Thursday, 27 June 2024

నాగ్ అశ్విన్, అమితాబ్, ప్రభాస్‌ల విశ్వరూపం


ఇప్పుడే చూసొచ్చా... కల్కి2898ఏడీ మొదటి భాగం. 

మామూలుగా మన సినిమాల్లో తప్పనిసరిగా ఉండే  ఒక రొటీన్ హీరో లేడు, ఒక రొటీన్ హీరోయిన్ లేదు, రొటీన్ ఫార్ములా లేదు. డ్యూయెట్ సాంగ్స్ లేవు.

అన్నీ శక్తివంతమైన పాత్రలే. 

అసలు ఏమాత్రం గ్లామర్ లేని ఒక ప్రధానపాత్రలో దీపికా పదుకోన్ సహజ నటన కూడా సూపర్బ్. కమలహాసన్ పాత్ర జస్ట్ శాంపిల్ చూపించాడు. రెండో భాగం మొత్తం ఆయనే ఉండే అవకాశముంది.    

స్టార్‌వార్స్‌లు, మ్యాడ్ మ్యాక్స్‌లు, లార్డ్ ఆఫ్ ద రింగ్స్‌లు... ఒక్క హాలీవుడ్డే కాదు, మనమూ తీయగలం అని నిరూపించిన నాగ్ అశ్విన్‌ & టీమ్‌కు అభినందనలు.  

వెటరన్ నిర్మాత అశ్వినీదత్, సహ నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్‌ల గట్స్‌కు హాట్సాఫ్. 

రాజమౌళి, రామ్‌గోపాల్ వర్మ అతి చిన్న ఫ్లాషీ కేమియో రోల్స్‌లో కనిపించటం హైలైట్! 

ఇంకా - మాళవిక నాయర్, మృణాల్ ఠాకూర్, డైరెక్టర్ అనుదీప్ కూడా ఈ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు.  

కట్ చేస్తే -  

ఈకలు తోకలు పీకకుండా... హాలీవుడ్ రేంజ్‌కు ఏమాత్రం తక్కువకాని మన తెలుగు సినిమాను కూడా ఎంజాయ్ చేయండి. మన మహాభారతాన్ని ఒక అద్భుతమైన క్లాసిక్ ఎంటర్‌టైనర్ సై-ఫై సినిమాకు ముడివేస్తూ మళ్ళీ ముందుకుతెచ్చిన మన డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ను అప్రిషియేట్ చెయ్యండి. 

ఎంజాయ్ సినిమా. ఎంజాయ్ ఎంటర్‌టైన్మెంట్. 

- మనోహర్ చిమ్మని 

Sunday, 23 June 2024

నిజంగా అది లేకపోతే ఈ పదేళ్ళు నాకు ఎలా గడిచేవో!


పదేళ్ళ క్రితం ఒకరోజు పొద్దున్నే మా పెద్దబాబు బయటికెళ్ళాడు. మామూలుగా రోజూలాగే ఫ్రెండ్స్ దగ్గరికో, రన్నింగ్‌కో, స్విమ్మింగ్‌కో అనుకున్నాను. 

కాని కాదు. 

కట్ చేస్తే - 

ఒక రెండున్నర గంటల తర్వాత, చేతిలో చిన్న బ్లూ కలర్ ప్లాస్టిక్ బుట్టతో ఇంట్లోకొచ్చాడు మా పెద్దబాబు. నేను పెద్దగా పట్టించుకోకుండా నా పనిమీద నేనున్నాను. నా గదిలోకెళ్ళాను.  

మెల్లగా హాల్లోంచి గుసగుసలు వినిపించసాగాయి. మా చిన్నబాబు, పెద్దబాబు, మా సుజ్జి ఏదో సీక్రెట్‌గా మాట్లాడుకుంటున్నారు.  

ఇంకో నిమిషం తర్వాత చిన్న కుక్క పిల్ల కుయ్ మంటూ శబ్దం చేసింది. 

అర్థమైపోయింది నాకు. పెంచుకోడానికి కుక్క పిల్లను తెచ్చాడన్నమాట! 

కట్ చేస్తే -  

ఆ తర్వాత కనీసం ఒక మూడు నాలుగు రోజుల పాటు నాకు, మా ఇంట్లోని మిగతా ముగ్గురికీ మధ్య యుద్ధం జరిగింది. 

