Wednesday, 30 October 2024

వీలైతే అప్రిషియేట్ చేద్దాం!


కూలిపని చేసి చదివించిన తన అమ్మ గురించి కిరణ్ అబ్బవరం ఎమోషనల్‌గా చెప్తోంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. కావాలని చేసే శాడిస్టిక్ ట్రోల్స్ అతన్ని ఎంత బాధపెట్టకపోతే అంత బాహాటంగా బరస్ట్ అవుతాడు? 

మనుషులెందుకంత రాక్షసంగా మారుతున్నారు? 

ఇవ్వాళ ఉదయం అనుకోకుండా "క" ప్రి-రిలీజ్‌లో హీరో కిరణ్ అబ్బవరం స్పీచ్ చూశాను. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేవరకూ నన్ను అదే వీడియో వెంటాడింది. 

కూలిపని చేసే తల్లి కుటుంబం నుంచి వచ్చినవాళ్ళు హీరోలు కాకూడదా? సొంత కష్టంతో ఎదగకూడదా? 

అతను ఎదిగితే ఎవరికి అడ్డం? ఎవరికి నష్టం? ఈ డిజిటల్ యుగంలో కూడా ఇలాంటి చెత్త ఆలోచనలేనా? ఏం సాధిస్తారు? 

ఒకర్ని తొక్కడం ద్వారా పైకొచ్చే రోజులు పోయాయి. 

ఇప్పుడు ఎవరూ ఎవరికి పోటీ కాదు. ఎవరూ ఎవర్ని అడ్డుకోలేరు. సత్తా ఉన్నవాడు ఎవడైనా ఎదుగుతాడు. పైకొస్తాడు. తనదంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటాడు. 

పి ఆర్ ఒక్కదానితోనే పైకొస్తారనుకొంటే ఇప్పటికి ఎంతోమంది ప్రముఖుల పిల్లలు సక్సెస్ సాధించేవాళ్ళు. 

సక్సెస్‌కు పి ఆర్ ఒక్కటే సరిపోదు. ఇంకా చాలా కావాలి. 

ఓకే, పి ఆర్ తోనే పాపులర్ అయ్యాడనుకుందాం... తప్పేంటి? సెల్ఫ్ మార్కెటింగ్ లేకుండా ఏ ప్రొఫెషన్ ఉంది? మంచి పి ఆర్ మెయింటేన్ చేస్తూ ఉండటమనేది ఒక అదనపు అసెట్ ఎవరికైనా. 

అయితే, అల్టిమేట్‌గా ప్రేక్షకులు ఆదరించేది మాత్రం వారికి బాగా నచ్చిన కంటెంట్‌నే.  

కట్ చేస్తే - 

ఎలాంటి సినిమా నేపథ్యం లేని ఒక కొత్త హీరో, నాలుగేళ్ళలో 8 సినిమాల్లో నటించడం గొప్పవిషయమే. ఆ ఎనిమిది సినిమాల్లో 4 సక్సెస్ అంటే మరింత గొప్ప విషయం. 

ఆ ఫ్యాన్ ఫాలోయింగ్, ఆ క్రేజ్... నిజంగా అందరికీ అంత ఈజీ కాదు. ఊరికే రాదు. 

వీలైతే అప్రిషియేట్ చేద్దాం. పోయేదేముంది, మరింత ఉత్సాహంతో మరింత మంచి కంటెంట్ ఉన్న సినిమాల కోసం కష్టపడతాడని చెప్తూ... రేపు విడుదలవుతున్న కిరణ్ అబ్బవరం "క" మంచి సక్సెస్ సాధించాలని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా "క" చిత్ర దర్శకులు సుజిత్-సందీప్‌లకు, వారి టీమ్‌కు నా బెస్ట్ విషెస్.  

Kiran bro, no need to waste your time on those sadistic trollers—they are who they are. Just be yourself, keep enjoying your heroic journey, and keep rocking. Wishing you all the success for "KA" tomorrow! You’re going to crush it, I know it! 

- మనోహర్ చిమ్మని  

Tuesday, 29 October 2024

ఫిలిం ఓపెనింగ్ చెయ్యాలా?


