Wednesday, 21 May 2014

నమో నమః

అనక తప్పదు. అలాంటి విజయం నరేంద్ర మోడీది. చెప్పాడు. చేసి చూపించాడు.

ఆ వినయం, ఆ విధేయత.. ముఖ్యంగా ఆయనతో జతకట్టిన మనవాళ్లలాగా అణువణువూ అహంకారం, ఈగో, స్వోత్కర్షలు  లేకపోవడం.. ఇవన్నీ కేవలం మోడీకే సొంతం.

కట్ టూ కనీ వినీ ఎరుగని రికార్డు -

గుజరాత్ విధానసభలోకి నరేంద్ర మోడీ తొలిసారిగా ప్రవేశించింది సి ఎం గానే! ఇప్పుడు - పార్లమెంట్ సెంట్రల్ హాల్లోకి కూడా తొలిసారిగా ప్రవేశించింది పి ఎం గా!!

కేన్ అండ్ ఏబుల్, ఫస్ట్ ఎమాంగ్ ఈక్వల్స్ వంటి (కొంతవరకు ఈ కోవకి చెందిన) అద్భుతమైన ఫిక్షన్ రాసిన జెఫ్రీ ఆర్చర్ కూడా థ్రిల్ అయ్యే కాన్సెప్ట్ ఇది!  ఫిక్షన్ కాదు. నిజం.

ఈ రికార్డుని ఎవరయినా బీట్ చేయగలరా? ఈ లక్ష్యాన్ని మరొకరెవరయినా చేదించగలరా? ఏమో.. నాకయితే నమ్మకం లేదు.

ఇదంతా నేను మోడీ భజన చేస్తూ రాయటం లేదు. ఇదొక సక్సెస్ స్టోరీ. సక్సెస్ సైన్స్. ఇంకా చెప్పాలంటే - ఒక రాగ్స్ టూ రిచెస్ లైఫ్! అందుకే మోడీ గురించి ఈ చిన్న బ్లాగ్ పోస్ట్‌ని నేను ఇంత ప్యాషనేట్‌గా రాస్తున్నాను.

ఇంత గొప్ప విజయం వెనుక ఎంతో కఠిన శ్రమ ఉంది. వ్యక్తిగత జీవనత్యాగం ఉంది. చాయ్‌వాలా నుంచి ఒక దేశ ప్రధాన మంత్రి కాగలిగిన ఒక వాస్తవ జీవితం ఉంది.

దేశంలోని మరే సి ఎం లు చేయలేని ఎన్నో పనుల్ని, ఎంతో అభివృధ్ధిని మోడీ సునాయాసంగా చేసి చూపించాడు. విచిత్రమయిన విషయం ఏంటంటే - కొన్ని విషయాల్లో మోడీ అప్పటి చంద్రబాబుని ఆదర్శంగా తీసుకోని పనిచేయడం!

మోడీ మీద మతానికి సంబంధించిన ఒక మరక ఉంది. అయితే అది నిజం కాదని కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చాయి. గుజరాత్‌లో మోడీ చేసిన అభివృధ్ధి కళ్లముందు కనిపిస్తోంది. ప్రపంచదేశాలూ గుర్తించాయి. ఆయనకు మొన్నటివరకూ వీసా ఇవ్వని అమెరికాతో సహా!

మిగిలిన ఎన్ డి ఏ భాగస్వాముల అంకెలతో సంబంధం లేకుండా - ఒక్క బిజెపి తోనే ఒంటిచేత్తో స్వీప్ చేయగలిగిన సత్తా ఒక్క మోడీవల్లనే సాధ్యమయింది. దీన్ని "బిజెపి భీష్ముడు" అద్వానీ కూడా గుర్తించి మోడీని పొగడ్డం విశేషం.
అయితే - తల్లి భారతదేశం లాగే, బిజెపి కూడా తన తల్లేననీ.. ఆ తల్లికి సేవ చేయడం తన బాధ్యత అని.. అమితమైన భావోద్వేగం కన్నీటితెరని కప్పేస్తుండగా వినమ్రంగా చెప్పాడు మోడీ.

అదీ మోడీ వ్యక్తిత్వం.

కావల్సింది చేతలు. మాటలు కాదు. ఆ సత్తా మోడీలో ఉంది. వచ్చే అయిదేళ్లలో మనదేశ ప్రధానిగా మోడీ ఎన్ని మిరాకిల్స్ అయినా క్రియేట్ చేయగలడని నా నమ్మకం.

ఈ అయిదేళ్లలో మోడీ సృష్టించే అద్భుతాలు.. అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాలకు కూడా ఒక జర్క్‌నివ్వొచ్చు.
నో డౌట్!  

"చక్రం" బాబుకు మళ్లీ వచ్చిన అవకాశం!