మూడువేల రూపాయలు పెట్టి కొనుక్కొని తెచ్చిన ఆ కుక్కపిల్లను తిరిగి అక్కడే ఇచ్చిరమ్మని నేను, లేదు పెంచుకుంటాం అని నా ఆపోజిషన్ పార్టీ! 

చివరికి వాళ్ళే గెలిచారు.  

నా మనసు మార్చుకున్నాను. ఆ కుక్కపిల్లకు పేరు కూడా నేనే పెట్టాను.  


ఇప్పుడు అదంటే నాకు చాలా ప్రేమ. వాళ్లందరికంటే ఎక్కువ ప్రేమ. అది లేకుండా నేనుండలేను. నాకోసం కూడా అది ఎదురుచూస్తుంటుంది. నేను డల్‌గా ఉన్న సమయాల్లో నన్ను ఆడిస్తుంది, ఇన్‌స్పయిర్ చేస్తుంది, నేను మళ్ళీ యాక్టివ్ అయ్యేవరకు నా పక్కనే నన్ను ఆనుకొని పడుకొంటుంది. 

నిజంగా అది లేకపోతే ఈ పదేళ్ళు నాకు ఎలా గడిచేవో అని అనుకుంటాను అప్పుడప్పుడూ. ఇది అతిశయోక్తి కాదు. నిజం.

అలా పదేళ్ళ క్రితం పొద్దున్నే ఓల్డ్ సిటీ దాకా వెళ్ళి, ఆ రోజు మా పెద్దబాబు తెచ్చిన ఆ చిన్న కుక్క పిల్లే మా లక్కీ.

దాని 10వ బర్త్ డే ఈ రోజు. 

హాపీ బర్త్ డే మై డియర్ లక్కీ!    

- మనోహర్ చిమ్మని 

Saturday, 22 June 2024

మనం చేసే తప్పుల్లో అన్నిటికంటే పెద్ద తప్పు...


కొన్ని రంగాలు ఎలాంటివి అంటే - మనం చదివిన చదువులు, మనం చేసిన ఉద్యోగాలు, పనిచేసిన ప్రొఫెషన్లు, జీవితంలో మనం సాధించిన ఒకటీ అరా విజయాల ముందు... ఎందుకూ పనికిరానివాళ్ళతో మనం మాట్లాడాల్సి ఉంటుంది. డీల్ చెయ్యాల్సి ఉంటుంది. బలవంతంగా అసోసియేట్ అవ్వాల్సి ఉంటుంది. నానా హెడేక్స్ భరించాల్సి ఉంటుంది. అంతిమంగా ఎంతో డబ్బూ సమయం నష్టపోవాల్సి ఉంటుంది. 

కాని, ఇది ఆయా ఫీల్డుల తప్పు కాదు. కనిపించేదే నిజమని నమ్మి మనం తీసుకున్న మన నిర్ణయాల తప్పు. మనం నమ్మిన వ్యక్తుల్లో మనకు తెలియకుండా అపరిచితులుంటారని తెలియని అమాయకత్వంలో వాళ్ళతో అసోసియేట్ అవ్వటం ద్వారా జరిగిన తప్పు. 

సినిమా రంగంలో కూడా ఇలాంటి తప్పులు అనేకం జరుగుతాయి. మనుషులను మనుషులుగా నమ్మి నేనూ చాలా నష్టపోయాను. చాలా బాధపడ్డాను.   

కట్ చేస్తే - 

ఇలాంటి తప్పులు చేయడం తప్పు కాదు. కాని, వెంటనే అలర్ట్ అయి - ఆ తప్పులు, ఆ వ్యక్తులు, ఆ పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లోనూ మన జీవితంలోకి మళ్ళీ రాకుండా చేసుకోవడంలో అశ్రద్ధ చూపడం అనేది మాత్రం మనం చేసే తప్పుల్లో అన్నిటికంటే పెద్ద తప్పు. 

No more such mistakes. No more keeping quiet.  

- మనోహర్ చిమ్మని 

Tuesday, 18 June 2024

నా తొలి ప్రేయసి


"అసలు మీ స్ట్రెంత్ రైటింగే!" అని నేను అతి దగ్గరగా తెలిసినవాళ్ళు చాలామంది చాలా సార్లు అన్నారు నాతో. 