నాకు ఫిలిం ఓపెనింగ్ వంటి కార్యక్రమాలు అసలు ఇష్టం ఉండదు. కాని, కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో, కొందరి కోసం చెయ్యాల్సివచ్చినప్పుడు తప్పదు. నిన్న జరిగిన నా తాజా సినిమా ఓపెనింగ్ కార్యక్రమం అలాంటిదే. 

కట్ చేస్తే - 

ఓపెనింగ్ కార్యక్రమమైనా, ఇంకే కార్యక్రమమైనా చుట్టూవున్నవాళ్ళ అంచనాలు, ఊహలమేరకు చెయ్యడానికి ఎప్పుడూ ప్రయత్నించవద్దు. వాళ్ళెవ్వరూ మనకు, మన పనికి ఉపయోగపడరు. పైగా ఎప్పుడూ నాలుగు రాళ్ళేయడానికి రెడీగా ఉంటారు. 

మనకేది ఇష్టమో, మనకేది వర్కవుట్ అవుతుందో అది మాత్రమే చెయ్యాలి. మనం దేనివల్ల సంతోషపడతామో, దేనివల్ల మరింత ఉత్సాహంగా పనిచేస్తామో, దేనివల్ల మరింత శక్తివంతంగా ఫీలవుతామో అదే చెయ్యాలి. 

నిన్న జరిగిన మా ఓపెనింగ్ కారయక్రమం కోసం ముందు పొలిటీషన్స్, బిగ్ స్టార్స్, బిగ్ డైరెక్టర్స్ గెస్టులుగా చెయ్యాలని ప్లాను. ముందు పొలిటీషన్స్ కొట్టిపడేశాను. వీళ్ళతో నానా టెన్షన్. ఎదురుచూడాలి, వాళ్ళ వెనుక ఆ మందీ మార్బలం భరించాలి. నో అనుకున్నాను.  

తర్వాత స్టార్స్, స్టార్ డైరెక్టర్స్ కూడా వద్దనుకున్నాను. వాళ్ళను రప్పించడం కోసం, వస్తాను అని వాళ్ళు ఒప్పుకోవడం కోసం, ఇష్టం లేకుండా చాలా కష్టపడాలి. లాస్ట్ మినట్‌లో వీళ్ళు ఏదో కారణం చేత, ఈవెంట్‌కు రాకుండా మిస్ అయ్యే ప్రమాదమే ఎక్కువ. కొట్టేశాను. అవసరం లేదు అనుకున్నాను. 

కట్ చేస్తే - 

మా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ గారిని ముఖ్య అతిథిగా పిలిచాను. దర్శక మిత్రులు బాబ్జీ, చంద్రమహేశ్, ప్రియదర్శిని లను అతిథులుగా పిలిచాను. మన కోసం కొంత సమయం సంతోషంగా కెటాయించగలిగే మనవాళ్ళను పిల్చుకోవడంలో ఉన్న ఆనందం వేరు.   

ఈవెంట్ కూల్‌గా, ఎలాంటి టెన్షన్ లేకుండా బాగా జరిగింది. పాజిటివ్ ఆరా కమ్మేసింది. దీనికి మా ఇతర మిత్రులు, శ్రేయోభిలాషుల అభిమానం తోడయ్యింది. 

ఇంకేం కావాలి? 

సినిమా బాగా చెయ్యాలి. అనుకున్న స్థాయి విజం సాధించాలి. అదొక్కటే ఇప్పుడు మా టీమ్ లక్ష్యం.  

- మనోహర్ చిమ్మని 

Saturday, 26 October 2024

మనోభావాలు అందరికీ ఉంటాయి!


భాష గురించి పక్కన పెడదాం. దాన్ని ఎవ్వరూ ఒప్పుకోరు. నేనూ ఒప్పుకోను. గొడవంతా మనోభావాల దగ్గరే. 

కట్ చేస్తే - 

ఈ సోకాల్డ్ గ్రేట్ క్రిటిక్స్ రివ్యూల వల్ల ప్రతి శుక్రవారం ఎంతమంది మనోభావాలు దెబ్బ తినటం లేదు? 