అప్పట్లో చంద్రబాబుకీ, చక్రం తిప్పడానికీ చాలా అవినాభావ సంబంధం ఉండేది. కొంతకాలం ఆ రేంజ్‌లో ఢిల్లీలో ఆటలాడుకున్నాడు చంద్రబాబు.

మొన్న తెలంగాణ బిల్లు పాస్ కాకుండా కూడా.. ఆ చెదలుపట్టిన చక్రాన్ని అడ్డదిడ్డంగా తిప్పుతూ, ఢిల్లీలో యమ కష్టపడ్డాడు. నేషనల్ మీడియాతో చీవాట్లు కూడా తిన్నాడు.

చెదలుపట్టిన ఆ చక్రం విషయం అలా వదిలేస్తే - 

చంద్రబాబు అనగానే నాకు అనేకమైన విశేష సంఘటనలు గుర్తుకొస్తాయి. వాట్లో మచ్చుకి కొన్ని:

> బాలయోగి లోక్‌సభ స్పీకర్ కావడం కోసం చివరి క్షణాల్లో.. దాదాపు ఓ థ్రిల్లర్ సినిమా క్లయిమాక్స్‌లా, అత్యంత ఉత్కంఠభరితంగా బాబు తిప్పిన చక్రం.
> బాబు "విజన్ 2020".
> బిల్ గేట్స్, బిల్ క్లింటన్ రేంజ్‌వాళ్లను హైదరాబాద్ రప్పించడం.
> సాఫ్ట్‌వేర్ రంగానికి బాగా ప్రాముఖ్యం ఇవ్వడం.

(నేనూ బాబు చేతులమీదుగానే తెలుగు లలిత కళాతోరణంలో నంది అవార్డ్ తీసుకున్నాను. అది నా పర్సనల్ విషయం అనుకోండి.)

ఇలా ఇంకా కొన్నున్నాయి. అన్నీ ఠక్కున గుర్తుకొచ్చేవే. కాకపోతే, ఇది “9 మినట్ బ్లాగింగ్” కాబట్టి.. యమ స్పీడ్‌గా రాసి, తొందరగా క్లోజ్ చేయాలి.

అయితే, వీటిని అంటిపెట్టుకొనే చాలా మైనస్‌లు కూడా ఉన్నాయి. ఉదాహరణకు:

> వ్యవసాయాన్ని, రైతులను పెద్దగా కేర్ చేయకపోవడం.
> ప్రభుత్వోద్యోగులను ఫుట్‌బాల్ ఆట ఆడుకోవడం.
> కొన్ని పనికిరాని లాబీలకు, కోటరీ భజనకు లొంగిపోయి.. పెడ్ద బ్లండర్ స్టెప్ వేసి ఊహించనివిధంగా గద్దె దిగటం.
> ఫలితంగా - పదేళ్లు కుర్చీని కోల్పోవడం.

కట్ టూ 2014 - 

అధికారంలో ఉన్నపుడు ఏ రైతుల జీవితాల్నయితే కేర్ చేయలేదో – ఇప్పుడు అదే రైతుకు “రుణ మాఫీ” ఇస్తూ విజయాన్ని దక్కించుకున్నాడు బాబు. ఆయన పశ్చాత్తాపానికి ఫలితం దక్కింది.

దీనికితోడు – మిగిలిన విషయాల్లో బాబు ట్రాక్ రికార్డుని సీమాంధ్ర ప్రజలు నిజంగా మనస్పూర్తిగా గౌరవించి గుర్తించారు. మళ్లీ బంగారు పల్లెంలో అధికారాన్ని అందించారు.

కట్ టూ అవసరంలేని “అతి” - 

> రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల్ని బాబు మళ్లీ కలుపుతాడట!
> అక్కడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇక్కడి తెలంగాణను కూడా అభివృధ్ధి చేస్తాట్ట!
> అక్కడ ఆయన చేసే అభివృధ్ధి పనులను చూసి ఇక్కడ తెలంగాణవాళ్లు నేర్చుకోవాలట!

ఎంత అర్థం లేని మాటలు! ఎంత అవివేకం!!

బాబు తాను ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ముఖ్యమంత్రి అన్న విషయం మర్చిపోయాడనుకుంటాను. ఇలాంటివన్నీ విజయం ఇచ్చిన “కిక్” వల్ల తలకెక్కిన ఈగో రూపంలో ఇదిగో ఇలా బయటపడతాయి. ఇక్కడే - తనని చూసి ఇన్స్‌పయిర్ అయిన మోడీని చూసి, తను ఏం మాట్లాడకూడదో నేర్చుకోవాల్సిన అవసరం బాబుకు చాలా ఉంది.

కట్ టూ “రాబోయే మార్పు” - 

ఇప్పుడు ప్రజల్లో చాలా అవేర్‌నెస్ వచ్చింది. ఏదో అర్థం లేకుండా, అల్లాటప్పాగా, ఎడాలిసెంట్‌గా “ఓదార్పు” అంటూ, “అయిదు సంతకాలు” అంటే పడిపోయే రోజులు పోయాయి.

