్నాను" అని మళ్లీ సర్ది చెబుతాడు నాగచైతన్య. తను ఏమనుకుంటుందోనని.

కానీ, సమంత పెద్ద సీరియస్‌గా తీసుకోదు. ఒక కాంప్లిమెంట్‌గా తీసుకొని తనలో తను నవ్వుకుంటుంది.

"హాట్" లాంటి కొన్ని మాటలు, విషయాల గురించి ఓపెన్‌గా మాట్లాడ్డం, చర్చించడం ఇంకా మనదగ్గర ఓ పనికిరాని టాబూగానే ఉండటం నేనింకా నమ్మలేకపోతున్నాను. కానీ, నిజం అదే.

అసలేందీ హాట్?

సినిమాల విషయానికొస్తే - కొంచెం ఎక్కువ మోతాదులో ఉన్న రొమాన్స్ ని "హాట్ రొమాన్స్" అనవచ్చునేమో!

మరో అర్థంలో -  ఎవరయినా ఒక అమ్మాయో, అబ్బాయో చూడగానే కత్తిలా కనిపించినా, వారు 'ఒక' మూడ్‌లో ఉన్న విషయం గమనించినా చాలు. ఏ మాత్రం కొంచెం చనువున్న ఫ్రెండయినా (బాయ్/గాళ్) ఆ అమ్మాయినో, అబ్బాయినో ఉద్దేశించి ఈ 'హాట్' పదం వాడొచ్చు.

ఇదంతా రొమాన్స్ కు సంబంధించిన 'హాట్' చర్చ.

రొమాన్స్‌కు, తత్ సంబంధమయిన మూడ్‌కూ అసలు సంబంధం లేకుండా - "వాడివాళ చాలా హాట్ హాట్ గా ఉన్నాడు" అని కోపం అర్థంలో కూడా ఈ హాట్ పదాన్ని వాడొచ్చు.  

ఈ థియరీ అంతా కాసేపు పక్కనపెడితే - అసలు "హారర్" పదం కంటే "హాట్" పదమే మన జనాలని ఎక్కువగా భయపెడుతున్నట్టుంది చూస్తోంటే!  

కట్ టూ మన "హాట్" స్విమ్మింగ్‌పూల్ - 

"స్విమ్మింగ్‌పూల్" సినిమా ఓ మంచి రొమాంటిక్ హారర్. ఈ రొమాన్స్ కూడా స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఓ మోతాదులో ఉంది అని డైరెక్టర్‌గా నేనే చెప్తున్నాను.

ఈ కోణంలో ఆలోచించినపుడు, పోస్టర్ మీద 'హాట్ రొమాంటిక్ హారర్' అనే ముద్ర వేయడం నాకేమంత పెద్ద విషయంగా అనిపించలేదు.

అలాగని - జంటగా కానీ, ఒంటరిగా కానీ చూడలేనంత ఇబ్బందికరమైన చిత్రీకరణ కూడా ఇందులో ఏమీలేదు. ఇదేం బి గ్రేడ్ సినిమా కాదు.

పోనీ .. స్క్రిప్ట్ డిమాండ్ చేసిందనీ, ఏదో చూపించాలనీ మేమెన్ని బిజినెస్ జిమ్మిక్కులు చేసినా చివరికి సెన్సార్ అంటూ ఒకటి ఉండనే ఉంది! ఏమాత్రం తేడా వచ్చినా - అక్కడ మా పరిస్థితి రొంబ హాట్ హాట్ గా ఉంటుంది. అది వేరే విషయం.

ఈ విషయంలో నాకు నచ్చిన ఒకే ఒక్క డీసెంట్ లాజిక్ ఏంటంటే - "హాట్ అనేది బయట చెప్పడం దేనికి? సినిమాకు వచ్చేవాళ్లు కొందరు ఆ పదం చూసే ఇబ్బందిపడి రాకపోవచ్చు. సో, ఆ హాట్ ఏదో సినిమా లోపల చూపించండి. బయట వద్దు!" అని.

చాలా అర్థవంతమయిన ఈ లాజిక్ వ్యక్తిగతంగా నాకు బాగా నచ్చింది. మా టీమ్ అందరికీ కూడా నచ్చి తీరాలి మరి. చూద్దాం.

ఇదంతా ఎలా ఉన్నా - సినిమాలో ఏముందన్నది కాదు ప్రశ్న. ఆ సినిమాను ఎలా ప్రజెంట్ చేస్తున్నాం, ఎంత ఎట్రాక్టివ్‌గా ప్రజెంట్ చేస్తున్నాం అన్నదే అసలు ప్రశ్న.

దీన్నే మార్కెటింగ్ అంటారు, బహుశా!