దాదాపు ప్రతి ఫిలిం ప్రెస్ మీట్లో ఎంతమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్ల మనోభావాలు దెబ్బతినటం లేదు?  

అది బాగా లేదు, ఇది బాగా లేదు. ఫస్టాఫ్ ఓకే, సెకండాఫ్ సాగింది. డైరెక్టర్ గ్రిప్పు కోల్పోయాడు. స్క్రిప్టు బాగాలేదు. అసలు ఇంకో పది నిమిషాలు ఎడిట్ చెయ్యొచ్చు. అన్నీ బాగున్నాయి, ఒక్క డైరెక్షనే చెత్తగా ఉంది... ఇలా అబ్బో ఏం రాస్తారో! 

జేమ్స్ కామెరన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్‌లకు కూడా స్క్రిప్ట్ రైటింగ్, ఫిలిం మేకింగ్ నేర్పగల నిష్ణాతులు వీళ్ళు!! 

ఇన్ని తెలిసిన ఈ గ్రేట్ రివ్యూయర్స్ అందరూ ఒక్క సినిమా ఎందుకని తీసి, సక్సెస్ చేసి చూపించకూడదు? హీరోలు, హీరోయిన్స్, ప్రొడ్యూసర్స్ అందరూ వాళ్లందరికీ బాగా పరిచయమే కదా? వాళ్ల దృష్టిలో 5/5 పాయింట్స్ వచ్చే కథతో, అదిరిపోయే స్క్రిప్టు రాసుకొని హీరోల డేట్స్ తీసుకోవచ్చుకదా?

సినిమా ఎలా తీయాలో వీళ్ళందరికీ చాలా బాగా తెలుసు కదా? మరింకేం, తీసి... హిట్స్ మీద హిట్స్ కొట్టి కోట్లు సంపాదించొచ్చు కదా?

ఎందుకని ఆ పనిచేయరు? 

ఎంతసేపూ వారం వారం రివ్యూల పేరుతో ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఆర్టిస్టులు, టెక్నీషియన్ల కష్టానికి పాయింట్స్ వేసి, వారి మనోభావాలు దెబ్బతీయడమేనా పని? అందులో అంత ఆనందం ఏముంటుంది? 

సినిమా తీసేవాడు తీస్తుంటాడు. చూసేవాడు చూస్తుంటాడు. బాగుంటే బాగుందంటాడు. బాగా లేకపోతే చెత్త సినిమా అంటాడు. ఆ ఫ్రీడం ప్రేక్షకులకు ఎప్పుడూ ఉంటుంది. కాని మధ్యలో వీళ్ళెవ్వరు? 

ఒక వ్యక్తి రాసే రివ్యూ అతని వ్యక్తిగత అభిప్రాయం కాదా? దాన్నే ప్రామాణికంగా చెప్తూ 3/5, 2.5/5, 2/5, 1/5... అని ఆ రేటింగులేంటి అసలు? ఏమన్నా అర్థముందా?   

సినిమా తీసేవాడు కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాడు. సినిమా రిజల్టుని బట్టి కోట్లు సంపాదిస్తున్నాడు, లేదా కోట్లు పోగొట్టుకుంటున్నాడు.

దురదృష్టవశాత్తూ, వీళ్ల రివ్యూల వల్ల కోట్లు పోగొట్టుకున్నవాడి కోట్లలోనే వాడి ప్రమోషన్ బడ్జెట్ కూడా ఉంది. పీఆర్వో బడ్జెట్ కూడా ఉంది. కవర్లు కూడా ఉన్నాయి. వాడి మనోభావాలు ఎంత దెబ్బతినాలి వీళ్ల సోకాల్డ్ రివ్యూలకు?  

- మనోహర్ చిమ్మని    

Thursday, 24 October 2024

క్రియేటివిటీలో నిర్ణయాలు శాశ్వతం కాదు


క్రియేటివిటీలో నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి... 

కట్ చేస్తే -

అప్పుడప్పుడూ అనుకుంటుంటాను. మా టీమ్‌లో కొందరితో చెప్తుంటాను కూడా. "ఒకటో రెండో సినిమాలు హాయిగా ఎంజాయ్ చేస్తూ చేస్తాను. ఇంక తర్వాత సినిమాలు చేయను" అని. 