ఇకమీదట ప్రజలు రాజకీయనాయకుల పనితీరు చూస్తారు. ఫలితాలు చూస్తారు. ఆది కూడా ఏదో ఆషామాషీగా కాదు.

సగటు పౌరుని జీవితాన్ని వీరు చేసే పనులు పాజిటివ్ కోణంలో ఎంతో ప్రభావితం చేయగలగాలి. ఎంతో ఉపయోగపడాలి. అలా లేనప్పుడు బాబయినా, ఇంకెవరయినా నిర్మొహమాటంగా ప్రజలు తిప్పికొడతారు. ఆదీ అసలు ప్రజాస్వామ్యం.

దీని విలువని ఇప్పటికయినా మన పొలిటీషియన్లు గ్రహించారనే అనుకుంటున్నాను. ఇకమీదట - ఎంతో బాగా ప్రభుత్వాన్ని నడిపి, మరెంతో గొప్పగా ఫలితాల్ని చూపించాలన్న తహతహ ప్రతి సి ఎం లోనూ, మంత్రిలోనూ, రాజకీయనాయకునిలోనూ ఉంటాయని నేననుకుంటున్నాను. కనీసం కొంత రేంజ్ వరకయినా!

ఏ పార్టీ అన్నది కాదు విషయం. ఏం మంచి చేశారు అన్నదే ముఖ్యం.

Friday, 16 May 2014

జయహో కె సి ఆర్!

జస్ట్ కొద్దిరోజుల క్రితం ..

"కె సి ఆర్ పై విచారణ జరిపిస్తాం!" -- పొన్నాల
"కె సి ఆర్ ని పిచ్చాసుపత్రికి పంపిస్తాం!" -- చంద్రబాబు
"కె సి ఆర్, మాకు నీతులు చెప్పొద్దు!" -- వెంకయ్య నాయుడు
"కె సి ఆర్, నా ఆస్తులు ప్రకటిస్తా. నీ ఆస్తులు ప్రకటిస్తావా?" -- దామోదర
"కె సి ఆర్.. కరిష్మా లేని నాయకుడు!" -- డి ఎస్

కె సి ఆర్ ఇదీ, కె సి ఆర్ అదీ అని నానా స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ఎలక్షన్ల తర్వాత కె సి ఆర్ ను జైలుకు కూడా పంపిస్తామన్నారు.

వాటన్నిటికీ కలిపి ఒక్కటే సమాధానం.. ఈనాటి ఈ క్లీన్ స్వీప్.

తెలంగాణ ఉద్యమం మళ్లీ ఇంత ఉవ్వెత్తున ఎగిసి, దాదాపు పుష్కర కాలం ఉధృతంగా కొనసాగి, అంతిమ లక్ష్యం ఛేదించడానికి మూలకారణం కె సి ఆర్.

ఎన్ని ఎత్తులు, ఎంత చాకచక్యం, ఏం వాగ్ధాటి, ఎంత జాగ్రత్త.. చివరి నిమిషం వరకూ!

ఎవరు ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం.

తెలంగాణకు తొలి సి ఎం గా రేపు ప్రమాణ స్వీకారం చేయడానికి కె సి ఆర్ అన్ని విధాలా అర్హుడు, సమర్థుడు.  

కె సి ఆర్, నువ్వు సాధించినవ్! ఇప్పుడు సాధించాల్సింది చాలా ఉంది. ఇదే వేడి, ఇదే వాడి.. నువ్వు కలలుగన్న తెలంగాణ పునర్నిర్మాణం దిశగా కూడా కొనసాగాలి. ప్రతి తెలంగాణ బిడ్డ ముఖంలో నవ్వు వికసించాలి.. 

Saturday, 10 May 2014

జూన్ 2 తర్వాత ..

ముందుంది ఏదో పండగ అన్నట్టు .. జూన్ 2 తర్వాత నుంచి రెండు తెలుగు ప్రాంతాల్లోని వ్యవస్థలు, వృత్తులు, వ్యాపారాలు, వ్యక్తుల జీవితాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా మార్పులు జరుగుతాయని నాకనిపిస్తోంది.

"జూన్ 2 సరే, ఈ మే 16 కే కదా అందరి జాతకాలు తెలిసేది?" అని మీరు అనొచ్చు. అయితే - ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచినా, ఎవరు సీ ఎం గా వచ్చినా - జరగాల్సింది జరిగిపోయింది. విడిపోవడం విడిపోవడమే. లెక్క లెక్కే!

అడుగూ బొడుగూ - "ఫోలవరం ముంపు గ్రామాలు" లాంటి కొన్ని సమస్యలుంటాయి. రగులుతూ.