"దాన్ని మరీ ఇంత కేర్‌లెస్ చెయ్యకుండా ఏదైనా రాయొచ్చుగా" అని కూడా ఈమధ్యే ఒక శ్రేయోభిలాషి అన్నారు. 

వినను కదా... 

కట్ చేస్తే - 

ఫండింగ్ ఏర్పాట్ల పనులు, ఇంక నానా తలనొప్పులు ఊపిరాడనీయకుండా చుట్టూ కమ్ముకొని ఉన్నా కూడా... అనుకోకుండా నిన్న రాత్రి నుంచి నా దృష్టి ఎందుకో స్క్రిప్ట్ రైటింగ్ మీద పడింది. 

ఇప్పుడు చేస్తున్న నా సినిమా #Yo ఫైనల్ డ్రాఫ్ట్‌కు తుది మెరుగులు దిద్దటం, వెంటనే షూటింగ్ స్క్రిప్ట్ మొదలెట్టి పూర్తిచెయ్యటం ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్నాయి. ఏ వైజాగ్‌కో, గోవాకో వెళ్ళి, ఒక అయిదు రోజుల్లో ఫోకస్డ్‌గా రాసి, పని పూర్తిచేద్దామనుకొంటూ చాలా సమయం గడిచిపోయింది. ఫైనల్ స్క్రిప్ట్ పని మాత్రం ఎక్కడిదక్కడే అలా ఆగిపోయింది.

ఉన్నట్టుండి రాత్రి ఎందుకో నా ఫోకస్ మొత్తం నా రైటింగ్ మీద పడింది. ఇదిగో, ఇవ్వాళ రాత్రి కూడా రాస్తూనే ఉన్నాను.

నాకే కొంత ఆశ్చర్యంగా ఉంది. కాని, నేను చాలా ఆనందంగా ఉన్నాను. 

ఎందుకంటే -

నా తొలి ప్రేమ, తొలి ప్రేయసీ... నా రైటింగే.   

- మనోహర్ చిమ్మని 

Sunday, 16 June 2024

ఒక్క ఛాన్స్, ప్లీజ్!


తెలుగు సినిమాలో ఒక్క ఛాన్స్ వస్తే చాలు అని ముంబై నుంచి కూడా మన టాలీవుడ్ వైపు చూస్తున్న రోజులివి. 

హీరోలు, హీరోయిన్స్, ఆర్టిస్టులే కాదు... అసిస్టెంట్ డైరెక్టర్ చాన్స్ కోసం కూడా ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, గుజరాత్, యూపీ లాంటి రాష్ట్రాల నుంచి కూడా హైద్రాబాద్‌కు రావడానికి ఎంతోమంది కొత్తవాళ్ళు రెడీగా ఉన్నారు. 

అవకాశం ఇచ్చి, వెండితెరకు పరిచయం చేస్తే చాలు. పారితోషికం కూడా అక్కర్లేదు. అలా ఉంది డిమాండ్. 

ఒక్క ఆర్టిస్టులు, టెక్నీషియన్సే కాదు... ముంబై నుంచి మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ కూడా మన దగ్గర ఈ "ఒక్క ఛాన్స్" కోసం ప్రయత్నిస్తున్నారు.

కట్ చేస్తే -  

నేనిప్పటివరకు చేసిన 3 సినిమాల్లో కనీసం ఒక 55 మంది వరకు కొత్త ఆర్టిస్టుల్ని, టెక్నీషియన్స్‌ను పరిచయం చేశాను. వారిలో కొందరు ఇప్పుడు ఆర్టిస్టులుగా, టెక్నీషియన్స్‌గా మంచి పొజిషన్స్‌లో ఉన్నారు. 

అయితే - వాళ్ళల్లో ఇప్పుడు ఎంతమంది నాతో టచ్‌లో ఉన్నారన్నది డిఫరెంట్ కొశ్చన్. 

నా గత అనుభవాల నేపథ్యంలో... కొందరు సీనియర్ డైరెక్టర్ మిత్రులు చెప్పిన మాట కూడా వినకుండా, ఇప్పుడు చేస్తున్న సినిమాలో కూడా నేను కొందరు కొత్తవాళ్ళని పరిచయం చేస్తున్నాను. 

"ఒక్క ఛాన్స్, ప్లీజ్" అని అవకాశం కోసం వెంటపడుతున్నవాళ్లను పట్టించుకోకుండా, నాకు నేనుగా కొందర్ని పిలిచి అవకాశం ఇవ్వడం కూడా తప్పేమో అని ఈమధ్య అప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది. 