కాని, ఇప్పుడు మళ్ళీ నా మనసు మార్చుకొన్నాను.

ఇప్పటికే సినిమాలు చాలా మిస్ అయ్యాను. చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు నాకెలాంటి బాదర బందీల్లేవు. ఉద్యోగాలు సద్యోగాల్లేవు. పూర్తిగా ఫ్రీ. అసలెందుకని ఇప్పుడు నేను ఒకటి, రెండు సినిమాలతోనే సినిమాలకు గుడ్ బై చెప్పాలి? ఆ అవసరం లేదు కదా?  

రెండు మూడు పడవల మీద కాళ్ళున్నప్పుడే బాజాప్త, హాయిగా సినిమాలు చేయగలిగాను. ఇప్పుడు పూర్తిగా ఫ్రీ అయిపోయాక ఎందుకని ఫీల్డుని వదిలెయ్యాలి? అర్థంలేని డెసిషన్ కదా? 

సో, సినిమాల్ని ఇప్పుడప్పుడే నేను వదిలెయ్యటం లేదు. వదిలెయ్యాలన్న నా అర్థం లేని ఆలోచనను పూర్తిగా వదిలేస్తున్నాను. 

- మనోహర్ చిమ్మని 

Sunday, 20 October 2024

తెలుగు ఫిలిం జర్నలిజంలో అసలేం జరుగుతోంది?


దయచేసి ముందు ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి:
https://youtu.be/W-2jUnmY22Q?si=3UdQ1J3Sno9lIFem 

కట్ చేస్తే - 

మొత్తం ఆమే చెబుతోంది... సోకాల్డ్ మహిళా-జర్నలిస్టు:

> తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావడానికి భయపడతారట. దానికి ఫస్ట్ రీజన్ "కాస్టింగ్ కౌచ్"ట. 
(ఈవిడకు ఎలా తెలుసు?)   
> చెప్పినా చెప్పకపోయినా అది వాస్తవం ట. 
(ఈమే డిసైడ్ చేసేస్తోంది!)  
> ఫిలిం ఫీల్డులో ఒక హీరోయిన్‌కు, ఆర్టిస్టుకి చాన్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ కమిట్మెంటే అడుగుతారట. 
(అంత ష్యూర్‌గా ఈమెకెలా తెలుసు? పూర్వాశ్రమంలో నటిగా తనకు అలాంటి అనుభవాలున్నాయా?) 
> సైన్ చేసే అగ్రిమెంట్‌లో కూడా కమిట్మెంట్ అని ఉంటుందట. 
(అలాంటి ఒక్క అగ్రిమెంట్ చూపించమనండి. ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయం చాలా సీరియస్‌గా తీసుకోవాలి.)
> కమిట్మెంట్ ఇస్తే ఒక "రేటు" అట, ఇవ్వకపోతే ఒక రేటు అట. 
(అసలా భాష ఏంటి, ఒక బాధ్యతాయుతమైన జర్నలిస్టు భాషేనా అది? ఈమె ఎక్కడనుంచి వచ్చింది, ఎక్కడి భాష?)   

ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఒక హీరోయిన్‌ను పట్టుకొని, జుగుప్సాకరమైన భాషలో, ఇలాంటి పనికిమాలిన ప్రశ్నలు అడగటమేనా ఫిలిం జర్నలిజం? 

ఆమధ్య ఒక హీరోయిన్‌ను "ఒక్క విషయం చెప్పండి... మీరు డైవోర్స్ తీసుకున్నారా లేదా?" అని హింసించాడొక సో కాల్డ్ జర్నలిస్టు. ఇంగిత జ్ఞానం ఉన్న ప్రశ్నేనా అది? 

థియేటర్ దగ్గర పెద్ద కటౌట్ పెట్టుకున్నాడని, ఒక కొత్త హీరోని పట్టుకుని, "అసలు నీకు అంత కటౌట్ అవసరమా?" అని అడిగాడింకో జర్నలిస్టు. ఇదే ప్రశ్నను అల్లు అర్జున్ తొలి సినిమా ప్రెస్ మీట్ అప్పుడు అడిగాడా సదరు జర్నలిస్టు?    