ఆదీ అంతం లేకుండా అవి అలా సాగుతూనే ఉంటాయి. మోక్షం ఎప్పుడో ఇప్పుడే ఎవరేం చెప్పలేరు. చేయలేరు. ఇలాంటి నేపథ్యంలోంచే కొత్తగా మరికొందరు మేథా పాట్కర్‌లు పుడతారు.

కట్ టూ సినిమా ఇండస్ట్రీ - 

'ఈ ఇండస్ట్రీలో కూడా పెద్ద తేడా ఉండకపోవచ్చు.. ఉండదు'.. అని సీనియర్ సినీరంగ ప్రముఖులు, స్టుడియోల అధినేతలు, వాళ్లూ వీళ్లూ అంటున్నారు. అదంతా మేకపోతు గాంభీర్యమే అని నాకనిపిస్తోంది. లేదంటే, లోపల్లోపల ఏమయినా ఒప్పందాలున్నాయో తెలీదు.

అక్కడ, (కొత్త) ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సినీ ఇండస్ట్రీకి చాలా వరాలిస్తారు. టాక్స్ దాదాపు ఉండదు. ఎట్ లీస్ట్ కొంతకాలం వరకు. అప్పుడు కూడా హైదరాబాద్‌ని పట్టుకునే వేలాడతాం అని ఏ బిజినెస్ మ్యాన్ కూడా అనుకోడు.

ఈ కోణంలో చూస్తే - ఇండస్ట్రీలో బాగా పాతుకుపోయిన పెద్ద తలకాయలు కొన్నయినా అటు వైజాగ్‌కో, మరోచోటకో వలస వెళ్లితీరతాయి. హైదరాబాద్‌కి  గుడ్‌బై చెప్తూ!

మిగిలిన కొద్దిమంది పాతకాపులకి ఇంతకుముందులా బిజినెస్ ఉండే అవకాశంలేదు. ఎందుకంటే - కొత్తగా రూపొందే/మార్పులుపొందే తెలంగాణ ఫిలిం చాంబర్, అసోషియేషన్లు, యూనియన్లు ఎలాంటి కొత్త పుంతలు తొక్కుతాయో, ఎలాంటి కొత్త శకానికి నాంది పలుకుతాయో ఇప్పుడే చెప్పలేం.

కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, కొత్త సినిమాటోగ్రఫీ మంత్రి, ఆ మంత్రిత్వ శాఖ తీసుకొనే నిర్ణయాలు, రూపొందించే మార్గదర్శకాలమీద ఇక్కడి సినీ ఇండస్ట్రీలోని చాలామంది జీవితాలు ఆధారపడి ఉంటాయి.

ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇదే నిజం. జూన్ 2 తర్వాత నుంచే ఇక్కడ అసలు సినిమా మొదలవుతుంది. 

Tuesday, 6 May 2014

ప్రొఫెషనల్ మీడియేటర్స్‌కి వెల్‌కమ్!

జూన్ 2 ను కాస్తా.. ఈ మే 17 కో, 18కో ముందుకు జరపాలని యమస్పీడ్‌లో పనులూ, ప్రయత్నాలూ జరుగుతున్నాయిట! సో, రాజకీయాలు రాజకీయాలే.. మన సినిమాలు సినిమాలే. ఏదీ దేనికోసం ఆగదు. ఎవ్వరికోసం ఆగదు.

కట్ టూ మన అసలు పాయింట్ - 

నేనిప్పుడు చేస్తున్న రెండు మైక్రో బడ్జెట్ చిత్రాల కోసం .. చిన్న స్థాయిలో (కనీసం 5 నుంచి 10 లక్షలైనా) వెంటనే ఇన్వెస్ట్ చేయగల ఇన్వెస్టర్స్/కో-ప్రొడ్యూసర్స్ అవసరముంది.

ఇక్కడ ఒక అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే - ఇలా ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చేవాళ్లకు ప్రధానంగా సినిమాల మీద ఇంట్రెస్టూ, ఫిలిం ప్రొడక్షన్ బిజినెస్ మీద ప్యాషన్ కాస్తో కూస్తో ఉండటం చాలా అవసరం.  ఎందుకంటే, వాళ్లు మాత్రమే కొన్ని కొన్ని విషయాల్ని ఠక్కున అర్థం చేసుకోగలుగుతారు. ఇతర బిజినెస్‌లకూ దీనికీ ఉన్న తేడాను ఇట్టే గ్రహించగలుగుతారు. ఎంతో కోపరేట్ చేస్తారు. మోరల్ సపోర్ట్ కూడా ఇస్తారు.

అలాంటి ఔత్సాహిక ఇన్వెస్టర్లని/కో-ప్రొడ్యూసర్లని పరిచయం చేసి, డీల్ సక్సెస్ చేయించగల సత్తా ఉన్న నెగొషియేటర్లు/మీడియేటర్లకు ఇదే మా రెడ్ కార్పెట్ వెల్‌కమ్!

