ఒక నేషనల్ మీడియా సంస్థలోని మ్యూజిక్ విభాగంలో డివిజనల్ ఇన్‌చార్జిగా పనిచేస్తున్న ఓ సిన్సియర్ ఉద్యోగి మీద ఉన్నట్టుండి ఒక భారీ కాపీరైట్ నేరం మోపబడింది. అంత భారీ కేసు అతని మీద వేసింది - ఒక టాలీవుడ్ ప్రొడ్యూసర్.
తీవ్రమైన మానసిక వత్తిడితో ఒక మూడునాలుగు రోజులు అతను అనుభవించిన వేదన అంతా ఇంతా కాదు. అయితే - తనకున్న క్రెడిబిలిటీతో, పరిచయాలతో కలవాల్సిన ఒకరిద్దరిని కలిశాడు. అతనేం తప్పు చేయలేదు కాబట్టి లీగల్‌గా ఆ కేసు నుంచి ఎలాగో బయటపడ్డాడు.
సదరు టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఆ కేసును అతని మీద వేసింది కేవలం ఒక నెగెటివ్ బజ్ కోసం!... తద్వారా వీలైతే ఆ మీడియా సంస్థ నుంచి ఒక ఐదారు కోట్లు నష్టపరిహారం అప్పనంగా పొందటం కోసం!!
ఇలా కూడా జరుగుతుందా అనిపిస్తుంది. కాని, జరిగింది.
ఉన్నట్టుండి - అతనిలో ఎప్పటినుంచో నిద్రాణంగా ఉన్న రచయిత మళ్ళీ లేచాడు.
ఒక ఫిలిం డైరెక్టర్, అతనికి ఎలాంటి సంబంధం లేకుండా - అతను చేయని నేరానికి - తప్పించుకోలేని విధంగా కాపీరైట్ చట్టం కింద బుక్ అయితే ఏంటి పరిస్థితి? అతని జీవితంలో తర్వాతేం జరుగుతుంది?.... ఈ ప్రశ్నలకు - తాను బలంగా నమ్మే పూర్వజన్మ సిద్ధాంతాన్ని కూడా జోడించి - ఒక మంచి సినిమా కథ అళ్ళుకున్నారు.
ఆ కథే... రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో నాని, సాయిపల్లవిల బ్లాక్ బస్టర్ సినిమా... "శ్యామ్ సింఘరాయ్."
ఆ కథారచయిత... సత్యదేవ్ జంగా.
కట్ చేస్తే -
సుమారు పాతికేళ్లపాటు ఆదిత్య మ్యూజిక్‌లో సీనియర్ మేనేజర్ స్థాయి వరకు పనిచేసిన సత్యదేవ్... ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యే ప్రతి తెలుగు సినిమా మ్యూజిక్ ఈవెంట్‌కు, ఆ కంపెనీ తరపున వేదికనెక్కేవారు. అలా టాలీవుడ్‌లో సత్యదేవ్ దాదాపు అందరికీ బాగా తెలుసు.
అయితే - సత్యదేవ్‌లో ఒక అద్భుతమైన కథారచయిత కూడా ఉన్నాడన్న విషయం శ్యామ్ సింఘరాయ్ వచ్చేవరకు ఇండస్ట్రీలో చాలామందికి తెలియదు.
శ్యామ్ సింఘరాయ్ కంటే చాలా ముందు - 2005 లోనే "ఏ ఫిలిం బై అరవింద్" సినిమాకు కథ అందించిన నేపథ్యం సత్యదేవ్ జంగాకు ఉంది.
మరి అప్పటి నుంచి ఇప్పటివరకు ఎందుకంత గ్యాప్? ఎందుకని కథారచయితగా పూర్తిస్థాయిలో దిగలేదు?
"ఏది ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అలా జరుగుతుంది" అంటూ నవ్వేస్తారు కర్మ సిద్ధాంత ప్రేమి సత్యదేవ్ జంగా.