తెలుగు ఫిలిం జర్నలిజంలో అంతకు ముందు ఇలా లేదు. ఈమధ్యే ఎక్కువైపోయింది. చిన్న సినిమాలవాళ్ళను, చిన్న స్థాయి హీరోయిన్స్‌ను, హీరోలను ఆడుకుంటున్నారు. ఇలాంటి కొశ్చన్సే పెద్ద హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు కూర్చున్న (పెద్ద సినిమాల) ప్రమోషన్ ప్రెస్ మీట్స్‌లో అడిగే దమ్ముందా ఇదే జర్నలిస్టులకి? 

ప్రభు, వినాయకరావు, బాల్‌రెడ్డి, ధీరజ్ అప్పాజీ, ఓంప్రకాశ్ నారాయణ్ వంటి సీనియర్ ఫిలిం జర్నలిస్టు మిత్రులెందరో నాకు వ్యక్తిగతంగా తెలుసు. వారి స్థాయి వేరు. వారి నోటి నుంచి నేనెప్పుడూ ఇలాంటి భాష, ఇలాంటి ప్రశ్నలు వినలేదు. 

పైన చెప్పిన ఉదాహరణల్లో లాంటి జర్నలిస్టుల వల్ల మొత్తం తెలుగు ఫిలిం జర్నలిజానికే చెడ్డ పేరొస్తోంది. పక్కనే కూర్చొని ఇలాంటి చెత్తను మౌనంగా ఎంజాయ్ చేస్తున్న సీనియర్ జర్నలిస్టు మిత్రులు ఈ విషయం గురించి కొంచెం ఆలోచించాల్సిందిగా నా హంబుల్ రిక్వెస్టు. 

నిజంగా... ఇక ఫిలిం ప్రెస్ మీట్స్ అన్నీ... ఇలాగే... ఇంత చెత్త స్థాయిలోనే కొనసాగుతాయి అనుకుంటే... ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టకపోవడమే మంచిది. 

వీటివల్ల సినిమాలకు ఎలాంటి మేలు జరగదు. 

వాళ్లకిచ్చే డబ్బులు దండగ. మన విలువైన సమయం వృధా. అనవసరంగా మనసు పాడుచేసుకోవడమవుతుంది. 

సోషల్ మీడియా ప్రమోషన్ బాగా చేసుకుంటే చాలు. సినిమాలో ఏమాత్రం సత్తా ఉన్నా మౌత్ టాక్ కూడా దానికి సహకరిస్తుంది. మనం ఆశించే రిజల్ట్ అదే వస్తుంది. 

కట్ చేస్తే -

మొన్నొక మహిళా మంత్రి మీడియా ముందు మాట్లాడిన మాటల కంటే, ఈ మహిళా జర్నలిస్టు మాట్లాడిన మాటలు, వేసిన ప్రశ్నలు ఏం తక్కువ కాదు. చెప్పాలంటే ఇంకా ఎక్కువే.

ఇంత చెత్తను నవ్వుతూ భరించి, గట్టిగా మొహం మీద గుద్దినట్టు జవాబిచ్చిన అనన్య నాగళ్ళకు అభినందనలు. హాట్సాఫ్. 

- మనోహర్ చిమ్మని    

Saturday, 19 October 2024

సరైన ప్రమోషన్, సరైన రిలీజ్ లేకపోతే...


ఒక సినిమా విజయంలో ప్రమోషన్ పాత్ర చాలా ఉంటుంది. చెప్పాలంటే ఎన్నో చెత్త సినిమాలు జస్ట్ కరెక్ట్ ప్రమోషన్ ద్వారా బిజినెస్ చేసుకున్నాయి. భారీగా లాభాలు పొందాయి. 