మీ శ్రమకి మార్కెట్ రేట్ ప్రకారం తగిన రాయాల్టీ ఉంటుంది. తెరపైన కూడా మొట్టమొదటే మీ పేరు వేసి మరీ కృతజ్ఞతలు చెప్పుకుంటాం.

అంతా కొత్తవారితో తీస్తున్న ఈ 2 ట్రెండీ యూత్ ఎంటర్‌టైనర్ చిత్రాలను "రెడ్" కెమెరాలతో తీస్తున్నాం. మార్కెటింగ్, ప్రమోషన్ (ఆన్‌లైన్/ఆఫ్‌లైన్), రిలీజ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవు.

డీల్‌ని ఆథరైజ్‌డ్ సిఏతో పేపర్ మీద రికార్డ్ చేయించి సంతకాలు చేయటం జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే - ఈ పనంతా - ఒక కార్పొరేట్ సంప్రదాయం ప్రకారం లీగల్‌గా జరుగుతుంది.

ముఖ్యమైన విషయం ఏంటంటే - మాకు కావలసింది కో-ప్రొడ్యూసర్లుగా ఇన్వెస్ట్ చేయగలవాళ్లు మాత్రమే తప్ప ఫైనాన్సియర్స్ కాదు. మాకు ఫైనాన్స్ అవసరం లేదు.

కట్ టూ మీడియేటర్స్ - 

ముందే చెప్పినట్టు - ఇండస్ట్రీ సంప్రదాయం ప్రకారం - తగిన రాయాల్టీని డీల్ పూర్తి అయినరోజే మీడియేటర్స్‌కి ఇవ్వటం జరుగుతుంది. స్క్రీన్ మీద మొట్టమొదటి టైటిల్ కార్డ్ "అక్నాలెడ్జ్‌మెంట్స్"లో మీ పేరు తప్పనిసరిగా వేస్తాము.

నిజంగా మీదగ్గర ఇప్పటికిప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నవారు ఉన్నట్లయితేనే - మీ మొబైల్ నంబర్ ఇస్తూ ఈమెయిల్ పెట్టండి. మా ఆఫీస్ నుంచి మీకు వెంటనే కాల్ వస్తుంది. మిగిలిన వివరాలు ఫోన్లో మాట్లాడుకుందాం.

ఇదీ మా ఈమెయిల్ అడ్రస్:
mchimmani10x@gmail.com 

Monday, 5 May 2014

సర్వమ్ ఆధ్యాత్మికమ్!

సుమారు రెండేళ్ల క్రితం - ఇంగ్లిష్‌లో నేనొక స్పిరిచువల్ మెమొయిర్‌ని రాసి, దాన్ని నా కలం పేరుతో పబ్లిష్ చేశాను.

అది పూర్తిగా నా వ్యక్తిగత ఆధ్యాత్మిక నమ్మకాలకు.. నా జీవితంలో జరిగిన కొన్ని అద్భుత సంఘటనలకు సంబంధించిన పుస్తకం. అందులోని కొన్ని ముఖ్యమైన అంశాలు ఎంత రియలిస్టిక్‌గా కనిపిస్తాయో.. అంత నమ్మశక్యం కాని విధంగా ఉంటాయి. కానీ నిజం నిజమే.

పాఠకుల్లో కొందరు - ముఖ్యంగా నన్ను వ్యక్తిగతంగా ఇష్టపడనివారు కొందరు; నాస్తికులు అందరూ.. పుస్తకం చదివాక నన్ను ఎగతాళి చెయ్యొచ్చు. చీదరించుకోవచ్చు. ఎదురుపడితే తిట్టొచ్చు.

మరో కోణంలో.. చాలామంది పాఠకులు బాధపడవచ్చు. కళ్లల్లో నీళ్లు పెట్టుకోవచ్చు. నా చొక్కా పుచ్చుకుని, "అసలు ఎందుకు ఇదంతా అనుభవించావు? మాకెవ్వరికీ ఎందుకు చెప్పలేదు? మేం చచ్చామా?" అని కూడా తిట్టొచ్చు. ముఖ్యంగా నా ఆత్మీయ మిత్రులు.. శ్రేయోభిలాషులు..

నా ఆధ్యాత్మిక నమ్మకాలకు, అనుభవాలకు సంబంధించిన ఇన్ని పార్శ్వాలు ఈ పుస్తకంలో ఉన్నాయి కాబట్టే - (కొన్ని వ్యక్తిగత కారణాలవల్లకూడా) - ఈ పుస్తకాన్ని ముందు నేను నా కలం పేరుతో పబ్లిష్ చేశాను.

అది గతం.

కట్ చేస్తే - 

అసలు ఇప్పుడు నేనున్న సిచువేషన్‌లో ఈ పుస్తకం ప్రసక్తి అంత అవసరమా?