కట్ చేస్తే -
నెల్లూరు జిల్లాలోని కావలి నుంచి తన తల్లిదండ్రులతో ఏడో ఏట హైద్రాబాద్‌కు వచ్చిన సత్యదేవ్‌కు తెలంగాణ మట్టి వాసన బాగా నచ్చింది. బాగానే అచ్చివచ్చింది.
అలాగని సత్యదేవ్ తన మూలాల్ని మర్చిపోలేదు.
"I respect Andhra, I admire Telangana" అని సిన్సియర్‌గా చెప్పగలిగిన హంబుల్ ఓపెన్‌నెస్ సత్యదేవ్ సొంతం.
ప్యారడైజ్ చౌరస్తాలో ఉన్న "సంగీత్ సాగర్"లో 1993 లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి - ఒక నేషనల్ మీడియా సంస్థలో ఓ మూడేళ్ళు పనిచేసి - ఆదిత్య మ్యూజిక్‌లో రెండేళ్ల క్రితం వరకు సీనియర్ మేనేజర్‌గా తన ఉద్యోగ జీవితం వదిలేసేవరకు... కేవలం మ్యూజిక్‌లోనే "30 ఇయర్స్ ఇండస్ట్రీ" సత్యదేవ్‌ది!
స్వయంగా తనే కంపోజర్‌గా ఒక పాతిక ఆల్బమ్స్‌తో కలిపి - ప్రొడ్యూసర్‌గా మొత్తం ఒక 250 వరకు భక్తిసంగీతం ఆల్బమ్స్ చేసిన రికార్డ్ సత్యదేవ్‌కుంది.
ఈ జర్నీలో - బాలమురళీకృష్ణ, యస్ పి బాలు వంటి లెజెండ్స్‌తో కలిసి పనిచేసి, వారితో పాడించిన మధుర జ్ఞాపకాలు సత్యదేవ్ జీవితంలో చాలా వున్నాయి.
అలాగే పార్థసారథి వంటి మ్యూజిక్ డైరెక్టర్స్‌ను... నిహాల్, నిత్యసంతోషిని, మాళవిక వంటి ఎందరో కొత్త తరం సింగర్స్‌ను పరిచయం చేసిన క్రెడిట్ కూడా సత్యదేవ్‌కుంది.
కట్ చేస్తే -
మా ఇద్దరిదీ దాదాపు 20 ఏళ్ళ పరిచయం. దర్శకుడిగా నేను చేసిన నాలుగు సినిమాల ఆడియోల విషయంలోనూ నాతో జర్నీలో ఉన్నారు సత్యదేవ్.
ఈ జర్నీలోనే - సుమారు ఏడేళ్ళ క్రితం - మా బోయిన్‌పల్లి ఆఫీసులో కూర్చొని, సత్యదేవ్ నాకు చెప్పిన ఒక అద్భుతమైన కథ నాకింకా గుర్తుంది. ఇదే జర్నీలో - మా ఇద్దర్నీ మరింత దగ్గర చేసింది మా ఇద్దరిలోనూ ఉన్న ఆధ్యాత్మిక స్పృహ. ఈ గుళ్ళూ గోపురాలకి అవతలి ఆధ్యాత్మిక లోకం గురించి మేం ఎంతసేపైనా మాట్లాడుకోగలం!
సత్యదేవ్ జంగా కథతో - మా ఇద్దరి కోంబోలో కూడా ఒక సినిమా ఎందుకు చెయ్యకూడదు అని మొన్నే అనుకున్నాం. అంతా అనుకున్నట్టు జరిగితే - ఆ ప్రాజెక్టు ఒక పెద్ద బ్యానర్‌లోనే ఉంటుంది. అది వేరే విషయం.
సత్యదేవ్, భార్య, ఇటీవలే ISB లో సీట్ తెచ్చుకున్న ఒక అబ్బాయితో కలిపి వారిది చిన్న కుటుంబం. వాళ్ల అన్నగారి కుటుంబంతో కలిసి వారిది ఉమ్మడి కుటుంబం కూడా కావడం విశేషం.