కట్ చేస్తే - 

ప్రతి నిర్మాత, దర్శకుడు వారి సినిమా హిట్ కావాలనే తీస్తారు. 5 నుంచి 10 శాతం వరకు మాత్రమే ఈ విషయంలో సక్సెస్ అవుతారు. మిగిలిన 90 శాతం మంది సక్సెస్ కాలేరు. అలాగని ఈ 90 శాతం సినిమాలు చెత్త సినిమాలని కాదు. చాలా సినిమాలు మేకర్స్ మాత్రం చివర్లో ప్రమోషన్ విషయంలోనే ఫెయిలవుతారు. చేతులెత్తేస్తారు. 

మంచి సినిమాలు కూడా సరైన ప్రమోషన్, సరైన రిలీజ్ లేకపోతే అనుకున్న ఫలితాన్నివ్వవు. 

ఒక సినిమా భారీగా హిట్ అవ్వడానికి ఒక్కోసారి ఆ సినిమాలోని ఒక 'కీ సీన్', ఒక పాట, ఒక డైలాగ్ కూడా 'బటర్‌ఫ్లయి ఎఫెక్టు'ని ఇవ్వొచ్చు. 

అలా బటర్‌ఫ్లై ఎఫెక్టు తెచ్చుకొని, బ్లాక్‌బస్టర్ హిట్ చేసుకోవాలంటే ... ముందు మనం ప్లాన్ చెయ్యాల్సింది భారీ ప్రమోషన్. 

-మనోహర్ చిమ్మని   

Friday, 18 October 2024

మనోహరమ్, ఈ-బులెటిన్!


ఇదొక కొత్త ప్రయత్నం...

మా సొంత డిజిటల్ బులెటిన్. 

కొద్దిరోజుల్లో నా కొత్త సినిమా ప్రాజెక్టు ప్రారంభమవుతున్న నేపథ్యంలో, ప్రమోషన్ వైపు ప్రత్యేకంగా ఒక వింగ్ ఏర్పాటు చేసుకున్నాము. మా టీంలో ఒకరిద్దరు ఈవైపు కూడా పనిచేస్తారు. 

కట్ చేస్తే -

నా బ్లాగులో రాసుకుంటున్న కొన్ని సెలక్టివ్ పోస్టులు ఈ ఈ-బులెటిన్లో వస్తాయి. బులెటిన్ కోసం కూడా కొత్తగా రాస్తాను. 

మా సినిమాలకు సంబంధించిన న్యూస్ అప్‌డేట్స్, వర్కింగ్ స్టిల్స్ వంటివి దీన్లో తరచూ ఉంటాయి. ఇంకొన్ని ఆలోచనలున్నాయి. అవన్నీ మీరు ముందు ముందు చూస్తారు.

A director's brand is their signature—build it strong, and your name will speak louder than any script. 

Also... Every blockbuster film needs a powerful voice—promote like your story depends on it, because it does. 

- మనోహర్ చిమ్మని
 
***

#Yo #YoTeam #Manoharam #ManoharChimmani 

Friday, 11 October 2024

"...ఇజమ్" ప్రేమికులు తెలుసుకోవాల్సిన నిజం!


తమ ఆదాయంలో సుమారు 65% డబ్బు, అంటే మొత్తం ఒక 102 బిలియన్ డాలర్స్‌ను చారిటీ కోసం వెచ్చించిన రతన్ టాటాను కూడా విమర్శించే 'పనికిమాలిన బ్యాచ్' పోస్టులను ఫేస్‌బుక్‌లో చూసి కంపరం పుడుతోంది. 

వీళ్ళంతా 'మేధావులు', 'మేధో జర్నలిస్టులు'... అని వీళ్ళకి వీళ్ళే అనుకుంటారు. 

వీళ్ళ లెక్క ప్రకారం, రతన్ టాటా లాంటివాళ్ళు బాగా సంపాదించి, ఇలాంటి పనిదొంగలకు అన్నీ పుక్యానికి ఇవ్వాలి. అప్పుడే టాటా కాని, ఇంకో ఇండస్ట్రియలిస్టు గాని మంచోళ్ళయిపోతారు. 

కట్ చేస్తే -

కమ్యూనిజం నామరూపాల్లేకుండా పోయి చాలా కాలమైంది. 

అదొక ఫెయిల్యూర్ యుటోపియా. 