ఈ మార్కెటింగే రేపు మాకు బిజినెస్ తెచ్చేదీ, ఇచ్చేదీ. దీనికోసం నానా బిజినెస్ జిమ్మిక్స్ తప్పవు. ప్రస్తుతం మా టీమంతా ఈ ప్రాసెస్ లో యమ 'హాట్' గా ఉన్నాం.

ఫినిషింగ్ టచ్ ఏమిటంటే - పోస్టర్ మీదున్న ఈ "హాట్ రొమాంటిక్ హారర్" ముద్రనూ, అందులో ఉన్న "హాట్"నీ, మా అసలు టార్గెట్ ఆడియెన్స్ చూడరనీ, చూసినా పెద్దగా పట్టించుకోరనీ .. మా బిజినెస్ వర్గాల మిలియన్ డాలర్ అభిప్రాయం!  

Thursday, 15 January 2015

రష్యన్ ప్రొఫెసర్‌కు మా 'స్విమ్మింగ్‌పూల్' లో ఏం పని?

వయస్సులో అమితాబ్ బచ్చన్ కంటే సరిగ్గా 28 రోజులు పెద్దవారు మా రష్యన్ ప్రొఫెసర్ మాధవ్ మురుంకర్.

ఉస్మానియా యూనివర్సిటీలోని రష్యన్ డిపార్ట్‌మెంట్‌లో ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ గా ఉన్నప్పుడు
ఓ మూడేళ్లపాటు పార్ట్ టైమ్‌గా రష్యన్ చదివాను నేను.

ఇప్పటికీ - నా చదువు మొత్తంలో నాకు బాగా నచ్చిన, మజా ఇచ్చిన చదువు ఏది అంటే - నేను ఠక్కున చెప్పే సమాధానం .. "ఓయూ లో 3 ఏళ్ల నా రష్యన్ డిప్లొమా!" అని.  

ఒక విదేశీ భాషను ఎంత బాగా, ఎంత అందంగా, ఎంత సులభంగా నేర్పవచ్చో - మా మురుంకర్ సర్, కల్పన మేడమ్ ల తర్వాతే బహుశా ఎవరయినా అని నేనిప్పటికీ అనుకొంటూ ఉంటాను.

ఆ మూడేళ్ల రష్యన్ డిప్లొమాలో నేనే యూనివర్సిటీ టాపర్. ఆ విషయం అలా వదిలేద్దాం.

కట్ టూ "స్విమ్మింగ్‌పూల్"లో మా ప్రొఫెసర్ -  

థాంక్స్ టూ ఫేస్‌బుక్ .. సుమారు రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ నేను మా ప్రొఫెసర్‌ను కలిశాను. నా రష్యన్ క్లాస్‌మేట్ స్వరూపతో కలిసి. ఆ తర్వాతే మాటల సందర్భంలో మా మురుంకర్ సర్ నోట నేనొక మాట విన్నాను.

"సినిమాలో యాక్ట్ చేయటమొక్కటే నా జీవితంలో ఇప్పటికీ నాకో తీరని కోరికగా మిగిలిపోయింది!" అని.

అంతే. ఫిక్స్ అయిపోయాను. నా తర్వాతి సినిమాలో సర్ కి ఓ మంచి రోల్ తప్పదు అని. "ఇకనుంచీ అది మీ తీరని కోరిక కాదు. అదింక నా కోరిక!" అని చెప్పాను సర్ కి.

అదీ ఫేస్‌బుక్ ద్వారానే!

కట్ చేస్తే .. ఇప్పుడు "స్విమ్మింగ్ పూల్" సినిమాలో ప్రొఫెసర్ ఆఫ్ డెమనాలజీ కేరెక్టర్ ఆయనకోసమే పుట్టింది.

ఆయన వచ్చారు. యాక్ట్ చేశారు. కొద్దిరోజుల్లో తెరమీద కనిపించబోతున్నారు.

72 వ ఏట, తన డెబ్యూ సినిమాలో! 

Sunday, 11 January 2015

తెలుగులో మొట్టమొదటి "కార్బన్ న్యూట్రల్" సినిమా

శ్రీ శ్రీ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో అరుణ్‌కుమార్ ముప్పన నిర్మాతగా నేను రూపొందిస్తున్న "స్విమ్మింగ్‌పూల్" సినిమా, పర్యావరణ పరిరక్షణ స్పృహతో తెలుగులో రూపొందుతున్న మొట్టమొదటి సినిమా. 

మనం సినిమా తీయాలి అనుకున్నప్పటి నుంచి - ప్రిప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ వంటి వివిధ దశలు పూర్తయ్యి - సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆయా దశల్లో .. మనం ఉపయోగించే ఎలెక్ట్రిసిటీ, వాహనాలు, పెట్రోల్, డీజెల్, జెనెరేటర్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, మొబైల్ ఫోన్లు, ప్లాస్టిక్ వస్తువులు, పేపర్ మొదలైన ఎన్నో రూపాల్లో మన చుట్టూ ఉన్న పర్యావరణంలోకి ఎంతో కార్బన్‌డయాక్సైడ్ విడుదలవుతుంది.