శ్యామ్ సింఘరాయ్ వంటి పెద్ద హిట్ తర్వాత - సత్యదేవ్ నుంచి వచ్చే కథను అదే స్థాయిలో, అంతకు మించిన స్థాయిలో ఎక్స్‌పెక్ట్ చేయటం సహజం. అలాంటి వత్తిడిని తట్టుకొంటూ - తనదైన శైలిలో దేనికదే విభిన్నమైన కథలను తయారుచేసుకొంటూ - తన ప్యాషనేట్ కథాప్రపంచంలో బిజీగా ఉన్నారు సత్యదేవ్.
బ్లాక్ బస్టర్ "శ్యామ్ సింఘరాయ్" తర్వాత "వాట్ నెక్‌స్ట్" అంటే -
బ్లాక్ బస్టర్ "శ్యామ్ సింఘరాయ్" తర్వాత "వాట్ నెక్‌స్ట్" అంటే -
"ఒక సూపర్ న్యాచురల్ యాక్షన్ డ్రామా, కాశీ బ్యాక్‌డ్రాప్‌లో ఒక పీరియాడిక్ లవ్‌స్టోరీ, రోమోకామ్స్, థ్రిల్లర్స్... అన్నీ కలిపి ఒక 10 నుంచి 15 వరకు కథలున్నాయి. త్వరలోనే నా కథతో ఒక పెద్ద ప్రాజెక్టు కూడా ఎనౌన్స్ అవబోతోంది" అన్నారు సత్యదేవ్.
నిజానికి - "శ్యామ్ సింఘరాయ్" తర్వాత - సత్యదేవ్‌కు ముంబై నుంచి, ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో పెద్ద బ్యానర్స్ నుంచి కూడా ఆఫర్స్ వచ్చాయి. కథలు వినిపించారు, ఒప్పించారు. అయితే - భారీ కమర్షియల్ సినిమా అంటే బేసిగ్గా కాంబినేషన్స్‌తో భారీ వ్యాపారం కాబట్టి - అవన్నీ సరిగ్గా కుదరాలి. ప్రస్తుతం ఆ దిశలోనే ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి.
సో... ఆ కాంబినేషన్స్, బడ్జెట్స్ అన్నీ కుదిరి... శ్యామ్ సింఘరాయ్‌ని మించిన కథతో అతి త్వరలోనే సత్యదేవ్ జంగా సినిమా ఎనౌన్స్ అవుతుందని ఈ అంతర్జాతీయ రచయితల దినోత్సవం రోజు ఒక మిత్రుడిగా నేను మనస్పూర్తిగా ఆశిస్తున్నాను.
"శ్యామ్ సింఘరాయ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకు కథ ఇచ్చారు కదా - మాతో చేస్తారో లేదో" అని అనుకొనే అవకాశం ఇండస్ట్రీలో కొందరిలో ఉంటుంది. అది సహజం. నిజానికి చిన్న పెద్దా, సీనియర్ జూనియర్ అనే భేషజాల్లేకుండా - టేస్ట్ ఉన్న దర్శకులు-ప్రొడ్యూసర్స్ ఎవరితోనైనా కలిసి మంచి సినిమా చెయ్యడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే సత్యదేవ్ జంగాకు మంచి ప్రాజెక్ట్సే లభిస్తాయని ఆయన మనసు తెలిసిన మిత్రునిగా నా నమ్మకం... నా ఆకాంక్ష.
"శ్యామ్ సింఘరాయ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకు కథ ఇచ్చారు కదా - మాతో చేస్తారో లేదో" అని అనుకొనే అవకాశం ఇండస్ట్రీలో కొందరిలో ఉంటుంది. అది సహజం. నిజానికి చిన్న పెద్దా, సీనియర్ జూనియర్ అనే భేషజాల్లేకుండా - టేస్ట్ ఉన్న దర్శకులు-ప్రొడ్యూసర్స్ ఎవరితోనైనా కలిసి మంచి సినిమా చెయ్యడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే సత్యదేవ్ జంగాకు మంచి ప్రాజెక్ట్సే లభిస్తాయని ఆయన మనసు తెలిసిన మిత్రునిగా నా నమ్మకం... నా ఆకాంక్ష.
Happy International Writers' Day!
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani