సినిమా ఫీల్డు ఎసొంటిది అంటే... ఎప్పటికప్పుడు మస్త్ డైనమిక్‌గ, దూకుడుగ ఉన్నోనికి ఇక్కడ ఏదో ఒక చాన్స్ దొరికే చాన్సుంటది. "వెయిట్ అండ్ సీ" అన్న ధోరణిల ఎప్పుడూ మన్ను తిన్న పాములెక్క నాలుగ్గోడల మధ్య ఉండెటోనికి ఏ చాన్సు రాదు. జన్మల రప్పిచ్చుకోలేడు.
కట్ చేస్తే -
మన డైరెక్టర్ "మిస్టర్ డి" కి మంచి టాలెంటున్నది. మంచి డైనమిక్. మంచి నెట్వర్క్ గుడ ఉన్నది.
మరేంది ప్రాబ్లం?
గదే ప్రాబ్లం.
"మిస్టర్ డి" కి ఉన్న నెట్వర్క్‌ల ప్రతివాడు ఫోజులు కొట్టెటోడే. నోటికచ్చిన అబద్ధాలాడెటోదే. జస్ట్ ఫేక్‌గాళ్లన్నమాట!
"ఇగ రేపే నేను ఇన్వెస్టర్ని రప్పిస్తున్న. కూసొని మాట్లాడుకోండ్రి. మధ్యలుండి నేనే డీల్ ఓకే చేయిస్తా. ఎల్లుండి ఓపెనింగ్. ఆవలెల్లుండి నుంచి షూటింగ్!" ఇగో గిట్లుంటై వాళ్ళ మాటలు.
గసొంటి సొల్లుగాడే ఇప్పుడు ఇంకొకడు వస్తున్నడు. గాయినె కోసం ఎదురుసూసుకుంట బోయిన్‌పల్లిలోని స్వీట్ హార్ట్ హోటల్ల కూసున్నడు "మిస్టర్ డి".
ఇప్పుడు వచ్చెటోనికి గుడ రొండు కంపెనీలున్నై. యాడాదికి కోట్లల్ల టర్నోవరున్నది. ఇసొంటోడు టైమ్ వేస్ట్ చేస్కొని ఇక్కడిదాకా రాడుగదా అన్నది మన డైరెక్టర్ లాజిక్.
వీడు సొక్కమే అయ్యుంటడని మనోని దురాశ.
వచ్చిండు, కూసున్నడు. మటన్ బిర్యాని, రొండు థమ్సప్‌లు ఆర్డరిచ్చిండు.
ఒకప్పుడు మటన్ బిర్యానీ, థమ్సప్ కాంబినేషన్ అంటె మస్త్ ఎంజాయ్ చేసెటోడు మన డి. ఇప్పుడు మనోని ధ్యాసంత ఎదురుంగ కూసున్న ఇన్వెస్టర్ ఫ్రెండ్ మీదనే ఉన్నది... ఏం జేస్తడా అని.
"సూడన్న... నువ్వు మస్త్ టాలెంటెడ్. గదాంట్ల గింత గుడ డౌట్ లేదు. ఎవ్వడన్న డౌట్ ఉన్నదంటె రమ్మను. నేను వాని గు*ల తంత. నువ్వు రమ్మను" అన్నడు ఇన్వెస్టర్ ఫ్రెండు.
"గిప్పుడు గదంత ఎందుకు లేవే... ముందుగాల మనం మన గీ డీల్ మాట్లాడుదం అన్నా" అన్నడు మన డైరెక్టర్.
"నీ గురించి బాగా తెల్సినోన్ని నేను. మన జిల్లాకు ఫస్ట్ నంది అవార్డు తెచ్చినోనివి నువ్వు. నీ టాలెంట్ నాకు తెల్సు. గందికే నేనే పిల్చిన కద నిన్ను... నువ్వు పిల్చినవా గిక్కడ స్వీట్ హార్ట్‌ల బిర్యాని తినుకుంట మాట్లాడుకుందం, డీల్ చేస్కుందం అని?"
"అవ్ అన్నా, నువ్వే పిల్చినవ్"
"గదే మరి. బిర్యాని మంచిగున్నది కదా. మెల్లగ తిను. ఐపోయినంక ఐస్‌క్రీమ్ తెప్పిస్త. నువ్వేం ఇది కాకు" అన్నడు ఇన్వెస్టర్ ఫ్రెండు.
మనోనికి ఆశ ఆకాశంలకు రీచ్ అయి కూసుంది. ఇదేదో అయ్యేటట్టుంది అనుకున్నడు డి.
మన డి గిట్ల ఆకాశంల ఉండంగనే ఇగ అసలు ముచ్చట చెప్పుడు మొదలు పెట్టిండు ఇన్వెస్టర్ ఫ్రెండు...
"సూడన్న... మన దగ్గర పస్త్ పైసలున్నయి. ఏం తక్కువలేదు. 10 కోట్లు కాదు, బడ్జెట్ వంద కోట్లైన పెడ్దాం బాంచొత్. మనం ఎవ్వనికి తక్కువ కాదు"
వింటున్నడు మన డైరెక్టర్.
"కాని అన్నా, నీ టాలెంట్ సూపర్ అన్న. కరెక్టోడు ఒక్కడు పడాల్నె నీకు. చిన్నదో పెద్దదో నడిపిదో... ఒక్క సిన్మా, జస్ట్ ఒక్క సీన్మ... ముందుగాల గా ఒక్కటి తీసి ఇప్పుడు హిట్టు కొట్టన్న. ఇగ తర్వాత ఎంతైనా నేను పెడ్తా! నీకేం ఫికర్ లేదు. నేనున్న!..." అని ఇంకేదో చెప్పుకుంటపోతున్నడు ఇన్వెస్టర్.
మన డిరెక్టర్‌కు మొత్తం సీన్ అర్థమైంది. ఎక్కడో మండింది.
"నేను ఎవ్వర్నో సూసుకొని, సీన్మ దీసి హిట్టు కొట్టినంక... అప్పుడు గూడ గిసొంటి సొల్లుగాల్ల కోసమే సూత్తనా?!" అనుకుంట థమ్సప్ లాస్ట్ సిప్పు తాగి లేచిండు మన డైరెక్టర్... మిస్టర్ డి.
- మనోహర్ చిమ్మని
- మనోహర్ చిమ్మని
No comments:
Post a Comment
Thanks for your time!
- Manohar Chimmani