మరెన్నో కార్బన్ సంబంధిత రసాయనాలు పర్యావరణం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి.  
మన చిత్ర నిర్మాణం ద్వారా పర్యావరణంలోకి విడుదలయ్యే ఈ కార్బన్‌డయాక్సైడ్, కార్బన్ సంబంధిత రసాయనాలు, వాయువులను న్యూట్రల్ చెయ్యడం కోసం, తగిన పరిణామంలో కొన్ని వందల చెట్లని మనం నాటాల్సి ఉంటుంది. 

ముంబైలో ఉన్న "సెంటర్ ఫర్ ఎన్వైరన్‌మెంట్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్" (CERE) అనే ఒక అంతర్జాతీయ స్థాయి ఎన్ జి ఓ సంస్థ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ పని మొట్టమొదటిసారిగా మేము మా "స్విమ్మింగ్‌పూల్" చిత్రం ద్వారా చేస్తున్నాము.

ఈ సినిమా అనుకున్న కాన్‌సెప్ట్ స్టేజ్ నుంచి, ఈ సినిమా రిలీజయ్యేవరకు, మేము అందిచే డేటాను విశ్లేషించి,
సి ఇ ఆర్ ఇ ఒక నివేదిక మాకు ఇస్తుంది. దాని ప్రకారం కొన్ని వందల చెట్లను శ్రీ శ్రీ క్రియేషన్స్ తరపున మేము నాటాల్సి ఉంటుంది.

ఈ పనిని మేము అప్పుడే ప్రారంభించాము కూడా.

ఈ విషయంలో సి ఎ ఆర్ ఇ కి మేము చెల్లించే (కొన్ని లక్షల) ఫీజుతో ఆ సంస్థ కేవలం మొక్కలను నాటడం ఒక్కటే కాకుండా, మరెన్నో సామాజికంగా నిజంగా ఉపయోగకరమైన పనులు చేస్తుంది.

ఆ విధంగా మా "స్విమ్మింగ్‌పూల్" చిత్రం తెలుగులో (బహుశా మన దేశంలో కూడా) - పర్యావరణ స్పృహతో రూపొందిస్తున్న మొట్టమొదటి "కార్బన్ న్యూట్రల్" చిత్రం అని చెప్పుకోడానికి నిజంగా సంతోషంగా ఉంది.  
కట్ టూ మా సినిమా "యు ఎస్ పి" -


"హాట్ రొమాంటిక్ హారర్" అనేది మా "స్విమ్మింగ్‌పూల్" సినిమాకు బిజినెస్ పరంగా మేము క్రియేట్ చేసుకున్న యూ ఎస్ పి (యునిక్ సెల్లింగ్ ప్రపొజిషన్). 


నిజానికి "తెలుగులో మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ సినిమా" అన్నదే మా నిజమైన యు ఎస్ పి అని
 చెప్పుకోవడం వ్యక్తిగతంగా నాకిష్టం. అదే మా వీరేంద్ర లలిత్, అరుణ్‌కుమార్ ల అభిప్రాయం కూడా. 
మా టీమ్‌కు కూడా అదే ఇష్టం.     

Saturday, 10 January 2015

ఓషో "మంత్ర" తులసీరామ్ ..

మా "స్విమ్మింగ్‌పూల్" సినిమా టైటిల్ లోగో లాంచ్ ఎవరితో చేయిస్తే బాగుంటుందా అనుకున్నప్పుడు చాలా పేర్లు మా చర్చల్లో వచ్చాయి.

కాని, చివరికి నేను ఒకే ఒక్క క్షణంలో నిర్ణయం తీసేసుకున్నాను.

అది .. ఓషో తులసీరామ్ గారయితే బాగుంటుందని.

దీనికి కారణాలు రెండు: ఒకటి "మంత్ర" లాంటి అద్భుతమయిన సినిమా రూపొందించిన డైరెక్టర్ ఆయన. రెండవది. తులసీరామ్ గారు తన పేరుకు ముందు "ఓషో" అన్న పేరు పెట్టుకోవడం! 

ఓషో రజనీష్ పుస్తకాలు కనీసం ఓ డజన్ అయినా చదివినవాణ్ణి మరి.. :)

అదే విషయాన్ని అప్పుడు లండన్ నుంచి ఫ్లయిట్‌లో ప్రయాణంలో ఉన్న మా ప్రొడ్యూసర్ అరుణ్ గారికి చెప్పాను. ఇక్కడ కార్తీక్ తో నేను అనుకుంటున్న విషయం చెప్పి, ఆ బాధ్యతను కార్తీక్‌కే అప్పగించాను.