నిజంగా అవసరమే. ఇంగ్లిష్‌లో ఓ సామెత ఉంది.. "మైండ్ చేంజెస్ లైక్ వెదర్!" అని. అప్పుడు ఈ పుస్తకాన్ని కలం పేరుతో పబ్లిష్ చేయడానికే ఎంతో సంకోచించాను. భయపడ్డాను. ఇప్పుడు అదే పుస్తకాన్నినా ఒరిజినల్ పేరుతో బయటికి తేవడానికి సంతోషిస్తున్నాను.

దీని గురించి ఇంకా వివరంగా చెప్పాలంటే - టిమ్ ఫెర్రిస్ గురించి చెప్పాల్సి ఉంటుంది. ఓ అద్భుతమైన అతని కొటేషన్ గురించి చెప్పాల్సి ఉంటుంది. "న్యూయార్క్ టైమ్‌స్ బెస్ట్ సెల్లర్" అవాలన్న లక్ష్యంతో,  మరో నాలుగయిదు నెలల్లో నేను పబ్లిష్ చేయబోతున్న మరో ఆధ్యాత్మిక పుస్తకం గురించీ చెప్పాల్సి ఉంటుంది. ఇదంతా మళ్లీ ఇంకో బ్లాగ్ పోస్టులో చర్చిందుకుందాం.

అంతర్జాతీయంగా ఇప్పటికే ఎన్నో కాపీలు అమ్మకం జరిపిన ఈ పుస్తకం, ఇప్పుడు, నా ఒరిజినల్ పేరుతో మళ్లీ పబ్లిష్ అవుతోంది. యు ఎస్ లో.

వచ్చే జూన్ నుంచి - అమెజాన్‌లో, బార్న్స్ అండ్ నోబెల్లో, ఇతర ముఖ్యమైన ఆన్‌లైన్ అవుట్‌లెట్స్‌లో.. ఆఫ్‌లైన్‌లో కొన్ని ముఖ్యమైన చోట్ల కూడా .. దాదాపు ప్రపంచం అంతా అందుబాటులో ఉండే ఈ పుస్తకం గురించి ఎంత వద్దనుకున్నా, ఎంత డిటాచ్‌డ్‌గా ఉందామన్నా.. కొంత ఎక్‌జైటింగ్‌గానే ఉంది నాకు. 

Friday, 2 May 2014

"క్రౌడ్ ఫండింగ్" మనదగ్గర ఎందుకు సక్సెస్ కాదు?

కిక్‌స్టార్టర్, ఇండీగోగో వంటి ఎన్నో సైట్స్ - అమెరికాలోనూ, ఇతర పాశ్చాత్య దేశాల్లోనూ సక్సెస్‌ఫుల్‌గా ఎంతో సెన్షేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఎందరి ప్రాజెక్టులకో ఊహించని స్థాయిలో సపోర్ట్ ఇస్తున్నాయి.

మన దగ్గర ఇలాంటి ప్రయత్నాలు నాలుగయిదు జరిగాయి. ఓ నాలుగయిదు సైట్స్ కూడా వచ్చాయి. బట్.. తుస్సుమన్నాయి. దీనికి కారణాలు అనేకం.

వాటిల్లో కొన్ని కారణాలు :

> మనవాళ్లు రూపాయి పెట్టుబడి పెడితే తెల్లవారే 100 రూపాయలు రావాలనుకుంటారు.

> ఎదుటివారిలోని క్రియేటివ్ ప్యాషన్‌ని అర్థం చేసుకోవాల్సిన అవసరం వీరికి కనిపించదు, లేదు. మన మైండ్‌సెట్స్ అలాంటివి. తప్పేం లేదు.

> ఇంకెవరయినా ఇంట్రెస్ట్ ఉన్నవాడు పెడుతున్నా వద్దని వారిస్తారు. అవసరమయితే, అదే డబ్బుతో ఏ లిటిగేషన్ ఉన్న ల్యాండుకో అడ్వాన్స్ ఇప్పిస్తారు.

> అన్నింటికంటే ముందు.. "అసలు నువ్వు మా డబ్బులు పట్టుకుని ఉడాయిస్తే!?".. అన్న డౌట్ వీళ్లని వెంటాడి వేధిస్తుంది.  

> మన దగ్గర డబ్బులు పెట్టే ప్రతి ఒక్కరికీ కథ చెప్పాలి. అది ప్రతి ఒక్కరికీ నచ్చాలి. క్రౌడ్ ఫండింగ్ కి కనీసం ఒక 100 మంది అయినా అవసరం. అలాంటప్పుడు.. ఏ ఒక్క కథయినా ఆ 100 మందిలో అందరికీ నచ్చుతుందా?

ఇలా చెప్పుకుంటూపోతే బోలెడు..