తూర్పు యూరోప్ దేశాలు కమ్యూనిజం నేపథ్యంలో పూర్తిగా కొలాప్స్ అయి, చివరికి కేపిటలిస్టిక్ డెమోక్రసీనే సరైందని తెలుసుకున్నాయి. సోషలిస్టు అగ్రరాజ్యంగా ఒక ఊపు ఊపిన సోవియట్ యూనియన్ కూడా ముక్కలవక తప్పలేదు.

ప్రపంచపటం మీద ఇప్పుడు మిగిలి ఉన్న ఒకే ఒక్క చెప్పుకోదగ్గ అత్యంత శక్తివంతమైన కమ్యూనిస్టు దేశం చైనాలో కూడా ఇప్పుడు దాదాపు 3 వేల కోట్ల యు యస్ డాలర్ల వ్యక్తిగత సంపద ఉన్న జాక్ మా లాంటి బిలియనేర్లు ఎందరో పుట్టుకొస్తున్నారు.  

చైనా కాకుండా... క్యూబా, లావోస్, వియత్నాం, ఉత్తర కొరియా తప్ప ప్రపంచపటం మీద కమ్యూనిస్టు పాలన ఆనవాళ్లెక్కడున్నాయి? 

అవి కూడా క్రమక్రమంగా లిబరలైజ్ కావడం లేదా? 

'ఇలా ఉండాలి... అలా ఉండాలి' అని నాలుగు గోడల మధ్య కూర్చొని రాసే రాతలతో ప్రపంచదేశాలు ప్రగతిపథంవైపు వెళ్ళవు. 

ప్రఖ్యాత రచయిత్రి ఐన్ రాండ్ కూడా అప్పటి రష్యా నుంచి పారిపోయి అమెరికా వెళ్ళింది. ఇంగ్లిష్ నేర్చుకొంది. హాలీవుడ్‌లో స్క్రీన్ రైటర్‌గా పనిచేసింది. తర్వాతనే ఫౌంటేన్ హెడ్. అట్లాస్ ష్రగ్గ్‌డ్ లాంటి సెన్సేషనల్ నవలలు రాసింది. ఆబ్జెక్టివిజం అనే కొత్త ఫిలాసఫీ సృష్టించింది. 

ముందు ఇలాంటి చిన్న చిన్న సాధారణ వాస్తవాలను తెలుసుకోవాలి. అయినాసరే, మేమింతే అనుకుంటే, ముందు మీ కుటుంబంలో ఉన్న నలుగురినైనా మీ బాటలో నడపడానికి ప్రయత్నించండి. రతన్ టాటా లాంటివాళ్ళను విమర్శించగలిగే కనీస హక్కు మీకు అప్పుడొస్తుంది.   

- మనోహర్ చిమ్మని

Thursday, 10 October 2024

మాతృభాషను ఎలా మర్చిపోతాం?


సోషల్ మీడియా కోసం తెలుగులో రాయడం/టైప్ చెయ్యడం అంత కష్టం కాదు. వీలైనంతవరకు సోషల్ మీడియాలో ఎక్కువగా తెలుగే రాయాలి. మనకు చేతనైనంతలో మన తెలుగును మనం బ్రతికించుకోవాలి.  

తెలుగురానివాళ్ళు కూడా మన సోషల్ మీడియా మిత్రుల్లో, ఫాలోవర్స్‌లో ఉంటారు. వారి కోసం ఒక 30% వరకు కొన్ని పోస్టులకు ఇంగ్లిష్ తప్పదు. అయితే, ఒక్కోసారి ఏ పోస్ట్ ఎవరికోసం పెడుతున్నాం అన్న ఫిల్టర్ మర్చిపోయి అంతా ఇంగ్లిష్‌లోనే రాస్తూపోతాం. 

సోషల్ మీడియాలో పోస్ట్ చేసేముందు, ఇప్పుడు నేను ఈ ఫిల్టర్ వేసుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. 

నా తెలుగులో అక్కడక్కడా ఇంగ్లిష్ పదాలు కూడా కొన్ని వస్తుంటాయి. వీలైనంతవరకు అది కూడా తగ్గించుకొనే ప్రయత్నంలో ఉన్నాను. కాని, అసలు తెలుగులో రాయకుండా ఉండటం కంటే కొంతవరకు ఇది మంచిది కదా! (మామూలుగా అయితే "ఇది బెటర్ కదా" అని రాసేవాణ్ణి!)  