ఈ అవకాశం విలువ వీళ్లకి అర్థంకావడం లేదా? ఆ విలువని వీళ్ళు గుర్తించడం లేదా? 

- మనోహర్ చిమ్మని 

Thursday, 13 June 2024

అది వారి మానసిక వైకల్యం... అదే వారి జీవన విధానం


మానసిక వ్యాధిగ్రస్తులు కొందరు నా బ్లాగులోకో, నా సోషల్ మీడియాలోకో వచ్చి అప్పుడప్పుడు కొన్ని చెత్త కామెంట్స్ పెడుతుంటారు...

వారి భవిష్యత్తు గురించి, వారిని భరిస్తున్న వారి కుటుంబం గురించి నాకు చాలా జాలి అనిపిస్తుంది. 

కట్ చేస్తే -

ఈ ప్రపంచంలో ఏ ఒక్క విషయంపైనైనా అందరి అభిప్రాయాలు, ఆలోచనలు ఒక్కలా ఉండవు. ఉండాల్సిన అవసరం లేదు. 

అసలు నేనే కరెక్ట్ అనుకోవడం కంటే పెద్ద బుద్ధి తక్కువ పని ఇంకోటి ఉండదు. అలా నేననుకోను. 

అంతే కాదు, ఒకప్పుడు నేను కరెక్టు అనుకున్నవి అన్నీ ఇప్పుడు కరెక్ట్ కాకపోవచ్చు. 

మార్పు సహజం.  

There is nothing permanent except change.

నా బ్లాగులోనో, నా సోషల్ మీడియాలోనో నా ఇష్టాలు, నా ఆలోచనలు, నా పాయింటాఫ్ వ్యూలు నేను రాసుకొంటుంటాను. అది నా స్వేచ్ఛకు సంబంధించిన విషయం. 

అందరికీ నా రాతలు నచ్చాల్సిన అవసరం లేదు. నచ్చనివాళ్ళు నిర్మాణాత్మకంగా విమర్శ చేయవచ్చు. వారి పాయింటాఫ్ వ్యూ చెప్పవచ్చు. 

కాని, బీపీ తెచ్చుకొని ఒక సైకోలా ఏదేదో చెత్త రాయడం, బూతులు రాయడం... ఇవన్నీ వారి మానసిక పరిస్థితిని తెలుపుతాయి. లాజిక్ ఎదుర్కోలేనివారే ఇలాంటి ఆవేశం తెచ్చుకొంటారు. సహనం కోల్పోతారు. లోపల్లోపల వారిలో పెరుగుతున్న మానసిక వ్యాధి పైకొస్తుంది. ఏదో చెత్త కామెంట్ చేస్తారు. సంతృప్తిపడతారు. 

అది వారి మానసిక వైకల్యం. అదే వారి జీవన విధానం.  

అలాంటి జీవరాశులు కూడా సోషల్ మీడియాలో ఉంటాయి అనుకొని, సూపర్ స్టార్ రజినీకాంత్ చెప్పినట్టు "మనపనిలో మనం ముందుకెళ్తుండటమే" మనం చేయగలిగింది.  

- మనోహర్ చిమ్మని 

Tuesday, 11 June 2024

CBN Proves Age is Just a Number !!


ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు. నా మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు కూడా ఎందరో ఏపీలో ఉన్నారు... వారందరికి కూడా నా ప్రత్యేక శుభాకాంక్షలు. 

పాలిటిక్స్ ఒక డిఫరెంట్ గేమ్. బయటికి కనిపించే పాలిటిక్స్ వేరు. ఇంటర్నల్ పాలిటిక్స్ వేరు. ఈ గేమ్‌లో అతిరథమహారథులతో ఒక ఆట ఆడుకున్న అనుభవం సి బి యన్ కు ఉంది. అలాగే, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న అనుభవం కూడా.  