జస్ట్ ఈ సైట్స్‌ని విజిట్ చేయండి సరదాకి. బయట ఏం జరుగుతోందీ.. మనం ఎక్కడున్నామో.. ఒక ఐడియా వస్తుంది. ఆ అయిడియా మనలో కొందరికయినా అవసరమని నా ఉద్దేశ్యం.

సినిమాలు తీయడం ఒక్కటే కాదు.. ఈ క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఇంకెన్నో కూడా సాధించొచ్చు. అదికూడా మనలో చాలామందికి తెలియాలి. ఎవరు ఏదయినా సాధించొచ్చు..  

చెప్పలేం.. మనవాళ్లలోనూ ఉన్నారు మార్క్ జకెర్‌బర్గ్‌లు!  

Wednesday, 30 April 2014

ఒక జీవనశైలి కోసం ..

అమందా హాకింగ్ అనే ఓ యువతి.. భయపెట్టే చిన్న చిన్న "జాంబీ" నవలలు రాసి, అమెజాన్ కిండిల్ బుక్స్ ద్వారా అతి తక్కువ సమయంలో మిలియన్లు సంపాదించిన రికార్డ్ సొంతం చేసుకొంది ఆ మధ్య.

అమందాకి అంతమంది పాఠకులున్నారు!

జాన్ లాకి అనే ఓ డిటెక్టివ్/క్రైమ్ రచయిత కేవలం 5 నెలల్లో మిలియన్ కాపీలమ్మిన రికార్డ్ సొంతం చేసుకున్నాడు.. అదే అమెజాన్ కిండిల్ బుక్స్ అమ్మకాల్లో!

జాన్ ప్రతి 3-4 నెలలకి ఓ క్రైమ్ నవల రాసి పబ్లిష్ చేస్తాడు!! ఇతను "న్యూయార్క్ టైమ్‌స్ బెస్ట్ సెల్లర్" రచయితగా కూడా లిస్టుల్లోకెక్కాడు.

ఇక హారీ పాటర్ రచయిత్రి జె కె రౌలింగ్ గురించి ప్రత్యేకంగానే ఒక బ్లాగ్ పోస్టేంటి.. పుస్తకమే రాయొచ్చు.

అలాగే, నాకు ఎంతో ఇష్టమయిన ప్రపంచస్థాయి రచయితల్లో పావ్‌లో కోయిల్యూ ఒకరు. ఒక రచయితగా ఇప్పటివరకు ఆయన క్రియేట్ చేసిన తన పుస్తకాల అమ్మకాల రికార్డ్‌ను బీట్ చేయటం బహుశా ఎవరివల్లా ఇప్పట్లో సాధ్యం కాదు!

పుస్తకాల సేల్స్, మిలియన్లలో ఆదాయం పక్కన పెడితే - ఈ రచయితలు ఏం రాస్తున్నారన్నది పక్కనపెడితే - ఈ రచయితలందరికీ ఉన్న సృజనాత్మక స్వతంత్రం, వీరు అనుసరిస్తున్న జీవనశైలి ఎంత అందమైంది! ఒక్క సారి ఊహించండి..

ఆ ఫ్రీడమ్, ఆ లైఫ్ స్టయిల్ ముందు ఈ సినిమాలు, రాజకీయాలు.. వీటిల్లోని మేనిప్యులేషన్స్, మాఫియా మెంటాలిటీలు అసలెందుకు పనికొస్తాయి?     

Monday, 28 April 2014

సురేశ్‌బాబు "ఓపెన్‌ హార్ట్"

టీవీ చూడ్డం అంటే - యాడ్స్ మధ్యలో వచ్చే ఏవో పనికిరాని "ఫిల్లర్స్"ని చూడ్డమని ఎక్కడో చదివాను. నా వ్యక్తిగత ఉద్దేశ్యం కూడా అదే.

ఏదో అతి ముఖ్యమైన ప్రోగ్రాం కానీ, న్యూస్ కానీ - అది కూడా నాకు పర్సనల్‌గా అవసరమైందీ, పనికొచ్చేదీ అయితే తప్ప.. సాధారణంగా నేను టీవీ చూడను. దీన్నొక గొప్ప విషయంగా నేను చెప్పడంలేదు. నాకలా అలవాటయింది అంతే.

అనుకోకుండా నిన్న రాత్రి ఎ బి ఎన్ ఆంధ్రజ్యోతిలో నిర్మాత డి సురేష్‌బాబు ఇంటర్వ్యూ చూశాను. అదీ, పూర్తిగా! నిజంగా, చాలావరకు, అదొక నో హిపోక్రసీ ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు.