కట్ చేస్తే - 

మీరు గమనించారా... ఎక్స్ లో కమలహాసన్, అమితాబ్ బచ్చన్ లాంటివాళ్ళు వారి వారి మాతృభాషల్లోనే ఎక్కువగా పోస్ట్ చేస్తుంటారు. 

అదీ మాతృభాష మీద ప్రేమంటే. 

- మనోహర్ చిమ్మని 

Tuesday, 8 October 2024

కొత్త బిజినెస్ వెంచర్ షురూ...


సుమారు 9 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఒక సినిమా ప్రాజెక్టు ప్రారంభించాను. 

అప్పుడు ఇప్పుడు అనుకుంటూ చివరికి నిన్న మా ఇన్వెస్టర్స్ వెన్యూకి డబ్బులు కట్టడంతో నిర్ణయం సంపూర్ణమైంది. 

షూటింగ్ కూడా అతి తక్కువ సమయంలో పూర్తిచేసి, ఫైనల్ కాపీ తీసుకురాబోతున్నాను. అనుకున్నట్టుగా బిజినెస్ చేసి, రిలీజ్ కూడా త్వరగా చేయాలనుకుంటున్నాను. సమ్మర్ రిలీజ్ హంగామాలో ఈ ప్రాజెక్టు కూడా ఉండొచ్చు.

కట్ చేస్తే -

సరిగ్గా మధ్యలో 9 రోజులుంది. బతుకమ్మ పండుగ, దసరా కూడా ఈ మధ్యలోనే ఉన్నాయి. ఈ హడావిడిలోనే గెస్టులను అనుకొని, ఆహ్వానించడం జరగాల్సి ఉంది. ఇంకా చాలా ఉన్నాయి పనులు. 

అదేంటో గాని, సినిమా నిజంగా ప్రారంభం అవుతోంది అంటే చాలు... అన్ని పనులూ అవే చకచకా అయిపోతుంటాయి. అవ్వాలి కూడా. 

అసలు ఆ కిక్కే వేరు! 

- మనోహర్ చిమ్మని  

Wednesday, 2 October 2024

మనం మర్చిపోలేనివి కొన్నుంటాయి...


మీ అమానాన్నలు ఇంకా మీ కళ్ళముందున్నారా? 

అయితే మీరు అదృష్టవంతులు. 

ఇప్పుడు మీరు ఎంత బిజీగా ఉన్నా సరే, ప్రతిరోజూ కొంచెం ఎక్కువ సమయం మీ తల్లిదండ్రులతో గడపండి.  

తర్వాత ఏదో ఒకరోజు మీరు నాకు థాంక్స్ చెబుతారు. 

కట్ చేస్తే -

ఇవ్వాళ పితృ అమావాస్య. వరంగల్లో నా చిన్నతనం నుంచీ "పెత్రమావాస"గా ఈరోజు గురించి నాకు బాగా తెలుసు. తల్లిదండ్రులకు బియ్యం ఇచ్చేరోజు. 

ఇప్పుడే గుడికెళ్ళి, మా తల్లిదండ్రులకు బియ్యం ఇచ్చే కార్యక్రమం పూర్తిచేసి వచ్చాను. 

మా వరంగల్, మా ఉర్సు-ప్రతాప్ నగర్, మా 14 దర్వాజాల పెద్ద ఇల్లు, మా అమ్మ-నాన్నలు నాకు పంచిన ప్రేమ... నేనెలా మర్చిపోగలను? 

మా అమ్మ, నాన్న ఇద్దరు గుర్తుకొస్తున్నారు. కళ్ళల్లోంచి నీళ్ళు అదేపనిగా వస్తున్నాయి. 

నిశ్శబ్ద దుఖం. 

వారి చివరిరోజుల్లో వారికి దగ్గరగా ఉండలేకపోయాను. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేని బాధ. కాని, జరిగింది మార్చలేను కదా... 

- మనోహర్ చిమ్మని