కాని, 74 ఏళ్ళ వయస్సులో కూడా సంపూర్ణమైన ఫిట్‌నెస్ మెయింటేన్ చేస్తూ, ఒక అత్యంత కఠినతరమైన లక్ష్యం పెట్టుకొని, ఆ లక్ష్యాన్ని బాహాటంగా బయటికి చెప్పి మరీ సాధించటం గొప్ప విషయం. 'Age is just number' అని సి బి యన్ తాజాగా ప్రూవ్ చేశారు. పార్టీలకతీతంగా ఇలాంటి సక్సెస్ సైన్స్‌కు సంబంధించిన అంశాలు నన్ను బాగా ఆకట్టుకుంటాయి. 

కట్ చేస్తే -   
 
5 సంవత్సరాల తర్వాత, సి ఎం గా మళ్ళీ అధికారం చేపట్టబోతున్న సందర్భంగా సి బి యన్ గారికి హార్దిక శుభాకాంక్షలు.  

ఎన్నో సవాళ్లున్నాయ్. సి బి యన్ ఈ సారి రెచ్చిపోతారనటంలో సందేహం లేదు. ఆ అవసరం ఉంది కూడా. ఫోకస్ అటువైపే పెడితే మంచిది. బిల్ గేట్స్ ఏం ఖర్మ, ఆయన బాబుని కూడా రప్పిస్తారాయన. ఆ విజన్, ఆ మెకానిజం ఆయనకుంది. 

రాష్ట్రంలోనే కాదు, ఖండాంతరాల్లో కూడా ఆయనకోసం ఏదైనా సరే చెయ్యడానికి, ఎప్పుడూ సిద్ధంగా ఉండే వేలాదిమంది అత్యున్నతస్థాయి డైహార్డ్ అభిమానగణాన్ని కలిగి ఉన్నారాయన. అదంత మామూలు విషయం కాదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వారంతా కూడా సి బి యన్ విజయంలో ప్రధాన పాత్ర వహించినవారే. వారి కంట్రిబ్యూషన్ కూడా చాలా విలువైంది.  

ఆంధ్రప్రదేశ్ ప్రజలు సి బి యన్ నుంచి ఏం ఆశించి ఇంత ఘనమైన విజయం ఆయనకి అందించారో అది పూర్తిచేయగల సత్తా ఆయనకుంది. చేస్తారని ఆశిస్తూ... రేపు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి హార్దిక శుభాకాంక్షలతో -            

- మనోహర్ చిమ్మని         

Saturday, 8 June 2024

మీడియా మొఘుల్‌కు నివాళి


కోట్లాదిమందిని ఒక పత్రికకు ఎడిక్ట్ చెయ్యటం అంత చిన్న విషయం కాదు. అన్నదాత, చతుర, విపుల లాంటి పత్రికల ఆలోచన ఇంకెవ్వరైనా చేశారా? భాష గురించి, జర్నలిజం స్కూల్ గురించి ఆయన చేసిన కృషి మరే పత్రికాధిపతులు చెయ్యలేకపోయారు. ఒక టీవీ చానెల్‌తో ప్రారంభించి, ఈటీవీ చానెల్స్‌ను ఎన్నెనో భాషల్లో దేశమంతా విస్తరింపజేసిన ఘనత కూడా ఆయనదే. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌లో ఎన్నెన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించారు. ప్రపంచస్థాయి ఫిలిం సిటీ గురించి ఊహించడానికే ఎన్నో గట్స్ కావాలి. ఆర్ ఎఫ్ సి రూపంలో అలాంటిది నిర్మించి చూపించారాయన.
ఒకటిరెండు విషయాల్లో ఆయన దృక్కోణం పక్కనపెడితే, సక్సెస్ సైన్స్ పాయింటాఫ్ వ్యూలో రామోజీరావుది ఒక గొప్ప రాగ్స్-టు-రిచెస్ స్టోరీ. మనిషి తల్చుకొంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించిన ఈనాడు గ్రూపు సంస్థల సామ్రాజ్యాధినేత రామోజీరావుకు నివాళి. - మనోహర్ చిమ్మని

Thursday, 6 June 2024

అన్ని గంటలు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళడం అవసరమా?


మొన్న మొన్నటివరకూ యు యస్ అంటే నాకు పెద్ద ఆసక్తి ఉండేది కాదు. వరల్డ్ వార్స్, ఇతర హిస్టరీ గురించి విద్యార్థి దశలో నేను చదివిన పుస్తకాలు, వ్యాసాల ద్వారా తెలుసుకున్న కొన్ని అంశాల నేపథ్యంలో - ఆ దేశం పట్ల అంత మంచి అభిప్రాయం కూడా నాకు ఉండేది కాదు.