కట్ టూ టాపిక్ - 

ఒక బిజినెస్‌మేన్ గా కన్నా, ఒక వ్యక్తిగా సురేష్‌బాబు మాట్లాడిన ఎన్నో మాటలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అంత రిచ్, కలర్‌ఫుల్ నేపథ్యం నుంచి వచ్చి.. బిజినెస్ గురించీ, జీవనశైలి గురించీ అంత సాధారణంగా ఆలోచించగలగటం, అలా ఉండగలగటం ఈరోజుల్లో నిజంగా అసాధ్యమైన పని.

ఎందుకిలా అంటున్నానంటే - ఫీల్డులో ఉండే అలవాట్లు, ఎట్రాక్షన్స్ అలాంటివి.

ఈ అలవాట్లు, ఎట్రాక్షన్లు.. చివరికి జీవితాన్ని బోల్తా కొట్టించడానికే టార్గెట్ చేస్తాయన్న విషయం బోల్తాపడ్డాకే  తెలుస్తుంది ఎవరికయినా!

ఇక ఫీల్డులో మోసాల విషయం సరే సరి. దానిగురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

కట్ టూ "మల్లీశ్వరి" కత్రినా - 

ఇది అన్నింటికంటే హైలైట్ విషయం ఇంటర్వ్యూ మొత్తంలో!

మల్లీశ్వరి చిత్రంలో హీరోయిన్‌గా చేయడానికి, మొదట 25 లక్షలకి అగ్రిమెంట్‌పై సంతకం చేసిన కత్రినా కైఫ్ - తర్వాత తన రేటుని అమాంతంగా పెంచేసి, 65 లక్షలిస్తే తప్ప చేయనందిట! అప్పటికి కత్రినాకు హిందీలో కూడా ఇంకా పేరు రాలేదు, డిమాండ్ అసలు లేదు అన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం.

ఆమె తప్ప ఇంక ఆ పాత్రకి వేరెవ్వరూ సరిపోరని సురేష్‌బాబు కూడా ఫిక్స్ అయిపోయాడు కాబట్టి - చివరికి కత్రినా అడిగిన 65 లక్షలు ఇవ్వక తప్పలేదు సురేష్‌బాబుకి.

దటీజ్ సినిమా..  

Friday, 25 April 2014

ముంబైలో కలిసిన వారణాసి అమ్మాయి!

నరేంద్ర మోదీ నిన్న వారణాసిలో నామినేషన్ వేసినప్పటి వార్తలు చూస్తుంటే, నాకు మొట్టమొదట గుర్తుకొచ్చింది వేరే. అది పూర్తిగా రాజకీయాలతో సంబంధం లేని విషయం.

మోదీ వారణాసిలో ఎలాగూ గెలుస్తాడు. ఆ విషయం వదిలేద్దాం.

కట్ టూ టాపిక్ -    

ముంబై జూహూలోని "సీ సైడ్" హోటల్లో నన్ను కలిసిన ఒక అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి పేరు విదిశ. నా రెండో చిత్రం "అలా" కాస్టింగ్ గురించి వెళ్లినప్పుడు ఆడిషన్ కోసం వచ్చిన ఎందరో ఔత్సాహిక హీరోయిన్లలో విదిశ చిట్టచివరగా వచ్చింది. విచిత్రంగా - హీరోయిన్‌గా చివరికి తనే సెలెక్టయ్యింది.

విదిశ వారణాసిలో పుట్టిపెరిగిన అమ్మాయి. "మిస్ వారణాసి" కూడా. వాళ్ల నాన్న వినయ్ శ్రీవాస్తవ ఒక రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్. ఆయనతో నాకు భలే ఫ్రెండ్‌షిప్ ఉండేది. అప్పుడప్పుడూ నా మీద ఏదో డౌట్ కూడా ఉండేది!

"అలా"లో నేను పరిచయం చేసిన విదిశ శ్రీవాస్తవ - తర్వాత చాలా తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది.
ఇ వి వి "అత్తిలి సత్తిబాబు ఎల్ కె జి", "మా ఇద్దరి మధ్యలో", ఇటీవలి శ్రీకాంత్ చిత్రం "దేవరాయ" మొదలైనవి విదిశ తెలుగులో చేసిన కొన్ని చిత్రాలు.

కట్ టూ లేటెస్ట్ హాట్ ఫేవరేట్ - 

రామ్‌గోపాల్ వర్మ "రౌడీ"లో విష్ణు సరసన హీరోయిన్‌గా చేసి, మరో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కళ్లల్లో పడిన "శాన్వి" విదిశ సొంత చెల్లెలు.

విదిశ చెల్లెలుగా శాన్వి నాకు ముందునుంచే తెలుసు. అప్పుడు చాలా చిన్నది. హీరోయిన్ అవుతుందనుకోలేదు. అయ్యింది. చెప్పలేం.. నిజంగానే పూరి చిత్రంలో తనకు అవకాశం వస్తే మాత్రం - టాలీవుడ్‌లో శాన్వి ఒక హాట్ ఫేవరేట్ హీరోయిన్ అయితీరుతుంది.