గతంలో "మంత్ర", "మంగళ" వంటి మంచి హారర్/థ్రిల్లర్ సినిమాలు రూపొందించిన డైరెక్టర్ ఓషో తులసీరామ్ గారు వచ్చి మా రొమాంటిక్ హారర్ సినిమా "స్విమ్మింగ్‌పూల్" టైటిల్ లోగో ను ఆవిష్కరిచడం నాకు పూర్తి సంతృప్తినిచ్చింది.

థాంక్ యూ, ఓషో తులసీరామ్ గారూ!

నా గురించి, మా గురించీ, మా టీమ్ గురించీ మీరు చెప్పిన నాలుగు మాటలు నాకెంతో ఎనర్జీనిచ్చాయి. ఇప్పుడు మీరు రూపొందిస్తున్న "క్రిమినల్స్", మొన్నటి "మంత్ర" ను మించి సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటున్నాను.

కట్ టూ ప్రెస్‌మీట్ -

దాదాపు ఒక అర్థ దశాబ్దం తర్వాత అనుకుంటాను. నేను ప్రెస్ ముందుకు వచ్చాను. అదీ ఒక పూరిస్థాయి ప్రెస్‌మీట్‌లో!

దాదాపు ప్రెస్‌వాళ్లు అందరూ నన్ను గుర్తుపట్టారు. ఆత్మీయంగా పలకరించారు.

నెర్వస్‌నెస్ ఏమీ లేదు. అంతా నావాళ్ల ముందు, నా మిత్రులముందు మాట్లాడుతున్నట్టే ఉంది తప్ప .. మరో విధంగా లేదు.

ఒకరకంగా సినిమాల్లో ఇది నా సెకండ్ ఇన్నింగ్స్. ఈ ఇన్నింగ్స్ సక్సెస్‌లో సోషల్ మీడియాతో పాటు, ప్రెస్ మీడియా కూడా నాకు బాగా సహకరిస్తుందని నా నమ్మకం.     

Friday, 9 January 2015

ప్రెస్ మీట్, చాలా గ్యాప్ తర్వాత!

ఇంకో 24 గంటల్లో, చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు నా కొత్త టీమ్‌తో మళ్లీ ప్రెస్ ముందుకు రాబోతున్నాను. ఇదొక తప్పనిసరి రొటీన్ కాబట్టి పెద్ద ఎక్జయిటింగ్‌గా ఏం లేదు.

కాకపోతే .. ఈ ప్రెస్‌మీట్‌కు, ఇది పెట్టడానికి కారణమయిన ఈ సినిమాకు కొన్ని చిన్న చిన్న ప్రత్యేకతలున్నాయి.

అవన్నీ ప్రెస్‌మీట్ లోనే మొదటిసారిగా చెప్పాల్సి ఉంది కాబట్టి ఇక్కడ, ఈ టైమ్‌లో రాయలేకపోతున్నాను.  

సుమారు 26 టీవీ చానెళ్లు, ఒక డజన్ వెబ్‌సైట్లు, మరో పది ఫిలిమ్ మ్యాగజైన్లు, ఇంకో ఎనిమిది డైలీ న్యూస్‌పేపర్లు .. ఈ ప్రెస్‌మీట్‌ను కవర్ చేస్తాయి. రేపు రాత్రినుంచి, ఓ రెండు రోజులవరకు, దీనికి సంబంధించిన ఫుటేజ్ రకరకాలుగా ఆయా చానెళ్లలో వస్తుంది.

ముందే చెప్పినట్టు, ఇదొక తప్పనిసరి అయిన రొటీన్. 

కట్ టూ టైటిల్ లోగో లాంచ్ - 

మొన్నటిదాకా ఎలాగూ మా సినిమా టైటిల్ ప్రకటించలేదు కాబట్టి, పనిలో పనిగా, ఈ ప్రెస్‌మీట్ లోనే "స్విమ్మింగ్‌పూల్" టైటిల్ లోగో కూడా విడుదల చేస్తున్నాము.

మంత్ర, మంగళ వంటి మంచి హారర్/థ్రిల్లర్స్ ని రూపొందించిన ప్రముఖ దర్శకుడు ఓషో తులసీరామ్ టైటిల్ లోగోను ఆవిష్కరిస్తారు.

ఈ సందర్భంగా .. నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న కొంతమంది నా ఆత్మీయ ప్రెస్ మిత్రులను, మొత్తంగా ప్రెస్ ఫ్రాటర్నిటీని, చాలా గ్యాప్ తర్వాత రేపు మళ్లీ కలవబోతున్నందుకు ఆనందంగా ఉంది.