ఇదంతా పక్కనపెడితే, అసలు అన్ని గంటల జర్నీ చేసి అక్కడికి వెళ్ళడం అవసరమా అనుకునేవాన్ని.

ఆ జర్నీ టైమ్‌లో సగం కంటే తక్కువ సమయంలోనే యూరోప్‌లో అద్భుతమైన స్విట్జర్లాండ్ లాంటి దేశాలకు వెళ్ళొచ్చు కదా అనుకునేవాన్ని. 

కట్ చేస్తే -  

మొన్నటి నా 20 రోజుల అమెరికా ట్రిప్, ఆ దేశం పట్ల, ఆ సుధీర్ఘమైన ఫ్లయిట్ జర్నీ పట్ల నా ఆలోచనావిధానాన్ని పూర్తిగా మార్చేసింది.  

ఒక దేశం ఎందుకు అన్ని దశాబ్దాలుగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా కొనసాగగలుగుతోందో అర్థమైంది. 

అంతర్జాతీయ రాజకీయాలు, ఆయుధపాటవాలు కాదు. దేశభక్తి, పెంటాగన్లు, సి ఐ ఏ లు కూడా కాదు. వీటన్నిటినీ మించిన ఆయుధం కూడా ఒకటి అమెరికా దగ్గరుంది...

వ్యక్తిగత క్రమశిక్షణతో కూడిన ఫ్రీడమ్!

అది లేకుండా ఇవేవీ సాధ్యం కాదు. బహుశా అదే దాని అడ్వాంటేజ్.  అది అక్కడి ప్రతి పౌరునిలో కనిపిస్తుంది...

అక్కడున్నంత సేపూ దాన్ని మనమూ ఫీలవుతాం. 

- మనోహర్ చిమ్మని 

Wednesday, 5 June 2024

మిగతాదంతా సేమ్ టు సేమ్!


ఇది సాధారణ విజయం కాదు. అంత సింపుల్ కాదు. 

ఇందులో ఎలాంటి మాయ లేదు. మర్మం లేదు. 

రైట్ టైమ్‌లో రైట్ డెసిషన్స్ తీసుకోవడం. "ఎవడేమనుకున్నా సరే, ఏదేమైనా సరే... నేను సాధిస్తున్నాను, సాధించి తీరతాను" అనే కిల్లర్ ఇన్‌స్టింక్ట్. 

అతనిలోని సహజసిద్ధమైన ఇంకొన్ని క్వాలిటీస్ కూడా వీటికి బాగా తోడయ్యాయి.   

మా సినిమా ప్రపంచం నుంచి రాజకీయాల్లో ఇటీవల ఇదే అతిపెద్ద రికార్డు. రేపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోను తన రేంజ్ సత్తా చూపించడానికి ఇది చాలు. 

ఇంతకు ముందు ఎన్నికల్లో తాను పోటీచేసిన రెండుచోట్లా ఓడిపోవడం ఆయన్ను డిజప్పాయింట్ చెయ్యలేదు. ఇంచ్ కూడా వెనక్కి తగ్గనీయలేదు.  

మొన్న అక్టోబర్‌లో చంద్రబాబు నాయుడును జైల్లో పెట్టినప్పుడు, వెళ్ళి కలిశాడు. ఒక నిర్ణయం తీసుకున్నాడు. "బాబుతో నేనున్నాను, మేం కలిసి పోటీచేస్తాం" అని బయటికొచ్చి రెండు మాటలు చెప్పాడు. 

నా ఉద్దేశ్యంలో - అతని ఈ ఒక్క నిర్ణయం ఒక సెన్సేషనల్ బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌లా పనిచేసింది. 

కట్ చేస్తే - 

"పార్టీ పెట్టింది పోటీ చెయ్యడానికి కాదు, ప్యాకేజీల కోసం" అని ఎన్నోరకాల మాటలతో ఎగతాళి చేసినవాళ్లందరికీ మొహం మీద గుద్దినట్టుగా స్ట్రెయిట్ సింగిల్ పంచ్ ఆన్సర్.   

21/21, 2/2... 100% మాండేట్! 

దటీజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.  

Heartfelt congratulations to Power Star Pawan Kalyan on this special occasion! Wishing you a powerful tenure ahead as an even more powerful politician!!

- Manohar Chimmani